Thursday, December 9, 2010

34 మిలియన్ ఫ్రెండ్స్

దీనికి ప్రత్యక్ష నిదర్శనం జేన్ రాబర్ట్స్, లూయిస్ అబ్రహాం. జేన్ రాబర్ట్స్ పుట్టింది పెరిగింది కాలిఫోర్నియాలో. రెడ్‌ల్యాండ్స్ అనే ప్రాంతంలోని ఒక స్కూల్లో ఫ్రెంచ్ ఉపాధ్యాయురాలు. అందరికీ మంచి చేయాలనే ఆలోచన తప్పితే- ఉద్యమాల పట్ల అంత ఆసక్తి లేదు. అలాగని తన చుట్టూ జరిగే అన్యాయాలు, అక్రమాలను ఎదిరించాలనే భావన పట్ల విముఖత కూడ లేదు. పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దాలనే కోరికే ఆమెను ఉపాధ్యాయవృత్తిని ఎంచుకొనేలా చేసింది. ఆ కోరికే ఆమెను రిటైరయ్యే దాకా అదే ఉద్యోగంలో కొనసాగేలా చేసింది.

లూయిస్ అబ్రహాం ఒక మామూలు మధ్యతరగతి మహిళ. కుటుంబమే సర్వస్వం, ఇంటి పనే దైవం అనుకొనే వ్యక్తి. కాని అవసరమైనప్పుడు ఎంతకైనా తెగించి పోరాడడం ఆమె నైజం.

జేన్‌కు ఒక రోజు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసిన ప్రకటన కనబడింది. పత్రికలకు అది చాలా అప్రధాన వార్త. చాలా మంది పాఠకులకూ అది అప్రధాన వార్తే. "యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్‌కు అమెరికా ప్రభుత్వం 3.4 కోట్ల డాలర్ల నిధులను సమకూరుస్తానని గతంలో ప్రకటించింది. అయితే ఈ సంస్థ పనితీరును గమనించిన తర్వాత.. మారిన ప్రాధమ్యాల నేపధ్యంలో- ఈ నిధులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం..'' అనేది ఆ ప్రకటన సారాంశం. ఉదయాన్నే చాలామంది లాగానే జేన్ కూడా ఆ వార్త చదివింది. ఈ నిధులు ఇవ్వకపోతే అమెరికా ప్రభుత్వంపై ఎవరూ ఒత్తిడి పెట్టరు.

ప్రపంచ దేశాల నేతలెవరూ పట్టించుకోరు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించరు. కాలమిస్ట్‌లు కూడా తమ వ్యాసాల్లో ఈ విషయానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి నిర్ణయాలు ఎవరికి పట్టవు. కాని అమెరికా ఇచ్చే ఆ మూడు కోట్ల డాలర్లు- అఫ్గానిస్థాన్, అంగోలా, దక్షిణాఫ్రికా, ఇథియోపియా- ఇలా అనేక వర్థమాన దేశాల్లో ఉన్న మహిళల జీవితాల్లో మార్పు తెస్తాయి.

అంగోలాలో ఉన్న ఒక పల్లెటూరులోని ఆసుపత్రికి కొత్త ఇన్‌క్యుబేటర్ రావచ్చు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో గర్భిణిలకు పౌష్టికాహారం అందొచ్చు. ఈ భావన జేన్‌లో కొత్త ఆలోచనలను రేపింది. కాని ఏం చేయాలి? పదవీ విరమణ చేసిన ఒక సాధారణ ఉపాధ్యాయురాలు ఏం చేయగలుగుతుంది? ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని ఎలా మార్చగలుగుతుంది? జేన్‌కు రెండు మూడు రోజులు ఆలోచనలు తెగలేదు. కాని ఏదో చేయాలనే భావన మాత్రం పోవటం లేదు.

చివరకు తనలాంటి వారిని కలుపుకొని పోవాలని నిర్ణయించింది. తొలి అడుగుగా- తన అభిప్రాయాలను అందరితోను పంచుకోవటం మొదలుపెట్టింది. దీనికి సాధనం మీడియా. స్థానిక పత్రికయిన శాన్ బెన్‌నార్డినో సన్‌కు ఒక ఉత్తరం రాసింది.. "ప్రతి ఏడాది ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ఎంతమంది మరణిస్తారో.. అంత కన్నా ఎక్కువ మంది మహిళలు కాన్పులలో మరణిస్తున్నారు. సరైన వైద్య పరికరాలు లేక అంత కన్నా ఎక్కువ మంది దుర్భరమైన బాధను అనుభవిస్తున్నారు.

కిలుము పట్టిన కత్తులతో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. మన ప్రజాస్వామ్యంలో ఒక తప్పు జరిగింది. దానిని సరిచేయాలి. దాని కోసం ఒకో డాలర్ చొప్పున యుఎన్ఎఫ్‌పీఏకి పంపుదాం. 3.4 కోట్ల మంది ఒకో డాలర్ చొప్పున విరాళం ఇస్తే - 3.4 కోట్ల డాలర్లు సమకూరుతాయి..జరిగిన తప్పుకు ప్రాయశ్చితం జరుగుతుంది'' అనేది ఆ ఉత్తర సారాంశం.

జేన్ ఉత్తరం యూఎన్ఎఫ్‌పీఏ అధికారుల దృష్టికి వచ్చింది కాని దానిని వారు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కాని సరిగ్గా అదే సమయంలో న్యూమెక్సికోకు చెందిన లూయిస్ అబ్రహాం కూడా ఈ వార్తను చదివింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలపై బుష్ నిర్ణయం చూపే ప్రభావం ఆమెకు అర్థమయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలా చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచించింది. లూయిస్ కూడా జేన్ మాదిరిగా విరాళాలు సేకరించటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని భావించింది. దీని కోసం ఒక మెయిల్‌ను తయారుచేసి తన స్నేహితులందరికి పంపింది.

"మహిళలకు ఆరోగ్య సేవలు అందించాలనేది మానవతా దృష్టితో తీసుకోవాల్సిన నిర్ణయం. అది రాజకీయ నిర్ణయం కాదు... అందుకే దయచేసి మీరందరూ ఒక కాగితాన్ని తీసుకొని- దానిలో ఒక డాలర్ పెట్టి చుట్టండి. ఒక కవర్ మీద "34మిలియన్ ఫ్రెండ్స్..'' అని రాసి వెంటనే యూఎన్ఎఫ్‌పీఏకు పంపించండి.

మరో ముఖ్యమైన విషయం- ఈ మెయిల్‌ను కనీసం పది మందికి పంపండి.. ఎంత మందికి పంపగలిగితే అంత మంచిది'' అనేది ఆ ఉత్తర సారాంశం.
మొదటి వారం కొన్ని ఉత్తరాలు వచ్చాయి. రెండో వారానికి అవి మరింతగా పెరిగాయి. మొదట యూఎన్ఎఫ్‌పీఏ సిబ్బంది-తమ ఖాళీ సమయంలో ఉత్తరాలను విప్పి- వాటిలో ఉన్న డాలర్ నోట్లను జాగ్రత్త చేసేవారు. మూడో వారానికి పెద్ద పెద్ద మూటల నిండా ఉత్తరాలు రావటం మొదలుపెట్టాయి. మగవారు కూడా విరాళాలు పంపటం మొదలుపెట్టారు. కొందరు ఐదుడాలర్లు, మరి కొందరు పది డాలర్లు- ఇలా విరాళాల సంఖ్య పెరగటం మొదలుపెట్టింది. కొందరు ఉత్తరాలు కూడా రాసేవారు.

"ఈ ఐదు డాలర్లు నా జీవితాన్ని సుసంపన్నం చేసిన మహిళలు: మా అమ్మ, నా భార్య, నా ఇద్దరు కూతుళ్లు, నా మనమరాలు-లకు గుర్తుగా పంపుతున్నా'' అని ఒకాయన విరాళం పంపుతూ రాశాడు. ఇవన్నీ చూశాక యూఎన్ఎఫ్‌పీఏ లూయిస్, జేన్‌ల ఉద్యమ ప్రాధాన్యాన్ని గుర్తించింది. వారిద్దరిని ఒకరికొకరిని పరిచయం చేసింది. వారిద్దరూ కలిసి - 34 మిలియన్ ఫ్రెండ్స్. ఒఆర్‌జిని స్థాపించారు. వివిధ దేశాలు తిరిగి ఉద్యమ ప్రాధాన్యం గురించి చెప్పటం మొదలుపెట్టారు.

"ఒక డాలర్ ఇవ్వలేనని ఎవరూ అనలేరు. కాలేజీ విద్యార్థులు కూడా విరాళం ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. సోడాకి పెట్టే ఖర్చుతో ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక మహిళ జీవితం బాగుపడుతుందంటే అంత కన్నా ఏం కావాలి?'' అంటుంది జేన్. అయితే ఒబామా అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత 2009లో- యుఎన్ఎఫ్‌పీఏకు(బుష్ ఆపిన) 34 మిలియన్ డాలర్ల నిధులూ సమకూరుస్తామని ప్రకటించాడు. కాని అప్పటికే జేన్, లూయిస్‌ల ఉద్యమ ఫలితంగా నాలుగు మిలియన్ డాలర్లు సమకూరాయి.

అమెరికా ప్రభుత్వం ఇస్తానని ప్రకటించింది కాబట్టి- ఇక 34 మిలియన్ డాలర్ ఫ్రెండ్స్ అవసరం లేదా? అనే విషయమైతీవ్రమైన చర్చ జరిగింది. అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధులను అదనపు విరాళాలుగా భావించి వాటిని కూడా మహిళా ఆరోగ్య కార్యక్రమాలకు ఖర్చు చేయాలని లూయిస్, జేన్ నిర్ణయించారు. ఇప్పటికీ 34 మిలియన్ ఫ్రెండ్స్ కొనసాగుతూనే ఉంది.

అనేక వేల మంది విరాళాలు ఇస్తూనే ఉన్నారు. వాటి ద్వారా కొన్ని వేల మందికి సాయం అందుతోంది. ప్రతి మంచి పనికి ఎవరో ఒకరు ఇలా పూనుకుంటే ఎంత బాగుండు! 
(హాఫ్ ద స్కై.. హౌ టు చేంజ్ ద వరల్డ్ ఆధారంగా)

No comments: