Saturday, April 16, 2011

సోమాలియా దొంగల దేశం ఎందుకైంది?

సోమాలియా అని గూగుల్‌లో 'సెర్చ్' చేస్తే దాని పక్కనే 'పైరేట్స్' ప్రత్యక్షమవుతుంది. ఒకప్పుడు ఆకలిచావులకి మారుపేరైన సోమాలియా ఇప్పుడు పైరేట్స్‌కి.. అంటే సముద్రపు దొంగలకి మారుపేరవడానికి దారి తీసిన పరిస్థితులేమిటి? చదరపు కిలోమీటర్‌కి 14 మంది మాత్రమే జనసాంద్రత ఉన్న ఆ దేశం తలసరి ఆదాయంలో 148వ స్థానంలో ఉంది. అందుకే కాబోలు ఐరాస రూపొందించే మానవాభివృద్ధి సూచిలో కొన్నేళ్లుగా సోమాలియా పేరే లేకుండా పోయింది. వీటికి కారణం ఒకటని చెప్పలేం. అరాచకం, జాతుల వైరం, విదేశీ దోపిడీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం, పాలన లాంటివి లేని సమాజంలో ఎంతటి అరాచకం రాజ్యమేలుతుందో చెప్పడానికి 1991, 2006ల మధ్య కాలం నాటి సోమాలియానే ఉదాహరణ అంటారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడినా దాని పనితనం అంతంత మాత్రమే. అదే అదునుగా ఎన్నో దేశాలు సోమాలియా వనరులను హరించి వేశాయి. చేపలు పట్టుకోవాల్సిన సోమాలియా జాలరులు సముద్రపు దొంగలుగా మారడం వాటన్నిటి పుణ్యమే.

నవంబర్ 2008. సౌదీ అరేబియా తీరం నుంచి అమెరికాకి బయల్దేరింది 'సైరస్ స్టార్'. చమురు రవాణా చేసే మహా నౌకలలో అది ఒకటి. 22 లక్షల బ్యారెళ్ల ముడి చమురుని తీసుకెళ్తున్న ఆ నౌకలో పాతికమంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. దాని ఖరీదు 50 మిలియన్ డాలర్లయితే దాన్లో ఉన్న చమురు ఖరీదు అక్షరాలా 100 మిలియన్ డాలర్లు. నౌకా సిబ్బందికి తెలుసు.. సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు ఉంటారని, శరవేగంగా దూసుకుపోయే మర పడవల్లో వచ్చి ఎకె 47 లాంటి మారణాయుధాలతో దాడికి దిగుతారని తెలుసు. ఆ దొంగలు కొన్నేళ్లుగా పడవల్ని, ఓడల్ని హైజాక్ చేస్తున్నా తమలాంటి పెద్ద నౌకని ఎప్పుడూ హైజాక్ చెయ్యలేదు. అందుకే 'మనల్నేం చేస్తారులే' అని కాస్త ధీమాగానే ఉన్నారు వాళ్లు. ఆఫ్రికాకి ఈశాన్య మూలన ఉండే సోమాలియా తీరం దాటి కెన్యా పక్కనుంచి 'కేప్ ఆఫ్ గుడ్‌హోప్' దిశగా సాగిపోతున్నారు.

