Sunday, October 24, 2010

పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిరాభివృద్ధి

ఉపాధికి 'పచ్చ' దిక్కు


వాతావరణం కలుషితమవుతోంది.. ఓజోన్ పొర క్షీణిస్తోంది... భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి..అని గగ్గోలు పెట్టిన ప్రపంచం ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించే పనిలో పడింది. 'రీయూజ్, రెడ్యూస్,రీసైకిల్', వెల్త్ ఆవుట్ ఆఫ్ వేస్ట్, గ్రీన్ కన్‌స్ట్రక్షన్స్ , గ్రీన్ టెక్నాలజీ, ఎకో ఫ్రెండ్లీ, గో గ్రీన్...సేవ్ గ్లోబ్...అంటూ పదేపదే వల్లెవేస్తోంది. అందుకే 'ఎకో ఫ్రెండ్లీ' అంటేనే ఓ బ్రాండ్ అయిపోయింది. ఈ పరిణామం ప్రధానలక్ష్యం పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిరాభివృద్ధి కూడా. అంటే ఒక హాని ఆరోగ్యకరమైన కొత్త అభివృద్ధికి నాంది పలుకుతోందన్నమాట. ఇదే ఇప్పుడు ఉపాధి అవకాశాల వెల్లువను సృష్టిస్తోంది. వీటి గురించి ఉస్మానియా యూనివర్శిటిలో పనిచేసి రిటైరై 'సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్'కి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త కె. పురుషోత్తమ్‌రెడ్డి చెప్పిన 
విశేషా లు. 

ఎన్నడూ లేంది మూడు నెలల కిందట... మాస్కోలో భయంకరమైన క్షామం తాండవించింది. మొన్నటికిమొన్న చైనా, పాకిస్థాన్‌లను భీభత్సమైన వరదలు ముంచెత్తాయి. మన దేశానికి వస్తే... ఎప్పుడూ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో మగ్గే జైసల్మేర్‌లో చిరపుంజిని మించిన వర్షపాతం నమోదైంది. మైనస్ 45 డిగ్రీల టెంపరేచర్‌తో గడగడా వణికే దేశాలు సైతం ఎండతో మండిపోతున్నాయి. వింటే విచిత్రంగా అనిపిస్తోంది కదూ... ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ మరి. భూవాతావరణం వేడెక్కడం, రుతువులు గతితప్పడం ఫలితంగా ఎండైనా, వానైనా, చలైనా ఎక్కువగా ఉండడం. ఇలా వాతావరణం ఎఫెక్టవడమే కాదు దానికి సంబంధించి గొలుసు కట్టులా ఉన్న చాలా విషయాల్లో నష్టం జరుగుతోంది, జరగబోతోంది కూడా. ఇప్పటివరకు దుష్ప్రభావం చూపిస్తున్నవాటిపట్ల మనమేం చేయలేకపోయినా ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడానికి మాత్రం చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ, ఎకో ఫ్రెండ్లీ, గో గ్రీన్,సేవ్ గ్లోబ్ వంటివి ఈ నేపధ్యంలో నుంచి పుట్టినవే. ఎనలేని ఉద్యోగాల వనరులుగా ఉన్నవి కూడా ఇవే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తరం భవిష్యత్తంతా 'పచ్చ'దనమే. ఇదంతా ఎలా మొదలయిందంటే...

ఆక్సిజన్ పుట్టడం వల్లే...

పరిశ్రమలు విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్‌లను ఓజోన్‌కు హాని కలిగించే వాయువులుగా మొట్టమొదట గుర్తించారు. అయితే తర్వాత జరిగిన పరిశోధనల్లో ఇంకా అనేక వాయువులు బయటపడ్డాయి. వీటన్నిటినీ కలిపి ఓడిఎస్- ఓజోన్ డిఫ్లిటెటీవ్ సబ్‌స్టాన్సెస్ అంటున్నారు. గాల్లో పైకెళ్లి ఓజోన్‌ను చేరుకున్నాక ఇందులోని క్లోరిన్ తనకుండే సహజ గుణమైన ఆక్సిజన్‌ను పుట్టించడమనే పనిని దిగ్విజయంగా సాగిస్తుంది. కాని ఓజోన్‌పొర ఉన్న చోట మనకు ఆక్సిజన్ అవసరం లేదు. అయితే క్లోరిన్‌కు ఈ విషయం తెలియదు కదా.. అందుకే అది తన పని తాను చేసుకుపోతుంది. ఓజోన్‌పొర క్షీణిస్తోంది.

కొత్త అభివృద్ధి మొదలు

వనరులను విచ్చలవిడిగా వాడుకోవడం, ఆ దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం వంటివి కూడా ఓజోన్ పొర క్షీణించడం లాంటి దుష్ఫలితాలనిచ్చాయి. ఇదొక్కటే కాదు మనం చేసిన చాలా చర్యలు భూమ్మీదే కాకుండా జల సంపద మీదా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపాయి. ఒకొక్కటీ బయట పడుతుంటే ప్రపంచం ఉలిక్కిపడింది. అగ్రరాజ్యాలు వణికిపోయాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఐక్యరాజ్యసమితి 1987 సెప్టెంబరు 16న కెనడాలోని మాంట్రియల్‌లో ఓ అంతర్జాతీయ సదస్సును ఏర్పాటుచేసింది. ఆ సమావేశంలో ఓజోన్ పొరను రక్షించుకోవడం అత్యవసరమని భావించాయి. అందుకు దాదాపు అన్ని దేశాలు సమ్మతిని తెలుపుతూ ఓ డాక్యుమెంట్ మీద సంతకాలు చేశాయి. దీన్నే మాంట్రియల్ ప్రొటోకాల్ అంటున్నారు.

మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ఓజోన్‌కు హాని చేసే సిఎఫ్‌సి (క్లోరోఫ్లోరో కార్బన్స్) వాయువుల ఉత్పత్తి, వాడకాలను నిషేధించాలి. అయితే ఎసి, ఫ్రిజ్‌లు, కోల్డ్‌స్టోరేజ్‌లాంటివి ఒకప్పుడు విలాసాలుగా ఉన్నా తర్వాత అత్యవసరాలుగా మారాయి కాబట్టి వాటి వాడకాన్ని తగ్గించుకునే వీలు లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? సిఎఫ్‌సికి ప్రత్యామ్నాయంగా, పర్యావరణానికి హాని కలిగించని కొత్త మూలకాలను వెతుక్కోవాలి. అలాంటి మూలకాల మీద దృష్టిపెట్టారు పరిశోధకులు. ఎన్నో పరిశోధనల ఫలితంగా సిఎఫ్‌సి ప్రత్యామ్నాయ మూలకాలు వెలుగుచూశాయి. ఈ ప్రాసెస్ అంతా సంబంధిత రంగాల్లో ఉద్యోగవకాశాలను కల్పించింది. ఒక్క ఓజోన్ విషయంలోనే కాదు పర్యావరణానికి హాని చేస్తున్న అనేక విషయాల్లో ప్రత్యామ్నాయాల కోసం జరుగుతున్న అధ్యయనాలు, పరిశీలనలు, పరిశోధనలు, ఫలితాలే ఒక్కొక్క రంగంలో అనేక అవకాశాలను అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు చర్చల్లో ఉన్న గ్లోబల్ వార్మింగ్ నివారణా ప్రయత్నాలు కూడా ఇలాంటి కొత్త అవకాశాలను చూపించబోతోంది.

సేఫ్ అండ్ క్లీన్...

ఇప్పటిదాకా విచ్చలవిడిగా వాడుతూ ఎన్నో దుష్పరిణామాలకు కారణమైన ఎనర్జీని అదుపు చేయాలని నిర్ణయించాం బాగానే ఉంది. కాని శక్తి లేందే ఏ పనీ జరగదు కదా...మరెలా? అప్పుడే మన కళ్లకు సూర్యుడు కనిపించాడు. మిరుమిట్లు గొలిపే ఆ కాంతి ఎంత వాడినా తరగని శక్తి. ఇంకేముంది సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునే యత్నాలు మొదలయ్యాయి. కరెంటు, పెట్రోలియం ఉత్పత్తులన్నింటికీ సౌరశక్తే ప్రత్యామ్నాయం కాబట్టే ఈ రంగంలో అవకాశాలుు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు శక్తికి ప్రకృతిలో వీచే గాలి కూడా మరో ప్రత్యామ్నాయంగా తోచింది. ఫలితంగా గాలిమరలు నిలిచాయి. ఇలా శక్తి వినియోగాన్ని అదుపు చేసే విషయంలో జరిగిన ఎన్నో పరిశోధనల్లో జియోథర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్, థైడల్ ఎనర్జీ (సముద్ర అలల నుంచి శక్తిని తీయడం) హానిలేని శక్తివనరులుగా తేలాయి. అలాగే హైడ్రోజన్‌ని కూడా పర్యావరణానికి హాని చేయని శక్తి వనరుగా భావిస్తున్నారు కాబట్టి దీనికీ బ్రహ్మాండమైన భవిష్యత్తుంది. ప్రస్తుతం లోకమంతటినీ ఆకర్షిస్తోన్న అతిముఖ్యమైన శక్తి వనరు జియోథర్మల్.

హాట్‌స్పాట్ ఎనర్జీ

గ్లోబల్ వార్మింగ్‌కి ప్రధాన కారణం బొగ్గే కనక ఇకముందు థర్మల్ పవర్ మూతపడనుంది. దానికి బదులుగా వృద్ధి చెందుతున్న అనేక ప్రత్యామ్నాయాల్లో ఒకటే ఈ జియోథర్మల్. భూమిలోపలున్న వేడి ప్రదేశాల నుంచి కరెంటును ఉత్పత్తి చేయడమే జియో థర్మల్. వీటినే హాట్ స్పాట్స్ అంటున్నారు. మన దేశంలో జమ్ముకాశ్మీర్, రాష్ట్రంలో రెంటచింతల అనే ప్రాంతాల్లో హాట్‌స్పాట్స్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇంకా అనేకప్రాంతాల్లో సర్వేలు జరుగుతున్నాయి. దీన్నెలా ఉత్పత్తి చేస్తారంటే... ముందు హాట్‌స్పాట్స్‌ను గుర్తిస్తారు. నేల స్వభావాన్నిబట్టి ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోతు వరకు పక్కపక్కనే రెండు బోర్లను వేస్తారు. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలో ఈ రెండింటినీ కలుపుతారు. లోపల 250 డిగ్రీల నుంచి 300 డిగ్రీల టెంపరేచర్ ఉన్న చోట ఒక పైపు నుంచి నీళ్లను పంపిస్తారు. ఆ వేడికి నీళ్ల నుంచి ఆవిరి పుడుతుంది. ఆవిరితో పక్కనే ఉన్న టర్బైన్స్ తిరుగుతాయి. టర్బైన్ తిరుగుతుంటే కరెంట్ పుడుతుంది. ఇది బొగ్గును మండించి తీసే విద్యుత్‌చ్ఛక్తి కన్నా కొన్ని రెట్లు సురక్షితమైనది. ఎలాంటి కాలుష్యం ఉండదు. అందుకే ప్రస్తుతం ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి కొన్ని వేల ఉద్యోగాలను అందిస్తోంది.

అవకాశాలు కల్పించడంలో బయోగ్యాస్ పాత్రా తక్కువేమీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో దీనికున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. కొందరు రైతులైతే తమ పైర్లకు బయోగ్యాస్ కరెంటుతో నడిచే మోటార్లతోనే నీళ్లు పడుతున్నారు. బయోగ్యాస్ కూడా ఆ రంగంలో కొత్త అన్వేషణలకు మార్గం చూపెడుతోంది. ఇవేకాదు వ్యర్థాల నుంచి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సాలిడ్ వేస్ట్‌ను మండించి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రంగంలో కూడా వేల సంఖ్యలో ఉపాధి మార్గాలు పుట్టుకొస్తున్నాయి.

నిర్మాణ రంగంలో...

పర్యావరణాన్ని కాపాడే దిశగా నిర్మాణ రంగంలో వచ్చిన మార్పులూ ఉపాధి మార్గాలను చూపెడుతున్నాయి. ఎకోఫ్రెండ్లీ కట్టడాలు వచ్చేశాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు ఎదిగిన ప్రత్యామ్నాయ రంగం, సేంద్రీయ వ్యవసాయం... ఒక్కటేమిటి, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా రూపుదిద్దుకోనున్న ప్రతి రంగం కొత్త అవకాశాలను లక్షల్లో పుట్టిస్తోంది. ప్రతి పౌరుడు పొల్యూట్ కాని లైఫ్ స్టయిల్‌ని కోరుకుంటున్నాడు కాబట్టి 'గ్రీన్' అనేది అన్ని చర్యల్లో అంతర్భాగమైంది. ఈ చైతన్యం ఉన్న వినియోగదారులు మార్కెట్‌ను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు కాబట్టి గ్రీన్ మార్కెట్‌నే డిమాండు చేస్తున్నారు. అందుకే కృత్రిమ రసాయనాలు లేని, కలుషితం కాని వస్తువులను వాళ్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ బిజినెస్ అంతా గ్రీన్ బిజినెస్‌గా మారుతోంది. కార్పొరేట్ కంపెనీల మీదా ఈ దిశగా విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీంతో అవీ తమ పంథాను పర్యావరణానికి అనుకూలంగా మార్చుకోక తప్పడం లేదు. సామాజిక బాధ్యతల దృష్ట్యా కూడా తమ కంపెనీలను ఎకోఫ్రెండ్లీగా మార్చుకుంటున్నాయి. కనుక కార్పొరేట్ ఉద్యోగాలూ ఈ రంగాల్లోనే ఉండబోతున్నాయి. అంటే వ్యాపారం కూడా క్లీన్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కిందకు మారుతోందన్నమాట.

రిస్క్, డిజాస్టర్, క్రైసిస్...

సంపదను దాచుకున్న సముద్రంలా అవకాశాలను పొదువుకున్న పర్యావరణం మీద జరిగిన అధ్యయనాలు కొత్త కొత్త రంగాలను వెలుగులోకి తెస్తే... వాటిని అభివృద్ధి చేయడంలో మరిన్ని అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఉదాహారణకు ఎకో ఫ్రెండ్లీగా ఉండే ఓ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టామనుకుందాం... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ఏవైనా ప్రమాదాలు సంభవించవచ్చు. వాటిని నిభాయించి, సరిదిద్దగల సామర్థ్యం కూడా వాటి యాజమాన్యాలకు ఉండాలి. ఆ నిర్వహణే రిస్క్, డిజాస్టర్, క్రైసిస్ మేనేజ్‌మెంట్లు. బృహత్తర అవకాశాలనిస్తున్నాయివి. వీటితోపాటు రీయూజ్, రీసైకిల్డ్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్లు కూడా ప్రధాన ఉపాధి రంగాల్లా మారాయి ఇప్పుడు.

అక్షయపాత్రలా...

పర్యావరణాన్ని కాపాడుకుంటూ సుస్థిరాభివృద్ధికి నాంది పలకాలి. ఈ అవగాహన, పరిశోధనల పుణ్యమాని ఇదే భవిష్యత్తుగా, గ్రీన్ (పర్యావరణం, ప్రకృతి) అనేది అత్యంత శక్తిమంతమైన రంగంగా మారింది. ఇంతకుముందు వాడిన కృత్రిమాలన్నిటికీ బదులుగా సహజసిద్ధంగా లభించేవేమున్నాయనే శోధన మొదలవడంతో పర్యావరణానికి చెందిన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించడం, పరిశోధించడంతో ఇదో పెద్ద శాస్త్రంగానే కాదు లక్షల ఉద్యోగాలు పుట్టిస్తున్న అక్షయపాత్రగా మారింది. ఈ డిమాండుననుసరించి పర్యావరణం అనేది చదువులో కూడా భాగమైంది. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయిదాకా దీన్నో సబ్జెక్టుగా చేరింది. ఆర్ట్, సైన్స్, లా, పాలిటిక్స్, ఎకనమిక్స్, మేనేజ్‌మెంట్ చదువుల్లో, ఇంజనీరింగ్‌లలో కూడా పర్యావరణ శాస్త్రం పాఠ్యాంశంగా మొదలైంది. ఇందులో స్పెషలైజేషన్ కోర్సులూ ప్రారంభమయ్యాయి. పర్యావరణ బయోటెక్నాలజీలో కూడా చాలా అవకాశాలున్నాయి.

స్మార్ట్ అండ్ గ్రీన్ లివింగ్

పర్యావరణశాస్త్ర పురోగతి కొత్త తలపులను తెరిచి లోకాన్ని పచ్చగా మారుస్తోంది. ఇది ఒక ఎత్తయితే... ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉన్న వనరులను పొదుపుగా వాడుకుంటూ తెలివిగా జీవించడం ఇంకో ఎత్తు. ఈ రెంటిని కలిపి స్మార్ట్ అండ్ గ్రీన్ లివింగ్ అంటున్నారు. స్మార్ట్‌గా ఆలోచించి కనిపెట్టే స్మార్ట్ థింగ్స్‌లో కూడా బ్రహ్మాండమైన ఉపాధి ఉందన్నట్టే కదా. ఎలాగంటే... చైనా, అమెరికా లాంటి దేశాల్లో కొత్తరకమైన కరెంటు బల్బులు వెలుగుతున్నాయి. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్లగానే మనం విడిచి వెళ్లిన గదిలో లైట్ ఆరిపోయి అడుగుపెట్టిన గదిలో వెలుగుతుంది. అంటే విద్యుత్ వృధా అయ్యే అవకాశం లేకుండా అన్నమాట. అలాగే నీటి వృధా అరికట్టడానికీ ఇలాంటి కిటుకులు కనిపెట్టారు. వాష్ బేసిన్, సింకుల్లాంటి చోట్ల కుళాయి కింద చేయి పెడితేనే నీళ్లొస్తాయి. చేయి తీయగానే నీళ్లు రావడం ఆగిపోతాయి. ఇలాంటివి కనుక్కొనే టెక్నాలజీ ఒకటి ఉందీ అంటే అందులో బోలెడు అవకాశాలు ఉన్నట్లే కదా.

మహాత్మా గాంధీ చెప్పినట్టు ప్రకృతికి ప్రజలందరి అవసరాలను తీర్చే స్తోమత ఉంది కాని కొందరి అత్యాశలను తీర్చే శక్తి లేదు. అందుకే ప్రకృతి సంపదను కాపాడుకోవాలి. దానికే ఎసరు పెట్టే కార్యక్రమాలను మానుకోవాలి. అప్పుడే అది మనల్ని కాపాడుతుంది. మొత్తం భూమండలాన్నే ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మనదే. పర్యావరణం అందించే అవకాశాల గురించి అవగాహన, విజ్ఞానాన్ని పెంచుకుని వాటిని అందుకుంటే ప్రపంచంలోనే మనవాళ్లు గ్రీన్ లీడర్స్‌గా ఎదిగే బంగారం లాంటి చాన్స్ ఇది.

ఆ నవలే...

1965లో... పర్యావరణ కాలుష్యం వల్ల జరగబోయే నష్టాల నేపథ్యంగా రేచెల్ కార్సన్ రాసిన 'ది సైలెంట్ స్ప్రింగ్ ' అనే నవల ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మేధావుల నుంచి ఐరాస దాకా విస్తృతమైన చర్చకు తెరలేపింది. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ కోసం 1972లో స్టాక్‌హోంలో గ్లోబల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇలాంటి చర్చలు, సమావేశాలు, అధ్యయనాలు, పరిశోధనలు అనేకం1985 వరకు సాగాయి. అందుకే ఈ కాలాన్ని పీరియడ్ ఆఫ్ ఇంటెన్సివ్ రీసెర్చ్ అంటారు. ఈ రకంగా 'ది సైలెంట్ స్ప్రింగ్' ఇంటలెక్చువల్ రివల్యూషన్‌కి కారణమైంది. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ఏ దేశానికి ఆ దేశమే నడుం కట్టింది. కొన్ని వందల చట్టాలను తయారు చేసుకున్నాయి. మన దేశంలోనూ సుమారు రెండు వందల చట్టాలున్నాయి. వాటి ప్రకారం ప్రకృతిని తమ చర్యల ద్వారా ఎవరూ కలుషితం చేయడానికి వీలులేదు. ఒకవేళ చేస్తే ఆ కాలుష్యాన్ని నివారించే పనిని కూడా వాళ్లే చేయాలి.

మా సంస్థ ఏం చేస్తుందంటే...

కె. పురుషోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలోని 'సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్' సంస్థ గ్రీన్ డెవలప్‌మెంట్ (హరితాభివృద్ధి)కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే అకడమిక్ రీసెర్చ్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఈ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగకారిగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయడం, దీని ఆధారంగా స్థానిక సమస్యలకు పరిష్కారాలు అందించడం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం వంటి పనులనూ చేపడుతోంది.

ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీగా వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేయడమేకాక దాని ఆవశ్యకతను వివరిస్తుంది. అంతేకాదు వాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించిన విషయాలపై ప్రజలను చైతన్య పరుస్తూ ఆ మార్పులను నివారించే మార్గాలను వెదకడం... అవి ఆలస్యమైనప్పుడు ఆ మార్పులకెలా సర్దుకుపోవాలో శిక్షణనిస్తుంది ఈ సంస్థ. ఇవీ కాక ఈ అంశం మీద పనిచేస్తున్న అన్నిరకాల సంస్థలతో అనుసంధానమేర్పర్చుకుని ఓ బలమైన శక్తిగా మారేందుకు కృషిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో మన దేశం నాయకత్వం వహించేలా... స్థూలంగా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సంస్థలా ఎదగడం దీని ప్రధాన లక్ష్యం.
* సరస్వతి రమ

No comments: