Thursday, December 30, 2010

మద్యం ముచ్చట్లు

ఆల్కహాల్ ప్రియులకి మన దేశంలో లభ్యమయ్యేవి విస్కీ, బ్రాందీ, జిన్, రమ్, బీర్‌లు మాత్రమే. కాని ఇవేకాక వివిధ దేశాల్లో ఇతర రకాల మద్యాలు కూడా తయారుచేస్తున్నారు. అవి మన దేశంలో సామాన్యులకి లభ్యంకావడం లేదు.
1. సాకీ- జపాన్
జపనీస్ భాషలో ‘నిహోంఘా’గా పిలిచే సాకీలో 17% ఆల్కహాల్ ఉంది. ఏడో శతాబ్దంలో క్యోటో నగరంలోని ఇంపీరియల్ పేలస్‌లో దీన్ని మొదటిసారిగా తయారుచేసారు. బియ్యంతో చేసే సాకీ పారదర్శకంగా ఉండే ద్రవం. దీంట్లో అనేక వెరైటీలున్నాయి. జపాన్‌లోని 1600 బ్రూవరీలలో సాకీ తయారవుతుంది.

2. గిన్నిస్-ఐర్లండ్
డబ్లిన్‌లో కనిపెట్టబడ్డ గిన్నిస్‌ని వేయించిన బార్లీని మాల్ట్‌చేసి, దానికి హాప్స్, నీరుని కలిపి తయారుచేస్తారు. ఈ ద్రవం నల్లగా ఉంటుంది. ఎందుకంటే, కాఫీగింజల్లా వేయించిన బార్లీ నల్లగా ఉంటుంది కాబట్టి. దీని నురగ మాత్రం తెల్లగా ఉంటుంది. ఇది బీర్ తరగతికి చెందింది.
3. బీర్- బెల్జియం

బెల్జియంలో 450 రకాల బీర్లని, వాటిని తాగేందుకు అన్ని రకాల గ్లాసులని తయారుచేస్తారు. నెపోలియన్ ఫ్రాన్స్‌ని పాలించే రోజుల్లో అక్కడినుంచి బెల్జియంకి పారిపోయి వచ్చిన క్రైస్తవ సన్యాసులు ఇక్కడ బీర్‌ని తయారుచేసేవారు. లేత బంగారు రంగులో, నురగలో ఉండే ఈ బీర్‌లో కొత్తిమీర లాంటి మూలికలు కూడా వేస్తూంటారు. గ్లాసునిబట్టి ఏ రకం బీర్‌ని తాగుతున్నారో గ్రహించవచ్చు.
4. ఆబ్సింతే- చెక్ రిపబ్లిక్
పందొమ్మిదో శతాబ్దంలో యూరప్ దేశాల్లో నిషేధించిన ఆబ్సింతే అనే ఆల్కహాల్, చెక్ రిపబ్లిక్‌లో తయారుచేస్తారు. నిషేధానికి కారణం దీంట్లో ఆల్కహాల్ శాతం 45% నుంచి 74%దాకా ఉంటుంది. మూలికల, ఆకులు, పువ్వులతో వాటి రుచి వచ్చేలా తయారుచేసే ఆబ్సింతే, ఆకుపచ్చ రంగులోకాని, రంగు లేకుండా కాని ఉంటుంది.
5. బర్గండీ వైన్- ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లోని బేర్‌గోగ్నే అనే ప్రాంతంలో పండే ద్రాక్షతో తయారుచేసే ఈ వైన్ రుచి ప్రపంచంలో మరి ఇంకే వైన్‌కీ రాదు. సున్నపు రాతి నేలలో గుర్తించిన ప్రాంతంలోనే పండే ద్రాక్షపళ్ళతో చేసిన వైన్‌నే బర్గండీ వైన్ అంటారు. ఈ ప్రాంతంలోని ద్రాక్ష తోటలన్నీ తొలుత చర్చి ఆధీనంలో ఉండేవి. ఇక్కడ రెడ్ బర్గండి, లైట్ బర్గండి అనే రెండు రకాల వైన్‌లు తయారవుతాయి.
6. బెచెరోకో- చెక్ రిపబ్లిక్
36% ఆల్కహాల్ గల బెచెరోకాని తయారుచేసే పద్ధతి ప్రపంచంలో కేవలం ఇద్దరికే తెలుసు. దీన్ని బ్రూవరీలోకి వచ్చి వారిద్దరే దీన్ని వర్కర్స్ సహాయంతో తయారుచేస్తారు. అనేక రకాల మూలికలని, మసాలా దినుసులని ఓ చిన్న గోదాంలో ఉంచి ఆల్కహాల్‌తో వారంపాటు దాన్ని నాననిస్తారు. ఆ ఆల్కహాల్‌కి నీరు, చక్కెర కలిపి ఓక్ బేరల్స్‌లో రెండు నెలలు నిలువ ఉంచుతారు.
7. కైపి రోస్కా- బ్రెజిల్
ఓడ్కా, నిమ్మ రసం, చక్కెర కలిపి చేసే ఇది నిజానికి ఓ కాక్‌టెయిల్. బ్రెజిల్ దేశంలోని అన్ని బార్లలో క్లబ్‌లలో దీన్ని సర్వ్ చేస్తారు. ఇటీవలే ఇది ప్రపంచానికి తెలిసి, మిగిలినచోట్ల కూడా లభ్యం అవుతోంది.
8. జార్జి డికెల్ టెనె్నట్ విస్కీ- అమెరికా
1870లో జార్జి డికెల్ తను చేసే విస్కీ, స్కాచ్ విస్కీని పోలి ఉందని, విస్కీ స్పెల్లింగ్‌లోని ‘ఇ’ని తీసేసి దానికి కాపీరైట్ తీసుకున్నాడు. బార్లీ, రై, కార్న్‌లతో రెండుసార్లు డిస్టిల్ చేసి, వైట్ ఓక్ బేరల్స్‌లో పనె్నండేళ్ళు పాతరేసిన ఈ విస్కీకూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఐతే ఇది అన్ని దేశాల్లో లభ్యంకాదు.
9. టెకూలా- మెక్సికో
మెక్సికోలోని టెకూలా ప్రాంతంలోని ‘బ్లూఅజేవ్’ అనే మొక్కని ఫెర్మెంట్ చేసి చేసే టెకూలా పారదర్శకంగా ఉండే లిక్కర్. ఓక్ కాస్క్‌లో పాతరేసిన దీంట్లో ఆల్కహాల్ శాతం ఎక్కువ (38-40%) మెక్సికో చట్టం ప్రకారం ఎర్రటి అగ్నిపర్వత బూడిదగల భూమిలో పండే బ్లూఅజేవ్ నుంచే దీన్ని తయారుచేయాలి. ఇతర దేశాల్లో దీన్ని తయారుచేయకుండా మెక్సికో దీనికి ఇంటర్నేషనల్ కాపీ రైట్స్‌ని తీసుకుంది. పదహారో శతాబ్దంలో కనిపెట్టబడ్డ దీంట్లో అయిదారు రకాలున్నాయి.
10. ఓడ్కా- పోలెండ్
బంగాళాదుంపలు, లేదా రైస్టార్చ్‌తో తయారుచేసే ఈ లిక్కర్ తాగితే పెద్దగా హేంగోవర్ ఉండదు. 16వ శతాబ్దంనుంచి దీన్ని పోలెండ్‌లో తయారుచేస్తున్నారు. ప్రతీ బాటిల్‌లో ఓ రకం గడ్డిపోచని ఉంచి బాటిల్ చేయడం ఆనవాయితీ.

ashlesha


Wednesday, December 29, 2010

శూన్య బంగారం... '' పరుసవేది '' అల్‌కెమీ అంటే పరుసవేది. సువర్ణ శాస్త్రం. బంగారాన్ని తయారుచేసే ప్రక్రియ.

అల్‌కెమిస్ట్ అంటే రసాయనాల ద్వారా బంగారాన్ని తయారుచేయగలిగిన వాడు. అల్‌కెమీ అంటే పరుసవేది. సువర్ణ శాస్త్రం. బంగారాన్ని తయారుచేసే ప్రక్రియ. అల్‌కెమిస్ట్ నవలలో శాంటియాగో అనే గొర్రెలకాపరి బంగారాన్ని అన్వేషిస్తూ ప్రయాణం ప్రారంభిస్తాడు. బంగారాన్ని తయారుచేసే విద్య తెలుసుకున్నాడా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నవాడు సర్ ఐజాక్ న్యూటన్. మూడు వందల ఏళ్ల కిందట... న్యూటన్ కూడా బంగారాన్ని సృష్టించవచ్చని నమ్మాడు. కాని బంగారాన్ని సృష్టించగలిగాడా? ఇంకా పూర్వం... ఆరు వందల ఏళ్ల కిందట... వేమన పరుసవేది విద్యను ఔపోసన పట్టాడన్నారు. వేమన రాసిన పద్యాల్లో పరుసవేది విద్యకు సంబంధించిన రహస్య సమాచారం నిక్షిప్తమై ఉందని భావించారు. నిజంగా వేమన బంగారాన్ని తయారు చేయగలిగాడా? మనిషి బంగారాన్ని సృష్టించగలడా? బంగారాన్ని మనం తయారుచేయగలమా? పరుసవేది విద్య... నిజమేనా? ఒట్టి నమ్మకమేనా? లేక శూన్యమేనా?

బంగారాన్ని ల్యాబ్‌లలో తయారుచేయడం అనే ఆలోచనను సైన్సు ఒప్పుకోదు. అదసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. అందుకు వాళ్లు చెప్పే రీజనింగ్ వేరే.


బంగారం.
ఆ మాట వింటేనే ఎవరికయినా మనసు మెరుస్తుంది. ఒళ్లంతా బంగారం అవ్వాలనుకుంటారు మగువలు. ఇల్లంతా బంగారం కావాలనుకుంటారు మగవారు. ముట్టుకుంటే రాయి కూడా బంగారమైపోవాలన్నది చాలామంది కల. మిడాస్ టచ్ కథ అలా పుట్టిందే. బాబాలూ, స్వామీజీలు గాల్లో చేతులు ఊపి బంగారు గొలుసులు, ఉంగరాలూ సృష్టిస్తే మనకు ఆశ్చర్యం. ఇంటి పెరట్లో బంగారు నగలు దొరుకుతాయంటూ ఆశలు రేపి మోసాలు చేస్తుంటారు మంత్రగాళ్లు. ఎంత బంగారం ఉంటే అంత సంపద. ఎంత లేకపోతే అంతకు అన్నింతల ఆశ. బంగారాన్ని మనిషి కనుగొన్న నాటి నుంచి, బంగారం గొప్పదనాన్ని తెలుసుకున్న నాటి నుంచి, దాన్ని ఆభరణంగా వాడటం మొదలుపెట్టిన నాటి నుంచి బంగారం అంటే మనిషికి అపరిమితమైన వ్యామోహం.

ఇప్పుడూ అప్పుడూ కాదు... లక్షల సంవత్సరాలుగా బంగారం మీద మనిషికి తరగని మమకారం. కాని ఏం లాభం? మనిషికి ఆశ ఉన్నంతగా ఈ భూమి మీద బంగారం లేదు. మనిషి బంగారాన్ని కనుగొన్న నాటి నుంచి 2009 వరకూ వెలికి తీసిన బంగారం మొత్తం లక్షా 65 వేల టన్నులు. అయినా కూడా ఈ బంగారం సరిపోదు. ఇంకా బంగారం కావాలి. బతుకంతా బంగారుమయం కావాలి. కొన్ని యుగాలుగా మనిషిని వీడని ఆశ! ఈ ఆశకు ఫలితమే పరుసవేది. బంగారాన్ని తయారుచేసే విద్య.


ఆనాటి ఈజిప్టు, మెసొపటేమియా, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీకు, రోమన్, ఆధునిక యూరప్ దేశాలలో శతాబ్దాలుగా రసాయన శాస్తవ్రేత్తలు బంగారాన్ని తయారుచేయడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రక్రియనే అల్‌కెమీ అంటారు. మనం పరుసవేది అంటున్నాం. ఐదు వేల సంవత్సరాల కిందట పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేసేవారు అనే కథలున్నాయి. ఒక్కోసారి ఊహలు నిజమవుతాయనిపిస్తాయి. అప్పట్లో అది సాధ్యమని చాలామంది శాస్తవ్రేత్తలు భావించారు. శ్రమించారు.

బంగారాన్ని మనిషి తయారుచేయవచ్చన్న ఆలోచన అప్పట్లో ఎంత బలంగా ఉందంటే, సర్ ఐజాక్ న్యూటన్ లాంటి గొప్ప సైంటిస్టు కూడా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేయడానికి ప్రయోగాలు చేశాడు. 17వ శతాబ్దానికి సంబంధించిన యోగి వేమన కొద్దిరోజులు యోగ విద్య నేర్చుకుని పరుసవేది ప్రయోగాలు చేశాడని కథలున్నాయి. ఆ బంగారు సృష్టికి సంబంధించిన విద్య రహస్యాలను ఆయన పద్యాల్లో నిక్షిప్తం చేశాడన్న ప్రచారం ఉంది. దీనితో చాలా కాలంగా వేమన పద్యాల్లో నిగూఢ అర్థాలేమయినా ఉన్నాయా? అనే విషయం మీద పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.


‘‘ఉప్పు చింతకాయ ఊరిలోనుండగ...
కరువదేల వచ్చు కాంతలారా...’’

...లాంటి పద్యాల్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించిన దాఖలాలూ ఉన్నాయి. కాని ఇదంతా నిజమేనా? సాధ్యమేనా? లేక ఒట్టి అభూతకల్పనా? బంగారాన్ని తయారుచేయడం సైన్సా? ఫిక్షనా?

దుస్సాధ్యం... అంటుంది సైన్సు.
బంగారాన్ని ల్యాబ్‌లలో తయారుచేయడం అనే ఆలోచనను సైన్సు ఒప్పుకోదు. అదసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. అందుకు వాళ్లు చెప్పే రీజనింగ్ వేరే.
బంగారం... అంటే గోల్డ్... దీనినే లాటిన్‌లో అరమ్ అంటారు. గోల్డ్ కూడా ఒక కెమికల్ ఎలిమెంట్. దాని సింబల్ అఠ. గోల్డ్ అటామిక్ నెంబర్ 79. బంగారం విశిష్టత ఏమిటంటే, దీనికి కెమికల్ రియాక్షన్స్‌ని తట్టుకుని నిలబడే శక్తి ఎక్కువ ఉంటుంది. మిగతా లోహాలతో తేలికగా కలిసిపోగలుగుతుంది. కెమికల్‌గా గోల్డ్ ఒక ఎలిమెంట్ అయినప్పుడు... దాన్ని సృష్టించడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తారు సైంటిస్టులు. ప్రకృతిసిద్ధంగా తయారయిన కొన్నింటినే మూలకాలు గుర్తించారు. ఇనుము ఒక మూలకం... వెండి, కాంస్యం, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్... ఇలా వేటికవే ప్రత్యేకమైన ఎలిమెంట్స్. ఇవి బేస్ ఎలిమెంట్స్. వాటి సమ్మేళనం ద్వారా తయారుచేయగలిగేవే ఇతర రసాయనాలు లేదా లోహమిశ్రమాలు (అలాయ్స్). అలాంటి ఒక కెమికల్ ఎలిమెంట్ అయిన బంగారాన్ని సృష్టించడం మానవమాత్రుడికి సాధ్యం కాదు అన్నది సైంటిస్టుల వాదన. అందుకే ఇంతవరకూ పరుసవేది ద్వారా బంగారాన్ని ఎవ్వరైనా సృష్టించారు అంటే అది నమ్మనవసరం లేదని అంటారు వారు. మరి ఇంతకాలం మనం విన్న పరుసవేది కథలన్నీ పుక్కిటి పురాణాలేనా?

ప్రపంచం రోజురోజుకూ పెరుగుతోంది. మనుషుల సంఖ్య పెరుగుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. బంగారం ఎంత ఉంటే అంత సంపద. ఇది ఒక్క మనిషికో, కుటుంబానికో సంబంధించినది మాత్రమే కాదు. ఒక దేశానికి ఎంత బంగారు నిల్వలు (గోల్డ్ రిజర్వ్) ఉంటే అంత సంపన్న దేశంగా గుర్తింపు ఉంటుంది. బంగారానికి కొన్ని యుగాలుగా ఉన్న డిమాండు ఇంకొన్ని యుగాలయినా ఉంటుంది. బంగారం మీద మనిషికి ఆశ కొనసాగుతుంటుంది. టెక్నాలజీ పెరుగుతోంది, మనిషి మేధస్సు పెరుగుతోంది, కాబట్టి బంగారాన్ని తయారుచేయడానికి మనిషి మార్గాలు అన్వేషిస్తూనే ఉంటాడు. కాని ఎప్పటికయినా మనిషి పరుసవేది విద్యను నిజం చేయగలుగుతాడా? బంగారాన్ని సృష్టించగలుగుతాడా?


ఏమో... బహుశా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారుచేయడం సాధ్యపడొచ్చు అనే వాళ్లూ ఉన్నారు. అందుకు శాస్ర్తీయంగా వాళ్లు చెప్పే కారణాలూ సహేతుకంగానే ఉన్నాయి. బంగారం ఒక రసాయనమూలకం. ఇది కొన్ని బంగారు అణువుల సముదాయంగా ఉంటుంది. కొన్ని చౌకయిన లోహాలు, మిశ్రమాల ఎలిమెంట్లను సబ్‌అటామిక్ స్థాయిలో బ్రేక్ చేయగలిగి, వాటి ద్వారా బంగారుఅణువు తయారుచేయగలిగితే, ఆ లోహాలు లేదా మిశ్రమాలు బంగారంగా మారే అవకాశం ఉంటుందన్నది కొందరు సైంటిస్టుల వాదన. అయితే, అలా చేయడానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ అంతటి భారీ పరిమాణంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అంత కష్టపడి బంగారాన్ని సృష్టించడం కన్నా బంగారాన్ని ఎంత ధరయినా పెట్టి కొనడమే చౌక. అంటే.. పరుసవేది విద్య నిజం కావచ్చనే సూచనలు ఉన్నట్టేగా! బహుశా ఈ దిశగా ఇంకొన్ని ప్రయోగాలు జరిగితే మనిషి ఏనాటికయినా బంగారాన్ని సృష్టించగలుగుతాడా? ఇప్పటికంటే పూర్వకాలమే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది ఉంటుందా? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలు.


పరుసవేది విద్య గురించి కేవలం శాస్తవ్రేత్తలు మాత్రమే కాదు, సన్యాసులు, బౌద్ధులు, వేదాంతులు కూడా మాట్లాడారు. దీనితో వేదాల్లోనూ, పూర్వకాలపు శాస్ర్తాల్లోనూ పరుసవేది రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయని నమ్మి మళ్లీ చాలామంది పరిశోధనలు చేశారు. అంత జ్ఞానాన్ని మధించిన తర్వాత వాళ్లకు ఒక విషయం మాత్రం స్పష్టమయింది. వేదాంతులు, ఫిలాసఫర్లు చెప్పే పరుసవేదికి మాత్రం ఇక్కడ అర్థం వేరు. మనిషి బంగారాన్ని తయారుచేయడం కాదు. మనిషే బంగారంగా మారాలంటారు వాళ్లు. ఇక్కడ పరుసవేది... మనస్సుకు సంబంధించిన విద్య. మంచి మనసు కన్నా బంగారం ఏముంటుంది?


విద్యంటే... ఇదే బంగారం!
ప్రఖ్యాత రచయిత పాలో కొయెలో రాసిన ‘ద అల్‌కెమిస్ట్’ (తెలుగులో పరశువేది)లో చెప్పిందీ ఇదే. బంగారానికి సంబంధించిన ఇంకొన్ని కథలు చెప్పిందీ ఇదే. అలాంటి ఓ తాత్త్వికమైన కథ ఇది.
అనగనగా ఒక ఊళ్లో... ఓ అందమైన యువకుడు. అతనికి కొత్తగా పెళ్లయింది. అబ్బాయి మంచివాడే కాని అతనితో ఒక్కటే సమస్య. పగలూ, రాత్రి అతడు పరుస వేది ప్రయోగాలు చేస్తూ గడిపేస్తున్నాడు. అతని భార్య కలవరపడిపోయింది. ఇల్లు గడవడమే కష్టమయిపోతోంది. ఉద్యోగం చేయమంటే వద్దంటున్నాడు. బంగారాన్ని సృష్టించి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని అయిపోతానంటున్నాడు.
అమ్మాయి వెళ్లి తన తండ్రి దగ్గర గోల పెట్టింది. మీ అల్లుడుగారిని మార్చండి అంటూ ప్రాథేయపడింది. అప్పుడు మామగారు అల్లుడి దగ్గరకు వెళ్లారు. కాని ఆయన మందలించలేదు.

‘‘బాబూ... నిన్ను చూస్తే ముచ్చటగా ఉందయ్యా... చిన్నతనంలో నేను కూడా పరుసవేది ప్రయోగాలు చేశాను. బంగారాన్ని తయారు చేసే ఫార్ములా కనుక్కున్నాను. అది నీకు చెప్పాలని ఉంది...’’ అన్నారు. అబ్బాయి మొహం వికసించింది. చెప్పండన్నాడు ఆత్రుతగా.

‘‘అరటిపండ్ల మీద ఏర్పడే తెల్లని ధూళి ఉంటేగాని నీ ప్రయోగం ఫలించదు... కాని అందుకు రెండు టన్నుల ధూళి కావాలి..’’ చెప్పాడు మామగారు. అబ్బాయి ఆలోచించలేదు. వెంటనే పొలంలో అరటి తోట వేశాడు. తనే దగ్గరుండి తోటను చూసుకున్నాడు. చక్కని పంట పండించాడు. ధూళితో మామగారి దగ్గరకు వెళ్ళాడు.
‘‘ఇది అవసరం లేదయ్యా... నువ్వు ఇప్పటికే బంగారాన్ని సాధించావు’’ అన్నాడు చల్లగా.
అబ్బాయి ఆశ్చర్యపోయేలోపే... పక్కనుంచి అమ్మాయి వచ్చింది. ఆమె రెండు సంచుల నిండా బంగారం కాసుల్ని అతని ముందు బోర్లించింది. అప్పుడు మామగారు చెప్పారు...
‘‘నువ్వు శ్రమపడి పండించిన అరటిపండ్లను అమ్మాయి అమ్మి ఇంత సొమ్ము సంపాదించింది. ఇదేనయ్యా... పరుసవేది...’’ అన్నారు. అబ్బాయికి జ్ఞానోదయం అయింది.
- సతీశ్ కుమార్

Tuesday, December 28, 2010

ఓపావురమా... నీసేవకు జోహార్లు

పావురం మన నేస్తం. శాంతి చిహ్నం. మతపరంగా విశిష్టత కలది. పావురం మనకు ఎన్నో రూపాల్లో సేవలందించింది. అందిస్తూనే ఉంది.
- కొన్ని దేశాల్లో పావురాల పెంటకు భలే గిరాకీ. దీన్ని ఎరువుగా పంటలకు ఉపయోగిస్తూ ఉంటారు. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో పావురాల పెంటతో సాల్ట్‌పీటర్‌ను తయారు చేసేవారు. ఈ సాల్ట్‌పీటర్ గన్‌పౌడర్ తయారీలో ప్రధాన మూలకం.
- మొదటి, రెండవ ప్రపంచయుద్ధాల్లో ఎంతో మంది సైనికుల ప్రాణాలను పావురాలు రక్షించాయి. శత్రుదేశాలకు సమాచారాన్ని చేరవేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషించాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో చెర్అమి అనే పావురం అందించిన సేవలను చాలా విలువైనవిగా చెబుతారు. వందల మంది ఫ్రెంచ్ సైనికుల ప్రాణాలను అది కాపాడింది. శత్రుదేశానికి సమచారం అందించి తిరిగి వస్తుండగా తీవ్రంగా గాయపడింది. అయినా 25 నిమిషాలు అలాగే ప్రయాణించి స్వదేశానికి సమాచారాన్ని చేరవేసింది. ఇందుకు గుర్తింపుగా క్రాక్స్ డీ గ్వెర్ అనే పురస్కారాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రదానం చేసింది.

- యుద్ధ సమయాల్లో సైనికులు పావురాలను తమతోపాటుగా ఓడల్లో తీసుకెళ్లేవారు. ఎక్కడైనా ఓడ మునిగిపోయే పరిస్థితి ఉంటే ఇవి ముందుగానే తె లియజేసేవి.
- క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో పావురాలను సమాచార పంపిణీకి వారధులుగా సిరియా, పర్షియా, ఈజిప్టుల్లో ఉపయోగించారు. చాలా దేశాల్లో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేంతవరకూ పావురాలను సమాచారా బట్వాడాకు వినియోగించారు.
ఈ రేసింగ్ పావురాలకు మార్కెట్లో భలే గిరాకీ ఉంది. ఇరవై ఒక్కవేల పావురాలను ఓడించి లక్ష్యాన్ని చేరుకున్న ఓ పావురాన్ని కొంత కాలం క్రితం ఓ బ్రిటిష్ కంపెనీ సుమారుగా అరవైలక్షల తొంబైఐదువేల రూపాయలు పెట్టిమరీ కొనుగోలు చేసింది.

- గతంలో పావురాలు అడవుల్లో మాత్రమే ఉండేవి. తర్వాత అవి మనకు దగ్గరయ్యాయి.
- పావురాలు చాలా తెలివైన పక్షులు. ఒకే మనిషికి సంబంధించిన రెండు చిత్రాల మధ్య తేడాలను ఇవి గుర్తించగలవు. ఇంగ్లిష్‌లో ఉన్న 26 అక్షరాలను కూడా గుర్తుపట్టగలవు.

Saturday, December 25, 2010

తీపిగురుతుల సంబరం.. కొత్త ఆశల సౌరభం .. కొత్త సంవత్సరం 2011

Sun-Rising
మంచు తెరలు తెరలుగా కురుస్తూనే ఉంది. చల్లగాలికి శరీరం చిగురుటాకులా వణుకుతోంది. మసకచీకట్లను చీల్చుకుంటూ బయటకొచ్చేందుకు ఉదయభానుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. బయటకు అడుగుపెడితే గడ్డకట్టిపోతానేమోననిపిస్తున్నా... ‘ఇంత పొద్దున్నే ఏమిటే నీ గొడవ’ అని అమ్మ తిడుతున్నా... నేను మాత్రం ఊరుకుంటానా... బయటికి వెళ్లాల్సిందేనని మారం చేస్తున్నా, అమ్మ ఎంత పెద్దదైనా... నా మారం ముందు ఆమె ఎంతో చిన్నదే. ఎందుకంటే నేను బుంగమూతి పెడితే ఆమె మనసు వెన్నలా కరిగిపోతుంది. ఇంకేముంది అమ్మ నాకు తలంటింది. చక్కగా ముస్తాబు చేస్తోంది. నేను ‘తొందర తొందర’ అని గొడవ చేస్తూంటే ‘ఉండవే ఏమిటా తొందర’ అంటూ తాను మాత్రం నన్ను బుట్ట బొమ్మలా తయారు చేసింది. కానీ ఆమెకేం తెలుసు నా తొందర గరించి టీచర్‌ దగ్గరకెళ్లాలి. నిన్ననే కొనిపెట్టుకున్న గ్రీటింగ్‌ కార్డు, యాపిల్‌ పండు ఇవ్వాలి. అందరికంటే నేనే ముందుండాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్‌ అందరి దగ్గరికెళ్ళాలి. వాళ్లు నన్ను కలవడానికి రాకముందే నేనే వాళ్లని కలవాలి. ఇవన్నీ ఆమెకేం తెలుసు... అందుకే అమ్మకేం తెలీదు.

newyear2ఏమిటిదంతా అంటారా?! అవును మరి ఆదునిక ప్రపంచంలో... కంప్యూటర్‌ యుగంలో... అన్నం తినడానికి కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ ఇచ్చే కాలంలో... వున్న మనకు పై విషయం అంత తేలిగ్గా గుర్తుకు రాదు. 21వ శతాబ్దంలో... కంప్యూటర్‌ యుగంలో కాలాన్ని మర్చిపోయి కంప్యూటర్‌తో కాలం గడిపేస్తున్న నాకు కొత్త ఏడాది వస్తుందనగానే గతం ఒక్కసారిగా కళ్లముందు కదిలింది. అవును అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. 365 రోజులు గిర్రున తిరిగి పోయాయి. నిన్నగాక మొన్న పోయినట్లుంది జనవరి ఒకటో తారీఖు. మళ్లీ వచ్చేసింది కొత్త ఏడాది తొలిరోజు. కాలచక్రం కంప్యూటర్‌ వేగంతో తిరుగుతోంది కదా!!

అంతా కాలం మాయ. అప్పట్లో కొత్త ఏడాది వస్తుందంటే రెండు, మూడు వారాల నుండే సందడి మొదలయ్యేది. గ్రీటింగ్‌ కార్డులు అమ్మే దుకాణాలతో, పూల అంగళ్లతో అంతా కళకళలాడుతుండేది. ఆత్మీయులందరికీ నూతన సంవత్సర తొలి రోజునే శుభాక్షాంక్షలు అందజేయాలన్న ఉత్సాహంతో కార్డు కొని పోస్టు చేసేవారు. ఇక పిల్లల సందడైతే చెప్పనలవి కాకుండా వుండేది. ఉద్యోగులు అందరూ అధికారులను స్వయంగా కలుస్తూ... పండ్లు, పుష్పగుచ్చాలను అందజేసి వారి పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేసేవారు.

newyear1 

ఇప్పుడేమో అంతా తారుమారు. మన మధ్యలోకి కంప్యూటర్‌ వచ్చేసింది. మనసు మధ్యలోకి సెల్‌ ఫోన్‌ చొరబడింది. శుభాకాంక్షలు చెప్పేందుకో ఆన్‌లైన్‌ గ్రీటింగ్‌ కార్డు. అభినందించేందుకో ఎస్సెమ్మెస్‌. అంతా మాయా ప్రపంచం. కార్డును కళ్లతో కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద చూసుకోవడం తప్పించి దాన్ని తాకి అవతలి వారికి మనపై ఉన్న ప్రేమాభిమానాన్ని ఆస్వాదిద్దామంటే ఇప్పుడు కుదిరే పని కూడా కాదు.

కొన్నేళ్ల క్రితం వరకు...
పిల్లల్లో... పెద్దల్లో నూతన సంవత్సరం అంటే ఓ వేడుక. ఇప్పుడూ అంతకంటే ఎక్కువగానే అనుభవిస్తున్నారు. మరెంతో ఉత్సాహంతో ఉరకలెత్తే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కానీ రోజులు మారిపోయాయి. అప్పట్లోలా అభిమాన సినీనటుడి బొమ్మతో ఉన్న అర్థరూపాయి గ్రీటింగ్‌ కార్డు చేతిలో పట్టుకుని స్నేహితులందరికీ తానే ముందివ్వాలనుకుంటూ పొద్దు పొద్దున్నే వీధుల్లో తిరుగుతూ చిన్నారులు చేసే సందడి కనిపించడం లేదు. ఆత్మీయ మిత్రుడిని కలిసి కరచాలనం చేసి తన్మయత్వం పొందే అవకాశం అసలే లేదు. మనుషుల్ని దగ్గర చేసి ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానులు పెంపొందేలా సమున్నత లక్ష్యాలతో జరుపుకునే వేడుక అసలు అర్థానికి దూరంగా జరిగిపోయింది.
పరుగు తీయాల్సిందే...
newyearఇందుకు పూర్తిగా మనల్ని తప్పుబట్టేకన్నా మారుతున్న కాలంతో కంప్యూటర్‌తో పోటిపడి పరుగు తీయాల్సిన జీవితం. జీవితంలో పైకి ఎదిగేందుకు ప్రపంచ నలుమూలలకు వెళ్లక తప్పని పరిస్థితులు వెరసి మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. అయితే ఆ దూరాన్ని చెరిపేయకున్నా... తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూ కంప్యూటర్‌, సెల్‌, ఇతర ఆధునిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరు కొంతలో కొంత నమయని చెప్పుకోవచ్చు.

నేటి సమాజంలో అత్యాధునిక పోకడతో కాలం వెళ్లదీస్తున్న యువత కూడా ఒకప్పుడు ఇదే కొత్త ఏడాదిని అంతరాలు మరచి ఆనందంగా జరుపుకున్న వారే. తమ చిన్ననాటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పులెన్ని ఉన్నా గతాన్ని మాత్రం మరువనంటోంది యువత.
సరదాలు... సంబరాలు...
newyear3గతంలో కేవలం ప్రముఖులకే పరిమితమైన కొత్త సంవత్సరపు వేడుకలు ఒక దశాబ్దపు కాలంగా పూర్తిగా మారిపోయాయి. నగరాలలో మొత్తం మత్తులో జోగడమే. ఈ పార్టీల కల్చర్‌ ఇప్పుడు మధ్యతరగతి వారికి వ్యాపించేసింది. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు... థీమ్‌లు... మధురానుభూతులు యువత గుండెల్లో నిలిచిపోతున్నాయి. వీటికి తోడు అసాంఘీక కార్యక్రమాలు కూడా పెరిగిపోతున్నాయి. ఉద్వేగం... ఉత్సాహం... ఒకటే హడావుడి... కాసింత ఒత్తిడి మరో రూపంలో చెప్పాలంటే బాధ్యతల సమాహారం. తమ జీవితంలో మరో కొత్త ఏడాదిని ఆహ్వానించేందుకు సిద్ధపడటం కన్నా అదేదో ఒక ట్రెండ్‌లాగా ఫాలో అయిపోతున్నారు. ఇక 31వ తేదీ రాత్రి పది గంటలు మొదలు ఈ పార్టీల సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల ఇవి మన హైదరాబాదుసహా మిగిలిన ప్రధాన నగరాల్లో బాగా విస్తరించాయి. అమ్మాయిలు సైతం ఇలాంటి పార్టీలు ఇస్తున్నారు. గల్లీ దోస్తులు, తోటి ఉద్యోగులు... ఇలా యువతరం అందర్నీ ఒక్కచోటకు చేర్చి తీపి జ్ఞాపకాలు, సరదా సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందకేళి, ఆటపాటలతో ఆ పూట ఆనందాల్లో తేలియాడుతుంటారు.

ఆట పాటలతో సమయాన్ని మరచి గడిపేయడం వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. కొత్త సంవత్సరం అంటేనే చాలు ఎక్కడలేని హుషారుతో ఊగిపోతారు. వీరిలో ఎక్కువగా ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన వారే కా మధ్యతరగతి యువత కూడా ఎక్కువగా పాలు పంచుకుంటారు.
ఎక్కడైనా మేముంటాం...
Newyear-gifts కుర్రాళ్ల వేడుకలు ఎక్కువగా వారి గదులు, ఫంక్షన్‌ హాళ్లు, శివారు రిసార్టులు, విల్లాలు, పబ్బుల్లోనే జరుగుతుంటాయి. డీజే సంగీత హోరులో యువతరం మైమర్చి ఆడిపాడతారు. అసలే కొత్త సంవత్సరపు వేడుకలు... పాటలు... డాన్సులు మారుమ్రోగుతున్నాయి. ఖర్చు అంటారా... వెయ్యి రూపాయల మొదలు లక్షల వరకు. సంతోషాలకు హద్దేలేదు. పిండి కొద్దీ రొట్టెలాగ ఎవరి స్థాయికి తగిన విధంగా వారు వెచ్చిస్తున్నారు. నగరాల్లో, పట్టణాల్లో 12 అయ్యిందంటే చాలు బైకులపై మద్యం తాగుతూ గోలచేస్తూ అరుస్తూ తిరగడం వీరి వేడుకలో ఒక భాగం. అమ్మాయిల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. ఇటువంటి వేడుకలలో ఇప్పుడిప్పుడే వీరూ పాల్గొంటున్నారు. వారి హాస్టల్స్‌... లేదా కళాశాలలు, పనిచోసే చోట్లలోనే వేడుకల్లో పాల్గొనేందుకు మక్కువ చూపిస్తున్నారు.
మనకిది పాతైపోయింది...
cellPhoneఅమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ రకం పార్టీలు ఎప్పటినుంచో వున్నాయి. మనకు తొలుత నగరంలోని తారలు... ప్రముఖుల పిల్లల నుంచి మొదలైన ఈ సంస్కృతి సాధారణ యువతీ యువకుల వరకు పాకింది. వీటిని నిర్వహించేందుకు పనిగట్టుకుని కొన్ని ఈవెంట్‌ మేనేజ్‌మెంట సంస్థలు సైతం నగరంలో పనిచేస్తున్నాయి. కొత్త కొత్త ఆకర్షణీయ ప్యాకేజీలలో భాగంగా ఈ సేవలను అందిస్తున్నాయి.. రకరకాల థీమ్‌లతో పార్టీలను నిర్వహించడం వీరి ప్రత్యేకత. హవాయి థీమ్‌ అంటే కొబ్బరి చెట్లు, కొడలతో కేరళ వాతావరణం ప్రతిబింబిస్తుంది. బీచ్‌ థీమ్‌లో సముద్రపు ఒడ్డున ఉన్నట్లు భ్రమ కల్పించేస్తారు వీరు. సినీ థీమ్‌ అంటే మీకు అర్థమయిపోయే వుంటుంది. హిందీ సినిమా పోస్టర్లతో అలంకరించి మరీ అలరిస్తారు. ఎవరి అభిరుచికి తగినట్లుగా వారికి వీరు సిద్ధం చేస్తారు. వీటికి రేంజ్‌ను బట్టి 50 వేల నుండి లక్షల వరకూ వసూలు చేస్తారు. ఎవరి స్థాయిలో వారు ఈ కొత్తసంవత్సరానికి సన్నాహాలు చేసుకుంటారు.
వింత పోకడలు...
గతంలో మన నగరాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గతేడాది న్యూయర్‌ వేడుకల్లో పాల్గొని తిరిగివెళ్తున్న అమ్మాయిలను ఆపి కొందరు యువకులు మద్యం మత్తులో చేసిన వింత చేష్టలకు సభ్యసమాజం నివ్వెరపోయింది. వారి వస్త్రాలను తీయించి ఫొటోలు తీసి మరీ నెట్‌లో పెట్టిన ఆ సంఘటనను ఇప్పటికీ ఏ తల్లిదండ్రులూ మర్చిపోలేరు. ఇక నగరంలో మరో చోట కారులో వెళ్తున్న వారిపై బీర్‌ బాటిల్స్‌ విసిరి, ఏంటని ప్రశ్నించిన వారిపై చేయి చేసుకున్న ఆకతాయిలపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. వేడుకల పేరుతో ఇటువంటి అసాంఘీక కార్యకలాపాలు కూడా కొత్త సంవత్సరపు వేడుకల్లో భాగంగా మారిపోయాయి. మరికొన్ని చోట్ల ఏటిఎం సెంటర్ల అద్దాలు పగులగొట్టి పోలీసుల చేతుల్లో తన్నులు తిన్నారు. నేడు ఇది కొత్త ఫ్యాషన్‌... వేడుకంటే ఇలాగే వుంటుంది. ఇలా వేడుకలు చేసుకునే వారంతా డబ్బున్నవారి పిల్లలే కావడం గమనార్హం.
దేశాలు వేరైనా వేడుక ఒక్కటే...
New-Year-Cake ఇప్పుడు మన దగ్గర వున్న క్యాలెండరు జనవరి ఒకటవ తేదీన ప్రారంభం అవుతుంది. నిజానికి ఆంగ్లేయుల పాలన వలన మనకు సంక్రమించింది. అనంతరం కాలంలో అదే స్థిరపడిపోయింది. దీనికి ముందు మన భారతదేశంలో వుండే క్యాలెండరుకు పది మాసాలే వుండేవట. అనంతరం ఆ పది నెలలకు ముందు జనవరి, ఫిబ్రవరి నెలలను కలిపి పన్నెండు నెలతో క్యాలెండర్‌ రూపొందింది. నిజానికి మన కొత్త సంవత్సరం మార్చితో ప్రారంభం అవుతుంది.

సంవత్సరం చివరి రోజైన 31వ తేదీ రాత్రి నుండి కొత్త సంవత్సరం ప్రారంభించడానికి స్వాగత సంబరాలు ప్రారంభం అవుతాయి. వివిధ రకాలైన సంగీతాలు, డాన్సులు... మిరమిట్టు గొలిపే బాణాసంచాలతో కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం అందిస్తారు. ఇక మనదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా, బెంగళూరు, చెనై్న మొదలైన ఇంకా ఎన్నో నగరాల్లో, పట్టణాల్లో, ఈ వేడుకలు అత్యంత అంబరాన్నంటుతాయి. మనదేశంలోపాటు చాలా దేశాల్లో న్యూయిర్‌ రోజున శెలవు దినంగా ప్రకటిస్తారు.
దేనికదే భిన్నం...
ప్రపంచ వ్యాప్తంగా ఈ న్యూయర్‌ వేడుకలు వైభవంగా జరుగుతున్నా ఎడిన్‌బర్గ్‌, సిడ్నీ టొరంటో, మాస్కో, రోమ్‌, హాంగ్‌కాంగ్‌, లండన్‌, లాస్‌ ఏంజిల్స్‌, వెనిస్‌, బెర్లిన్‌, పారిస్‌, న్యూయార్క్‌, టోక్యో, రియో డీజెనీరియెలలో మాత్రం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇంగ్లండ్‌, అమెరికాలలోని ఆలయాల్లో డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి 11 గంటలు మొదలు విరామం లేకుండా గంటలు మోగిస్తారు. అలా సరిగ్గా పన్నెండు అయ్యే వరకు వాయిస్తారు. ఇది గడిచిన సంవత్సరానికి చెప్పే వీడ్కోలు.. అలాగే సంతోషంగా కొత్త సంవత్సరానికి చెప్పే స్వాగతం. 12 గంటలు కాగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేగంగా గంటలను మోగిస్తారు. తెల్లవారగానే ఒకరినొకరు గ్రీటింగ్స్‌ చెప్పుకుని, స్వీట్లు పంచుకుంటారు. మహిళలు ప్రత్యేక నృత్యాలు చేస్తారు. ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తారు. ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో పదార్థాలతో విందు చేసుకుంటారు.
ఇండోనేషియాలో...
ఇండోనేషియాలో అయితే అక్కడి ప్రభుత్వాలే కొత్త సంవత్సరపు వేడుకలను నిర్వహిస్తాయి. పశుపతి బ్రిడగ్జివద్ద జరిగే వేడుకలు ఎంతో ఘనంగా అట్టహాసంగా నిర్వహిస్తారు. ప్రజలు తమ కుటుంబాలతో సహా బాణాసంచా కాల్చుకుంటూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. దీన్ని సాలుగన్‌ అని అంటారు. సంతోషానికి దీన్ని ప్రతీకగా చెబుతారు.

న్యూయార్క్‌లో ఉన్న టైమ్‌ స్కే్వర్‌ భవంతిపై నుండి నీటితో నిండిన పెద్ద క్రిస్టల్‌ను 11.59 గంటల సమయంలో కిందికి జారవిడుస్తారు. అది నేలమీద పడేటప్పటికి 12 గంటలవుతుంది. వెంటనే అక్కడ వేచియున్న లక్షలాది మంది ప్రజలు హేపీ న్యూయర్‌ అంటూ గట్టిగా అరుస్తూ, కొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇలా ఈ వేడుక 100 సంవత్సరాల నుండి అక్కడ జరుగుతోంది.
ఆధ్యాత్మిక సమాహారం జపాన్‌...
జపాన్‌లో ‘ఒమిసోకా’ అంటూ నూతన సంవత్సర దేవతగా ‘తోషిమా’ని ప్రార్థిస్తారు. ఇళ్లను ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బుద్ధుని ఆలయంలోని గంటలను 108 సార్లు మోగించడం వల్ల సంవత్సరమంతా శుభం జరుగుతుందని నమ్ముతారు. అక్కడి స్థానిక టీవీల్లో అనేక కార్యక్రమాలు, పాటల పోటీలునిర్వహిస్తారు.
రోమ్‌లో నూతన సంవత్సరాన్ని ‘గిఫ్ట్‌డే’ అంటారు. ఇరాన్‌లో ‘నీరో’, పశ్చిమ జర్మనీలో ‘పినిపినీ’ అనీ వేడుకలకు సిద్ధం అవుతారు. యుగస్లోవియాలో ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా కొత్త సంవత్సరపు వేడుకలను నిర్వహించుకుంటారు. ఆర్థిక వ్యవస్థకు చిహ్నం అయిన ‘నూకరం’ను వారు తప్పకుండా తాకుతారు.

రష్యాలోని ప్రజలు తమ ఇళ్లలో ‘స్కూసు’ అనే ప్రత్యేకమైన చెట్లను నాటుతారు. ఇవి క్మిస్మస్‌ చెట్లలాగే ఉంటాయి. ఇలా ఈ చెట్లను నాటడం ఎంతో అదృష్టంగా వారు భావిస్తారు. వీటి వల్ల అంతా శుభం జరుగుతందన్నది వారి నమ్మకం. రష్యాలోని మరికొన్ని ప్రాంతాల్లో కొత్త సంవత్సరం మొదటి రోజు మొదలు వారం వారం మొత్తం వరకు ఈ వేడుకలు జరుపుకుంటారు. ‚పోర్చుగల్‌లో డిసెంబర్‌ 31 అర్థరాత్రి వేళలో పాత్రలను చప్పుడు చేస్తూ లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. ఇది భారతదేశంలో దీపావళి చేసుకుంటున్నట్లే వుంటుంది.
సెల్టులనుంచి రోమన్ల వరకూ...
సెల్టిక్‌-జర్మన్‌ పురోహిత వర్గంవారు నూతన సంవత్సరం మొదలైన సందర్భంలో తమ పవిత్రమైన మొక్క మిస్ట్‌లెటో ను బహుమతిగా ఇచ్చేవారు. రోమన్లు ఇలాంటి బహుమతులను ‘స్ట్రేనే’ అనేవారు. ‘స్ట్రేనియా’ అనే అదృష్ట దేవత నుంచి ఈ పదం ఆవిర్భవించింది. మొదట శుభప్రదమైన నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ పవిత్ర వృక్షాల కొమ్మలను బహుమతులుగా ఇచ్చేవారు. తరువాత జనవరి నెల ఎవరికి పవిత్రమైన నెలో ఆ దైవం జేనస్‌ ముఖం ముద్రించి వున్న గిల్డెడ్‌ నట్స్‌, నాణాలు వంటివి బహుమతులుగా ఇచ్చేవారు. చక్రవర్తి బహుమతులిచ్చే ఆచారాన్ని రోమ్‌ కూడా పాటించింది. కానీ రోమన్‌ నియంత చక్రవర్తుల పుణ్యమా అని తదనంతర కాలంలో ఈ స్ఫూర్తి అడుగంటిపోయింది.
స్కాటిష్‌, ఆంగ్లేయులు...
హెన్రీ-3 (1216-72) కాలం నుంచే ఇంగ్లీషు రాజరికం కూడా తమ ప్రజలనుంచి నూతన సంవత్సర బహుమతులు రాబట్టేది. ఇక ఎలిజెబత్‌ రాణి అయితే ‘ఎవరిస్తున్నారు? ఎమిస్తున్నారు?’ అన్నది పట్టిపట్టి గమనించేది. నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద పెద్ద మొత్తాలు నగల రూపేణా, బంగారం రూపేణా రాబట్టేది. ఈ రాణిగారు ఈ పద్ధతిని క్రమబద్ధీకరించిందని చెప్పవచ్చు. అన్ని వర్గాలకు చెందిన వారు సమర్పించే బహుమతుల వివరణాత్మక జాబితాలు తయారు చేయించసాగింది. కానీ ఎలిజెబత్‌ రాణి వైభవం తర్వాత ఈ ఆచారం పతనం కానారంభించింది. చివరికి ఆలివర్‌ క్రామవెల్‌, ప్యూరిటన్లు ఆధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆచారం నిలిపివేశారు. విక్టోరియన్‌ హయాం వరకూ కొత్తసంవత్సరం నాడు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఆచారం ఇంగ్లీషు ప్రజల్లో సర్వసాధారణమైన ఆచారంగా కొనసాగింది. చేతితొడుగులు సర్వసాధారమైన బహుమతి.

వైన్‌ను నిలవచేయడానికి, రుచిని చేకూర్చడానికి లవంగాలు గుచ్చిన కమలాలు కూడా ప్రజాదరణ పొందిన బహుమతిగా ఉంటూ వచ్చింది. ఇంగ్లీషువారు అమెరికాకు వచ్చి ిస్థిరపడినపుడు కొత్త సంవత్సరం నాడు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఆచారాన్ని తమ వెంట తీసుకువెళ్ళారు. ఫ్రెంచువారు కూడా ఈ ఆచారాన్ని పాటించారు. ఫ్రెంచివారు అధికసంఖ్యలో ఉండే న్యూ ఆర్లియన్స్‌లో చాలాకాలం వరకూ బహుమతుల ఆచారం కొనసాగింది. ఫ్రాన్సులో ఈనాటికీ నూతన సంవత్సరం సందర్భంగా బహుమతులు గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త సంవత్సరం అత్యంత భారీస్థాయి వేడుకైన స్కాట్‌ల్యాండ్‌లో పిల్లలు గుంపులు గుంపులుగా ఇంటింటికీ వెళ్ళి పాటలు పాడతూ డబ్బు, ఆహారం భిక్ష కోరుతారు. ‘ఐ విష్‌ యు మెర్రీ క్రిస్మస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌’ అని శుభాకాంక్షలు తెలియజేస్తారు.
భారతదేశంలో కొత్త ఏడాది...
హిందూ క్యాలెండర్‌ ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినపుడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. అంటే చైత్ర మాసంలో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దాన్నే సంవత్సరాది, యుగాది లేక ఉగాది అని ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం కూడా. ఈ రోజున పెద్దల ఆశీర్వాదంతో మొదలయ్యే వేడుకలు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని సంబరాలు చేసుకుంటారు. పంచాంగ శ్రవణం వంటివి ఈ రోజున తప్పనిసరి. కానీ ఇందులోనూ ఆధునిక పోకడలు చోటు చేసుకుంటున్నాయి. ఉగాదిని కేవలం ఓ పండుగలాగే చేసుకుంటున్నారు. జనవరి ఒకటినే ఎక్కువ శాతం సంవత్సరం మొదలుగా పాటిస్తూ, వేడుకలు చేసుకోవడం ఎక్కువైంది.
భిన్న సంస్కృతుల నిలయం...
అందుకే ఇక్కడ ఎవరికి తోచిన విధంగా వారు వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశంలో ముఖ్యంగా చెప్పుకోదగినది గోవాలో జరిగే న్యూయర్‌ వేడుకలు. ఇవి ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. సముద్ర తీరంలో జరిగే ఈ వేడుకలను చూడడం ఒక గొప్ప అనుభూతిగా వర్ణిస్తారు చూసి వచ్చినవారు. ఢిల్లీ, బెంగుళూరు, చెనై్న హైదరాబాద్‌, ఇంకా ఎన్నెన్నో పట్టణణాల్లో, నగరాల్లో డిసెంబరు 31 రాత్రి నుండి యువతీయువకులు శుభాక్షాంకలు తెలుపుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పార్టీలు చేసుకోవడం మొదలెట్టేస్తారు. నృత్యం... సంగీతం ఇందులో ఎంతో ప్రత్యేకతను కలిగి వుంటుంది.
నవవసంతం ఒక కొత్త ‘బహుమానం’...
కొత్త సంవత్సరం సందర్భంగా బహుమతు లిచ్చే సంప్రదాయం చరిత్రకందని కాలంలోనే మొదలైనట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌ బహుమ తుల సంస్కృతే కాక ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, రష్యా, గ్రీస్‌ సహా యూరప్‌లో అనేక ప్రాంతాల్లో కొత్త సంవత్సరం నాడు బహు మానా లిచ్చే ఆచారం ఉంది. క్రీస్తుకు పూర్వ మే యూరోప్‌లో ఇది ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనాడు అమెరికాలో కొత్త సంవత్సరం కంటే క్రిస్మస్‌కే బహుమానాలిచ్చే సంప్రదాయం ఎక్కువగా వుంది. చారిత్రకం గా చూస్తే ఇక్కడి జెర్మన్‌ డచ్‌ సెట్లర్ల పాత ఆచారాల్లో దీని మూలాలున్నాయి. ఇంగ్లీషు, ఫ్రెంచి ప్రాభవమున్న రాష్ట్రాల్లో కొత్త సంవత్స రంనాడు బహుమతులు ఇచ్చే ఆచారం నేటికీ కొనసాగుతోంది. కానీ, జర్మన్‌ డచ్‌ ప్రభా వాలు కలిసి పనిచేసినందువల్ల కాల ప్రవా హం లో పాత సంప్రదాయం తుడిచిపెట్టు కు పోయి అమెరికా అంతటా ఇప్పుడున్న సంప్రదాయం వచ్చి స్థిరపడింది. జనవరి 1న లౌకికవాద నూతన సంవత్సరంగా ప్రపంచం గుర్తించే చాలాకాలం పూర్వమే ప్రపంచంలో వివిధ దేశాల ప్రజలు వివిధ నూతన సంవత్స రాల కాలం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వారి విభిన్న నూతన సంవత్సరాల్లో కూడా ఓ విధమైన ఏకత్వం వున్నట్లు తెలుస్తోంది. బహుమతులు విందులు సాంఘిక వేడుకలు ఈ ఏకత్వాన్ని సూచించే కొన్ని ప్రధాన ఆచా రాలుగా ఉన్నాయి. నూతన సంవత్సరం రావడాన్ని పురస్కరించుకుని శుభప్రదంగా భావిం చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకో వడం బహుశా ఈ సంప్రదాయానికి ప్రోద్బలంగా ఉంది.
కొత్త ఏడాదిని కొత్తగా ప్రారంభించాలి...
Sri_Sri_Ravishankarకొత్త ఏడాది మొత్తం మంచి జరగాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోవాలి. అలాగే ఎప్పుడూ పాతగా కాకుండా కాస్త కొత్తగా ఆలో చించండి. గొడవపడే విషయంలో కూడా అప్పుడు ఇలా జరిగింది... ఇప్పుడు ఇలా జరిగింది అని కాకుండా కొత్తగా ప్రయత్నించండి. ప్రతి విషయాన్ని కొత్తగా ఆహ్వానించండి. సరదాలు... సంబరాలు కాదు శాంతి కావాలి. ఎన్ని వున్నా... ఎన్ని వేడుకలు చేసుకున్నా మనసులలో శాంతి లేకుండా ఏదీ సాధించలేం. కాబట్టి జీవితానికి జ్ఞానం, ధ్యానం ఎంతో ముఖ్యం. ఇందుకు మార్గాలను అన్వేషించాలి. కొత్తగా వుండాలి. ఈ ఏడాది మొత్తం అందరికీ మంచి జరగాలి. ముందుకెళ్లేందుకు అందుకు కృషి చేయాలి.
- శ్రీ శ్రీ రవిశంకర్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు

ఎంతో ఆనందం...
karnthi మా వీధిలో పిల్లలం, పెద్దలం అందరం కలిసి మా ఇంటిపైనే కొత్త సంవత్సరం ముందు రోజు రాత్రి వేడుకలు చేసుకుంటాం. పది గంటల నుండి మొదలు రాత్రి పన్నెండుకు ఒక నిమిషం మందు వరకు అందరం డాన్స్‌ చేస్తాం. పెద్దవాళ్లందరూ కూర్చుని మమ్మల్ని ఎంతో ఎంకరేజ్‌ చేస్తారు. పన్నెండు అయిందంటే చాలు అందరం గట్టిగా ఒక్కసారి హేపీ న్యూ ఇయర్‌ అంటూ గట్టిగా అరిచేస్తారు. అందరం విషెస్‌ చెప్పుకున్న తరువాత తిరిగి సంతోషంతో మా కార్యక్రమాలు మొదలు పెడతాం. పాటలు, డాన్సులతో ఎంతో ఎంజాయ్‌ చేస్తాం. ఉదయాన్నే మిగిలిన స్నేహితులకు ఫోన్‌ చేసి విష్‌ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు స్నేహితులంతా ఒక్కోచోట వుండరు. అందరినీ కలవడం అంటే కుదరదు.
- క్రాంతి, నల్గొండ

ఆధ్మాత్మికతతో నిండాలి...
sushmareddyకొత్త ఏడాది అంటే నాకు వేడుకల కన్నా ముందు లక్ష్యాలు గుర్తొస్తాయి. అప్పుడే ఓ ఏడాది గడిచిపోయిందా అని అనిపిస్తుంది. అయినా ఆ రోజు మాత్రం ఆనందంగా గడుపుతాను. ఇప్పుడు వచ్చే ఏడాది మాత్రం నాకు చాలా ముఖ్యం. నా సివిల్స్‌ ప్రయత్నాలు ఈ ఏడాదితోనే ప్రారంభించాను కాబట్టి. ఇక మిగిలిన వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నా. నాలాగే ప్రతి ఒక్కరు మంచి లక్ష్యంతో మందుకెళ్లాలని కోరుకుంటున్నా. తెలంగాణ సమస్యలు... ప్రత్యేక రాష్ట్రాలు... ధర్నాలు... రైతుల ఆత్మహత్యలు వంటివాటన్నిటికీ కొత్త సంవత్సరంలో మంచి పరిష్కారం దొరకాలి. ప్రపంచంలో అందరికీ కూడా ఈ ఏడాది ఎంతో హాయిగా వుండాలని కోరుకుంటున్నాను.
- టి.సుష్మారెడ్డి, సివిల్స్‌ స్టూడెంట్‌, హైదరాబాద్‌

మంచి జరగాలి...
giriనాకు కొత్త సంవత్సరం అంటే ఓ పండుగలాగే అనిపిస్తుంది. ప్రతి ఏడాది దీన్ని మా స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా ఎంజాయ్‌ చేస్తాం. ఈ సంవత్సరం కూడా ప్లాన్‌ చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఏడాదిలా కాకుండా ఇప్పుడు కాస్త కొత్తగా వుండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాధ్యతలు, సమస్యలు అన్నీ తెలుస్తున్నాయి. అందుకే ఏదైనా మంచి పని చేయాలని అనుకుంటున్నాం. మేము సరదాలకు ఖర్చు పెట్టే మొత్తంలో కొంత భాగాన్ని సమాజసేవలో వినియోగించాలని నిర్ణయించుకున్నాం. అందుకే దాని కోసం ప్లాన్‌ చేసుకుంటున్నాం.
- వి.గిరిసౌమ్య, బ్యాంక్‌ కోచింగ్‌ విద్యార్థిని

ఇప్పటికీ... నాది అదే తీరు...
Jamal హాయ్‌.. నాపేరు జమాల్‌ బాషా. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 31వ తేదీ రాత్రి సెలబ్రేట్‌ చేసుకుంటాను. ఇప్పుడు కొంత మార్పు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాను. బయటకి వెళ్లడానికి కుదరదు. కానీ ఉదయాన్నే అంతా మామూలే. ముందుగా నా గర్ల్‌ఫ్రెండ్స్‌కి శుభాకాంక్షలు చెబుతాను. ఎందుకంటే అబ్బాయిలు ఎప్పుడైనా కలుస్తారు. అమ్మాయిలు అలా కాదు కదా! అందుకే. తరువాత నా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్తాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... ఇప్పుడు చాలామంది ఇలా లేరు. ఎస్‌.ఎం.ఎస్‌తో వాళ్ల న్యూ ఇయర్‌ అయిపోతుంది. ఇంతకుముందు గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చుకునేవారు. దూరంగా వున్న వాళ్లకు కొరియర్‌ చేసేవాళ్లు. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగేది. కానీ ఇప్పుడంత లేదు. మెయిల్‌... లేదా ఎస్‌ఎంఎస్‌... మరీ అయితే ఫోన్‌ కాల్‌ అంతే. నేను స్కూల్‌లో వున్నప్పుడు కార్డులు చేతబట్టుకుని ఉపాధ్యాయులకు కూడా ఇచ్చేవాళ్లం. ఫ్రెండ్స్‌కి పంచేవాళ్లం. ఇక ఇంటర్‌లో అయితే జనవరి ఒకటి అంటేనే కేక పుట్టించేవాళ్లం. ఆ రోజంతా అమ్మాయిలం, అబ్బాయిలం అందరం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్లం. లేదా ఏక్కడికైనా మంచి ప్లేస్‌ ఎంచుకుని అక్కడికి వెళ్లివచ్చేవాళ్లం. నా దృష్టిలో కొత్త సంవత్సరం వేడుక అంటే అందమైన పూలతో... మరో జీవితానికి స్వాగతం పలకడం... అందుకే ఆ రోజును వీలైనంత వరకు ఆనందంగా గడుపుతాను. - జమాల్‌ బాషా, డోన్‌

- హైమ సింగత

Friday, December 24, 2010

అవును, ఇది ఒక పల్లెటూరు!

1960లో ఓ రోజు
వర్షం పడి ఆగింది. రోడ్లపై బురద. కిక్కిరిసిన ఎద్దుల బండి బురదలో కూరుకుపోయింది. బండి నడవదని అందరూ నడుచుకుంటూ పొలాలకు వెళ్లారు.

2010లో ఆ గ్రామం

వర్షం పడినా తడవటానికి మట్టి లేదు. ఎద్దుల బళ్లు లేవు. ప్రపంచంలో దొరికే అన్ని పెద్ద కంపెనీల ఖరీదైన కార్లు ఉన్నాయి.
ఇదీ చైనాలో అత్యంత ధనిక గ్రామం హువాక్సి కథ.

ధనిక గ్రామమంటే..
హువాక్సిలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉంటుంది. చాలామందికి సొంత విల్లా ఉంటుంది. ఇంటింటికీ కార్లు ఉంటాయి. అక్కడ చదువుకోని యువకుడు, పనిచేయని పెద్దవారు, అనాథలైన వృద్ధులు లేరు. బ్యాంకు అకౌంట్లలో లక్షలుంటాయి. చైనా స్టాక్ మార్కెట్లో నమోదైన ఆ ఊరి పరిశ్రమల ఉత్పత్తి విలువ ఏడాదికి అక్షరాలా మూడు వేల కోట్ల డాలర్లు.

ఎలా సాధ్యమైంది?

‘‘హువాక్సి పైనున్న ఆకాశం కమ్యూనిస్టు పార్టీదే. కిందనున్న నేల సామ్యవాదపు మట్టి. మాకిలాంటి ఆధునిక సామ్యవాదం కావాలి’’ ఇది ఆ ఊరి పాట.

గ్రామాన్ని తీర్చిదిద్దింది ప్రభుత్వమో, ఏ సంస్థో కాదు.. ఒకే ఒక వ్యక్తి. పేరు వు రెన్‌బావో. 50 ఏళ్లుగా ఆయన కమ్యూనిస్టు పార్టీ హువాక్సి శాఖ అధ్యక్షుడు. ‘అందరికీ పనిచేసే శక్తి ఉంది. మరి దీన్ని అత్యల్ప ఉత్పాదకతకు ఎందుకు వదిలేయాలి. ఇదే శక్తిని సమర్థంగా ఉపయోగిస్తే చరిత్రను, తలరాతను తిరగరాస్తాం’ అని మొదలుపెట్టాడు. అభివృద్ధికి గ్రామానికి మధ్య వారధిగా నిలిచాడు.


కుటీర పరిశ్రమలుగా మొదలైన పరిశ్రమలు ఊరిలో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే వరకు వెళ్లాయి. భారత్, బ్రెజిల్ నుంచి ఇనుపరజను, పత్తి దిగుమతి చేసుకుని వాటి నుంచి ఇనుము, ఉక్కు ఉత్పత్తులు, దుస్తులు తయారుచేస్తారు. 40 దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇప్పటికీ అక్కడ వారానికి ఏడురోజులు పనిచేస్తారు. ప్రత్యేకంగా సెలవులు ఉండవు కాని.. అవసరం ఉన్నపుడు సెలవు తీసుకోవడానికి ఏ అభ్యంతరం ఉండదు.


వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలు

వచ్చేది హువాక్సికి స్వర్ణోత్సవ ఏడాది. 24 గంటలూ నడిచే ఫైవ్‌స్టార్ హోటల్‌తో కూడిన అతిపెద్ద వాణిజ్య, నివాస భవంతిని నిర్మిస్తున్నారు. స్వర్ణోత్సవాలకు సూచికగా దీన్ని ప్రారంభిస్తారు. 74 అంతస్తుల ఈ భవనం ప్రపంచంలోనే 15వ అతిపెద్దది. ఊరి పౌరులందరికీ ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం ఉచితం. ప్రపంచంలో ఏ పెద్ద నగరంలో దొరికే సదుపాయాలైనా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
పర్యాటకం నుంచి భారీ ఆదాయం

70 వేల జనాభా ఉన్న హువాక్సికి పర్యాటకం నుంచి కూడా భారీ ఆదాయం వస్తుంది. ఇక్కడ చైనా గోడను పోలిన నమూనా గోడను సిద్ధం చేశారు. పల్లెటూరిని మరిచిపోని పచ్చదనం, ఆధునికతకు నిదర్శనంలా కనిపించే ఆకాశహర్య్మాలు, వైవిధ్యమైన కట్టడాలు, పెద్దపెద్ద పార్కులు, మెరిసే రోడ్లు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఏటా పర్యాటకుల సంఖ్య 20 లక్షలు. హువాక్సి పర్యాటక కమిటీ తాజాగా రెండు హెలికాప్టర్‌లను కొన్నది. ఎంచక్కా ఈ హెలికాప్టర్ ఎక్కి ఊరంతటినీ చూడొచ్చట. అంతేకాదు.. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, సిడ్నీ ఒపెరా హౌస్ చూడటానికి ఈ ఊరికి వెళ్తే చాలు... ఎందుకంటే వాటిని పోలిన కట్టడాలను త్వరలో ఇక్కడ నిర్మించనున్నారు.


‘కష్టే ఫలి’ అంటారు.. వీళ్లు మాత్రం ‘కష్టే కోట్లు’ అంటారు!


- ప్రకాష్ చిమ్మల

Tuesday, December 21, 2010

పురుగుల పుట్ట ...... మానవ దేహం


మట్టిపై పుట్టి, మట్టిలో కలిసిపోయే మనుషులం మనం.
కానీ మనం అసలు మనుషులమే కాదని అంటున్నారు బోనీ బాస్లేర్!
‘‘ఇదేం మాట తల్లీ!’’ అని అడిగితే -‘‘ఉన్నమాటే’’ అంటున్నారావిడ!
కళ్లు, చెవులు, కాళ్లూ చేతులూ ఉన్నంత మాత్రాన మనుషులం అయిపోమనీ,
మనమంతా పురుగుల పుట్టలమనీ.... సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు బోనీ బాస్లేర్. ఈ చేదునిజాన్ని అంగీకరించడానికి మీరు సిద్ధమేనా?
అయితే చదవండి.

ఒక వస్తువుకు మనం పేరు ఎలా పెడతాం? ఆ వస్తువు తయారైన పదార్థం ఆధారంగా లేదా దాంట్లో ఏమున్నాయి అన్న అంశంపై ఆధారపడి నామ్నీకరణ జరుగుతుంది. ఒక గ్రాము బంగారపు పూత ఉన్నంత మాత్రాన అలాంటి ఆభరణాలు రోల్డ్‌గోల్డ్ మాత్రమే అవుతాయి గానీ అచ్చు గోల్డ్ కాదన్నది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే ఉదాహరణను మనిషికి వర్తింపజేసి చూద్దాం. మన శరీరాల్లో ఏముంటాయి? అవయవాలు, రక్తం.. ఇంకొంచెం సూక్ష్మంగా, స్థూలంగా ఆలోచిస్తే కోటానుకోట్ల కణాలు. మరి ఈ కణాలతోనే మన దేహం మొత్తం నిండిపోయిందా? కానేకాదు అంటారు బోనీ బాస్లేర్. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ మైక్రోబయాలజిస్ట్ అయిన ఈ శాస్తవ్రేత్త ఒక వినూత్న వాదననను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. మన శరీరంలోని కణాలు, డిఎన్‌ఏల సంఖ్యతో పోలిస్తే పది నుంచి వందరెట్లు ఎక్కువగా సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా ఉంటుందన్నదే ఆ వాదన. (బ్యాక్టీరియం ఏకవచనం. బాక్టీరియా బహువచనం)

ఆశ్చర్యంగా ఉందా? బోనీ చెబుతున్నది అక్షరాలా నిజం. ‘‘మనిషి దేహంలో దాదాపు లక్ష కోట్ల కణాలుంటాయి. ఆ లక్ష కోట్ల కణాలు 10 లక్షల కోట్ల బ్యాక్టీరియాకు ఆవాసాలుగా మారిపోయాయి. మనలో దాదాపు 30 వేల జన్యువులు ఉంటే వాటిల్లో 100 రెట్లు అధికంగా బ్యాక్టీరియాకు ఆతిథ్యమిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి.. నాకు మీరు 1-10 శాతం మాత్రమే మనుషులుగా, 90-99 శాతం బ్యాక్టీరియాగా కనిపిస్తారనడం తప్పా?’’ అని ప్రశ్నిస్తారు బాస్లెర్! కేవలం 51 మంది చేతులను పరిశీలిస్తేనే 4,742 జాతుల బ్యాక్టీరియా ఉందని తేలినప్పుడు ఇక వాస్తవ సంఖ్యను అంచనావేయడం సాధ్యమవుతుందా? అని ఆమె చెబితే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు మరి. అంతేకాదు... ఈ బ్యాక్టీరియా శరీరంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తూ జీవక్రియలను కూడా నియంత్రిస్తూంటాయని, భాష లాంటిది కూడా అభివృద్ధి చేసుకున్నాయని ఆమె ఎనిమిదేళ్ల క్రితమే ప్రతిపాదించారు!


బ్యాక్టీరియా మాటలు
అసలు దేహంలో ఇంత పెద్దమొత్తంలో బ్యాక్టీరియా ఎలా పోగయిపోయిందబ్బా? అని ఆశ్చర్యం వేస్తోంది కదూ! జనాభాను పెంచుకునేందుకు బ్యాక్టీరియా పరస్పరం మాట్లాడుకుంటాయంటారు బాస్లెర్! అవి వివిధ వేర్వేరు వాతావరణాల్లో ఎలా మనుగడ సాగించగలవన్న కోణంలో ఆమె చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగుచూసింది. ప్రత్యేకమైన రసాయన సంకేతాల ద్వారా బ్యాక్టీరియా సమాచార మార్పిడి చేసుకుంటాయి. కొన్ని రకాల సముద్ర బ్యాక్టీరియా మాత్రమే రసాయన సంకేత భాషను ఉపయోగిస్తాయన్నది అప్పటివరకూ ఉన్న అంచనా. బోనీ మాత్రం తన పరిశోధనల ద్వారా ఇది అన్ని రకాల బ్యాక్టీరియాకూ వర్తిస్తుందని నిరూపించారు. బ్యాక్టీరియా భాషకు బోనీ పెట్టిన పేరు... ‘కోరమ్ సెన్సింగ్! ఇంకో విషయం... అనువుగాని చోట అధికులమనరాదు అన్న సామెతను బాగా వంటబట్టించుకున్నాయి ఈ బ్యాక్టీరియా. తమతో పోలిన బ్యాక్టీరియా నిర్దిష్ట సంఖ్యలో ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే... ఇవి ఆతిథ్య కణం లేదా డీఎన్‌ఏపై దాడి మొదలుపెడతాయట!
ఎలా తెలిసింది?
పదేళ్లక్రితం నాటి మాట ఇది. అప్పట్లో బోనీ రసాయన శాస్త్రంలో పిహెచ్‌డి చేస్తోంది. ఒకానొక సందర్భంలో సిల్వర్‌మాన్ అనే ఓ శాస్తవ్రేత్త ఉపన్యాసం వింది. జన్యుశాస్తవ్రేత్త అయిన సిల్వర్‌మాన్ చెప్పిందేమిటో ఈ రసాయన శాస్తవ్రేత్తకు ఏమీ అర్థం కాలేదు. రెండు విషయాలు తప్ప... ఆయన బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నారని... అవి తమలో తాము మాట్లాడుకుంటాయని! ‘‘బ్యాక్టీరియా మాట్లాడుకుంటాయని ఇతరులెవరైనా చెప్పిఉంటే ఆ... చెప్పావులే అని అనుకునేదాన్నేమో. మనం చదువుకున్న చదువుల్లో లేని విషయం అది. అందుకే ఆ అంశంపై ఆసక్తి పెరిగింది’’ అని బోనీ తెలిపారు. ఆ ఉపన్యాసం అయిన వెంటనే సిల్వర్‌మాన్‌ను వేడుకుని అతడి సంస్థలోనే బ్యాక్టీరియా భాషపై పరిశోధనలు ప్రారంభించారు బోనీ!
చీకట్లో వెలుగులు నింపే బ్యాక్టీరియా!
బ్యాక్టీరియా ఎలా మాట్లాడుతుందో తెలుసుకోవాలంటే బోనీ పరిశోధనశాలకు వెళ్లాల్సిందే. పూర్తి చీకటిగా ఉండే ఆ పరిశోధనశాలలో వందల కొద్దీ గాజు పాత్రలు ఉంటాయి. ఏ ఒక్కదాన్ని తీసుకుని అటూఇటూ కదిలించినా నీలపు రంగు వెలువడుతుంది. ఆ పాత్రల్లో ఉండేది సముద్రాల్లోంచి సేకరించిన ఒక రకమైన బ్యాక్టీరియా మరి. బ్యాక్టీరియా రెండు రకాల రసాయనాలతో సంభాషణలు నెరపుతాయని, తమతో పోలిన వాటితో మాత్రమే కాకుండా ఇతర రకాల బ్యాక్టీరియాతో మాట్లాడేందుకు కూడా వీటికి ప్రత్యేకమైన సంకేత భాష ఉందని బోనీ వివరిస్తారు. జీవజాతులన్నింటికంటే ముందుగా అవతరించిన బ్యాక్టీరియా రసాయనాల సాయంతో ఒక భాషను అభివృద్ధి చేసుకుని ఉండాలని తాను ముందు నుంచి అంచనా వేసినట్లు వివరించారు. ఈ రసాయనాల ద్వారానే లక్ష్యాలపై దాడి చేయడం, మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థ, మందుల నుంచి తప్పించుకోవడం లాంటి తదితర పనులను సమష్టిగా చక్కబెట్టుకుంటాయని ఆమె నిరూపించారు. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలచుకోవడం కూడా బ్యాక్టీరియాకు ఈ కోరం సెన్సింగ్ ద్వారానే సాధ్యమవుతోందని బోనీ అంటారు.
ఎన్నో ప్రయోజనాలు
బ్యాక్టీరియా పేరు చెప్పగానే మనకు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు గుర్తుకు రావడం సహజం. కానీ బ్యాక్టీరియా అన్నీ మనకు చెడే చేయవు. మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. నిజానికి ఇటువంటి బ్యాక్టీరియానే మన శరీరంలో ఎక్కువ. అయితే వ్యాధులకు కారణమవుతున్న బ్యాక్టీరియాను నాశనం చేసే క్రమంలో మంచి బ్యాక్టీరియా కూడా నాశనమవుతోంది. బ్యాక్టీరియా భాషను బాగా అర్థం చేసుకుంటే ఈ చిక్కు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మందులకు లొంగని మొండి బ్యాక్టీరియా పనిపట్టేందుకు కొత్త ఆయుధాలు తయారు చేయవచ్చన్నది బోనీ ఆలోచన. బ్యాక్టీరియా సంకేత భాషను నిలిపివేయడం ద్వారా అవి సమష్టిగా వ్యవహరించడాన్ని అంటే... ఆతిథ్య కణంపై దాడిచేయడాన్ని నిలువరించవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకో విషయం. కోరం సెన్సింగ్ కేవలం వ్యాధులకు మాత్రమే పరిమితం కావడం లేదు.

కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి రంగాల్లోనూ దీన్ని ఉపయోగించవచ్చునని శాస్తవ్రేత్తలు అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగించే సెల్ఫ్ ఆర్గనైజింగ్ నెట్‌వర్క్‌లు మరింత సమర్థంగా పనిచేసేందుకు కోరం సెన్సింగ్ ఉపయోగపడుతుందని అంచనా. ఇందులో నెట్‌వర్క్‌లోని ఒక్కో నోడ్ తన పరిసరాల్లో తగినన్ని నోడ్‌లు ఉన్నాయా? లేదా? అన్నది సరి చూసుకున్న తరువాతనే పనిచేస్తాయి. తద్వారా సమర్థవంతమైన, మెరుగైన పనితీరు వీలవుతుంది. అంతేకాకుండా తనంతటతానుగా ప్రవర్తించే రోబోట్‌ల ప్రవర్తనను నియంత్రించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చునని అంచనా.
జనాభాను పెంచుకునేందుకు
బ్యాక్టీరియా పరస్పరం
మాట్లాడుకుంటాయి.
బ్యాక్టీరియా భాషకు బోనీ
పెట్టిన పేరు... ‘కోరమ్ సెన్సింగ్!



బ్యాక్టీరియా ఉండని ప్రాంతమంటూ ఈ భూమ్మీద లేనే లేదు. అగ్నిపర్వత బిలాల్లోనైనా... మంచుగడ్డల లోపలైనా బ్యాక్టీరియా మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.

నేల పొరల్లో ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ లోతులో, సముద్రగర్భంలోనూ అతి ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉంటుంది

భూమ్మీద ఉండే మొత్తం బ్యాక్టీరియా జాతులు... కోటానుకోట్లు!

కొంచెం ఉజ్జాయింపుగా చెప్పాలంటే ఆ అంకె 5 పక్కన 30 సున్నాలు పెడితే ఎంతో అంత!

ఒక్క లీటర్ సముద్రపు నీటిలో 20,000కు పైచిలుకు బ్యాక్టీరియా ఉంటాయి!

- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

Sunday, December 19, 2010

జస్ట్ మైనస్.. అంతే!


ఎంత చలేస్తోందంటే...
పెదాలు పగిలి.. నవ్వొచ్చినా నవ్వలేనంత...
పాదాలు పగిలి.. నడవాలన్నా నడవలేనంత...
పల్లెటూళ్లలో అయితే పొద్దున్నే చలిమంటలు వేసుకునేంత...
పట్టణాల్లో అయితే ముసుగు తన్ని బారెడు పొద్దెక్కేదాకా పడుకునేంత...
ఉష్ణోగ్రత పది డిగ్రీలకి చేరితేనే మనం గజగజా వణికిపోతున్నాం... స్వెటర్లు, ఇన్నర్లు వేసుకుంటున్నాం... చాలక షాల్స్ కప్పుకుంటున్నాం... అరికాళ్లకి సాక్స్ తొడుక్కొని, తలకి మంకీ క్యాప్ తగిలించుకుంటున్నాం.
...అదే ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే దేశాల్లో అయితే ఉష్ణోగ్రత మైనస్ 70 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది... అంత చలిలో అసలు జనం బయట తిరగగలుగుతారా? ఇంట్లోనే హీటర్లు పెట్టుకుని గడిపేస్తారా? అలా అయితే సంవత్సరంలో సగం కాలం వాళ్లు ఇంటికే పరిమితమై ఉండాల్సి ఉంటుంది. అలా ఉండలేకో లేక అలవాటయ్యో అక్కడి జనం అంత చలిలో కూడా ఘనీభవించిన నదులపై ఆటలాడుకుంటారు... డాగ్‌రేస్‌లు, స్కీయింగ్ పోటీలతో బిజీగా గడుపుతారు. ఆ ప్రాంతాల్లో ఉండే జంతువులు కూడా చలికాలాన్ని రకరకాలుగా ఆస్వాదిస్తాయి. ఆ వింతలు విశేషాలే ఈ స్టోరీ!


ఎముకలు కొరికే చలిని ఎంత బాగా ఆస్వాదించవచ్చో, చలిపులికి భయపడకుండా మంచుకురిసే కాలంలో ఎన్ని రకాల ఆటలాడుకోవచ్చో మనకు తెలియాలంటే... ఉత్తర ధృవానికి సమీపంగా ఉండే కెనడా, గ్రీన్‌లాండ్, స్వీడన్, నార్వే, ఫిన్‌లాండ్, రష్యా లాంటి దేశాలకి వెళ్లాల్సిందే...

స్వీడన్: ఐస్ హోటల్


ఐస్‌తో కట్టిన హోటల్ రూమ్‌లో ఐస్‌తో చేసిన కుర్చీలో కూర్చుని భోజనం చేశాక ఐస్ బెడ్ మీద దుప్పటి పరుచుకుని నిద్రపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... వింటుంటేనే థ్రిల్లింగ్‌గా ఉంది కదూ. కాని ఆ పని చేయాలంటే స్వీడన్ వెళ్లాలి. ఆ దేశం లోని 'జుక్కాస్‌జార్వి' అనే చిన్న పట్టణ సమీపాన టార్న్ నదిపైన ఉంటుంది ఈ ఐస్ హోటల్. ఆర్కిటిక్ వలయానికి 200 కిలోమీటర్లు ఉత్తరంగా ఉంటుంది ఈ ప్రాంతం. చలి కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది. అంతా సరే కాని మంచుతో హోటల్ ఎలా కడతారు?
ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రపంచం నలుమూలల నుంచి మంచు ప్రేమికులు, ఆర్కిటెక్ట్‌లు ఇక్కడికి చేరుకుంటారు. ఆ ఏడాది నిర్మించబోయే 'ఐస్ హోటల్' డిజైన్‌ని తయారు చేసుకుంటారు. గడ్డ కట్టి ఉన్న టార్న్ నది నుంచి వేల టన్నుల హిమఖండాల్ని పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి కోస్తారు. వాటితో ఆ నది పైనే ఐస్ హోటల్ నిర్మిస్తారు. రిసెప్షన్ దగ్గర్నించి పై కప్పు, కుర్చీలు, టేబుళ్ళు, మంచాలు అన్ని ఐస్‌తోటే చేస్తారు. చివరికి మంచినీళ్ళు, మందు తాగే గ్లాస్‌లు కూడా మంచుతో చేసినవే. ఈ హోటల్లో ఐస్ బార్, కాన్ఫరెన్స్ హాల్స్, ఐస్ చర్చ్ కూడా ఉంటాయి. డిసెంబర్ 20కల్లా ఈ హోటల్ సిద్ధమై మార్చి నెల వరకూ కొనసాగుతుంది. ఈ నాలుగు నెలల్లో ప్రపంచం నలుమూలల నుండి వేలాదిమంది వచ్చి ఈ హోటల్‌ని సందర్శిస్తూ ఉంటారు.

అంతర్జాతీయ సందర్శకులు పెరగడం వల్ల బ్రిటన్ నుంచి ఇక్కడికి నేరుగా విమాన సర్వీసుని కూడా ప్రవేశపెట్టారు. యూరోపియన్లకి ఈ ఐస్ హోటల్‌ని సందర్శించడం ఒక కల. అంతేకాదు వందలాది ప్రేమ జంటలు ఇక్కడ ఐస్ చర్చ్‌లో పెళ్ళి చేసుకుని ఒకటవుతుంటారు. 1992లో మొదటి సారి ఈ హోటల్‌ని నిర్మించారు. దీనికి క్రేజ్ పెరగడంతో ఇప్పుడు కెనడా, రష్యా, నార్వే దేశాల్లో కూడా ఐస్ హోటళ్లు వెలిశాయి. టార్న్ ఐస్ హోటల్ మూతబడే సమయంలోనే స్వీడన్‌లో మరో భారీ పోటీ జరుగుతుంది. అదే 'స్కీయింగ్ రేస్'

స్వీడన్: స్కీయింగ్

చలి కాలంలో ఆరు బయట ఆడుకునే ఆటల్లోకల్లా ఎక్కువ పాపులర్ ఆట స్కీయింగ్. కాళ్ళకి మీటర్ పొడవుంటే పలుచని ప్లేట్‌లు, రెండు చేతుల్లో రెండు అంతే పొడవున్న 'స్టిక్'లు... అరికాలి నుంచి తలదాకా అంతా కప్పేసి ఉండే 'హాట్ సూట్' వేసుకున్న స్కీయర్లు మంచుకొండల్లో చాలా వేగంగా దూసుకుపోతుంటారు. ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల్లో... మంచు పర్వతాలుండే ప్రాంతంలో ఈ రేస్‌లు జరుగుతాయి. స్వీడన్‌లో జరిగే 'గ్చట్చజూౌఞఞ్ఛ్ట' రేస్ ఈ రేసులన్నిట్లోకి పెద్దది. ఇందులో ఏటా 16 వేల మందికి పైగా పాల్గొంటారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ, పడుతూ లేస్తూ 92 కి.మీ. దూరం ప్రయాణించి గమ్యాన్ని చేరుకోవడం మహామహా స్కీయర్లకే తేలిక కాదు. అది కూడా 12 గంటల్లోపల చేరుకోవాల్సి ఉంటుంది. ఏటా మార్చి నెల మొదటి ఆదివారం జరిగే ఈ పోటీని తిలకించడానికి లక్షల మంది వస్తారు. రేస్‌లకి వేదిక అయిన 'Dalarna' పట్టణం ఆ సమయంలో సందర్శకులతో నిండిపోతుంది. హోటళ్ళ రూములను నెలల ముందే బుక్ చేసుకంటారు.

మారథాన్ రన్నింగ్ పోటీలకి రెండు రెట్లు ఎక్కువ దూరం ఉండే ఈ రేస్‌ను నిర్వహించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 500 ఏళ్ళ క్రితం గుస్తావ్ వాసా అనే ఆయన స్వీడన్ అంతటా పర్యటించి, ప్రజల్ని కూడగట్టి 'స్వీడిష్ తిరుగుబాటు'ని లేవదీశాడు. ఆ తర్వాత ఆయన స్వీడన్ రాజయ్యాడు. ఆ పర్యటన స్ఫూర్తితోటే ఇప్పటికీ శీతాకాలంలో స్కీయింగ్ రేసును నిర్వహిస్తున్నారట. 'గుస్తావ్ వాసా' పేరు నుంచే ఈ 'వాసాలొప్పెట్' కూడా వచ్చింది. ఏటా 3500 మందికి పైగా వాలంటీర్లు ఈ రేస్ ఏర్పాట్లలో పాలు పంచుకుంటారు. సుమారు నలభై దేశాల నుంచి వేల మంది స్కీయర్లు ఈ రేస్‌లో పాల్గొంటారు. గెలిచిన వారికి భారీ బహుమానాల్ని అందిస్తారు.

సైబీరియా: హాట్ స్ప్రింగ్స్


స్వీడన్‌కి సమాంతరంగానే ఉంటుంది రష్యాలోని సైబీరియా ప్రాంతం. సైబీరియా అంటేనే మంచు ఎడారుల నిలయం. ఉష్ణోగ్రత ఎప్పుడూ జీరోకి అటూ ఇటూ ఉంటుంది. అదే చలికాలంలో అయితే మైనస్ ఇరవైకి పడిపోతుంది. ఆ చలిని తట్టుకోవడానికే ట్యూమెన్ నగరంలో జనం కొలనుల్లో దిగి జలకాలాడతారు. అంత చలిలో నీటికొలనుల్లో జలకాలా అనుకోకండి. అవి వేడి నీటి కొలనులు. ఎవరో కాచి పోసిన నీళ్ళు కాదు. సహజంగా ఏర్పడిన కొలనులవి. రష్యాలోని మిగతా నగరాలతో పోలిస్తే ట్యూమెన్‌కి ఉన్న ప్రత్యేకత అక్కడున్న కొలనులే. అందుకే రష్యా రాజధాని మాస్కోతో పాటు చాలా ప్రాంతాల నుండి కొలనుల్లో ఈతకొట్టడానికి ఇక్కడ వాలిపోతుంటారు. ఈ వేణ్ణీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూ ఉపరితలం మొత్తం మంచుతో కప్పబడినా భూమి లోపల మాత్రం చాలా వేడిగా ఉంటుంది. 'నివురు గప్పిన నిప్పు'లాగా అన్నమాట. ఆ వేడివల్ల కొలనుల్లో ఉండే నీళ్ళు ఏడాది పొడవునా వెచ్చగానే ఉంటాయి. అందుకే మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవడానికి 55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఆ నీళ్ళలో దూకేస్తారు. కారుల్లోనే బట్టలు విడిచి పార్కింగ్‌కి 300 మీటర్ల దూరంలో ఉండే ఆ కొలనుల వద్దకి గజగజ వణుకుతూ పరుగుతీసి ఒక్కసారిగా నీళ్లలో దూకేసి ఊపిరి పీల్చుకుంటారు. గంటలసేపు అలా నీళ్ళల్లో గడిపి ఇక చాల్లే అనుకుని ఒడ్డుకు వచ్చేలోపే... ఐదారు సెకన్లలోనే వంటి మీద ఉన్న నీటి బిందువులు ఘనీభవించి 'ఐస్' అయిపోతాయట.

జపాన్: మంచు 'మంకీ'లు

వేడినీటిలో మునగవచ్చన్న తెలివి మనుషులకే కాదు కోతులకి కూడా ఉంటుంది. ఎంత కాదన్నా అవి మన పూర్వీకులు కదా! అంత తెలివి ఉంది కాబట్టే ఆ కోతులు వేణ్ణీళ్ళ ప్రవాహాల్లో చలికాలమంతా గడిపేస్తాయి.
జపాన్ ఉత్తర ప్రాంతంలోని 'యమనోచి' అనే పట్టణంలో ఓ కోతుల పార్కు ఉంది. అది 'యొకొయూ' నదీ లోయలో ఉంటుంది. ఆ పార్కుని 'హెల్స్ వ్యాలీ' అని పిలుస్తారు. అంటే 'నరక లోయ'. ఆ లోయలో ఉన్న వేడినీటి ప్రవాహమే దానికి ఆ పేరు తెచ్చింది. ఆ ప్రవాహంలో నీళ్ళు తెర్లుతూ ఉంటాయి. మంచు కప్పుకున్న కొండల మధ్య ఉండే ఆ కొలనుకు మనుషులు చేరుకోవాలంటే సాహసమే కాని ఆ కొండల్లోనే నివసించే మంచు కోతులకి అది చాలా చిన్న విషయం. మిగతా కాలమంతా పార్కులో గడిపే ఆ కోతులు చలికాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే బయల్దేరి కొలనుకి చేరుకుంటాయి. చీకటిపడేదాకా కొలనులోనే ఆడుకుంటూ చలి బారి నుంచి తప్పించుకుంటాయి. చీకటిపడగానే తిరిగి తమ ఆవాసాలకి వెళ్లిపోతాయి. చలికి భయపడి రాలేని సందర్శకులు ఆ నీటిలో మునిగే కోతుల్ని చూడడానికి మాత్రం సాహసం చేసి మరీ వస్తుంటారు. ఆ వానరాలు మాత్రం వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటాయి. ఒడ్డుకి వచ్చి మంచు ముద్దల్ని వారిపై విసురుతూ ఆటపట్టిస్తాయి.

వేడినీటిలో మునగాలనే తెలివితేటలు ఈ కోతులకి మొదటి నుంచే ఉన్నాయా అంటే... కాదంటున్నారు ఆ ప్రాంతం వాళ్లు. ఇదంతా 1963 తర్వాతే జరిగిందని అంటున్నారు. సహజంగా నీళ్ళంటే భయపడతాయట కోతులు. మరి ఏ కోతి ఎప్పుడు ప్రమాదవశాత్తూ జారి ఆ లోయలో పడిందో గాని అప్పట్నించి మొదలై ఉంటుంది ఈ కోతుల 'వేడినీటి విడిది' అంటున్నారు జపనీయులు.

కెనడా: రంగు మార్చుకునే కుందేళ్లు

కోతులు నీళ్ళలో దూకితే... కుందేలు చలికాలం రాగానే ఏకంగా తన రంగునే మార్చేసుకుంటుంది. అలా అయితేనే అది తనని తాను చలికాలంలో కాపాడుకోగలుగుతుంది... చలి నుంచి కాదు... దాన్ని వేటాడే జంతువుల నుంచి. దీన్ని 'పోలార్ హేర్' (ధృవ కుందేలు) లేదా మంచు కుందేలు అని అంటారు. అంటే ఊసరవెల్లి టైప్ అన్నమాట.
ఉత్తర అమెరికాలోని కెనడా, అలస్కాలలో ఎక్కువగా కనిపించే ఈ కుందేలు ఏడాదికి ఎనిమిది నెలలు బ్రౌన్ రంగులోనే ఉంటుంది. చలికాలం మంచు కురవడం మొదలైందంటే చాలు... తన వెంట్రుకల్ని తెల్లగా మంచు రంగులోకి మార్చేసుకుంటుంది. పొడవుగా, నిటారుగా ఉండే దాని చెవుల చివర్లో ఉన్న వెంట్రుకలు మాత్రమే మామూలు రంగులో ఉంటాయి. మిగతా శరీరమంతా తెల్లగా మారిపోతుంది. అందుకే పరీక్షగా చూస్తే తప్ప మంచులో దీన్ని గుర్తించలేము. మిగతా కాలంలో గడ్డి, చెట్ల ఆకులు తినే ఈ జంతువు చలికాలంలో మాత్రం అప్పుడు పూసే పువ్వుల్ని, చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటుంది. దాని శరీరంలోని ప్రొటీన్లు చలికాలంలో తగ్గిపోవడం వల్ల వాటిని పొందడం కోసమే మాంసం తింటుందట. రంగు మార్చుకోవడమే కాదు ఆ కాలంలో కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే బయట తిరుగుతుంది. చలికాలం ముగిసే నాటికి మళ్లీ బ్రౌన్ రంగులోకి మారిపోతుంది. ఇలా పూర్తిగా రంగు మారడానికి ఎనిమిది నుంచి పది వారాలు పడుతుందట.

అన్నీ లాంగ్ స్లీప్‌లోకి

మంచు దట్టంగా కురిసే ప్రాంతాల్లో 'మంచు కుందేలు' లాంటి కొన్ని జంతువులు మామూలుగానే జీవించినా కొన్ని జీవాలు మాత్రం ఆ కాలంలో గాఢనిద్రలోకి జారుకుంటాయి. నెలల పాటు అలా నిద్రించి తిరిగి ఉష్ణోగ్రత పెరగగానే లేచి మామూలుగా తిరుగుతాయి. అలా నిద్రించడాన్నే సుప్తావస్థ అని అంటారు. అన్ని జీవాలూ మనుషుల్లా తగిన సౌకర్యాలు సమకూర్చుకోలేవుగా మరి. గబ్బిలాలు, పాములు, 'పెయింటెడ్ టర్టిల్' అనే రకం తాబేలు ఈ కోవలోకి వస్తాయి. ఇవన్నీ సుష్టుగా భుజించి శీతాకాలం వచ్చే నాటికి కొన్ని నెలలు ఆహారం లేకపోయినా తట్టుకునే శక్తిని సమకూర్చుకుంటాయి. చలికాలం ప్రారంభం కాగానే తమ ఆవాసాల్లోకి వెళ్లిపోయి నిద్రకి పూనుకుంటాయి. ఏ వారం, పది రోజులకో ఓసారి లేస్తాయి... మళ్లీ నిద్రపోతాయి. ఆ కాలంలో తిండి లేకపోవడం వల్ల చిక్కి సగమైపోతాయి... అయితేనేం మళ్ళీ తర్వాత బాగా తిని కొన్ని రోజులకు మామూలు స్థితికి వచ్చేస్తాయి.

ఒక్కో జంతువు శీతాకాలాన్ని ఎదుర్కొనడానికి ఒక్కో విధంగా రెడీ అవుతుంది. అందుకేనేమో వీటి ప్రవర్తనను ఆధారం చేసుకుని చాలా నమ్మకాలు ఏర్పడ్డాయి. ఈ కింద పేర్కొన్నవి జరిగితే శీతాకాలం ఎక్కువ రోజులు ఉంటుందని జనం నమ్మకం. అవేవంటే...
1. జంతువుల వెంట్రుకలు దట్టంగా పెరిగినప్పుడు
2. పిచ్చుకలు తమ గూళ్ళను చెట్లపై తక్కువ ఎత్తులో కట్టుకున్నప్పుడు, అవి ఆహారాన్ని ముందుగానే సమకూర్చుకుంటున్నప్పుడు
3. చీమలు పుట్టల్ని ఎత్తు మీద కట్టుకున్నప్పుడు
4. చలికాలానికి ముందే సాలీళ్లు ఎక్కువగా కనిపించినప్పుడు
5. పక్షులు ముందుగానే వలస వెళ్లిపోయినప్పుడు
... ఇలా ప్రజల్లో చాలా నమ్మకాలు ఉన్నాయి.
జంతువులన్నీ ఇలా శీతాకాలాన్ని గడపడానికి సిద్ధమవుతుంటే అలస్కాలోని వేటకుక్కలు మాత్రం రేస్‌కు సిద్ధమవుతూ ఉంటాయి. మంచులో వందల కిలోమీటర్లు పరిగెట్టగల కుక్కలు అవి.

అలస్కా: ది గ్రేట్ డాగ్ రేస్

అలస్కాలో ఏటా మార్చి నెల మొదటి శనివారం మొదలవుతుంది డాగ్ రేస్. ఒక్కో జట్టులో 16 కుక్కలు ఉంటాయి. ఓ చిన్న బండిపై వాటి యజమాని కూర్చుంటే ఆ కుక్కలన్నీ ఆ బండిని లాక్కుంటూ మంచు కొడల్లో 1,868 కి.మీ ప్రయాణించి గమ్యాన్ని చేరాల్సి ఉంటుంది. రేస్ పూర్తవడానికి 10 నుంచి 30 రోజులు దాకా పట్టవచ్చు. మార్గమధ్యంలో మంచు తుపానులకి, చలికి కుక్కలకు, మనుషులకు ఆరోగ్యం క్షీణించవచ్చు. అందుకే ఈ రేస్‌లో పాల్గొనడమంటేనే పెద్ద సాహసం. అయినా సరే ఎన్నో జట్లు ఈ రేస్‌లో పాల్గొంటాయి. కొండలు, టండ్రా గడ్డిభూములు, నదులు దాటుకుంటూ ప్రయాణిస్తాయి. ఒక్కోసారి ఉష్ణోగ్రత మరీ తగ్గి మైనస్ 70 డిగ్రీలకి చేరుతుంది. అయినా రేసులు మాత్రం ఆగిపోవు. డాగ్ రేస్ అంత పేరున్న క్రీడ అలస్కాలో మరొకటి లేదంటే ఆశ్చర్యం కాదు. అలస్కాకు చెందిన యాభైకి పైగా జట్లతోపాటు మరో 20 దేశాల నుంచి కూడా జట్లు వచ్చి ఈ రేసులో పాల్గొంటాయి. మహిళలు కూడా ఇందులో పాల్గొనడమే కాదు రెండుసార్లు గెలిచారు కూడా! ఇంతదూరం సాగే రేస్ భూమి మీద మరోటి లేదు. అందుకే దీనిని 'లాస్ట్ గ్రేట్ రేస్ ఆన్ ఎర్త్' అని అంటారు.

రేస్‌లో పాల్గొనే వాళ్లనే కాదు, వారి కుక్కల్ని సైతం ఇక్కడ సెలబ్రిటీలుగా భావిస్తారు. చిన్న చిన్న పోటీలు అలస్కాలో ఎప్పట్నించో జరుగుతున్నా ఎంతో దూరం సాగే ఈ రేస్ మొదలైంది మాత్రం 1973లో. ఎనిమిది రోజుల 22 గంటల 47 నిమిషాల 2 సెకన్లలో చేరుకుని 2002లో మార్టిన్ బుసర్ రికార్డు సృష్టించాడు. సంబరంలా సాగే ఈ పోటీకి ప్రపంచ మీడియాతో పాటు చాలా దేశాల సినీ తారలు కూడా వెళతారు. అందుకే ఈ రేస్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

వింటర్ ఒలింపిక్స్

ఇప్పటి దాకా మనం చెప్పుకున్న ఆటలన్నీ ఆయా దేశాల ప్రత్యేకతలయితే నాలుగేళ్లకోసారి జరిగే 'వింటర్ ఒలింపిక్స్'కి మరో రకం ప్రత్యేకత ఉంది. సమ్మర్ ఒలింపిక్స్‌లో ఉండే క్రీడలేవీ వింటర్ ఒలింపిక్స్‌లో ఉండవు. కేవలం మంచులో ఆడే ఆటలే ఉంటాయి. స్కీయింగ్, ఐస్‌హాకీ, ఫిగర్ స్కేటింగ్, స్పీడ్ స్కేటింగ్, ఇలా... మొత్తం పదిహేను రకాలు ఆటలుంటాయి. వీటిని ఆటలనే కన్నా మంచుపై విన్యాసాలంటేనే బాగుంటుందేమో.
వింటర్ ఒలింపిక్స్‌ను మొదటిసారి 1924లో ఫ్రాన్స్‌లో నిర్వహించారు. ఉత్తరార్థగోళంలో చలికాలం నవంబర్ ఫిబ్రవరిల మధ్య వస్తుంది కదా... అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రతి సారి ఫిబ్రవరి నెలలో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది (2010) జరిగిన 21వ వింటర్ ఒలింపిక్స్‌కు కెనడాలోని వాంకోవర్ వేదికగా నిలిచింది. మొత్తం 82 దేశాలకు చెందిన 2,600 మంది క్రీడాకారులు దీనిలో పాల్గొన్నారు. ఈ క్రీడలు కెనడాలో జరగడం ఇది మూడోసారి. దక్షిణార్థగోళంలో అంటార్కిటికా ఖండంలో తప్ప మరెక్కడా చెప్పుకోదగినంతగా చలి ఉండదు కాబట్టి వింటర్ ఒలింపిక్స్ దక్షిణార్థగోళంలో ఇంతవరకు జరగలేదు.

పైన చెప్పిన ఆటలు, విశేషాలన్నీ ఉత్తరార్థగోళానికే పరిమితమైనా నిజానికి భూగోళం మీద అతి శీతల ప్రాంతం మాత్రం అంటార్కిటికా. ఆ ఖండంలో స్థిరనివాసాలు లేవు కాబట్టి ఇలాంటి విశేషాలకు అవకాశం కూడా లేదు. అయితే చాలా దేశాలకు ఇక్కడ పరిశోధనా కేంద్రాలున్నాయి. ఆ కేంద్రాలలో 5000 మందికి పైగా శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు. కాని శీతాకాలం వచ్చేనాటికి వారిలో చాలామంది తిరిగి వచ్చేస్తారు. కేవలం ఓ వెయ్యిమంది మాత్రమే అక్కడ ఉంటారు. భూమ్మీద రికార్డు చేసిన అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ 89.2 డిగ్రీలు. అంటార్కిటికా లోని రష్యాకి చెందిన పరిశోధనా కేంద్రం 'వోస్టాక్ స్టేషన్'లో నమోదైన ఉష్ణోగ్రత అది.

***

ఇక్కడ పేర్కొన్న వింటర్ విశేషాలు కొన్ని మాత్రమే. చెప్పుకుంటూపోతే ఇంకా ఇలాంటివి బోలెడుంటాయి. వీటిలో కొన్ని మరీ విడ్డూరంగా ఉన్నాయని మీరనుకోవచ్చు. అయితే ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను అందమైన అనుభవాలుగా ఎలా మలచుకోవచ్చో ఈ విశేషాలు చదువుతుంటే తెలియట్లేదూ!

వింటర్‌లో బడికెళ్లాల్సిందే...

మన దేశంలోని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా శీతాకాల ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి దిగిపోతాయి. కాశ్మీర్ లోయలో అయితే సరస్సులన్నీ హిమ శిలలుగా మారిపోతాయి. మనకి వేసవి సెలవులు ఇచ్చినట్టు అక్కడ చలికాలం సెలవులు కూడా ఇస్తారు. అందుకే చలికాలం వచ్చిందంటే అక్కడ బడిపిల్లలందరికీ పండగ. మంచులో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం స్కూళ్లకి చలికాలం సెలవులు లేవని ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆధునిక విద్యా విధానం మొదలైన తర్వాత 1880 నుంచి ఇప్పటి దాకా వింటర్ హాలిడేస్ రద్దు చేయడం ఇదే మొదటిసారి. చిట్టిపొట్టి చిన్నారులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు లెండి. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ఇచ్చి సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లు యధావిధిగా కొనసాగాలని సూచించింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కాశ్మీర్లో నెలల తరబడి కొనసాగిన ఆందోళనలు, కర్ఫ్యూల వల్ల స్కూళ్లు అసలు నడవలేదు. పాఠాలు పూర్తి చేయడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదట.


* నాగేశ్వరరావు తమనం

Wednesday, December 15, 2010

భళా.. తొలి మహిళా...!

కేవలం దేశాధినేతలకు భార్యలుగానే కాదు.. ఓ దేశానికి మొదటి మహిళగా బాధ్యతాయుత స్థానంలో వుంటూ... రాజీయ, కళారంగాల్లోనూ తమదైన ముద్రను వేశారు ఈ నారీ మణులు. వీరిలో కొందరు భారత గడ్డపై పర్యటించి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు ముగ్ధులయ్యారు.ఇక్కడి సంగీతానికి కాలు కదిపారు. మరికొందరు ఇక్కడి సంప్రదాయ వస్త్రాలను చూసి మురిసిపోయారు. మరికొందరు త్వరలోనే భారత్‌లో అడుగిడనున్నారు. ఉన్నత స్థానాల్లో వుంటూ తమ విధి నిర్వహణలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్న వివిధ దేశాల మొదటి మహిళల సమాహారం ఈ కథ...!

చైనాకి మొదటి మహిళ...
Svetlana 
చైనా భావి మొదటి మహిళగానే కాదు... భూగర్భ పరిశోధకురాలిగా కూడా జాంగ్‌ ఎం తో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారు. చైనా ప్రధాని వెన్‌ జియాబావోను జాంగ్‌ గాన్‌సులో మొదటిసారి కలుసుకున్నారు. వెన్‌ మైనింగ్‌కి సంబంధించి ఒక పనిమీద వెళ్లి నపుడు ఆమెను చూశారు. అక్కడ జాంగ్‌ భూగర్భ శాస్త్ర పరిశోధకురాలుగా పనిచేసే వా రు. జాంగ్‌ వెన్‌ మనసు దోచుకునేందుకు మరో ఇద్దరితో పోటీ పడాల్సి వచ్చిందని కూడా అంటారు. అతనికి దగ్గరవ్వడానికి కారణం మాత్రం అతని పనుల్లో సాయం చేయడం అని అంటారు.

రాజకీయాల్లోనూ :
జాంగ్‌ బీజింగ్‌ డైమండ్‌ కార్పొరేషన్‌కి ప్రెసిడెంట్‌గా, చైనా అసోసియే షన్‌ ఆఫ్‌ జ్యుయలరీకి వైస్‌ ప్రెపిడెంట్‌గా చేశా రు. వెన్‌ ప్రధానిగా 2003లో బాధ్యతలు చేపట్టి న అనంతరం ఆమె తన పదవి నుండి తప్పుకు న్నారు. అనంతరం ఆ విభాగాల్లోనే కొన్ని ము ఖ్య విభాగాలను చూసుకుంటున్నారు.

ఆభరణాలంటే ఇష్టం :
2007లో చైనాలోని ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో జాం గ్‌కు వున్న ఆభరణాల ఇష్టాన్ని గురించి మాట్లా డుతూ ఆమెకు పచ్చలు, పగడాలు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అందుకు మరొకరు ఆమె దగ్గర 250000డాలర్లు విలువైన చెవి దిద్దులు వున్నట్లు చెప్పారు. మొత్తానికి ఆమెకు ఆభరణా లంటే ఎంతో ఇష్టం అని చెప్పారు.

పరిపూర్ణ మహిళ మిషెల్‌...
అమెరికా ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌ రాబిన్‌సన్‌ ఒబామా గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. న్యాయవాద వృత్తిలో పట్టా పొందిన ఆమె ప్రతి విషయంలోనూ ఎంతో నిక్కచ్చిగా వుంటారు. పొగ తాగడం మానేస్తేనే ఎన్నికల్లో భర్త తరపున ప్రచారంలో పాల్గొంటాను అన్న ఆమె మాటలే దాన్ని స్పష్టం చేస్తున్నారు. ఉన్నత భావాలు కలిగిన మిషెల్‌ ఒబామాను మొదటి సారి ఆఫ్రికన్‌-అమెరికన్‌ లా ఫిర్మ్‌ లో కలుసుకున్నారు. అక్కడ బబామాకు మెంటర్‌గా సంతకం చేశారు. అనంతరం తిరిగి వారు ఓ వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఇలా క్రమంగా కమ్యూనిటీ సమావేశాల్లోనూ వీరు కలుసుకున్నారు. అప్పుడే ఒబామా మిషెల్‌ మనసును ఆకట్టుకున్నారు. అనంతనం ఒక సంవత్సరం తరువాత వారు వివాహం చేసుకున్నారు.

అన్నిటిలోనూ ముందే :
సంస్కృతీ సంప్రదాయాలంటే మిషెల్‌కి ప్రాణం. అలాగే ప్రతి ఒక్కరూ విద్యావంతులవ్వాలన్నది ఆమె ఆశయం. అందుకు ఆమె ఎన్నో దేశాల్లో ప్రచారాల్లోనూ పాల్గొన్నారు. అంతేకాదు 2006లో ప్రపంచం లో ఎక్కువ ప్రభావితం చేసిన 25 మంది మహిళలలో ఆమె స్థానం పొందింది. ప్రపంచంలో బెస్ట్‌ డ్రెస్‌డ్‌ మహిళల్లోనూ ఎప్పుడూ ముందు వరుసలో మిషెల్‌ వుంటారు.

తోచిందే చేయడం ఆమె ప్రత్యేకత...
whomans
�జీవితాంతం ఒక్కరితోనే గడపడం బోర్‌� అన్నా.. �ప్రేమ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎప్పటికీ అలాగే వుండదు� అని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడినా అది ఫ్రెంచి ప్రెసిడెంట్‌ భార్య బ్రూనీకే చెల్లుతుంది.మోడల్‌గా, సింగర్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న బ్రూనీ నికోలస్‌ సర్కోజీని 2007లో ఒక డిన్నర్‌ పార్టీలో కలుసుకుంది. అనంతరం వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒక సంవత్సరం తరువాత వారు ప్యారిస్‌లోని ఎలిసీ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. ఇది బ్రూనికి మొదటి పెళ్లి. సర్కోజీకి మూడవది.

అన్నిటా ముందే :
గత మూడు సంవత్సరాలుగా ఇంటర్నేషనల్‌ బ్రెస్ట్‌ డ్రెస్‌డ్‌ లిస్టులోముందు వరుసలోనే బ్రూనీ వుంటోంది.పుతిన్‌ కన్నా నాలుగు ఇంచులు ఎత్తు కూడా. పంప్‌ షూష్‌ విత్‌ లో హీల్స్‌ వేసుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం.

ఇతరాలు :
కేవలం మోడల్‌గానే కాదు.. ఆమె తన న్యూడ్‌ ఫొటో గ్రాఫ్స్‌తో కూడా ఫేమ్‌ అయ్యారు. ఈ ఫొటోలు 90వేల డాటర్లకు అమ్ముడుపోయాయి. గాయనిగా ఇప్పటి వరకు బ్రూనీ మూడు ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేశారు.నాలుగవది వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆమె ఒక సినిమాలోనూ నటించింది.

పేరు ప్రఖ్యాతులు కలిగిన మహిళ...
రష్యాప్రెసిడెంట్‌ వ్లాద్‌మీర్‌ పుతిన్‌ భార్యగానే కాక స్వయంగా ఓ నేతగా కూడా స్వెట్లానా మెద్వెదేవ్‌ సుపరిచితమే. ఆమె పుతిన్‌ని మొదట లెనిన్‌గ్రాడ్‌లో కలుసుకున్నారు. అప్పుడు వారి వయసు ఏడు సంవత్సరాలు. వారు కలుసు కున్న స్థలం ఒక పాఠశాల. చిన్న తనం నుండే స్నేహితులుగా వున్న వీరు 1993లో వివాహం చేసుకున్నారు. ఎకనామిక్స్‌ గ్యాడ్యుయేట్‌ అయిన డ్మిట్రీ కొంత కాలం అంతర్జాతీయ కళాశాలలో పని చేశారు. 1995లో కొడుకు పుట్టిన అనంతరం ఆ విధుల నుండి తప్పుకున్నారు.అనంతరం ఆమె రష్యా లోని అనేక ముఖ్య విభాగాల్లో పని నిచేశారు. ప్రధానమంత్రి సిబ్బందిలోనూ ఆమె పని చేశారు.

వివక్షకు వ్యతిరేకంగా :
లింగవివక్షకు వ్యతిరేకంగా ఆమె ఎన్నో స్వచ్చంధ సంస్థల తరపున ప్రచారం చేశారు. మొదటి మహిళగా మారకమునుపే ఆమె సామాజిక సేవలో ఎక్కువగా పాల్గొన్నారు. అలాగే రష్యా కళల, సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆమె ఎంతో మక్కువ చూపిస్తారు.

Thursday, December 9, 2010

34 మిలియన్ ఫ్రెండ్స్

దీనికి ప్రత్యక్ష నిదర్శనం జేన్ రాబర్ట్స్, లూయిస్ అబ్రహాం. జేన్ రాబర్ట్స్ పుట్టింది పెరిగింది కాలిఫోర్నియాలో. రెడ్‌ల్యాండ్స్ అనే ప్రాంతంలోని ఒక స్కూల్లో ఫ్రెంచ్ ఉపాధ్యాయురాలు. అందరికీ మంచి చేయాలనే ఆలోచన తప్పితే- ఉద్యమాల పట్ల అంత ఆసక్తి లేదు. అలాగని తన చుట్టూ జరిగే అన్యాయాలు, అక్రమాలను ఎదిరించాలనే భావన పట్ల విముఖత కూడ లేదు. పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దాలనే కోరికే ఆమెను ఉపాధ్యాయవృత్తిని ఎంచుకొనేలా చేసింది. ఆ కోరికే ఆమెను రిటైరయ్యే దాకా అదే ఉద్యోగంలో కొనసాగేలా చేసింది.

లూయిస్ అబ్రహాం ఒక మామూలు మధ్యతరగతి మహిళ. కుటుంబమే సర్వస్వం, ఇంటి పనే దైవం అనుకొనే వ్యక్తి. కాని అవసరమైనప్పుడు ఎంతకైనా తెగించి పోరాడడం ఆమె నైజం.

జేన్‌కు ఒక రోజు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసిన ప్రకటన కనబడింది. పత్రికలకు అది చాలా అప్రధాన వార్త. చాలా మంది పాఠకులకూ అది అప్రధాన వార్తే. "యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్‌కు అమెరికా ప్రభుత్వం 3.4 కోట్ల డాలర్ల నిధులను సమకూరుస్తానని గతంలో ప్రకటించింది. అయితే ఈ సంస్థ పనితీరును గమనించిన తర్వాత.. మారిన ప్రాధమ్యాల నేపధ్యంలో- ఈ నిధులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం..'' అనేది ఆ ప్రకటన సారాంశం. ఉదయాన్నే చాలామంది లాగానే జేన్ కూడా ఆ వార్త చదివింది. ఈ నిధులు ఇవ్వకపోతే అమెరికా ప్రభుత్వంపై ఎవరూ ఒత్తిడి పెట్టరు.

ప్రపంచ దేశాల నేతలెవరూ పట్టించుకోరు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించరు. కాలమిస్ట్‌లు కూడా తమ వ్యాసాల్లో ఈ విషయానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి నిర్ణయాలు ఎవరికి పట్టవు. కాని అమెరికా ఇచ్చే ఆ మూడు కోట్ల డాలర్లు- అఫ్గానిస్థాన్, అంగోలా, దక్షిణాఫ్రికా, ఇథియోపియా- ఇలా అనేక వర్థమాన దేశాల్లో ఉన్న మహిళల జీవితాల్లో మార్పు తెస్తాయి.

అంగోలాలో ఉన్న ఒక పల్లెటూరులోని ఆసుపత్రికి కొత్త ఇన్‌క్యుబేటర్ రావచ్చు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో గర్భిణిలకు పౌష్టికాహారం అందొచ్చు. ఈ భావన జేన్‌లో కొత్త ఆలోచనలను రేపింది. కాని ఏం చేయాలి? పదవీ విరమణ చేసిన ఒక సాధారణ ఉపాధ్యాయురాలు ఏం చేయగలుగుతుంది? ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని ఎలా మార్చగలుగుతుంది? జేన్‌కు రెండు మూడు రోజులు ఆలోచనలు తెగలేదు. కాని ఏదో చేయాలనే భావన మాత్రం పోవటం లేదు.

చివరకు తనలాంటి వారిని కలుపుకొని పోవాలని నిర్ణయించింది. తొలి అడుగుగా- తన అభిప్రాయాలను అందరితోను పంచుకోవటం మొదలుపెట్టింది. దీనికి సాధనం మీడియా. స్థానిక పత్రికయిన శాన్ బెన్‌నార్డినో సన్‌కు ఒక ఉత్తరం రాసింది.. "ప్రతి ఏడాది ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ఎంతమంది మరణిస్తారో.. అంత కన్నా ఎక్కువ మంది మహిళలు కాన్పులలో మరణిస్తున్నారు. సరైన వైద్య పరికరాలు లేక అంత కన్నా ఎక్కువ మంది దుర్భరమైన బాధను అనుభవిస్తున్నారు.

కిలుము పట్టిన కత్తులతో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. మన ప్రజాస్వామ్యంలో ఒక తప్పు జరిగింది. దానిని సరిచేయాలి. దాని కోసం ఒకో డాలర్ చొప్పున యుఎన్ఎఫ్‌పీఏకి పంపుదాం. 3.4 కోట్ల మంది ఒకో డాలర్ చొప్పున విరాళం ఇస్తే - 3.4 కోట్ల డాలర్లు సమకూరుతాయి..జరిగిన తప్పుకు ప్రాయశ్చితం జరుగుతుంది'' అనేది ఆ ఉత్తర సారాంశం.

జేన్ ఉత్తరం యూఎన్ఎఫ్‌పీఏ అధికారుల దృష్టికి వచ్చింది కాని దానిని వారు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కాని సరిగ్గా అదే సమయంలో న్యూమెక్సికోకు చెందిన లూయిస్ అబ్రహాం కూడా ఈ వార్తను చదివింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలపై బుష్ నిర్ణయం చూపే ప్రభావం ఆమెకు అర్థమయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలా చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచించింది. లూయిస్ కూడా జేన్ మాదిరిగా విరాళాలు సేకరించటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని భావించింది. దీని కోసం ఒక మెయిల్‌ను తయారుచేసి తన స్నేహితులందరికి పంపింది.

"మహిళలకు ఆరోగ్య సేవలు అందించాలనేది మానవతా దృష్టితో తీసుకోవాల్సిన నిర్ణయం. అది రాజకీయ నిర్ణయం కాదు... అందుకే దయచేసి మీరందరూ ఒక కాగితాన్ని తీసుకొని- దానిలో ఒక డాలర్ పెట్టి చుట్టండి. ఒక కవర్ మీద "34మిలియన్ ఫ్రెండ్స్..'' అని రాసి వెంటనే యూఎన్ఎఫ్‌పీఏకు పంపించండి.

మరో ముఖ్యమైన విషయం- ఈ మెయిల్‌ను కనీసం పది మందికి పంపండి.. ఎంత మందికి పంపగలిగితే అంత మంచిది'' అనేది ఆ ఉత్తర సారాంశం.
మొదటి వారం కొన్ని ఉత్తరాలు వచ్చాయి. రెండో వారానికి అవి మరింతగా పెరిగాయి. మొదట యూఎన్ఎఫ్‌పీఏ సిబ్బంది-తమ ఖాళీ సమయంలో ఉత్తరాలను విప్పి- వాటిలో ఉన్న డాలర్ నోట్లను జాగ్రత్త చేసేవారు. మూడో వారానికి పెద్ద పెద్ద మూటల నిండా ఉత్తరాలు రావటం మొదలుపెట్టాయి. మగవారు కూడా విరాళాలు పంపటం మొదలుపెట్టారు. కొందరు ఐదుడాలర్లు, మరి కొందరు పది డాలర్లు- ఇలా విరాళాల సంఖ్య పెరగటం మొదలుపెట్టింది. కొందరు ఉత్తరాలు కూడా రాసేవారు.

"ఈ ఐదు డాలర్లు నా జీవితాన్ని సుసంపన్నం చేసిన మహిళలు: మా అమ్మ, నా భార్య, నా ఇద్దరు కూతుళ్లు, నా మనమరాలు-లకు గుర్తుగా పంపుతున్నా'' అని ఒకాయన విరాళం పంపుతూ రాశాడు. ఇవన్నీ చూశాక యూఎన్ఎఫ్‌పీఏ లూయిస్, జేన్‌ల ఉద్యమ ప్రాధాన్యాన్ని గుర్తించింది. వారిద్దరిని ఒకరికొకరిని పరిచయం చేసింది. వారిద్దరూ కలిసి - 34 మిలియన్ ఫ్రెండ్స్. ఒఆర్‌జిని స్థాపించారు. వివిధ దేశాలు తిరిగి ఉద్యమ ప్రాధాన్యం గురించి చెప్పటం మొదలుపెట్టారు.

"ఒక డాలర్ ఇవ్వలేనని ఎవరూ అనలేరు. కాలేజీ విద్యార్థులు కూడా విరాళం ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. సోడాకి పెట్టే ఖర్చుతో ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక మహిళ జీవితం బాగుపడుతుందంటే అంత కన్నా ఏం కావాలి?'' అంటుంది జేన్. అయితే ఒబామా అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత 2009లో- యుఎన్ఎఫ్‌పీఏకు(బుష్ ఆపిన) 34 మిలియన్ డాలర్ల నిధులూ సమకూరుస్తామని ప్రకటించాడు. కాని అప్పటికే జేన్, లూయిస్‌ల ఉద్యమ ఫలితంగా నాలుగు మిలియన్ డాలర్లు సమకూరాయి.

అమెరికా ప్రభుత్వం ఇస్తానని ప్రకటించింది కాబట్టి- ఇక 34 మిలియన్ డాలర్ ఫ్రెండ్స్ అవసరం లేదా? అనే విషయమైతీవ్రమైన చర్చ జరిగింది. అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధులను అదనపు విరాళాలుగా భావించి వాటిని కూడా మహిళా ఆరోగ్య కార్యక్రమాలకు ఖర్చు చేయాలని లూయిస్, జేన్ నిర్ణయించారు. ఇప్పటికీ 34 మిలియన్ ఫ్రెండ్స్ కొనసాగుతూనే ఉంది.

అనేక వేల మంది విరాళాలు ఇస్తూనే ఉన్నారు. వాటి ద్వారా కొన్ని వేల మందికి సాయం అందుతోంది. ప్రతి మంచి పనికి ఎవరో ఒకరు ఇలా పూనుకుంటే ఎంత బాగుండు! 
(హాఫ్ ద స్కై.. హౌ టు చేంజ్ ద వరల్డ్ ఆధారంగా)

రష్యా అవినీతి ఎరగని దేశం

ఇరవై ఏళ్ల కిందట నాన్న మాస్కో వచ్చారు. ఇక్కడి యూనివర్శిటీ క్యాంపస్‌లో 'దేవీ కెఫే అండ్ బార్' అనే రెస్టారెంట్ కమ్ బార్ ఉంది మాకు. నా చదువు పూర్తయ్యేదాకా నాన్న, అన్నయ్య ఇద్దరే దాన్ని చూసుకునే వాళ్లు. మూడేళ్ల నుంచే (ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేళ్ల క్రితమే నేను మాస్కో వచ్చాను) నేనూ ఆ పని చేస్తున్నాను. మేము ఇక్కడి మన దేశ రాయబార కార్యాలయానికి వంటకాలను సరఫరా చేస్తాం. భారతదేశం నుంచి ఏ విఐపి వచ్చినా భోజనం మా దగ్గర నుంచే వెళ్తుంది.

అద్దెలు భరించడం కష్టం
మాది రెస్టారెంట్ బిజినెస్ కనుక నిర్దిష్టమైన పని వేళలంటూ ఏమీ ఉండవు. ఉదయం ఆరింటికి మొదలైతే అర్దరాత్రి పన్నెండు దాకా మా హోటల్ తెరిచే ఉంటుంది. ఉదయం ఐదు గంటల నుంచే పనులు మొదలుపెడ్తాం. ఇల్లు క్యాంపస్‌కి దగ్గర్లోనే ఉంటుంది. ఇక్కడ ఇళ్లు దొరకడం కష్టం కాదు కాని అద్దె భరించడమే చాలా కాష్టం. ఒక గది అద్దె రెండు వేల అమెరికన్ డాలర్లు ఉంటుంది. అంటే దాదాపు లక్ష రూపాయలు. ఒక అపార్ట్‌మెంట్ తీసుకుంటే రెండు నుంచి రెండున్నర లక్షల దాకా ఉంటుంది అద్దె. ఒక్క ఇల్లే కాదు ఏదైనా ఇక్కడ ఖరీదు ఎక్కువే. ధరలు ఆకాశన్నంటుతుంటాయి. మా రెస్టారెంట్‌లో 25 మంది సిబ్బంది ఉన్నారు.

అందులో ఆరుగురు రష్యన్లు. మిగిలిన వాళ్లు భారతీయులే. వాళ్లలో విద్యార్థులే ఎక్కువ. అంటే క్యాంపస్‌లో చదువుకుంటూ పార్ట్ టైమ్ ఇక్కడ ఉద్యోగం చేస్తారన్నమాట. రష్యన్లలో నలుగురు ఆడవాళ్లు. క్లీనింగ్ సెక్షన్‌లో వెయిటర్స్‌గా పని చేస్తారు. ఒకావిడయితే పదిహేనేళ్ల నుంచీ మా దగ్గరే పనిచేస్తోంది. పని విషయంలో రష్యన్లు చాలా బాధ్యతగా ఉండటమే కాదు చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. చేయాల్సిన పని గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్టే గ్రహించి చకచకా చేసుకుపోతుంటారు. ఇద్దరు రష్యన్లున్నా హోటల్ నడిపేయొచ్చు. అంటే అంత ధీమాగా ఉండొచ్చు వాళ్లుంటే. ఇద్దరే రెస్టారెంట్ మొత్తాన్నీ ఒంటి చేత్తో మేనేజ్ చేసేయగలరు.

హారన్ మోగిస్తే పనిష్మెంటే....
మా రెస్టారెంట్‌కి కావల్సిన సరుకులు, కూరగాయల కోసం గుజరాతీలు నడిపే భారతీయ దుకాణాలకి వెళ్తాం. నిలువ ఉండే వస్తువులైతే ఇండియా నుంచే తెప్పించుకుంటాం. ప్రతి నాలుగైదు నెలలకు ఎవరో ఒకరు ఇండియా నుంచి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఫుడ్ కలర్స్, కాశ్మీరి మిర్చి, కస్తూరి మేతి, కొన్ని రకాల గరం మసాలా పదార్థాలను అక్కడి నుంచే తెప్పించుకుంటాం. ఇక్కడవి దొరకవని కాదు, ధరలు ఎక్కువని.

యూనివర్శిటీ మాస్కో సిటీ సెంటర్‌లోనే ఉంటుంది. ఆ క్యాంపస్‌లోనే మా రెస్టారెంట్ కనక ఏ దుకాణమైనా అరగంట దూరంలోనే ఉంటుంది. కాని ఇక్కడ ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. అరగంట ప్రయాణానికి కనీసం రెండు గంటలు... ఆపైన ఎంతైనా పట్టొచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు, సాయంత్రం ఆరు తర్వాతయితే మరీ దారుణం. ఐదేసి గంటలు కూడా జామ్ అవుతుంది. ఇంకో విషయమేంటంటే... హారన్ మోగించకూడదు. మోగిస్తే ఫైన్.. లేదంటే పనిష్మెంట్. ట్రాఫిక్ నియమాలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. తాగి వాహనాలు నడిపే వాళ్లు పట్టుబడితే... ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో పదోపరకో పెట్టి తప్పించుకోవడం వంటి పప్పులేమీ ఉడకవు . ఫైన్‌తోపాటు పనిష్మెంట్లే కాక డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు క్షణాల్లో.

లంచం అంటే ఏమిటో తెలియదు వీళ్లకు. అందుకే ఇక్కడేదైనా తప్పు చేస్తే తప్పించుకోవడం కుదరదు. అలాగే ప్రజల అవసరాలకు ఏ చిన్న అంతరాయం కలిగినా ఆయా విభాగాలు క్షణాల్లో స్పందిస్తాయి. ఉదాహరణకు.. మనింట్లో టెలిఫోన్ డెడ్ అయినా... స్ట్రీట్ లైట్ వెలగట్లేదని ఫిర్యాదు చేసినా... తక్షణమే స్పందించి బాగు చేస్తారు. అంతేకాదు సమాజం ఆస్తుల పట్ల ప్రతివాళ్లూ బాధ్యతగా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం... చెత్త పారబోయడం కుదరదిక్కడ. చెత్తను కూడా దేనికదే (ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్, నూనె పదార్థాలు ఇలా) వేరు చేసి డస్ట్‌బిన్‌లో వేయాలి. వీళ్ల జీవన విధానంలో అడుగడుగునా క్రమశిక్షణ కనిపిస్తుంది. స్వంత వాహనాలు ఉన్నా ప్రజారవాణా సౌకర్యాలను.. అంటే బస్సులనే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. (బస్సులు కాక టాక్సీలు కూడా ఉంటాయి). విద్య నుంచి వైద్యం దాకా ప్రజల మౌలిక అవసరాలన్నింటిలో అత్యుత్తమ ప్రమాణాలుంటాయి.

ఎన్ని రకాల వోడ్కాలో..!
వారానికి అయిదు రోజులే పనిదినాలు. శని, ఆదివారాలు సెలవులు. కాని మాకు మాత్రం నో హాలిడేస్. సెలువుదినాల్లోనే పని ఎక్కువగా ఉంటుంది. వీకెండ్స్‌కి బయటకు వచ్చే వాళ్లు ఎక్కువ కాబట్టి మా రెస్టారెంట్ ఆ రోజుల్లో కిటకిటలాడుతుంది. భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్తులే కాక రష్యన్స్ కూడా వస్తుంటారు మా రెస్టారెంట్‌కి. నిజానికి వాళ్లు మాంసాహార ప్రియులు. పోర్క్, ల్యాంబ్ అంటే చాలా ఇష్టపడతారు. కాని మా రెస్టారెంట్‌లో శాకాహారం, చికెన్ తప్ప మిగతావేమీ ఉండవు. అయినా వస్తారు. పోర్క్‌లాంటి వాటి కోసం డిమాండ్ చేయకుండా మన వంటకాలనే చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఇడ్లీ, వడ, దోసెలాంటి టిఫిన్లంటే ప్రాణం పెడ్తారు.

పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటారు. వారికి అన్నిటికన్నా ప్రధానమైన పానీయం వోడ్కా. దీనికి రష్యానే పుట్టిల్లు. ఇక్కడున్నన్ని వోడ్కా వెరైటీలు ఇంకెక్కడా ఉండవు. ఇక్కడ అందరూ దీన్ని ఆస్వాదిస్తారు. ఇంటకి వచ్చిన అతిథులకు వోడ్కా ఇవ్వడం కనీస మర్యాద. అలాగే ఎవరినైనా హలో అని పలకరించడం కనీస మర్యాద. హలో అని చిరునవ్వుతో పలకరించకపోతే బయటకి ఏమీ అనకపోయినా అనాగరికులుగా చూస్తారు.

మొన్నటిదాకా కమ్యూనిస్టు దేశమైనా పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లే సరదా ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది. వీకెండ్ అనే కాదు... రోజంతా పనిచేసి రాత్రుళ్లు పబ్బులలో తుళ్లే యూత్ ఎక్కువే. సరదాలు, వినోదాలు, సంతోషాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. మన పండగలు, పబ్బాలు అన్నిటినీ ఇండియన్ ఎంబసీలో నిర్వహిస్తుంటారు. భారతీయులందరం అక్కడికే వెళ్తుంటాం. ఆసక్తి ఉన్న రష్యన్లు కూడా పాలుపంచుకుంటుంటారు.

పిల్లుల్ని పిల్లల్లా చూసుకుంటారు..
ఇక్కడ భారతీయులే కాక పాకిస్తానీ, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్లు కూడా ఎక్కువగా కనిపిస్తారు. రష్యన్లు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. వాళ్ల పద్ధతులు, ఆచారాలు, మతానికి సంబంధించిన నమ్మకాలు వాళ్ల వరకే పరిమితం చేసుకుంటారు. చాలా గుంభనంగా ఉంటారు. ఏ విషయంలోనూ బయటపడరు. వీళ్ల అలవాట్లు కొన్ని మనకు చిత్రంగా అనిపిస్తాయి. రష్యన్లకు పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ. పిల్లుల్ని బాగా పెంచుతారు.

ప్రతి ఇంట్లో పెంపుడు పిల్లులుంటాయి. మనకు వింతగా అనిపించే ఇంకో సంగతేంటంటే.. పిల్లలు లేని వాళ్లు పిల్లుల్నే స్వంత పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు. రష్యా రావాలనుకునే వాళ్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం... రష్యన్లకు ఇంగ్లీష్ అంతగా రాదు. బస్సుల మీద, ఇతరత్రా సైన్ బోర్డులన్నీ రష్యన్ భాషలోనే ఉంటాయి. కనుక రష్యన్ భాష వచ్చుంటే మంచిది. ఇక్కడ చదువు చాలా చవక. ముఖ్యంగా మెడిసిన్. ఉద్యోగాలకు మాత్రం అంతగా అవకాశాలు లేవు. పైగా వీసా అనుమతులు చాలా తక్కువగా ఉంటాయి.

విదేశీయుల వల్ల ఇక్కడి శాంతిభద్రతలకు, జన జీవనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు పాటిస్తుంటారు. రష్యాలో చదువుకున్న చాలామంది ఉద్యోగాల కోసం లండన్ వెళ్తుంటారు. మాస్కో నుంచి లండన్‌కి రోడ్డు దారి ఉంది. ఐదుగంటలే ప్రయాణం. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం... క్రైమ్ రేట్ చాలా చాలా తక్కువ. అమ్మాయిలను ఏడిపించడం, రేప్‌లు లాంటి సంఘటనలు అసలు వినిపించవు. ఆడా, మగా అందరూ సమానమే ఇక్కడ.
జూ సరస్వతి రమ

Monday, December 6, 2010

న్యూయార్క్‌లో దోశల బండి

కొబ్బరి చట్నీ వేసుకొని కరకరలాడే దోశలను తినేయాలని ఎవరికుండదు చెప్పండి..? మనకు దోశ తినాలనిపిస్తే ఇంటి పక్కనే ఉన్న ఏ చిన్న గల్లీలోనైనా దొరుకుతుంది. అదే అమెరికాలో అయితే అక్కడి భారతీయులందరూ దోశ కోసం మైళ్లకు మైళ్లు వెళ్లి, అక్కడున్న ఇండియన్ రెస్టారెంట్లలో దోశలను తినేవారు. కానీ, ఇప్పుడు తిరుకుమార్ కందస్వామి అమెరికా వెళ్లాక... ఆయన చుట్టూ తిరుగుతున్నారు దోశల ప్రియులు. ఎందుకంటే అతను న్యూయార్క్‌లోని వాషింగ్టన్ స్క్వేర్‌లో ఓ చిన్న దోశల బండి పెట్టాడు. ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి దోశలను వేసి అబ్బురపరుస్తున్నాడు. భారతీయులే కాదు, అమెరికన్లు కూడా కందస్వామి దోశలను ఆవురావురుమంటూ తినేస్తున్నారట.

శ్రీలంక నుంచి న్యూయార్క్‌కు..
కందస్వామి అమెరికాలో దోశల బండి పెట్టడం దోశలు తిన్నంత సులభంగా జరిగిపోలేదు. ఆయన తమిళనాడువాసి. కుటుంబం శ్రీలంకలో స్థిరపడింది. అమ్మా, చెల్లెలు ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. ఒకప్పుడు శ్రీలంకలో బైక్ రేసుల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేసిన కందస్వామికి.. అమెరికా వెళ్లాక దోశలతో దశ తిరిగిపోయింది. కొన్నాళ్లు క్వీన్స్‌లోని సౌత్ ఇండియన్ హోటళ్లలో పనిచేశాడు. చెప్పుకోడు కానీ మరిన్ని చిన్నాచితక పనులు చాలానే చేశాడు. ఎలాగో కష్టపడి గ్రీన్‌కార్డు సంపాదించుకున్నాడు.

మన దేశంలో రోడ్డు పక్కన బండి పెట్టుకొని ఇడ్లీలు, దోశలు అమ్మాలంటే ఏమంత కష్టమైన పని కాదు. అప్పుడప్పుడు తగిలే పోలీసులు, మున్సిపాలిటీ వాళ్లకు అంతోఇంతో చేతిలో పెడుతుంటే ఎన్నాళ్లయినా నడిచిపోతుంది. కానీ, అమెరికాలో అలా నడవదు. రోడ్ల పక్కన ఎక్కడా చిన్న తోపుడుబండి కూడా కనిపించదు. ఒకవేళ ఉన్నా దానికి బోలెడు పర్మిషన్లు ఉండాలి. అందుకే కందస్వామి కూడా మూడున్నరేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి లైసెన్సు తెచ్చుకున్నాడు.

లైసెన్సు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, దోశల బండిని తయారు చేయించడం మరో ఎత్తు. ఎందుకంటే న్యూయార్క్ నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారమే బండిని చేయించాలి. దీని కోసం కందస్వామి మరో ఆరు మాసాలు కుస్తీపట్టాడు. "నాకు ముందు నుంచి అందరూ చేసే పనినే గుడ్డిగా అనుసరించడం ఇష్టముండదు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగాను. ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ఇడ్లీ, దోశల బండ్లు కనిపిస్తాయి. అదే అమెరికాలో అయితే ఈ సౌకర్యం ఉండదు.

అయినా మన వాళ్లు ఎక్కడ కలిసినా దోశలు, ఇడ్లీల గురించే చర్చలు. పెద్ద హోటళ్లలో తింటే సంతృప్తి తక్కువ, బిల్ ఎక్కువ. అదే రోడ్డు పక్కన నిల్చుని, అటూఇటూ వెళ్లే మనుషుల్ని, వాహనాల్ని చూస్తూ.. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే ఆ మజానే వేరు. ఆ తినేదేదో అమెరికా వీధుల్లో తింటే ఇంకెంత బాగుంటుందో కదా..! అందుకే పెడితే ఇక్కడే దోశల బండి పెట్టాలనుకున్నా.

ఎంతోమందిని కలిసి, అమెరికా ప్రభుత్వ నిబంధనలను అధ్యయనం చేసి... ఈ దోశలబండిని ఈ చెట్ల కింద పెట్టాను. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా... నేను వేసిన మసాలా దోశ ఈ అమెరికాలో ఎవ్వడు వేస్తాడో చూపించండి...'' అంటూ గర్వంగా మీసాలు మెలేస్తూ.. చిరునవ్వుతో చెప్పుకొచ్చే కందస్వామిని చూసి అమెరికన్లు కూడా శభాష్ అనక తప్పడం లేదు.

మాంద్యంలో హాట్‌కేకులు
ఆర్థికమాంద్యంతో అమెరికా ఎంత నష్టపోతున్నదో కానీ, కందస్వామి మాత్రం బాగా వెనకేస్తున్నాడు. అమెరికాలోని యువతీయువకులు ఉద్యోగాలు లేక వీధుల్లో తిరుగుతున్నారు. రెస్టారెంట్‌లలో తిండి తినాలంటే కనీసం యాభై డాలర్లను వదిలించుకుంటే కానీ కడుపు నిండదు. అదే కందస్వామి దగ్గరికి వెళితే కేవలం ఆరు డాలర్లకే రుచికరమైన వేడి వేడి దోశ వేసిస్తాడు. రవ్వదోశ, మసాలదోశ, ప్లెయిన్ దోశ, పాండిచ్చేరి దోశతోపాటు ఊతప్పం, వడ... ఇలా ఎవరికి ఏం కావాలంటే అది క్షణాల్లో తయారు చేసిస్తున్నాడు.

'నాకే ఆశ్చర్యం వేస్తుంది. రోడ్ల మీద వెళ్లే వాహనాలు నా దోశ వాసన తగలగానే ఆగిపోతున్నాయి. అందులో భారతీయులకంటే అమెరికన్లే ఎక్కువ మంది ఉన్నారు. నేను దోశ వేశానంటే అదిరిపోవాలంతే. ఎప్పుడో మా అవ్వ నేర్పింది కొబ్బరి చట్నీ చేయడం. అది ఇప్పుడు పనికొచ్చింది. కొబ్బరి చట్నీతో లొట్టలేసుకుంటూ దోశలు తినేస్తున్నారు అందరూ. నాకు 45 దేశాల కస్టమర్లు ఉన్నారు. హోటళ్లు ప్రచురించే గైడ్ బుక్‌లో నా దోశల బండికీ స్థానం దక్కింది. ఫేస్‌బుక్, ఈ మెయిల్ ద్వారా కూడా దోశలు పంపమని ఆర్డర్లు వస్తుంటాయి. ఒక రోజు అమెరికాలో ఫైనాన్షియల్ టైమ్స్‌లో నా గురించి స్టోరీ పడింది.

దాన్ని చూసి లండన్‌కు చెందిన ఒకాయన నా బండి దగ్గరకొచ్చి దోశ తిని, నన్ను అభినందనలతో ముంచెత్తి మరీ వెళ్లాడు. నాకు చాలా సంతోషమేసింది. న్యూయార్క్ యూనివర్శిటీ స్టూడెంట్స్ కూడా నాకు రెగ్యులర్ కస్టమర్లు..'' అన్నాడు దోశల కందస్వామి. న్యూయార్క్‌లో ఏటా వీధి వ్యాపారులకు ఇచ్చే'వెండీ' అవార్డును (వెండర్లకిచ్చే అవార్డు) సైతం ఆయన గెలుచుకోవడం విశేషం. దోశలతో వేడి వేడిగా సంపాదిస్తున్న కందస్వామి ఇప్పుడు అమెరికాలోనే రెండో దోశల బండి పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

దోశల సంపాదనతోనే తన ముద్దుల కూతురును కొలంబియా యూనివర్శిటీలో చదివిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి..? భారతీయ దోశల ఘుమఘుమలతో న్యూయార్క్ వీధులను నింపేస్తున్న కందస్వామికి మనం కూడా దోశలు సారీ, చేతులు జోడించి అభినందనలు చెబుదాం.

Sunday, December 5, 2010

నల్లమలకు '' వజ్రపుకోత ''


diamond
వజ్రానికున్న విలువ మనిషి సృష్టించిందే. ఏది అరుదైపోతుందో దాని మూల్యం అమూల్యమైపోతుంది. విశ్వవ్యాప్తంగా వజ్రాలు విరివిగా దొరుకుతున్నా ఒక దండగమారి సంస్థ కృతిమ పరిస్థితిని కల్పించి వజ్రాల వ్యాపారంలో యావత్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. అందమైన వజ్రాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది. వజ్రాన్ని కబ్జా చేసుకున్న ఆ ఒకేఒక్క సంస్థ ఇప్పుడు మన దేశంలో, అందులోనూ మన నల్లమల అటవీ ప్రాంతాన్ని కబళించే దుశ్చర్యకు పాల్పడుతోంది. చెంచులను వారి అటవీ సంపదకు దూరం చేసే కుతంత్రం పన్నుతోంది. నల్లమలవాసులు, ఉద్యమకారులు కూడా ఈ దురాక్రమణను వజ్రసంకల్పంతో ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వజ్రాల వర్తకం, నల్లమలలో పరిణాలపై కథనం...

diamondring
నల్లమల అడవుల్లోకి వెళ్ళితే... పచ్చటి చెట్లు కానవస్తాయి. కొండలూ, కోనలూ కన్పిస్తాయి. అడవి తల్లికి దండాలు... మా తల్లి అడవికి దండాలు అనే పాటలు విన్పిస్తాయి. అంతలోనే డి బీర్స్‌ రాబందు రెక్కల చప్పుడూ వినిపిస్తుంది. నల్లమల అడవుల భూగర్భంలో దాగిన వజ్రాలను పసిగట్టేందుకు ఆ డేగ తన వాడిచూపులతో ప్రయత్నిస్తోంది. తన చూపులకు అడ్డు వస్తున్నాయన్న మిషతో గిరిజనులను ఎత్తుకెళ్ళి మరోచోట పడేయా లని, వారి ఆవాసాలను నేలమట్టం చేయాలని ప్రయత్నిస్తోంది. అది అన్వేషించదల్చిన వజ్రాలు నిజంగా అంత అమూల్యమైనవా... యావత్‌ భూగోళంలో ఎన్నో చోట్ల అపారంగా లభించే ఆ రాళ్ళ కు నిజంగా అది చెప్పేటంత విలువ ఉందా? ఆ విలువ అంతా కృత్రిమంగా సృష్టించిందేనా... డి బీర్స్‌ అంతర్ధానమైతే, ఆ ప్రభా వం యావత్‌ ప్రపంచ డీలర్లపై పడితే... ఆ ‘విలువైన’ వజ్రాలన్నీ ఒట్టి రంగురాళ్ళుగా మిగిలిపోతాయా? వజ్రాల కుబేరులు బికా రులైపోతారా? అప్పటి వరకూ రూ.లక్షలు ‘విలువ’ చేసిన వజ్రాలు కాస్తా రూ. వేల ధరలకు పడిపోతాయా? ఏ వస్తువైనా అపా రంగా లభిస్తే దానికి అంతగా విలువ ఉండదు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యమే. ఇలా అపారంగా లభించే వస్తువులకు సైతం కృత్రిమంగా కొరత సృష్టిస్తే వాటి ధర పెరగడం ఖాయం. నల్లబజారు వర్తకులు చేసేదంతా ఇలాంటి మాయనే. వజ్రాల విష యంలోనూ సరిగ్గా ఇదే జరుగుతోంది.

యావత్‌ ప్రపంచంలోనూ వజ్రాల వ్యాపారాన్ని అత్యధిక స్థాయిలో (సుమారు 40 శాతం దాకా) డి బీర్స్‌ సంస్థ నియంత్రిస్తోంది. భారీ మొత్తా ల్లో వజ్రాలను ఇది తన వద్ద నిల్వ చేసుకొని మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తూ అధిక రేట్లను వజ్రాలను విక్ర యిస్తూ సొమ్ము చేసుకుం టోంది. మార్కెట్లో దీనికి పోటీ లేకపోవడంతో ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. రేపటి నాడు ఈ సంస్థ ఏ సందర్భంలోనై నా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే, తన వద్ద ఉన్న వజ్రాల నిల్వలను అయిన కాడికి అమ్మేసుకుంటుంది.

diamond-thum-b
అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వజ్రాల మార్కెట్‌ కుప్పకూలడం ఖాయం. వజ్రాల విలువ ఊహించలేనంతగా పడిపోతుంది. ఈ ప్రభావం డిబీర్స్‌ సంస్థకు మాత్రమే పరిమితం కాదు. ఇటీవలి ఆర్థిక మాంద్యం అమెరికాలో పుట్టి ప్రపంచ వ్యాప్తం అయినట్లుగా క్రమక్రమంగా ఒక్కో వజ్రాల సంస్థపై, ఆ తరువాత వజ్రాలు కలిగి ఉన్న వారిపై దీని దుష్ర్పభావం పడుతుంది. అప్పటి వరకూ రూ. లక్షలు ఖరీదు చేసిన వజ్రాలు రేటు రూ. వేలల్లోకి పడిపోతుంది. అలాంటి వజ్రాలను అధిక రేట్లకు వేలంవెర్రిగా కొనడంలో ఔచిత్యాన్ని పక్కకు బెడితే, అలాంటి రాళ్ళ కోసం ప్రజల ప్రాణాలను, ఆస్తులను, సంస్కృతిని, అన్నింటికీ మించి ప్రకృతిని పణంగా పెట్టడం ఎంత వరకు న్యాయం అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. వజ్రాల అన్వేషణకు రాష్ట్రప్రభుత్వం లక్షలాది ఎకరాలను డీ బీర్స్‌ సంస్థకు కట్టబెట్టిం ది. ఇందులో అటవీ భూములు కూడా ఉన్నాయి. ఆయా అటవీ ప్రాంతాల్లో అంతరించిపోతున్న జాతులకు చెందిన పక్షు లు, జంతువులు, మొక్కలు ఉన్నాయి. వీటని పరిరక్షించుకోవడం మన బాధ్యత కాదా... ‘విలు వైన’ రాళ్ళ కోసం అంత కన్నా విలువైన ప్రాణాలను, ప్రకృతి ని నాశనం చేసుకుందామా?

వజ్రాలు ‘వెల’ లేనివని, అమూల్యమైనవనీ డి బీర్స్‌ ప్రచారం చేస్తోంది. నిజంగానే ఆ వజ్రాలు వెల లేనివి, మూల్యం లేనివనీ ఆ సంస్థ కార్యకలాపాలను వ్యతిరేకించే వారు విమర్శిస్తుంటారు. ఎన్నో దేశాల జాతకాలను తారుమారు చేసిన ఘనత డి బీర్స్‌కు ఉంది. తన మాట వినని దేశాలను తన కాళ్ళపై పడేసుకున్న ఘనత ఆ సంస్థది. అంతటి పటిష్ఠమైన మార్కె టింగ్‌ వ్యవస్థ దానికి ఉంది. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే మన వజ్రాల పరిశ్రమను దానికి ధారాదత్తం చేసినట్లే. డి బీర్స్‌ను వ్యతిరేకించడమంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమే. స్వదేశీ భావనను సమర్థించడమే. పర్యా వరణాన్ని పరిరక్షించడమే. అడవులను సంరక్షించుకోవడమే. భూమిపుత్రుల ఆచారవ్యవహారాలను గౌరవించడమే. అడవితల్లిని కాపాడుకోవడమే.

డి బీర్స్‌ సంస్థ పుట్టుపూర్వోత్తరాలను ఒక సారి పరిశీలిస్తే...
diamond1
వజ్రం అనేది కొత్తగా పుట్టుకొచ్చిన వస్తువేమీ కాదు. లక్షల ఏళ్ళ నుంచీ వజ్రాలు భూమిలో ఉంటూనే వచ్చాయి. వేల ఏళ్ళ నుంచీ మానవజాతికి వ జ్రాల గురించి తెలుసు. దానికి ఉన్నదల్లా విలాసవస్తువుగా వెల మాత్రమే. స్ర్తీ, పురుషులు వజ్రాలను కోరుకునేది వాటి వల్ల లభించే ఉపయోగాల కోసం కాదు... వాటిపై ఉన్న కోరికతో మాత్రమే. ఆ కోరికను రెచ్చగొట్టి వజ్రాలను అధి క ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది డి బీర్స్‌. నిజానికి వాటికి ప్రకృతిలో కొరత లేదు. వాటిని గనుక పారిశ్రా మిక ఉత్పత్తి కి, వినియో గానికి అను మతిస్తే వాటి ధర రెండు నుంచి 30 డాలర్లకు మించదనే వారూ ఉన్నారు. అలాంటి వజ్రాలు నేడు వంద నుంచి వెయ్యి డాలర్లకూ విక్రయమవుతున్నాయి. వివిధ దేశాల ప్రజానీకంలో ఉన్న సెంటి మెంట్‌ను ఆధారంగా చేసు కుని వజ్రాల వర్తకులు వాటిని అత్య ధిక ధరలకు విక్రయిస్తున్నారు.

diamond2
డీ బీర్స్‌ సంస్థను సెసిల్‌ రోడ్స్‌ 1870లో స్థాపించారు. ఆ సంస్థ నేడు యావత్‌ ప్రపంచంలో వజ్రాల వ్యాపారాన్ని నియంత్రించే స్థాయికి ఎది గింది. అందుకు అనుగుణంగా తన కొనుగోళ్ళు, అమ్మకాల వ్యవస్థను రూపొందించుకుంది. ఓ శతాబ్దం పాటు అది మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలిగింది. క్రమంగా మార్కెట్లోకి వజ్రాల వ్యాపారులు అధికం కావడంతో ఒక నాటి ప్రాభవాన్ని అది కోల్పోయింది. పూర్వ వైభవాన్ని సాధించుకునే క్రమంలో అది నేడు భారత్‌ లాంటి వర్ధమాన దేశాల్లో తన కార్యకలాపాలను అధికం చేసింది. శతాబ్దాల తరబడిగా భారత్‌, బ్రెజిల్‌ రెండు దేశాలు మాత్రమే వజ్రాలను ఉత్పత్తి చేసేవి. 19వ శతాబ్ది మధ్యకాలం నాటి వరకు కూడా వజ్రాలకు తీవ్ర కొరత ఉండేది. చక్రవర్తులు, రాజులు, అపర కుబేరులు, సంపన్నుల వద్ద మాత్రమే వజ్రాలు ఉండేవి. సాధారణ ప్రజానీకానికి వజ్రాలను అందుబాటు లోకి తెచ్చే యోచనే అప్పట్లో ఊహకు అందేది కాదు. 1867లో దక్షిణాఫ్రికా లో తొలిసారిగా వజ్రాలను కనుగొన్నారు. నాటి నుంచి వజ్రాల సరఫరా అధికం కావడం ఆరంభమైంది. వీటి సరఫరా ఎంత పెరిగి నా నేటికీ వజ్రాలను ఎంతో అమూల్యమైనవిగా భావించడం విశేషం.

ChenchuHunter_Nallamala
1871లో దక్షిణాఫ్రికాలోని కోలెస్‌బర్గ్‌ కోప్జె (ఇప్పుడు కింబెర్లే) లో 83.5 క్యారట్‌ డైమండ్‌ బయటపడడంతో గోల్డ్ష్‌ తరహాలో డైమరడ్‌ రష్‌ ఆరంభమైంది. నాటి నుంచీ వజ్రాల వేటలో ఎంతో మంది ఆ దేశం వైపు పరు గులు తీయడం ఆరంభించారు. వజ్రాలు లభించే ప్రాం తం తక్కువగా ఉండడం, మౌలిక వసతుల కోసం భారీగా పెట్టుబడి పెట్టాల్సి రావడంతో ఆయా వ్యక్తులంతా సామూ హికంగా సహకరించుకోవడం ఆరంభించారు. వారి మధ్య ఎన్నో తలెత్తే వివాదాలను పరిష్కరించుకునేందుకు డిగ్గర్స్‌ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. క్రమంగా భారీ స్థాయిలో వజ్రాల వెలికితీత కోసం ఇతరులతో కలసి సంస్థలను నెలకొల్పా రు. ఆ చిన్న చిన్న సంస్థలన్నీ విలీనాలు, స్వాధీనాల ప్రక్రియలో పెద్ద సంస్థలుగా పుట్టుకొచ్చాయి. డీ బీర్స్‌ వ్యవస్థాపకుడు సెసిల్‌ రోడ్స్‌ మొదట్లో పంపింగ్‌ ఉపకరణాలను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేపట్టారు. వజ్రాలకు భారీ మార్కెట్‌ ఉందన్న విషయాన్ని అతి త్వరలోనే గ్రహించి 1880 నాటికి ఓ పెద్ద సంస్థను ఏర్పరచగలిగే స్థాయికి చేరుకున్నాడు. రాత్‌షిల్డ్‌ కుటుంబం నుంచి నిధులు పొంది వ్యాపారాన్ని విస్తరించాడు.

chenchu_family
1888 నాటికి ఆ కంపెనీ దక్షిణాఫ్రికాలోని వజ్రాల గనులన్నింటి పై కూడా ఆధిపత్యం సాధించగలిగింది. ది డైమండ్‌ సిండికేట్‌ పేరిట ఆయన వజ్రాల పంపిణీ వ్యవస్థపై పట్టు సాధించగలిగాడు. బార్నే బర్నాటో, సిసెల్‌ రోడ్స్‌ కంపెనీల విలీనంతో డి బీర్స్‌ కన్సాలిడే టెడ్‌ మైన్స్‌ సంస్థ రూపుదిద్దుకుంది. అప్పటికి దక్షిణాఫ్రికాలోని అన్ని వజ్రాల గనులు దాని ఆధీనంలోనే ఉన్నాయి. 1889లో సిసెల్‌ లండన్‌కు చెందిన డైమండ్‌ సిండికేట్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా మార్కెట్‌ నియంత్రణకు ఆనాడే బీజం పడింది. రెండో బోయర్‌ యుద్ధం ఈ కంపెనీకి ఓ సవాల్‌గా పరిణమించింది. యుద్ధం ఆరంభం కాగానే సిసెల్‌కు చెందిన విలువైన గనులు శత్రువుల ఆధీనంలో ఉండి పోయాయి. సిసెల్‌ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంతో తన గనుల విముక్తిని కోరాడు. వ్యూహాత్మక యుద్ధ లక్ష్యాల కంటే కూడా గనుల విముక్తికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా కోరాడు. మిలటరీ పెద్దగా సహకరించనప్పటికీ, సిసెల్‌ సైన్యానికి అండగా నిలిచాడు. తన ఫ్యాక్టరీల్లో సైన్యానికి అవసరమైన ఆయుధసంపత్తిని తయారు చేయించి అందించాడు. 1902లో తొలిసారి గా కులినన్‌ గనిని కనుగొన్నారు. దాని యజ మాని డి బీర్స్‌తో చేతులు కలిపేందుకు నిరాకరించాడు. స్వతంత్ర డీలర్లకు తన వజ్రాలు విక్రయించడం ఆరం భించాడు.

తద్వారా డి బీర్స్‌ మార్కెట్‌ ఆధి పత్యానికి తొలిసారిగా గండి పడింది. కొత్త సంస్థ ఉత్పత్తి డి బీర్స్‌ ఉత్పత్తికి సమానం కావడం తో పాటుగా రెండో అతి పెద్ద సంస్థగా అది ఎదిగింది. అప్పటికి శక్తివంతంగా ఉండిన లండన్‌ సిండికేట్‌కు లోకల్‌ ఏజెంట్‌గా ఎర్నెస్ట్‌ ఒపెన్‌హెమర్‌ నియుక్తులయ్యారు. పదేళ్ళ లో ఆయన కింబెర్లేకు మేయర్‌గా కూడా అయ్యా రు. డి బీర్స్‌ విజయసూత్రాన్ని ఆయన బాగా ఒంటపట్టిం చుకున్నారు. అది ఆయన మాట ల్లోనే... ‘‘వజ్రాలకు విలువ పెంచాలంటే వాటికి కొరత సృష్టిం చాలి... అంటే ఉత్పత్తి తగ్గించాలి’’. చివర కు మొదటి ప్రపంచ యుద్ధసమయం నాటి కి కులినన్‌ గని డి బీర్స్‌ చేతికి చిక్కింది. 1902లో రోడ్స్‌ మరణించారు. అప్పటికి డి బీర్స్‌ యావత్‌ ప్రపంచ వజ్రాల వ్యాపా రంలో 90 శాతాన్ని నియంత్రించే స్థాయికి చేరుకుంది.
అనంతర కాలంలో డీ బీర్స్‌ కంపెనీ బాధ్య తలను హారీ ఒపెన్‌హెమర్‌ చేపట్టారు.

diamond_ear_clip-2
సంస్థ మార్కెటింగ్‌ విధానమైన సెంట్రల్‌ సెల్లింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఓ) విధానాన్ని మరింత ప కడ్బందీగా అమలు చేయడం ఆరంభించాడు. డి బీర్స్‌కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి డి బీర్స్‌ సొంత గనులతో సహా వజ్రాల ఉత్పత్తి దారులందరి నుంచి వజ్రాలను కొంటుంది. వజ్రాల మొత్తం సరఫరాలో కనీసం సగ భాగం డి బీర్స్‌ సొంత గనుల నుంచే అని ఓ అంచనా. ప్రతీ సంవత్సరం కూడా డి బీర్స్‌ ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వజ్రాలను ఏ రేటుకు విక్రయించాలో నిర్ణయించుకుం టుంది. అందుకు తగ్గట్లుగా మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టిస్తుంది. ప్రతీ వజ్రాల ఉత్పత్తిదారుకు కూడా మొత్తం ఉత్పత్తిలో కనీసం ఇంత శాతాన్ని కచ్చితంగా తాము కొంటామని డి బీర్స్‌ గ్యారంటీ ఇస్తుంది. మార్కెటింగ్‌ ఫీజు కింద తిరిగి వారి వద్ద నుంచి 10 నుంచి 20 శాతాన్ని వసూలు చేస్తుంది.

DeBeers_HeadOffice
ఈ సెంట్రల్‌ సెల్లింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఓ) అనేది యావత్‌ పరిశ్రమకూ క్లియ రింగ్‌ హౌజ్‌లా పని చేస్తుంది. మార్కెట్‌ లో లభ్యం కావాల్సిన వజ్రాల పరిమాణాన్ని, రేట్లను ఇది నిర్దేశిస్తుంది. ఒకప్పుడు 80 శాతం వరకు ప్రపంచ వాణిజ్య వ్యాపా రాన్ని ఈ సీఎస్‌ఓ నియంత్రించేది. ఇప్పుడి ది 65 నుంచి 75 శాతం దాకా ఉండవ చ్చునని భావిస్తున్నారు. సీఎస్‌ఓ నుంచి వజ్రాలు కొనే డీలర్లు తిరిగి వాటిని తమ తమ ప్రాంతాల్లో విక్రయించు కుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా వజ్రాల ధరలు ఎన్నటికీ తగ్గకుండా చూస్తూ వచ్చింది డి బీర్స్‌. ఇటు వజ్రాల ఉత్పత్తిదారులకు, అటు విక్రేతలకూ అందరికీ ఇది ఎంతో లాభదాయకంగా ఉండింది. ఎన్నో వర్ధమాన దేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు సైతం డీ బీర్స్‌తో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకునేవి. తద్వారా వాటికి నిలకడతో కూడిన విదేశీ మారక ద్రవ్యం లభించేది. హెచ్చు ధరల భారం అంతా కూడా కొనుగోలుదారులపైనే పడేది. ఏ డైమండ్‌ ఈజ్‌ ఫర్‌ ఎవర్‌ అనే వాణిజ్య నినాదం 1947 లో రూపుదిద్దుకుంది. ప్రేమకు, అంకితభావా నికి ప్రతీక వజ్రం అనే రీతిలో కంపెనీ ప్రకటనలు ఉంటాయి.

గుత్తాధిపత్యానికి అడ్డంకులు...
DeBeers-VenetiaPlant-SA
1970 ప్రాంతంలో డి బీర్స్‌ గుత్తాధిపత్యానికి ముప్పు ఎదురైంది. అప్పట్లో ఇజ్రాయెల్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉండింది. ద్రవ్యోల్బ ణాన్ని తట్టుకునే మార్గంగా వజ్రాలను ఎంపిక చేసుకోవడం ఆరంభమైంది. తక్కువ వడ్డీకి రుణాలు పొందేందుకు వజ్రాలు మార్గాన్ని సుగమం చేసేవి. వ్యాపారులు కూడా తదనం తర కాలంలో మరింత లాభాన్ని పొందవచ్చనే ఉద్దేశంతో వజ్రా లను భారీగా నిల్వ చేసుకోవ డం ఆరంభించారు. దీంతో మార్కెట్లో వజ్రాల కు కృత్రిమ కొరత ఏర్పడింది. వజ్రాల ధరలు బాగా పెరిగాయి. దీంతో డి బీర్స్‌ లాభాలు కూడా మరింత వృద్ధి చెందాయి. అప్పటి వరకూ వజ్రాలను ‘ఫర్‌ ఎవర్‌’గా భావించేవా రు. ఒకసారి ఓ వజ్రాన్ని కొన్నవారు తిరిగి దాన్ని విక్రయించే వారు కాదు. ఎప్పుడైతే వజ్రాలను పెట్టుబడి మార్గంగా చూడడం మొదలుపెట్టారో అప్పుడు వజ్రాల మారువిక్ర యాలు కూడా మొదలయ్యాయి. దాంతో మార్కెట్లో ఓ నిర్దిష్ట సమయంలో ఎన్ని వజ్రా లు ఎంత రేటుకు విక్రయించాలి అనే అంశం డి బీర్స్‌ చేతిలో లేకుండా పోయింది. కొంత మంది వజ్రాల మదుపరులు గనుక కూడబ లుక్కుని వజ్రాలను మార్కెట్లో విక్రయించడం మొదలుపెడితే వజ్రాల ధర తగ్గిపోయే ప్రమా దం ఏర్పడింది.
nallamala-forest
అది వజ్రం అత్యంత విలువైన దనే భావాన్ని ప్రజలకు దూరం చేసే అవకా శం ఏర్పడింది. రకరకాల మార్గాల ద్వారా ఈ తరహా విక్రయాలను అదుపు చేసేందుకు డి బీర్స్‌ ప్రయత్నించింది. సీఎస్‌ఓ ద్వారా విక్ర యించే వజ్రాలపై సర్‌ఛార్జ్‌ విధించింది. మార్కెట్‌ పరిస్థితులను బట్టి, ఈ సర్‌ఛార్జ్‌ను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఉప సంహరించేది కూడా. ఇదంతా కూడా స్పెక్యులేటివ్‌ వ్యాపారాన్ని తగ్గించేందుకే. అప్ప ట్లో ఇజ్రాయెల్‌లో ఏ వ్యాపారి అయినా కూడా సర్‌చార్జ్‌ ఉన్న సమయంలో వజ్రాలను కొని, విక్రయిద్దామనుకునే సమయానికి డి బీర్స్‌ సర్‌ఛార్జ్‌ ఎత్తివేసేది. ఫలితంగా ఆ వజ్రాల విక్రేత నష్టపోక తప్పదు. ఈ విధంగా డి బీర్స్‌ మార్కెట్‌ను నియంత్రించడం చేసేది. పలు సందర్భాల్లో డి బీర్స్‌ ప్రతినిధులు వివిధ వజ్రా ల వ్యాపారుల వద్దకు వెళ్ళి తమ ఆదేశాలు పాటించకపోతే, వారికి సరఫరా చేసే వజ్రాల్లో కోత విధిస్తామని హెచ్చరించేవారు. ఆ విధం గా ఇజ్రాయెల్‌ డీలర్లను డి బీర్స్‌ తిరిగి తన గుప్పిట్లోకి తీసుకోగలిగింది. 1984 దాకా ఇదే పరిస్థితి కొనసాగింది.

తల వంచక తప్పని జైరే...
డి బీర్స్‌ సీఎస్‌ఓ నిబంధనలు తమకు అను కూలంగా లేవని భావించిన జైరే దేశం సొంతంగా మార్కెటింగ్‌ చేసుకుందామని భావించింది. తమ నుంచి 20 శాతం మొత్తా న్ని హ్యాండ్లింగ్‌ ఛార్జీలుగా వసూలు చేయడా న్ని అది నిరసించింది. సొంతంగానే వ్యాపా రం ఆరంభించింది. దీంతో డి బీర్స్‌ తన వద్ద ఉన్న భారీ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసింది. జైరే అంత తక్కువ రేటుకు వజ్రాల ను విక్రయించలేకపోయింది. చివరకు డి బీర్స్‌ను తిరిగి ఆశ్రయించాల్సి వచ్చింది. దాంతో మునపటి కన్నా కఠిన నిబంధనలతో డి బీర్స్‌ దాన్ని సీఎస్‌ఓలో చేర్చుకుంది. తనను ఎదిరిస్తే ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఈ సందర్భంగా డి బీర్స్‌ యావత్‌ ప్రపంచానికి చాటి చెప్పింది.

రష్యాలో...
Narayana-visited-Nallamala
1957 ప్రాంతంలో సైబీరి యాలో భారీఎత్తున వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందేమోన ని భావించిన డి బీర్స్‌ సోవి యట్‌ ప్రభుత్వంతో ఒప్పందా నికి తహతహలాడింది. సీఎస్‌ఓ ద్వారా సోవియట్‌ వజ్రాలను మార్కెటింగ్‌ చేస్తా మని తెలిపింది. రెండింటి మధ్యా ఒప్పం దం కుదిరింది. అప్పట్లో సోవియట్‌ వజ్రాల ఉత్పత్తి యావత్‌ ప్రపంచ ఉత్పత్తిలో 20 నుంచి 30 శాతం దాకా ఉన్నట్లు అంచనా. సైబీరియాలో ఉత్పత్తి అయ్యే వజ్రాల్లో 95 శాతం మేర తాను కొనుగోలు చేస్తానని డి బీర్స్‌ గ్యారంటీ ఇచ్చింది. అప్పట్లో ఈ బేరం కుదుర్చుకునేందుకు గాను సాధారణ కొను గోలు రేటు కంటే 10 శాతం అధిక మొత్తాన్నే డి బీర్స్‌ ఆఫర్‌ చేసినట్లుగా చెబుతారు. 1980 దాకా కూడా సోవియట్‌ దేశం డి బీర్స్‌ ఒప్పం దంతో తృప్తి చెందింది. డి బీర్స్‌ ద్వారా కాకుం డా నేరుగా తానే వజ్రాలను మార్కెట్‌లో విక్ర యిస్తే భారీ లాభాలను గడించ వచ్చునని సోవి యట్‌ గుర్తించింది.

దాంతో యూరప్‌ మార్కె ట్లోకి ఒక్కసారిగా సోవియట్‌ వజ్రాలు వరద లా వచ్చిపడ్డాయి. ఫలితంగా అక్కడ రేట్లు పడిపోయాయి. అప్పటి వరకూ డి బీర్స్‌ మార్కెట్‌ మంత్రాంగంపై ధీమాతో ఉన్న వ్యాపారులు సందిగ్ధంలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో సోవియట్‌ తిరిగి డి బీర్స్‌ పంచ న చేరింది. నిలకడతో కూడిన విదేశీ మారక ద్రవ్యం కోసమే సోవియట్‌ అలా చేసిందని చెబుతారు. అప్పట్లో సోవియట్‌ నుంచి నేరు గా వజ్రాలు కొన్న డీలర్లు మాత్రం తమ తప్పి దాలకు డి బీర్స్‌ విధించిన శిక్షలను అనుభవిం చాల్సి వచ్చింది. తనను వదిలివెళ్తే ఏం జరుగు తుందో డీలర్లకు అనుభవంలోకి వచ్చేలా చేసింది డి బీర్స్‌.

స్టాక్‌మార్కెట్ల పతనంతో...
diamond3
1987 ప్రాంతంలో స్టాక్‌ మార్కెట్లు పతనం కావడంతో కాగితపు పెట్టుబడుల కన్నా కూడా కంటికి కన్పించే వాటిపై పెట్టుబడి పెట్టడంలో మదుపరులు ఆసక్తి కనబర్చారు. ఎప్పటిలా ఇది డి బీర్స్‌కు కలవరం కలిగించే అంశమే. పెట్టుబడి దృష్టితో వజ్రాలను కొన్నవారు వాటి ని ఎప్పుడు విక్రయిస్తారో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు డి బీర్స్‌ మార్కెట్‌ను నియం త్రించే స్థితిలో ఉండదు. ఈ పరిస్థితిని కూడా డి బీర్స్‌ సొమ్ము చేసుకుంది. ఓ వైపున విక్ర యాలు పెంచుకుంటూనే ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం వజ్రాలు కొనడాన్ని నిరుత్సాహపరిచింది. జపాన్‌ వంటి కొత్త మార్కెట్లను వెదుక్కొంది. మగవారు సైతం వజ్రాభరణాలను ధరించేలా చేసింది. డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్‌ అంటూ ప్రచారం ఆరంభించింది.

ఆస్ట్రేలియా...
డి బీర్స్‌ సంస్థకు ఆస్ట్రేలియ రూపంలో మరో ప్రమాదం ఎదురైంది. అక్కడ కూడా భారీస్థా యిలో వజ్రాల నిక్షేపాలు బయట పడ్డాయి. కార్టెల్‌ (డి బీర్స్‌ వాణిజ్య విధానం) ద్వారా గాకుండా ఆస్ట్రేలియా నేరుగా వాటిని ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తే గుత్తాధిపత్యానికి గండి పడుతుంది. డి బీర్స్‌ విశ్వరూపాన్ని అప్పటికే చూసిన ఆర్గే డైమండ్‌ మైన్స్‌ సంస్థ రంగు రాళ్ళ రూపంలో ఈ వ్యాపారంలోకి ప్రవేశిం చింది.

ఈ సంస్థ కూడా తనకు లాభదాయకం గా ఉండే రీతిలో డి బీర్స్‌ కార్టెల్‌లో చేరింది. 1995 ప్రాంతంలో డి బీర్స్‌ ఆస్ట్రేలియా సంస్థ పై అణచివేత ధోరణి ప్రదర్శించింది. దాన్ని నుంచి కొనే మొత్తాన్ని 85 శాతానికి తగ్గిం చింది. దీంతో ఒప్పందాన్ని పునరుద్ధరించు కోబోమంటూ ఆర్గే డైమండ్స్‌ సంస్థ డి బీర్స్‌ను బెదిరించింది.
1996లో అది కార్టెల్‌ ఉచ్చులోనుంచి బయ టపడింది. అప్పటి నుంచి కూడా భారత వజ్ర పరిశ్రమతో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. అది ఉత్పత్తి చేసే మొత్తంలో 95 శాతం భార త్‌ డైమండ్‌ కట్టింగ్‌ పరిశ్రమకు చేరుకుంటోం ది. దీంతో ఆర్గే పై డి బీర్స్‌ కక్ష సాధించడం మొదలుపెట్టింది. భారీ కుట్ర చేసింది. ఆర్గే ఉత్పత్తి చేసే రకం వజ్రాల ధర తగ్గడం ఆరం భమైంది. 1997లో ఆర్గే విక్రయాలు గణనీ యంగా పడిపోయాయి. కార్టెల్‌ నుంచి ఆస్ట్రేలి యా వైదొలిగినా తమకేమీ కాలేదంటూ డి బీర్స్‌ ప్రచారం చేసుకోవ డం ఆరంభించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆస్ట్రేలి యా సొంతంగా వ్యాపారం చేయడం ఆరంభించింది.

అంగోలా...
అంతర్యుద్ధం అనంతంర 1992 ప్రాంతంలో అంగోలా దేశం సైతం నాటి సోవియన్‌ యూ నియన్‌ తరహాలో విదేశీ మారక ద్రవ్యం కో సం డి బీర్స్‌తో ఒప్పందం చేసుకోక తప్పలే దు. అయినప్పటికీ అది డి బీర్స్‌తో సంబంధం లేకుండా ముడి వజ్రాల ఎగుమతులు భారీగా చేపట్టింది. ఈ దేశంపై మాత్రం డి బీర్స్‌ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకపోవడం విశేషం. అది తన మార్కెట్‌ను అంతగా ప్రభా వితం చేయకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు.


కెనడా...
1991 ప్రాంతంలో కెనడాలోని కోలా ప్రాం తంలో గణనీయ స్థాయిలో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. తన ఆధిపత్యానికి గండి ప డుతుందనే ఉద్దేశంతో డి బీర్స్‌ ఇక్కడ కూడా పాగా వేసింది. మరో రెండు సంస్థలు (ఆర్‌టీ జెడ్‌ కార్పోరేషన్‌), ఆస్ట్రేలియాకు చెందిన బ్రో కెన్‌ హిల్‌ ప్రొప్రయిటరీ (బీహెచ్‌ పీ) కూడా ఈ వజ్రాల వెలికి తీతలో పాలుపంచుకున్నా యి. తద్వారా పంపిణీ వ్యవస్థ తన చేజారిపో కుండా చూసుకుంది డి బీర్స్‌. బీహెచ్‌పీ సంస్థ ను కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయ త్నించింది డి బీర్స్‌. అమెరికాలోనూ బీహెచ్‌పీ సంస్థకు వ్యాపార ఆసక్తులున్నాయి. అమెరికా చట్టాలకు భయ పడి బీహెచ్‌పీ, డి బీర్స్‌ పంచన చేరేందుకు నిరాకరించింది. డి బీర్స్‌ అమెరికాలో ఎలాం టి కార్యకలాపాలు చేపట్టనందున అది అమెరి కా చట్టాలకు భయపడాల్సిన అవసరం లేకపోయింది.

సోవియట్‌ బాటలోనే రష్యా...
1990 ప్రాంతంలో రష్యాకు హార్డ్‌ కరెన్సీ అవసరం ఏర్పడింది. 1993లో రష్యా రుణం బజారున పడింది. తన వద్ద 200 మిలియన్‌ క్యారెట్ల విలువైన వజ్రాలు ఉన్నట్లు బయటపె ట్టింది. నిజానికి ఇంత భారీస్థాయి నిల్వలతో రష్యా, డి బీర్స్‌ తరహాలో సొంత మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. రకరకాల డిమాండ్లు చేసినప్పటికీ, తక్షణావసరాల నేపథ్యంలో రష్యా కూడా డి బీర్స్‌కు తలొగ్గక తప్పలేదు.

వజ్రం ఒకటే... ముఖాలెన్నో...
డి బీర్స్‌ ప్రధాన వ్యాపారం వ్రంతోనే. ఆ వజ్రానికి ఎన్నో ముఖాలు. అన్నీ అనుబంధ సంస్థలే. ఈ కంపెనీలన్నీ కూడా వజ్రాల వెలికి తీత, వజ్రాల వ్యాపారం, పారిశ్రామిక వజ్రాల తయారీ రంగాల్లో ఉన్నాయి. అన్ని విభాగాల్లో నూ దీనిదే అగ్రస్థానం. ఓపెన్‌ పిట్‌, భూగర్భం సముద్ర తీరం, సముద్ర గర్భం... ఇలా అన్నింటిలోనూ డి బీర్స్‌ అతి పెద్దది. బోట్స్‌ వానా, నమీబియా, దక్షిణాఫ్రికా, కెనడాలలో దీని కార్యకలాపాలు ప్రధానంగా సాగుతు న్నాయి. తాజాగా భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవులపై దృష్టి సారించింది.

అటవీ హక్కుల చట్టానికి తూట్లు...
వజ్రాల నిక్షేపాల అన్వేషణకు వీలుగా అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులను అడవి నుంచి బయటకు పంపేందుకు డి బీర్స్‌ సంస్థ కుట్ర పన్నుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2005లోనే అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చినా, దాన్ని ఉల్లంఘించి 2009లో డి బీర్స్‌ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిం దని అంటున్నారు. గత రెండే ళ్ళుగా ఇతర సంస్థల పేరిట డి బీర్స్‌ సంస్థ అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగ ర్‌ జిల్లా సోమశిల, మొలచింత పల్లి, పెద్దూటి పెంట తదితర ప్రాంతాల్లో ఈ విధమైన తవ్వకాలు జరుగుతున్నట్లుగా చెప్పారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం స్థానిక చెంచులకు తెలియ కుండా ఎక్కడా అడవుల్లో తవ్వకాలు చేపట్ట కూడదు. నల్లమల ప్రాంతంలో వజ్రాలు, యురేనియం తదితర నిక్షేపాల అన్వేషణ, వెలికితీతకు డి బీర్స్‌ను అనుమతించకూడదని కోరుతున్నారు. తెలుగుదేశంతో సహా వివిధ రాజకీయపక్షాలు, పలు ప్రజాసంఘాలు స్థానిక చెంచులకు అండగా నిలిచాయి. డి బీర్స్‌ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ఉద్యమిస్తున్నాయి.

నవంబర్‌ 19న మహబూబ్‌నగర్‌ జిల్లా లింగాల మండలంలో సీపీఐ నేత నారాయణ పర్యటించారు. డి బీర్స్‌ సంస్థ కార్యకలాపాలు అధికమైతే చెంచులకు అటవీ ఉత్పత్తులు సేకరించుకునే వీల్లేకుండా పోతుందని పేర్కొన్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వ హయాంలోనే అటవీ ప్రాంతాలను చెంచుల కు వదిలేశారని, ఇప్పుడు స్వరాజ్యం వచ్చిన తరువాత ఇలా చేయడం తగదని అన్నారు. అడవి తల్లిని చెంచులకు దూరం చేయడం తగదని సూచించారు. నవంబర్‌ 15న తెలం గాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత కూ డా నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించా రు. చెంచులను అడవి నుంచి తరలించవద్దని సూచించారు. ఖనిజ నిక్షేపాల సర్వే కోసం డి బీర్స్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం కూడా చెంచుల ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించింది. చెంచుల జీవించే హక్కును కాపాడాలని ఏపీసీఎల్‌సీ డిమాండ్‌ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనం ఝాన్సీ నవంబర్‌ 12న మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు.

కర్నూలు జిల్లా మొద లుకొని గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాలు, ఇతర ఖనిజాల అన్వేషణ కోసం డీ బీర్స్‌కు ధారాదత్తం చేయడాన్ని విమర్శించా రు. మొత్తం 6 వేల చ ెహక్టా ర్ల విస్తీర్ణంలో వజ్రాల అన్వేషణకుగాను డి బీర్స్‌కు అనుమతి ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. సర్వేకు అడ్డు గా ఉన్న చెంచులను అడవుల్లో నుంచి వెళ్ళ గొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమిం చాలని కోరారు. జీవో ఎం.ఎస్‌ నెం. 236 (16.11.2009), జీవో ఎం.ఎస్‌ నెం. 237 (12.11.2009), జీవో ఎంఎస్‌ నెం. 242 (24.11.2009) లతో రాష్ట్రప్రభుత్వం డి బీ ర్స్‌కు ప్రత్యేక అనుమతులను ఇచ్చిందన్నారు. టైగర్‌ జోన్‌ ప్రాజెక్టులో అనుమతించ కపోయి నా, రిజర్వు ఫారెస్టు పరిధిలో అనుమతి ఇ చ్చారని తెలిపారు. గత సంవత్సరం చెంచుల ను అడవుల్లోనుంచి చెంచులను బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేశారని, ప్రజల నిరసనలకు తలొగ్గి విరమించుకున్నారని పేర్కొన్నారు. డి బీర్స్‌ సంస్థ ఇప్పటికే దక్షిణా ఫ్రికా సంపదనంతా దోచుకుని ఇప్పుడు భారతదేశంపై పడిందని విమర్శించారు.
డి బీర్స్‌ ప్రొఫైల్‌
స్థాపితం : 1888
వ్యవస్థాపకుడు : సెసిల్‌ రోడ్స్‌
ప్రధాన కార్యాలయం : జోహాన్స్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా)
ఉనికి : ప్రపంచవ్యాప్తం
చైర్మన్‌ : నికీ ఒపెన్‌హెమర్‌
ఎండీ : గారెత్‌ పెన్నీ
ఉత్పత్తులు : వజ్రాలు
సేవలు : డైమండ్‌ మార్కెటింగ్‌, ప్రమోషన్‌
ఆదాయం : 6.8 బిలియన్‌ డాలర్లు (2009)
సిబ్బంది : 20,000

- వంశీ మోహన్‌ నర్ల