Thursday, September 23, 2010

ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న నైజీరియా * ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. * మన వాళ్లకూ ఆశలూరిస్తోంది. * భారతీయులకు నైజీరియా బంగారు బాతు.

ఎప్పుడూ అంతర్యుద్ధాలతో ..బయటి ప్రపంచానికి అశాంతి దేశంగా కనిపిస్తుంది.. కాని ఇక్కడ ల్యాండ్ అయితే గాని తేలీదు విదేశీయులుండటానికి ఇది ఎంత అనువైనదని. తమ శ్రమను దోచుకునే వారంటే ఈ దేశీయులకు చెప్పరాని అసహ్యం. అయినా వాళ్ల పద్ధతులను గౌరవిస్తారు. వాళ్ల అలవాట్లకు మర్యాదిస్తారు. ఫుట్‌బాల్ అంటే అమిత ఇష్టం. చేసే ప్రతి పనిలో కళాత్మకతను చూపిస్తారు. అదే...ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న నైజీరియా. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మన వాళ్లకూ ఆశలూరిస్తోంది. ఓఎస్ఐ కన్సల్టింగ్ కంపెనీలో డెలివరీ మేనేజర్ (ఒరాకిల్ అప్లికేషన్)గా పనిచేస్తున్న రాచుమల్ల అనీల్ కుమార్ కొంతకాలంగా ఈ దేశంలోనే ఉంటున్నారు. 
ఆయన దృష్టిలో నైజీరియా...
 
నా వృత్తిలో భాగంగా ప్రాజెక్ట్ పనుల మీద ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుంటాను. ఇప్పటి వరకు యుఎస్, యుకె, బెల్జియం, చైనా, మలేషియా, మారిషస్, సౌదీ, దుబాయ్ వంటి 11 దేశాలు తిరిగాను. ఇప్పుడు నైజీరియాలో ఉంటున్నాను. ఇక్కడికొచ్చి సంవత్సరమవుతోంది. నేను చూసిన అన్ని దేశాల కంటే నాకు బాగా నచ్చింది నైజీరియానే.

గో స్లో
నేనుండేది నైజీరియా పాత రాజధాని లెగోస్‌లో (కొత్త రాజధాని అబుజా). ఇక్కడా వారానికి ఐదు రోజులే పనిదినాలు. ఉదయం ఏడింటికల్లా లేచి టిఫిన్, వంట చేసుకుని టిఫిన్ తిని, లంచ్ బాక్స్ తీసుకెళ్తాను. నేనుండే గెస్ట్ హౌస్ ఆఫీస్‌కు దగ్గరే కాబట్టి తొమ్మిదికి బయలుదేరి వెళ్తాను. కాని స్థానికులు మాత్రం ఏడున్నరకే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ . మూడేసి గంటలు కూడా జామ్ అవుతుంటుంది. ట్రాఫిక్ జామ్‌ను వాళ్లు 'గో స్లో' అంటారు. ఉదయం ఎనిమిది నుంచి పదకొండు దాకా, సాయంత్రం ఐదు నుంచి ఎనిమిదాకా ఎక్కువుంటుంది. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు రోడ్లమీదే షాపింగ్ చేసుకుంటారు.

దీన్ని గో స్లో షాపింగ్ అంటారిక్కడ. గుండు పిన్నుల దగ్గర్నుంచి తినే వస్తువుల దాకా అన్నీ మన దగ్గరకొచ్చి అమ్ముతుంటారు. ఇంకా వంట చేసుకోలేదే అన్న బెంగ కూడా అక్కర్లేదు. చాలామంది ఆ ట్రాఫిక్ జామ్‌లోనే టిఫిన్లు, కాఫీలు లాగిస్తుంటారు. మళ్లీ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను, రూల్స్‌ను చాలా కచ్చితంగా పాటిస్తారు. ఎవరూ నిర్దేశించిన గీత దాటరు. ఫోర్ వీలర్ టాక్సీలున్నట్టే ఇక్కడ టూ వీలర్ టాక్సీలూ ఉంటాయి. వీటిని వొకాడా(ఠిౌజ్చుఛ్చీ) అంటారు. మన ఆటోలు, బజాజ్ బాక్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

టాప్ మేనేజ్‌మెంట్‌కి 12 గంటలు
నైజీరియన్లు చాలా పంక్చువల్‌గా ఉంటారు. ఉదయం ఏడున్నరకొచ్చి నాలుగున్నర ఐదుకల్లా వెళ్లిపోతారు. టాప్ మేనేజ్‌మెంట్ మాత్రం పన్నెండు గంటలు పనిచేస్తుంది. అందుకే మేము పని ముగించుకుని మా గెస్ట్ హౌస్‌కు వెళ్లేసరికి పది అవుతుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్తానని చెప్పాను కదా..అది తినేస్తాను. లేదంటే క్యాంటీన్ లాంటిది ఉంటుంది. రైస్ తెచ్చుకుని కర్రీస్ క్యాంటీన్‌లో తీసుకుంటాం. వీళ్ల వంటలు ఇండియా వంటల్లాగే ఉంటాయి. కూరలన్నీ ఇంచుమించు మన కూరల్లాగే ఉంటాయి, కాకపోతే కారానికి బదులు మిరియాలు వాడతారు. స్పైసీ కూరల్నే ఎక్కువ ఇష్టపడతారు.

నైజీరియాలో నెలకోసారి ఊరు క్లీనింగ్ డే


క్లీనింగ్ డే, నో మోబైల్స్ డే
అదంతా బాగానే ఉంటుంది గానీ లెగోస్‌లో సగం జీవితం ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఎక్కడికి వెళ్లాలన్నా కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆఫీస్ దగ్గర్లో ఇల్లు దొరకడమనేది పెద్ద లగ్జరీ. ట్రాఫిక్‌లోనే సగం రోజు గడిచిపోతుంది. అందుకని మిగిలిన రోజుల్లో హడావుడిగా గడిపిన వాళ్లంతా శనివారం తీరిగ్గా ఇంటిపనుల్లో పడతారు. అందుకే శనివారాన్ని క్లీనింగ్ డే అంటారు. ప్రతి నెల రెండో శనివారం అయితే ఊరుని బాగు చేసే పనిలో ఉంటారు. పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరూ పాలు పంచుకుంటారు. రోడ్ల దగ్గర్నించి టాయ్‌లెట్స్ దాకా అన్నీ శుభ్రం చేస్తారు.

ఆ రోజు ఉదయం ఫ్లైట్స్‌కూడా ఎగరవు. అలాగని వీకెండ్స్ జాలీగా గడపరని అనుకోడానికి వీల్లేదు. శుక్రవారం రాత్రి నుంచే క్లబ్బులు, పబ్బులు పాటలు, డ్యాన్సులతో హోరెత్తుతుంటాయి. శనివారం నాకైనా క్లీనింగ్ డేనే. ఆదివారాన్ని రిలిజియస్ డేగా పాటిస్తారు. ఆ రోజు మొబైల్స్ కూడా పనిచేయవు. ముస్లింలు, క్రైస్తవులు అందరూ ప్రార్థనల్లో మునిగిపోతారు. ప్రతి చర్చికి స్వంత చానెల్, హెలికాప్టర్ ఉంటుంది.

పెట్రోలు బాగా చవక
అఫ్రికా అంతటినీ ఫ్రెంచ్ వాళ్లు పరిపాలిస్తే నైజీరియా, ఘనాలను మాత్రం బ్రిటిషర్లు పాలించారు. అందుకే ఈ రెండు దేశాల్లో బ్రిటిష్ వాళ్ల ప్రభావం చాలా ఉంటుంది. సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైన దేశం నైజీరియా. పూర్తిగా వైరుధ్యమున్న రెండు తరగతులు కనిపిస్తాయి ఇక్కడ. చదువుకుని కాలానికనుగుణంగా మారి బాగా బతుకుతున్నవాళ్లు ఒక వర్గం, చదువులేక పేదరికంలో మగ్గుతున్నవాళ్లు రెండో వర్గం(ఉత్తర నైజీరియా వనరుల పరంగా...దక్షిణ నైజీరియా విద్యాపరంగా సంపన్నమైంది). చిత్రమైన విషయమేమిటంటే...ఎంత చదువుకున్న వారికైనా వాళ్ల తెగను సూచించే గాట్లుంటాయి వాళ్ల మొహాల్లో. లెగోస్ ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల నగరాల్లో ఐదోది.

ఆఫ్రికాలోనైతే మొదటిది. ఏనుగు దంతాలు, పులిగోర్లు.....వీటితో చేసిన కళాఖండాలు రోడ్లమీదే అమ్ముతుంటారు. దీన్ని జాకుండే మార్కెట్ అంటారు. ముడిచమురు దండిగా దొరుకుతుంది. అందుకే పెట్రోల్ చాలా చవక. స్థానికంగా యురోబా, హౌసా వంటి భాషలున్నా ఇంగ్లీషే అధికార భాష.ఈ భాషలకు లిపి లేదు. ఇంగ్లీషులోనే రాస్తారు.

సొంతంగా జనరేటర్లు
అద్భుతమైన ప్రకృతి వనరులున్నప్పటికీ ఇక్కడ పవర్ ప్లాంట్లు లేక ఎవరికి వారే ఇంట్లో కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటారు. ఇల్లు కట్టుకునేప్పుడే జనరేటర్ కోసం ప్రత్యేకించి కొంత స్థలాన్ని కేటాయించుకుంటారు. కరెంట్ లేక మిగిలిన అభివృద్ధి ఆగిపోయినా మౌలిక సదుపాయాలు మాత్రం బాగానే ఉన్నాయి. పెద్ద పెద్ద రోడ్లు....రింగ్ రోడ్లు...ఫ్లై ఓవర్లు ఎప్పుడో డెభ్భైల్లోనే కట్టుకున్నారు. బస్సులే ముఖ్యమైన రవాణా సౌకర్యం. బిఆర్‌టిఎస్ అంటే బస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట్‌మ్ అది ఎప్పుడో డెవలప్ అయిందిక్కడ. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా బస్సులకు సపరేట్ లైన్ ఉంటుంది. ఆ దారిలోనే వెళ్తుంటాయి. దాదాపు ప్రతి వాళ్లకు స్వంత ఫోర్ వీలర్ ఉంటుంది.

షాపులకు తాళాలుండవు
ఒక్క బియ్యం తప్ప ఇండియాలో దొరికే ప్రతీదీ దొరుకుతుంది. వీళ్లు బాసుమతి బియ్యం ఎక్కువగా తింటారు. ఇండియన్ రెస్టారెంట్లు, షాపులు అన్నీ ఉంటాయి. వీళ్లు బీఫ్, టర్కీ, జింక మాంసం ఎక్కువగా తింటారు. మనం అన్నం తిన్నట్టుగా వీళ్లు బంగాళా దుంపను పోలిన..గుమ్మడికాయ సైజులో ఉండే యామి అనే దుంపను ఉడికించి ముద్ద చేసుకుని కూరలతో తింటారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ప్రతి వీథికి ఎలాగైతే ఉంటాయో... అలాగే నైజీరియన్ల సంప్రదాయ ఆహారానికి సంబంధించిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కూడా ఉంటాయి. మనకు కావాల్సింది ఆర్డరిస్తే ఐదు నిమిషాల్లో రెడీ చేసిస్తారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే...రాత్రిళ్లు షాపులకు తాళాలే వేయరు. బంగారం షాపులకు క్కూడా. దొంగతనాలు అసలు జరగవు. కాని మోసాలు ఉంటాయి. మాటలతో గారడీ చేస్తుంటారు. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే.

మనవాళ్లు ఎక్కువగా వ్యాపారస్తులు
సింధీలు, గుజరాతీలు ఎక్కువగా ఉంటారు. వ్యాపారరంగంలో మన సింధీలదే పైచేయి. చోళా రామ్స్, భోజ్ రాజ్ అని ఇండియలో రిలయన్స్ ఎంత పెద్ద కంపెనీయో ఇక్కడ ఇవి ఇంచుమించు ఆ స్థానంలో ఉన్నాయి. తెలుగు వాళ్లు దాదాపు 15 వేల మంది ఉన్నారు. 'ఇల్లుపేజ్' అనే చోట ఎక్కువగా కనిపిస్తారు. ఇండియన్ ఎంబసీ స్కూల్ కూడా ఇక్కడే ఉంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు. తిరుపతిలో ఎలా జరుగుతాయో ఇక్కడా అలాగే జరుగుతాయి కార్యక్రమాలన్నీ. ప్రతి పండక్కి అందరూ కలుస్తారు. నైజీరియాలో ఎక్కువగా కనిపించేది లెబనీయులు, చైనీయులే.

దేశభక్తి ఎక్కువ
సింధీలు రక్తం పీలుస్తారనే అభిప్రాయం ఉంది వారిలో. సింధీల వల్ల ఇండియన్లంటేనే నైజీరియన్లకు కోపం ఉన్నా.. బాగా చదువుకున్న వారని, తెలివైనవాళ్లనే గౌరవం కూడా ఉంది. ఏదైనా రెస్టారెంట్‌కి భారతీయులు వెళితే బీఫ్‌ను వాళ్ల దరిదాపుల్లోకి కూడా రానీయరు. అంత మర్యాదిస్తారు మనకు.. గొడ్డు చాకిరీ చేయడంలో వాళ్లకు మించిన వాళ్లు ఎవరూ లేరేమో..! దేశ భక్తి ఎక్కువ.

ప్రతి కారులో వాళ్ల దేశం జెండా ఉంటుంది. మంచి క్రీడా ప్రియులు. ఫుట్ బాల్ అంటే ప్రాణం. మొన్న ఫుట్ బాల్ గేమ్స్ అప్పుడైతే నైజీరియా టీమ్ ఆడే రోజున రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రతి వాళ్లకు తప్పకుండా ఓ అభిమాన ఆటగాడుంటాడు. కాఫీ మగ్గుల మీద, టీ షర్టుల మీద, ఒంటి మీద టాటూస్ రూపంలో ఈ ఆటగాళ్లు దర్శనమిస్తుంటారు. ఇంటిని అలంకరించుకోవడం దగ్గర్నుంచి వీళ్లు చేసే ప్రతి పనిలోనూ కళాత్మకత ఉట్టి పడుతుంది.

కాస్ట్ ఆఫ్ లివింగ్...
ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. 2 వేల డాలర్లు పెడితే గాని ఇల్లు దొరకదు అద్దెకు. కాని సివిల్ ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లకు ప్రపంచంలోనే అథ్యధిక వేతనం చెల్లిస్తున్న దేశం ఇదే. 8 వేల డాలర్లతో పాటు ఇల్లు, కారు ఇస్తారు. ఇందులో 6 వేల డాలర్లు మన పేరు మీద మన దేశ బ్యాంకులో వేసి మిగిలిన డబ్బును ఇక్కడి కరెన్సీ నైరోల్లో ఇస్తారు. దేనికీ లోటు లేదు.

వాతావరణం కూడా మన వైజాగ్ వాతావరణాన్ని పోలి ఉంటుంది. కిడ్నాప్‌లు, మర్డర్లతో భయంకరంగా ఉంటుంది నైజీరియా అంటారు చాలామంది కాని అది అబద్ధం. ఉత్తర నైజీరియాలో కొన్ని ప్రాంతాల్లో డబ్బుల కోసం కిడ్నాప్‌లు చేస్తారు కాని మర్డర్లు చేస్తారనడంలో వాస్తవం లేదు. అయితే ఎప్పుడూ తెగల మధ్య జరిగే అంతః కలహాల వల్ల సైనిక చర్యలు ఉంటుంటాయి. నాకు తెలిసినంత వరకు ప్రొఫెషనల్ కోర్సులు చేసి వేరే దేశం వెళ్లాలనుకునే భారతీయులకు నైజీరియా బంగారు బాతు.

No comments: