Showing posts with label New Year. Show all posts
Showing posts with label New Year. Show all posts

Saturday, January 1, 2011

ఏడాదికి 700 'రోజు'లు


ఇదేంటి...ఇదెప్పట్నించి... కొత్త సంవత్సరం మొదలవడం మొదలవడం ఇలా మొదలైందేమిటి... రాత్రికి రాత్రి క్యాలెండర్ ఎవరైనా మార్చేశారా అని కంగారుపడొద్దు. భూభ్రమణం వల్ల ఏర్పడే పగళ్లు రాత్రుల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. అవి ప్రస్తుతానికి 365 రోజుల దగ్గరే నిలకడగా ఉన్నాయి. ప్రజలు తమ కోసం తాము సృష్టించుకున్న రోజులు ఇవి. కుటుంబం నుంచి విశ్వం దాకా తమకున్న అన్ని అనుబంధాలు, సమస్యల గురించి ఉత్సవాలు, ఊరేగింపులు సమావేశాలు జరుపుకోవడానికి కార్డులు, గిఫ్ట్‌లు ఇచ్చుకోవడానికి సొంతంగా రూపొందించుకున్న 'డే'లు ఇవి. అందుకే మనకిప్పుడు ఏదో ఒక 'రోజు' కాని రోజే లేదు.

ఆ 'రోజు'లే ఈ రోజులు. టీచర్స్ డే, చ్రిల్డన్స్ డే, వాలెంటైన్స్ డే, మదర్స్‌డే, ఫాదర్స్ డే లాంటి అందరికీ తెలిసిన రోజుల నుండి... పెక్యూలియర్ పీపుల్ డే లాంటి విచిత్ర రోజులు... కజిన్స్‌డే, హౌస్ వైఫ్స్‌డే, మదర్ ఇన్‌లాస్ డే లాంటి కొత్తరకం రోజులు... ఫన్ ఎట్ వర్క్ డే, వర్క్ లైక్ ఎ డాగ్ డే లాంటి సరదా రోజులు... చాక్‌లెట్ డే, మైసూర్‌పాక్ డే లాంటి తిండి రోజులు... చెట్టుల దినోత్సవాలు, పిట్టల దినోత్సవాలు... చెప్పుకుంటూ పోతే కాదేదీ రోజుకి అనర్హం అన్నట్టు ప్రతి అంశానికి ఓ రోజుంది. ప్రతి రోజుకి ఓ 'ప్రత్యేకత' ఉంది. చాలావాటికి రెండు, మూడు కూడా ఉన్నాయి. వాటన్నిట్నీ లెక్కిస్తే ఇంచుమించు ఏడొందలవుతున్నాయి. అందుకే ఏడాదికి ఇప్పుడు ఏడొందల రోజులుగా నిర్ధారించాం. ఆ రోజుల క్యాలెండర్ని తిరగేయడమే ఈ వారం కవర్‌స్టోరీ!


హ్యాపీ న్యూ ఇయర్! కొత్త సహస్రాబ్దిలోకి ప్రవేశించి అప్పుడే పదేళ్లయిపోయింది. రెండో దశాబ్ది మొదలై ఓ రోజు గడిచింది. ఈ ఏడు ఏమేం మంచి పనులు చేయాలనుకుంటున్నారు? మరీ ఎక్కువో కష్టమైనవో తీసుకోలేదు కదా. ఇదంతా ఎందుకంటారా. అవి గనక ఆచరణ సాధ్యం కానివని మీకనిపిస్తేనో, వాటికి కట్టుబడి ఉండే సీన్ మీకు లేదనిపిస్తేనో ఆ ఒట్టు తీసి గట్టుమీద పెట్టే రోజొకటి త్వరలోనే ఉంది. అదే 'డిచ్ న్యూ ఇయర్స్ రిజొల్యూషన్స్ డే'. సంక్రాంతి తర్వాత రెండోరోజే ... అంటే ఈ నెల పదిహేడున వస్తుంది. మ్యారథన్ పరుగు లాంటి పెద్దపెద్ద గోల్స్‌ను, చక్కదిద్దలేం అనుకున్న 'క్లిష్ట' సమస్యల్ని వదిలేసి మళ్లీ ఫ్రీ బర్డ్స్ అయిపోగల రోజు. బరువైన నిర్ణయాలను 15 రోజుల కంటే భరించలేరని గుర్తించి ఈ ఏర్పాటు చేసినట్టున్నారు. ఏమైతేనేం మంచి సౌలభ్యం మనందరికీ.

ఆ డే చేసుకోకపోయినా, అలాంటి రోజు ఒకటుందో లేదో తెలియకపోయినా ఎలాగూ అందరం ఆ పని చేస్తూనే ఉంటాం కాని దాని కన్నా ముందు జనవరిలో మరో రెండుమూడు రోజులున్నాయి. రేపు 'హ్యుమిలియేషన్ డే'. అంటే ఆ రోజు ఎవరినో ఒకరిని మానసికంగా హింసించాలని కాదు. ఎవరినీ మనోవ్యధకి గురి చేయకూడదని చెప్పడమే ఆ రోజు ఉద్దేశం. ఈ 'రోజు'ని కెనడాలో అయితే జూలై ఒకటిన జరుపుకుంటారు. చైనీయుల ప్రవేశాన్ని నిషేధిస్తూ కెనడా ప్రభుత్వం గతంలో ఒకసారి ఆదేశాలు జారీ చేసిందట. ఆ నిర్ణయానికి నిరసనగా కెనడాలో ఉంటున్న చైనీయులు 1923 నుంచి ఈ హ్యుమిలియేషన్ డేని జరుపుకుంటున్నారు. అందుకే కొత్త సంవత్సరం నాడు తీసుకున్న ఎన్ని నిర్ణయాలను గాలికి వదిలేసినా హ్యుమిలియేషన్ డే నాడు మాత్రం గట్టిగా నిర్ణయించుకోండి ఎవరినీ నొప్పించ కూడదని.

అంతటితో ఆగిపోకుండా దాన్ని పాటించడానికి గట్టిగా ప్రయత్నించండి. ఒకవేళ దాన్ని పాటించకుండా ఎవరినైనా హింసించారో మీ గురించి 'పెక్యూలియర్ క్యారెక్టర్'రా బాబూ అని చెప్పుకుంటారు. అంటే మీరు 'ఆడంతే అదో టైపు' అయిపోతారు. అలాంటి అదో టైప్ వాళ్లకి కూడా ఒక రోజుంది. అదే పెక్యూలియర్ పీపుల్ డే. జనవరి పది. ఇలాంటి రోజులు ఉన్నాయా అనిపిస్తోందా. మీ అనుమానం పాడుగాను. ఇలా ప్రతి దాన్ని అనుమానించే వాళ్లకోసం కూడా ఓ రోజుంది. అదే 'ఇంటర్నేషనల్ స్కెప్టిక్స్ డే'. అంతర్జాతీయ అనుమానస్తుల(సంశయవాదుల) దినోత్సవమన్న మాట.

మరో రోజుకి వెళ్లిపోదామా!

మనకి బాగా నచ్చిన వాళ్లని ఒక్కసారైనా కౌగలించుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఆలింగనం చేసుకోవడం ఎంత బాగుంటుందో రంజాన్ రోజు చిట్టిపొట్టి చిన్నారులు ఒకరినొకరు కౌగలించుకోవడం చూసినపుడు అనిపిస్తుంది. మీరూ అలాగే జనవరి 21న ఒక్కసారి కౌగలించుకోండి. ఎందుకంటే ఆ రోజు నేషనల్ హగ్గింగ్ డే. వివరాలు కావాలంటే నేషనల్ హగ్గింగ్ డే వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఎవర్నయినా కౌగిలించుకోవచ్చా భార్యాభర్తలు మాత్రమేనా అని డౌట్ వచ్చింది కదూ మీకు! వాళ్లకు విడిగా ఒక రోజుంది. జనవరి 26.. మన రిపబ్లిక్ డే నాడే 'స్పౌజెస్ డే' కూడా. ఆ రోజు రావడం కూడా మంచిదే లెండి. ఎందుకంటే ఆ రోజు మనకు హాలిడే కాబట్టి ప్రత్యేకంగా ఉద్యోగానికి సెలవు పెట్టాల్సిన అవసరం ఉండదు.

సో... కపుల్స్ ఎంజాయ్ యువర్ డే. వాళ్లను వదిలేసి పని దగ్గరికి వద్దాం. పనే ఫన్‌గా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? అప్పుడు ఆఫీసంటే ఇష్టం పెరుగుతుంది. అలాంటి ఇష్టం ఎంతమందికి ఉందో చూద్దామని కాబోలు 'ఫన్ ఎట్ వర్క్ డే' అని పెట్టారు. అంటే పని మానేసి ఫన్‌గా గడిపేయమని కాదు. పనినే ఫన్‌గా ఇష్టపడి చేయమని. ఒకరోజు ఇష్టంగా చేసినపుడు రెండో రోజు మాత్రం ఎందుకు చేయలేం అనుకుంటూ ఇక ప్రతి రోజూ మంచిగా చేయొచ్చు. ఒక్క నెల లోనే ఇన్ని 'డే'లున్నాయా అనుకుంటున్నారా. అప్పుడే ఏం చూశారు... ఇంకా చాలా ఉన్నాయి.

ఇక ఫిబ్రవరిలోకి ఎంటరవుదాం


ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే అని ప్రేమికుల పుణ్యమా అని అందరికీ తెలుసు కాని 4న వరల్డ్ క్యాన్సర్‌డే అని ఎంతమందికి తెలుసు? ఏటా లక్షల మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి రోజూ కృషి చేసేవాళ్లున్నా ఆ ఒక్కరోజు అందరి దృష్టినీ దాని మీద ఫోకస్ అయ్యేలా చేసిన ఏర్పాటు అది. ఇకపోతే ఫిబ్రవరి 12 డార్విన్ పుట్టిన రోజు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహానుభావుని గురించి పిల్లలందరికీ తెలియడం కోసమే కాక సైన్స్‌ను, హేతువును పెంపొందించేందుకు గాను డార్విన్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. తెల్లారితే మరో పండుగ ఉంది. మీలో ఎవరికైనా మీ పెద్దవాళ్లు పెట్టిన పేర్లు నచ్చకపోతే ఈ రోజు మీ కోసమే.

అదే 'గెట్ ఎ డిఫరెంట్ నేమ్ డే'. అంతా నచ్చింది కాని, నీ పేరేం బాలేదు అనే బోయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ వాలంటైన్‌డేకి ఒక రోజు ముందే కొత్త పేరు పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం నచ్చలేదంటారో చూద్దాం. 21న 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం' ఉంది. 'నాక్ తెల్గు రాదు' అనే తెలుగు వాళ్లందరూ ఈ రోజుని తప్పకుండా గుర్తుంచుకోండి. తెలుగుని తెల్గు చేయకండి. ఆ రోజుకి ఓ రోజు ముందు 20న 'లవ్ యువర్ పెట్ డే', ఒక రోజు తర్వాత 22న 'వాకింగ్ ది డాగ్ డే' కూడా ఉన్నాయి. చూడబోతే ఈ రెండు రోజులూ పెంపుడు జంతు ప్రేమికుల సృష్టో, లేక వాటిని, వాటి ఫుడ్‌ని అమ్మేవారి సృష్టో అనిపించట్లా! 'డే'ల వెనక వ్యాపార ప్రయోజనాలు ఉండడం రహస్యం కాదనుకోండి.

మార్చి-ఏప్రిల్

మార్చి మూడోతేదీ జాతీయ గీత దినోత్సవం. పాడడం తగ్గిపోయాక యేటా దాని గురించి ఒక రోజయినా గుర్తు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. నిద్ర లేచాక అటెన్షన్‌లో నిలబడి పాడేస్తే ఒక పనైపోతుంది.
దాని తర్వాత చెప్పుకోదగిన రోజు డెంటిస్ట్స్ డే-ఆరో తేదీన. బహుశా దీనికి చొరవ తీసుకున్నది టూత్‌పేస్ట్ వ్యాపారులై ఉంటారు. లేకపోతే మిగతా వాళ్లకేం పట్టింది మన దంతాలు బాగున్నాయో లేదో చూడడానికి.
ఏప్రిల్ ఒకటో తేదీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ నాలుగో తేదీ గురించి మాత్రం తప్పక చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు 'టెల్ ఎ లై డే'... అబద్ధం చెప్పడానికి అధికారికంగా అనుమతి లభించిన రోజు. 'సత్యమునే పలుక వలెను' అని పెద్దవాళ్లు, టీచర్లు చేసిన హితబోధల్ని ఈ రోజు పట్టించుకోకండి. అబద్ధమాడేసేయండి. కాని జస్ట్ ఈ ఒక్క రోజే. ఒక్క అబద్ధమే. గుర్తుంచుకోండి లై అన్నారుగాని లైస్ అనలేదు. అబద్దమాడిన తర్వాత ఆ నేరాన్ని మరొకరి మీదకి నెట్టడం చాలామందికి అలవాటు. అలాంటి వారికోసం మరో రోజు ఉంది. 'బ్లేమ్ సమ్ వన్ ఎల్స్ డే'. నేరం ఇతరుల మీదికి నెట్టేయగల ఆ రోజు ఏప్రిల్ పదమూడున వస్తుంది. ఇన్ని చేసినా ఏప్రిల్ 30న మాత్రం ఆనెస్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఆ రోజు 'నేషనల్ ఆనెస్టీడే'.

మే... మంచి మగాడివైపో

మేడే అంటే రిక్షా వాళ్లు జరుపుకునే పండగేనా అని ఓ చదువుకున్న అమాయకురాలు ఒకసారి అడిగింది. కాదమ్మా కాదు... శ్రామికులందరి పండగ అది. అందుకే దానిని కూడా కాస్త గుర్తుంచుకోండి. లేకపోతే చదువుకున్న అజ్ఞానులుగా మిగిలిపోతాం. శ్రామికుల గురించి తెలుసుకున్న తెల్లారే 'బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డే' అని మరిచిపోకండి. అది మన రాఖీ పండగ లాంటిది. ప్రేమానుబంధాల్ని గుర్తు చేసుకోవడానికి ఎన్ని డేస్ ఉంటే అంత మంచిదే కదా. ప్రేమ ఉందని అస్తమానం పనిచేయించుకుంటే కుదరదు బ్రదర్ అని చెప్పడానికి ఆడవాళ్లంతా కుమ్మక్కై మే 10న 'క్లీన్ యువర్ రూమ్ డే' అని ఒకటి సృష్టించారు. కనీసం ఆ రోజన్నా మీ రూమ్ మీరు చిమ్ముకోండి అని చెప్పాల్సి వచ్చిందంటే మగవాళ్ల బద్ధకం ఎంత పేరుకుపోయిందో ఊహించండి. తల్లిదండ్రులు, భార్యలు అందరూ ఈ రోజు కోసం చాలా ఎదురుచూస్తారట.

'విజిట్ యువర్ రిలెటివ్స్ డే' అంటే చుట్టాలింటికి వెళ్లే రోజు మే 18న వస్తుంది. ఈ రోజుల్లో ఎవరికి వారైపోయారు కదా. బంధాలు అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అందుకే తయారైంది ఈ రోజు. కనీసం ఆ రోజన్నా మీ వాళ్లని గుర్తు తెచ్చుకుని వారిళ్లకి వెళ్లండి. వెళ్లే వాళ్లు వట్టి చేతులతో వెళ్లరు కాబట్టి ఏ వ్యాపారి మదిలో మెదిలిన ఆలోచనో ఈ రోజై కూర్చుంది.

జూన్-జూలై

రక్తసంబంధాల్ని దేవుడు ఏర్పరుస్తాడు కానీ స్నేహబంధాల్ని ఏర్పరుచుకోవడం పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుందంటారు. ఫ్రెండ్‌షిప్‌డే కాక 'బెస్ట్ ఫ్రెండ్స్ డే' అని మరొకటుందని తెలుసా? అది జూన్ 8న వస్తుంది. 'ఫ్రెండ్స్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ డిఫరెంటయా' అనుకునే వారంతా ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోండి. ఇంకాస్త ముందుకు వెళితే జూన్ 26న వస్తుంది 'బ్యూటీషియన్స్ డే'. మీరు వెళ్లే బ్యూటీ పార్లర్‌లో కొత్త ఆఫర్లేమైనా ఉండొచ్చు అప్పుడు. అవి ఉన్నా లేకపోయినా మీ బ్యూటీషియన్‌కి విషెస్ చెప్పడం మర్చిపోకండి. ఆ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే 'ఫర్‌గివ్‌నెస్ డే'. కోపాలు ఎన్నాళ్లని మనసులో దాచుకుంటారు అన్నిట్నీ కలిపి ఆ రోజు మీకు హాని చేసిన వారందరినీ కలిపి ఒకేసారి క్షమించేసెయ్యండి. మీలో కొత్తగా పుట్టుకొచ్చిన గొప్ప గుణాన్ని మీరే పొగుడుకోండి.

జూన్‌లోకెళితే... అన్నీ పెద్దవాళ్ల పండగలే ఒక్క 'కజిన్స్ డే' తప్ప. మదర్స్‌డే, ఫాదర్స్‌డే వేర్వేరుగా జరుపుకున్న మీరంతా జూలై నాలుగో ఆదివారం రెండూ కలిపి పేరెంట్స్ డే చేసుకోండి. ఆ తర్వాత రెండు రోజులకి వచ్చే 'ఆంట్స్ అండ్ అంకుల్స్ డే'కి వారికీ విషెస్ చెప్పేసెయ్యండి. ఇక ముప్పయ్యో తారీకున మామగార్ల రోజు...'ఫాదర్ ఇన్ లాస్ డే'. మీ జీవిత భాగస్వామి దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలంటే వీరికి శుభాకాంక్షలు చెప్పడం అస్సలు మరిచిపోవద్దు.

ఇక ఆగస్ట్‌లోకి...

ఆగస్టు అనగానే మనకు గుర్తుకొచ్చేది స్వాతంత్య్ర దినోత్సవం. దానికి పది రోజుల ముందు 5న 'వర్క్ లైక్ ఎ డాగ్ డే' ఉందని మర్చిపోకండి. అంటే మరేం లేదు. కుక్కలా పని చేసెయ్యమనే. ఎప్పుడూ పని గురించేనా... జనవరిలోనే కదా ఫన్ ఎట్ వర్క్ డే వచ్చింది అనుకుంటున్నారా. ఆ రోజు ఆ రోజే. ఈ రోజు ఈ రోజే. దేని ప్రత్యేకత దానిదే. పని పక్కన పెట్టి చదువు మీద మనసుపెడదామనుకునే వారికోసం ఆగస్టు తొమ్మిదిన 'బుక్ లవర్స్ డే' ఉంది. ఇప్పటి తరం పుస్తకాలు చదవడం తగ్గిపోయిందని పెద్దోళ్లు వాపోతున్నారు కాబట్టి కనీసం వారికోసమైనా ఈ ఒక్కరోజు ఓ పుస్తకం చదివేసేయండి.

పన్నెండో తారీకున 'మిడిల్ చైల్డ్స్ డే' ఉంది. పెద్దోళ్ల, చిన్నోళ్ల మధ్య నలిగిపోయి వారికంటూ ప్రత్యేక గుర్తింపు లేదని వాపోయే నడిమి సంతానం కోసం వెలిసిందే ఈ రోజు. వీలైతే అలాంటి 'నడుమ రాయుళ్ల'ందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ లాంటిదేమైనా పెట్టేసెయ్యండి. మీకు ఇంట్లో దక్కాల్సిన గౌరవం దక్కకపోతే మీ హక్కుల కోసం పోరాడండి. మీ సమస్యలు సరే... 'లెఫ్ట్ హ్యాండర్స్' సంగతేంటి అని ఎడమ చేతి వాటం వాళ్లు అంటున్నారా! రేపు అంటే 13 మీ రోజే. రాజకీయాల్లో బరాక్ ఒబామా, క్రికెట్‌లో బ్రియాన్ లారా, టెన్నిస్‌లో రఫెల్ నదాల్ మా వాళ్లే అని గొప్పగా చెప్పుకోండి. ఇవన్నీ సరే 21న మాత్రం అందరూ 'సీనియర్ సిటిజన్స్ డే'ని తప్పకుండా జరుపుకోండి. ఇంకా ముసలివాళ్లం కాలేదుగా అనుకునే వాళ్లందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయమేమిటంటే ఏదో ఒక రోజు అయితీరతారని. ఆ 'రోజు' గురించి ఇవాళ్టి నుంచే అవగాహన పెంచుకోండి మరి.

పేపర్‌బాయ్‌కు సెప్టెంబర్ వందనం

సెప్టెంబర్ 4 'న్యూస్ పేపర్ క్యారియర్ డే'. చేతుల్తో కళ్లు నులుముకుంటూ, నోరు పెద్దగా తెరిచి ఆవలిస్తూ న్యూస్‌పేపర్ కోసం వెతికే మనబోటి వాళ్లం అది కనబడకపోతే ఎంత అసహనానికి గురవుతామో వేరే చెప్పాలా. అందుకే పేపర్ బాయ్‌ని ఆ ఒక్క రోజైనా గౌరవిద్దాం. అమెరికాలో 1833లో న్యూయార్క్ సన్ పత్రిక కోసం పని చేసిన పేపర్ బోయ్ Barney Flaherty గౌరవార్ధం ఈ రోజుని జరుపుకుంటారు. పాల వాళ్లకి, పనిమనుషులకి కూడా ఓ రోజు ఉంటే ఎంత బాగుండో కదా అనిపిస్తుంది ఇది వింటుంటే. అలాంటి ఐడియాలు ఎన్నున్నా పదో తారీకున మాత్రం వాటిని ఒకరితో ఒకరు పంచుకోండి. ఎందుకంటే ఆ రోజు 'శ్వాప్ ఐడియాస్ డే'. మరో మూడు రోజులకి 'పాజిటివ్ థింకింగ్ డే' కూడా ఉంది. ఆ రోజన్నా పాజిటివ్‌గా ఆలోచించండి అని జనానికి చురక కాబోలు. ఇలా ఆలోచనలు పంచుకుంటూ అక్టోబరులో అడుగుపెట్టండి.

అక్టోబర్‌లో బాస్‌లూ...అత్తలూ

అక్టోబర్ 1న ప్రపంచ శాకాహార దినమైతే...రెండో రోజు గాంధీ జయంతి. అదే రోజు 'నేమ్ యువర్ కార్ డే '. జీవులకి పెట్టినట్టు మీ కారుకీ ఓ పేరెట్టేసేయండి. కార్లకి పేర్లేంటి అని నవ్వొద్దు. నవ్వులకు వేరే దినోత్సవం ఉంది. అదే అక్టోబర్ ఏడు. 'ప్రపంచ నవ్వుల దినోత్సవం'. ఇదే నెలలో 16 'బాస్‌ల దినోత్సవం', నాలుగో ఆదివారం నాడు 'అత్తల దినోత్సవం' కూడా ఉన్నాయి. రెండింటికీ పెద్ద తేడా లేదనిపిస్తోందా. అవును ఆఫీస్‌లో అసలు బాస్, ఇంట్లో కొసరు బాస్... ఆడవాళ్లకు ఇద్దరితోనూ సఖ్యంగా ఉండక తప్పదు మరి. ఎవరితో మంచిగా ఉండక పోయినా తంటాలే కాబట్టి ఈ రెండు రోజుల్నీ సెల్‌ఫోన్లో రిమైండర్లలో పెట్టుకోండి. గిఫ్టులతోనో వినయ విధేయతలతోనో వారి మనసుల్ని గెలవండి. వారి అభిమానం పొందితే లైఫ్‌లో సగం సక్సెస్ సాధించినట్టే.

నవంబర్‌లో పిల్లలూ, గృహిణులూ

అన్నట్టు హౌస్‌వైఫ్‌లకూ ఓ రోజుంది. నవంబర్ మూడే మీ రోజు. మీ సంగతి అటుంచితే నవంబర్‌లో మీ పిల్లలకి రెండు 'రోజు'లున్నాయి. 14న మన దేశంలో బాలల దినోత్సవం అయితే, 20న అంతర్జాతీయ బాలల దినోత్సవం. అన్ని రోజులూ మీవే అంటూ రెండు రోజులే ఇవ్వడమేమిటి, అందులో ఒక రోజు సెలవు ఇవ్వడమేమిటి అని గొణుక్కోకండి. రోజూ స్కూలు ఎగ్గొడితే ఎవరు చదువుకోవాలి? పెద్దవాళ్లా?

డిసెంబర్‌లో పూర్వీకులు

మొదటి రోజే ఎయిడ్స్ అవగాహనా దినోత్సవం అని తెలుసుగా... ఆ సంగతి ప్రభుత్వాలకి కానీ మనకు అవసరం లేదనుకోకండి. మీ వంతు కృషి మీరూ చేయండి. చెప్పుకోవాలంటే చాలానే ఉన్నా కాస్త ముందుకెళ్లిపోతే.. 21న 'ఫోర్ ఫాదర్స్ డే' ఉంది. పూర్వీకుల దినోత్సవం. ఏడాదంతా మన ముందు తరాల వారిని మరిచిపోయినా ఏడాది చివరిలోనన్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలనేమో ఈ 'డే'ని ఇంత చివర చేర్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారుగా అందుకే వారినీ ఓ సారి గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు నానమ్మ తాతయ్యలతో గడిపిన క్షణాల్ని నెమరు వేసుకోండి. ఆ జ్ఞాపకాల్లో మునిగి తేలుతూ డిసెంబర్ 31 దాకా వెళ్లిపోండి. కొత్త సంవత్సరంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో మళ్లీ కొత్త నిర్ణయాలు తీసుకోండి... ఆ తర్వాత అని అడక్కండి... సేమ్ స్టోరీ చదువుకోండి.

***
శాంపుల్‌గా కొన్నే చెప్పాం. ముందే చెప్పినట్టు నిజానికివి ఏడొందల దాకా ఉన్నాయి. అందుకే 'ఏడాదికి ఏడొందల' రోజులు అన్నది. భవిష్యత్‌లో ఇవి రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదు. మానవాళి మరిచిపోకూడని విషయాల సంఖ్య పెరిగే కొద్దీ సహజంగానే వీటి సంఖ్యా పెరుగుతూనే పోతుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ప్రమాదాల గురించి హెచ్చరించేందుకు ప్రత్యేక దినోత్సవాలు పుట్టుకు రావడం ఇటీవలి ధోరణి. రకరకాల వ్యాధుల గురించి, పర్యావరణానికి రాగల ముప్పు గురించి 'డే'లు ఏర్పడడం ఈ ధోరణిలో భాగమే. అందుకే నెలలో ముప్పయి రోజులే ఉన్నా ఒక్కో రోజుకు రెండు మూడు ప్రత్యేకతలు ఉంటున్నాయి.

ఏ నెలలో ఎన్ని?

ప్రముఖ సోషియాలజిస్టు, జ్యోతిష శాస్త్రవేత్త అయిన బ్రాడ్‌లీ హర్టెల్ 8 సంవత్సరాలు 'కార్డ్ ఇండస్ట్రీ'పై పరిశోధన చేసి ప్రత్యేకమైన రోజుల గురించి ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఆయన చెప్పిన జాబితా ప్రకారం ఏ నెలలో ఎన్ని స్పెషల్ డేస్ ఉన్నాయో చూడండి.
జనవరి-48
ఫిబ్రవరి-54
మార్చి- 60
ఏప్రిల్-77
మే-71
జూన్-50
జులై-57
ఆగస్టు-44
సెప్టెంబర్-64
అక్టోబర్-66
నవంబర్-59
డిసెంబర్-56

Saturday, December 25, 2010

తీపిగురుతుల సంబరం.. కొత్త ఆశల సౌరభం .. కొత్త సంవత్సరం 2011

Sun-Rising
మంచు తెరలు తెరలుగా కురుస్తూనే ఉంది. చల్లగాలికి శరీరం చిగురుటాకులా వణుకుతోంది. మసకచీకట్లను చీల్చుకుంటూ బయటకొచ్చేందుకు ఉదయభానుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. బయటకు అడుగుపెడితే గడ్డకట్టిపోతానేమోననిపిస్తున్నా... ‘ఇంత పొద్దున్నే ఏమిటే నీ గొడవ’ అని అమ్మ తిడుతున్నా... నేను మాత్రం ఊరుకుంటానా... బయటికి వెళ్లాల్సిందేనని మారం చేస్తున్నా, అమ్మ ఎంత పెద్దదైనా... నా మారం ముందు ఆమె ఎంతో చిన్నదే. ఎందుకంటే నేను బుంగమూతి పెడితే ఆమె మనసు వెన్నలా కరిగిపోతుంది. ఇంకేముంది అమ్మ నాకు తలంటింది. చక్కగా ముస్తాబు చేస్తోంది. నేను ‘తొందర తొందర’ అని గొడవ చేస్తూంటే ‘ఉండవే ఏమిటా తొందర’ అంటూ తాను మాత్రం నన్ను బుట్ట బొమ్మలా తయారు చేసింది. కానీ ఆమెకేం తెలుసు నా తొందర గరించి టీచర్‌ దగ్గరకెళ్లాలి. నిన్ననే కొనిపెట్టుకున్న గ్రీటింగ్‌ కార్డు, యాపిల్‌ పండు ఇవ్వాలి. అందరికంటే నేనే ముందుండాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్‌ అందరి దగ్గరికెళ్ళాలి. వాళ్లు నన్ను కలవడానికి రాకముందే నేనే వాళ్లని కలవాలి. ఇవన్నీ ఆమెకేం తెలుసు... అందుకే అమ్మకేం తెలీదు.

newyear2ఏమిటిదంతా అంటారా?! అవును మరి ఆదునిక ప్రపంచంలో... కంప్యూటర్‌ యుగంలో... అన్నం తినడానికి కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ ఇచ్చే కాలంలో... వున్న మనకు పై విషయం అంత తేలిగ్గా గుర్తుకు రాదు. 21వ శతాబ్దంలో... కంప్యూటర్‌ యుగంలో కాలాన్ని మర్చిపోయి కంప్యూటర్‌తో కాలం గడిపేస్తున్న నాకు కొత్త ఏడాది వస్తుందనగానే గతం ఒక్కసారిగా కళ్లముందు కదిలింది. అవును అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. 365 రోజులు గిర్రున తిరిగి పోయాయి. నిన్నగాక మొన్న పోయినట్లుంది జనవరి ఒకటో తారీఖు. మళ్లీ వచ్చేసింది కొత్త ఏడాది తొలిరోజు. కాలచక్రం కంప్యూటర్‌ వేగంతో తిరుగుతోంది కదా!!

అంతా కాలం మాయ. అప్పట్లో కొత్త ఏడాది వస్తుందంటే రెండు, మూడు వారాల నుండే సందడి మొదలయ్యేది. గ్రీటింగ్‌ కార్డులు అమ్మే దుకాణాలతో, పూల అంగళ్లతో అంతా కళకళలాడుతుండేది. ఆత్మీయులందరికీ నూతన సంవత్సర తొలి రోజునే శుభాక్షాంక్షలు అందజేయాలన్న ఉత్సాహంతో కార్డు కొని పోస్టు చేసేవారు. ఇక పిల్లల సందడైతే చెప్పనలవి కాకుండా వుండేది. ఉద్యోగులు అందరూ అధికారులను స్వయంగా కలుస్తూ... పండ్లు, పుష్పగుచ్చాలను అందజేసి వారి పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేసేవారు.

newyear1 

ఇప్పుడేమో అంతా తారుమారు. మన మధ్యలోకి కంప్యూటర్‌ వచ్చేసింది. మనసు మధ్యలోకి సెల్‌ ఫోన్‌ చొరబడింది. శుభాకాంక్షలు చెప్పేందుకో ఆన్‌లైన్‌ గ్రీటింగ్‌ కార్డు. అభినందించేందుకో ఎస్సెమ్మెస్‌. అంతా మాయా ప్రపంచం. కార్డును కళ్లతో కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద చూసుకోవడం తప్పించి దాన్ని తాకి అవతలి వారికి మనపై ఉన్న ప్రేమాభిమానాన్ని ఆస్వాదిద్దామంటే ఇప్పుడు కుదిరే పని కూడా కాదు.

కొన్నేళ్ల క్రితం వరకు...
పిల్లల్లో... పెద్దల్లో నూతన సంవత్సరం అంటే ఓ వేడుక. ఇప్పుడూ అంతకంటే ఎక్కువగానే అనుభవిస్తున్నారు. మరెంతో ఉత్సాహంతో ఉరకలెత్తే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కానీ రోజులు మారిపోయాయి. అప్పట్లోలా అభిమాన సినీనటుడి బొమ్మతో ఉన్న అర్థరూపాయి గ్రీటింగ్‌ కార్డు చేతిలో పట్టుకుని స్నేహితులందరికీ తానే ముందివ్వాలనుకుంటూ పొద్దు పొద్దున్నే వీధుల్లో తిరుగుతూ చిన్నారులు చేసే సందడి కనిపించడం లేదు. ఆత్మీయ మిత్రుడిని కలిసి కరచాలనం చేసి తన్మయత్వం పొందే అవకాశం అసలే లేదు. మనుషుల్ని దగ్గర చేసి ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానులు పెంపొందేలా సమున్నత లక్ష్యాలతో జరుపుకునే వేడుక అసలు అర్థానికి దూరంగా జరిగిపోయింది.
పరుగు తీయాల్సిందే...
newyearఇందుకు పూర్తిగా మనల్ని తప్పుబట్టేకన్నా మారుతున్న కాలంతో కంప్యూటర్‌తో పోటిపడి పరుగు తీయాల్సిన జీవితం. జీవితంలో పైకి ఎదిగేందుకు ప్రపంచ నలుమూలలకు వెళ్లక తప్పని పరిస్థితులు వెరసి మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. అయితే ఆ దూరాన్ని చెరిపేయకున్నా... తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూ కంప్యూటర్‌, సెల్‌, ఇతర ఆధునిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరు కొంతలో కొంత నమయని చెప్పుకోవచ్చు.

నేటి సమాజంలో అత్యాధునిక పోకడతో కాలం వెళ్లదీస్తున్న యువత కూడా ఒకప్పుడు ఇదే కొత్త ఏడాదిని అంతరాలు మరచి ఆనందంగా జరుపుకున్న వారే. తమ చిన్ననాటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పులెన్ని ఉన్నా గతాన్ని మాత్రం మరువనంటోంది యువత.
సరదాలు... సంబరాలు...
newyear3గతంలో కేవలం ప్రముఖులకే పరిమితమైన కొత్త సంవత్సరపు వేడుకలు ఒక దశాబ్దపు కాలంగా పూర్తిగా మారిపోయాయి. నగరాలలో మొత్తం మత్తులో జోగడమే. ఈ పార్టీల కల్చర్‌ ఇప్పుడు మధ్యతరగతి వారికి వ్యాపించేసింది. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు... థీమ్‌లు... మధురానుభూతులు యువత గుండెల్లో నిలిచిపోతున్నాయి. వీటికి తోడు అసాంఘీక కార్యక్రమాలు కూడా పెరిగిపోతున్నాయి. ఉద్వేగం... ఉత్సాహం... ఒకటే హడావుడి... కాసింత ఒత్తిడి మరో రూపంలో చెప్పాలంటే బాధ్యతల సమాహారం. తమ జీవితంలో మరో కొత్త ఏడాదిని ఆహ్వానించేందుకు సిద్ధపడటం కన్నా అదేదో ఒక ట్రెండ్‌లాగా ఫాలో అయిపోతున్నారు. ఇక 31వ తేదీ రాత్రి పది గంటలు మొదలు ఈ పార్టీల సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల ఇవి మన హైదరాబాదుసహా మిగిలిన ప్రధాన నగరాల్లో బాగా విస్తరించాయి. అమ్మాయిలు సైతం ఇలాంటి పార్టీలు ఇస్తున్నారు. గల్లీ దోస్తులు, తోటి ఉద్యోగులు... ఇలా యువతరం అందర్నీ ఒక్కచోటకు చేర్చి తీపి జ్ఞాపకాలు, సరదా సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందకేళి, ఆటపాటలతో ఆ పూట ఆనందాల్లో తేలియాడుతుంటారు.

ఆట పాటలతో సమయాన్ని మరచి గడిపేయడం వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. కొత్త సంవత్సరం అంటేనే చాలు ఎక్కడలేని హుషారుతో ఊగిపోతారు. వీరిలో ఎక్కువగా ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన వారే కా మధ్యతరగతి యువత కూడా ఎక్కువగా పాలు పంచుకుంటారు.
ఎక్కడైనా మేముంటాం...
Newyear-gifts కుర్రాళ్ల వేడుకలు ఎక్కువగా వారి గదులు, ఫంక్షన్‌ హాళ్లు, శివారు రిసార్టులు, విల్లాలు, పబ్బుల్లోనే జరుగుతుంటాయి. డీజే సంగీత హోరులో యువతరం మైమర్చి ఆడిపాడతారు. అసలే కొత్త సంవత్సరపు వేడుకలు... పాటలు... డాన్సులు మారుమ్రోగుతున్నాయి. ఖర్చు అంటారా... వెయ్యి రూపాయల మొదలు లక్షల వరకు. సంతోషాలకు హద్దేలేదు. పిండి కొద్దీ రొట్టెలాగ ఎవరి స్థాయికి తగిన విధంగా వారు వెచ్చిస్తున్నారు. నగరాల్లో, పట్టణాల్లో 12 అయ్యిందంటే చాలు బైకులపై మద్యం తాగుతూ గోలచేస్తూ అరుస్తూ తిరగడం వీరి వేడుకలో ఒక భాగం. అమ్మాయిల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. ఇటువంటి వేడుకలలో ఇప్పుడిప్పుడే వీరూ పాల్గొంటున్నారు. వారి హాస్టల్స్‌... లేదా కళాశాలలు, పనిచోసే చోట్లలోనే వేడుకల్లో పాల్గొనేందుకు మక్కువ చూపిస్తున్నారు.
మనకిది పాతైపోయింది...
cellPhoneఅమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ రకం పార్టీలు ఎప్పటినుంచో వున్నాయి. మనకు తొలుత నగరంలోని తారలు... ప్రముఖుల పిల్లల నుంచి మొదలైన ఈ సంస్కృతి సాధారణ యువతీ యువకుల వరకు పాకింది. వీటిని నిర్వహించేందుకు పనిగట్టుకుని కొన్ని ఈవెంట్‌ మేనేజ్‌మెంట సంస్థలు సైతం నగరంలో పనిచేస్తున్నాయి. కొత్త కొత్త ఆకర్షణీయ ప్యాకేజీలలో భాగంగా ఈ సేవలను అందిస్తున్నాయి.. రకరకాల థీమ్‌లతో పార్టీలను నిర్వహించడం వీరి ప్రత్యేకత. హవాయి థీమ్‌ అంటే కొబ్బరి చెట్లు, కొడలతో కేరళ వాతావరణం ప్రతిబింబిస్తుంది. బీచ్‌ థీమ్‌లో సముద్రపు ఒడ్డున ఉన్నట్లు భ్రమ కల్పించేస్తారు వీరు. సినీ థీమ్‌ అంటే మీకు అర్థమయిపోయే వుంటుంది. హిందీ సినిమా పోస్టర్లతో అలంకరించి మరీ అలరిస్తారు. ఎవరి అభిరుచికి తగినట్లుగా వారికి వీరు సిద్ధం చేస్తారు. వీటికి రేంజ్‌ను బట్టి 50 వేల నుండి లక్షల వరకూ వసూలు చేస్తారు. ఎవరి స్థాయిలో వారు ఈ కొత్తసంవత్సరానికి సన్నాహాలు చేసుకుంటారు.
వింత పోకడలు...
గతంలో మన నగరాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గతేడాది న్యూయర్‌ వేడుకల్లో పాల్గొని తిరిగివెళ్తున్న అమ్మాయిలను ఆపి కొందరు యువకులు మద్యం మత్తులో చేసిన వింత చేష్టలకు సభ్యసమాజం నివ్వెరపోయింది. వారి వస్త్రాలను తీయించి ఫొటోలు తీసి మరీ నెట్‌లో పెట్టిన ఆ సంఘటనను ఇప్పటికీ ఏ తల్లిదండ్రులూ మర్చిపోలేరు. ఇక నగరంలో మరో చోట కారులో వెళ్తున్న వారిపై బీర్‌ బాటిల్స్‌ విసిరి, ఏంటని ప్రశ్నించిన వారిపై చేయి చేసుకున్న ఆకతాయిలపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. వేడుకల పేరుతో ఇటువంటి అసాంఘీక కార్యకలాపాలు కూడా కొత్త సంవత్సరపు వేడుకల్లో భాగంగా మారిపోయాయి. మరికొన్ని చోట్ల ఏటిఎం సెంటర్ల అద్దాలు పగులగొట్టి పోలీసుల చేతుల్లో తన్నులు తిన్నారు. నేడు ఇది కొత్త ఫ్యాషన్‌... వేడుకంటే ఇలాగే వుంటుంది. ఇలా వేడుకలు చేసుకునే వారంతా డబ్బున్నవారి పిల్లలే కావడం గమనార్హం.
దేశాలు వేరైనా వేడుక ఒక్కటే...
New-Year-Cake ఇప్పుడు మన దగ్గర వున్న క్యాలెండరు జనవరి ఒకటవ తేదీన ప్రారంభం అవుతుంది. నిజానికి ఆంగ్లేయుల పాలన వలన మనకు సంక్రమించింది. అనంతరం కాలంలో అదే స్థిరపడిపోయింది. దీనికి ముందు మన భారతదేశంలో వుండే క్యాలెండరుకు పది మాసాలే వుండేవట. అనంతరం ఆ పది నెలలకు ముందు జనవరి, ఫిబ్రవరి నెలలను కలిపి పన్నెండు నెలతో క్యాలెండర్‌ రూపొందింది. నిజానికి మన కొత్త సంవత్సరం మార్చితో ప్రారంభం అవుతుంది.

సంవత్సరం చివరి రోజైన 31వ తేదీ రాత్రి నుండి కొత్త సంవత్సరం ప్రారంభించడానికి స్వాగత సంబరాలు ప్రారంభం అవుతాయి. వివిధ రకాలైన సంగీతాలు, డాన్సులు... మిరమిట్టు గొలిపే బాణాసంచాలతో కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం అందిస్తారు. ఇక మనదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా, బెంగళూరు, చెనై్న మొదలైన ఇంకా ఎన్నో నగరాల్లో, పట్టణాల్లో, ఈ వేడుకలు అత్యంత అంబరాన్నంటుతాయి. మనదేశంలోపాటు చాలా దేశాల్లో న్యూయిర్‌ రోజున శెలవు దినంగా ప్రకటిస్తారు.
దేనికదే భిన్నం...
ప్రపంచ వ్యాప్తంగా ఈ న్యూయర్‌ వేడుకలు వైభవంగా జరుగుతున్నా ఎడిన్‌బర్గ్‌, సిడ్నీ టొరంటో, మాస్కో, రోమ్‌, హాంగ్‌కాంగ్‌, లండన్‌, లాస్‌ ఏంజిల్స్‌, వెనిస్‌, బెర్లిన్‌, పారిస్‌, న్యూయార్క్‌, టోక్యో, రియో డీజెనీరియెలలో మాత్రం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇంగ్లండ్‌, అమెరికాలలోని ఆలయాల్లో డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి 11 గంటలు మొదలు విరామం లేకుండా గంటలు మోగిస్తారు. అలా సరిగ్గా పన్నెండు అయ్యే వరకు వాయిస్తారు. ఇది గడిచిన సంవత్సరానికి చెప్పే వీడ్కోలు.. అలాగే సంతోషంగా కొత్త సంవత్సరానికి చెప్పే స్వాగతం. 12 గంటలు కాగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేగంగా గంటలను మోగిస్తారు. తెల్లవారగానే ఒకరినొకరు గ్రీటింగ్స్‌ చెప్పుకుని, స్వీట్లు పంచుకుంటారు. మహిళలు ప్రత్యేక నృత్యాలు చేస్తారు. ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తారు. ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో పదార్థాలతో విందు చేసుకుంటారు.
ఇండోనేషియాలో...
ఇండోనేషియాలో అయితే అక్కడి ప్రభుత్వాలే కొత్త సంవత్సరపు వేడుకలను నిర్వహిస్తాయి. పశుపతి బ్రిడగ్జివద్ద జరిగే వేడుకలు ఎంతో ఘనంగా అట్టహాసంగా నిర్వహిస్తారు. ప్రజలు తమ కుటుంబాలతో సహా బాణాసంచా కాల్చుకుంటూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. దీన్ని సాలుగన్‌ అని అంటారు. సంతోషానికి దీన్ని ప్రతీకగా చెబుతారు.

న్యూయార్క్‌లో ఉన్న టైమ్‌ స్కే్వర్‌ భవంతిపై నుండి నీటితో నిండిన పెద్ద క్రిస్టల్‌ను 11.59 గంటల సమయంలో కిందికి జారవిడుస్తారు. అది నేలమీద పడేటప్పటికి 12 గంటలవుతుంది. వెంటనే అక్కడ వేచియున్న లక్షలాది మంది ప్రజలు హేపీ న్యూయర్‌ అంటూ గట్టిగా అరుస్తూ, కొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇలా ఈ వేడుక 100 సంవత్సరాల నుండి అక్కడ జరుగుతోంది.
ఆధ్యాత్మిక సమాహారం జపాన్‌...
జపాన్‌లో ‘ఒమిసోకా’ అంటూ నూతన సంవత్సర దేవతగా ‘తోషిమా’ని ప్రార్థిస్తారు. ఇళ్లను ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బుద్ధుని ఆలయంలోని గంటలను 108 సార్లు మోగించడం వల్ల సంవత్సరమంతా శుభం జరుగుతుందని నమ్ముతారు. అక్కడి స్థానిక టీవీల్లో అనేక కార్యక్రమాలు, పాటల పోటీలునిర్వహిస్తారు.
రోమ్‌లో నూతన సంవత్సరాన్ని ‘గిఫ్ట్‌డే’ అంటారు. ఇరాన్‌లో ‘నీరో’, పశ్చిమ జర్మనీలో ‘పినిపినీ’ అనీ వేడుకలకు సిద్ధం అవుతారు. యుగస్లోవియాలో ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా కొత్త సంవత్సరపు వేడుకలను నిర్వహించుకుంటారు. ఆర్థిక వ్యవస్థకు చిహ్నం అయిన ‘నూకరం’ను వారు తప్పకుండా తాకుతారు.

రష్యాలోని ప్రజలు తమ ఇళ్లలో ‘స్కూసు’ అనే ప్రత్యేకమైన చెట్లను నాటుతారు. ఇవి క్మిస్మస్‌ చెట్లలాగే ఉంటాయి. ఇలా ఈ చెట్లను నాటడం ఎంతో అదృష్టంగా వారు భావిస్తారు. వీటి వల్ల అంతా శుభం జరుగుతందన్నది వారి నమ్మకం. రష్యాలోని మరికొన్ని ప్రాంతాల్లో కొత్త సంవత్సరం మొదటి రోజు మొదలు వారం వారం మొత్తం వరకు ఈ వేడుకలు జరుపుకుంటారు. ‚పోర్చుగల్‌లో డిసెంబర్‌ 31 అర్థరాత్రి వేళలో పాత్రలను చప్పుడు చేస్తూ లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. ఇది భారతదేశంలో దీపావళి చేసుకుంటున్నట్లే వుంటుంది.
సెల్టులనుంచి రోమన్ల వరకూ...
సెల్టిక్‌-జర్మన్‌ పురోహిత వర్గంవారు నూతన సంవత్సరం మొదలైన సందర్భంలో తమ పవిత్రమైన మొక్క మిస్ట్‌లెటో ను బహుమతిగా ఇచ్చేవారు. రోమన్లు ఇలాంటి బహుమతులను ‘స్ట్రేనే’ అనేవారు. ‘స్ట్రేనియా’ అనే అదృష్ట దేవత నుంచి ఈ పదం ఆవిర్భవించింది. మొదట శుభప్రదమైన నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ పవిత్ర వృక్షాల కొమ్మలను బహుమతులుగా ఇచ్చేవారు. తరువాత జనవరి నెల ఎవరికి పవిత్రమైన నెలో ఆ దైవం జేనస్‌ ముఖం ముద్రించి వున్న గిల్డెడ్‌ నట్స్‌, నాణాలు వంటివి బహుమతులుగా ఇచ్చేవారు. చక్రవర్తి బహుమతులిచ్చే ఆచారాన్ని రోమ్‌ కూడా పాటించింది. కానీ రోమన్‌ నియంత చక్రవర్తుల పుణ్యమా అని తదనంతర కాలంలో ఈ స్ఫూర్తి అడుగంటిపోయింది.
స్కాటిష్‌, ఆంగ్లేయులు...
హెన్రీ-3 (1216-72) కాలం నుంచే ఇంగ్లీషు రాజరికం కూడా తమ ప్రజలనుంచి నూతన సంవత్సర బహుమతులు రాబట్టేది. ఇక ఎలిజెబత్‌ రాణి అయితే ‘ఎవరిస్తున్నారు? ఎమిస్తున్నారు?’ అన్నది పట్టిపట్టి గమనించేది. నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద పెద్ద మొత్తాలు నగల రూపేణా, బంగారం రూపేణా రాబట్టేది. ఈ రాణిగారు ఈ పద్ధతిని క్రమబద్ధీకరించిందని చెప్పవచ్చు. అన్ని వర్గాలకు చెందిన వారు సమర్పించే బహుమతుల వివరణాత్మక జాబితాలు తయారు చేయించసాగింది. కానీ ఎలిజెబత్‌ రాణి వైభవం తర్వాత ఈ ఆచారం పతనం కానారంభించింది. చివరికి ఆలివర్‌ క్రామవెల్‌, ప్యూరిటన్లు ఆధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆచారం నిలిపివేశారు. విక్టోరియన్‌ హయాం వరకూ కొత్తసంవత్సరం నాడు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఆచారం ఇంగ్లీషు ప్రజల్లో సర్వసాధారణమైన ఆచారంగా కొనసాగింది. చేతితొడుగులు సర్వసాధారమైన బహుమతి.

వైన్‌ను నిలవచేయడానికి, రుచిని చేకూర్చడానికి లవంగాలు గుచ్చిన కమలాలు కూడా ప్రజాదరణ పొందిన బహుమతిగా ఉంటూ వచ్చింది. ఇంగ్లీషువారు అమెరికాకు వచ్చి ిస్థిరపడినపుడు కొత్త సంవత్సరం నాడు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఆచారాన్ని తమ వెంట తీసుకువెళ్ళారు. ఫ్రెంచువారు కూడా ఈ ఆచారాన్ని పాటించారు. ఫ్రెంచివారు అధికసంఖ్యలో ఉండే న్యూ ఆర్లియన్స్‌లో చాలాకాలం వరకూ బహుమతుల ఆచారం కొనసాగింది. ఫ్రాన్సులో ఈనాటికీ నూతన సంవత్సరం సందర్భంగా బహుమతులు గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త సంవత్సరం అత్యంత భారీస్థాయి వేడుకైన స్కాట్‌ల్యాండ్‌లో పిల్లలు గుంపులు గుంపులుగా ఇంటింటికీ వెళ్ళి పాటలు పాడతూ డబ్బు, ఆహారం భిక్ష కోరుతారు. ‘ఐ విష్‌ యు మెర్రీ క్రిస్మస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌’ అని శుభాకాంక్షలు తెలియజేస్తారు.
భారతదేశంలో కొత్త ఏడాది...
హిందూ క్యాలెండర్‌ ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినపుడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. అంటే చైత్ర మాసంలో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దాన్నే సంవత్సరాది, యుగాది లేక ఉగాది అని ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం కూడా. ఈ రోజున పెద్దల ఆశీర్వాదంతో మొదలయ్యే వేడుకలు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని సంబరాలు చేసుకుంటారు. పంచాంగ శ్రవణం వంటివి ఈ రోజున తప్పనిసరి. కానీ ఇందులోనూ ఆధునిక పోకడలు చోటు చేసుకుంటున్నాయి. ఉగాదిని కేవలం ఓ పండుగలాగే చేసుకుంటున్నారు. జనవరి ఒకటినే ఎక్కువ శాతం సంవత్సరం మొదలుగా పాటిస్తూ, వేడుకలు చేసుకోవడం ఎక్కువైంది.
భిన్న సంస్కృతుల నిలయం...
అందుకే ఇక్కడ ఎవరికి తోచిన విధంగా వారు వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశంలో ముఖ్యంగా చెప్పుకోదగినది గోవాలో జరిగే న్యూయర్‌ వేడుకలు. ఇవి ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. సముద్ర తీరంలో జరిగే ఈ వేడుకలను చూడడం ఒక గొప్ప అనుభూతిగా వర్ణిస్తారు చూసి వచ్చినవారు. ఢిల్లీ, బెంగుళూరు, చెనై్న హైదరాబాద్‌, ఇంకా ఎన్నెన్నో పట్టణణాల్లో, నగరాల్లో డిసెంబరు 31 రాత్రి నుండి యువతీయువకులు శుభాక్షాంకలు తెలుపుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పార్టీలు చేసుకోవడం మొదలెట్టేస్తారు. నృత్యం... సంగీతం ఇందులో ఎంతో ప్రత్యేకతను కలిగి వుంటుంది.
నవవసంతం ఒక కొత్త ‘బహుమానం’...
కొత్త సంవత్సరం సందర్భంగా బహుమతు లిచ్చే సంప్రదాయం చరిత్రకందని కాలంలోనే మొదలైనట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌ బహుమ తుల సంస్కృతే కాక ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, రష్యా, గ్రీస్‌ సహా యూరప్‌లో అనేక ప్రాంతాల్లో కొత్త సంవత్సరం నాడు బహు మానా లిచ్చే ఆచారం ఉంది. క్రీస్తుకు పూర్వ మే యూరోప్‌లో ఇది ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనాడు అమెరికాలో కొత్త సంవత్సరం కంటే క్రిస్మస్‌కే బహుమానాలిచ్చే సంప్రదాయం ఎక్కువగా వుంది. చారిత్రకం గా చూస్తే ఇక్కడి జెర్మన్‌ డచ్‌ సెట్లర్ల పాత ఆచారాల్లో దీని మూలాలున్నాయి. ఇంగ్లీషు, ఫ్రెంచి ప్రాభవమున్న రాష్ట్రాల్లో కొత్త సంవత్స రంనాడు బహుమతులు ఇచ్చే ఆచారం నేటికీ కొనసాగుతోంది. కానీ, జర్మన్‌ డచ్‌ ప్రభా వాలు కలిసి పనిచేసినందువల్ల కాల ప్రవా హం లో పాత సంప్రదాయం తుడిచిపెట్టు కు పోయి అమెరికా అంతటా ఇప్పుడున్న సంప్రదాయం వచ్చి స్థిరపడింది. జనవరి 1న లౌకికవాద నూతన సంవత్సరంగా ప్రపంచం గుర్తించే చాలాకాలం పూర్వమే ప్రపంచంలో వివిధ దేశాల ప్రజలు వివిధ నూతన సంవత్స రాల కాలం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వారి విభిన్న నూతన సంవత్సరాల్లో కూడా ఓ విధమైన ఏకత్వం వున్నట్లు తెలుస్తోంది. బహుమతులు విందులు సాంఘిక వేడుకలు ఈ ఏకత్వాన్ని సూచించే కొన్ని ప్రధాన ఆచా రాలుగా ఉన్నాయి. నూతన సంవత్సరం రావడాన్ని పురస్కరించుకుని శుభప్రదంగా భావిం చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకో వడం బహుశా ఈ సంప్రదాయానికి ప్రోద్బలంగా ఉంది.
కొత్త ఏడాదిని కొత్తగా ప్రారంభించాలి...
Sri_Sri_Ravishankarకొత్త ఏడాది మొత్తం మంచి జరగాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోవాలి. అలాగే ఎప్పుడూ పాతగా కాకుండా కాస్త కొత్తగా ఆలో చించండి. గొడవపడే విషయంలో కూడా అప్పుడు ఇలా జరిగింది... ఇప్పుడు ఇలా జరిగింది అని కాకుండా కొత్తగా ప్రయత్నించండి. ప్రతి విషయాన్ని కొత్తగా ఆహ్వానించండి. సరదాలు... సంబరాలు కాదు శాంతి కావాలి. ఎన్ని వున్నా... ఎన్ని వేడుకలు చేసుకున్నా మనసులలో శాంతి లేకుండా ఏదీ సాధించలేం. కాబట్టి జీవితానికి జ్ఞానం, ధ్యానం ఎంతో ముఖ్యం. ఇందుకు మార్గాలను అన్వేషించాలి. కొత్తగా వుండాలి. ఈ ఏడాది మొత్తం అందరికీ మంచి జరగాలి. ముందుకెళ్లేందుకు అందుకు కృషి చేయాలి.
- శ్రీ శ్రీ రవిశంకర్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు

ఎంతో ఆనందం...
karnthi మా వీధిలో పిల్లలం, పెద్దలం అందరం కలిసి మా ఇంటిపైనే కొత్త సంవత్సరం ముందు రోజు రాత్రి వేడుకలు చేసుకుంటాం. పది గంటల నుండి మొదలు రాత్రి పన్నెండుకు ఒక నిమిషం మందు వరకు అందరం డాన్స్‌ చేస్తాం. పెద్దవాళ్లందరూ కూర్చుని మమ్మల్ని ఎంతో ఎంకరేజ్‌ చేస్తారు. పన్నెండు అయిందంటే చాలు అందరం గట్టిగా ఒక్కసారి హేపీ న్యూ ఇయర్‌ అంటూ గట్టిగా అరిచేస్తారు. అందరం విషెస్‌ చెప్పుకున్న తరువాత తిరిగి సంతోషంతో మా కార్యక్రమాలు మొదలు పెడతాం. పాటలు, డాన్సులతో ఎంతో ఎంజాయ్‌ చేస్తాం. ఉదయాన్నే మిగిలిన స్నేహితులకు ఫోన్‌ చేసి విష్‌ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు స్నేహితులంతా ఒక్కోచోట వుండరు. అందరినీ కలవడం అంటే కుదరదు.
- క్రాంతి, నల్గొండ

ఆధ్మాత్మికతతో నిండాలి...
sushmareddyకొత్త ఏడాది అంటే నాకు వేడుకల కన్నా ముందు లక్ష్యాలు గుర్తొస్తాయి. అప్పుడే ఓ ఏడాది గడిచిపోయిందా అని అనిపిస్తుంది. అయినా ఆ రోజు మాత్రం ఆనందంగా గడుపుతాను. ఇప్పుడు వచ్చే ఏడాది మాత్రం నాకు చాలా ముఖ్యం. నా సివిల్స్‌ ప్రయత్నాలు ఈ ఏడాదితోనే ప్రారంభించాను కాబట్టి. ఇక మిగిలిన వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నా. నాలాగే ప్రతి ఒక్కరు మంచి లక్ష్యంతో మందుకెళ్లాలని కోరుకుంటున్నా. తెలంగాణ సమస్యలు... ప్రత్యేక రాష్ట్రాలు... ధర్నాలు... రైతుల ఆత్మహత్యలు వంటివాటన్నిటికీ కొత్త సంవత్సరంలో మంచి పరిష్కారం దొరకాలి. ప్రపంచంలో అందరికీ కూడా ఈ ఏడాది ఎంతో హాయిగా వుండాలని కోరుకుంటున్నాను.
- టి.సుష్మారెడ్డి, సివిల్స్‌ స్టూడెంట్‌, హైదరాబాద్‌

మంచి జరగాలి...
giriనాకు కొత్త సంవత్సరం అంటే ఓ పండుగలాగే అనిపిస్తుంది. ప్రతి ఏడాది దీన్ని మా స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా ఎంజాయ్‌ చేస్తాం. ఈ సంవత్సరం కూడా ప్లాన్‌ చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఏడాదిలా కాకుండా ఇప్పుడు కాస్త కొత్తగా వుండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాధ్యతలు, సమస్యలు అన్నీ తెలుస్తున్నాయి. అందుకే ఏదైనా మంచి పని చేయాలని అనుకుంటున్నాం. మేము సరదాలకు ఖర్చు పెట్టే మొత్తంలో కొంత భాగాన్ని సమాజసేవలో వినియోగించాలని నిర్ణయించుకున్నాం. అందుకే దాని కోసం ప్లాన్‌ చేసుకుంటున్నాం.
- వి.గిరిసౌమ్య, బ్యాంక్‌ కోచింగ్‌ విద్యార్థిని

ఇప్పటికీ... నాది అదే తీరు...
Jamal హాయ్‌.. నాపేరు జమాల్‌ బాషా. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 31వ తేదీ రాత్రి సెలబ్రేట్‌ చేసుకుంటాను. ఇప్పుడు కొంత మార్పు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాను. బయటకి వెళ్లడానికి కుదరదు. కానీ ఉదయాన్నే అంతా మామూలే. ముందుగా నా గర్ల్‌ఫ్రెండ్స్‌కి శుభాకాంక్షలు చెబుతాను. ఎందుకంటే అబ్బాయిలు ఎప్పుడైనా కలుస్తారు. అమ్మాయిలు అలా కాదు కదా! అందుకే. తరువాత నా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్తాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... ఇప్పుడు చాలామంది ఇలా లేరు. ఎస్‌.ఎం.ఎస్‌తో వాళ్ల న్యూ ఇయర్‌ అయిపోతుంది. ఇంతకుముందు గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చుకునేవారు. దూరంగా వున్న వాళ్లకు కొరియర్‌ చేసేవాళ్లు. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగేది. కానీ ఇప్పుడంత లేదు. మెయిల్‌... లేదా ఎస్‌ఎంఎస్‌... మరీ అయితే ఫోన్‌ కాల్‌ అంతే. నేను స్కూల్‌లో వున్నప్పుడు కార్డులు చేతబట్టుకుని ఉపాధ్యాయులకు కూడా ఇచ్చేవాళ్లం. ఫ్రెండ్స్‌కి పంచేవాళ్లం. ఇక ఇంటర్‌లో అయితే జనవరి ఒకటి అంటేనే కేక పుట్టించేవాళ్లం. ఆ రోజంతా అమ్మాయిలం, అబ్బాయిలం అందరం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్లం. లేదా ఏక్కడికైనా మంచి ప్లేస్‌ ఎంచుకుని అక్కడికి వెళ్లివచ్చేవాళ్లం. నా దృష్టిలో కొత్త సంవత్సరం వేడుక అంటే అందమైన పూలతో... మరో జీవితానికి స్వాగతం పలకడం... అందుకే ఆ రోజును వీలైనంత వరకు ఆనందంగా గడుపుతాను. - జమాల్‌ బాషా, డోన్‌

- హైమ సింగత