Sunday, December 5, 2010

నల్లమలకు '' వజ్రపుకోత ''


diamond
వజ్రానికున్న విలువ మనిషి సృష్టించిందే. ఏది అరుదైపోతుందో దాని మూల్యం అమూల్యమైపోతుంది. విశ్వవ్యాప్తంగా వజ్రాలు విరివిగా దొరుకుతున్నా ఒక దండగమారి సంస్థ కృతిమ పరిస్థితిని కల్పించి వజ్రాల వ్యాపారంలో యావత్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. అందమైన వజ్రాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది. వజ్రాన్ని కబ్జా చేసుకున్న ఆ ఒకేఒక్క సంస్థ ఇప్పుడు మన దేశంలో, అందులోనూ మన నల్లమల అటవీ ప్రాంతాన్ని కబళించే దుశ్చర్యకు పాల్పడుతోంది. చెంచులను వారి అటవీ సంపదకు దూరం చేసే కుతంత్రం పన్నుతోంది. నల్లమలవాసులు, ఉద్యమకారులు కూడా ఈ దురాక్రమణను వజ్రసంకల్పంతో ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వజ్రాల వర్తకం, నల్లమలలో పరిణాలపై కథనం...

diamondring
నల్లమల అడవుల్లోకి వెళ్ళితే... పచ్చటి చెట్లు కానవస్తాయి. కొండలూ, కోనలూ కన్పిస్తాయి. అడవి తల్లికి దండాలు... మా తల్లి అడవికి దండాలు అనే పాటలు విన్పిస్తాయి. అంతలోనే డి బీర్స్‌ రాబందు రెక్కల చప్పుడూ వినిపిస్తుంది. నల్లమల అడవుల భూగర్భంలో దాగిన వజ్రాలను పసిగట్టేందుకు ఆ డేగ తన వాడిచూపులతో ప్రయత్నిస్తోంది. తన చూపులకు అడ్డు వస్తున్నాయన్న మిషతో గిరిజనులను ఎత్తుకెళ్ళి మరోచోట పడేయా లని, వారి ఆవాసాలను నేలమట్టం చేయాలని ప్రయత్నిస్తోంది. అది అన్వేషించదల్చిన వజ్రాలు నిజంగా అంత అమూల్యమైనవా... యావత్‌ భూగోళంలో ఎన్నో చోట్ల అపారంగా లభించే ఆ రాళ్ళ కు నిజంగా అది చెప్పేటంత విలువ ఉందా? ఆ విలువ అంతా కృత్రిమంగా సృష్టించిందేనా... డి బీర్స్‌ అంతర్ధానమైతే, ఆ ప్రభా వం యావత్‌ ప్రపంచ డీలర్లపై పడితే... ఆ ‘విలువైన’ వజ్రాలన్నీ ఒట్టి రంగురాళ్ళుగా మిగిలిపోతాయా? వజ్రాల కుబేరులు బికా రులైపోతారా? అప్పటి వరకూ రూ.లక్షలు ‘విలువ’ చేసిన వజ్రాలు కాస్తా రూ. వేల ధరలకు పడిపోతాయా? ఏ వస్తువైనా అపా రంగా లభిస్తే దానికి అంతగా విలువ ఉండదు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యమే. ఇలా అపారంగా లభించే వస్తువులకు సైతం కృత్రిమంగా కొరత సృష్టిస్తే వాటి ధర పెరగడం ఖాయం. నల్లబజారు వర్తకులు చేసేదంతా ఇలాంటి మాయనే. వజ్రాల విష యంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోంది.

యావత్‌ ప్రపంచంలోనూ వజ్రాల వ్యాపారాన్ని అత్యధిక స్థాయిలో (సుమారు 40 శాతం దాకా) డి బీర్స్‌ సంస్థ నియంత్రిస్తోంది. భారీ మొత్తా ల్లో వజ్రాలను ఇది తన వద్ద నిల్వ చేసుకొని మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తూ అధిక రేట్లను వజ్రాలను విక్ర యిస్తూ సొమ్ము చేసుకుం టోంది. మార్కెట్లో దీనికి పోటీ లేకపోవడంతో ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. రేపటి నాడు ఈ సంస్థ ఏ సందర్భంలోనై నా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే, తన వద్ద ఉన్న వజ్రాల నిల్వలను అయిన కాడికి అమ్మేసుకుంటుంది.

diamond-thum-b
అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వజ్రాల మార్కెట్‌ కుప్పకూలడం ఖాయం. వజ్రాల విలువ ఊహించలేనంతగా పడిపోతుంది. ఈ ప్రభావం డిబీర్స్‌ సంస్థకు మాత్రమే పరిమితం కాదు. ఇటీవలి ఆర్థిక మాంద్యం అమెరికాలో పుట్టి ప్రపంచ వ్యాప్తం అయినట్లుగా క్రమక్రమంగా ఒక్కో వజ్రాల సంస్థపై, ఆ తరువాత వజ్రాలు కలిగి ఉన్న వారిపై దీని దుష్ర్పభావం పడుతుంది. అప్పటి వరకూ రూ. లక్షలు ఖరీదు చేసిన వజ్రాలు రేటు రూ. వేలల్లోకి పడిపోతుంది. అలాంటి వజ్రాలను అధిక రేట్లకు వేలంవెర్రిగా కొనడంలో ఔచిత్యాన్ని పక్కకు బెడితే, అలాంటి రాళ్ళ కోసం ప్రజల ప్రాణాలను, ఆస్తులను, సంస్కృతిని, అన్నింటికీ మించి ప్రకృతిని పణంగా పెట్టడం ఎంత వరకు న్యాయం అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. వజ్రాల అన్వేషణకు రాష్ట్రప్రభుత్వం లక్షలాది ఎకరాలను డీ బీర్స్‌ సంస్థకు కట్టబెట్టిం ది. ఇందులో అటవీ భూములు కూడా ఉన్నాయి. ఆయా అటవీ ప్రాంతాల్లో అంతరించిపోతున్న జాతులకు చెందిన పక్షు లు, జంతువులు, మొక్కలు ఉన్నాయి. వీటని పరిరక్షించుకోవడం మన బాధ్యత కాదా... ‘విలు వైన’ రాళ్ళ కోసం అంత కన్నా విలువైన ప్రాణాలను, ప్రకృతి ని నాశనం చేసుకుందామా?

వజ్రాలు ‘వెల’ లేనివని, అమూల్యమైనవనీ డి బీర్స్‌ ప్రచారం చేస్తోంది. నిజంగానే ఆ వజ్రాలు వెల లేనివి, మూల్యం లేనివనీ ఆ సంస్థ కార్యకలాపాలను వ్యతిరేకించే వారు విమర్శిస్తుంటారు. ఎన్నో దేశాల జాతకాలను తారుమారు చేసిన ఘనత డి బీర్స్‌కు ఉంది. తన మాట వినని దేశాలను తన కాళ్ళపై పడేసుకున్న ఘనత ఆ సంస్థది. అంతటి పటిష్ఠమైన మార్కె టింగ్‌ వ్యవస్థ దానికి ఉంది. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే మన వజ్రాల పరిశ్రమను దానికి ధారాదత్తం చేసినట్లే. డి బీర్స్‌ను వ్యతిరేకించడమంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమే. స్వదేశీ భావనను సమర్థించడమే. పర్యా వరణాన్ని పరిరక్షించడమే. అడవులను సంరక్షించుకోవడమే. భూమిపుత్రుల ఆచారవ్యవహారాలను గౌరవించడమే. అడవితల్లిని కాపాడుకోవడమే.

డి బీర్స్‌ సంస్థ పుట్టుపూర్వోత్తరాలను ఒక సారి పరిశీలిస్తే...
diamond1
వజ్రం అనేది కొత్తగా పుట్టుకొచ్చిన వస్తువేమీ కాదు. లక్షల ఏళ్ళ నుంచీ వజ్రాలు భూమిలో ఉంటూనే వచ్చాయి. వేల ఏళ్ళ నుంచీ మానవజాతికి వ జ్రాల గురించి తెలుసు. దానికి ఉన్నదల్లా విలాసవస్తువుగా వెల మాత్రమే. స్ర్తీ, పురుషులు వజ్రాలను కోరుకునేది వాటి వల్ల లభించే ఉపయోగాల కోసం కాదు... వాటిపై ఉన్న కోరికతో మాత్రమే. ఆ కోరికను రెచ్చగొట్టి వజ్రాలను అధి క ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది డి బీర్స్‌. నిజానికి వాటికి ప్రకృతిలో కొరత లేదు. వాటిని గనుక పారిశ్రా మిక ఉత్పత్తి కి, వినియో గానికి అను మతిస్తే వాటి ధర రెండు నుంచి 30 డాలర్లకు మించదనే వారూ ఉన్నారు. అలాంటి వజ్రాలు నేడు వంద నుంచి వెయ్యి డాలర్లకూ విక్రయమవుతున్నాయి. వివిధ దేశాల ప్రజానీకంలో ఉన్న సెంటి మెంట్‌ను ఆధారంగా చేసు కుని వజ్రాల వర్తకులు వాటిని అత్య ధిక ధరలకు విక్రయిస్తున్నారు.

diamond2
డీ బీర్స్‌ సంస్థను సెసిల్‌ రోడ్స్‌ 1870లో స్థాపించారు. ఆ సంస్థ నేడు యావత్‌ ప్రపంచంలో వజ్రాల వ్యాపారాన్ని నియంత్రించే స్థాయికి ఎది గింది. అందుకు అనుగుణంగా తన కొనుగోళ్ళు, అమ్మకాల వ్యవస్థను రూపొందించుకుంది. ఓ శతాబ్దం పాటు అది మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలిగింది. క్రమంగా మార్కెట్లోకి వజ్రాల వ్యాపారులు అధికం కావడంతో ఒక నాటి ప్రాభవాన్ని అది కోల్పోయింది. పూర్వ వైభవాన్ని సాధించుకునే క్రమంలో అది నేడు భారత్‌ లాంటి వర్ధమాన దేశాల్లో తన కార్యకలాపాలను అధికం చేసింది. శతాబ్దాల తరబడిగా భారత్‌, బ్రెజిల్‌ రెండు దేశాలు మాత్రమే వజ్రాలను ఉత్పత్తి చేసేవి. 19వ శతాబ్ది మధ్యకాలం నాటి వరకు కూడా వజ్రాలకు తీవ్ర కొరత ఉండేది. చక్రవర్తులు, రాజులు, అపర కుబేరులు, సంపన్నుల వద్ద మాత్రమే వజ్రాలు ఉండేవి. సాధారణ ప్రజానీకానికి వజ్రాలను అందుబాటు లోకి తెచ్చే యోచనే అప్పట్లో ఊహకు అందేది కాదు. 1867లో దక్షిణాఫ్రికా లో తొలిసారిగా వజ్రాలను కనుగొన్నారు. నాటి నుంచి వజ్రాల సరఫరా అధికం కావడం ఆరంభమైంది. వీటి సరఫరా ఎంత పెరిగి నా నేటికీ వజ్రాలను ఎంతో అమూల్యమైనవిగా భావించడం విశేషం.

ChenchuHunter_Nallamala
1871లో దక్షిణాఫ్రికాలోని కోలెస్‌బర్గ్‌ కోప్జె (ఇప్పుడు కింబెర్లే) లో 83.5 క్యారట్‌ డైమండ్‌ బయటపడడంతో గోల్డ్ష్‌ తరహాలో డైమరడ్‌ రష్‌ ఆరంభమైంది. నాటి నుంచీ వజ్రాల వేటలో ఎంతో మంది ఆ దేశం వైపు పరు గులు తీయడం ఆరంభించారు. వజ్రాలు లభించే ప్రాం తం తక్కువగా ఉండడం, మౌలిక వసతుల కోసం భారీగా పెట్టుబడి పెట్టాల్సి రావడంతో ఆయా వ్యక్తులంతా సామూ హికంగా సహకరించుకోవడం ఆరంభించారు. వారి మధ్య ఎన్నో తలెత్తే వివాదాలను పరిష్కరించుకునేందుకు డిగ్గర్స్‌ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. క్రమంగా భారీ స్థాయిలో వజ్రాల వెలికితీత కోసం ఇతరులతో కలసి సంస్థలను నెలకొల్పా రు. ఆ చిన్న చిన్న సంస్థలన్నీ విలీనాలు, స్వాధీనాల ప్రక్రియలో పెద్ద సంస్థలుగా పుట్టుకొచ్చాయి. డీ బీర్స్‌ వ్యవస్థాపకుడు సెసిల్‌ రోడ్స్‌ మొదట్లో పంపింగ్‌ ఉపకరణాలను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేపట్టారు. వజ్రాలకు భారీ మార్కెట్‌ ఉందన్న విషయాన్ని అతి త్వరలోనే గ్రహించి 1880 నాటికి ఓ పెద్ద సంస్థను ఏర్పరచగలిగే స్థాయికి చేరుకున్నాడు. రాత్‌షిల్డ్‌ కుటుంబం నుంచి నిధులు పొంది వ్యాపారాన్ని విస్తరించాడు.

chenchu_family
1888 నాటికి ఆ కంపెనీ దక్షిణాఫ్రికాలోని వజ్రాల గనులన్నింటి పై కూడా ఆధిపత్యం సాధించగలిగింది. ది డైమండ్‌ సిండికేట్‌ పేరిట ఆయన వజ్రాల పంపిణీ వ్యవస్థపై పట్టు సాధించగలిగాడు. బార్నే బర్నాటో, సిసెల్‌ రోడ్స్‌ కంపెనీల విలీనంతో డి బీర్స్‌ కన్సాలిడే టెడ్‌ మైన్స్‌ సంస్థ రూపుదిద్దుకుంది. అప్పటికి దక్షిణాఫ్రికాలోని అన్ని వజ్రాల గనులు దాని ఆధీనంలోనే ఉన్నాయి. 1889లో సిసెల్‌ లండన్‌కు చెందిన డైమండ్‌ సిండికేట్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా మార్కెట్‌ నియంత్రణకు ఆనాడే బీజం పడింది. రెండో బోయర్‌ యుద్ధం ఈ కంపెనీకి ఓ సవాల్‌గా పరిణమించింది. యుద్ధం ఆరంభం కాగానే సిసెల్‌కు చెందిన విలువైన గనులు శత్రువుల ఆధీనంలో ఉండి పోయాయి. సిసెల్‌ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంతో తన గనుల విముక్తిని కోరాడు. వ్యూహాత్మక యుద్ధ లక్ష్యాల కంటే కూడా గనుల విముక్తికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా కోరాడు. మిలటరీ పెద్దగా సహకరించనప్పటికీ, సిసెల్‌ సైన్యానికి అండగా నిలిచాడు. తన ఫ్యాక్టరీల్లో సైన్యానికి అవసరమైన ఆయుధసంపత్తిని తయారు చేయించి అందించాడు. 1902లో తొలిసారి గా కులినన్‌ గనిని కనుగొన్నారు. దాని యజ మాని డి బీర్స్‌తో చేతులు కలిపేందుకు నిరాకరించాడు. స్వతంత్ర డీలర్లకు తన వజ్రాలు విక్రయించడం ఆరం భించాడు.

తద్వారా డి బీర్స్‌ మార్కెట్‌ ఆధి పత్యానికి తొలిసారిగా గండి పడింది. కొత్త సంస్థ ఉత్పత్తి డి బీర్స్‌ ఉత్పత్తికి సమానం కావడం తో పాటుగా రెండో అతి పెద్ద సంస్థగా అది ఎదిగింది. అప్పటికి శక్తివంతంగా ఉండిన లండన్‌ సిండికేట్‌కు లోకల్‌ ఏజెంట్‌గా ఎర్నెస్ట్‌ ఒపెన్‌హెమర్‌ నియుక్తులయ్యారు. పదేళ్ళ లో ఆయన కింబెర్లేకు మేయర్‌గా కూడా అయ్యా రు. డి బీర్స్‌ విజయసూత్రాన్ని ఆయన బాగా ఒంటపట్టిం చుకున్నారు. అది ఆయన మాట ల్లోనే... ‘‘వజ్రాలకు విలువ పెంచాలంటే వాటికి కొరత సృష్టిం చాలి... అంటే ఉత్పత్తి తగ్గించాలి’’. చివర కు మొదటి ప్రపంచ యుద్ధసమయం నాటి కి కులినన్‌ గని డి బీర్స్‌ చేతికి చిక్కింది. 1902లో రోడ్స్‌ మరణించారు. అప్పటికి డి బీర్స్‌ యావత్‌ ప్రపంచ వజ్రాల వ్యాపా రంలో 90 శాతాన్ని నియంత్రించే స్థాయికి చేరుకుంది.
అనంతర కాలంలో డీ బీర్స్‌ కంపెనీ బాధ్య తలను హారీ ఒపెన్‌హెమర్‌ చేపట్టారు.

diamond_ear_clip-2
సంస్థ మార్కెటింగ్‌ విధానమైన సెంట్రల్‌ సెల్లింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఓ) విధానాన్ని మరింత ప కడ్బందీగా అమలు చేయడం ఆరంభించాడు. డి బీర్స్‌కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి డి బీర్స్‌ సొంత గనులతో సహా వజ్రాల ఉత్పత్తి దారులందరి నుంచి వజ్రాలను కొంటుంది. వజ్రాల మొత్తం సరఫరాలో కనీసం సగ భాగం డి బీర్స్‌ సొంత గనుల నుంచే అని ఓ అంచనా. ప్రతీ సంవత్సరం కూడా డి బీర్స్‌ ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వజ్రాలను ఏ రేటుకు విక్రయించాలో నిర్ణయించుకుం టుంది. అందుకు తగ్గట్లుగా మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టిస్తుంది. ప్రతీ వజ్రాల ఉత్పత్తిదారుకు కూడా మొత్తం ఉత్పత్తిలో కనీసం ఇంత శాతాన్ని కచ్చితంగా తాము కొంటామని డి బీర్స్‌ గ్యారంటీ ఇస్తుంది. మార్కెటింగ్‌ ఫీజు కింద తిరిగి వారి వద్ద నుంచి 10 నుంచి 20 శాతాన్ని వసూలు చేస్తుంది.

DeBeers_HeadOffice
ఈ సెంట్రల్‌ సెల్లింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఓ) అనేది యావత్‌ పరిశ్రమకూ క్లియ రింగ్‌ హౌజ్‌లా పని చేస్తుంది. మార్కెట్‌ లో లభ్యం కావాల్సిన వజ్రాల పరిమాణాన్ని, రేట్లను ఇది నిర్దేశిస్తుంది. ఒకప్పుడు 80 శాతం వరకు ప్రపంచ వాణిజ్య వ్యాపా రాన్ని ఈ సీఎస్‌ఓ నియంత్రించేది. ఇప్పుడి ది 65 నుంచి 75 శాతం దాకా ఉండవ చ్చునని భావిస్తున్నారు. సీఎస్‌ఓ నుంచి వజ్రాలు కొనే డీలర్లు తిరిగి వాటిని తమ తమ ప్రాంతాల్లో విక్రయించు కుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా వజ్రాల ధరలు ఎన్నటికీ తగ్గకుండా చూస్తూ వచ్చింది డి బీర్స్‌. ఇటు వజ్రాల ఉత్పత్తిదారులకు, అటు విక్రేతలకూ అందరికీ ఇది ఎంతో లాభదాయకంగా ఉండింది. ఎన్నో వర్ధమాన దేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు సైతం డీ బీర్స్‌తో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకునేవి. తద్వారా వాటికి నిలకడతో కూడిన విదేశీ మారక ద్రవ్యం లభించేది. హెచ్చు ధరల భారం అంతా కూడా కొనుగోలుదారులపైనే పడేది. ఏ డైమండ్‌ ఈజ్‌ ఫర్‌ ఎవర్‌ అనే వాణిజ్య నినాదం 1947 లో రూపుదిద్దుకుంది. ప్రేమకు, అంకితభావా నికి ప్రతీక వజ్రం అనే రీతిలో కంపెనీ ప్రకటనలు ఉంటాయి.

గుత్తాధిపత్యానికి అడ్డంకులు...
DeBeers-VenetiaPlant-SA
1970 ప్రాంతంలో డి బీర్స్‌ గుత్తాధిపత్యానికి ముప్పు ఎదురైంది. అప్పట్లో ఇజ్రాయెల్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉండింది. ద్రవ్యోల్బ ణాన్ని తట్టుకునే మార్గంగా వజ్రాలను ఎంపిక చేసుకోవడం ఆరంభమైంది. తక్కువ వడ్డీకి రుణాలు పొందేందుకు వజ్రాలు మార్గాన్ని సుగమం చేసేవి. వ్యాపారులు కూడా తదనం తర కాలంలో మరింత లాభాన్ని పొందవచ్చనే ఉద్దేశంతో వజ్రా లను భారీగా నిల్వ చేసుకోవ డం ఆరంభించారు. దీంతో మార్కెట్లో వజ్రాల కు కృత్రిమ కొరత ఏర్పడింది. వజ్రాల ధరలు బాగా పెరిగాయి. దీంతో డి బీర్స్‌ లాభాలు కూడా మరింత వృద్ధి చెందాయి. అప్పటి వరకూ వజ్రాలను ‘ఫర్‌ ఎవర్‌’గా భావించేవా రు. ఒకసారి ఓ వజ్రాన్ని కొన్నవారు తిరిగి దాన్ని విక్రయించే వారు కాదు. ఎప్పుడైతే వజ్రాలను పెట్టుబడి మార్గంగా చూడడం మొదలుపెట్టారో అప్పుడు వజ్రాల మారువిక్ర యాలు కూడా మొదలయ్యాయి. దాంతో మార్కెట్లో ఓ నిర్దిష్ట సమయంలో ఎన్ని వజ్రా లు ఎంత రేటుకు విక్రయించాలి అనే అంశం డి బీర్స్‌ చేతిలో లేకుండా పోయింది. కొంత మంది వజ్రాల మదుపరులు గనుక కూడబ లుక్కుని వజ్రాలను మార్కెట్లో విక్రయించడం మొదలుపెడితే వజ్రాల ధర తగ్గిపోయే ప్రమా దం ఏర్పడింది.
nallamala-forest
అది వజ్రం అత్యంత విలువైన దనే భావాన్ని ప్రజలకు దూరం చేసే అవకా శం ఏర్పడింది. రకరకాల మార్గాల ద్వారా ఈ తరహా విక్రయాలను అదుపు చేసేందుకు డి బీర్స్‌ ప్రయత్నించింది. సీఎస్‌ఓ ద్వారా విక్ర యించే వజ్రాలపై సర్‌ఛార్జ్‌ విధించింది. మార్కెట్‌ పరిస్థితులను బట్టి, ఈ సర్‌ఛార్జ్‌ను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఉప సంహరించేది కూడా. ఇదంతా కూడా స్పెక్యులేటివ్‌ వ్యాపారాన్ని తగ్గించేందుకే. అప్ప ట్లో ఇజ్రాయెల్‌లో ఏ వ్యాపారి అయినా కూడా సర్‌చార్జ్‌ ఉన్న సమయంలో వజ్రాలను కొని, విక్రయిద్దామనుకునే సమయానికి డి బీర్స్‌ సర్‌ఛార్జ్‌ ఎత్తివేసేది. ఫలితంగా ఆ వజ్రాల విక్రేత నష్టపోక తప్పదు. ఈ విధంగా డి బీర్స్‌ మార్కెట్‌ను నియంత్రించడం చేసేది. పలు సందర్భాల్లో డి బీర్స్‌ ప్రతినిధులు వివిధ వజ్రా ల వ్యాపారుల వద్దకు వెళ్ళి తమ ఆదేశాలు పాటించకపోతే, వారికి సరఫరా చేసే వజ్రాల్లో కోత విధిస్తామని హెచ్చరించేవారు. ఆ విధం గా ఇజ్రాయెల్‌ డీలర్లను డి బీర్స్‌ తిరిగి తన గుప్పిట్లోకి తీసుకోగలిగింది. 1984 దాకా ఇదే పరిస్థితి కొనసాగింది.

తల వంచక తప్పని జైరే...
డి బీర్స్‌ సీఎస్‌ఓ నిబంధనలు తమకు అను కూలంగా లేవని భావించిన జైరే దేశం సొంతంగా మార్కెటింగ్‌ చేసుకుందామని భావించింది. తమ నుంచి 20 శాతం మొత్తా న్ని హ్యాండ్లింగ్‌ ఛార్జీలుగా వసూలు చేయడా న్ని అది నిరసించింది. సొంతంగానే వ్యాపా రం ఆరంభించింది. దీంతో డి బీర్స్‌ తన వద్ద ఉన్న భారీ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసింది. జైరే అంత తక్కువ రేటుకు వజ్రాల ను విక్రయించలేకపోయింది. చివరకు డి బీర్స్‌ను తిరిగి ఆశ్రయించాల్సి వచ్చింది. దాంతో మునపటి కన్నా కఠిన నిబంధనలతో డి బీర్స్‌ దాన్ని సీఎస్‌ఓలో చేర్చుకుంది. తనను ఎదిరిస్తే ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఈ సందర్భంగా డి బీర్స్‌ యావత్‌ ప్రపంచానికి చాటి చెప్పింది.

రష్యాలో...
Narayana-visited-Nallamala
1957 ప్రాంతంలో సైబీరి యాలో భారీఎత్తున వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందేమోన ని భావించిన డి బీర్స్‌ సోవి యట్‌ ప్రభుత్వంతో ఒప్పందా నికి తహతహలాడింది. సీఎస్‌ఓ ద్వారా సోవియట్‌ వజ్రాలను మార్కెటింగ్‌ చేస్తా మని తెలిపింది. రెండింటి మధ్యా ఒప్పం దం కుదిరింది. అప్పట్లో సోవియట్‌ వజ్రాల ఉత్పత్తి యావత్‌ ప్రపంచ ఉత్పత్తిలో 20 నుంచి 30 శాతం దాకా ఉన్నట్లు అంచనా. సైబీరియాలో ఉత్పత్తి అయ్యే వజ్రాల్లో 95 శాతం మేర తాను కొనుగోలు చేస్తానని డి బీర్స్‌ గ్యారంటీ ఇచ్చింది. అప్పట్లో ఈ బేరం కుదుర్చుకునేందుకు గాను సాధారణ కొను గోలు రేటు కంటే 10 శాతం అధిక మొత్తాన్నే డి బీర్స్‌ ఆఫర్‌ చేసినట్లుగా చెబుతారు. 1980 దాకా కూడా సోవియట్‌ దేశం డి బీర్స్‌ ఒప్పం దంతో తృప్తి చెందింది. డి బీర్స్‌ ద్వారా కాకుం డా నేరుగా తానే వజ్రాలను మార్కెట్‌లో విక్ర యిస్తే భారీ లాభాలను గడించ వచ్చునని సోవి యట్‌ గుర్తించింది.

దాంతో యూరప్‌ మార్కె ట్లోకి ఒక్కసారిగా సోవియట్‌ వజ్రాలు వరద లా వచ్చిపడ్డాయి. ఫలితంగా అక్కడ రేట్లు పడిపోయాయి. అప్పటి వరకూ డి బీర్స్‌ మార్కెట్‌ మంత్రాంగంపై ధీమాతో ఉన్న వ్యాపారులు సందిగ్ధంలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో సోవియట్‌ తిరిగి డి బీర్స్‌ పంచ న చేరింది. నిలకడతో కూడిన విదేశీ మారక ద్రవ్యం కోసమే సోవియట్‌ అలా చేసిందని చెబుతారు. అప్పట్లో సోవియట్‌ నుంచి నేరు గా వజ్రాలు కొన్న డీలర్లు మాత్రం తమ తప్పి దాలకు డి బీర్స్‌ విధించిన శిక్షలను అనుభవిం చాల్సి వచ్చింది. తనను వదిలివెళ్తే ఏం జరుగు తుందో డీలర్లకు అనుభవంలోకి వచ్చేలా చేసింది డి బీర్స్‌.

స్టాక్‌మార్కెట్ల పతనంతో...
diamond3
1987 ప్రాంతంలో స్టాక్‌ మార్కెట్లు పతనం కావడంతో కాగితపు పెట్టుబడుల కన్నా కూడా కంటికి కన్పించే వాటిపై పెట్టుబడి పెట్టడంలో మదుపరులు ఆసక్తి కనబర్చారు. ఎప్పటిలా ఇది డి బీర్స్‌కు కలవరం కలిగించే అంశమే. పెట్టుబడి దృష్టితో వజ్రాలను కొన్నవారు వాటి ని ఎప్పుడు విక్రయిస్తారో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు డి బీర్స్‌ మార్కెట్‌ను నియం త్రించే స్థితిలో ఉండదు. ఈ పరిస్థితిని కూడా డి బీర్స్‌ సొమ్ము చేసుకుంది. ఓ వైపున విక్ర యాలు పెంచుకుంటూనే ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం వజ్రాలు కొనడాన్ని నిరుత్సాహపరిచింది. జపాన్‌ వంటి కొత్త మార్కెట్లను వెదుక్కొంది. మగవారు సైతం వజ్రాభరణాలను ధరించేలా చేసింది. డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్‌ అంటూ ప్రచారం ఆరంభించింది.

ఆస్ట్రేలియా...
డి బీర్స్‌ సంస్థకు ఆస్ట్రేలియ రూపంలో మరో ప్రమాదం ఎదురైంది. అక్కడ కూడా భారీస్థా యిలో వజ్రాల నిక్షేపాలు బయట పడ్డాయి. కార్టెల్‌ (డి బీర్స్‌ వాణిజ్య విధానం) ద్వారా గాకుండా ఆస్ట్రేలియా నేరుగా వాటిని ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తే గుత్తాధిపత్యానికి గండి పడుతుంది. డి బీర్స్‌ విశ్వరూపాన్ని అప్పటికే చూసిన ఆర్గే డైమండ్‌ మైన్స్‌ సంస్థ రంగు రాళ్ళ రూపంలో ఈ వ్యాపారంలోకి ప్రవేశిం చింది.

ఈ సంస్థ కూడా తనకు లాభదాయకం గా ఉండే రీతిలో డి బీర్స్‌ కార్టెల్‌లో చేరింది. 1995 ప్రాంతంలో డి బీర్స్‌ ఆస్ట్రేలియా సంస్థ పై అణచివేత ధోరణి ప్రదర్శించింది. దాన్ని నుంచి కొనే మొత్తాన్ని 85 శాతానికి తగ్గిం చింది. దీంతో ఒప్పందాన్ని పునరుద్ధరించు కోబోమంటూ ఆర్గే డైమండ్స్‌ సంస్థ డి బీర్స్‌ను బెదిరించింది.
1996లో అది కార్టెల్‌ ఉచ్చులోనుంచి బయ టపడింది. అప్పటి నుంచి కూడా భారత వజ్ర పరిశ్రమతో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. అది ఉత్పత్తి చేసే మొత్తంలో 95 శాతం భార త్‌ డైమండ్‌ కట్టింగ్‌ పరిశ్రమకు చేరుకుంటోం ది. దీంతో ఆర్గే పై డి బీర్స్‌ కక్ష సాధించడం మొదలుపెట్టింది. భారీ కుట్ర చేసింది. ఆర్గే ఉత్పత్తి చేసే రకం వజ్రాల ధర తగ్గడం ఆరం భమైంది. 1997లో ఆర్గే విక్రయాలు గణనీ యంగా పడిపోయాయి. కార్టెల్‌ నుంచి ఆస్ట్రేలి యా వైదొలిగినా తమకేమీ కాలేదంటూ డి బీర్స్‌ ప్రచారం చేసుకోవ డం ఆరంభించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆస్ట్రేలి యా సొంతంగా వ్యాపారం చేయడం ఆరంభించింది.

అంగోలా...
అంతర్యుద్ధం అనంతంర 1992 ప్రాంతంలో అంగోలా దేశం సైతం నాటి సోవియన్‌ యూ నియన్‌ తరహాలో విదేశీ మారక ద్రవ్యం కో సం డి బీర్స్‌తో ఒప్పందం చేసుకోక తప్పలే దు. అయినప్పటికీ అది డి బీర్స్‌తో సంబంధం లేకుండా ముడి వజ్రాల ఎగుమతులు భారీగా చేపట్టింది. ఈ దేశంపై మాత్రం డి బీర్స్‌ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకపోవడం విశేషం. అది తన మార్కెట్‌ను అంతగా ప్రభా వితం చేయకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు.


కెనడా...
1991 ప్రాంతంలో కెనడాలోని కోలా ప్రాం తంలో గణనీయ స్థాయిలో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. తన ఆధిపత్యానికి గండి ప డుతుందనే ఉద్దేశంతో డి బీర్స్‌ ఇక్కడ కూడా పాగా వేసింది. మరో రెండు సంస్థలు (ఆర్‌టీ జెడ్‌ కార్పోరేషన్‌), ఆస్ట్రేలియాకు చెందిన బ్రో కెన్‌ హిల్‌ ప్రొప్రయిటరీ (బీహెచ్‌ పీ) కూడా ఈ వజ్రాల వెలికి తీతలో పాలుపంచుకున్నా యి. తద్వారా పంపిణీ వ్యవస్థ తన చేజారిపో కుండా చూసుకుంది డి బీర్స్‌. బీహెచ్‌పీ సంస్థ ను కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయ త్నించింది డి బీర్స్‌. అమెరికాలోనూ బీహెచ్‌పీ సంస్థకు వ్యాపార ఆసక్తులున్నాయి. అమెరికా చట్టాలకు భయ పడి బీహెచ్‌పీ, డి బీర్స్‌ పంచన చేరేందుకు నిరాకరించింది. డి బీర్స్‌ అమెరికాలో ఎలాం టి కార్యకలాపాలు చేపట్టనందున అది అమెరి కా చట్టాలకు భయపడాల్సిన అవసరం లేకపోయింది.

సోవియట్‌ బాటలోనే రష్యా...
1990 ప్రాంతంలో రష్యాకు హార్డ్‌ కరెన్సీ అవసరం ఏర్పడింది. 1993లో రష్యా రుణం బజారున పడింది. తన వద్ద 200 మిలియన్‌ క్యారెట్ల విలువైన వజ్రాలు ఉన్నట్లు బయటపె ట్టింది. నిజానికి ఇంత భారీస్థాయి నిల్వలతో రష్యా, డి బీర్స్‌ తరహాలో సొంత మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. రకరకాల డిమాండ్లు చేసినప్పటికీ, తక్షణావసరాల నేపథ్యంలో రష్యా కూడా డి బీర్స్‌కు తలొగ్గక తప్పలేదు.

వజ్రం ఒకటే... ముఖాలెన్నో...
డి బీర్స్‌ ప్రధాన వ్యాపారం వ్రంతోనే. ఆ వజ్రానికి ఎన్నో ముఖాలు. అన్నీ అనుబంధ సంస్థలే. ఈ కంపెనీలన్నీ కూడా వజ్రాల వెలికి తీత, వజ్రాల వ్యాపారం, పారిశ్రామిక వజ్రాల తయారీ రంగాల్లో ఉన్నాయి. అన్ని విభాగాల్లో నూ దీనిదే అగ్రస్థానం. ఓపెన్‌ పిట్‌, భూగర్భం సముద్ర తీరం, సముద్ర గర్భం... ఇలా అన్నింటిలోనూ డి బీర్స్‌ అతి పెద్దది. బోట్స్‌ వానా, నమీబియా, దక్షిణాఫ్రికా, కెనడాలలో దీని కార్యకలాపాలు ప్రధానంగా సాగుతు న్నాయి. తాజాగా భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవులపై దృష్టి సారించింది.

అటవీ హక్కుల చట్టానికి తూట్లు...
వజ్రాల నిక్షేపాల అన్వేషణకు వీలుగా అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులను అడవి నుంచి బయటకు పంపేందుకు డి బీర్స్‌ సంస్థ కుట్ర పన్నుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2005లోనే అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చినా, దాన్ని ఉల్లంఘించి 2009లో డి బీర్స్‌ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిం దని అంటున్నారు. గత రెండే ళ్ళుగా ఇతర సంస్థల పేరిట డి బీర్స్‌ సంస్థ అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగ ర్‌ జిల్లా సోమశిల, మొలచింత పల్లి, పెద్దూటి పెంట తదితర ప్రాంతాల్లో ఈ విధమైన తవ్వకాలు జరుగుతున్నట్లుగా చెప్పారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం స్థానిక చెంచులకు తెలియ కుండా ఎక్కడా అడవుల్లో తవ్వకాలు చేపట్ట కూడదు. నల్లమల ప్రాంతంలో వజ్రాలు, యురేనియం తదితర నిక్షేపాల అన్వేషణ, వెలికితీతకు డి బీర్స్‌ను అనుమతించకూడదని కోరుతున్నారు. తెలుగుదేశంతో సహా వివిధ రాజకీయపక్షాలు, పలు ప్రజాసంఘాలు స్థానిక చెంచులకు అండగా నిలిచాయి. డి బీర్స్‌ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ఉద్యమిస్తున్నాయి.

నవంబర్‌ 19న మహబూబ్‌నగర్‌ జిల్లా లింగాల మండలంలో సీపీఐ నేత నారాయణ పర్యటించారు. డి బీర్స్‌ సంస్థ కార్యకలాపాలు అధికమైతే చెంచులకు అటవీ ఉత్పత్తులు సేకరించుకునే వీల్లేకుండా పోతుందని పేర్కొన్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వ హయాంలోనే అటవీ ప్రాంతాలను చెంచుల కు వదిలేశారని, ఇప్పుడు స్వరాజ్యం వచ్చిన తరువాత ఇలా చేయడం తగదని అన్నారు. అడవి తల్లిని చెంచులకు దూరం చేయడం తగదని సూచించారు. నవంబర్‌ 15న తెలం గాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత కూ డా నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించా రు. చెంచులను అడవి నుంచి తరలించవద్దని సూచించారు. ఖనిజ నిక్షేపాల సర్వే కోసం డి బీర్స్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం కూడా చెంచుల ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించింది. చెంచుల జీవించే హక్కును కాపాడాలని ఏపీసీఎల్‌సీ డిమాండ్‌ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనం ఝాన్సీ నవంబర్‌ 12న మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు.

కర్నూలు జిల్లా మొద లుకొని గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాలు, ఇతర ఖనిజాల అన్వేషణ కోసం డీ బీర్స్‌కు ధారాదత్తం చేయడాన్ని విమర్శించా రు. మొత్తం 6 వేల చ ెహక్టా ర్ల విస్తీర్ణంలో వజ్రాల అన్వేషణకుగాను డి బీర్స్‌కు అనుమతి ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. సర్వేకు అడ్డు గా ఉన్న చెంచులను అడవుల్లో నుంచి వెళ్ళ గొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమిం చాలని కోరారు. జీవో ఎం.ఎస్‌ నెం. 236 (16.11.2009), జీవో ఎం.ఎస్‌ నెం. 237 (12.11.2009), జీవో ఎంఎస్‌ నెం. 242 (24.11.2009) లతో రాష్ట్రప్రభుత్వం డి బీ ర్స్‌కు ప్రత్యేక అనుమతులను ఇచ్చిందన్నారు. టైగర్‌ జోన్‌ ప్రాజెక్టులో అనుమతించ కపోయి నా, రిజర్వు ఫారెస్టు పరిధిలో అనుమతి ఇ చ్చారని తెలిపారు. గత సంవత్సరం చెంచుల ను అడవుల్లోనుంచి చెంచులను బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేశారని, ప్రజల నిరసనలకు తలొగ్గి విరమించుకున్నారని పేర్కొన్నారు. డి బీర్స్‌ సంస్థ ఇప్పటికే దక్షిణా ఫ్రికా సంపదనంతా దోచుకుని ఇప్పుడు భారతదేశంపై పడిందని విమర్శించారు.
డి బీర్స్‌ ప్రొఫైల్‌
స్థాపితం : 1888
వ్యవస్థాపకుడు : సెసిల్‌ రోడ్స్‌
ప్రధాన కార్యాలయం : జోహాన్స్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా)
ఉనికి : ప్రపంచవ్యాప్తం
చైర్మన్‌ : నికీ ఒపెన్‌హెమర్‌
ఎండీ : గారెత్‌ పెన్నీ
ఉత్పత్తులు : వజ్రాలు
సేవలు : డైమండ్‌ మార్కెటింగ్‌, ప్రమోషన్‌
ఆదాయం : 6.8 బిలియన్‌ డాలర్లు (2009)
సిబ్బంది : 20,000

- వంశీ మోహన్‌ నర్ల

No comments: