ఎంత చలేస్తోందంటే...
పెదాలు పగిలి.. నవ్వొచ్చినా నవ్వలేనంత...
పాదాలు పగిలి.. నడవాలన్నా నడవలేనంత...
పల్లెటూళ్లలో అయితే పొద్దున్నే చలిమంటలు వేసుకునేంత...
పట్టణాల్లో అయితే ముసుగు తన్ని బారెడు పొద్దెక్కేదాకా పడుకునేంత...
ఉష్ణోగ్రత పది డిగ్రీలకి చేరితేనే మనం గజగజా వణికిపోతున్నాం... స్వెటర్లు, ఇన్నర్లు వేసుకుంటున్నాం... చాలక షాల్స్ కప్పుకుంటున్నాం... అరికాళ్లకి సాక్స్ తొడుక్కొని, తలకి మంకీ క్యాప్ తగిలించుకుంటున్నాం.
...అదే ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే దేశాల్లో అయితే ఉష్ణోగ్రత మైనస్ 70 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది... అంత చలిలో అసలు జనం బయట తిరగగలుగుతారా? ఇంట్లోనే హీటర్లు పెట్టుకుని గడిపేస్తారా? అలా అయితే సంవత్సరంలో సగం కాలం వాళ్లు ఇంటికే పరిమితమై ఉండాల్సి ఉంటుంది. అలా ఉండలేకో లేక అలవాటయ్యో అక్కడి జనం అంత చలిలో కూడా ఘనీభవించిన నదులపై ఆటలాడుకుంటారు... డాగ్‌రేస్‌లు, స్కీయింగ్ పోటీలతో బిజీగా గడుపుతారు. ఆ ప్రాంతాల్లో ఉండే జంతువులు కూడా చలికాలాన్ని రకరకాలుగా ఆస్వాదిస్తాయి. ఆ వింతలు విశేషాలే ఈ స్టోరీ!
ఎముకలు కొరికే చలిని ఎంత బాగా ఆస్వాదించవచ్చో, చలిపులికి భయపడకుండా మంచుకురిసే కాలంలో ఎన్ని రకాల ఆటలాడుకోవచ్చో మనకు తెలియాలంటే... ఉత్తర ధృవానికి సమీపంగా ఉండే కెనడా, గ్రీన్‌లాండ్, స్వీడన్, నార్వే, ఫిన్‌లాండ్, రష్యా లాంటి దేశాలకి వెళ్లాల్సిందే...
స్వీడన్: ఐస్ హోటల్
ఐస్‌తో కట్టిన హోటల్ రూమ్‌లో ఐస్‌తో చేసిన కుర్చీలో కూర్చుని భోజనం చేశాక ఐస్ బెడ్ మీద దుప్పటి పరుచుకుని నిద్రపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... వింటుంటేనే థ్రిల్లింగ్‌గా ఉంది కదూ. కాని ఆ పని చేయాలంటే స్వీడన్ వెళ్లాలి. ఆ దేశం లోని 'జుక్కాస్‌జార్వి' అనే చిన్న పట్టణ సమీపాన టార్న్ నదిపైన ఉంటుంది ఈ ఐస్ హోటల్. ఆర్కిటిక్ వలయానికి 200 కిలోమీటర్లు ఉత్తరంగా ఉంటుంది ఈ ప్రాంతం. చలి కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది. అంతా సరే కాని మంచుతో హోటల్ ఎలా కడతారు?
ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రపంచం నలుమూలల నుంచి మంచు ప్రేమికులు, ఆర్కిటెక్ట్‌లు ఇక్కడికి చేరుకుంటారు. ఆ ఏడాది నిర్మించబోయే 'ఐస్ హోటల్' డిజైన్‌ని తయారు చేసుకుంటారు. గడ్డ కట్టి ఉన్న టార్న్ నది నుంచి వేల టన్నుల హిమఖండాల్ని పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి కోస్తారు. వాటితో ఆ నది పైనే ఐస్ హోటల్ నిర్మిస్తారు. రిసెప్షన్ దగ్గర్నించి పై కప్పు, కుర్చీలు, టేబుళ్ళు, మంచాలు అన్ని ఐస్‌తోటే చేస్తారు. చివరికి మంచినీళ్ళు, మందు తాగే గ్లాస్‌లు కూడా మంచుతో చేసినవే. ఈ హోటల్లో ఐస్ బార్, కాన్ఫరెన్స్ హాల్స్, ఐస్ చర్చ్ కూడా ఉంటాయి. డిసెంబర్ 20కల్లా ఈ హోటల్ సిద్ధమై మార్చి నెల వరకూ కొనసాగుతుంది. ఈ నాలుగు నెలల్లో ప్రపంచం నలుమూలల నుండి వేలాదిమంది వచ్చి ఈ హోటల్‌ని సందర్శిస్తూ ఉంటారు.
అంతర్జాతీయ సందర్శకులు పెరగడం వల్ల బ్రిటన్ నుంచి ఇక్కడికి నేరుగా విమాన సర్వీసుని కూడా ప్రవేశపెట్టారు. యూరోపియన్లకి ఈ ఐస్ హోటల్‌ని సందర్శించడం ఒక కల. అంతేకాదు వందలాది ప్రేమ జంటలు ఇక్కడ ఐస్ చర్చ్‌లో పెళ్ళి చేసుకుని ఒకటవుతుంటారు. 1992లో మొదటి సారి ఈ హోటల్‌ని నిర్మించారు. దీనికి క్రేజ్ పెరగడంతో ఇప్పుడు కెనడా, రష్యా, నార్వే దేశాల్లో కూడా ఐస్ హోటళ్లు వెలిశాయి. టార్న్ ఐస్ హోటల్ మూతబడే సమయంలోనే స్వీడన్‌లో మరో భారీ పోటీ జరుగుతుంది. అదే 'స్కీయింగ్ రేస్'
స్వీడన్: స్కీయింగ్
చలి కాలంలో ఆరు బయట ఆడుకునే ఆటల్లోకల్లా ఎక్కువ పాపులర్ ఆట స్కీయింగ్. కాళ్ళకి మీటర్ పొడవుంటే పలుచని ప్లేట్‌లు, రెండు చేతుల్లో రెండు అంతే పొడవున్న 'స్టిక్'లు... అరికాలి నుంచి తలదాకా అంతా కప్పేసి ఉండే 'హాట్ సూట్' వేసుకున్న స్కీయర్లు మంచుకొండల్లో చాలా వేగంగా దూసుకుపోతుంటారు. ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల్లో... మంచు పర్వతాలుండే ప్రాంతంలో ఈ రేస్‌లు జరుగుతాయి. స్వీడన్‌లో జరిగే 'గ్చట్చజూౌఞఞ్ఛ్ట' రేస్ ఈ రేసులన్నిట్లోకి పెద్దది. ఇందులో ఏటా 16 వేల మందికి పైగా పాల్గొంటారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ, పడుతూ లేస్తూ 92 కి.మీ. దూరం ప్రయాణించి గమ్యాన్ని చేరుకోవడం మహామహా స్కీయర్లకే తేలిక కాదు. అది కూడా 12 గంటల్లోపల చేరుకోవాల్సి ఉంటుంది. ఏటా మార్చి నెల మొదటి ఆదివారం జరిగే ఈ పోటీని తిలకించడానికి లక్షల మంది వస్తారు. రేస్‌లకి వేదిక అయిన 'Dalarna' పట్టణం ఆ సమయంలో సందర్శకులతో నిండిపోతుంది. హోటళ్ళ రూములను నెలల ముందే బుక్ చేసుకంటారు.
మారథాన్ రన్నింగ్ పోటీలకి రెండు రెట్లు ఎక్కువ దూరం ఉండే ఈ రేస్‌ను నిర్వహించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 500 ఏళ్ళ క్రితం గుస్తావ్ వాసా అనే ఆయన స్వీడన్ అంతటా పర్యటించి, ప్రజల్ని కూడగట్టి 'స్వీడిష్ తిరుగుబాటు'ని లేవదీశాడు. ఆ తర్వాత ఆయన స్వీడన్ రాజయ్యాడు. ఆ పర్యటన స్ఫూర్తితోటే ఇప్పటికీ శీతాకాలంలో స్కీయింగ్ రేసును నిర్వహిస్తున్నారట. 'గుస్తావ్ వాసా' పేరు నుంచే ఈ 'వాసాలొప్పెట్' కూడా వచ్చింది. ఏటా 3500 మందికి పైగా వాలంటీర్లు ఈ రేస్ ఏర్పాట్లలో పాలు పంచుకుంటారు. సుమారు నలభై దేశాల నుంచి వేల మంది స్కీయర్లు ఈ రేస్‌లో పాల్గొంటారు. గెలిచిన వారికి భారీ బహుమానాల్ని అందిస్తారు.
సైబీరియా: హాట్ స్ప్రింగ్స్
స్వీడన్‌కి సమాంతరంగానే ఉంటుంది రష్యాలోని సైబీరియా ప్రాంతం. సైబీరియా అంటేనే మంచు ఎడారుల నిలయం. ఉష్ణోగ్రత ఎప్పుడూ జీరోకి అటూ ఇటూ ఉంటుంది. అదే చలికాలంలో అయితే మైనస్ ఇరవైకి పడిపోతుంది. ఆ చలిని తట్టుకోవడానికే ట్యూమెన్ నగరంలో జనం కొలనుల్లో దిగి జలకాలాడతారు. అంత చలిలో నీటికొలనుల్లో జలకాలా అనుకోకండి. అవి వేడి నీటి కొలనులు. ఎవరో కాచి పోసిన నీళ్ళు కాదు. సహజంగా ఏర్పడిన కొలనులవి. రష్యాలోని మిగతా నగరాలతో పోలిస్తే ట్యూమెన్‌కి ఉన్న ప్రత్యేకత అక్కడున్న కొలనులే. అందుకే రష్యా రాజధాని మాస్కోతో పాటు చాలా ప్రాంతాల నుండి కొలనుల్లో ఈతకొట్టడానికి ఇక్కడ వాలిపోతుంటారు. ఈ వేణ్ణీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూ ఉపరితలం మొత్తం మంచుతో కప్పబడినా భూమి లోపల మాత్రం చాలా వేడిగా ఉంటుంది. 'నివురు గప్పిన నిప్పు'లాగా అన్నమాట. ఆ వేడివల్ల కొలనుల్లో ఉండే నీళ్ళు ఏడాది పొడవునా వెచ్చగానే ఉంటాయి. అందుకే మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవడానికి 55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఆ నీళ్ళలో దూకేస్తారు. కారుల్లోనే బట్టలు విడిచి పార్కింగ్‌కి 300 మీటర్ల దూరంలో ఉండే ఆ కొలనుల వద్దకి గజగజ వణుకుతూ పరుగుతీసి ఒక్కసారిగా నీళ్లలో దూకేసి ఊపిరి పీల్చుకుంటారు. గంటలసేపు అలా నీళ్ళల్లో గడిపి ఇక చాల్లే అనుకుని ఒడ్డుకు వచ్చేలోపే... ఐదారు సెకన్లలోనే వంటి మీద ఉన్న నీటి బిందువులు ఘనీభవించి 'ఐస్' అయిపోతాయట.
జపాన్: మంచు 'మంకీ'లు
వేడినీటిలో మునగవచ్చన్న తెలివి మనుషులకే కాదు కోతులకి కూడా ఉంటుంది. ఎంత కాదన్నా అవి మన పూర్వీకులు కదా! అంత తెలివి ఉంది కాబట్టే ఆ కోతులు వేణ్ణీళ్ళ ప్రవాహాల్లో చలికాలమంతా గడిపేస్తాయి.
జపాన్ ఉత్తర ప్రాంతంలోని 'యమనోచి' అనే పట్టణంలో ఓ కోతుల పార్కు ఉంది. అది 'యొకొయూ' నదీ లోయలో ఉంటుంది. ఆ పార్కుని 'హెల్స్ వ్యాలీ' అని పిలుస్తారు. అంటే 'నరక లోయ'. ఆ లోయలో ఉన్న వేడినీటి ప్రవాహమే దానికి ఆ పేరు తెచ్చింది. ఆ ప్రవాహంలో నీళ్ళు తెర్లుతూ ఉంటాయి. మంచు కప్పుకున్న కొండల మధ్య ఉండే ఆ కొలనుకు మనుషులు చేరుకోవాలంటే సాహసమే కాని ఆ కొండల్లోనే నివసించే మంచు కోతులకి అది చాలా చిన్న విషయం. మిగతా కాలమంతా పార్కులో గడిపే ఆ కోతులు చలికాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే బయల్దేరి కొలనుకి చేరుకుంటాయి. చీకటిపడేదాకా కొలనులోనే ఆడుకుంటూ చలి బారి నుంచి తప్పించుకుంటాయి. చీకటిపడగానే తిరిగి తమ ఆవాసాలకి వెళ్లిపోతాయి. చలికి భయపడి రాలేని సందర్శకులు ఆ నీటిలో మునిగే కోతుల్ని చూడడానికి మాత్రం సాహసం చేసి మరీ వస్తుంటారు. ఆ వానరాలు మాత్రం వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటాయి. ఒడ్డుకి వచ్చి మంచు ముద్దల్ని వారిపై విసురుతూ ఆటపట్టిస్తాయి.
వేడినీటిలో మునగాలనే తెలివితేటలు ఈ కోతులకి మొదటి నుంచే ఉన్నాయా అంటే... కాదంటున్నారు ఆ ప్రాంతం వాళ్లు. ఇదంతా 1963 తర్వాతే జరిగిందని అంటున్నారు. సహజంగా నీళ్ళంటే భయపడతాయట కోతులు. మరి ఏ కోతి ఎప్పుడు ప్రమాదవశాత్తూ జారి ఆ లోయలో పడిందో గాని అప్పట్నించి మొదలై ఉంటుంది ఈ కోతుల 'వేడినీటి విడిది' అంటున్నారు జపనీయులు.
కెనడా: రంగు మార్చుకునే కుందేళ్లు
కోతులు నీళ్ళలో దూకితే... కుందేలు చలికాలం రాగానే ఏకంగా తన రంగునే మార్చేసుకుంటుంది. అలా అయితేనే అది తనని తాను చలికాలంలో కాపాడుకోగలుగుతుంది... చలి నుంచి కాదు... దాన్ని వేటాడే జంతువుల నుంచి. దీన్ని 'పోలార్ హేర్' (ధృవ కుందేలు) లేదా మంచు కుందేలు అని అంటారు. అంటే ఊసరవెల్లి టైప్ అన్నమాట.
ఉత్తర అమెరికాలోని కెనడా, అలస్కాలలో ఎక్కువగా కనిపించే ఈ కుందేలు ఏడాదికి ఎనిమిది నెలలు బ్రౌన్ రంగులోనే ఉంటుంది. చలికాలం మంచు కురవడం మొదలైందంటే చాలు... తన వెంట్రుకల్ని తెల్లగా మంచు రంగులోకి మార్చేసుకుంటుంది. పొడవుగా, నిటారుగా ఉండే దాని చెవుల చివర్లో ఉన్న వెంట్రుకలు మాత్రమే మామూలు రంగులో ఉంటాయి. మిగతా శరీరమంతా తెల్లగా మారిపోతుంది. అందుకే పరీక్షగా చూస్తే తప్ప మంచులో దీన్ని గుర్తించలేము. మిగతా కాలంలో గడ్డి, చెట్ల ఆకులు తినే ఈ జంతువు చలికాలంలో మాత్రం అప్పుడు పూసే పువ్వుల్ని, చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటుంది. దాని శరీరంలోని ప్రొటీన్లు చలికాలంలో తగ్గిపోవడం వల్ల వాటిని పొందడం కోసమే మాంసం తింటుందట. రంగు మార్చుకోవడమే కాదు ఆ కాలంలో కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే బయట తిరుగుతుంది. చలికాలం ముగిసే నాటికి మళ్లీ బ్రౌన్ రంగులోకి మారిపోతుంది. ఇలా పూర్తిగా రంగు మారడానికి ఎనిమిది నుంచి పది వారాలు పడుతుందట.
అన్నీ లాంగ్ స్లీప్‌లోకి
మంచు దట్టంగా కురిసే ప్రాంతాల్లో 'మంచు కుందేలు' లాంటి కొన్ని జంతువులు మామూలుగానే జీవించినా కొన్ని జీవాలు మాత్రం ఆ కాలంలో గాఢనిద్రలోకి జారుకుంటాయి. నెలల పాటు అలా నిద్రించి తిరిగి ఉష్ణోగ్రత పెరగగానే లేచి మామూలుగా తిరుగుతాయి. అలా నిద్రించడాన్నే సుప్తావస్థ అని అంటారు. అన్ని జీవాలూ మనుషుల్లా తగిన సౌకర్యాలు సమకూర్చుకోలేవుగా మరి. గబ్బిలాలు, పాములు, 'పెయింటెడ్ టర్టిల్' అనే రకం తాబేలు ఈ కోవలోకి వస్తాయి. ఇవన్నీ సుష్టుగా భుజించి శీతాకాలం వచ్చే నాటికి కొన్ని నెలలు ఆహారం లేకపోయినా తట్టుకునే శక్తిని సమకూర్చుకుంటాయి. చలికాలం ప్రారంభం కాగానే తమ ఆవాసాల్లోకి వెళ్లిపోయి నిద్రకి పూనుకుంటాయి. ఏ వారం, పది రోజులకో ఓసారి లేస్తాయి... మళ్లీ నిద్రపోతాయి. ఆ కాలంలో తిండి లేకపోవడం వల్ల చిక్కి సగమైపోతాయి... అయితేనేం మళ్ళీ తర్వాత బాగా తిని కొన్ని రోజులకు మామూలు స్థితికి వచ్చేస్తాయి.
ఒక్కో జంతువు శీతాకాలాన్ని ఎదుర్కొనడానికి ఒక్కో విధంగా రెడీ అవుతుంది. అందుకేనేమో వీటి ప్రవర్తనను ఆధారం చేసుకుని చాలా నమ్మకాలు ఏర్పడ్డాయి. ఈ కింద పేర్కొన్నవి జరిగితే శీతాకాలం ఎక్కువ రోజులు ఉంటుందని జనం నమ్మకం. అవేవంటే...
1. జంతువుల వెంట్రుకలు దట్టంగా పెరిగినప్పుడు
2. పిచ్చుకలు తమ గూళ్ళను చెట్లపై తక్కువ ఎత్తులో కట్టుకున్నప్పుడు, అవి ఆహారాన్ని ముందుగానే సమకూర్చుకుంటున్నప్పుడు
3. చీమలు పుట్టల్ని ఎత్తు మీద కట్టుకున్నప్పుడు
4. చలికాలానికి ముందే సాలీళ్లు ఎక్కువగా కనిపించినప్పుడు
5. పక్షులు ముందుగానే వలస వెళ్లిపోయినప్పుడు
... ఇలా ప్రజల్లో చాలా నమ్మకాలు ఉన్నాయి.
జంతువులన్నీ ఇలా శీతాకాలాన్ని గడపడానికి సిద్ధమవుతుంటే అలస్కాలోని వేటకుక్కలు మాత్రం రేస్‌కు సిద్ధమవుతూ ఉంటాయి. మంచులో వందల కిలోమీటర్లు పరిగెట్టగల కుక్కలు అవి.
అలస్కా: ది గ్రేట్ డాగ్ రేస్
అలస్కాలో ఏటా మార్చి నెల మొదటి శనివారం మొదలవుతుంది డాగ్ రేస్. ఒక్కో జట్టులో 16 కుక్కలు ఉంటాయి. ఓ చిన్న బండిపై వాటి యజమాని కూర్చుంటే ఆ కుక్కలన్నీ ఆ బండిని లాక్కుంటూ మంచు కొడల్లో 1,868 కి.మీ ప్రయాణించి గమ్యాన్ని చేరాల్సి ఉంటుంది. రేస్ పూర్తవడానికి 10 నుంచి 30 రోజులు దాకా పట్టవచ్చు. మార్గమధ్యంలో మంచు తుపానులకి, చలికి కుక్కలకు, మనుషులకు ఆరోగ్యం క్షీణించవచ్చు. అందుకే ఈ రేస్‌లో పాల్గొనడమంటేనే పెద్ద సాహసం. అయినా సరే ఎన్నో జట్లు ఈ రేస్‌లో పాల్గొంటాయి. కొండలు, టండ్రా గడ్డిభూములు, నదులు దాటుకుంటూ ప్రయాణిస్తాయి. ఒక్కోసారి ఉష్ణోగ్రత మరీ తగ్గి మైనస్ 70 డిగ్రీలకి చేరుతుంది. అయినా రేసులు మాత్రం ఆగిపోవు. డాగ్ రేస్ అంత పేరున్న క్రీడ అలస్కాలో మరొకటి లేదంటే ఆశ్చర్యం కాదు. అలస్కాకు చెందిన యాభైకి పైగా జట్లతోపాటు మరో 20 దేశాల నుంచి కూడా జట్లు వచ్చి ఈ రేసులో పాల్గొంటాయి. మహిళలు కూడా ఇందులో పాల్గొనడమే కాదు రెండుసార్లు గెలిచారు కూడా! ఇంతదూరం సాగే రేస్ భూమి మీద మరోటి లేదు. అందుకే దీనిని 'లాస్ట్ గ్రేట్ రేస్ ఆన్ ఎర్త్' అని అంటారు.
రేస్‌లో పాల్గొనే వాళ్లనే కాదు, వారి కుక్కల్ని సైతం ఇక్కడ సెలబ్రిటీలుగా భావిస్తారు. చిన్న చిన్న పోటీలు అలస్కాలో ఎప్పట్నించో జరుగుతున్నా ఎంతో దూరం సాగే ఈ రేస్ మొదలైంది మాత్రం 1973లో. ఎనిమిది రోజుల 22 గంటల 47 నిమిషాల 2 సెకన్లలో చేరుకుని 2002లో మార్టిన్ బుసర్ రికార్డు సృష్టించాడు. సంబరంలా సాగే ఈ పోటీకి ప్రపంచ మీడియాతో పాటు చాలా దేశాల సినీ తారలు కూడా వెళతారు. అందుకే ఈ రేస్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
వింటర్ ఒలింపిక్స్
ఇప్పటి దాకా మనం చెప్పుకున్న ఆటలన్నీ ఆయా దేశాల ప్రత్యేకతలయితే నాలుగేళ్లకోసారి జరిగే 'వింటర్ ఒలింపిక్స్'కి మరో రకం ప్రత్యేకత ఉంది. సమ్మర్ ఒలింపిక్స్‌లో ఉండే క్రీడలేవీ వింటర్ ఒలింపిక్స్‌లో ఉండవు. కేవలం మంచులో ఆడే ఆటలే ఉంటాయి. స్కీయింగ్, ఐస్‌హాకీ, ఫిగర్ స్కేటింగ్, స్పీడ్ స్కేటింగ్, ఇలా... మొత్తం పదిహేను రకాలు ఆటలుంటాయి. వీటిని ఆటలనే కన్నా మంచుపై విన్యాసాలంటేనే బాగుంటుందేమో.
వింటర్ ఒలింపిక్స్‌ను మొదటిసారి 1924లో ఫ్రాన్స్‌లో నిర్వహించారు. ఉత్తరార్థగోళంలో చలికాలం నవంబర్ ఫిబ్రవరిల మధ్య వస్తుంది కదా... అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రతి సారి ఫిబ్రవరి నెలలో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది (2010) జరిగిన 21వ వింటర్ ఒలింపిక్స్‌కు కెనడాలోని వాంకోవర్ వేదికగా నిలిచింది. మొత్తం 82 దేశాలకు చెందిన 2,600 మంది క్రీడాకారులు దీనిలో పాల్గొన్నారు. ఈ క్రీడలు కెనడాలో జరగడం ఇది మూడోసారి. దక్షిణార్థగోళంలో అంటార్కిటికా ఖండంలో తప్ప మరెక్కడా చెప్పుకోదగినంతగా చలి ఉండదు కాబట్టి వింటర్ ఒలింపిక్స్ దక్షిణార్థగోళంలో ఇంతవరకు జరగలేదు.
పైన చెప్పిన ఆటలు, విశేషాలన్నీ ఉత్తరార్థగోళానికే పరిమితమైనా నిజానికి భూగోళం మీద అతి శీతల ప్రాంతం మాత్రం అంటార్కిటికా. ఆ ఖండంలో స్థిరనివాసాలు లేవు కాబట్టి ఇలాంటి విశేషాలకు అవకాశం కూడా లేదు. అయితే చాలా దేశాలకు ఇక్కడ పరిశోధనా కేంద్రాలున్నాయి. ఆ కేంద్రాలలో 5000 మందికి పైగా శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు. కాని శీతాకాలం వచ్చేనాటికి వారిలో చాలామంది తిరిగి వచ్చేస్తారు. కేవలం ఓ వెయ్యిమంది మాత్రమే అక్కడ ఉంటారు. భూమ్మీద రికార్డు చేసిన అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ 89.2 డిగ్రీలు. అంటార్కిటికా లోని రష్యాకి చెందిన పరిశోధనా కేంద్రం 'వోస్టాక్ స్టేషన్'లో నమోదైన ఉష్ణోగ్రత అది.
***
ఇక్కడ పేర్కొన్న వింటర్ విశేషాలు కొన్ని మాత్రమే. చెప్పుకుంటూపోతే ఇంకా ఇలాంటివి బోలెడుంటాయి. వీటిలో కొన్ని మరీ విడ్డూరంగా ఉన్నాయని మీరనుకోవచ్చు. అయితే ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను అందమైన అనుభవాలుగా ఎలా మలచుకోవచ్చో ఈ విశేషాలు చదువుతుంటే తెలియట్లేదూ!
వింటర్‌లో బడికెళ్లాల్సిందే...
మన దేశంలోని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా శీతాకాల ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి దిగిపోతాయి. కాశ్మీర్ లోయలో అయితే సరస్సులన్నీ హిమ శిలలుగా మారిపోతాయి. మనకి వేసవి సెలవులు ఇచ్చినట్టు అక్కడ చలికాలం సెలవులు కూడా ఇస్తారు. అందుకే చలికాలం వచ్చిందంటే అక్కడ బడిపిల్లలందరికీ పండగ. మంచులో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం స్కూళ్లకి చలికాలం సెలవులు లేవని ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆధునిక విద్యా విధానం మొదలైన తర్వాత 1880 నుంచి ఇప్పటి దాకా వింటర్ హాలిడేస్ రద్దు చేయడం ఇదే మొదటిసారి. చిట్టిపొట్టి చిన్నారులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు లెండి. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ఇచ్చి సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లు యధావిధిగా కొనసాగాలని సూచించింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కాశ్మీర్లో నెలల తరబడి కొనసాగిన ఆందోళనలు, కర్ఫ్యూల వల్ల స్కూళ్లు అసలు నడవలేదు. పాఠాలు పూర్తి చేయడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదట.
* నాగేశ్వరరావు తమనం
No comments:
Post a Comment