కృష్ణా జిల్లా విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎ.కొండూరు మండలంలో కంభంపాడు అనే గిరిజన తండా మాది. తల్లిదండ్రులు చిట్టిపోతుల నాగయ్య, ముత్తమ్మలు. పండుగలప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో కొర్రన్నం తినేవాళ్లం. పూట గడవాలంటే కూలికి వెళ్లాలి. ఉన్న కాస్తోకూస్తో పొలంలో పండినవే తిండిగింజలు. ఇలాంటి కుటుంబంలో పుట్టిన నాకు చదువుకునే భాగ్యం పదకొండేళ్ల వయస్సులో కలిగింది.
అమ్మ చేర్పించింది..
విస్సన్నపేటకు చెందిన కోటేశ్వరరావు అనే విద్యార్థి రోజూ మా ఇంటిదగ్గరికి స్నానానికి వచ్చేవాడు. ఒకరోజు వాణ్ణి చూసి 'ఒరే నువ్వు కూడా ఎలాగైనా చదువుకోవాలి..' అంటూ అమ్మ గట్టిగా చెప్పింది. వెంటనే తీసికెళ్లి బళ్లో ఒకటో తరగతిలో చేర్చింది. తర్వాతి సంవత్సరం 2, 3, 4 తరగతులు ఒకేసారి పూర్తి చేశాను. మా ఊర్లోనే ఉన్న మూర్తి మాస్టారు ట్యూషన్ చెప్పి, నన్ను బాగా ప్రోత్సహించారు.
ఆరో తరగతికి వచ్చేలోగా తోటి విద్యార్థులతో సమానంగా చదివేవాణ్ణి. ఏడోతరగతిలో పబ్లిక్ పరీక్షరాసి జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచాను. గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకోవడం గొప్ప అనుభవం. అప్పటికే నా చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు. వాళ్లను చూసి నాలో పట్టుదల పెరిగింది. పదోతరగతి అయ్యాక ఇంటర్‌కు ఏపీ రెసిడెన్షియల్‌లో సీటు సంపాదించాలనుకున్నాను. రిజల్టు అలాగే వచ్చింది. పులిగడ్డ ఏపీ రెసిడెన్షియల్‌లో ఇంటర్‌లో చేరి 83 శాతం మార్కులతో పాసయ్యాను.
ఆంధ్రాయూనివర్శిటీలో ఎంటెక్ పూర్తిచేసేసరికి, మా అమ్మానాన్న నా కోసం 25 పశువుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. మాకున్న ఒకేఒక్క ఆధారం పశువులే. నా చదువుకు అవసరమైనప్పుడల్లా కొన్ని పశువులను అమ్మేసి నాకు డబ్బులు పంపించేవారు. నా కష్టానికి ఫలితం అన్నట్లు పాండిచ్చేరిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సైంటిస్టుగా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఏడాదిపాటు చేశాను.
పనికొచ్చే పరిశోధనతో...
ఉద్యోగం ఏదైనా సమాజం కోసం పనికొచ్చే పరిశోధన చేయాలన్న లక్ష్యం రోజురోజుకూ బలపడింది. అదే సమయంలో కాకినాడలోని జెఎన్‌టియులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. పీహెచ్‌డీ చేసే సమయంలోనే 'హ్యూమన్ ఫేస్ రికగ్నైజేషన్' సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశా. యూనివర్శిటీలో చేరాక అదే కొనసాగించాను. ఒక వ్యక్తి లక్షమందిలో ఉన్నా గుర్తుపట్టే సాఫ్ట్‌వేర్ అది.
చిన్న ఫోటో ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్‌తో సులువుగా, నిమిషాల్లో గుర్తుపట్టవచ్చు. డీఆర్‌డీవో సైంటిస్టుల సహాయం తీసుకొని దీన్ని రూపొందించాను. ఈ సాఫ్ట్‌వేర్ సామాజిక భద్రతకు పనికొస్తుంది. నేరస్తులను పట్టుకొనేందుకు తోడ్పడుతుంది. వాయిస్ రికగ్నైజేషన్, స్పీచ్ రికగ్నైజేషన్ కూడా దీనికి జోడిస్తున్నాం. ఇప్పటికే పోలీసులు ఈ సాఫ్ట్‌వేర్‌ను వారికి ఇవ్వమని అడిగారు. పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తాం.
ప్రస్తుతం నాకు సహాయపడిన డీఆర్‌డీవో సైంటిస్టులు నా దగ్గరే పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇప్పుడు కాకినాడ జెఎన్‌టియులోనే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా పనిచేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు 35 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారు. 'పదకొండేళ్ల వయసులో బడికి వెళ్లి ఏం సాధించగలనని..' భావించి ఉంటే ఇప్పటికీ పశువులకాపరిగానే అడవులు పట్టుకు తిరుగుతుండేవాణ్ణి.
- వై.రమేష్‌బాబు
No comments:
Post a Comment