Thursday, December 30, 2010

మద్యం ముచ్చట్లు

ఆల్కహాల్ ప్రియులకి మన దేశంలో లభ్యమయ్యేవి విస్కీ, బ్రాందీ, జిన్, రమ్, బీర్‌లు మాత్రమే. కాని ఇవేకాక వివిధ దేశాల్లో ఇతర రకాల మద్యాలు కూడా తయారుచేస్తున్నారు. అవి మన దేశంలో సామాన్యులకి లభ్యంకావడం లేదు.
1. సాకీ- జపాన్
జపనీస్ భాషలో ‘నిహోంఘా’గా పిలిచే సాకీలో 17% ఆల్కహాల్ ఉంది. ఏడో శతాబ్దంలో క్యోటో నగరంలోని ఇంపీరియల్ పేలస్‌లో దీన్ని మొదటిసారిగా తయారుచేసారు. బియ్యంతో చేసే సాకీ పారదర్శకంగా ఉండే ద్రవం. దీంట్లో అనేక వెరైటీలున్నాయి. జపాన్‌లోని 1600 బ్రూవరీలలో సాకీ తయారవుతుంది.

2. గిన్నిస్-ఐర్లండ్
డబ్లిన్‌లో కనిపెట్టబడ్డ గిన్నిస్‌ని వేయించిన బార్లీని మాల్ట్‌చేసి, దానికి హాప్స్, నీరుని కలిపి తయారుచేస్తారు. ఈ ద్రవం నల్లగా ఉంటుంది. ఎందుకంటే, కాఫీగింజల్లా వేయించిన బార్లీ నల్లగా ఉంటుంది కాబట్టి. దీని నురగ మాత్రం తెల్లగా ఉంటుంది. ఇది బీర్ తరగతికి చెందింది.
3. బీర్- బెల్జియం

బెల్జియంలో 450 రకాల బీర్లని, వాటిని తాగేందుకు అన్ని రకాల గ్లాసులని తయారుచేస్తారు. నెపోలియన్ ఫ్రాన్స్‌ని పాలించే రోజుల్లో అక్కడినుంచి బెల్జియంకి పారిపోయి వచ్చిన క్రైస్తవ సన్యాసులు ఇక్కడ బీర్‌ని తయారుచేసేవారు. లేత బంగారు రంగులో, నురగలో ఉండే ఈ బీర్‌లో కొత్తిమీర లాంటి మూలికలు కూడా వేస్తూంటారు. గ్లాసునిబట్టి ఏ రకం బీర్‌ని తాగుతున్నారో గ్రహించవచ్చు.
4. ఆబ్సింతే- చెక్ రిపబ్లిక్
పందొమ్మిదో శతాబ్దంలో యూరప్ దేశాల్లో నిషేధించిన ఆబ్సింతే అనే ఆల్కహాల్, చెక్ రిపబ్లిక్‌లో తయారుచేస్తారు. నిషేధానికి కారణం దీంట్లో ఆల్కహాల్ శాతం 45% నుంచి 74%దాకా ఉంటుంది. మూలికల, ఆకులు, పువ్వులతో వాటి రుచి వచ్చేలా తయారుచేసే ఆబ్సింతే, ఆకుపచ్చ రంగులోకాని, రంగు లేకుండా కాని ఉంటుంది.
5. బర్గండీ వైన్- ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లోని బేర్‌గోగ్నే అనే ప్రాంతంలో పండే ద్రాక్షతో తయారుచేసే ఈ వైన్ రుచి ప్రపంచంలో మరి ఇంకే వైన్‌కీ రాదు. సున్నపు రాతి నేలలో గుర్తించిన ప్రాంతంలోనే పండే ద్రాక్షపళ్ళతో చేసిన వైన్‌నే బర్గండీ వైన్ అంటారు. ఈ ప్రాంతంలోని ద్రాక్ష తోటలన్నీ తొలుత చర్చి ఆధీనంలో ఉండేవి. ఇక్కడ రెడ్ బర్గండి, లైట్ బర్గండి అనే రెండు రకాల వైన్‌లు తయారవుతాయి.
6. బెచెరోకో- చెక్ రిపబ్లిక్
36% ఆల్కహాల్ గల బెచెరోకాని తయారుచేసే పద్ధతి ప్రపంచంలో కేవలం ఇద్దరికే తెలుసు. దీన్ని బ్రూవరీలోకి వచ్చి వారిద్దరే దీన్ని వర్కర్స్ సహాయంతో తయారుచేస్తారు. అనేక రకాల మూలికలని, మసాలా దినుసులని ఓ చిన్న గోదాంలో ఉంచి ఆల్కహాల్‌తో వారంపాటు దాన్ని నాననిస్తారు. ఆ ఆల్కహాల్‌కి నీరు, చక్కెర కలిపి ఓక్ బేరల్స్‌లో రెండు నెలలు నిలువ ఉంచుతారు.
7. కైపి రోస్కా- బ్రెజిల్
ఓడ్కా, నిమ్మ రసం, చక్కెర కలిపి చేసే ఇది నిజానికి ఓ కాక్‌టెయిల్. బ్రెజిల్ దేశంలోని అన్ని బార్లలో క్లబ్‌లలో దీన్ని సర్వ్ చేస్తారు. ఇటీవలే ఇది ప్రపంచానికి తెలిసి, మిగిలినచోట్ల కూడా లభ్యం అవుతోంది.
8. జార్జి డికెల్ టెనె్నట్ విస్కీ- అమెరికా
1870లో జార్జి డికెల్ తను చేసే విస్కీ, స్కాచ్ విస్కీని పోలి ఉందని, విస్కీ స్పెల్లింగ్‌లోని ‘ఇ’ని తీసేసి దానికి కాపీరైట్ తీసుకున్నాడు. బార్లీ, రై, కార్న్‌లతో రెండుసార్లు డిస్టిల్ చేసి, వైట్ ఓక్ బేరల్స్‌లో పనె్నండేళ్ళు పాతరేసిన ఈ విస్కీకూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఐతే ఇది అన్ని దేశాల్లో లభ్యంకాదు.
9. టెకూలా- మెక్సికో
మెక్సికోలోని టెకూలా ప్రాంతంలోని ‘బ్లూఅజేవ్’ అనే మొక్కని ఫెర్మెంట్ చేసి చేసే టెకూలా పారదర్శకంగా ఉండే లిక్కర్. ఓక్ కాస్క్‌లో పాతరేసిన దీంట్లో ఆల్కహాల్ శాతం ఎక్కువ (38-40%) మెక్సికో చట్టం ప్రకారం ఎర్రటి అగ్నిపర్వత బూడిదగల భూమిలో పండే బ్లూఅజేవ్ నుంచే దీన్ని తయారుచేయాలి. ఇతర దేశాల్లో దీన్ని తయారుచేయకుండా మెక్సికో దీనికి ఇంటర్నేషనల్ కాపీ రైట్స్‌ని తీసుకుంది. పదహారో శతాబ్దంలో కనిపెట్టబడ్డ దీంట్లో అయిదారు రకాలున్నాయి.
10. ఓడ్కా- పోలెండ్
బంగాళాదుంపలు, లేదా రైస్టార్చ్‌తో తయారుచేసే ఈ లిక్కర్ తాగితే పెద్దగా హేంగోవర్ ఉండదు. 16వ శతాబ్దంనుంచి దీన్ని పోలెండ్‌లో తయారుచేస్తున్నారు. ప్రతీ బాటిల్‌లో ఓ రకం గడ్డిపోచని ఉంచి బాటిల్ చేయడం ఆనవాయితీ.

ashlesha


No comments: