మట్టిపై పుట్టి, మట్టిలో కలిసిపోయే మనుషులం మనం.
కానీ మనం అసలు మనుషులమే కాదని అంటున్నారు బోనీ బాస్లేర్!
‘‘ఇదేం మాట తల్లీ!’’ అని అడిగితే -‘‘ఉన్నమాటే’’ అంటున్నారావిడ!
కళ్లు, చెవులు, కాళ్లూ చేతులూ ఉన్నంత మాత్రాన మనుషులం అయిపోమనీ,
మనమంతా పురుగుల పుట్టలమనీ.... సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు బోనీ బాస్లేర్. ఈ చేదునిజాన్ని అంగీకరించడానికి మీరు సిద్ధమేనా? అయితే చదవండి.
ఒక వస్తువుకు మనం పేరు ఎలా పెడతాం? ఆ వస్తువు తయారైన పదార్థం ఆధారంగా లేదా దాంట్లో ఏమున్నాయి అన్న అంశంపై ఆధారపడి నామ్నీకరణ జరుగుతుంది. ఒక గ్రాము బంగారపు పూత ఉన్నంత మాత్రాన అలాంటి ఆభరణాలు రోల్డ్‌గోల్డ్ మాత్రమే అవుతాయి గానీ అచ్చు గోల్డ్ కాదన్నది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే ఉదాహరణను మనిషికి వర్తింపజేసి చూద్దాం. మన శరీరాల్లో ఏముంటాయి? అవయవాలు, రక్తం.. ఇంకొంచెం సూక్ష్మంగా, స్థూలంగా ఆలోచిస్తే కోటానుకోట్ల కణాలు. మరి ఈ కణాలతోనే మన దేహం మొత్తం నిండిపోయిందా? కానేకాదు అంటారు బోనీ బాస్లేర్. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ మైక్రోబయాలజిస్ట్ అయిన ఈ శాస్తవ్రేత్త ఒక వినూత్న వాదననను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. మన శరీరంలోని కణాలు, డిఎన్‌ఏల సంఖ్యతో పోలిస్తే పది నుంచి వందరెట్లు ఎక్కువగా సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా ఉంటుందన్నదే ఆ వాదన. (బ్యాక్టీరియం ఏకవచనం. బాక్టీరియా బహువచనం)
ఆశ్చర్యంగా ఉందా? బోనీ చెబుతున్నది అక్షరాలా నిజం. ‘‘మనిషి దేహంలో దాదాపు లక్ష కోట్ల కణాలుంటాయి. ఆ లక్ష కోట్ల కణాలు 10 లక్షల కోట్ల బ్యాక్టీరియాకు ఆవాసాలుగా మారిపోయాయి. మనలో దాదాపు 30 వేల జన్యువులు ఉంటే వాటిల్లో 100 రెట్లు అధికంగా బ్యాక్టీరియాకు ఆతిథ్యమిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి.. నాకు మీరు 1-10 శాతం మాత్రమే మనుషులుగా, 90-99 శాతం బ్యాక్టీరియాగా కనిపిస్తారనడం తప్పా?’’ అని ప్రశ్నిస్తారు బాస్లెర్! కేవలం 51 మంది చేతులను పరిశీలిస్తేనే 4,742 జాతుల బ్యాక్టీరియా ఉందని తేలినప్పుడు ఇక వాస్తవ సంఖ్యను అంచనావేయడం సాధ్యమవుతుందా? అని ఆమె చెబితే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు మరి. అంతేకాదు... ఈ బ్యాక్టీరియా శరీరంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తూ జీవక్రియలను కూడా నియంత్రిస్తూంటాయని, భాష లాంటిది కూడా అభివృద్ధి చేసుకున్నాయని ఆమె ఎనిమిదేళ్ల క్రితమే ప్రతిపాదించారు!
బ్యాక్టీరియా మాటలు
అసలు దేహంలో ఇంత పెద్దమొత్తంలో బ్యాక్టీరియా ఎలా పోగయిపోయిందబ్బా? అని ఆశ్చర్యం వేస్తోంది కదూ! జనాభాను పెంచుకునేందుకు బ్యాక్టీరియా పరస్పరం మాట్లాడుకుంటాయంటారు బాస్లెర్! అవి వివిధ వేర్వేరు వాతావరణాల్లో ఎలా మనుగడ సాగించగలవన్న కోణంలో ఆమె చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగుచూసింది. ప్రత్యేకమైన రసాయన సంకేతాల ద్వారా బ్యాక్టీరియా సమాచార మార్పిడి చేసుకుంటాయి. కొన్ని రకాల సముద్ర బ్యాక్టీరియా మాత్రమే రసాయన సంకేత భాషను ఉపయోగిస్తాయన్నది అప్పటివరకూ ఉన్న అంచనా. బోనీ మాత్రం తన పరిశోధనల ద్వారా ఇది అన్ని రకాల బ్యాక్టీరియాకూ వర్తిస్తుందని నిరూపించారు. బ్యాక్టీరియా భాషకు బోనీ పెట్టిన పేరు... ‘కోరమ్ సెన్సింగ్! ఇంకో విషయం... అనువుగాని చోట అధికులమనరాదు అన్న సామెతను బాగా వంటబట్టించుకున్నాయి ఈ బ్యాక్టీరియా. తమతో పోలిన బ్యాక్టీరియా నిర్దిష్ట సంఖ్యలో ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే... ఇవి ఆతిథ్య కణం లేదా డీఎన్‌ఏపై దాడి మొదలుపెడతాయట!
ఎలా తెలిసింది?
పదేళ్లక్రితం నాటి మాట ఇది. అప్పట్లో బోనీ రసాయన శాస్త్రంలో పిహెచ్‌డి చేస్తోంది. ఒకానొక సందర్భంలో సిల్వర్‌మాన్ అనే ఓ శాస్తవ్రేత్త ఉపన్యాసం వింది. జన్యుశాస్తవ్రేత్త అయిన సిల్వర్‌మాన్ చెప్పిందేమిటో ఈ రసాయన శాస్తవ్రేత్తకు ఏమీ అర్థం కాలేదు. రెండు విషయాలు తప్ప... ఆయన బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నారని... అవి తమలో తాము మాట్లాడుకుంటాయని! ‘‘బ్యాక్టీరియా మాట్లాడుకుంటాయని ఇతరులెవరైనా చెప్పిఉంటే ఆ... చెప్పావులే అని అనుకునేదాన్నేమో. మనం చదువుకున్న చదువుల్లో లేని విషయం అది. అందుకే ఆ అంశంపై ఆసక్తి పెరిగింది’’ అని బోనీ తెలిపారు. ఆ ఉపన్యాసం అయిన వెంటనే సిల్వర్‌మాన్‌ను వేడుకుని అతడి సంస్థలోనే బ్యాక్టీరియా భాషపై పరిశోధనలు ప్రారంభించారు బోనీ!
చీకట్లో వెలుగులు నింపే బ్యాక్టీరియా!
బ్యాక్టీరియా ఎలా మాట్లాడుతుందో తెలుసుకోవాలంటే బోనీ పరిశోధనశాలకు వెళ్లాల్సిందే. పూర్తి చీకటిగా ఉండే ఆ పరిశోధనశాలలో వందల కొద్దీ గాజు పాత్రలు ఉంటాయి. ఏ ఒక్కదాన్ని తీసుకుని అటూఇటూ కదిలించినా నీలపు రంగు వెలువడుతుంది. ఆ పాత్రల్లో ఉండేది సముద్రాల్లోంచి సేకరించిన ఒక రకమైన బ్యాక్టీరియా మరి. బ్యాక్టీరియా రెండు రకాల రసాయనాలతో సంభాషణలు నెరపుతాయని, తమతో పోలిన వాటితో మాత్రమే కాకుండా ఇతర రకాల బ్యాక్టీరియాతో మాట్లాడేందుకు కూడా వీటికి ప్రత్యేకమైన సంకేత భాష ఉందని బోనీ వివరిస్తారు. జీవజాతులన్నింటికంటే ముందుగా అవతరించిన బ్యాక్టీరియా రసాయనాల సాయంతో ఒక భాషను అభివృద్ధి చేసుకుని ఉండాలని తాను ముందు నుంచి అంచనా వేసినట్లు వివరించారు. ఈ రసాయనాల ద్వారానే లక్ష్యాలపై దాడి చేయడం, మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థ, మందుల నుంచి తప్పించుకోవడం లాంటి తదితర పనులను సమష్టిగా చక్కబెట్టుకుంటాయని ఆమె నిరూపించారు. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలచుకోవడం కూడా బ్యాక్టీరియాకు ఈ కోరం సెన్సింగ్ ద్వారానే సాధ్యమవుతోందని బోనీ అంటారు.
ఎన్నో ప్రయోజనాలు
బ్యాక్టీరియా పేరు చెప్పగానే మనకు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు గుర్తుకు రావడం సహజం. కానీ బ్యాక్టీరియా అన్నీ మనకు చెడే చేయవు. మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. నిజానికి ఇటువంటి బ్యాక్టీరియానే మన శరీరంలో ఎక్కువ. అయితే వ్యాధులకు కారణమవుతున్న బ్యాక్టీరియాను నాశనం చేసే క్రమంలో మంచి బ్యాక్టీరియా కూడా నాశనమవుతోంది. బ్యాక్టీరియా భాషను బాగా అర్థం చేసుకుంటే ఈ చిక్కు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మందులకు లొంగని మొండి బ్యాక్టీరియా పనిపట్టేందుకు కొత్త ఆయుధాలు తయారు చేయవచ్చన్నది బోనీ ఆలోచన. బ్యాక్టీరియా సంకేత భాషను నిలిపివేయడం ద్వారా అవి సమష్టిగా వ్యవహరించడాన్ని అంటే... ఆతిథ్య కణంపై దాడిచేయడాన్ని నిలువరించవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకో విషయం. కోరం సెన్సింగ్ కేవలం వ్యాధులకు మాత్రమే పరిమితం కావడం లేదు.
కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి రంగాల్లోనూ దీన్ని ఉపయోగించవచ్చునని శాస్తవ్రేత్తలు అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగించే సెల్ఫ్ ఆర్గనైజింగ్ నెట్‌వర్క్‌లు మరింత సమర్థంగా పనిచేసేందుకు కోరం సెన్సింగ్ ఉపయోగపడుతుందని అంచనా. ఇందులో నెట్‌వర్క్‌లోని ఒక్కో నోడ్ తన పరిసరాల్లో తగినన్ని నోడ్‌లు ఉన్నాయా? లేదా? అన్నది సరి చూసుకున్న తరువాతనే పనిచేస్తాయి. తద్వారా సమర్థవంతమైన, మెరుగైన పనితీరు వీలవుతుంది. అంతేకాకుండా తనంతటతానుగా ప్రవర్తించే రోబోట్‌ల ప్రవర్తనను నియంత్రించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చునని అంచనా.
జనాభాను పెంచుకునేందుకు
బ్యాక్టీరియా పరస్పరం
మాట్లాడుకుంటాయి.
బ్యాక్టీరియా భాషకు బోనీ
పెట్టిన పేరు... ‘కోరమ్ సెన్సింగ్!
బ్యాక్టీరియా ఉండని ప్రాంతమంటూ ఈ భూమ్మీద లేనే లేదు. అగ్నిపర్వత బిలాల్లోనైనా... మంచుగడ్డల లోపలైనా బ్యాక్టీరియా మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.
నేల పొరల్లో ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ లోతులో, సముద్రగర్భంలోనూ అతి ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉంటుంది
భూమ్మీద ఉండే మొత్తం బ్యాక్టీరియా జాతులు... కోటానుకోట్లు!
కొంచెం ఉజ్జాయింపుగా చెప్పాలంటే ఆ అంకె 5 పక్కన 30 సున్నాలు పెడితే ఎంతో అంత!
ఒక్క లీటర్ సముద్రపు నీటిలో 20,000కు పైచిలుకు బ్యాక్టీరియా ఉంటాయి!
- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
No comments:
Post a Comment