'హమ్మయ్య.. దాటేశాం. ఇక దొంగల భయం లేదు' అనుకుంటుండగా... కెన్యా తీరానికి 830 కిలో మీటర్ల దూరంలో చుట్టుముట్టారు సోమాలీ పైరేట్లు. కాసేపటికల్లా నౌకని తమ అధీనంలోకి తెచ్చుకుని సోమాలియా వైపు మళ్లించారు. తమ డిమాండ్లను 'అల్ జజీరా' చానల్ ద్వారా ప్రకటించారు... పదిరోజుల్లోగా 25 మిలియన్ డాలర్లు సైరస్ స్టార్‌కి చేరాలని, ఆ సొమ్మును తమ వద్ద ఉన్న మిషన్లతో లెక్కిస్తామని, వాటిలో గనక దొంగనోట్లుంటే తమ మిషన్లు పసిగడతాయని కూడా హెచ్చరించారు.55 రోజుల పాటు సౌదీ ఆయిల్ కంపెనీకి, పైరేట్లకి బేరసారాలు జరిగి చివరికి 3 మిలియన్ డాలర్లకి బేరం కుదిరింది. డబ్బు పారాచూట్ ద్వారా సైరస్ స్టార్‌ని చేరిన తర్వాత 9 జనవరి, 2009న ఆ నౌకను విడిచిపెట్టారు. డజన్లమంది పైరేట్లు ఆ డబ్బు తీసుకుని తమ మర పడవల్లో తీరం వైపు దూసుకుపోయారు. ఆ పడవల్లో ఒకటి సముద్రంలో వచ్చిన తుపాను తాకిడికి తిరగబడిపోతే అందులో ఉన్న ఐదుగురు నీటిలో మునిగిపోయారు. వారిలో ఒకరి శవం మరునాడు సోమాలియా తీరానికి కొట్టుకొచ్చింది. ఆ శవానికి ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లో లక్ష డాలర్లున్నాయి. అదీ సోమాలియా పైరేట్ల కథ. దొంగతనం ఎంతటి సాహసంతో కూడుకుందో తెలియజేసే గాధ.

***

ఉద్యోగాల నుంచి రిటైరైన బ్రిటిష్ దంపతులు పాల్ చాండ్లర్, రేచల్ చాండ్లర్ తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవాలనుకున్నారు. 2006లో ఒక బోట్ కొనుక్కొని సముద్రంపై విహార యాత్రకి పయనమయ్యారు. నచ్చిన చోట నెలలపాటు గడిపేస్తూ.. ఇల్లు గుర్తుకొచ్చినప్పుడు బోట్‌ని ఏదో ఒక తీరంలో ఆపేసి బ్రిటన్ ఎగిరెళ్లిపోయే వారు... మళ్లీ కొన్ని రోజులకు యాత్రకి సిద్ధమయ్యేవారు. అలా ప్రపంచాన్ని చుట్టి రావాలని వారి కోరిక. దాన్ని నెరవేర్చుకునే క్రమంలోనే ఎర్రసముద్రం దాటి సోమాలియా మీదుగా టాంజానియా వెళ్తూ పైరేట్ల కళ్లలో పడ్డారు. 22 అక్టోబర్ 2009న వాళ్ల చేతుల్లో బందీలయ్యారు. అంతే.. సముద్రయాన విశేషాలు వివరిస్తూ ఆ దంపతులు రాస్తున్న బ్లాగ్‌లో అప్‌డేట్‌లు ఆగిపోయి.. 'ప్లీజ్ రింగ్ శారా' (శారాకి ఫోన్ చెయ్యండి) అని మాత్రమే రాసుంది. ఆ రోజు నుంచి వాళ్లు 388 రోజులపాటు పైరేట్ల చెరలోనే గడిపారు. ఆ దంపతుల బంధువుల నుంచి బ్రిటన్ ప్రభుత్వం దాకా ఎంతో మంది పైరేట్లతో సంప్రదింపులు, రాయబారాలు జరిపి చివరికి 3 లక్షల డాలర్లు చెల్లించిన తర్వాత 2010 నవంబర్ 14న వారిని విడిచి పెట్టారు.

***

అరేబియా సముద్రంలో దోపిడికి పాల్పడుతున్న 61 మంది సోమాలియన్లని గత నెల 13న భారత నౌకాదళం పట్టుకుని 13 మంది నావికులను కాపాడింది. అదేనెల 26న 16 మంది పైరేట్లని పట్టుకుని వారి చెరలో ఉన్న 16 మంది నావికులకు విముక్తి కలిగించింది. సోమాలియాలో ఆకలితో అలమటించేకంటేమన జైళ్లలో గడపడం నయమని మన నౌకాదళానికి చిక్కిన పైరేట్లు అంటున్నారు.
సముద్రంలో తెగబడే దోపిడి దొంగలని పైరేట్స్ అంటారు. ఆ దొంగలకిఇ ప్పుడు సోమాలియా తీరం కేంద్రమై రవాణాకి, సముద్రయానానికి పెనుసవాలుగా మారింది. సోమాలియా పైరేట్ల చేతికి చిక్కితే బయటపడడం ఎంత కష్టమో మొదటి రెండు సంఘటనలూ తెలియజేస్తుంటే కడు పేదరికమే వాళ్ల చేత ఆ పని చేయిస్తోందని మూడో సంఘటన తెలియజేస్తుంది.

ఆ గల్ఫే వారి స్వర్గధామం

ఆఫ్రికా ఖండానికి ఈశాన్య మూలన ఉంటుంది సోమాలియా. దానికి ఉత్తరాన ఉన్న సముద్రాన్ని 'గల్ఫ్ ఆఫ్ అడెన్' అని పిలుస్తారు. గల్ఫ్‌కి ఇటువైపు యెమెన్ దేశం ఉంటుంది. ఏటా ముప్పై వేలకి పైగా నౌకలు గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా ప్రయాణిస్తాయి. సోమాలియా ఆకలిచావుల దేశమైతే యెమెన్, దాని పక్కనున్న సౌదీ అరేబియా, ఒమన్ లాంటి దేశాలేమో ముడిచమురు అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు. ఆ చమురు విదేశాలకి ఎగుమతి అయ్యేది గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండానే. అదే పైరేట్ల పాలిట వరమైంది. ఆ నౌకలను హైజాక్ చేయడం.. వారి యజమానుల నుండి డబ్బు గుంజడం వారికి అలవాటైపోయింది. ఏటా వందల కొద్దీ నౌకల మీద దాడులు చేయడం, పదుల సంఖ్యలో ఓడలను హైజాక్ చేయడం, వందలమందిని బంధించి వారిని విడిచి పెట్టడానికి లక్షల డాలర్లు డిమాండ్ చేయడం వీరి ప్రధాన ఉపాధి మార్గమైపోయింది. సోమాలియా పైరేట్ల చెరలో ఇంకా కనీసం 600 మంది ఉండి ఉంటారు. వారిలో మన దేశీయులే 70 మందికి పైగా ఉన్నారు.

సూయజ్ ఉండీ లాభం లేదు

యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరాన్ని సూయజ్‌కాల్వ దగ్గర చేసి ఆ ఖండాల మధ్య సరుకుల రవాణాని సుగమం చేస్తే సోమాలియా పైరేట్లు ఆ దగ్గరని మళ్లీ దూరం చేస్తున్నారు. వారికి భయపడే కొన్ని దేశాలు ఇప్పుడు తమ నౌకల్ని మళ్లీ ఆఫ్రికా ఖండం చుట్టూ తిప్పి తీసికెళుతున్నాయి. రవాణా వ్యయం పెరిగినా పర్వాలేదని 'కేప్ ఆఫ్ గుడ్‌హోప్' గుండా వెళ్తున్నాయి. దాని వల్ల గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో ఓడల రాకపోకలు తగ్గడంతో పైరేట్లు ఇప్పుడు హిందూమహాసముద్రంలో కూడా నౌకలపై దాడులకు దిగుతూ తమ పరిధిని విస్తరించుకుంటూ పోతున్నారు. చాండ్లర్ దంపతుల్ని హైజాక్ చేసింది సోమాలియాకి దక్షిణాన ఉన్న టాంజానియా సమీపంలో అయితే, సైరస్ స్టార్‌పై దాడి చేసింది కెన్యా సమీపంలో. ఈ పైరేట్లు ఎంతగా విస్తరించారంటే అరేబియా సముద్రంలో మనదేశ దక్షిణ తీరానికి 300 మైళ్ల దూరంలో కూడా వాళ్లు నౌకని హైజాక్ చేశారు. అక్కడి నుంచి సోమాలియా 1,500 మైళ్ల దూరంలో ఉందంటే వాళ్ల పరిధిని ఎంతగా పెంచుకుంటూ పోతున్నారో ఊహించుకోవచ్చు.

2008లో 111 నౌకలపై దాడులు చేసి 40 నౌకల్ని హైజాక్ చేశారు ఈ పైరేట్లు. 2009లో 217 నౌకలపై దాడి చేసి 47 నౌకల్ని తమ అధీనంలో ఉంచుకున్నారు. ఇప్పటికీ వీటిలో కొన్నిటిని మాత్రమే విడిచి పెట్టారు. మిగతావన్నీ వారి చేతిలోనే ఉన్నాయి. హైజాక్ చేసిన ఓడల్ని సముద్రం మధ్యలో నిలిపి వాటిని కేంద్రంగా చేసుకుని మరిన్ని ఓడల్ని హైజాక్ చేస్తున్నారు. తమ అధీనంలో ఉన్న ఓడలో నుంచి వేరే ఓడల్ని పసిగట్టడం.. అవిసమీపంలోకి రాగానే తమ ఓడ అపాయంలో ఉందని తప్పుడు సంకేతాలు పంపించడం తీరా అది దగ్గరకి వచ్చాక తమ వద్ద ఉన్న మిషన్ బోట్‌లలో వెళ్లి వాటిపై మారణాయుధాలతో దాడులకు దిగడం వీరికి అలవాటై పోయింది.

మూడు రకాల నైపుణ్యం అవసరం

చేతుల్లో ఎకె 47 రైఫిళ్లు, రివ్వున దూసుకుపోయే పడవలు, వాటిపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు, సముద్రంలో తామెక్కడున్నామో తెలియజేసే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలు, శాటిలైట్ ఫోన్లు పైరేట్ల పనిని సులువు చేస్తున్నాయి. పైరేట్లలో ఎక్కువ శాతం ఈశాన్య సోమాలియాలోని 'పుంట్‌ల్యాండ్' ప్రాంతానికి చెందినవారు. పైరేట్లలో చాలామంది ఒకప్పటి మత్స్యకారులే అయినా ఇప్పుడున్న పైరేట్ల బృందాల్లో ముఖ్యంగా మూడు రకాల వ్యక్తులున్నారు. మొదటి వర్గం జాలరులు. వేట వీరికి కొట్టిన పిండే.. బోట్లు నడపడంలో సుశిక్షితులు, పైగా సముద్రంలో తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తమని తాము ఎలా రక్షించుకోవాలో వీళ్లకి బాగా తెలుసు. రెండో వర్గం మిలిటెంట్లు. సోమాలియాలో నిత్యం జరిగే జాతుల వైరం వల్ల ఆ జాతులకి సైన్యాలు కూడా ఉంటాయి. వాళ్లిప్పుడు పైరేట్లుగా మారుతున్నారు. గన్‌లు, రాకెట్ లాంచర్లతో ఓడలపై దాడులు చేసేది వీళ్లే. మూడో రకం జిపిఎస్ పరికరాల్ని ఉపయోగించడం తెలిసిన వాళ్లు.

పదేళ్ల క్రితం దాకా చిన్నచిన్న జట్లుగా దాడులకు పాల్పడిన పైరేట్లు ఇప్పుడు అతిపెద్ద మాఫియాగా ఎదిగారు. ఆ దేశంలోని బడా వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ దారి దోపిడీలను ప్రోత్సహిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే సోమాలియన్లు ఆ గల్ఫ్‌కి వచ్చివెళ్లే నౌకల సమాచారాన్ని సోమాలియాలోని తమ వాళ్లకి క్షణాల్లో చేరవేస్తున్నారు. అందుకే ఏయే నౌకలు ఏ సరుకులతో వస్తున్నాయో, అవి ఎప్పటికి సోమాలియా తీరానికి చేరుకుంటాయో వారికి ముందే తెలిసిపోతుంది. ఈ దోపిడీలు పెరగడం వల్ల ఆ దేశంలో మారణాయుధాలకి బాగా గిరాకీ ఏర్పడింది. ఎక్కువగా యెమెన్ నుంచి ఆయుధాలు దిగుమతి అవుతాయి. పైరేట్ల పుణ్యమా అని సోమాలియా రాజధానిలో కూడా పెద్ద పెద్ద ఆయుధాల మార్కెట్‌లు వెలిశాయట.

ఈ మాఫియా పెరిగి పెద్దయి కోట్ల డాలర్లు డబ్బు వస్తుండడంతో పైరేట్ల లీడర్లు రకరకాల కార్లు, బంగ్లాల్లో విలాస జీవితాల్ని గడుపుతున్నారు. వారిని చూసి మరెందరో అదే బాట పడుతున్నారు. అందుకే ఆ దేశంలో నేను పైరేట్‌ని అని చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందట. సోమాలియాలో బడా వ్యాపారులు సైతం అప్పు కావాల్సి వస్తే పైరేట్లనే ఆశ్రయిస్తున్నారు.

అరాచకంలోనూ ఐకమత్యం

నిత్యం జాతుల వైరం, రక్తపాతం జరిగే సోమాలియాలో పైరేట్ల మధ్య మాత్రం ఎలాంటి వైరాలూ ఉండవు. వాళ్ల మధ్య ఐక్యత చూసిన వాళ్లు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. డబ్బే వారిని ఒకటి చేస్తుంది. పైరేట్లు డబ్బు కోసం ఎప్పుడూ ఒకరిని ఒకరు చంపుకోరట. పదేళ్లుగా ఈ దోపిడీలు ఉధృతంగా జరుగుతున్నా ఇంతవరకూ పైరేట్ గ్యాంగ్‌ల మధ్య ఎలాంటి వైరం రాలేదట. వాళ్ల గురించి ఇంకో విషయం కూడా ఘనంగా చెప్పుకుంటారు. బందీలని ఎన్ని రోజులైనా సరే చాలా బాగా చూసుకుంటారు. చాండ్లర్ దంపతులు కూడా ఆ విషయం చెప్పారు. పైరేట్లకికావాల్సింది డబ్బే కాని బందీల ప్రాణాలు కాదు కాబట్టి బందీల ప్రాణాలు తీయడం అరుదు. చాలా సందర్భాల్లో పైరేట్లకి డబ్బు హెలికాప్టర్ల నుంచి జారవిడుస్తారు. ఒక్కోసారి వాటర్‌ప్రూఫ్ సూట్ కేసుల్లో పడవల్లో పంపిస్తారు. ఆ డబ్బుని 'ఫారిన్ ఎక్స్‌ఛేంజ్' కార్యాలయాల్లో ఉపయోగించే మిషన్లతో లెక్కిస్తారు.

ఎలా మొదలైంది..?

ఆఫ్రికా ఖండం మొత్తంలో పొడవైన తీరరేఖ ఉన్న దేశం సోమాలియా. కొండలు గుట్టలతో నిండి ఉండే ఆ దేశంలో సహజవనరులు అంతంత మాత్రమే. తీర రేఖ వెంబడి నివసించే జనాభాకి చేపల వేట తప్పమరో జీవనాధారం లేదు. ఆ దేశంలో దశాబ్దాల పాటు కొనసాగిన మిలిటరీ పాలన 1991లో అంతమైన తర్వాత జాతుల మధ్య వైరాలు మరీ ఎక్కువయ్యాయి. అరాచకం పెచ్చరిల్లింది. తర్వాత ఏర్పడిన ప్రభుత్వం పని తీరు అంతంత మాత్రమే. అందుకే ఆ దేశ తీరాన్ని పరిరక్షించడానికి ఎలాంటి రక్షణ దళం లేకుండా పోయింది. అది పాశ్చాత్య దేశాల పాలిట వరమైంది. ఫలితంగా విదేశాలకి చెందిన చాలా నౌకలు సోమాలియా తీరంలో ప్రవేశించి చేపలు పట్టడం, వారి జల వనరుల్ని దోచుకోవడం ఎక్కువైంది. దీనికి తోడు పలు పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీలు రకరకాల వ్యర్థాలను సోమాలియా సముద్ర జలాల్లో వదిలేయడం మొదలుపెట్టాయి.

ఇలా రెండు రకాలుగా సోమాలియా జలాల్ని కలుషితం చేసి ఆ దేశ మత్స్యకారుల పొట్టగొట్టారు. సోమాలియా తీర జలాలలో యురేనియం, సీసం, భారలోహాలైన కాడ్మి యం, పాదరసంతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు, ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు, మరెన్నో రసాయనాలు ఉన్నాయని 2005లో ఐరాస పేర్కొంది. తమ వనరుల్ని హరించి వేసిన విదేశీలపై సహజంగానే సోమాలియా తీరప్రాంత ప్రజలకి ద్వేషభావం పెరిగిపోయింది. దాంతో ఆ మత్స్యకారులు తమ జలాల్లోకి ప్రవేశించిన విదేశీ ఓడల్ని హైజాక్ చేయడం మొదలుపెట్టారు. ఆకలి చావులు సర్వ సాధారణమైన సోమాలియాలో ఇప్పుడు ఈ దోపిడీయే ఎంతో మందికి జీవనాధారమైంది. ఆకలితో చావలేని యువకులు ఈ గ్యాంగుల్లో చేరి తమ జాతకాల్ని పరీక్షించుకుంటున్నారు. విషాదమేమిటంటే.. పదిహేనేళ్ల లోపు బాలలు కూడా ఈ చోర జల క్రీడల్లో పాల్గొని నేరస్తులుగా మారుతున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లాంటి దేశాల్లో 'చైల్డ్ సోల్జర్'లు (బాల సైనికులు) ఎలాగైతే ఉగ్రవాదుల కార్యకలాపాల్లో పావులవుతున్నారో అలాగే సోమాలియాలో బాల పైరేట్లు తయారవుతున్నారు. మన దేశ నౌకాదళానికి చిక్కిన 61 మందిలో 25 మంది 15 ఏళ్ల వయసులోపు వారే. వారిలో నలుగురి వయసైతే 11 ఏళ్లే.

వాణిజ్యాన్ని దెబ్బతీసింది

సోమాలియా దోపిడీలు దాని సమీప దేశాల వ్యాపారాలను కూడా భారీగా దెబ్బతీశాయి. పైరేట్లకి భయపడి సూయజ్ కాల్వ గుండా రాకపోకలు తగ్గడం వల్ల ఈజిప్టు ఆదాయానికి కూడా గండి పడింది. కెన్యా, యెమెన్ దేశాల వాణిజ్యాన్ని దెబ్బ తీసింది కూడా ఈ దొంగలే. సోమాలియా పక్కనే ఉన్న సీషెల్స్‌కు వచ్చే టూరిస్టులు దీని వల్ల బాగా తగ్గిపోయారు. సమీప దేశాల్నే కాదు.. అంతర్జాతీయ వాణిజ్యానికికూడా పెను సవాలుగా మారారు వీళ్లు. యుద్ధ నౌకల్లో తప్ప వాణిజ్య నౌకల్లో మారణాయుధాలు నిషేధిస్తారు కాబట్టి ఆ ఓడల సిబ్బందిని పైరేట్లు మారణాయుధాలతో బెదిరించి చాలా సులభంగా తమ అధీనంలోకి తెచ్చుకోగలుగుతున్నారు.

నిరోధక చర్యలు

అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పు వాటిల్లడంతో ఐరాస భద్రతా మండలి నిరోధక చర్యలు చేపట్టాలని తీర్మానించింది. దాంతో అమెరికా, కెనడా, చైనా, జపాన్‌తో పాటు పలు దేశాలు ఈ దాడులను నిరోధించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం 'కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 150', 'కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 151', 'ఆపరేషన్ అట్లాంటా' - అనే మూడు అంతర్జాతీయ 'యాంటీ పైరేట్ టాస్క్ ఫోర్స్‌లు' ఇటు అరేబియా సముద్రంలోనూ, అటు హిందూ మహాసముద్రంలోనూ పహారా కాస్తున్నాయి. దాంతో పాటు వివిధ దేశాల యుద్ధ నౌకలు కూడా తమ వాణిజ్య నౌకలను కాపాడుకుంటున్నాయి. మన దేశ నౌకాదళం కూడా హిందూ మహా సముద్రంలో 'యాంటీ పైరేట్ ఆపరేషన్' చేపట్టి చాలా నౌకల్ని పైరేట్ల దాడి నుంచి కాపాడ గలిగింది.

ఈ టాస్క్ ఫోర్స్‌లన్నీ కలిసి వందలమంది సోమాలియా పైరేట్లను నిర్బంధించాయి.. అలా దొరికిన వాళ్లందరూ వివిధ దేశాల జైళ్లలో మగ్గుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా పైరేట్లు తమ పంజా విసురుతూనే ఉన్నారు. ఈ దోపిడీల్ని పూర్తిగా నిరోధించలేకపోవడానికి విశ్లేషకులు చెపుతున్న కారణమేమంటే సోమాలియా పైరేట్ల వల్ల జరిగే నష్టం కంటే యుద్ధ నౌకలు ఆ ప్రాంతాల్లో నిత్యం పహారా కాయడానికి అయ్యే ఖర్చు ఎక్కువట. అందుకే పాశ్చాత్య దేశాలు తీవ్రంగా స్పందించడం లేదనే వాదన కూడా ఉంది. పైగా మీరే మా వనరుల్ని హరించి వేశారని సోమాలియన్లు ఎదురుదాడికి దిగితే ఆ దేశాలు తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. విదేశీ నౌకలు ఎన్ని చేసినా పైరేట్లను అరికట్టాలంటే ఆ దేశంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉండాలి.. అది లేదు అక్కడ. అయినా అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో పైరేట్లను అరెస్టు చేసే పనిలో పడింది. అక్కడి ప్రభుత్వం వారికి ప్రత్యేక జైలు కూడా కట్టించింది.

హాలీవుడ్‌నీ ఆకర్షించింది

అంతర్జాతీయ సమాజాన్నే కాదు ఈ సముద్రపు దొంగలు రచయితల్నీ, హాలీవుడ్‌ని కూడా ఆకర్షించారు. ఒక నవల, ఒక యదార్ధ అనుభవం ఇప్పటికే పుస్తకాలుగా వచ్చాయి. 'దోజ్ ఇన్ పెరిల్' అనే నవలని విల్బర్ స్మిత్ రచిస్తే పైరేట్ల చెరనుండి బయట పడిన ఓ అమెరికన్ నౌక కెప్టెన్ తన అనుభవాన్ని వివరిస్తూ 'ఎ కెప్టెన్స్ డ్యూటీ' అనే పుస్తకం రాశారు. దీని ఆధారంగా తీస్తున్న హాలీవుడ్ సినిమాలో ఉత్తమ నటుడిగా రెండుసార్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న టామ్ హాంక్స్ కెప్టెన్‌గా నటిస్తున్నాడు. కథ ఏమిటంటే... 2009లో 'మెరెస్క్ అలబామా' అనే అమెరికన్ నౌకని నలుగురు సోమాలియన్ పైరేట్లు హైజాక్ చేశారు. నౌక సిబ్బంది వారిపై తిరగబడ్డారు. ఆ క్రమంలో ఒక పైరేట్ నౌక సిబ్బందికి చిక్కితే నౌక కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్ పైరేట్లకి చిక్కాడు. మా వాణ్ణి విడిచిపెడితే కెప్టెన్‌ని వదిలేస్తామని హామీ ఇచ్చినపైరేట్లు ఆడిన మాట తప్పి కెప్టెన్‌ని తీసుకుని బోట్‌లో పారిపోతారు. సముద్ర జలాల్లోనే తిరుగుతూ అమెరికాతో బేరాలు సాగిస్తారు. వారితో ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు అమెరికన్ నౌకాదళం తమ బలగాలను మొహరిస్తుంది. చివరికి ముగ్గురు పైరేట్లని హతమార్చి కెప్టెన్‌ని రక్షిస్తుంది.

* నాగేశ్వరరావు తమనం


No comments: