Showing posts with label abroad. Show all posts
Showing posts with label abroad. Show all posts

Saturday, April 23, 2011

జపాన్‌.. పడుతూ.. లేస్తూ..!! ఎదగడం.. కిందపడటం.. మళ్ళీ లేవడం.. అలవాటు చేసుకున్న దేశం.


japan

japan-5 
జపాన్‌ ఆటు పోట్లను అలవాటు చేసుకున్న దేశం. ఎదగడం.. కిందపడటం.. మళ్ళీ లేవడం.. ఈ ప్రవృత్తి వారి నిత్యదైనందిన జీవితంలోనూ ప్రతిఫలిస్తుంటుంది. జపనీయులు భవనాల మెట్లు ఎక్కడం.. దిగడం ఒక హాబీగా చేస్తారు. అందుకే అధికారిక కార్యక్రమాల్లో సైతం కొన్ని మీటింగులు ఒక ఫ్లోర్‌లో, మరికొన్ని సమావేశాలు మరో ఫ్లోర్‌లో పెట్టుకుంటారుట. లిఫ్ట్‌ వాడకుండా మెట్లు ఎక్కుతూ, దిగుతూ... ఆడుతూ, పాడుతూ విధులు నిర్వర్తిస్తుంటారని ప్రతీతి. వారి ఈ ప్రవృత్తి విధి రూపంలో వారితో ఆడుకుంటున్నదని అంటారు. అభివృద్ధిలో ఆకాశపుటంచులకు వెళ్లడం.. మానవ ప్రకోపమో.. ప్రకృతి ప్రకంపనమో.. వారిని అధఃపాతాళానికి తోసెయ్యడం.. మళ్ళీ కొండంత బలంతో పైకెదగడం.. జపాన్‌కు ఇదొక నిరంతర జీవన క్రీడగా మారిపోయింది.


japan1కనీసం అయిదు నిమిషాలకు ఒకసారి జపాన్‌లో భూమి కంపిస్తూ ఉంటుంది. అలాగే జపాన్‌ చుట్టుపక్కల కనీసం 200 అగ్ని పర్వతాలున్నాయి. ఇవి ఇరవై నాలుగ్గంటలూ కుతకుతలాడుతూ ఉంటాయి. ఇన్ని ఉపద్రవాల కుంపట్ల మీద జపాన్‌ పడుతూ లేస్తూ ప్రపంచ పరుగు పందెంలో ముందుకు సాగుతుంటుంది. పసిఫిక్‌ మహా సముద్రంలో 6,852 ద్వీపాలున్న ద్వీప సమూహం జపాన్‌. పసిఫిక్‌ మహాసముద్రంలోని సున్నితమైన ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో ఉన్న జపాన్‌ భూకంపాలకు పెట్టింది పేరుగా ముద్రపడింది. అగ్నిపర్వతాల అంచున ఉంటుంది. విశేషమేమిటంటే ప్రపంచంలోనే అత్యధిక మెట్రోపాలిటన్‌ జనాభా గల ప్రాంతంగా గ్రేటర్‌ టోక్యో పేరు గాంచడం. అంతేనా, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఆయుఃప్రమాణమే కాక అతితక్కువ శిశు మరణాలు కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన దేశం జపాన్‌. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా, అత్యంత కొనుగోలు శక్తి ఉన్న పౌరులు గల దేశంగా జపాన్‌ ముందుంది.

japan-3ప్రపంచం ఎగుమతులలోనూ, దిగుమతులలోనూ కూడా నాలుగవ స్థానంలో ఉన్నది. సాంకేతికంగా ఎంతో వృద్ధిని సాధించినా నిరంతరం ప్రకృతి ధాటికి భయపడుతూనే ఉంటారు జపనీయులు. ప్రపంచ పురాతన నాగరికతలలో జపాన్‌ ఒకటి. పాత రాతియుగంలోనే జపాన్‌లో మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నట్టు చారిత్రిక ఆధారాలున్నా యి. అంటే 30,000 బి.సి.లోనే అక్కడ మనుషులు ఉన్నారు. అంతటి పురాతన చరిత్ర, నాగరికత కలిగిన జపాన్‌ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్ర జాస్వామిక ఒరవడిలోకి అడుగిడేందుకు నిర్ణయించుకుని 1947లో నూతన రాజ్యాంగాన్ని ప్రకటించుకుంది. ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన రాచరికపు వ్యవస్థగా కొనసాగుతున్నది. రాజు దేశాధిపతి అయినా అలంకారప్రాయమే.. అధికారాలన్నీ డైట్‌ (పార్లమెంటు) ఎన్నుకున్న ప్రధాని చేతిలోనే ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా అమెరికాలోని పెర్ల్‌ హార్బర్‌పై దాడి చేసి ఆ దేశాన్ని కూడా యుద్ధంలోకి లాగిన జపాన్‌.. హిరోషిమా, నాగసాకిపై దాడి అనంతరం యుద్ధం జోలికి వెళ్ళరాదని ఒట్టు పెట్టుకున్నది. అయినప్పటికీ అత్యంత ఆధునికమైన సైన్యాన్ని జపాన్‌ కలిగి ఉండటం విశేషం.

japan-4హిరోషిమా, నాగసాకి దాడి, పునర్నిర్మాణం: రెండవ ప్రపంచ యుద్ధ చివరి దశలో అంటే 1945 జులై 26న చేసిన పాట్స్‌ డామ్‌ ప్రకటనలో లొంగిపోవలసిందిగా జపాన్‌ను అమెరికా హెచ్చరించింది. అ యితే జపాన్‌ ప్రభుత్వం ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో నాటి అమెరికా అధ్యక్షడు హారీ ఎస్‌. ట్రూమన్‌ ఉత్తర్వుల మేరకు అమెరికా దళాలే 1945 ఆగస్టు 6వ తేదీన హిరోషిమాపై ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణు బాంబును వేశాయి. మూడు రోజుల అనంతరం అంటే ఆగస్టు 9వ తేదీన ‘ఫ్యాట్‌మాన్‌’ అనే అణ్వాయుధాన్ని నాగసాకిపై విడిచారు. ఈ దాడులకు ఆరు నెలల ముందు దాదాపు 67 జపాన్‌ నగరాలపై అమెరికా ఉధృతంగా బాంబు దాడులు నిర్వహించింది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణు బాంబు దాడులు జరిపిన మొదటి నాలుగు నెలలోనే హిరోషిమాలో 90 వేల నుంచి 1లక్ష 66వేల మంది మరణించగా, నాగసాకిలో 60వేల నుంచి 80 వేల మంది మరణించారని, ఇందులో సగానికి సగం మంది దాడులు జరిగిన తొలి రోజే మరణించారని అంచనా. ఆ రోజు మరణించిన వారిలో 60శాతం మంది బాంబు దాడుల కారణంగా చెలరేగిన మంటల బారిన పడి మృతి చెందగా, 30 శాతం మంది భవనాలు కూలిపోయి, 10 శాతం మంది ఇతర కారణాల చేత మరణించినట్టు హిరోషిమా ఆరోగ్య శాఖ తేల్చింది. తర్వాత మరణించిన వారు కాలిన గాయాలు సెప్టిక్‌ అయ్యి, రేడియేషన్‌ సిక్‌నెస్‌కు గురైనవారు.

నాగసాకిపై దాడి జరిపిన ఆరు రోజుల అనంతరం అంటే ఆగస్టు 15వ తే దీన సంకీర్ణ శక్తులకు లొంగిపోతున్నట్టుగా జపాన్‌ ప్రకటించడం ద్వారా పసిఫిక్‌ యుద్ధానికి అంతిమంగా రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికిం ది. ఈ బాంబు దాడుల దుష్ఫలితాలను చవి చూసిన జపాన్‌ మూడు అణ్వేతర సూత్రాలను పాటించాలని నిర్ణయించుకుని, అణ్వాయుధాలను నిషేధిం చింది. ఈ బాంబు దాడి నుంచి బయటపడిన వారిని జపనీస్‌లో హిబకుష అంటారు. అంటే పేలుడుతో ప్రభావితమైన వ్యక్తులు అని అర్థం.

japan-6 2010 మార్చి 31 నాటి లెక్కల ప్రకారం 2 లక్షల 27వేల 565మంది హిబకషులు జీవిస్తున్నారని జపాన్‌ ప్రభుత్వం లెక్కలు కట్టింది, అలాగే రెండు చోట్ల బాంబు దాడులను ఎదుర్కొ ని సజీవంగా ఉన్నవారిని ‘నిజు హిబకషు’గా పేర్కొం టారు. గత సంవత్సరం మరణించిన ట్సు టుమో యమగూచి ఒక్కడే నిజ హిబకషుగా జపాన్‌ ప్రభుత్వం గుర్తించింది. అతడు హిరోషిమాపై దాడి జరిగినప్పుడు ఈ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దాడిలో కాలిన గాయాలైన అతడు ఆ రాత్రి హిరో షిమాలో గడిపి ఆగస్టు 8 నాటికి నాగసాకి చేరుకున్నాడు. మరునాడే అక్కడ బాంబు దాడి జరిగింది. తన బంధువుల కోసం వెతుకుతూ అతడు రెసిడ్యువల్‌ రేడియేషన్‌కు గురయ్యాడు.యుద్ధానంత రం హిరోషిమా, నాగసాకి పట్టణాల వైపు కొన్ని నెలల పాటు తొంగి చూసేందుకు కూడా వీలులేనంతగా ధ్వంసమవడమే కాక రేడియో యాక్టివేషన్‌ నెలకొంది. అయితేనేం పట్టబట్టి ఐదు సంవత్సరాలలో దానిని పునర్నిర్మించారు. పారిశ్రామిక నగరంగా నేడు హిరోషిమా అలరారుతోంది. ప్రముఖ కార్ల, మోటార్‌ సైకిళ్ళ ఉత్పత్తిదారు మజ్దా ప్రధాన కేంద్రం ఇక్కడే ఉన్నది.

japan-7 భూకంపాలు, సునామీలు: ప్రపంచంలోనే భూకంపాలు అధికంగా సంభవించే ప్రాంతం జపాన్‌. అగ్నిపర్వతాలు, సముద్రపు అగడ్తలు కలిగిన ప్రాంతంలో ఉన్న జపాన్‌లో కనీసం ఐదు నిమిషాలకు ఒకసారి అయినా భూమి కంపిస్తుంది. ప్రపంచంలో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 కన్నా ఎక్కువగా నమోదయ్యే భూకంపాలలో 20 శాతం ఇక్కడే సంభవిస్తుంటాయి. కోటి ఇరవై లక్షలమంది జనాభాకు పైగా కలిగిన టోక్యో నగరం యురేసియా, ఉత్తర అమెరికా, ఫిలిప్పీన్‌, పసిఫిక్‌కి సంబంధించిన నాలుగు టెక్టోనిక్‌ ప్లేట్ల కూడలిలో ఉంది. ఈ పొరలు ఏదైనా ఒకటి ఏ మాత్రం వంగినా, కదిలినా, విరిగినా వెంటనే భూకంపం సంభవిస్తుంది. గత నెలలో జపాన్‌ ఈశాన్య ప్రాంతంలో సంభవించిన భూకం పం తదనంతర సునామీలు 1995లో సంభవించిన కోబె భూకంపం కన్నా పెద్దది కావడమే కాక నాడు సంభవించిన దానికన్నా అధిక ప్రాణ నష్టం, ధన నష్టం సంభవించాయి.

రిక్టర్‌ స్కేల్‌పై 8.9గా నమోదైన భూకంపానంతరం సంభవించిన సునామీలో 10 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడి తీరప్రాంతంలోని పట్టణాలను, నగరాలను మింగివేసాయి. జపాన్‌ ఈశాన్య తీరంమైన సెందాయ్‌ సహా అనేక నగరాలు, దాదాపు పదకొండు పట్టణాలతోపాటు అనేక గ్రామాల ప్రజలు భూకంప తాకిడికి గురయ్యారు. హకై్కడో, ఆవ్‌మొరీ, ఇవా టే, మియోగి, యమగట, ఫుకుషిమా, ఇబరకి, తొచి గి, గుమ్మ, చిబ, కనగవ పట్టణాలలో మొత్తం 13,540 మంది మరణించగా, 16,963 మంది కనుపించకుండా పోయారు. ఇందుకు తోడుగా 5,253 మంది గాయపడ్డారు. సుమారు లక్షా 38 వేల మంది వ్యక్తులు పునరావాస కేంద్రాలలో ఉన్నారు. సునామీ కారణంగా ఉవ్వెత్తున లేచిన అలల కోరలు నౌకలను, కార్లను మింగివేయగా, ప్రధాన విమానాశ్రయాలను ముంచి వేశాయి. ఈ భూకంప సునామీలో 59వేల ఇళ్ళు నేలమట్టం కాగా, 17 వేల ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

japan-8ఇవి ప్రస్తుతానికి లెక్క తేలినవే. లెక్కించవలసినవి ఇంకా మిగిలే ఉన్నాయి. విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిన్నది. ఫుకుషిమా, దాయిచీ అణు విద్యుత్‌ కేంద్రాలలో రియాక్టర్ల పేలుడు సంభవించడంతో జపాన్‌లో మరోసారి రేడియేషన్‌ భయాలు పట్టుకున్నాయి. ఆ ప్రాంతానికి 30 కి.మీ. దూరం లో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందిగా జపాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నష్టాన్ని నివారించే ప్రయత్నం చేసింది. జపాన్‌ యుద్ధానంతర 65 ఏళ్ళ చరిత్రలో ఇది అత్యంత తీవ్రమైన సంక్షోభమని ప్రధాన మంత్రి నవాటో కాన్‌ పేర్కొనడం గమనార్హం. అయితే ఈ సంక్షోభాన్ని అధిగమించగలమని ఆత్మవిశ్వాసంతో చెప్పడం ద్వారా జపనీయుల ఆత్మవిశ్వాసపు స్థాయిని ప్రదర్శించారు. జపాన్‌ ప్రజల క్రమశిక్షణ ఎటువంటిదో ఈ సందర్భంగా ప్రపంచానికి చాటిచెప్పారు. ఆహారం, మంచినీరు వంటివి రోజుల తరబడి లభ్యం కావని తెలిసి కూడా అక్కడ తోపులాటలు కానీ గొడవలు కానీ జరుగలేదు. వారు షాపులో ఉండగానే కరెంటు పోయినప్పటికీ ఒక్క వస్తువు అదృశ్యం కాలేదు. లూటీలు, గొడవలు, గందరగోళాలు మచ్చుక కూడా కానరాకపోవడం జపాన్‌ ప్రజలలో ఉన్న ఐక్యతా స్ఫూర్తికి చిహ్నంగా చెప్పుకోవచ్చు.

జపాన్‌లో దాదాపు 55 అణు విద్యుత్‌ రియాక్టర్లు ఉన్నాయి. 61 శాతం ఇంధనం ఈ ‚రియాక్టర్ల నుంచే ఉత్పత్తి అవుతుంది. సునామీ అనంతరం ఫుకుషిమాలోని దాయిచీ అణుకేంద్రంలో సంభవించిన ప్రమాదంతో జపాన్‌లో ఆరింటిని నిలిపివేశారు. తొలిసారి జపాన్‌లో అణు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సునామీ కారణంగా దాయిచీతో పాటుగా మరి కొన్ని రియాక్టర్లను తాత్కాలికంగా నిలిపివేయడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒకవైపు భూకంపం కారణంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినగా మరోవైపు ఉత్పాదన లేకపోవడం వల్ల కూడా అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దాదాపు 4,50,000 గృహాలకు విద్యుత్‌ లేక అల్లాడుతున్నారు. ఒకవైపు అణు విద్యుత్‌ కేంద్రాలు సునామీకి దెబ్బతినగా విద్యుత్‌ టరె్బైన్లు మాత్రం ఏ మా త్రం చెక్కు చెదరలేదు.

japan-9 2010 చివరి నాటికి జపాన్‌ 2304 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 1746 విండ్‌ టరె్బైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ వాయు టరె్బైన్లు జాతీయ విద్యుత్‌ సరఫరాకు తోడ్పడుతున్నాయి. అణువిద్యుత్‌కన్నా విండ్‌ ఎనర్జీపై ఆధారపడడం అన్ని రకాలా శ్రేయస్కరమనే వాదనలు వినిపిస్తున్నాయి. జపాన్‌ అణు సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తం గా అక్కడ గ్యాస్‌కు డిమాండ్‌ పెరుగుతుందని దీనితో సహజవాయువు ధరల రెండేళ్లలో మొదటిసారి చుక్కలనంటుతాయని నిపుణు లు ఇప్పుటికే హెచ్చరిస్తుండడంతో యుకె సహా పలు దేశాలు కలవరం చెందుతున్నాయి. సునామీ ప్రభావిత ప్రాంతంలో ఉన్న టయో టా, నిస్సాన్‌, హోండా వంటి ఆటోమొబైల్‌ కంపెనీల కేంద్రాలతో పాటు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉత్పత్తి చేసే సోనీ సహా నిప్పన్‌, పానాసోనిక్‌, ఫుజి వంటి అనేక కంపెనీల ఉత్పత్తి కేంద్రాలు అనేకం దెబ్బతినడంతో ఆయా చోట్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. జపాన్‌ ఆర్థిక వ్యవస్థకు అధికంగా దోహదం చేస్తున్న పరిశ్రమలు ఇవి.

పునర్నిర్మాణం: గత నెల 11న సంభవించిన భూకంపం తీ వ్రత దాదాపు 140 ఏళ్ళలో ఇదే తొలిసారి. 1995లో కోబె నగరంలో సంభవిం చిన భూకంప విధ్వంసం, నష్టాన్ని వందబిలియన్‌ డాలర్లుగా లెక్కకట్టారు. మొన్నటి వరకూ ప్రపం చంలో నే అతిఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా దానిని అభిర్ణించారు. కానీ దానిని ఇది మించిపోయింది. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పునర్నిర్మాణానికి సుమారు 309 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని జపాన్‌ అంచనా వేసింది. పునర్నిర్మాణానికి, ఈ నష్టం నుండి తేరుకోవడానికి జపాన్‌కు కనీసం మరో ఐదేళ్ళు పడుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఫుకుషిమా రియాక్టర్లలో రేడియేషన్‌ను అంచనా వేసేందుకు జపాన్‌ ప్రస్తుతం రిమోట్‌ కంట్రోల్‌ రోబోలను వాడుతున్నది.

japan-10అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే జపాన్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని ఉ న్నది. గత సంవత్సరం చివరి మూడు నెలలలో దాని ఆర్థిక వృద్ధి రేటు 1.3శాతం కుం గిన నేపథ్యంలో చైనా దానిని అధిగమించి ప్రపం చంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దెబ్బ మీద దెబ్బలా సునామీ కారణంగా ఏర్పడిన నష్టం నుంచి తేరుకోవడానికి జపాన్‌కు ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో జపాన్‌ ప్రజలపై పన్నుల భారం తీవ్రంగానే పడనుంది. 1997 తర్వాత తొలిసారి పన్నుల పెంపు గురించి ప్ర భుత్వం ఆలోచిస్తున్నప్పటికీ 70శాతం మంది ప్రజలు పన్నులు కట్టేందుకు సిద్ధం గానే ఉ న్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. సంక్షోభం వచ్చింది కనుక ప్రభుత్వమే తమ ను ఆదుకోవాలి తప్ప తామేం చే యమనే తత్వం జపాన్‌ ప్రజలలో లేకపోవడం అభినందనీయం. క్రమశిక్షణకు మారుపేరై న జపనీయులు అవసరమైతే ఎంతటి కఠిన శ్రమ కైనా ఓర్చి తమ కు వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకోగలరని రెండవ ప్రపంచయుద్ధానం తరం నుంచీ రుజువు చేస్తూనే ఉన్నారు. ఈసారీ అదే జరుగుతుందని ఆశిద్దాం.

వారోత్సవాలతో ఎనలేని ఉత్సాహం
radiation-burnsజపాన్‌ చక్రవర్తి పుట్టిన రోజు ఈ నెల 29న. ప్రతి ఏడాది ఆయన జన్మ దినాన్ని జాతీయ దినోత్సవంగా అధికారికంగా జరిపేవారు. కొన్నేళ్ల క్రితం దాన్ని మార్చారు. ఏప్రిల్‌ 29 నుంచి మే నెల మూడో తేదీ దాకా స్వర్ణ వారోత్సవం (గోల్డెన్‌ వీక్‌ )గా జరుపుతున్నారు. జపాన్‌ దేశాన్ని స్వర్ణయు గంలోకి తీసుకెళ్లే ఏకైక ధ్యేయంతో ఈ వారోత్సవాలకు రూపకల్పన చేశా రు. నిత్యం భూకంపాలతో, అగ్నిపర్వతాల భయోద్వేగాలతో గడిపే జపనీ యుల్లో దేశభక్తి స్ఫోరక భావాలను నింపడం ద్వారా వారిని ఆ భయోత్పా తాలు దరి చేరకుండా ఉండేందుకే వీటిని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 29వ తేదీని జపాన్‌ చక్రవర్తి పుట్టిన రోజు గుర్తుగా జాతీయ దినోత్సవంగా జరు పుతారు. అలాగే మే మూడో తేదీని రాజ్యాంగ పరిరక్షణ దినంగాను, నాలుగో తేదీని గ్రీనరీ డే గా జరుపుతా రు. జపాన్‌ చక్రవర్తులు ప్రకృతి ప్రేమికులన్న దానికి గుర్తింపుగా దీన్ని జరుపు తారు. ఇక అయిదో తేదీని బాలల దినోత్సవం. తల్లిదండ్రులు త మ పిల్లల భవిష్యత్తు కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తారు.

సునామీ తర్వాత ఇప్పుడి ప్పుడే కోలుకుంటున్న జపాన్‌ ఈ స్వర్ణ వారోత్సవాలను జాతి పునర్నిర్మా ణానికి సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. సునామీకి దారు ణంగా దెబ్బతిన్నామని దీనంగా దైన్యం గా కూర్చోకుండా ఈ ఉత్సవాల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకుని, పని చేయాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా జాతి జనులనుసమాయత్తపరుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అతిపెద్ద భూకంపాలు, సునామీలు
2001 జూన్‌: పెరూ దక్షిణ ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 8.4 తీవ్రత కలిగిన భూకంపం కారణంగా వచ్చిన సునామీలో వందల మిలియన్‌ డాలర్ల మేరకు నష్టం సంభవించింది.
2004 డిసెంబర్‌ 26: సుమాత్రా దీవులలో సంభవించిన భూకంపం అనంతర సునామీల కారణంగా భారత్‌తో సహా పలు దేశాలలో వేలాది మంది మరణించారు. తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 9.0గా నమోదైంది.
2006, జులై: ఇండొనేషియాలోని పడమర జావాలో సంభవించిన భూకంపం తదనంతర సునామీలో 668 మంది మృతిచెందగా, 74వేల మంది నిర్వాసితులయ్యారు.
2007, జనవరి: జపాన్‌లోని ఉత్తర ప్రాంతంలోనూ, రష్యాలోని కురిల్‌ ద్వీపంలోనూ సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ఆ ప్రాంతాలను విడిచి పారిపోయారు. నాటి భూకంప తీవ్రత 8.3.
2007, ఏప్రిల్‌: సాలమన్‌ ద్వీపంలో సంభవించిన భూకంపం అనంతర సునామీలో 50మంది మరణించగా, వేలాదిమంది నిర్వాసితులయ్యారు. భూకంప తీవ్రత 8.0.
2009, సెప్టెంబర్‌: పసిఫిక్‌ ద్వీపమైన సుమోవాలో భూకంపం కారణంగా సంభవించిన సునామీలో 184మంది మరణించారు. భూకంప తీవ్రత 8.0.
2010, జనవరి: సాలమన్‌ ద్వీపంలోని పశ్చిమ ప్రాంతంలో సంభవించిన బలమైన భూకంపాల కారణంగా సునామీ సంభవించిన వెయ్యిమంది నిర్వాసితులయ్యారు. భూకంపాలు రిక్టర్‌ స్కేల్‌పై 6.5, 7.2లుగా నమోదయ్యాయి.
2010, ఫిబ్రవరి: చిలీలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా పసిఫిక్‌ తీర ప్రాంతాలలో హెచ్చరికలు జారీ అయ్యాయి.
2010, అక్టోబర్‌: సుమాత్రా దీవులలో సంభవించిన భూకంపం అనంతర సునామీలలో 509మంది మృతి చెందగా వేలాది మంది నిర్వాసితులయ్యారు. భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.

జపాన్‌కు సంబంధించి కొన్ని విశేషాలు
- గుర్రం పచ్చి మాంసాన్ని జపాన్‌లో ఇష్టంగా తింటారు. దీనిని వండకుండా పచ్చిగానే తింటారు. దీనిని బసాషీ అని పిలుస్తారు.

-జపాన్‌ భూభాగంలో 70 శాతం కొండలు, పర్వతాలు ఉంటాయి. అంతేకాదు దేశంలో సుమారు 200 అగ్నిపర్వతాలు ఉన్నాయి.

-జపాన్‌లో అక్షరాస్యతా రేటు దాదాపు 100శాతం

-అక్కడ బీర్‌ కోసం ప్రత్యేకంగా వెండింగ్‌ మెషిన్లు ఉంటాయి.

-క్షమాపణను తెలిపేందుకు కొందరు పురుషులు గుండు గీసుకుంటారు.

-జపాన్‌ నుంచి 15మంది నోబెల్‌ గ్రహీతలు (కెమిస్ట్రీ, మెడిసిన్‌, ఫిజిక్స్‌), ముగ్గురు ఫీల్‌‌డ్స మెడల్‌ పొందిన వారు ఉన్నారు.

-జపాన్‌కు చెందిన సినీ నిర్మాత, దర్శకుడు తకహి మీకె తన కెరీర్‌ ఉచ్ఛదశలో దశాబ్దకాలంలో 50 సినిమాలు తీశాడు.

-ప్రపంచంలో యానిమేషన్‌కి సంబంధించిన వినోద చిత్రాలలో 60శాతం జపాన్‌ నుంచ వచ్చినవే.

- జపాన్‌లో 21శాతం జనాభా వృద్ధులే. ప్రపంచంలో ఇది అత్యధిక శాతం
1900 సం నుంచి జపాన్‌లో సంభవించిన భూకంపాలు- సునామీ
సంవత్సరం నగరం మృతుల సంఖ్య తీవ్రత సునామీ
 1995 కోబె  5,502   6.9 సునామీ
 1948 పుకుయి 3769  7.3  సునామీ
 1948 నంకైదో 1362  8.3 సునామీ
 1945 మికావా 1961  7.1 సునామీ
 1944 తొనంకాయ్‌ 998  8.1 సునామీ
 1943 టిట్టోరి 1,190  7.7 సునామీ
 1933 సన్‌రికు 3000  8.4 సునామీ
 1927 టాంగో 3020 7.6 సునామీ
 1926 కాంటో 1,42,800 7.9 సునామీ

-జి.పాంచజన్య

Tuesday, November 16, 2010

Sunday, November 7, 2010

ఆ దారిలో...రెండు చరిత్ర చిహ్నాలు

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి కొత్తగా తెలుసుకునేది ఏముంది అనుకోవద్దు. ఆ నిలువెత్తు విగ్రహం గురించి మీరు ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు కాని దాని దగ్గరకు వెళ్లే దారిలోని రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి మాత్రం చదివి ఉండకపోవచ్చు. ఒకటి ఎల్లీస్ దీవి- 400 ఏళ్ల క్రితం యూరప్ నుండి వలస వచ్చిన లక్షలాది మందిని అమెరికన్ గడ్డ మీదికి ఆహ్వానించిన ప్రదేశం. రెండోది 'సెంట్రల్ రైల్ రోడ్ న్యూజెర్సీ(సీఆర్ఆర్ఎన్‌జీ) టర్మినల్' అలా వచ్చిన వారిని అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చేరవేసిన స్టేషన్..

అమెరికా అనగానే వెంటనే గుర్తుకొచ్చేది 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'. ఈ విగ్రహం వద్దకు వెళ్లాలంటే ముందు 'లిబర్టీ పార్కు'కి వెళ్లాలి. అధిక జనసాంద్రత కలిగిన న్యూజెర్సీ ప్రాంతంలో అది ఒక ఒయాసిస్. అంటే ఎడారి మ«ధ్యలో ఉండే పచ్చని ప్రదేశము. ఆ పార్కు 1212 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. అందులోని 'సి.ఆర్.ఆర్.ఎన్.జె. టర్మినల్' వద్దే లిబర్టీ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు టిక్కెట్ కొనాలి. ఫెర్రీ ద్వారా లిబర్టీ ద్వీపానికి, ఎల్లీస్ ద్వీపానికి హడ్సన్ నది గుండా ప్రయాణించాలి. మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా 12 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నా, శ్రీవారి వృత్తి రీత్యా వెసులుబాటు కాక ఈ సంవత్సరము జులైలో అక్కడికి వెళ్లడం జరిగింది. మా అబ్బాయి ఉండే న్యూజెర్సీలోని చెష్టర్ ఫీల్డు ప్రాంతం నుంచి లిబర్టీ పార్కుకు ఒక గంట డ్రైవ్. లిబర్టీ పార్కులోని సి.ఆర్.ఆర్.ఎన్.జె. టెర్మినల్ నుంచి ప్రతి అరగంటకి ఫెర్రీలు ఉంటాయి. మొదటి ఫెర్రీ ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది.

మేము టిక్కెట్ కొని లోపలికి వెళ్లి లైనులో నిలుచున్నాము. అక్కడ మగవాళ్లంతా సాక్సు, షూస్, బెల్టు, పెన్, సెల్ మొదలైన వస్తువులు తీసి ఒక ట్రేలో పెట్టాలి. ఆడవారు సాక్సు, షూస్‌తో పాటు హెయిర్ క్లిప్స్, చేతికున్న గాజులు కూడ తీసి ట్రేలో పెట్టాలి. తరవాత మెటల్ డిటెక్టర్‌తో మగవారిని మగవారు, ఆడవారిని ఆడవారు జాగ్రత్తగా పరిశీలిస్తారు. తరవాత ట్రేలో ఉన్న వస్తువులను స్కాన్ చేసి ఇచ్చేస్తారు. ఎవరి వస్తువులు వాళ్లకి వచ్చాక ఫెర్రీ ఎక్కేందుకు మళ్లీ లైన్లో నిలుచోవాలి. ఫెర్రీలో కిందా, పైనా సీట్లు ఉంటాయి. అక్కడి నుంచి ఎల్లీస్ ద్వీపానికి పది నిమిషాల ప్రయాణం.

ఎల్లీస్ ద్వీపం

ఈ ద్వీపం హడ్సన్ నదిలో ఒక ఇసుక దిబ్బ. మన్‌హట్టన్‌కి సరిగ్గా దక్షిణ వైపు ఉంది. ఇక్కడ ఒకనాడు 'మెహెగన్ ఇండియన్‌లు' ఉండేవారు. అప్పట్లో ఇది 'కి యెష్కు ఐలాండ్'గా పిలువబడేది. యు.ఎస్.ఎ ఏర్పడ్డాక 'ఎల్లీస్ శామ్యూల్' అనే వ్యాపారవేత్త ఈ ద్వీపాన్ని కొని తన పేరు పెట్టుకున్నాడు.
ఉత్తర, పశ్చిమ యూరప్ దేశాల నుంచి జర్మనీ, ఐర్లాండ్, బ్రిటన్ దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి పెద్ద ఎత్తున వలసలు వచ్చారు. యుద్ధాల వల్ల కావచ్చు, మతవైషమ్యాల వల్ల కావచ్చు, కరువుకాటకాల వల్ల కావచ్చు... కారణము ఏదైౖనా కానీ వాళ్లందరూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి అట్లాంటిక్ సముద్రం దాటి తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు ఈ ద్వీపాన్ని చేరేవారు.

ఫెడరల్ ఇమిగ్రేషన్ స్టేషన్

ఎల్లీస్ ద్వీపంలో ప్రభుత్వం వారు రెండు గృహాలను నిర్మించి వాటిలో అంటువ్యాధుల వారిని, మానసిక రోగులను ఉంచేవారు. ఆరోగ్యపరంగానూ, చట్టపరంగానూ అర్హత కలిగిన వారికే వీసా ఇచ్చి అమెరికాలోకి ప్రవేశం కల్పించేవారు. ఆ విధంగా 1892లో 'ఫెడరల్ ఇమిగ్రేషన్ స్టేషన్' ప్రారంభించడం జరిగింది. వలస వచ్చిన వారు తమతో తీసుకొచ్చి వదిలేసిన తట్టలు, చెక్కసామాను, ఇనుప పెట్టెలు మొదలైన వాటిని సందర్శకుల కోసం ఒక పెద్ద హాలులో ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా 1900- 1914 మధ్యకాలంలో వలసల సంఖ్య రోజుకి 5000 నుంచి 10000 వరకు ఉండేదట.
వలసలు తగ్గుముఖం పట్టడం, వలసల సంఖ్య పరిమితం చేయడం వలన కూడా 1954లో ఇమిగ్రేషన్ స్టేషన్‌ని మూసేశారు. ఎల్లీస్ ద్వీపానికి వలస వచ్చినవారి వివరాలతో, సంతకాలతో ఒక పట్టిక అందుబాటులో ఉంది. ఇప్పటికీ అనేక మంది తమ తమ పూర్వీకుల వివరాలు తెలుసుకునేందుకు ఎల్లీస్ ద్వీపానికి వెళ్తుంటారు. 1960 ప్రాంతాల్లో ఆసియా నుంచి అమెరికాకి వలస వెళ్లిన వారి సంఖ్య మిగతా దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు అక్కడున్న ఒక పట్టిక తెలియజేస్తుంది.

ఎల్లీస్ ద్వీపంలో వీటిని చూసిన తరవాత మరల ఫెర్రీ ఎక్కాము. అదే టిక్కెట్‌తో ఫెర్రీలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి ప్రయాణం చేయవచ్చు. రకరకాల దేశాలవారితో, రకరకాల మనుష్యులతో ఆ ప్రయాణం భలే సరదాగా సాగిపోయింది. పదిపదిహేను నిమిషాల్లో లిబర్టీ ద్వీపము చేరాము. అక్కడ నుంచి చూస్తే విగ్రహం వెనక మన్‌హట్టన్, బ్రాక్‌లిన్ బ్రిడ్జీ కనిపిస్తాయి.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ

సంప్రదాయబద్ధమైన పొడవైన వస్త్రాన్ని నిండుగా ధరించిన స్త్రీమూర్తి విగ్రహం అది. కుడిచేతిలో పైకి ఎత్తి చూపుతున్న 42 అడుగుల పొడవున్న జ్యోతి, ఎడమ చేతిలో అమెరికాకి స్వాతంత్య్రం ప్రకటించిన 4 జూలై 1776 వ తేదీతో రాయబడిన రాతి శాసనం, మెడలో విరిగిన హారము (ఇది బానిసత్వపు వలస పరిపాలనా శృంఖలాల నుంచి విముక్తికి సూచన) తలపై మిరిమిట్లు గొలుపుతూ మొనదేలిన ఏడు కిరణాలతో (ఈ ఏడు కిరణాలు సప్త సముద్రాలకు, సప్త ఖండాలకు సూచన) మెరిసే కిరీటంతో మూర్తీభవించిన స్త్రీమూర్తి విగ్రహం అది.

నాలుగు స్టీలు స్తంభాలపై నిర్మించిన ఇనుప చట్రం, దానిపైన రాగి కవచము. ఈ విగ్రహాన్ని నిర్మించాలన్న ఆలోచన 1865లో ఫ్రెంచ్ లా ప్రొఫెసర్, రాజకీయనాయకుడైన 'డెలిబొలె'కి రాగా, శిల్పకారుడైన 'బర్తోల్టి' అతని ఆలోచనకు ఉత్తేజితుడై కార్యరూపం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్మించిన చీఫ్ ఇంజనీరు 'గస్టవే ఈఫిల్'యే ఈ లిబర్టీ విగ్రహాన్ని కూడా నిర్మించాడు. ఫ్రాన్స్, అమెరికా దేశాల ఉమ్మడి కృషిగా తయారైంది ఇది. విగ్రహం నిలుచున్న దిమ్మ నిర్మాణం అమెరికా చేపట్టగా, విగ్రహాన్ని ఫ్రెంచివారు తయారు చేశారు. అమెరికన్ విప్లవంలో మరణించిన సైనికుల స్మృతి చిహ్నంగా ఫ్రాన్స్ ప్రజలు ఇరు దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలను పెంపొందించుకునేందుకు 1886 అక్టోబర్ 28 వ తేదీన దీన్ని అమెరికా ప్రజలకు కానుకగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని 350 భాగాలుగా 214 పెట్టెల్లో ఉంచి ఫ్రాన్స్ నుంచి న్యూయార్క్ హార్బర్‌కు నౌకలో పంపారు. న్యూయార్క్ హార్బర్‌లో ఈ విడిభాగాలను తిరిగి ఏక విగ్రహముగా అమర్చారు. దీని ఎత్తు 151 అడుగులు, విగ్రహం పెట్టిన దిమ్మె ఎత్తు 154 అడుగులు. మొత్తం కలిపి 305 అడుగులు. దిమ్మె 11 కోణాలు కలిగిన నక్షత్రం ఆకారంలో ఉండగా, గోడలు గ్రానైట్ రాతితో నిర్మించబడ్డాయి. దిమ్మె చుట్టూ ఇనుప కంచె ఉంటుంది. దిమ్మె ద్వారము నుంచి పైన కిరీటం వద్దగల అబ్జర్వేటరీ వరకు వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. పై వరకు వెళ్లాలంటే విడిగా టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

- 1912లో ఫ్రెడరిక్ అనే అతను విగ్రహం జ్యోతి వద్ద గల అబ్జర్వేటరీ ఫ్లాట్‌ఫామ్ నుంచి 75 అడుగుల పొడవున్న పారాచ్యూట్ ద్వారా దిగ్విజయంగా క్రిందికి దూకాడు.
- 1929లో రాల్ఫ్ గ్లేసన్ అనే వ్యక్తి విగ్రహం కిరీటం వద్దనున్న కిటికీలోంచి బయటకు చూసి తిరిగి వస్తున్నప్పుడు కాలుజారి కిందపడి మరణించాడు.
- 1982లో ఒక గర్భవతి విగ్రహం పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా పురిటినొప్పులు వచ్చి అక్కడే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇలా విగ్రహానికి సంబంధించి సంతోషకరమైన, విచారించదగ్గ సంఘటనలు చాలా ఉన్నాయట. ఈ విగ్రహాన్ని చూసిన తరవాత లిబర్టీ హౌస్ రెస్టారెంట్‌కి వెళ్లాము. ఆ దేశంలో ఏదైనా ముఖ్యమైన ప్రదర్శనా స్థలానికి వెళ్లినప్పుడు బయటికి వచ్చే మార్గంలో గిఫ్టు షాపింగ్ ఉంటుంది. అది వారి సంప్రదాయ. రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న వారికి లిబర్టీ బొమ్మల కొనుగోలులో కొంత రాయితీ ఇస్తారు. ఇవన్నీ వ్యాపార మెళకువలు.
దారిలో బర్తోల్టి, ఈఫిల్, పులిట్జర్, కొలంబస్, జెఫర్‌సన్, జార్జి వాషింగ్టన్ మొదలైన ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.

డబ్ల్యుటిసి చూడలేకపోయాం

ఫెర్రీ ఎక్కేందుకు రెండు క్యూలు ఉన్నాయి. ఒకటి న్యూయార్క్ వైపు వెళ్లేందుకు, రెండోది న్యూజెర్సీ వైపు వెళ్లేందుకు. మేము న్యూజెర్సీ వైపు వెళ్లే ఫెర్రీ ఎక్కాము. అమెరికాలో మే, జూన్, జులై నెలల్లో విపరీతమైన ఎండలు. 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వేడి, చురుకుదనం ఎక్కువగా ఉండడం వల్ల కొత్త వారికి తప్పకుండా తలనొప్పి వస్తుంది. లిబర్టీ ద్వీపమంతా ఎండలో తిరిగిన కారణంగా, ఫెర్రీ బయలుదేరగానే హడ్సన్ నది నుంచి వచ్చే చల్లటిగాలి తనువును తాకి సేదతీరినట్టయింది. హడ్సన్ నది పరవళ్లు, ఫెర్రీ శబ్దం రెండూ కలిసి విచిత్రంగా అనిపించింది. సహజంగానే పిల్లలకి నీళ్లంటే ఇష్టం కదా. ఆ సమయంలో మా మనవడి సంతోషానికి అవధులు లేవు.

నదిలో ప్రయాణించే ఆ ఇరవై నిమిషాలూ ప్రకృతి దృశ్యాలను చూస్తూ మంత్రముగ్దులయిపోతాము. అలా వెళ్తుంటే న్యూయార్కు వైపు మన్‌హటన్‌లోని పెద్దపెద్ద భవనాలు ఆకాశహర్మ్యాలను తలపింపజేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంత ఎత్తైన భవన సముదాయాల మధ్యే 2001 సెప్టెంబర్ 11న ముష్కరుల చేతిలో ధ్వంసమైన 'వరల్డ్ ట్రేడ్ సెంటర్' ఉండేది గదా, దాన్ని చూడలేకపోయామే అని ఒకింత నిరాశ కలిగింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలన్న ఆతృతలో సి.ఆర్.ఆర్.ఎన్.జె. అంటే ఏమిటనిగానీ, అక్కడ రైలు పట్టాలు ముళ్లపొదలతో, పిచ్చి మొ క్కలతో నిండివుండడం గాని గమనించలేదు. 'ఈ రైలు పట్టాలు ఏమిటని' తిరిగి వచ్చేటప్పుడు మా అబ్బాయిని అడిగాను.

"ఇది 'సెంట్రల్ రైల్ రోడ్డు న్యూజెర్సీ టెర్మినల్'. 1600 సంవత్సరంలో యూరప్ దేశాల నుంచి మూకుమ్మడిగా వలసలు వచ్చిన తరుణంలో దీని కార్యకలాపాలు అధికంగా ఉండేవి. న్యూయార్క్ హార్బరు ప్రధాన రవాణా కేంద్రంగా ముఖ్య భూమిక వహించింది. క్రమంగా ఇతర దేశాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామిక విప్లవం ఉధృతం కావడం, నగరాల్లో రోడ్డు మార్గాలు, ఆనకట్టలు అభివృద్ధి చెందడం మూలంగా 1950 నాటికి సి.ఆర్.ఆర్.యన్.జె. టెర్మినల్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి 1967 నాటికి పూర్తిగా ఆగిపోయాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ను గత చరిత్ర స్మృతి చిహ్నంగా ఉంచేందుకు 1968లో జెర్సీసిటీ 156 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. 1976 జూన్ 14న న్యూజెర్సీ ప్రభుత్వం లిబర్టీ పార్కుని ద్విశతాబ్ది కానుకగా జాతికి అంకితమిచ్చింది'' అని చెప్పుకొచ్చాడు.

న్యూయార్క్ హార్బరు లిబర్టీ పార్కుకి ఉత్తర దిశగా ఉంది. అప్పటి సేవలకు గుర్తుగా ఒక రైలు ఇంజను, కొన్ని పెట్టెలు లిబర్టీ పార్కులో పర్యాటకుల సందర్శనార్థం ఉంచారు.
ఎంతోమంది దేశవిదేశీయులను ఆకర్షిస్తూ ప్రపంచంలోని వింతలలో ఒకటైన లిబర్టీ విగ్రహాన్ని దర్శించడం గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయింది నా మనస్సులో శాశ్వతంగా.

- అవ్వా విజయలక్ష్మి, బచ్చుపేట, మచిలీపట్నం

Wednesday, November 3, 2010

ప్రకృతి వైపరీత్యాలతో రాటుదేలిన దేశమే ఇండోనేషియా.

సునామీ మినహా  అంతా సుఖమే

బంగారుగనులను దాచుకున్న ఆ నేలే ఇంకోవైపు అగ్నిపర్వతాలనూ మోస్తోంది. భూకంపాల్నీ, సునామీలను కూడా భరిస్తోంది. తరచూ సంభవించే ఈ వైపరీత్యాలతో రాటుదేలిన దేశమే ఇండోనేషియా. ప్రకృతి బీభత్సాలు భయాన్ని సృష్టిస్తున్నా ఇక్కడున్న ఉపాధి అవకాశాల వల్ల ప్రవాసీయుల తాకిడీ దీనికి ఎక్కువే.

ఎనిమిదేళ్ల క్రితం ఈ దేశానికి వచ్చిన ప్రవాసాం«ద్రుడు సబ్బవరపు హరి 'పేరులోనే కాదు కొన్ని ఆహారపు అలవాట్లలోనూ ఇండోనేషియా ఇండియాను కొంచెం పోలి ఉంటుంది' అంటారు. ఇక్కడి 'బిసానా అపెరల్ గ్రూప్' గార్మెంట్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన చెప్పిన విశేషాలు..

నేను ఇండోనేషియా వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది, నేనుండేది బోగోర్ అనే ఊళ్లో. జకార్తాకి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడ 365 రోజులూ వర్షం పడుతుంది. అందుకే దీన్ని రెయిన్ సిటీ అంటారు. గొడుగు, రెయిన్ కోట్ లేకుండా ఎవరూ బయటకు వెళ్లరు. అంత అవసరం అవి.

ఈ మధ్యే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు కొంచెం తగ్గినా.. రోజూ పడడం మాత్రం మానలేదు. అలవాటుపడేదాకా కొత్తగా వచ్చిన ఫారినర్స్‌కి, టూరిస్టులకు ఈ వర్షం ఇబ్బందినే కలిగిస్తుంది. ఇబ్బంది పడుతూనే ఎంజాయ్ చేస్తారు కూడా. నేను పనిచేసే గార్మెంట్ కంపెనీ ఎప్పుడో వందేళ్ల క్రితం ఇండోనేషియాలో స్థిరపడిన తమిళులది. మా కంపెనీలో 1800 మంది పనిచేస్తారు. అందులో ఏడుగురం మాత్రమే భారతీయులం. మిగిలిన అందరూ ఇండోనేషియన్లే.
టూ వీలర్ టాక్సీలు ఎక్కువ మా ఇంటికీ... ఫ్యాక్టరీకి పన్నెండు కిలోమీటర్ల దూరం. మాకు పనిమనిషి ఉంది. ఇంట్లో వంటతో సహా పనంతా చేస్తుంది. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలి. సర్వెంట్ మెయిడ్స్‌ను కూడా ఇక్కడ ఉద్యోగుల్లాగే చూస్తారు. ఇళ్లల్లో వంటమనుషులుగా పనిచేసే ఇండోనేషియన్లందరికీ భారతీయ వంటలు వచ్చు.

టిఫిన్ చేసి నేను ఏడింటికల్లా ఆఫీస్‌కి బయలుదేరుతాను. మెట్రొలు, బస్‌లు, ఆటోలు(లాంటివి) ఇక్కడి ప్రధాన రవాణా సౌకర్యాలు. టూవీలర్ టాక్సీలు కూడా ఎక్కువే. వీటివల్లే రోడ్లు రద్దీగా ఉంటాయి. ఏ కార్నర్‌లో చూసినా ఐదారుగురు హెల్మెట్లు పెట్టుకుని( హెల్మెట్ తప్పనిసరి) వెహికిల్స్‌తో నిలబడి ఉంటారు. అదీగాక చాలామంది బాగోర్( బాగోర్ ప్రాంతం చల్లగా, ప్రశాంతంగా చాలా బాగుంటుంది కాబట్టి)నుంచి జకార్తాకి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దీనివల్ల కూడా ఆఫీస్ వేళల్లో మహారద్దీగా ఉంటాయి రోడ్లు. అయితే ఎవరూ ట్రాఫిక్ నియమాలను ఉలంఘించరు. పాదచారులకు ప్రాధాన్యం ఎక్కువ

.
చివరి మూడు రోజులూ బిజీ
అన్ని వ్యాపారాల్లోకీ గార్మెంట్ బిజినెసే టాప్ ఇక్కడ. ప్రతి ఫ్యాక్టరీలో కార్మికులకు భోజన, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా ఉంటాయి. నా పనికొస్తే... భోజన సమయానికి ముందు ఎక్కువగా స్టాఫ్ మీటింగ్‌లు ఉంటాయి.అప్పటికప్పుడు చేయాల్సిన కొన్ని అత్యవసరమైన పనులూ ఉంటాయి.. ఒంటి గంటకు లంచ్.

తర్వాత మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పనులు చూసుకుంటాను. ప్రతి రెండున్నర గంటలకు టీ బ్రేక్ ఉంటుంది. నాలుగు నుంచి మెల్లమెల్లగా ఆఫీస్ ఖాళీ అవుతుంటుంది. మాకు పని సమయం ఎనిమిది గంటలు. నిజానికి నాకు పనివేళలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు దాకా. ఓవర్ టైమ్ చేయాల్సి వస్తే ఓ రెండుగంటలు ఎక్కువుంటాం . అయితే వారం మొత్తం ఇలాగే ఉండదు

. అమెరికా, యూరప్ దేశాలకు చేయాల్సిన ఎగుమతులుంటాయి. ఎగుమతులను తీసుకెళ్లే షిప్‌లన్నీ శనివారం బయలుదేరుతాయి. ఆ రోజుకల్లా డెలివరీ ఇచ్చేయాలి కాబట్టి గురు, శుక్ర, శని వారాలు చాలా బిజీగా ఉంటాం.ఆ రోజుల్లో ఇంటికి తిరిగొచ్చే టైమ్ మా చేతుల్లో ఉండదు. మామూలు రోజుల్లో ఆరున్నర కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఏడున్నరకి డిన్నర్ చేసి కాసేపు నెట్‌లో చాటింగ్, ఏదైనా చదువుకోవడం, ఇండియలో ఉన్న ఫ్రెండ్స్, బంధువులతో మాట్లాడ్డం లాంటివి చేస్తాను. అయితే మా దగ్గర టెలిఫోన్ లైన్స్ చాలా వీక్.

షారూఖ్ అంటే బాగా ఇష్టం

ఇక్కడ వారానికి ఆరు రోజుల పనిదినాలు. ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం ఒక్క పూటే ఉంటుంది. ఆదివారం రోజు జాలీగానే గడుపుతారంతా. మేమైతే ( మా కుటుంబం) ప్రతి ఆదివారం జకార్తాకి వెళ్తాం. అక్కడున్న ఇండియన్ స్టోర్స్‌లో కావల్సినవి కొనుక్కొంటాం. ఇండియన్ రెస్టారెంట్లలో లంచ్ చేసి సినిమాకి వెళ్తాం. పెద్ద పెద్ద హీరోల హిందీ సినిమాలన్నీ వస్తాయి.

ఇప్పుడు రోబో నడుస్తోంది. ఇక్కడి వాళ్లకు షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లంటే చాలా ఇష్టం. షారూఖ్ కుఛ్ కుఛ్ హోతా హై సినిమా అంటే పడి చస్తారు. ఆ సినిమా పాటలు అందరికీ వచ్చు. ఇండియన్స్ ఎవరు కనిపించినా...మీది షారూఖ్ ఖాన్ ఊరా? అని అడుగుతుంటారు. ఆహారం విషయానికి వస్తే...దొండకాయ తప్ప అన్నీ దొరుకుతాయి. వీళ్ల వంటలు కొన్ని మన వంటల్నే పోలి ఉంటాయి. అలాంటి వాటిని పడంగ్ ఫుడ్ అంటారు. సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. బాగా ఇష్టపడతారు కూడా . ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇండోనేషియన్లు ఇంట్లో వంట చేసుకోవడం చాలా తక్కువ.

హోటల్స్‌లోనే తింటారెక్కువగా. అందుకే ఇక్కడ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. భారతీయులు 35 వేల మంది దాకా ఉండొచ్చు. తమిళ్, పంజాబి అసోసియేషన్స్ ఉన్నాయి. తెలుగు కుటుంబాలు మాత్రం ఇరవై కన్నా ఎక్కువ లేవు. నెలకు ఒకసారి కలుసుకుంటాం. అందరం కలిసి దీపావళి గ్రాండ్‌గా చేసుకుంటాం. మన దేవాలయాలు చాలా ఉన్నాయి. పండగలకు, బర్త్‌డేలకు అక్కడికి వెళ్తుంటాం.

ఆడవాళ్లే ఎక్కువ...

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో ఇండోనేషియా నాలుగవది. ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం. చాలా భాషలున్నా అధికార భాష మాత్రం బహాసా దీరా(bahasa deearh). భారతీయుల్ని చాలా ఇష్టపడతారు, గౌరవిస్తారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ముస్లిం దేశమే అయినా ఆడవాళ్లు స్వేచ్ఛగానే ఉంటారు. నిజానికి పనిచేసేది ఎక్కువగా వాళ్లే. ఫ్యాక్టరిల్లో, ఆఫీసుల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కనిపిస్తారు.

భారతీయుల తర్వాత ఈ దేశంలో కనిపించేది కొరియన్లు, చైనీయులు. బాలిలో యురోపియన్లు, ఆస్ట్రేలియన్లు ఎక్కువుంటారు. సాఫ్ట్‌వేర్ సంగతేమో కాని గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు మాత్రం ఇబ్బడిముబ్బడి అవకాశాలున్నాయిక్కడ. కంపెనీ స్టాండర్డ్‌ను బట్టి వేతనాలుంటాయి. గోల్డ్‌మైన్స్‌లో కూడా మంచి అవకాశాలే ఉన్నాయి.

ఓవైపు సునామీ..ఇంకోవైపు అగ్నిపర్వతాలు

ఇక్కడ భయపెట్టేవల్లా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు. ఇవన్నీ మధ్య ఇండోనేషియాలోని జావా అనే ప్రాంతంలో ఎక్కువ. కొన్ని అగ్నిపర్వతాలయితే నిరంతరం రగులుతూనే ఉంటాయి. అయినా ఆ ప్రాంతాల్లో కూడా జనజీవనం సాగుతోంది. ఓ వైపు అగ్నిపర్వతాల్లోంచి పొగ వస్తూంటుంది..మరోవైపు దాని పరిసరాల్లోనే ప్రజలు తమ పనుల్లో మునిగి ఉంటారు.

ఆశ్చర్యమేస్తుంది ఆ దృశ్యం చూస్తే. నిజానికి అగ్నిపర్వతాలు ఎగజిమ్మే నిప్పుకణికల వల్ల ఇక్కడ మరణాల రేటు రోజురోజుకీ ఎక్కువవుతోంది. దట్టమైన పొగలో చిక్కుకుని కనిపించకుండా పోయే జనాల సంఖ్యా తక్కువేమీ లేదు. మా ఫ్యాక్టరీలోని ఓ వర్కర్ తల్లితండ్రులు ఇలాగే గల్లంతయ్యారు. ఇలాంటి వాళ్ల ఆచూకి తీయడం కోసం ప్రత్యేక బలగాలు పనిచేస్తూనే ఉంటాయి.

సునామీ...అయితే భయంక రమైన అనుభవం. 2004 నాటి సునామీలో ఊళ్లకు ఊళ్లే తుడుచిపెట్టుకుపోయాయి. అందులోంచి ఇంకా చాలామంది తేరుకోనే లేదు.. మొన్నటికిమొన్న వచ్చిన సునామీ కూడా మమ్మల్ని వణికించిందనే చెప్పాలి. ఇక్కడ అంత ప్రభావం చూపకపోయినా సునామీ వార్తతోనే అందరూ భయపడ్డారు. ఇళ్లు ఖాళీ చేసేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఇంకా స్వస్థలాలకు చేరుకోనేలేదు భయంతో. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడ ఎక్కువనే చెప్పాలి. ఓ రకంగా దైనందిన జీవితాన్ని చాలా డిస్ట్రర్బ్ చేస్తాయి.

ఇండోనేషియాలో భయపెట్టేవల్లా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు. ఇవన్నీ మధ్య ఇండోనేషియాలోని జావా అనే ప్రాంతంలో ఎక్కువ. కొన్ని అగ్నిపర్వతాలయితే నిరంతరం రగులుతూనే ఉంటాయి. అయినా ఆ ప్రాంతాల్లో కూడా జనజీవనం సాగుతోంది.  
సరస్వతి రమ