Sunday, October 3, 2010

సంద్రం చూడని సముద్రయానం

సముద్రంలోపల సబ్‌మెరైన్లలో పనిచేసేవాళ్లకు రంగురంగుల చేపలు, రకరకాల జీవులు, తిమింగలాలు కనిపిస్తాయనుకుంటాం. నీళ్లలో ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేయగల ఉద్యోగమనుకుంటాం.

కానీ అలాంటి అనుభూతులేవీ ఉండవంటున్నారు సబ్‌మెరైన్‌లో 20 ఏళ్లపాటు పనిచేసిన ఈ కెప్టెన్. కూర్చునే కుర్చీ దగ్గర నుంచి తిండితినే టేబుల్ వరకు అన్నీ ఇరుకిరుకేనట. సముద్రం లోపల వెళుతూ, సముద్రాన్ని తిలకించలేని ఆ జీవితం గురించి కెప్టెన్ నగిర్‌రెడ్డి పంచుకున్న అనుభవాలు...


అది 1982 అనుకుంటా. సముద్రంలో 50 మీటర్ల లోతులో మా సబ్‌మెరైన్ వెళుతోంది. నాతోపాటు వందమంది నేవీ సిబ్బంది అందులో ఉన్నారు. మేమంతా రష్యా వెళుతున్నాం. అప్పుడు సముద్రంలో భయంకరమైన చలిగాలులు వీస్తున్నాయి. హాంకాంగ్ సమీపానికి చేరుకున్నాం. సముద్రం మంచుతో గడ్డకట్టుకుపోయి ఉంది. మేమంతా సబ్‌మెరైన్‌లోనే చిక్కుకుపోయాం.

ఒడ్డుకు వద్దామనుకుంటే రాతిపలకల్లాంటి మంచు. వెంటనే హార్బర్‌లోని ఇండియన్ నేవీ అ«ధికారులకు మెసేజ్ పంపించాం. వాళ్లు హాంకాంగ్ నేవీ వాళ్లకు కబురు పెట్టారు. వెంటనే హాంకాంగ్ నేవీ వాళ్లు మంచును తొలగించే నౌకను తీసుకొచ్చారు. కట్టర్ల సాయంతో సముద్రం మీద గడ్డకట్టిన మంచును ముక్కలు చేశారు. అప్పటి వరకు మేం సముద్రంలోపలే సబ్‌మెరైన్‌లోనే ఉన్నాం.

అందరి మనసుల్లో ఆందోళన. కాసేపటి తరువాత మంచు విడిపోయిందని మెసేజ్ వచ్చింది. అప్పుడు బయటపడ్డాం. సబ్‌మెరైన్లలో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఒక్కసారి లోపలికి వెళ్లాక మళ్లీ బయటికి వచ్చే వరకు ఎప్పుడు, ఏం జరుగుతుందో ఊహించలేం. ఇదొక ఛాలెంజింగ్ జాబ్.

నీళ్లలో కాపలా...
భూభాగంలో గస్తీ తిరిగే సైన్యంలాగే, సముద్రంలోపల కూడా నిఘా తప్పనిసరి. నీళ్లలో ఆ పని చేసేది సబ్‌మెరైన్లే! మన దేశ సముద్ర తీరం ఏడువేల కిలోమీటర్లకుపైనే ఉంది. భూభాగం మీద అయితే అనుమతి లేకుండా సరిహద్దులు దాటే వాళ్లను సైన్యం అడ్డుకుంటుంది. అదే, సముద్రం లోపల్నించి వచ్చే వాళ్లను ఎలా గుర్తుపడతారు? ఏ సమయంలోనైనా శత్రువు రహస్యంగా మన దేశంలోకి రావచ్చు

. అందుకే సముద్రజలాల్లో కూడా నిఘాపెడుతుంది నావికాదళం. సబ్‌మెరైన్‌లు ఒక్కోసారి రెండు నెలలపాటు నీటిలోపలే ఉండిపోవాల్సి వస్తుంది. బయటి నుంచి చూస్తే సబ్‌మెరైన్లు చాలా పెద్ద ఆకారంలో కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం చాలా ఇరుగ్గా ఉంటాయి. అందులోనే వందమందికిపైగా సిబ్బంది ఉంటారు.

పెద్ద ఇనుప పెట్టెలాంటి క్యాబిన్లు, ఒక మనిషి పడుకుంటే మరొక మనిషి వచ్చేందుకు వీలులేని పడగ్గదులు. తిండీతిప్పలకు అంతంత మాత్రమే జాగా ఉంటుంది. హార్బర్‌లతో తప్ప బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఇలాంటి సబ్‌మెరైన్‌లోనే ఇరవై ఏళ్లు పనిచేశాను నేను. ప్రస్తుతం మర్చంట్ నావీ కెప్టెన్‌గా పనిచేస్తున్నాను.

సబ్‌మెరైన్‌లోనే...
మాది తూర్పుగోదావరి జిల్లాలోని పెనుగొండ ప్రాంతం. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. వర్ధమాన సినీనటి కలర్స్ స్వాతి నా కూతురే. నా గురించి చెప్పాలంటే.. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో సీటొచ్చింది నాకు. ఆ తర్వాత పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాను. అక్కడి నుంచి నేరుగా ఇండియన్ నేవీలోకి ప్రవేశించాను.

1977 నుంచి సబ్‌మెరైన్‌లోనే ఉద్యోగం. ఇరవై ఏళ్లలో కమాండర్, కెప్టెన్‌గా దేశమంతా తిరిగే భాగ్యం కలిగింది. విశాఖపట్టణం సముద్ర తీరంలో సందర్శనార్థం ఉంచిన 'కుర్‌సురా' సబ్‌మైరెన్‌కు అయిదేళ్లు కెప్టెన్‌గా పనిచేశాను. అప్పట్లో భారత్‌కు అది రెండో సబ్‌మెరైన్. రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. 1969లో దాన్ని సముద్రంలో ప్రవేశపెట్టారు. నాకు తెలిసి 31 సంవత్సరాలు సేవలు అందించింది 'కుర్‌సురా'. వైజాగ్‌లో దాన్ని చూసినప్పుడల్లా అందులో ఉద్యోగం చేసిన రోజులే గుర్తొస్తుంటాయి.

- సముద్రంలో 50 మీటర్ల లోతులో ప్రయాణిస్తున్నా, బయట ఏమీ కనిపించదు.
- రెండ్రోజులకు ఒకసారి డిస్పోజబుల్ డ్రెస్సులు మారుస్తుంటాం.
- ఆహ్లాదం కోసం సబ్‌మెరైన్‌లలో టీవీ, సినిమాలు చూడొచ్చు.
- మందు, సిగరెట్లు పూర్తిగా నిషేధం. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు.
మన సముద్రజలాల్లో నావికాదళం గస్తీ తిరిగినట్లే, ఇతర దేశాల వాళ్లూ సముద్రంలో గస్తీ నిర్వహిస్తుంటారు. ఒకసారి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నప్పుడు మాకు మరికొంత దూరంలో ఒక సబ్‌మెరైన్ వస్తున్నట్లు సంకేతాలొచ్చాయి. ఉద్యోగులందరూ అలర్ట్ అయ్యారు. కొంతసేపటికి ఆ సబ్‌మెరైన్ దూరం వెళ్లిపోయింది. ఆ రోజు ఏమీ జరగలేదు.
యుద్ధాల్లో కీలకపాత్ర.
మన దేశంలోని ప్రధాన నౌకా కేంద్రాలలో సబ్‌మెరైన్లను నిలుపుతుంటారు. అక్కడి నుంచి ప్రతి రోజూ నేవీ అధికారులు నిర్దేశించిన దూరం వరకు సముద్రంలోకి వెళ్లి వస్తాయి. ఒక్కో సబ్‌మెరైన్ సామర్థ్యాన్ని బట్టి కొన్నేసి రోజులు నీళ్లలో ఉంటాయి. రీఛార్జి కోసం సముద్ర పైభాగానికి వచ్చి కావాల్సినంత ఆక్సిజన్‌ను నింపుకొని మళ్లీ లోపలికి వెళతాయి. దీన్ని 'స్నాటింగ్' అంటారు.

సాధారణ సమయాల్లో గస్తీకి ఉపయోగించే ఈ సబ్‌మెరైన్లను యుద్ధాలు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి వాడుకుంటారు. ఇన్నేళ్ల నా ఉద్యోగ జీవితంలో యుద్ధాలు మాత్రం జరగలేదు. వెనకటి రోజుల్లో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు వైజాగ్‌లోనే ఒక సంఘటన జరిగింది. ఇండియాకు చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ అనే సబ్‌మెరైన్‌ను ముంచేయాలని పాకిస్తాన్ వ్యూహం పన్నింది. నిజానికి విక్రాంత్ అప్పుడు వైజాగ్‌లో లేదు.

అక్కడే ఉందనుకొని పొరబడిన పాకిస్తాన్ సబ్‌మెరైన్ ఘాజీ నీళ్లలోపలే రహస్యంగా వైజాగ్ చేరుకుంది. నిఘా పెట్టిన ఇండియన్ నేవీ నీటి లోపలే ఘాజీని పేల్చేసింది. మన దేశంలో సబ్‌మెరైన్లకు సంబంధించి ఇదే తొలి సంఘటన.

రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కూడా సబ్‌మెరైన్స్‌ను బాగా ఉపయోగించాడు. ఫాక్‌లాండ్ కోసం ఇంగ్లండ్, అర్జెంటీనాల నడుమ యుద్ధం జరిగినప్పుడు అర్జెంటీనాకు చెందిన రెండే రెండు సబ్‌మెరైన్లు ఇంగ్లండ్ నావికాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టాయి. ఆఖరికి ఆ యుద్ధంలో ఎంతో నష్టపోయాకగానీ ఇంగ్లండ్ గెలవలేదు. అదీ సబ్‌మెరైన్లకున్న పవర్.

అన్నీ ఇరుగ్గానే...
నిత్యం నీళ్లలోపల ఉండే సబ్‌మెరైన్ ఉద్యోగులు ఏం తింటారు..? ఎప్పుడు పడుకుంటారు..? స్నానాలు గట్రా ఎలా? ఇలాంటి ప్రశ్నలే చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని. అచ్చు మనం ఇంట్లో వండుకుని తినే ఆహారమే సబ్‌మెరైన్‌లోనూ వండుతారు. ప్రత్యేకంగా వంటమనిషి ఉంటాడు. అన్నం, పప్పు, రోటీ, కూరలు అన్నీ వేడిగా వండిపెడతారు.

చిన్న క్యాంటీన్‌లో డైనింగ్‌హాల్ మీదే అందరం భోంచేస్తాం. ఒక్క భోజన సమయంలో తప్పిస్తే సరదా సంభాషణలు ఎప్పుడూ వినిపించవు. షిప్టుల్లో పనిచేస్తాం. నిద్ర నాలుగైదు గంటలే ఉంటుంది. మిగతా సమయంలో కొందరు పుస్తకాలు చదువుకుంటుంటారు. సబ్‌మెరైన్ లోపల ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉండదు. ఒక్కసారి సముద్రంలోకి దిగాక, ట్రాన్స్‌మిటర్స్ ద్వారా నేవీ హెడ్‌క్వార్టర్స్‌కు మెసేజ్‌లు వెళుతుంటాయి.

మేం ఎక్కడున్నాం..? ఎంత లోతులో ఉన్నాం..? భూభాగానికి ఎంత దూరంలో వెళుతున్నాం..? సురక్షితంగా ఉన్నామా, లేక ప్రమాదంలో ఉన్నామా..? అనే విషయాలన్నీ మెసేజ్‌ల రూపంలో ఎప్పటికప్పుడు పంపిస్తుంటాం. మెసేజ్‌లు వెళ్లకపోతే సబ్‌మెరైన్ ప్రమాదంలో ఉన్నట్లేనని నేవీ హెడ్‌క్వార్టర్స్ వెంటనే అలర్ట్ అవుతుంది. వెంటనే 'ఫలానా సబ్‌మెరైన్ మిస్సింగ్' అంటూ అన్ని హార్బర్లకు సమాచారం పంపిస్తుంది

దాంతో వెంటనే నావికాదళానికి చెందిన నౌకలు వెతకడం ప్రారంభిస్తాయి. ఇలాంటి సంఘటన ఒకటి మా సబ్‌మెరైన్‌లో కూడా జరిగింది. అప్పుడు మేం విశాఖకు దగ్గర్లోనే సముద్రం లోపల ఉన్నాం. నేవీ హెడ్ క్వార్టర్స్‌కు మెసేజ్ ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో వాళ్లు అలర్ట్ అయ్యారు. అసలు అంత చురుగ్గా స్పందిస్తారని మేం ఊహించలేదు. వెంటనే 'సబ్‌మెరైన్ సేఫ్' అంటూ మెసేజ్ పంపించాం.
అప్పుడు ఊపిరిపీల్చుకున్నారు వాళ్లు. ఇలాంటి అనుభవాలు సబ్‌మెరైన్లలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంటాయి. అందరి జీవితాలు మట్టిమీద నడుస్తుంటే, మా జీవితాలు మాత్రం నీళ్లలో నడుస్తుంటాయి..'' అంటూ ముగించారు నగిర్‌రెడ్డి.  
జూ ఆది మల్లెంపూటి
ఫొటోలు : రజనీకాంత్

No comments: