జపాన్ ఆటు పోట్లను అలవాటు చేసుకున్న దేశం. ఎదగడం.. కిందపడటం.. మళ్ళీ లేవడం.. ఈ ప్రవృత్తి వారి నిత్యదైనందిన జీవితంలోనూ ప్రతిఫలిస్తుంటుంది. జపనీయులు భవనాల మెట్లు ఎక్కడం.. దిగడం ఒక హాబీగా చేస్తారు. అందుకే అధికారిక కార్యక్రమాల్లో సైతం కొన్ని మీటింగులు ఒక ఫ్లోర్‌లో, మరికొన్ని సమావేశాలు మరో ఫ్లోర్‌లో పెట్టుకుంటారుట. లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కుతూ, దిగుతూ... ఆడుతూ, పాడుతూ విధులు నిర్వర్తిస్తుంటారని ప్రతీతి. వారి ఈ ప్రవృత్తి విధి రూపంలో వారితో ఆడుకుంటున్నదని అంటారు. అభివృద్ధిలో ఆకాశపుటంచులకు వెళ్లడం.. మానవ ప్రకోపమో.. ప్రకృతి ప్రకంపనమో.. వారిని అధఃపాతాళానికి తోసెయ్యడం.. మళ్ళీ కొండంత బలంతో పైకెదగడం.. జపాన్‌కు ఇదొక నిరంతర జీవన క్రీడగా మారిపోయింది.
కనీసం అయిదు నిమిషాలకు ఒకసారి జపాన్‌లో భూమి కంపిస్తూ ఉంటుంది. అలాగే జపాన్ చుట్టుపక్కల కనీసం 200 అగ్ని పర్వతాలున్నాయి. ఇవి ఇరవై నాలుగ్గంటలూ కుతకుతలాడుతూ ఉంటాయి. ఇన్ని ఉపద్రవాల కుంపట్ల మీద జపాన్ పడుతూ లేస్తూ ప్రపంచ పరుగు పందెంలో ముందుకు సాగుతుంటుంది. పసిఫిక్ మహా సముద్రంలో 6,852 ద్వీపాలున్న ద్వీప సమూహం జపాన్. పసిఫిక్ మహాసముద్రంలోని సున్నితమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న జపాన్ భూకంపాలకు పెట్టింది పేరుగా ముద్రపడింది. అగ్నిపర్వతాల అంచున ఉంటుంది. విశేషమేమిటంటే ప్రపంచంలోనే అత్యధిక మెట్రోపాలిటన్ జనాభా గల ప్రాంతంగా గ్రేటర్ టోక్యో పేరు గాంచడం. అంతేనా, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఆయుఃప్రమాణమే కాక అతితక్కువ శిశు మరణాలు కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన దేశం జపాన్. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా, అత్యంత కొనుగోలు శక్తి ఉన్న పౌరులు గల దేశంగా జపాన్ ముందుంది.
ప్రపంచం ఎగుమతులలోనూ, దిగుమతులలోనూ కూడా నాలుగవ స్థానంలో ఉన్నది. సాంకేతికంగా ఎంతో వృద్ధిని సాధించినా నిరంతరం ప్రకృతి ధాటికి భయపడుతూనే ఉంటారు జపనీయులు. ప్రపంచ పురాతన నాగరికతలలో జపాన్ ఒకటి. పాత రాతియుగంలోనే జపాన్‌లో మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నట్టు చారిత్రిక ఆధారాలున్నా యి. అంటే 30,000 బి.సి.లోనే అక్కడ మనుషులు ఉన్నారు. అంతటి పురాతన చరిత్ర, నాగరికత కలిగిన జపాన్ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్ర జాస్వామిక ఒరవడిలోకి అడుగిడేందుకు నిర్ణయించుకుని 1947లో నూతన రాజ్యాంగాన్ని ప్రకటించుకుంది. ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన రాచరికపు వ్యవస్థగా కొనసాగుతున్నది. రాజు దేశాధిపతి అయినా అలంకారప్రాయమే.. అధికారాలన్నీ డైట్ (పార్లమెంటు) ఎన్నుకున్న ప్రధాని చేతిలోనే ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా అమెరికాలోని పెర్ల్ హార్బర్‌పై దాడి చేసి ఆ దేశాన్ని కూడా యుద్ధంలోకి లాగిన జపాన్.. హిరోషిమా, నాగసాకిపై దాడి అనంతరం యుద్ధం జోలికి వెళ్ళరాదని ఒట్టు పెట్టుకున్నది. అయినప్పటికీ అత్యంత ఆధునికమైన సైన్యాన్ని జపాన్ కలిగి ఉండటం విశేషం.
హిరోషిమా, నాగసాకి దాడి, పునర్నిర్మాణం: రెండవ ప్రపంచ యుద్ధ చివరి దశలో అంటే 1945 జులై 26న చేసిన పాట్స్ డామ్ ప్రకటనలో లొంగిపోవలసిందిగా జపాన్‌ను అమెరికా హెచ్చరించింది. అ యితే జపాన్ ప్రభుత్వం ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో నాటి అమెరికా అధ్యక్షడు హారీ ఎస్. ట్రూమన్ ఉత్తర్వుల మేరకు అమెరికా దళాలే 1945 ఆగస్టు 6వ తేదీన హిరోషిమాపై ‘లిటిల్ బాయ్’ అనే అణు బాంబును వేశాయి. మూడు రోజుల అనంతరం అంటే ఆగస్టు 9వ తేదీన ‘ఫ్యాట్‌మాన్’ అనే అణ్వాయుధాన్ని నాగసాకిపై విడిచారు. ఈ దాడులకు ఆరు నెలల ముందు దాదాపు 67 జపాన్ నగరాలపై అమెరికా ఉధృతంగా బాంబు దాడులు నిర్వహించింది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణు బాంబు దాడులు జరిపిన మొదటి నాలుగు నెలలోనే హిరోషిమాలో 90 వేల నుంచి 1లక్ష 66వేల మంది మరణించగా, నాగసాకిలో 60వేల నుంచి 80 వేల మంది మరణించారని, ఇందులో సగానికి సగం మంది దాడులు జరిగిన తొలి రోజే మరణించారని అంచనా. ఆ రోజు మరణించిన వారిలో 60శాతం మంది బాంబు దాడుల కారణంగా చెలరేగిన మంటల బారిన పడి మృతి చెందగా, 30 శాతం మంది భవనాలు కూలిపోయి, 10 శాతం మంది ఇతర కారణాల చేత మరణించినట్టు హిరోషిమా ఆరోగ్య శాఖ తేల్చింది. తర్వాత మరణించిన వారు కాలిన గాయాలు సెప్టిక్ అయ్యి, రేడియేషన్ సిక్‌నెస్‌కు గురైనవారు.
నాగసాకిపై దాడి జరిపిన ఆరు రోజుల అనంతరం అంటే ఆగస్టు 15వ తే దీన సంకీర్ణ శక్తులకు లొంగిపోతున్నట్టుగా జపాన్ ప్రకటించడం ద్వారా పసిఫిక్ యుద్ధానికి అంతిమంగా రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికిం ది. ఈ బాంబు దాడుల దుష్ఫలితాలను చవి చూసిన జపాన్ మూడు అణ్వేతర సూత్రాలను పాటించాలని నిర్ణయించుకుని, అణ్వాయుధాలను నిషేధిం చింది. ఈ బాంబు దాడి నుంచి బయటపడిన వారిని జపనీస్‌లో హిబకుష అంటారు. అంటే పేలుడుతో ప్రభావితమైన వ్యక్తులు అని అర్థం.
2010 మార్చి 31 నాటి లెక్కల ప్రకారం 2 లక్షల 27వేల 565మంది హిబకషులు జీవిస్తున్నారని జపాన్ ప్రభుత్వం లెక్కలు కట్టింది, అలాగే రెండు చోట్ల బాంబు దాడులను ఎదుర్కొ ని సజీవంగా ఉన్నవారిని ‘నిజు హిబకషు’గా పేర్కొం టారు. గత సంవత్సరం మరణించిన ట్సు టుమో యమగూచి ఒక్కడే నిజ హిబకషుగా జపాన్ ప్రభుత్వం గుర్తించింది. అతడు హిరోషిమాపై దాడి జరిగినప్పుడు ఈ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దాడిలో కాలిన గాయాలైన అతడు ఆ రాత్రి హిరో షిమాలో గడిపి ఆగస్టు 8 నాటికి నాగసాకి చేరుకున్నాడు. మరునాడే అక్కడ బాంబు దాడి జరిగింది. తన బంధువుల కోసం వెతుకుతూ అతడు రెసిడ్యువల్ రేడియేషన్‌కు గురయ్యాడు.యుద్ధానంత రం హిరోషిమా, నాగసాకి పట్టణాల వైపు కొన్ని నెలల పాటు తొంగి చూసేందుకు కూడా వీలులేనంతగా ధ్వంసమవడమే కాక రేడియో యాక్టివేషన్ నెలకొంది. అయితేనేం పట్టబట్టి ఐదు సంవత్సరాలలో దానిని పునర్నిర్మించారు. పారిశ్రామిక నగరంగా నేడు హిరోషిమా అలరారుతోంది. ప్రముఖ కార్ల, మోటార్ సైకిళ్ళ ఉత్పత్తిదారు మజ్దా ప్రధాన కేంద్రం ఇక్కడే ఉన్నది.
భూకంపాలు, సునామీలు: ప్రపంచంలోనే భూకంపాలు అధికంగా సంభవించే ప్రాంతం జపాన్. అగ్నిపర్వతాలు, సముద్రపు అగడ్తలు కలిగిన ప్రాంతంలో ఉన్న జపాన్‌లో కనీసం ఐదు నిమిషాలకు ఒకసారి అయినా భూమి కంపిస్తుంది. ప్రపంచంలో రిక్టర్ స్కేల్‌పై 6.0 కన్నా ఎక్కువగా నమోదయ్యే భూకంపాలలో 20 శాతం ఇక్కడే సంభవిస్తుంటాయి. కోటి ఇరవై లక్షలమంది జనాభాకు పైగా కలిగిన టోక్యో నగరం యురేసియా, ఉత్తర అమెరికా, ఫిలిప్పీన్, పసిఫిక్‌కి సంబంధించిన నాలుగు టెక్టోనిక్ ప్లేట్ల కూడలిలో ఉంది. ఈ పొరలు ఏదైనా ఒకటి ఏ మాత్రం వంగినా, కదిలినా, విరిగినా వెంటనే భూకంపం సంభవిస్తుంది. గత నెలలో జపాన్ ఈశాన్య ప్రాంతంలో సంభవించిన భూకం పం తదనంతర సునామీలు 1995లో సంభవించిన కోబె భూకంపం కన్నా పెద్దది కావడమే కాక నాడు సంభవించిన దానికన్నా అధిక ప్రాణ నష్టం, ధన నష్టం సంభవించాయి.
రిక్టర్ స్కేల్‌పై 8.9గా నమోదైన భూకంపానంతరం సంభవించిన సునామీలో 10 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడి తీరప్రాంతంలోని పట్టణాలను, నగరాలను మింగివేసాయి. జపాన్ ఈశాన్య తీరంమైన సెందాయ్ సహా అనేక నగరాలు, దాదాపు పదకొండు పట్టణాలతోపాటు అనేక గ్రామాల ప్రజలు భూకంప తాకిడికి గురయ్యారు. హకై్కడో, ఆవ్‌మొరీ, ఇవా టే, మియోగి, యమగట, ఫుకుషిమా, ఇబరకి, తొచి గి, గుమ్మ, చిబ, కనగవ పట్టణాలలో మొత్తం 13,540 మంది మరణించగా, 16,963 మంది కనుపించకుండా పోయారు. ఇందుకు తోడుగా 5,253 మంది గాయపడ్డారు. సుమారు లక్షా 38 వేల మంది వ్యక్తులు పునరావాస కేంద్రాలలో ఉన్నారు. సునామీ కారణంగా ఉవ్వెత్తున లేచిన అలల కోరలు నౌకలను, కార్లను మింగివేయగా, ప్రధాన విమానాశ్రయాలను ముంచి వేశాయి. ఈ భూకంప సునామీలో 59వేల ఇళ్ళు నేలమట్టం కాగా, 17 వేల ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఇవి ప్రస్తుతానికి లెక్క తేలినవే. లెక్కించవలసినవి ఇంకా మిగిలే ఉన్నాయి. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. ఫుకుషిమా, దాయిచీ అణు విద్యుత్ కేంద్రాలలో రియాక్టర్ల పేలుడు సంభవించడంతో జపాన్‌లో మరోసారి రేడియేషన్ భయాలు పట్టుకున్నాయి. ఆ ప్రాంతానికి 30 కి.మీ. దూరం లో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందిగా జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నష్టాన్ని నివారించే ప్రయత్నం చేసింది. జపాన్ యుద్ధానంతర 65 ఏళ్ళ చరిత్రలో ఇది అత్యంత తీవ్రమైన సంక్షోభమని ప్రధాన మంత్రి నవాటో కాన్ పేర్కొనడం గమనార్హం. అయితే ఈ సంక్షోభాన్ని అధిగమించగలమని ఆత్మవిశ్వాసంతో చెప్పడం ద్వారా జపనీయుల ఆత్మవిశ్వాసపు స్థాయిని ప్రదర్శించారు. జపాన్ ప్రజల క్రమశిక్షణ ఎటువంటిదో ఈ సందర్భంగా ప్రపంచానికి చాటిచెప్పారు. ఆహారం, మంచినీరు వంటివి రోజుల తరబడి లభ్యం కావని తెలిసి కూడా అక్కడ తోపులాటలు కానీ గొడవలు కానీ జరుగలేదు. వారు షాపులో ఉండగానే కరెంటు పోయినప్పటికీ ఒక్క వస్తువు అదృశ్యం కాలేదు. లూటీలు, గొడవలు, గందరగోళాలు మచ్చుక కూడా కానరాకపోవడం జపాన్ ప్రజలలో ఉన్న ఐక్యతా స్ఫూర్తికి చిహ్నంగా చెప్పుకోవచ్చు.
జపాన్‌లో దాదాపు 55 అణు విద్యుత్ రియాక్టర్లు ఉన్నాయి. 61 శాతం ఇంధనం ఈ రియాక్టర్ల నుంచే ఉత్పత్తి అవుతుంది. సునామీ అనంతరం ఫుకుషిమాలోని దాయిచీ అణుకేంద్రంలో సంభవించిన ప్రమాదంతో జపాన్‌లో ఆరింటిని నిలిపివేశారు. తొలిసారి జపాన్‌లో అణు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సునామీ కారణంగా దాయిచీతో పాటుగా మరి కొన్ని రియాక్టర్లను తాత్కాలికంగా నిలిపివేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒకవైపు భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినగా మరోవైపు ఉత్పాదన లేకపోవడం వల్ల కూడా అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దాదాపు 4,50,000 గృహాలకు విద్యుత్ లేక అల్లాడుతున్నారు. ఒకవైపు అణు విద్యుత్ కేంద్రాలు సునామీకి దెబ్బతినగా విద్యుత్ టరె్బైన్లు మాత్రం ఏ మా త్రం చెక్కు చెదరలేదు.
2010 చివరి నాటికి జపాన్ 2304 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 1746 విండ్ టరె్బైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ వాయు టరె్బైన్లు జాతీయ విద్యుత్ సరఫరాకు తోడ్పడుతున్నాయి. అణువిద్యుత్‌కన్నా విండ్ ఎనర్జీపై ఆధారపడడం అన్ని రకాలా శ్రేయస్కరమనే వాదనలు వినిపిస్తున్నాయి. జపాన్ అణు సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తం గా అక్కడ గ్యాస్‌కు డిమాండ్ పెరుగుతుందని దీనితో సహజవాయువు ధరల రెండేళ్లలో మొదటిసారి చుక్కలనంటుతాయని నిపుణు లు ఇప్పుటికే హెచ్చరిస్తుండడంతో యుకె సహా పలు దేశాలు కలవరం చెందుతున్నాయి. సునామీ ప్రభావిత ప్రాంతంలో ఉన్న టయో టా, నిస్సాన్, హోండా వంటి ఆటోమొబైల్ కంపెనీల కేంద్రాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేసే సోనీ సహా నిప్పన్, పానాసోనిక్, ఫుజి వంటి అనేక కంపెనీల ఉత్పత్తి కేంద్రాలు అనేకం దెబ్బతినడంతో ఆయా చోట్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థకు అధికంగా దోహదం చేస్తున్న పరిశ్రమలు ఇవి.
పునర్నిర్మాణం: గత నెల 11న సంభవించిన భూకంపం తీ వ్రత దాదాపు 140 ఏళ్ళలో ఇదే తొలిసారి. 1995లో కోబె నగరంలో సంభవిం చిన భూకంప విధ్వంసం, నష్టాన్ని వందబిలియన్ డాలర్లుగా లెక్కకట్టారు. మొన్నటి వరకూ ప్రపం చంలో నే అతిఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా దానిని అభిర్ణించారు. కానీ దానిని ఇది మించిపోయింది. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పునర్నిర్మాణానికి సుమారు 309 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని జపాన్ అంచనా వేసింది. పునర్నిర్మాణానికి, ఈ నష్టం నుండి తేరుకోవడానికి జపాన్‌కు కనీసం మరో ఐదేళ్ళు పడుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఫుకుషిమా రియాక్టర్లలో రేడియేషన్‌ను అంచనా వేసేందుకు జపాన్ ప్రస్తుతం రిమోట్ కంట్రోల్ రోబోలను వాడుతున్నది.
అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే జపాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని ఉ న్నది. గత సంవత్సరం చివరి మూడు నెలలలో దాని ఆర్థిక వృద్ధి రేటు 1.3శాతం కుం గిన నేపథ్యంలో చైనా దానిని అధిగమించి ప్రపం చంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దెబ్బ మీద దెబ్బలా సునామీ కారణంగా ఏర్పడిన నష్టం నుంచి తేరుకోవడానికి జపాన్‌కు ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రజలపై పన్నుల భారం తీవ్రంగానే పడనుంది. 1997 తర్వాత తొలిసారి పన్నుల పెంపు గురించి ప్ర భుత్వం ఆలోచిస్తున్నప్పటికీ 70శాతం మంది ప్రజలు పన్నులు కట్టేందుకు సిద్ధం గానే ఉ న్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. సంక్షోభం వచ్చింది కనుక ప్రభుత్వమే తమ ను ఆదుకోవాలి తప్ప తామేం చే యమనే తత్వం జపాన్ ప్రజలలో లేకపోవడం అభినందనీయం. క్రమశిక్షణకు మారుపేరై న జపనీయులు అవసరమైతే ఎంతటి కఠిన శ్రమ కైనా ఓర్చి తమ కు వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకోగలరని రెండవ ప్రపంచయుద్ధానం తరం నుంచీ రుజువు చేస్తూనే ఉన్నారు. ఈసారీ అదే జరుగుతుందని ఆశిద్దాం.
వారోత్సవాలతో ఎనలేని ఉత్సాహం
జపాన్ చక్రవర్తి పుట్టిన రోజు ఈ నెల 29న. ప్రతి ఏడాది ఆయన జన్మ దినాన్ని జాతీయ దినోత్సవంగా అధికారికంగా జరిపేవారు. కొన్నేళ్ల క్రితం దాన్ని మార్చారు. ఏప్రిల్ 29 నుంచి మే నెల మూడో తేదీ దాకా స్వర్ణ వారోత్సవం (గోల్డెన్ వీక్ )గా జరుపుతున్నారు. జపాన్ దేశాన్ని స్వర్ణయు గంలోకి తీసుకెళ్లే ఏకైక ధ్యేయంతో ఈ వారోత్సవాలకు రూపకల్పన చేశా రు. నిత్యం భూకంపాలతో, అగ్నిపర్వతాల భయోద్వేగాలతో గడిపే జపనీ యుల్లో దేశభక్తి స్ఫోరక భావాలను నింపడం ద్వారా వారిని ఆ భయోత్పా తాలు దరి చేరకుండా ఉండేందుకే వీటిని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 29వ తేదీని జపాన్ చక్రవర్తి పుట్టిన రోజు గుర్తుగా జాతీయ దినోత్సవంగా జరు పుతారు. అలాగే మే మూడో తేదీని రాజ్యాంగ పరిరక్షణ దినంగాను, నాలుగో తేదీని గ్రీనరీ డే గా జరుపుతా రు. జపాన్ చక్రవర్తులు ప్రకృతి ప్రేమికులన్న దానికి గుర్తింపుగా దీన్ని జరుపు తారు. ఇక అయిదో తేదీని బాలల దినోత్సవం. తల్లిదండ్రులు త మ పిల్లల భవిష్యత్తు కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తారు.
సునామీ తర్వాత ఇప్పుడి ప్పుడే కోలుకుంటున్న జపాన్ ఈ స్వర్ణ వారోత్సవాలను జాతి పునర్నిర్మా ణానికి సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. సునామీకి దారు ణంగా దెబ్బతిన్నామని దీనంగా దైన్యం గా కూర్చోకుండా ఈ ఉత్సవాల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకుని, పని చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా జాతి జనులనుసమాయత్తపరుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అతిపెద్ద భూకంపాలు, సునామీలు
2001 జూన్: పెరూ దక్షిణ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8.4 తీవ్రత కలిగిన భూకంపం కారణంగా వచ్చిన సునామీలో వందల మిలియన్ డాలర్ల మేరకు నష్టం సంభవించింది.
2004 డిసెంబర్ 26: సుమాత్రా దీవులలో సంభవించిన భూకంపం అనంతర సునామీల కారణంగా భారత్‌తో సహా పలు దేశాలలో వేలాది మంది మరణించారు. తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 9.0గా నమోదైంది.
2006, జులై: ఇండొనేషియాలోని పడమర జావాలో సంభవించిన భూకంపం తదనంతర సునామీలో 668 మంది మృతిచెందగా, 74వేల మంది నిర్వాసితులయ్యారు.
2007, జనవరి: జపాన్‌లోని ఉత్తర ప్రాంతంలోనూ, రష్యాలోని కురిల్ ద్వీపంలోనూ సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ఆ ప్రాంతాలను విడిచి పారిపోయారు. నాటి భూకంప తీవ్రత 8.3.
2007, ఏప్రిల్: సాలమన్ ద్వీపంలో సంభవించిన భూకంపం అనంతర సునామీలో 50మంది మరణించగా, వేలాదిమంది నిర్వాసితులయ్యారు. భూకంప తీవ్రత 8.0.
2009, సెప్టెంబర్: పసిఫిక్ ద్వీపమైన సుమోవాలో భూకంపం కారణంగా సంభవించిన సునామీలో 184మంది మరణించారు. భూకంప తీవ్రత 8.0.
2010, జనవరి: సాలమన్ ద్వీపంలోని పశ్చిమ ప్రాంతంలో సంభవించిన బలమైన భూకంపాల కారణంగా సునామీ సంభవించిన వెయ్యిమంది నిర్వాసితులయ్యారు. భూకంపాలు రిక్టర్ స్కేల్‌పై 6.5, 7.2లుగా నమోదయ్యాయి.
2010, ఫిబ్రవరి: చిలీలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా పసిఫిక్ తీర ప్రాంతాలలో హెచ్చరికలు జారీ అయ్యాయి.
2010, అక్టోబర్: సుమాత్రా దీవులలో సంభవించిన భూకంపం అనంతర సునామీలలో 509మంది మృతి చెందగా వేలాది మంది నిర్వాసితులయ్యారు. భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.
జపాన్‌కు సంబంధించి కొన్ని విశేషాలు
- గుర్రం పచ్చి మాంసాన్ని జపాన్‌లో ఇష్టంగా తింటారు. దీనిని వండకుండా పచ్చిగానే తింటారు. దీనిని బసాషీ అని పిలుస్తారు.
-జపాన్ భూభాగంలో 70 శాతం కొండలు, పర్వతాలు ఉంటాయి. అంతేకాదు దేశంలో సుమారు 200 అగ్నిపర్వతాలు ఉన్నాయి.
-జపాన్‌లో అక్షరాస్యతా రేటు దాదాపు 100శాతం
-అక్కడ బీర్ కోసం ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్లు ఉంటాయి.
-క్షమాపణను తెలిపేందుకు కొందరు పురుషులు గుండు గీసుకుంటారు.
-జపాన్ నుంచి 15మంది నోబెల్ గ్రహీతలు (కెమిస్ట్రీ, మెడిసిన్, ఫిజిక్స్), ముగ్గురు ఫీల్‌డ్స మెడల్ పొందిన వారు ఉన్నారు.
-జపాన్‌కు చెందిన సినీ నిర్మాత, దర్శకుడు తకహి మీకె తన కెరీర్ ఉచ్ఛదశలో దశాబ్దకాలంలో 50 సినిమాలు తీశాడు.
-ప్రపంచంలో యానిమేషన్‌కి సంబంధించిన వినోద చిత్రాలలో 60శాతం జపాన్ నుంచ వచ్చినవే.
- జపాన్‌లో 21శాతం జనాభా వృద్ధులే. ప్రపంచంలో ఇది అత్యధిక శాతం
1900 సం నుంచి జపాన్‌లో సంభవించిన భూకంపాలు- సునామీ
సంవత్సరం నగరం మృతుల సంఖ్య తీవ్రత సునామీ 1995 కోబె 5,502 6.9 సునామీ 1948 పుకుయి 3769 7.3 సునామీ 1948 నంకైదో 1362 8.3 సునామీ 1945 మికావా 1961 7.1 సునామీ 1944 తొనంకాయ్ 998 8.1 సునామీ 1943 టిట్టోరి 1,190 7.7 సునామీ 1933 సన్‌రికు 3000 8.4 సునామీ 1927 టాంగో 3020 7.6 సునామీ 1926 కాంటో 1,42,800 7.9 సునామీ
-జి.పాంచజన్య
No comments:
Post a Comment