Friday, December 24, 2010

అవును, ఇది ఒక పల్లెటూరు!

1960లో ఓ రోజు
వర్షం పడి ఆగింది. రోడ్లపై బురద. కిక్కిరిసిన ఎద్దుల బండి బురదలో కూరుకుపోయింది. బండి నడవదని అందరూ నడుచుకుంటూ పొలాలకు వెళ్లారు.

2010లో ఆ గ్రామం

వర్షం పడినా తడవటానికి మట్టి లేదు. ఎద్దుల బళ్లు లేవు. ప్రపంచంలో దొరికే అన్ని పెద్ద కంపెనీల ఖరీదైన కార్లు ఉన్నాయి.
ఇదీ చైనాలో అత్యంత ధనిక గ్రామం హువాక్సి కథ.

ధనిక గ్రామమంటే..
హువాక్సిలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉంటుంది. చాలామందికి సొంత విల్లా ఉంటుంది. ఇంటింటికీ కార్లు ఉంటాయి. అక్కడ చదువుకోని యువకుడు, పనిచేయని పెద్దవారు, అనాథలైన వృద్ధులు లేరు. బ్యాంకు అకౌంట్లలో లక్షలుంటాయి. చైనా స్టాక్ మార్కెట్లో నమోదైన ఆ ఊరి పరిశ్రమల ఉత్పత్తి విలువ ఏడాదికి అక్షరాలా మూడు వేల కోట్ల డాలర్లు.

ఎలా సాధ్యమైంది?

‘‘హువాక్సి పైనున్న ఆకాశం కమ్యూనిస్టు పార్టీదే. కిందనున్న నేల సామ్యవాదపు మట్టి. మాకిలాంటి ఆధునిక సామ్యవాదం కావాలి’’ ఇది ఆ ఊరి పాట.

గ్రామాన్ని తీర్చిదిద్దింది ప్రభుత్వమో, ఏ సంస్థో కాదు.. ఒకే ఒక వ్యక్తి. పేరు వు రెన్‌బావో. 50 ఏళ్లుగా ఆయన కమ్యూనిస్టు పార్టీ హువాక్సి శాఖ అధ్యక్షుడు. ‘అందరికీ పనిచేసే శక్తి ఉంది. మరి దీన్ని అత్యల్ప ఉత్పాదకతకు ఎందుకు వదిలేయాలి. ఇదే శక్తిని సమర్థంగా ఉపయోగిస్తే చరిత్రను, తలరాతను తిరగరాస్తాం’ అని మొదలుపెట్టాడు. అభివృద్ధికి గ్రామానికి మధ్య వారధిగా నిలిచాడు.


కుటీర పరిశ్రమలుగా మొదలైన పరిశ్రమలు ఊరిలో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే వరకు వెళ్లాయి. భారత్, బ్రెజిల్ నుంచి ఇనుపరజను, పత్తి దిగుమతి చేసుకుని వాటి నుంచి ఇనుము, ఉక్కు ఉత్పత్తులు, దుస్తులు తయారుచేస్తారు. 40 దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇప్పటికీ అక్కడ వారానికి ఏడురోజులు పనిచేస్తారు. ప్రత్యేకంగా సెలవులు ఉండవు కాని.. అవసరం ఉన్నపుడు సెలవు తీసుకోవడానికి ఏ అభ్యంతరం ఉండదు.


వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలు

వచ్చేది హువాక్సికి స్వర్ణోత్సవ ఏడాది. 24 గంటలూ నడిచే ఫైవ్‌స్టార్ హోటల్‌తో కూడిన అతిపెద్ద వాణిజ్య, నివాస భవంతిని నిర్మిస్తున్నారు. స్వర్ణోత్సవాలకు సూచికగా దీన్ని ప్రారంభిస్తారు. 74 అంతస్తుల ఈ భవనం ప్రపంచంలోనే 15వ అతిపెద్దది. ఊరి పౌరులందరికీ ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం ఉచితం. ప్రపంచంలో ఏ పెద్ద నగరంలో దొరికే సదుపాయాలైనా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
పర్యాటకం నుంచి భారీ ఆదాయం

70 వేల జనాభా ఉన్న హువాక్సికి పర్యాటకం నుంచి కూడా భారీ ఆదాయం వస్తుంది. ఇక్కడ చైనా గోడను పోలిన నమూనా గోడను సిద్ధం చేశారు. పల్లెటూరిని మరిచిపోని పచ్చదనం, ఆధునికతకు నిదర్శనంలా కనిపించే ఆకాశహర్య్మాలు, వైవిధ్యమైన కట్టడాలు, పెద్దపెద్ద పార్కులు, మెరిసే రోడ్లు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఏటా పర్యాటకుల సంఖ్య 20 లక్షలు. హువాక్సి పర్యాటక కమిటీ తాజాగా రెండు హెలికాప్టర్‌లను కొన్నది. ఎంచక్కా ఈ హెలికాప్టర్ ఎక్కి ఊరంతటినీ చూడొచ్చట. అంతేకాదు.. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, సిడ్నీ ఒపెరా హౌస్ చూడటానికి ఈ ఊరికి వెళ్తే చాలు... ఎందుకంటే వాటిని పోలిన కట్టడాలను త్వరలో ఇక్కడ నిర్మించనున్నారు.


‘కష్టే ఫలి’ అంటారు.. వీళ్లు మాత్రం ‘కష్టే కోట్లు’ అంటారు!


- ప్రకాష్ చిమ్మల

No comments: