Saturday, September 11, 2010

న్యూయార్క్‌లో మన ‘తినుబండి’!

మనవాళ్లు వట్టి వెధవాయిలోయ్..అని వెనకటికి ఎవరో పెద్దాయిన అంటే అని వుండొచ్చు కానీ, విదేశాల్లో మాత్రం మనవాళ్లు చాలా గట్టివాళ్లనిపించుకుంటున్నారు. అక్కడికి వెళ్లగానే ఎక్కడ లేని తెలివితేటలు ‘వంట’పట్టించేసుకుంటున్నారు. కేవలం ఉద్యోగాలతో సరిపెట్టేసుకోకుండా, కట్టెలమ్మే చోట కట్టెలు, పూలమ్మే చోట పూలు విక్రయిస్తూ, కావాల్సినన్ని కాసులు జమచేసుకుంటున్నారు.
న్యూయార్క్‌లో ఇండియన్ రెస్టారెంట్‌లకు కానీ, ఫుడ్‌కోర్టులకు కానీ కొదవలేదు. ముఖ్యంగా డౌన్‌టౌన్ మన్‌హట్టన్‌లోని న్యూయార్క్ యూనివర్సిటీ కాంపస్‌లో. ఇక్కడ కొంతమంది దేశీ ఫుడ్ కౌంటర్లు ప్రారంభించి, కాస్త జిహ్వచాపల్యం వున్న వారిని ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.Alamgeer Elahiమరి కొంఛెం ముందుకు వెళ్లి కాస్త భిన్నంగా ఏమన్నా చేయాలనుకున్నాడు. అక్కడి ఫిఫ్త్ ఎవెన్యూలోని 27వ వీధిలో ఇప్పుడు ఓ పచ్చటి వ్యాన్‌లో అతడు మోటల్ లేదా సంచార హోటల్ నడుపుతున్నాడు. అటుగా వెళ్లేవారెవరూ దాన్ని చూడకుండా వుండడం అసాధ్యం. పచ్చటి బ్యాక్‌గ్రౌండ్‌పై పాకిస్తానీ ట్రైబల్ ఆర్ట్‌తో డెకరేట్ చేసి, ఎంబ్రాయిడరీ కర్టెన్లు అమర్చి, డెకరేట్ చేసారా వ్యాన్‌ను.
చక్కగా వేడి వేడి లచ్చాపరాటాలను ఇట్టే ఆరగించవచ్చు అక్కడ. అలాగే కాస్త దాల్, రైస్, ఇంకా కావాలంటే కాస్త బిరియానీ కూడా తినొచ్చు. రేట్లేమీ అమెరికా లెవెల్లో వుండవు. ఆ బిరియానీలో కూడా రకాలెన్నో. కలకత్తా బిర్యానీ, షాన్‌దార్ బిర్యానీ ఇలా. ఇంకా ఇండియన్ వెరైటీలెన్నో లభిస్తాయి. చిత్రమేమిటంటే ఇండియనే్స కాదు.. నాన్ ఇండియన్స్ కూడా ఈ ‘తిండి బండి’ దగ్గరకు చేరి, లొట్టలు వేస్తూ ‘మన తిండి’ని లాగించేస్తున్నారు. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ వ్యాపారం అనుకున్న దాని కన్నా బాగా సాగుతోందని యజమాని ఇలాహీ ఆనందంగా చెబుతున్నాడు. ‘ఇక్కడ తినడం చాలా బాగుంది. పైగా అన్నీ రెడీగా క్షణాల్లో అందిస్తున్నారు’ అని కస్టమర్లు సర్ట్ఫికెట్లు ఇస్తున్నారు. నిజానికి ఇలాహీకి ఈ ఐడియా కొత్తగా రాలేదు. ఇంతకు ముందే సిక్స్త్ ఎవెన్యూలోని 40వ స్ట్రీట్‌లో ఓ ‘తిండి బండి’ వుంది. అది హిట్ కావడంతో, మరొకటి ప్రారంభించాడు. ‘చాలా మంది జనానికి తీరుబడిగా కూర్చుని తినేంత సమయం లేదు. ఉరకలు..పరుగుల జీవి తం సాగుతోంది. అందుకనే ఇక్కడకు వచ్చినవారికి క్షణాల్లో కావాల్సినవి త్వరగా తయారుచేసి వండిస్తున్నాం’ అని ఇలాహీ తన విజయరహస్యాన్ని వివరించాడు. అతడి తల్లితండ్రులు పాకిస్తాన్ పంజాబ్ నుంచి భారత్‌లోని కలకత్తాకు వలస వస్తే, ఇతడు అక్కడి నుంచి న్యూయార్క్‌లో తేలాడు. గత పద్దెనిమిదేళ్లుగా అక్కడే మొబైళ్ల వ్యాపారం, ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ఆఖరికి ఈ తిండి వ్యాపారంలో స్థిరపడ్డాడు. వీలయినంత తక్కువ ధరలకు ఆహారపదార్ధాలు అందివ్వడం, సెలవు అన్నదే లేకుండా నిర్వహించడం చేస్తున్నాడు. కొన్నాళ్లయితే ధరలు పెంచాలన్నది అతడి ఆలోచన. వారాంతాల్లో ఉదయం ఆరుకే ‘తిండిబండి’ని ప్రారంభిస్తాడు. వీలయినంతవరకు నాణ్యమైన బటర్, నెయ్యి వాడతాడు. దాల్, రైస్, చపాతీ, రోటీలతో పాటు మన స్టయిల్ పచ్చళ్లు కూడా వడ్డిస్తాడు. అన్నట్లు పచ్చి ఉల్లిపాయి ఇవ్వడం మర్చిపోడు. వారాంతాల్లో హైదరాబాద్ బిరియానీ ఘుమఘుమలాడుతూ , ఇల్లాహ్‌కు డబ్బులు బానే రప్పిస్తోంది. ఎవరన్నారు మనవాళ్లు వట్టి వెధవాయిలనీ..?

-వి.ఎస్.ఎన్


No comments: