Tuesday, September 28, 2010

మావో కొడుకు కావటమే దురదృష్టం!

"చైనా విముక్తి పోరాటంలో ఆరుగురు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న మావోకు తన సొంత బిడ్డలంటే చాలా ప్రేమ ఉండేది. కాని వారితో చాలా కఠినంగా ఉండేవాడు. మావో పెద్దకొడుకు మావో అనియింగ్ ( పెద్ద భార్య యాంగ్ కాహ కొడుకు) సోవియట్ యూనియన్‌లో చదువుకొని చైనాకు తిరిగి వచ్చాడు. మావో అతనిని షాన్‌క్సి-గన్‌న్సూ-నింక్సియా సరిహద్దులలోకి - వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవటానికి పంపాడు...

(అనియింగ్ తనకు నచ్చిన అమ్మాయినిపెళ్లి చేసుకోవటానికి రెండు సార్లు ప్రయత్నించాడు. తొలి ప్రయత్నం విఫలమయింది. రెండో ప్రయత్నంగా- సికి అనే యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని ఆమెకు పదహారేళ్లు మాత్రమే ఉండటంతో మావో ఒప్పుకోలేదు. దీనితో అనియింగ్‌కు చాలా కోపం వచ్చింది. ఆ నేపథ్యంలో జరిగిన ఒక సంఘటన) నాలాంటి బాడీగార్డ్స్‌తో కలిసి మావో అయినింగ్ సీ మెస్‌లో ఉండేవాడు. అయినింగ్‌ను బి మెస్‌లోకి మార్చటానికి అధికారులు ప్రయత్నించారు. కాని ఛైర్మన్ (మావో) ఒప్పుకోలేదు. "నీ చెల్లి(లీ నీ)- చిన్నప్పటి నుంచి సీ మెస్‌లోనే ఉంది. నువ్వు తన కన్నా పెద్ద.

నువ్వు ఏ మెస్‌లో ఉండాలో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు..'' అని అయినింగ్‌తో మావో అన్నాడు. ఒక రోజు మేమందరం కింద కూర్చుని భోజనం చేస్తున్నాం. ఒక కోడిని పుంజు వెంటాడుతోంది. దాని వల్ల దుమ్ములేస్తోంది. వాటిని చూసి- "కోడి పెట్టకు కూడా పుంజు కావాలి. నేను మనిషిని. నాకు ఇరవై ఏడేళ్లు వచ్చేసాయి. అయినా ఇంకా వేచి ఉండాల్సి వస్తోంది'' అని గట్టిగా గొణిగాడు. నాకు అప్పటికి 21 ఏళ్లు. నాకు పెళ్లి అయింది. అయినింగ్‌కు కాలేదు. నాకు ఇబ్బందిగా అనిపించింది. "కొద్ది కాలం ఓపిక పట్టు. ఛైర్మన్ మావో మంచి మూడ్‌లో ఉన్నప్పడు వెళ్లి పెళ్లిమాట చెప్పు. ఒప్పుకుంటాడు'' అని సలహా ఇచ్చాను.

నేను సలహా ఇచ్చిన కొన్ని రోజులకు- తూర్పు చైనాలో ఏడు శత్రు సైనిక బ్రిగేడ్లను మా సేనలు మట్టుపెట్టాయనే వార్తలు వచ్చాయి. మావో చాలా ఆనందంగా ఉన్నాడు. మావో ఆనందంగా ఉన్నప్పుడు బీజింగ్ ఒపేరా పాటలను గట్టిగా పాడేవాడు. ఆ రోజు కూడా గట్టిగా బీజింగ్ ఒపేరా పాటలను పాడుతున్నాడు. "ఛైర్మన్ పాటలు పాడుతున్నాడు. వెళ్లి నీ పెళ్లి విషయం చెప్పు. ఈ సారి ఒప్పుకుంటాడు'' అని అయినింగ్‌కు మళ్లీ సలహా ఇచ్చా. అయినింగ్ తండ్రి ఆఫీసుకు వెళ్లాడు. "నాన్నా! నేను రేపు పెళ్లి చేసుకుంటున్నా'' అని చెప్పాడు.

మావో తలెత్తి- "నిన్ను కొద్ది కాలం ఆగమన్నాను కదా'' అన్నాడు. "ఈ విషయం నా అంతట నేను నిర్ణయించుకోవాల్సింది అనుకుంటా!'' అని అయినింగ్ కొంత వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. "ఎవరిని పెళ్లి చేసుకోవాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు. కాని ఏ వయస్సులో పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకొనే అధికారం మాత్రం నీకు లేదు..మన దగ్గర ఉన్న నిబంధనలు మాత్రమే నిర్ణయిస్తాయి'' అని మావో స్వరం పెంచాడు. " నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు..'' అన్నాడు అయినింగ్. "కాని నువ్వు మావో జెడాంగ్ కొడుకువి.. నువ్వే పట్టించుకోపోతే- ఇంకెవ్వరు నిబంధనలను పట్టించుకుంటారు?'' అని మావో గట్టిగా అరిచాడు. చేతిలో ఉన్న బ్రష్‌ను విసిరేశాడు. అయినింగ్ విసవిస నడుచుకుంటూ రూమ్ బయటకు వెళ్లిపోయాడు. మావో కోపంతో ఊగిపోయాడు. "ఒక మంచి రోజంతా పాడైపోయింది..'' అన్నాడు.

(సైనికాధికారులు ఎంత చెబుతున్నా వినకుండా- కొరియా యుద్ధానికి మావో తన కొడుకును కూడా పంపాడు. ఆ యుద్ధంలో అయినింగ్ మరణించాడు..) అయినింగ్ మరణించినట్లు పెంగ్ దెహాయ్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మరణవార్తను వెంటనే మావోకు చెప్పలేదు. కొద్ది సేపు దాచిపెట్టారు. ఆ తర్వాత చౌన్ ఎన్ లై, జిలాంగ్ మావో దగ్గరకు వెళ్లారు. అప్పటికి రాత్రి అయింది. మావో ఈజీ ఛైర్‌లో కూర్చుని ఉన్నాడు. అయినింగ్ మరణవార్త విన్న వెంటనే షాక్ తిన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చౌన్ ఎన్ లై, జిలాంగ్‌ల కేసి చూస్తూ ఉండిపోయాడు. వారిద్దరు తలలు వంచుకొని నేల వైపు చూస్తున్నారు.

వారిద్దరికి కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు. మావో నెమ్మదిగా కళ్లు తిప్పాడు. దగ్గరలో ఉన్న టీ టేబుల్ మీద ఉన్న సిగరెట్లను తీసుకోవటానికి చేయి చాపాడు. సిగరెట్టు పెట్టెను తీసుకున్నాడు. దానిలో నుంచి ఒక సిగరెట్టును తీసుకోవటానికి ప్రయత్నించాడు. మావో చేతులు వణుకుతున్నాయి. పెట్టెలో నుంచి సిగరెట్టును తీసుకోలేకపోయాడు. నేను వెళ్లి మావోకు సిగరెట్టు నోట్లో పెట్టి ముట్టించాను. మొత్తం గదంతా నిశ్శబ్దంగా ఉంది. మావో సిగరెట్టు పొగను పీలుస్తున్న చప్పుడు తప్ప మరే శబ్దం వినిపించటం లేదు. మావో కళ్లు ఎర్రగా అయ్యాయి. దుఖఃం చేత కావచ్చు. సిగరెట్టు పొగ చేత కావచ్చు. అయినింగ్ జ్ఞాపకాల వల్ల కూడా కావచ్చు. జిలాంగ్ శబ్దం చేయకుండా గది బయటకు వెళ్లిపోయాడు. మావో మరో సిగరెట్టు తీసుకొని కాల్చటం మొదలుపెట్టాడు. గదంతా ఇంకా నిశ్శబ్దమే ఆవరించి ఉంది.. ఒక్క సారి గట్టిగా - "అతను మావో జెడాంగ్ కొడుకు. అదే అతని దురదృష్టం..'' అన్నాడు. నేను కళ్లు తిప్పుకున్నాను. ఒక్కసారి ఏడుపు పొంగి వచ్చేసింది.

(మావోకు లీ మిన్, లీ నీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరితో కూడా మావో కుమారులతోలాగే కఠినంగానే వ్యవహరించేవాడు. అయితే లీ నీ అంటే మావోకు ప్రత్యేకాభిమానం ఉండేది. లీ నీ మావో ఇంటికి దూరంగా ఉన్న ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉండేది. విశ్వవిద్యాలయంలో ఆమెకు కూడా మిగిలిన విద్యార్థుల మాదిరిగానే రేషన్ ఉండేది. ఒక రోజు ఆమె మావో ఇంటికి వచ్చింది)

లీ నీ బెడ్‌రూమ్ లోపలికి వచ్చి తండ్రికి తన చదువు గురించి చెబుతోంది. ఆ తర్వాత విశ్వవిద్యాలయంలో తిండి గురించి ఫిర్యాదు చేయటం మొదలుపెట్టింది. "నాకు కావాల్సినన్ని రేషన్లు ఎప్పుడూ దొరకవు. ఏ రోజూ నేను క్లాసుకు పూర్తిగా తిని వెళ్లలేదు'' అంది. "ఈ ఇబ్బందులు ఎక్కువ కాలం ఉండవు. దేశంలో మిగిలిన వారి మాదిరిగానే నువ్వూ తినాలి. మిగిలిన వారికి నువ్వు ఒక ఉదాహరణ కావాలి. కమ్యూనిస్టు పార్టీ మీద విశ్వాసం కోల్పోవద్దని నువ్వు వారికి చెప్పగలగాలి...'' అన్నాడు మావో. ఇంతలో ఇన్ జిన్‌షాన్ వచ్చి భోజనం రెడీ అయిందని చెప్పాడు. "దా.. నాతో పాటు వచ్చి భోజనం చేయి'' అని లీ నీని మావో చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత- లీ నీ అక్కడ గిన్నెలో పొగలు గక్కుతున్న అన్నం వైపు చూసింది.

"ఎంత మంచి వాసనొస్తోందో!'' అని గట్టిగా అంది. మావో భార్య అయిన, లీనీ తల్లి జియాంగ్ క్వింగ్ కూతురి వైపు చూసింది. ఏదో అనాలనుకుని ఆగిపోయింది. లీ నీ ముందున్న బౌల్‌లో అన్నాన్ని పెట్టింది. "భోజనం మొదలుపెట్టు..'' అన్నాడు మావో. లీ నీ గబగబ అన్నాన్ని నోటిలో కుక్కుకోవటం మొదలుపెట్టింది. అన్నం వేడిగా ఉండటం వల్ల నోరు కాలిపోయి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. "నెమ్మదిగా తిను. కంగారు లేదు'' అన్నాడు మావో. ఇదంతా ఒక బాడీగార్డు చూస్తూనే ఉన్నాడు. "మేము స్కూల్లో చాలా త్వరగా తింటాం. అదే అలవాటు అయిపోయింది'' అంది లీనీ ఆ బాడీగార్డుతో. "కాని ఇప్పుడు నువ్వు ఇంట్లో భోజనం చేస్తున్నావు...'' అన్నాడు మావో నవ్వుతూ. ఆయన మాటల్లో విషాదం ధ్వనించింది. "నువ్వు ఎంత తినగలిగితే అంత తిను..'' అంది క్వింగ్ లీ నీతో తల్లితండ్రులిద్దరినీ పట్టించుకొనే పరిస్థితిలో లేదు లీనీ.

ఆకలిగొన్న తోడేలులా.. అన్నాన్ని నమిలి మింగాలనే సృహ లేకుండా మింగేస్తోంది. మావో మౌనంగా ఆమెనే చూస్తున్నాడు. క్వింగ్ కూడా కుమార్తె వైపు, భర్త వైపు మార్చి మార్చి చూస్తోంది. లీ నీ తినే వేగం తగ్గింది. " అరే.. నువ్వు తినటం ఆపావేం?'' అని తండ్రిని ప్రశ్నించింది లీనీ. "నేను ముసలివాడిని అయిపోయాను. అందువల్లే ఎక్కువ తినలేకపోతున్నాను. నాకు కూడా నీ వయస్సు ఉంటే బావుండేది'' అన్నాడు మావో. టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్‌ను తీసుకొని చదవటం మొదలుపెట్టాడు. క్వింగ్ లేచి నిలబడి తాను తింటున్న బౌల్‌లో ఉన్న అన్నాన్ని కూడా లీనీ బౌల్‌లో వేసేసింది. ఏడుస్తూ డైనింగ్ రూమ్ వదిలి వెళ్లిపోయింది.

No comments: