Wednesday, September 29, 2010

శ్రమైక జీవన సౌందర్యమే ‘ఆనందం’


ఆయన ఓ సర్పంచ్. అయితే ఏంటని అంటారా? ఓ వైపు ప్రజాసేవ చేస్తూ, మరో వైపు పాడి పశువులు పెంచుతూ, ఇంకో వైపు వ్యవసాయం సాగిస్తూ ‘ఆనందం’ పొందుతున్నారు. అన్ని బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాడి పశువుల ఆలనా పాలనా చూసుకుంటూ పాల వ్యాపారిగా అవతారం ఎత్తుతూ ... పొలం పనులు సాగిస్తూ... గ్రామ సర్పంచ్‌గా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ... ఇలా మూడు రంగాలలోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఆయనే కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన అయిల్నేని ఆనందరావు. శ్రమైక జీవన సౌందర్యంలోని మాధుర్యాన్ని రుచి చూస్తున్న ఆనందరావును ‘న్యూస్‌లైన్’ పలకరిస్తే ఎన్నో విషయాలు తెలిపారు. ఆ వివరాలు మీరూ తెలుసుకోండి మరి...

ఒక్క గేదెతో వ్యాపారం మొదలెట్టి...
ఇంటర్ వరకూ చదివిన ఆనందరావు స్వయంకృషిని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నారు. పశు పోషణను ఉపాధిగా ఎంచుకున్నారు. 1990లో ఒకే ఒక్క గేదెతో పాల వ్యాపారం మొదలెట్టారు. ఇప్పుడు వాటి సంఖ్య 12కు చేరింది. అంతే సంఖ్యలో చిన్న దూడలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ పాడి గేదెల్ని కొంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరు. గేదెల్ని స్థానికంగానే కొనుగోలు చేస్తారు.

పాల వ్యాపారంలో మేటి
పాల అమ్మకం ద్వారా ప్రతి నెలా 12 వేల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు ఆనందరావు. లీటరుకు 15-20 రూపాయల వరకూ ధర పలుకుతోంది. రోజుకు కనీసం 60-70 లీటర్ల పాలను స్కూటర్‌పై తీసికెళ్లి సమీపంలోని జగిత్యాల పట్టణంలో విక్రయిస్తారు. తాను తిన్నా, తినకున్నా ప్రతి గేదెకు అయిదు కిలోల చొప్పున ఉదయం, సాయంత్రం తౌడు, అటుకుల పిండిని దాణాగా అందిస్తారు. తానే స్వయంగా ఎడ్ల బండి తోలుకుని పొలానికి వెళ్లి గడ్డి తెచ్చి పశువులకు మేపుతారు. వరి పైరు కోసిన తర్వాత వచ్చే ఎండు గడ్డిని ఓ పూట గేదెలకు వేస్తారు. దీంతో పశుగ్రాసం ఖర్చు కూడా తగ్గుతోంది. పశువులకు అవసరాన్ని బట్టి టీకాలు వేయించడంతో పాటు వాటికి ఎలాంటి వ్యాధులు వచ్చినా పశు వైద్యుల సలహాలు, సూచనలతో చికిత్సలు చేపడతారు.

పెద్దల నుండి వచ్చింది 30 గుంటలే...
సర్పంచ్ ఆనందరావుకు పెద్దల నుండి వచ్చిన వ్యవసాయ భూమి కేవలం 30 గుంటలే (ముప్పావు ఎకరం). దానినే అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు అయిదెకరాల ఆసామి అయ్యారు. ఇది పాడి పరిశ్రమ పుణ్యమేనని సగర్వంగా చెబుతారు ఆనందరావు. ఎందుకంటే పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఇద్దరు పిల్లల చదువులకు, వ్యవసాయ పెట్టుబడులకు, ఇంటి ఖర్చులకు సరిపోతుంది. పంటలు అమ్మగా వచ్చిన ఆదాయం మిగులుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏటా అన్ని ఖర్చులు పోను మూడు లక్షల రూపాయల నికరాదాయం పొందుతున్నారు. ప్రతి పనినీ తానే స్వయంగా చేసుకుంటారు. అవసరమైనప్పుడు ఒకరిద్దరు కూలీలను పెట్టుకుంటారు.

సేంద్రియ వ్యవసాయంపై మక్కువ
ఆ ప్రాంతంలోని రైతులందరూ వ్యవసాయ భూములకు పశువులు లేదా కోడి ఎరువు, చెరువు మట్టిని ఉపయోగిస్తుంటారు. అయితే పశువుల ఎరువు సరిగా లభ్యం కాకపోవడం, ధర అధికంగా ఉండటంతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ మన ఆనందరావు మాత్రం తన పాడి గేదెల పేడనే వరి, మొక్కజొన్న, పసుపు పంటలకు ఎరువుగా వాడుతున్నారు. చాలా వరకూ సేంద్రియ ఎరువునే వినియోగిస్తుండడంతో పైర్లకు ఎలాంటి చీడపీడలు సోకడం లేదని అంటారాయన. అంతే కాకుండా ఇతర రైతుల కంటే దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి. ఎలాంటి భేషజం లేకుండా ఓ వైపు పాడి గేదెల పాలు విక్రయిస్తూ మరో వైపు గ్రామ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ అందరి మెప్పూ పొందుతున్నారు. ఆనందరావును ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు కూడా ఇప్పుడు పాడి పశువుల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఆనందరావు నుండి సలహాలు పొందుతున్నారు.


4.30 గంటలకే దినచర్య మొదలు
ప్రతి రోజూ ఉదయం 4.30 గంటలకే ఆనందరావు దినచర్య మొదలవుతుంది. ముందుగా అన్ని గేదెల పాలు పిండి, పశువుల వద్ద పేడ తీసి దాణా వేస్తారు. ఆ తర్వాత పాలను జగిత్యాల తీసికెళ్లి రోజువారీ వినియోగదారులకు విక్రయిస్తారు. ఈ పనంతా తెల్లారే సరికే పూర్తవుతుంది. ఉదయం 7-8 గంటల లోపే పంచాయతీ కార్యాలయానికి చేరుకొని సర్పంచ్ విధుల్లో నిమగ్నమవుతారు. 11 గంటల తర్వాత వరి పొలాలు, పసుపు తోటల్లో పనులు చూసుకుంటారు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పచ్చి మేత తీసుకొస్తారు. మధ్యాహ్న సమయంలో పశువుల్ని మేపుకు రావడానికి ఒక మనిషిని నియమించారు. సాయంత్రం పాడి గేదెలు ఇంటికి రాగానే వాటికి మేత వేస్తారు. రాత్రి కాగానే దాణా పెట్టి పాలు పితుకుతారు. పాలు పిండిన తర్వాత మేత వేస్తారు. అప్పటితో ఆయన దినచర్య పూర్తవుతుంది. ఆనందరావు ఎప్పుడూ ఊర్లోనే గడుపుతారు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లినా చీకటి పడేసరికే ఇంటికి చేరుకుంటారు. గ్రామాభివృద్ధికి సంబంధించి ఏదైనా పని మీద మండల కేంద్రానికి వెళితే సాయంత్రానికే తిరిగి వచ్చేస్తారు.
పాల వ్యాపారాన్ని వదలను
ఏ స్థాయిలో ఉన్నా పాడి గేదెల పెంపకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టను. మరి న్ని పాడి గేదెలు కొనుగోలు చేయాలని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఉత్సాహంగా ఉంది.

ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్న వారు చాలా మంది తమ పాత వృత్తిని కొనసాగించేందుకు నామోషీగా ఫీలవుతారు. కానీ నేను అలా భేషజాలకు పోను. ఈ వ్యాపారాన్ని వదలను.

అందరికీ అందుబాటులో...
పాల వ్యాపారంతో పాటు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే ఆనందరావు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
అందరితో కలుపుగోలుగా ఉండే ఆనందరావు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ వారి ముందు వాలిపోతారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ చేనుకు వెళ్లడం మాత్రం మరచిపోరు. అన్ని పనులకు సమ న్యాయం చేసే క్రమంలో కొంత ఒత్తిడికి గురవుతున్నప్పటికీ ఎప్పుడూ ఆహ్లాదంగా కనబడుతుంటారు.

No comments: