Wednesday, November 3, 2010

ప్రకృతి వైపరీత్యాలతో రాటుదేలిన దేశమే ఇండోనేషియా.

సునామీ మినహా  అంతా సుఖమే

బంగారుగనులను దాచుకున్న ఆ నేలే ఇంకోవైపు అగ్నిపర్వతాలనూ మోస్తోంది. భూకంపాల్నీ, సునామీలను కూడా భరిస్తోంది. తరచూ సంభవించే ఈ వైపరీత్యాలతో రాటుదేలిన దేశమే ఇండోనేషియా. ప్రకృతి బీభత్సాలు భయాన్ని సృష్టిస్తున్నా ఇక్కడున్న ఉపాధి అవకాశాల వల్ల ప్రవాసీయుల తాకిడీ దీనికి ఎక్కువే.

ఎనిమిదేళ్ల క్రితం ఈ దేశానికి వచ్చిన ప్రవాసాం«ద్రుడు సబ్బవరపు హరి 'పేరులోనే కాదు కొన్ని ఆహారపు అలవాట్లలోనూ ఇండోనేషియా ఇండియాను కొంచెం పోలి ఉంటుంది' అంటారు. ఇక్కడి 'బిసానా అపెరల్ గ్రూప్' గార్మెంట్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన చెప్పిన విశేషాలు..

నేను ఇండోనేషియా వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది, నేనుండేది బోగోర్ అనే ఊళ్లో. జకార్తాకి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడ 365 రోజులూ వర్షం పడుతుంది. అందుకే దీన్ని రెయిన్ సిటీ అంటారు. గొడుగు, రెయిన్ కోట్ లేకుండా ఎవరూ బయటకు వెళ్లరు. అంత అవసరం అవి.

ఈ మధ్యే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు కొంచెం తగ్గినా.. రోజూ పడడం మాత్రం మానలేదు. అలవాటుపడేదాకా కొత్తగా వచ్చిన ఫారినర్స్‌కి, టూరిస్టులకు ఈ వర్షం ఇబ్బందినే కలిగిస్తుంది. ఇబ్బంది పడుతూనే ఎంజాయ్ చేస్తారు కూడా. నేను పనిచేసే గార్మెంట్ కంపెనీ ఎప్పుడో వందేళ్ల క్రితం ఇండోనేషియాలో స్థిరపడిన తమిళులది. మా కంపెనీలో 1800 మంది పనిచేస్తారు. అందులో ఏడుగురం మాత్రమే భారతీయులం. మిగిలిన అందరూ ఇండోనేషియన్లే.
టూ వీలర్ టాక్సీలు ఎక్కువ మా ఇంటికీ... ఫ్యాక్టరీకి పన్నెండు కిలోమీటర్ల దూరం. మాకు పనిమనిషి ఉంది. ఇంట్లో వంటతో సహా పనంతా చేస్తుంది. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలి. సర్వెంట్ మెయిడ్స్‌ను కూడా ఇక్కడ ఉద్యోగుల్లాగే చూస్తారు. ఇళ్లల్లో వంటమనుషులుగా పనిచేసే ఇండోనేషియన్లందరికీ భారతీయ వంటలు వచ్చు.

టిఫిన్ చేసి నేను ఏడింటికల్లా ఆఫీస్‌కి బయలుదేరుతాను. మెట్రొలు, బస్‌లు, ఆటోలు(లాంటివి) ఇక్కడి ప్రధాన రవాణా సౌకర్యాలు. టూవీలర్ టాక్సీలు కూడా ఎక్కువే. వీటివల్లే రోడ్లు రద్దీగా ఉంటాయి. ఏ కార్నర్‌లో చూసినా ఐదారుగురు హెల్మెట్లు పెట్టుకుని( హెల్మెట్ తప్పనిసరి) వెహికిల్స్‌తో నిలబడి ఉంటారు. అదీగాక చాలామంది బాగోర్( బాగోర్ ప్రాంతం చల్లగా, ప్రశాంతంగా చాలా బాగుంటుంది కాబట్టి)నుంచి జకార్తాకి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దీనివల్ల కూడా ఆఫీస్ వేళల్లో మహారద్దీగా ఉంటాయి రోడ్లు. అయితే ఎవరూ ట్రాఫిక్ నియమాలను ఉలంఘించరు. పాదచారులకు ప్రాధాన్యం ఎక్కువ

.
చివరి మూడు రోజులూ బిజీ
అన్ని వ్యాపారాల్లోకీ గార్మెంట్ బిజినెసే టాప్ ఇక్కడ. ప్రతి ఫ్యాక్టరీలో కార్మికులకు భోజన, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా ఉంటాయి. నా పనికొస్తే... భోజన సమయానికి ముందు ఎక్కువగా స్టాఫ్ మీటింగ్‌లు ఉంటాయి.అప్పటికప్పుడు చేయాల్సిన కొన్ని అత్యవసరమైన పనులూ ఉంటాయి.. ఒంటి గంటకు లంచ్.

తర్వాత మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పనులు చూసుకుంటాను. ప్రతి రెండున్నర గంటలకు టీ బ్రేక్ ఉంటుంది. నాలుగు నుంచి మెల్లమెల్లగా ఆఫీస్ ఖాళీ అవుతుంటుంది. మాకు పని సమయం ఎనిమిది గంటలు. నిజానికి నాకు పనివేళలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు దాకా. ఓవర్ టైమ్ చేయాల్సి వస్తే ఓ రెండుగంటలు ఎక్కువుంటాం . అయితే వారం మొత్తం ఇలాగే ఉండదు

. అమెరికా, యూరప్ దేశాలకు చేయాల్సిన ఎగుమతులుంటాయి. ఎగుమతులను తీసుకెళ్లే షిప్‌లన్నీ శనివారం బయలుదేరుతాయి. ఆ రోజుకల్లా డెలివరీ ఇచ్చేయాలి కాబట్టి గురు, శుక్ర, శని వారాలు చాలా బిజీగా ఉంటాం.ఆ రోజుల్లో ఇంటికి తిరిగొచ్చే టైమ్ మా చేతుల్లో ఉండదు. మామూలు రోజుల్లో ఆరున్నర కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఏడున్నరకి డిన్నర్ చేసి కాసేపు నెట్‌లో చాటింగ్, ఏదైనా చదువుకోవడం, ఇండియలో ఉన్న ఫ్రెండ్స్, బంధువులతో మాట్లాడ్డం లాంటివి చేస్తాను. అయితే మా దగ్గర టెలిఫోన్ లైన్స్ చాలా వీక్.

షారూఖ్ అంటే బాగా ఇష్టం

ఇక్కడ వారానికి ఆరు రోజుల పనిదినాలు. ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం ఒక్క పూటే ఉంటుంది. ఆదివారం రోజు జాలీగానే గడుపుతారంతా. మేమైతే ( మా కుటుంబం) ప్రతి ఆదివారం జకార్తాకి వెళ్తాం. అక్కడున్న ఇండియన్ స్టోర్స్‌లో కావల్సినవి కొనుక్కొంటాం. ఇండియన్ రెస్టారెంట్లలో లంచ్ చేసి సినిమాకి వెళ్తాం. పెద్ద పెద్ద హీరోల హిందీ సినిమాలన్నీ వస్తాయి.

ఇప్పుడు రోబో నడుస్తోంది. ఇక్కడి వాళ్లకు షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లంటే చాలా ఇష్టం. షారూఖ్ కుఛ్ కుఛ్ హోతా హై సినిమా అంటే పడి చస్తారు. ఆ సినిమా పాటలు అందరికీ వచ్చు. ఇండియన్స్ ఎవరు కనిపించినా...మీది షారూఖ్ ఖాన్ ఊరా? అని అడుగుతుంటారు. ఆహారం విషయానికి వస్తే...దొండకాయ తప్ప అన్నీ దొరుకుతాయి. వీళ్ల వంటలు కొన్ని మన వంటల్నే పోలి ఉంటాయి. అలాంటి వాటిని పడంగ్ ఫుడ్ అంటారు. సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. బాగా ఇష్టపడతారు కూడా . ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇండోనేషియన్లు ఇంట్లో వంట చేసుకోవడం చాలా తక్కువ.

హోటల్స్‌లోనే తింటారెక్కువగా. అందుకే ఇక్కడ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. భారతీయులు 35 వేల మంది దాకా ఉండొచ్చు. తమిళ్, పంజాబి అసోసియేషన్స్ ఉన్నాయి. తెలుగు కుటుంబాలు మాత్రం ఇరవై కన్నా ఎక్కువ లేవు. నెలకు ఒకసారి కలుసుకుంటాం. అందరం కలిసి దీపావళి గ్రాండ్‌గా చేసుకుంటాం. మన దేవాలయాలు చాలా ఉన్నాయి. పండగలకు, బర్త్‌డేలకు అక్కడికి వెళ్తుంటాం.

ఆడవాళ్లే ఎక్కువ...

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో ఇండోనేషియా నాలుగవది. ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం. చాలా భాషలున్నా అధికార భాష మాత్రం బహాసా దీరా(bahasa deearh). భారతీయుల్ని చాలా ఇష్టపడతారు, గౌరవిస్తారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ముస్లిం దేశమే అయినా ఆడవాళ్లు స్వేచ్ఛగానే ఉంటారు. నిజానికి పనిచేసేది ఎక్కువగా వాళ్లే. ఫ్యాక్టరిల్లో, ఆఫీసుల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కనిపిస్తారు.

భారతీయుల తర్వాత ఈ దేశంలో కనిపించేది కొరియన్లు, చైనీయులు. బాలిలో యురోపియన్లు, ఆస్ట్రేలియన్లు ఎక్కువుంటారు. సాఫ్ట్‌వేర్ సంగతేమో కాని గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు మాత్రం ఇబ్బడిముబ్బడి అవకాశాలున్నాయిక్కడ. కంపెనీ స్టాండర్డ్‌ను బట్టి వేతనాలుంటాయి. గోల్డ్‌మైన్స్‌లో కూడా మంచి అవకాశాలే ఉన్నాయి.

ఓవైపు సునామీ..ఇంకోవైపు అగ్నిపర్వతాలు

ఇక్కడ భయపెట్టేవల్లా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు. ఇవన్నీ మధ్య ఇండోనేషియాలోని జావా అనే ప్రాంతంలో ఎక్కువ. కొన్ని అగ్నిపర్వతాలయితే నిరంతరం రగులుతూనే ఉంటాయి. అయినా ఆ ప్రాంతాల్లో కూడా జనజీవనం సాగుతోంది. ఓ వైపు అగ్నిపర్వతాల్లోంచి పొగ వస్తూంటుంది..మరోవైపు దాని పరిసరాల్లోనే ప్రజలు తమ పనుల్లో మునిగి ఉంటారు.

ఆశ్చర్యమేస్తుంది ఆ దృశ్యం చూస్తే. నిజానికి అగ్నిపర్వతాలు ఎగజిమ్మే నిప్పుకణికల వల్ల ఇక్కడ మరణాల రేటు రోజురోజుకీ ఎక్కువవుతోంది. దట్టమైన పొగలో చిక్కుకుని కనిపించకుండా పోయే జనాల సంఖ్యా తక్కువేమీ లేదు. మా ఫ్యాక్టరీలోని ఓ వర్కర్ తల్లితండ్రులు ఇలాగే గల్లంతయ్యారు. ఇలాంటి వాళ్ల ఆచూకి తీయడం కోసం ప్రత్యేక బలగాలు పనిచేస్తూనే ఉంటాయి.

సునామీ...అయితే భయంక రమైన అనుభవం. 2004 నాటి సునామీలో ఊళ్లకు ఊళ్లే తుడుచిపెట్టుకుపోయాయి. అందులోంచి ఇంకా చాలామంది తేరుకోనే లేదు.. మొన్నటికిమొన్న వచ్చిన సునామీ కూడా మమ్మల్ని వణికించిందనే చెప్పాలి. ఇక్కడ అంత ప్రభావం చూపకపోయినా సునామీ వార్తతోనే అందరూ భయపడ్డారు. ఇళ్లు ఖాళీ చేసేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఇంకా స్వస్థలాలకు చేరుకోనేలేదు భయంతో. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడ ఎక్కువనే చెప్పాలి. ఓ రకంగా దైనందిన జీవితాన్ని చాలా డిస్ట్రర్బ్ చేస్తాయి.

ఇండోనేషియాలో భయపెట్టేవల్లా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు. ఇవన్నీ మధ్య ఇండోనేషియాలోని జావా అనే ప్రాంతంలో ఎక్కువ. కొన్ని అగ్నిపర్వతాలయితే నిరంతరం రగులుతూనే ఉంటాయి. అయినా ఆ ప్రాంతాల్లో కూడా జనజీవనం సాగుతోంది.  
సరస్వతి రమ

No comments: