Monday, December 6, 2010

న్యూయార్క్‌లో దోశల బండి

కొబ్బరి చట్నీ వేసుకొని కరకరలాడే దోశలను తినేయాలని ఎవరికుండదు చెప్పండి..? మనకు దోశ తినాలనిపిస్తే ఇంటి పక్కనే ఉన్న ఏ చిన్న గల్లీలోనైనా దొరుకుతుంది. అదే అమెరికాలో అయితే అక్కడి భారతీయులందరూ దోశ కోసం మైళ్లకు మైళ్లు వెళ్లి, అక్కడున్న ఇండియన్ రెస్టారెంట్లలో దోశలను తినేవారు. కానీ, ఇప్పుడు తిరుకుమార్ కందస్వామి అమెరికా వెళ్లాక... ఆయన చుట్టూ తిరుగుతున్నారు దోశల ప్రియులు. ఎందుకంటే అతను న్యూయార్క్‌లోని వాషింగ్టన్ స్క్వేర్‌లో ఓ చిన్న దోశల బండి పెట్టాడు. ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి దోశలను వేసి అబ్బురపరుస్తున్నాడు. భారతీయులే కాదు, అమెరికన్లు కూడా కందస్వామి దోశలను ఆవురావురుమంటూ తినేస్తున్నారట.

శ్రీలంక నుంచి న్యూయార్క్‌కు..
కందస్వామి అమెరికాలో దోశల బండి పెట్టడం దోశలు తిన్నంత సులభంగా జరిగిపోలేదు. ఆయన తమిళనాడువాసి. కుటుంబం శ్రీలంకలో స్థిరపడింది. అమ్మా, చెల్లెలు ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. ఒకప్పుడు శ్రీలంకలో బైక్ రేసుల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేసిన కందస్వామికి.. అమెరికా వెళ్లాక దోశలతో దశ తిరిగిపోయింది. కొన్నాళ్లు క్వీన్స్‌లోని సౌత్ ఇండియన్ హోటళ్లలో పనిచేశాడు. చెప్పుకోడు కానీ మరిన్ని చిన్నాచితక పనులు చాలానే చేశాడు. ఎలాగో కష్టపడి గ్రీన్‌కార్డు సంపాదించుకున్నాడు.

మన దేశంలో రోడ్డు పక్కన బండి పెట్టుకొని ఇడ్లీలు, దోశలు అమ్మాలంటే ఏమంత కష్టమైన పని కాదు. అప్పుడప్పుడు తగిలే పోలీసులు, మున్సిపాలిటీ వాళ్లకు అంతోఇంతో చేతిలో పెడుతుంటే ఎన్నాళ్లయినా నడిచిపోతుంది. కానీ, అమెరికాలో అలా నడవదు. రోడ్ల పక్కన ఎక్కడా చిన్న తోపుడుబండి కూడా కనిపించదు. ఒకవేళ ఉన్నా దానికి బోలెడు పర్మిషన్లు ఉండాలి. అందుకే కందస్వామి కూడా మూడున్నరేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి లైసెన్సు తెచ్చుకున్నాడు.

లైసెన్సు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, దోశల బండిని తయారు చేయించడం మరో ఎత్తు. ఎందుకంటే న్యూయార్క్ నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారమే బండిని చేయించాలి. దీని కోసం కందస్వామి మరో ఆరు మాసాలు కుస్తీపట్టాడు. "నాకు ముందు నుంచి అందరూ చేసే పనినే గుడ్డిగా అనుసరించడం ఇష్టముండదు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగాను. ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ఇడ్లీ, దోశల బండ్లు కనిపిస్తాయి. అదే అమెరికాలో అయితే ఈ సౌకర్యం ఉండదు.

అయినా మన వాళ్లు ఎక్కడ కలిసినా దోశలు, ఇడ్లీల గురించే చర్చలు. పెద్ద హోటళ్లలో తింటే సంతృప్తి తక్కువ, బిల్ ఎక్కువ. అదే రోడ్డు పక్కన నిల్చుని, అటూఇటూ వెళ్లే మనుషుల్ని, వాహనాల్ని చూస్తూ.. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే ఆ మజానే వేరు. ఆ తినేదేదో అమెరికా వీధుల్లో తింటే ఇంకెంత బాగుంటుందో కదా..! అందుకే పెడితే ఇక్కడే దోశల బండి పెట్టాలనుకున్నా.

ఎంతోమందిని కలిసి, అమెరికా ప్రభుత్వ నిబంధనలను అధ్యయనం చేసి... ఈ దోశలబండిని ఈ చెట్ల కింద పెట్టాను. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా... నేను వేసిన మసాలా దోశ ఈ అమెరికాలో ఎవ్వడు వేస్తాడో చూపించండి...'' అంటూ గర్వంగా మీసాలు మెలేస్తూ.. చిరునవ్వుతో చెప్పుకొచ్చే కందస్వామిని చూసి అమెరికన్లు కూడా శభాష్ అనక తప్పడం లేదు.

మాంద్యంలో హాట్‌కేకులు
ఆర్థికమాంద్యంతో అమెరికా ఎంత నష్టపోతున్నదో కానీ, కందస్వామి మాత్రం బాగా వెనకేస్తున్నాడు. అమెరికాలోని యువతీయువకులు ఉద్యోగాలు లేక వీధుల్లో తిరుగుతున్నారు. రెస్టారెంట్‌లలో తిండి తినాలంటే కనీసం యాభై డాలర్లను వదిలించుకుంటే కానీ కడుపు నిండదు. అదే కందస్వామి దగ్గరికి వెళితే కేవలం ఆరు డాలర్లకే రుచికరమైన వేడి వేడి దోశ వేసిస్తాడు. రవ్వదోశ, మసాలదోశ, ప్లెయిన్ దోశ, పాండిచ్చేరి దోశతోపాటు ఊతప్పం, వడ... ఇలా ఎవరికి ఏం కావాలంటే అది క్షణాల్లో తయారు చేసిస్తున్నాడు.

'నాకే ఆశ్చర్యం వేస్తుంది. రోడ్ల మీద వెళ్లే వాహనాలు నా దోశ వాసన తగలగానే ఆగిపోతున్నాయి. అందులో భారతీయులకంటే అమెరికన్లే ఎక్కువ మంది ఉన్నారు. నేను దోశ వేశానంటే అదిరిపోవాలంతే. ఎప్పుడో మా అవ్వ నేర్పింది కొబ్బరి చట్నీ చేయడం. అది ఇప్పుడు పనికొచ్చింది. కొబ్బరి చట్నీతో లొట్టలేసుకుంటూ దోశలు తినేస్తున్నారు అందరూ. నాకు 45 దేశాల కస్టమర్లు ఉన్నారు. హోటళ్లు ప్రచురించే గైడ్ బుక్‌లో నా దోశల బండికీ స్థానం దక్కింది. ఫేస్‌బుక్, ఈ మెయిల్ ద్వారా కూడా దోశలు పంపమని ఆర్డర్లు వస్తుంటాయి. ఒక రోజు అమెరికాలో ఫైనాన్షియల్ టైమ్స్‌లో నా గురించి స్టోరీ పడింది.

దాన్ని చూసి లండన్‌కు చెందిన ఒకాయన నా బండి దగ్గరకొచ్చి దోశ తిని, నన్ను అభినందనలతో ముంచెత్తి మరీ వెళ్లాడు. నాకు చాలా సంతోషమేసింది. న్యూయార్క్ యూనివర్శిటీ స్టూడెంట్స్ కూడా నాకు రెగ్యులర్ కస్టమర్లు..'' అన్నాడు దోశల కందస్వామి. న్యూయార్క్‌లో ఏటా వీధి వ్యాపారులకు ఇచ్చే'వెండీ' అవార్డును (వెండర్లకిచ్చే అవార్డు) సైతం ఆయన గెలుచుకోవడం విశేషం. దోశలతో వేడి వేడిగా సంపాదిస్తున్న కందస్వామి ఇప్పుడు అమెరికాలోనే రెండో దోశల బండి పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

దోశల సంపాదనతోనే తన ముద్దుల కూతురును కొలంబియా యూనివర్శిటీలో చదివిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి..? భారతీయ దోశల ఘుమఘుమలతో న్యూయార్క్ వీధులను నింపేస్తున్న కందస్వామికి మనం కూడా దోశలు సారీ, చేతులు జోడించి అభినందనలు చెబుదాం.

No comments: