Thursday, November 25, 2010

ప్రత్యేకతలున్న దేశం డెన్మార్క్ * మంచి జీవితం కావాలి అనుకుంటే...ఇక్కడికి రావచ్చు కాని డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్లు మాత్రం ఇక్కడికి రావాలంటే ఆలోచించుకోవాల్సిందే.

 సైకిల్ హైవేలూ ఉన్నాయి....
చల్లటి వాతావరణం....కాలుష్యంలేని జీవన విధానం...అందరికీ ఉచిత విద్య, వైద్యం.... సైకిళ్లపై ప్రయాణం, ప్రైవసీకి ప్రాధాన్యం, అంతా ప్రణాళికాబద్దం...ఆన్‌లైన్, ఆటో సెటప్ సిస్టం... ఇన్ని ప్రత్యేకతలున్న దేశం డెన్మార్క్. ఏడేళ్లుగా ఆ దేశంలో ఉంటున్న తెలుగు అబ్బాయి ఎన్.పి. కృష్ణంరాజు. 

ఆయన లైఫ్ అబ్రాడ్‌లో...... అనుభవాలు.

నేను డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌కి ఏడేళ్లక్రితం ఎమ్మెస్ చేయడానికి వచ్చాను. చదువయిపోయాక ఇక్కడే ఇమేజ్ ఎనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాను. మా ఆఫీస్ పనివేళలు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు వరకు. అయితే ఇక్కడ ఆఫీస్‌కి వెళ్లే పనిచేయాలన్న రూలేమీ లేదు. కొంతమంది ఇంటి దగ్గర నుంచే పనిచేస్తుంటారు. మీటింగులు , ఏవైనా అపాయింట్‌మెంట్లు ఉన్నప్పుడు మాత్రం ఆఫీస్‌కు వెళ్తుంటారు. సైకిళ్ల మీదే... మా ఆఫీస్ పనివేళలు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు వరకు. మా ఇల్లు కోపెన్‌హాగెన్‌కు ఈ చివరన ఉంటే ఆఫీస్ ఆ చివరన ఉంటుంది. ఎనిమిదింటికే బయలుదేరుతాను.

కార్లకు టాక్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ప్రపంచంలోనే కార్ల మీద ఎక్కువ టాక్స్ ఉన్న దేశం ఇదే. పైగా డానిష్ వాళ్లు పర్యావరణ ప్రియులు. కాబట్టి కార్లున్నా అందరూ సైకిళ్లనే వాడతారు. అందుకే దీన్ని బైక్స్ కాపిటల్ అని పిలుస్తారు. సైకిళ్లను బెక్స్ అని, టూవీలర్లను మోటార్ బైక్స్ అని అంటారు. సైకిళ్ల కోసం ప్రత్యేకమైన రోడ్డు ఉంటుంది. ఎంత దూరమైనా (కొపెన్‌హాగెన్ వైశాల్యం తక్కువ. కాని జనసాంద్రత ఎక్కువ) అంటే పది, ఇరవై కిలోమీటర్లున్నా అందరూ సైకిళ్ల మీదనే వెళ్తారు. లేదంటే..పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించుకుంటారు. ఇక్కడ మెట్రోలు, బస్‌లు, లోకల్ ట్రైన్‌లు ప్రధాన రవాణా సౌకర్యాలు. మెట్రోలు డ్రైవర్ లేకుండానే నడుస్తాయి. ప్రతి ఐదు నిమిషాలకు బస్‌లు, ట్రైన్‌లు అందుబాటులో ఉంటాయి.

ఇంకో విషయం ఏమిటంటే... కార్లను ఎంత తక్కువగా ఉపయోగిస్తారో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అంత ఎక్కువగా వినియోగిస్తారు. నేనైతే ఆఫీస్‌కి సైకిల్ మీదే వెళ్తాను. ట్రాఫిక్ పెద్దగా ఏమీ ఉండదు. ఉన్నా చాలా పద్ధతిగా ఉంటుంది. ఎవరూ నియమాలను అతిక్రమించరు. కాఫీ బ్రేకులు ఎక్కువ ఆఫీస్‌లో పని వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరి నియంత్రణ ఉండదు. ముఖ్యంగా బాసిజం ఉండదు. ఒత్తిడి అసలే ఉండదు. ఎవరికి వారే చాలా బాధ్యతగా ఉంటారు. ఆఫీసులో ఓ మూల చేరి హస్క్ వేసుకోవడాలు లాంటివి ఉండవు. అవసరమైతే తప్ప మాట్లాడరు. అలాగని కలుపుగోలుగా, స్నేహంగా ఉండరని కాదు. పనిమానేసి కబుర్లు చెప్పుకోవడాలు ఉండవు అంతే.

పక్కపక్కనే ఉన్నా సెల్‌లోనే మాట్లాడుకుంటారు అదీ అవసరమైతేనే. ఇక్కడ ప్రతి ఆఫీస్‌లో క్యాంటిన్ ఉంటుంది. ఒక్కో శుక్రవారం ఒక్కో ఉద్యోగి ఆఫీస్‌లో అందరికీ లంచ్ ఇప్పిస్తాడు. ఇక్కడ ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. మా ఆఫీస్‌లో అందరూ డానిష్ వాళ్లే. నేను, ఓ స్వీడన్ అతను ఇద్దరమే విదేశీయులం. పని చేసేటప్పుడు ప్రతి రెండు గంటలకు ఒక సారి తప్పనిసరిగా కాఫీ బ్రేక్ కావాలి ఇక్కడి వాళ్లకు. ఎనిమిది గంటలంటే..ఎనిమిది గంటలే పని చేస్తారు. అదనంగా ఒక గంట పని చేసినా దానికి ఓవర్ టైమ్ ఉంటుంది. ఇక్కడున్న ఇంకో సౌకర్యం ఏంటంటే...ఎవరైనా ఒక అర్హతతో ఉద్యోగంలో చేరితే...అందులో ఇంకా నైపుణ్యం, మెళకువలు సంపాదించుకోవాడానికి ప్రతి సంస్థ ప్రత్యేక శిక్షణను అందిస్తుంది. అన్ని రంగాల్లో ఇలాంటి సదుపాయం ఉంది. ఇక్కడ ఉద్యోగ సంఘాలు చాలా ఉంటాయి.

ఏదైనా కారణం చేత ఉద్యోగం పోతే....మళ్లీ ఇంకో ఉద్యోగం దొరికేదాక 70 శాతం జీతం ఇస్తారు. సైకిళ్లకు హైవేలు ప్రతి శనిఆదివారాలు సెలవులు. శుక్రవారం కూడా ఒక్క పూటే ఉంటుంది ఆఫీస్. మిగిలిన సమయాల్లో పనిపట్ల ఎంత నిక్కచ్చిగా ఉంటారో....సెలవుల్లో అంత సరదాగా గడుపుతారు. ఇక్కడ పబ్‌లు, క్లబ్‌లు కూడా చాలా బావుంటాయి. ఇవి కాక సంవత్సరానికి ఐదు వారాలు సెలవులిస్తారు. ఆ అయిదు వారాలు అందరూ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు వెళ్లిపోతారు. కొంతమంది సైక్లింగ్ వెళ్తుంటారు. వంద కిలోమీటర్లయినా సైకిల్ వేసుకుని వెళ్లిపోతుంటారు. సైక్లింగ్ కోసం స్పెషల్ హైవేలు ఉంటాయి. నేనూ అంతే...వీకెండ్స్‌కి సైక్లింగ్. లేదంటే...మా ఆవిడను తీసుకుని షాపింగ్‌కి వెళ్తాను.

పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వాళ్లు ఇండియన్ స్టోర్స్, రెస్టారెంట్లను నడుపుతుంటారు. మాకు కావల్సిన సరకులు అక్కడే తెచ్చుకుంటాం. అన్నీ దొరుకుతాయి. కూరగాయలే అన్నిరకాలూ దొరకవు. డానిష్ వాళ్లు బీఫ్, పోర్క్ ఎక్కువగా తింటారు. అందుకే డెన్మార్క్‌లో మనుషుల కంటే పందులే ఎక్కువ కనిపిస్తుంటాయని జోకులు కూడా వేసుకుంటుంటారు. అయితే ఏది తిన్నా...పరిమితంగానే తింటారు. ఇండియన్ ఫుడ్‌ని మాత్రం చాలా ఇష్టపడతారు. తెలుగు వాళ్ల కోసం క్లబ్ ఒకటి ఉంది. పండగలకి, పబ్బాలకి అందరం కలుసుకుంటాం. రెండు గుళ్లు కూడా ఉన్నాయి తమిళులు ఉన్న చోట. తెలుగు వాళ్లు కాక పంజాబీలు ఎక్కువగా కనిపిస్తారు. చైనా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వాళ్లు కూడా ఉంటారు.

డానిష్ వాళ్లు థాయ్‌లాండ్‌కు ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వస్తుంటారు కూడా. స్వీడన్‌లో షాపింగ్ ఎక్కువ షాపింగ్ చేయాలంటే...స్వీడన్ వెళ్తాం. కోపెన్‌హాగన్ నుంచి స్వీడన్‌లోని మాల్మాకు బ్రిడ్జ్ ఉంటుంది. దీన్నే మాల్మా బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జి గుండా వెళ్లిపోతాం. స్వీడన్ క్రోన్స్ కన్నా డెన్మార్క్ క్రోన్స్ (కరెన్సీ) విలువ ఎక్కువ. అందుకే అక్కడికెళ్తే చవకలో ఎక్కువ కొనుక్కోవచ్చని చాలా మంది అక్కడే షాపింగ్ చేస్తుంటారు. షాపింగే కాదు స్కాండినేవియన్ దేశాల వాళ్లు ఆ మూడు దేశాల్లో ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు. చాలామంది స్వీడన్ నుంచి రైల్లో కోపెన్‌హాగె న్‌కు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే....ఈ దేశానికి చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి ....నేల ఉన్నంత వరకు రైల్లు, బస్సులు ,కార్లలో వెళ్లి సముద్రం మొదలైన చోట ఓడలోకి ఈ వాహనాలు ఎక్కించేస్తారు. ఒడ్డు రాగానే ఆ వాహనాలు దిగి మళ్లీ రోడ్డుమీద, పట్టాల మీద ప్రయాణం సాగిస్తాయి. షెడ్యూల్‌లో ఉంటేనే కలవాలి ఇంకో విషయం ఏమిటంటే...ఇక్కడ ఎవరూ తమ వ్యక్తిగత జీ

వితంలోకి పక్కవారిని దూరనివ్వరు, వారు దూరరు. మిగిలిన యూరప్ దేశాల కన్నా కూడా వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. అందుకే విడాకుల రేటూ ఇక్కడ ఎక్కువే. అలాగని కుటుంబ జీవితాన్నేమీ నిర్లక్ష్యం చేయరు. ప్రతీదీ షెడ్యూల్ ప్రకారం చేసుకుంటారు. ఫ్రెండ్స్‌ని కలవాలన్నా...బంధువులను కలవాలన్నా.... అనుకున్నదే తడవుగా వెళ్లడానికి ఉండదు. ప్రతివాళ్లకు ఓ షెడ్యూల్ ఉంటుంది. ఎవరిని కలవాలనుకుంటున్నామో వాళ్ల షెడ్యూల్ చూసుకుని వాళ్లకు ఖాళీ ఉన్న రోజున ముందుగా సమాచారం ఇచ్చి కలవాల్సి ఉంటుంది. అలాగే భాష విషయంలో మరీ జర్మనీ , ఫ్రాన్స్ అంత పట్టింపులు లేకపోయినా....ఇంగ్లీష్ విరివిగా ఉపయోగంలోనే ఉన్నా డానిష్ వచ్చుంటే చాలా మంచిది.

ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, పని స్థలాల్లో డానిష్ మాట్లాడుతుంటారు. సైన్ బోర్డ్స్ కూడా చాలా వరకు డానిష్ భాషలోనే ఉంటాయి. పాఠ్యపుస్తకాలు మాత్రం ఎక్కువగా ఇంగ్లీష్‌లో ఉంటాయి. అందుకే ఇంగ్లీష్ తప్పనిసరి. అయితే దైనందిన జీవితంలో కొన్ని పనులను చేసుకోవడానికి మాత్రం డానిష్ వచ్చుండాలి. డెన్మార్క్ దేశస్తులు మంచి చదువరులు, టెక్నాలజీ ప్రియులు. వార్తా పత్రికలు బాగా చదువుతారు. తొంభై శాతం న్యూస్ పేపర్లు ఉచితంగానే పంపిణీ అవుతాయి. రైళ్లల్లో, బస్సుల్లో పేపర్లు ఇస్తారు.

టెక్నాలజీ విషయానికి వస్తే..అంతా ఆన్‌లైన్, ఆటో సెటప్ ఉంటుంది. లంచం తెలియదు ప్రజల మౌలిక సదుపాయాలు, సౌకర్యాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అందరికీ ఉచిత విద్య, ఆరోగ్య వసతులుంటాయి. ఈ దేశంకి వచ్చారాగానే ఎల్లో కార్డ్ ఇస్తారు. అది ఉంటే అన్నిటికీ భద్రత అన్నమాట. అంటే.. ఆసుపత్రులు, చదువులు అన్నీ దాంతోనే. అంతేకాదు ఇక్కడ పిల్లలు పుడితే....పుట్టినప్పటి నుంచి ఓ సంవత్సరం వయసు వచ్చేదాకా నాపీల నుంచి సెరిలాక్, హెల్త్ కేర్ దాకా అన్నీ ఉచితమే. ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే....లంచం అనే పదం వినిపించని దేశం డెన్మార్క్.

ప్రతివాళ్లకు అన్నిరకాలుగా భద్రత ఉంటుంది, మనకు 108 సర్వీస్ లా ఇక్కడ 112 అని ఎమర్జన్సీ సర్వీస్ ఉంటుంది. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినా...అనారోగ్యం వచ్చినా....గృహహింస జరుగుతున్నా....112కి ఫోన్ చేసిన మూడేమూడు నిమిషాల్లో సంబంధించిన సేవ మనకందుతుంది. స్త్రీ పురుష సమానత్వం కూడా ఎక్కువే. జీవనం చాలా ఖరీదు డెర్మార్క్‌లో వాతావరణం చాలా బాగుంటుంది. చలికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీలు. ఎండాకాలం బాగుంటుంది.20 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆహ్లాదంగా ఉంటుంది. కాలుష్యం లేని వాతావరణం.....మంచి వర్క్ కల్చర్...ఫ్రెండ్లీగా ఉండే డానిష్ ప్రజలు... అన్నిటికీ మించి గొప్ప భద్రతతో జీవితం చాలా బాగుంటుంది.

ఐటి సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్పెషలైజేషన్ చేసిన వాళ్లకైతే గొప్ప అవకాశాలే ఉన్నాయి. కాని ...ఇక్కడ ఖర్చే చాలా ఎక్కువగా ఉంటుంది. అద్దెల దగ్గర్నుంచి అన్నీ చాలా ఖరీదు. పన్నులూ ఎక్కువే. మన సంపాదన పెరిగిన కొద్దీ కట్టాల్సిన పన్నూ పెరుగుతుంది. మంచి జీవితం కావాలి అనుకుంటే...ఇక్కడికి రావచ్చు కాని డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్లు మాత్రం ఇక్కడికి రావాలంటే ఆలోచించుకోవాల్సిందే.

2 comments:

vasavi Reddy Hyderabad said...

hy dear nice information ..
thanx.. to u dear
iam vasu from hyd...

sri said...

Nice information.... Sir... Thanq.