బంగారాన్ని ల్యాబ్‌లలో తయారుచేయడం అనే ఆలోచనను సైన్సు ఒప్పుకోదు. అదసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. అందుకు వాళ్లు చెప్పే రీజనింగ్ వేరే.
బంగారం. ఆ మాట వింటేనే ఎవరికయినా మనసు మెరుస్తుంది. ఒళ్లంతా బంగారం అవ్వాలనుకుంటారు మగువలు. ఇల్లంతా బంగారం కావాలనుకుంటారు మగవారు. ముట్టుకుంటే రాయి కూడా బంగారమైపోవాలన్నది చాలామంది కల. మిడాస్ టచ్ కథ అలా పుట్టిందే. బాబాలూ, స్వామీజీలు గాల్లో చేతులు ఊపి బంగారు గొలుసులు, ఉంగరాలూ సృష్టిస్తే మనకు ఆశ్చర్యం. ఇంటి పెరట్లో బంగారు నగలు దొరుకుతాయంటూ ఆశలు రేపి మోసాలు చేస్తుంటారు మంత్రగాళ్లు. ఎంత బంగారం ఉంటే అంత సంపద. ఎంత లేకపోతే అంతకు అన్నింతల ఆశ. బంగారాన్ని మనిషి కనుగొన్న నాటి నుంచి, బంగారం గొప్పదనాన్ని తెలుసుకున్న నాటి నుంచి, దాన్ని ఆభరణంగా వాడటం మొదలుపెట్టిన నాటి నుంచి బంగారం అంటే మనిషికి అపరిమితమైన వ్యామోహం.
ఇప్పుడూ అప్పుడూ కాదు... లక్షల సంవత్సరాలుగా బంగారం మీద మనిషికి తరగని మమకారం. కాని ఏం లాభం? మనిషికి ఆశ ఉన్నంతగా ఈ భూమి మీద బంగారం లేదు. మనిషి బంగారాన్ని కనుగొన్న నాటి నుంచి 2009 వరకూ వెలికి తీసిన బంగారం మొత్తం లక్షా 65 వేల టన్నులు. అయినా కూడా ఈ బంగారం సరిపోదు. ఇంకా బంగారం కావాలి. బతుకంతా బంగారుమయం కావాలి. కొన్ని యుగాలుగా మనిషిని వీడని ఆశ! ఈ ఆశకు ఫలితమే పరుసవేది. బంగారాన్ని తయారుచేసే విద్య.
ఆనాటి ఈజిప్టు, మెసొపటేమియా, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీకు, రోమన్, ఆధునిక యూరప్ దేశాలలో శతాబ్దాలుగా రసాయన శాస్తవ్రేత్తలు బంగారాన్ని తయారుచేయడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రక్రియనే అల్‌కెమీ అంటారు. మనం పరుసవేది అంటున్నాం. ఐదు వేల సంవత్సరాల కిందట పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేసేవారు అనే కథలున్నాయి. ఒక్కోసారి ఊహలు నిజమవుతాయనిపిస్తాయి. అప్పట్లో అది సాధ్యమని చాలామంది శాస్తవ్రేత్తలు భావించారు. శ్రమించారు.
బంగారాన్ని మనిషి తయారుచేయవచ్చన్న ఆలోచన అప్పట్లో ఎంత బలంగా ఉందంటే, సర్ ఐజాక్ న్యూటన్ లాంటి గొప్ప సైంటిస్టు కూడా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేయడానికి ప్రయోగాలు చేశాడు. 17వ శతాబ్దానికి సంబంధించిన యోగి వేమన కొద్దిరోజులు యోగ విద్య నేర్చుకుని పరుసవేది ప్రయోగాలు చేశాడని కథలున్నాయి. ఆ బంగారు సృష్టికి సంబంధించిన విద్య రహస్యాలను ఆయన పద్యాల్లో నిక్షిప్తం చేశాడన్న ప్రచారం ఉంది. దీనితో చాలా కాలంగా వేమన పద్యాల్లో నిగూఢ అర్థాలేమయినా ఉన్నాయా? అనే విషయం మీద పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.
‘‘ఉప్పు చింతకాయ ఊరిలోనుండగ...
కరువదేల వచ్చు కాంతలారా...’’
...లాంటి పద్యాల్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించిన దాఖలాలూ ఉన్నాయి. కాని ఇదంతా నిజమేనా? సాధ్యమేనా? లేక ఒట్టి అభూతకల్పనా? బంగారాన్ని తయారుచేయడం సైన్సా? ఫిక్షనా?
దుస్సాధ్యం... అంటుంది సైన్సు. బంగారాన్ని ల్యాబ్‌లలో తయారుచేయడం అనే ఆలోచనను సైన్సు ఒప్పుకోదు. అదసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. అందుకు వాళ్లు చెప్పే రీజనింగ్ వేరే.
బంగారం... అంటే గోల్డ్... దీనినే లాటిన్‌లో అరమ్ అంటారు. గోల్డ్ కూడా ఒక కెమికల్ ఎలిమెంట్. దాని సింబల్ అఠ. గోల్డ్ అటామిక్ నెంబర్ 79. బంగారం విశిష్టత ఏమిటంటే, దీనికి కెమికల్ రియాక్షన్స్‌ని తట్టుకుని నిలబడే శక్తి ఎక్కువ ఉంటుంది. మిగతా లోహాలతో తేలికగా కలిసిపోగలుగుతుంది. కెమికల్‌గా గోల్డ్ ఒక ఎలిమెంట్ అయినప్పుడు... దాన్ని సృష్టించడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తారు సైంటిస్టులు. ప్రకృతిసిద్ధంగా తయారయిన కొన్నింటినే మూలకాలు గుర్తించారు. ఇనుము ఒక మూలకం... వెండి, కాంస్యం, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్... ఇలా వేటికవే ప్రత్యేకమైన ఎలిమెంట్స్. ఇవి బేస్ ఎలిమెంట్స్. వాటి సమ్మేళనం ద్వారా తయారుచేయగలిగేవే ఇతర రసాయనాలు లేదా లోహమిశ్రమాలు (అలాయ్స్). అలాంటి ఒక కెమికల్ ఎలిమెంట్ అయిన బంగారాన్ని సృష్టించడం మానవమాత్రుడికి సాధ్యం కాదు అన్నది సైంటిస్టుల వాదన. అందుకే ఇంతవరకూ పరుసవేది ద్వారా బంగారాన్ని ఎవ్వరైనా సృష్టించారు అంటే అది నమ్మనవసరం లేదని అంటారు వారు. మరి ఇంతకాలం మనం విన్న పరుసవేది కథలన్నీ పుక్కిటి పురాణాలేనా?
ప్రపంచం రోజురోజుకూ పెరుగుతోంది. మనుషుల సంఖ్య పెరుగుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. బంగారం ఎంత ఉంటే అంత సంపద. ఇది ఒక్క మనిషికో, కుటుంబానికో సంబంధించినది మాత్రమే కాదు. ఒక దేశానికి ఎంత బంగారు నిల్వలు (గోల్డ్ రిజర్వ్) ఉంటే అంత సంపన్న దేశంగా గుర్తింపు ఉంటుంది. బంగారానికి కొన్ని యుగాలుగా ఉన్న డిమాండు ఇంకొన్ని యుగాలయినా ఉంటుంది. బంగారం మీద మనిషికి ఆశ కొనసాగుతుంటుంది. టెక్నాలజీ పెరుగుతోంది, మనిషి మేధస్సు పెరుగుతోంది, కాబట్టి బంగారాన్ని తయారుచేయడానికి మనిషి మార్గాలు అన్వేషిస్తూనే ఉంటాడు. కాని ఎప్పటికయినా మనిషి పరుసవేది విద్యను నిజం చేయగలుగుతాడా? బంగారాన్ని సృష్టించగలుగుతాడా?
ఏమో... బహుశా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేయడం సాధ్యపడొచ్చు అనే వాళ్లూ ఉన్నారు. అందుకు శాస్ర్తీయంగా వాళ్లు చెప్పే కారణాలూ సహేతుకంగానే ఉన్నాయి. బంగారం ఒక రసాయనమూలకం. ఇది కొన్ని బంగారు అణువుల సముదాయంగా ఉంటుంది. కొన్ని చౌకయిన లోహాలు, మిశ్రమాల ఎలిమెంట్లను సబ్‌అటామిక్ స్థాయిలో బ్రేక్ చేయగలిగి, వాటి ద్వారా బంగారుఅణువు తయారుచేయగలిగితే, ఆ లోహాలు లేదా మిశ్రమాలు బంగారంగా మారే అవకాశం ఉంటుందన్నది కొందరు సైంటిస్టుల వాదన. అయితే, అలా చేయడానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ అంతటి భారీ పరిమాణంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అంత కష్టపడి బంగారాన్ని సృష్టించడం కన్నా బంగారాన్ని ఎంత ధరయినా పెట్టి కొనడమే చౌక. అంటే.. పరుసవేది విద్య నిజం కావచ్చనే సూచనలు ఉన్నట్టేగా! బహుశా ఈ దిశగా ఇంకొన్ని ప్రయోగాలు జరిగితే మనిషి ఏనాటికయినా బంగారాన్ని సృష్టించగలుగుతాడా? ఇప్పటికంటే పూర్వకాలమే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది ఉంటుందా? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలు.
పరుసవేది విద్య గురించి కేవలం శాస్తవ్రేత్తలు మాత్రమే కాదు, సన్యాసులు, బౌద్ధులు, వేదాంతులు కూడా మాట్లాడారు. దీనితో వేదాల్లోనూ, పూర్వకాలపు శాస్ర్తాల్లోనూ పరుసవేది రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయని నమ్మి మళ్లీ చాలామంది పరిశోధనలు చేశారు. అంత జ్ఞానాన్ని మధించిన తర్వాత వాళ్లకు ఒక విషయం మాత్రం స్పష్టమయింది. వేదాంతులు, ఫిలాసఫర్లు చెప్పే పరుసవేదికి మాత్రం ఇక్కడ అర్థం వేరు. మనిషి బంగారాన్ని తయారుచేయడం కాదు. మనిషే బంగారంగా మారాలంటారు వాళ్లు. ఇక్కడ పరుసవేది... మనస్సుకు సంబంధించిన విద్య. మంచి మనసు కన్నా బంగారం ఏముంటుంది?
విద్యంటే... ఇదే బంగారం!
ప్రఖ్యాత రచయిత పాలో కొయెలో రాసిన ‘ద అల్‌కెమిస్ట్’ (తెలుగులో పరశువేది)లో చెప్పిందీ ఇదే. బంగారానికి సంబంధించిన ఇంకొన్ని కథలు చెప్పిందీ ఇదే. అలాంటి ఓ తాత్త్వికమైన కథ ఇది.
అనగనగా ఒక ఊళ్లో... ఓ అందమైన యువకుడు. అతనికి కొత్తగా పెళ్లయింది. అబ్బాయి మంచివాడే కాని అతనితో ఒక్కటే సమస్య. పగలూ, రాత్రి అతడు పరుస వేది ప్రయోగాలు చేస్తూ గడిపేస్తున్నాడు. అతని భార్య కలవరపడిపోయింది. ఇల్లు గడవడమే కష్టమయిపోతోంది. ఉద్యోగం చేయమంటే వద్దంటున్నాడు. బంగారాన్ని సృష్టించి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని అయిపోతానంటున్నాడు.
అమ్మాయి వెళ్లి తన తండ్రి దగ్గర గోల పెట్టింది. మీ అల్లుడుగారిని మార్చండి అంటూ ప్రాథేయపడింది. అప్పుడు మామగారు అల్లుడి దగ్గరకు వెళ్లారు. కాని ఆయన మందలించలేదు.
‘‘బాబూ... నిన్ను చూస్తే ముచ్చటగా ఉందయ్యా... చిన్నతనంలో నేను కూడా పరుసవేది ప్రయోగాలు చేశాను. బంగారాన్ని తయారు చేసే ఫార్ములా కనుక్కున్నాను. అది నీకు చెప్పాలని ఉంది...’’ అన్నారు. అబ్బాయి మొహం వికసించింది. చెప్పండన్నాడు ఆత్రుతగా.
‘‘అరటిపండ్ల మీద ఏర్పడే తెల్లని ధూళి ఉంటేగాని నీ ప్రయోగం ఫలించదు... కాని అందుకు రెండు టన్నుల ధూళి కావాలి..’’ చెప్పాడు మామగారు. అబ్బాయి ఆలోచించలేదు. వెంటనే పొలంలో అరటి తోట వేశాడు. తనే దగ్గరుండి తోటను చూసుకున్నాడు. చక్కని పంట పండించాడు. ధూళితో మామగారి దగ్గరకు వెళ్ళాడు.
‘‘ఇది అవసరం లేదయ్యా... నువ్వు ఇప్పటికే బంగారాన్ని సాధించావు’’ అన్నాడు చల్లగా.
అబ్బాయి ఆశ్చర్యపోయేలోపే... పక్కనుంచి అమ్మాయి వచ్చింది. ఆమె రెండు సంచుల నిండా బంగారం కాసుల్ని అతని ముందు బోర్లించింది. అప్పుడు మామగారు చెప్పారు...
‘‘నువ్వు శ్రమపడి పండించిన అరటిపండ్లను అమ్మాయి అమ్మి ఇంత సొమ్ము సంపాదించింది. ఇదేనయ్యా... పరుసవేది...’’ అన్నారు. అబ్బాయికి జ్ఞానోదయం అయింది.
- సతీశ్ కుమార్
No comments:
Post a Comment