Sunday, September 5, 2010

కృష్ణ పరువళ్లు నిండుగా నిండిన శ్రీశైలం.. 885అడుగుల నీటి మట్టం


కళకళలాడుతున్న సాగర్..
22గేట్ల ఎత్తివేత
9లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి
అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
సాగర్ నీటిమట్టం 585 అడుగులు
ప్రకాశం బ్యారేజీలో 70 గేట్లను ఎత్తిన అధికారులు
70వేల క్యూసెక్కుల దిగువకు..
10.5 అడుగులకు చేరిన నీటి మట్టం
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గోదావరి గర్జిస్తోంది. రిజర్వాయర్లలో జలకళ ఉట్టిపడుతోంది. బ్యారేజీ గేట్ల నుంచి వరద నీరు ఉరుకుతోంది. సముద్రుడి దిశగా దూసుకుపోతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో.. ప్రమాదకరస్థాయికి చేరుతున్నా.. అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. గోదావరి మళ్లీ ఉద్ధృతరూపం దాల్చింది. పరవళ్లు తొక్కుతూ పోటెత్తుతోంది.

గోదావరి పరీవాహక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉప నదులైన శబరి, ప్రాణహిత, ఇంద్రావతి, మంజీరాల నుంచి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టుల నుంచి మిగులు ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ మొత్తం గేట్లను పైకి ఎత్తేశారు.

దీంతో, 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి చేరుతోంది. ఇక, భద్రాచలం వద్ద ప్రవాహం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ఉండడంతో ధవళేశ్వరం వద్ద అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి ప్రవాహం చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి ఎగువన కాళేశ్వరం వద్ద 9.87 మీటర్లు, పేరూరు వద్ద 13.53 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 13.18 మీటర్లు, భద్రాచలం వద్ద 48.2 అడుగులు, కూనవరం వద్ద 16 మీటర్లు, కుంట వద్ద 8.56 మీటర్లు, కొయిదా వద్ద 20.3 మీటర్లు, పోలవరం వద్ద 12.39 మీటర్లుగా నీటిమట్టాలు నమోదయ్యాయి.

నిండు గర్భిణిలా శ్రీశైలం
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో శ్రీశైలం, సాగర్ గేట్లను ఎత్తి లక్షలాది క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠస్థాయిలో 885 అడుగులకు చేరుకుంది. జలాశయ నీటిమట్టం ఆనకట్ట కంఠాన్ని తాకింది.

ఉద్ధృత ప్రవాహంతో శ్రీశైలానికి చేరుతున్న కృష్ణమ్మను డ్యాం వద్ద ఒడిసిపట్టే శక్తి లేక.. 3 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహకంలోని జూరాల నుంచి 90,716 క్యూసెక్కులు, రోజా నుంచి 45,156 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.

దీంతో జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 263.6345 టీఎంసీలుగా నమోదైంది. ఆ సమయానికి, మూడు క్రస్ట్‌గేట్లను 12 అడుగుల మేర ఎత్తి.. స్పిల్‌వే ద్వారా 96,090 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాల్లో పది జనరేటర్లను రన్ చేస్తూ 52,798 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఐదు వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం కుడి ప్రధాన కాల్వకు వదులుతున్నారు. కాగా, గడచిన 24 గంటల్లో కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాల్లో 33.867 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అందించారు. ఇందుకు జలాశయం నుంచి 70,955 క్యూసెక్కుల నీటిని వినియోగించారు.

భారీగా లీకవుతున్న క్రస్ట్‌గేట్లు
శ్రీశైలం డ్యాం వద్ద 5, 6 నెంబర్ క్రస్ట్‌గేట్లు భారీగా లీకవుతున్నాయి. వరద ఉద్ధృత ప్రవాహానికి గేట్లకు అమర్చిన రబ్బర్ సీల్స్ విఫలమవడంతో మూసి ఉంచిన గేట్ల ద్వారా నీరు వృథాగా ప్రవహిస్తోంది. నీటిమట్టం తగ్గుముఖం పట్టి గేట్లన్నీ మూసివేసినా లీకేజీ మాత్రం అదుపు చేయడం సాధ్యం కాదు.

సాగర్ గేట్ల నుంచి కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు వస్తున్న 1,54,763 క్యూసెక్కుల నీరు నేరుగా సాగర్‌కు చేరుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో ఉన్న మొత్తం నీటిమట్టం 390.60 టీఎంసీలు. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ఆదివారం సాయంత్రానికి ఇది 585 అడుగులకు చేరుకుంది. 22 క్రస్ట్‌గేట్ల ద్వారా 1,64,252 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అలాగే, కుడి కాలువకు 9 వేలు, ఎడమ కాలువకు 10 వేలు, వరద కాలువ ద్వారా 540, మెయిన్ పవర్ హౌస్‌కు 33,251 క్యూసెక్కుల నీటిని పంపుతున్నారు. మొత్తంమీద 2,17,663 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ నుంచి బయటకు విడుదలవుతోంది. ఆ నీరు రెండు రోజుల తర్వాత ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం ఉంది.

జల ప్రకాశం: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పోటెత్తుతోంది. సాగర్ నుంచి శనివారం విడుదల చేసిన 1.37 లక్షల క్యూసెక్కుల నీరు సోమవారం ఉదయం 11 గంటల తర్వాత బ్యారేజీకి రానుంది. దీంతో బ్యారేజీ వద్ద ఉన్న నీటితోపాటు స్థానికంగా వాగులు, వంకలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని అధికారులు సముద్రంలోకి పంపిస్తున్నారు.

ముందు జాగ్రత్తగా బ్యారేజీ నీటిమట్టాన్ని క్రమేణా తగ్గిస్తున్నారు. ఆదివారం ఉదయం 11 అడుగుల నీటిమట్టం ఉండగా, సాయంత్రానికి అది 10.5 అడుగులకు చేరింది. ఉదయం 49 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయగా, సాయంత్రం 70 గేట్లను ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌తోపాటు మున్నేరు, కీసర నుంచి సుమారు రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు బ్యారేజీకి రానుంది. దీనివల్ల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే నీటిపారుదలశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇరిగేషన్, రెవెన్యూ, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. కృష్ణా, బుడమేరు వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు చేపట్టారు.

ప్రాజెక్టులు.. నీటి మట్టాలు
తుంగభద్ర డ్యామ్
(1632.70 అడుగులు)
నిల్వ : 103.15 టీఎంసీలు
ఔట్‌ఫ్లో : 28,220 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో : 31,675 క్యూసెక్కులు
సుంకేసుల డ్యామ్ (789.20 అడుగులు)
నిల్వ : 0.378 టీఎంసీలు
ఔట్‌ఫ్లో : 50,012 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో : 48,000 క్యూసెక్కులు

శ్రీశైలం డ్యామ్ (884.90 అడుగులు)
నిల్వ : 262.20 టీఎంసీలు
ఔట్‌ఫ్లో : 2,46,000 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో : 2,19,344 క్యూసెక్కులు

No comments: