Sunday, October 3, 2010

ఎర్త్ ఫ్రెండ్లీ * 'సన్‌పవర్' టెక్నాలజి

 
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మనిషి సౌరశక్తి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. తప్పదు మరి. పత్ర హరితం నుంచి విద్యుచ్ఛక్తి వరకు భాస్కరుడి ప్రమేయం లేకుండా బయటకు రాదుగా! ఎక్కడి 'టెక్నాలజీ' అయినా పరోక్షంగా సూర్యుడి మీద ఆధారపడాల్సిందే కదా. ఇప్పటిదాకా అధికశాతం సౌరశక్తిని పరోక్షంగా ఉపయోగించుకుంటున్నా, ఇక ముందు నేరుగా ఉపయోగించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణలు... నిత్య జీవితంలో అత్యంత అవసరమైన వస్తువులైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏటీఎమ్‌లు, వాటర్‌హీటర్ వంటివన్నీ సోలార్‌పవర్‌తో తయారుకానుండడమే.

ఇటీవలే చెన్నై ఐఐటీ వాళ్లు సోలార్ ఏటీఎమ్‌లు తయారు చేసి, ఉపయోగంలోకి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా మూడు వేల ఐదువందల సోలార్ ఏటీఎంలు స్థాపించాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. చెన్నై ఐఐటీ వాళ్లు ఇప్పుడు ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఈ ఏటీఎమ్‌ల వల్ల పర్యావరణానికే కాదు బ్యాంకు వాళ్లకు కూడా లాభమే. ఏడాదికి 20,000 రూపాయలు కరెంటు బిల్లులు మిగులుతాయని వారి అంచనా. మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే వాచీలు, వాటర్ హీటర్‌లు, కుకర్‌లు, ఇప్పుడిప్పుడే కంప్యూటర్‌లు, సెల్‌ఫోన్‌లు, ఏటీఎమ్‌లు... ఇలా ప్రతీది సోలార్ బాట పడుతున్నాయి. అలాంటి ఉత్పత్తుల తయారీకి పెద్ద కంపెనీలు సైతం సిద్ధమవుతున్నాయి. మొట్టమొదట 1970లో రోగర్ రిచెల్ అనే అమెరికన్ సోలార్ పవర్ రిస్ట్‌వాచ్‌ను తయారు చేశాడు. వాటిని తయారు చేయని ఒక్క వాచీ కంపెనీ కూడా లేదిప్పుడు. సోలార్ పవర్డ్ ల్యాప్‌ట్యాప్‌ను మొదట తయారు చేసింది ఒక స్పానిష్ కంపెనీ. దాని సామర్థ్యం 64 జీబీ. ఇప్పుడు సామ్‌సంగ్ కంపెనీ కూడా సోలార్‌పవర్ ల్యాప్‌ట్యాపుల్ని తయారు చేస్తోంది. ఇక మొబైల్స్ విషయానికొస్తే సోలార్ మొబైల్స్ గతేడాది జూన్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రెండ్‌ను ప్రారంభించింది కూడా సామ్‌సంగ్ కంపెనీయే. 'సోలార్ గురు' పేరుతో వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా సోలార్ మొబైల్ ఫోన్లను తయారుచేసే యోచనలో ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఐదేళ్ల క్రితం గుజరాత్‌లోని ఒక సోలార్ కంపెనీ తయారు చేసిన సోలార్‌కుకర్ బాగా ప్రచారం పొందింది. అది సైనికుల కోసం తయారు చేసింది. ఆ సోలార్‌కుకర్‌లో ఒకేసారి 500 మందికి సరిపోయే ఆహారాన్ని వండవచ్చు. అదే కంపెనీ గత ఏడాది (2009) తయారు చేసిన మరో సోలార్ కుకర్‌లో 20,000 మందికి సరిపోను ఆహారం వండొచ్చు. ఈ కుకర్‌ను షిర్డీలోని 'శ్రీసాయిబాబా సంస్థాన ట్రస్టు' కోసం తయారు చేశారు. 2009లో ముంబయిలో జరిగిన 'వెస్ట్రన్ ఇండియా సైన్స్‌ఫేర్'లో మొదటి బహుమతి అందుకున్న విద్యార్థి తయారు చేసింది కూడా 'సోలార్‌వాటర్ హీటర్'నే.
మనరాష్ట్రంలోని బైసానివారిపల్లె గ్రామం దేశంలోనే మొదటి 'సోలార్ విలేజ్'గా ఖ్యాతి పొందింది. ఆ ఊళ్లో అందరూ సోలార్ కుకర్లే ఉపయోగిస్తారు. అంతేకాదు స్మోక్ ఫ్రీ విలేజ్‌గా కూడా ఆ గ్రామానికి పేరుంది.


జర్మనీలో సోలార్ పవర్‌తో నడిచే ఒక పెద్ద షిప్పు ఉంది. 30 మీటర్ల వెడల్పు, 15.2 మీటర్లు వెడల్పుతో ఉండే ఆ షిప్పు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరో ఆసక్తి కలిగించే సోలార్ వార్త.... ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో 'వరల్డ్ సోలార్ చాలెంజ్' పేరుతో కార్‌రేస్ పోటీలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కార్లు పోటీలకు వస్తాయి. ఇందులో సోలార్ పవర్‌తో నడిచే కార్లనే ఉపయోగించాలి. ఈ సోలార్ కార్ రేస్ ట్రాక్ డార్విన్ నుంచి ఎడిలైడ్ మధ్య 3000 కిలోమీటర్లు ఉంటుంది. 2009 నుంచి 'వరల్డ్ గ్రీన్ చాలెంజ్'గా దీని పేరు మార్చారు.
వాంగార్డ్ 1.. ఇది అమెరికాలో తయారైన సోలార్ పవర్డ్ శాటిలైట్. 17 మార్చి 1958లో ప్రయోగించారు. అయితే 1964 తర్వాత దీని నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయింది. ఫలితం ఆశించిన విధంగా లేకపోయినా ప్రయత్నానికి మంచి పేరు వచ్చింది. ఒక మంచి ప్రయత్నం మంచి ఫలితానికి దారి లాంటిదే. అది వెంటనే రావచ్చు... కాస్త సమయమూ పట్టవచ్చు.

టెక్నాలజీ కారణంగా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న సమయంలో అధునాతన టెక్నాలజీకి సౌరశక్తిని అనుసంధానిస్తుండడం ఎంతైనా అభినందనీయం. విద్యుత్‌తో పనిచేసే వస్తువుల హవా కొనసాగుతోంది కాబట్టి ప్రజల నుంచి భారీ స్పందన వస్తే గానీ మనిషి జీవితంలో భాగమైపోయిన సెల్‌పోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఏటీఎంలు 'ఎర్త్ ఫ్రెండ్లీ'గా మారే అవకాశం లేదు.

No comments: