Sunday, October 24, 2010

కాంగోలో జీవితం తుపాకీ మీద సామే!

నిత్యం తుపాకీ మోతలు.. ఏ బాంబు ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియని పరిస్థితి.. దారికాచి దోచుకునే దొంగలు... ఇంటి నుంచి బయటికిపోయి మళ్లీ ఇంటికి వచ్చేదాకా ప్రాణం మీద నమ్మకం లేని జీవితం గడపడమంటే ఎట్లా ఉంటుంది? ఊహిస్తేనే అమ్మో అనిపిస్తోంది కదూ.

కానీ అలవాటు పడితే అవన్నీ జీవితంలో భాగమవుతాయి అంటారు పరుపాటి శ్రీనివాసరెడ్డి. దేశం కానీ దేశంలో.. తన భాషరాని మనుషుల మధ్య ఆరేళ్లుగా జీవితాన్ని తుపాకీ మీద సాములాగా సాహసంతో నెట్టుకువస్తున్నాడీయన. కాంగో దేశంలోని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఓ) పీస్ కీపింగ్ మిషన్‌లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తోన్న ఆయన అనుభవాలు నిన్న యుఎన్ఓ డే సందర్భంగా...

"నా పేరు పరుపాటి శ్రీనివాసరెడ్డి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకొర్పోలు మా గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నలుగురు అన్నదమ్ములు. ముగ్గురు అక్కచెల్లెళ్లు. డిగ్రీ నర్సంపేటలో చేశాను. ఎంకాం ఉస్మానియా యూనివర్సిటీలో, ఐసీడబ్ల్యూఏ ఇంటర్ విజయవాడలో చేశాను. మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకునేవాణ్ని. అందుకోసం కంప్యూటర్ తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. కంప్యూటర్ (సాఫ్ట్‌వేర్) నేర్చుకునే దగ్గరే టర్న్ అయింది జీవితం.

అప్పట్లో సాఫ్ట్‌వేర్ బూమ్ బాగా ఉంది. నేను మొదటి నుంచి బ్రిలియంట్‌నేం కాదు. బిలో యావరేజ్ స్టూడెంట్‌ను. నేను టెన్త్ థర్డ్‌క్లాస్‌లో పాసయ్యాను. అటువంటిది నెమ్మది నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ సాఫ్ట్‌వేర్ దగ్గరకొచ్చేసరికి యావరేజ్ అయ్యాను. ఇంటర్‌నెట్ చూడటం, ఛాటింగ్ చేయడం అప్పట్లో హాబీగా ఉండేది. ఆన్‌లైన్లో ఈ ఉద్యోగం సంపాదించుకున్నాక ఒక సంవత్సరం కొసావో (యుగోస్లావియా)లో పనిచేశాను.

ఆ తరువాత పూర్తిస్థాయిలో యుఎన్ లోటస్ నోస్ డెవలపర్‌లో ప్రోగ్రామర్‌గా 2004, సెప్టెంబర్ 4 నుంచి కాంగోలో పనిచేస్తున్నాను. శాంతి పరిరక్షణ కోసం, ప్రజల భద్రత, వనరుల భద్రత కోసం యుఎన్ఓ ఎన్నో దేశాల్లో పీస్ కీపింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. మేం చేయాల్సిందల్లా యుఎన్‌కు సంబంధించిన విధానాలను అమలు చేయడమే. వివిధ దేశాల నుంచి ఎంతో మంది శాంతిపరిరక్షణ కోసం ఈ మిషన్‌లో భాగం పంచుకుంటున్నారు.

కాంగోలో ఇండియన్ కాంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంటుంది. మిలిటరీ పరంగా కానీ, ఇతరత్రా సహాయ సహకారాల పరంగాగానీ. మేం చేయాల్సింది ఆయా సందర్భాల్లో ట్రూప్స్‌కు ప్రోగ్రామ్స్‌ను (సాఫ్ట్‌వేర్ పరంగా) డెవలప్ చేయడం, వాటిలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే పరిష్కరించడం అంతే.

ఎప్పుడూ గొడవలే...
మా అవసరం ఎక్కడుంటే అక్కడికి రోజూ వెళ్లాల్సి ఉంటుంది. మామూలుగా డ్యూటీ టైమింగ్స్ అంటే ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 దాకా ఉంటుంది. శనివారం ఒక పూటే. అయితే డ్యూటీ ప్లేస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం ఏ మూడో నాలుగో అవుతుంది. ఆదివారం సెలవు తప్పనిసరేం కాదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. జీవితం క్షణం క్షణం రిస్క్‌గానే ఉంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే లైఫ్ ఎప్పుడూ గొడవలు, కొట్లాటల మధ్యే సాగుతూ ఉంటుంది. రాళ్లు విసురుకోవడాలూ కాల్పులూ తరచుగా ఉంటాయి. మొదట్లో భయం వేసేది. ఇప్పుడు అలవాటైంది (నవ్వుతూ). మొదట చాలా కాలం అక్కడి భాషరాక ఇబ్బంది పడ్డాను. కాంగోలో ఎక్కువగా స్వాహిలీ భాష మాట్లాడతారు. దాంతో పాటు ఫ్రెంచ్, ఇంగ్లీష్‌లు కూడా మాట్లాడతారు.

అయితే ప్రజలతో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి మాకు. ఇంగ్లీష్ ఎలాగూ వచ్చు. ఇప్పుడు స్వాహిలీ, ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నాను. పనిచేయడానికి భాష పెద్దగా అడ్డుకాదు. అక్కడి ప్రజలు చాలా మంచివారు. నల్లగా, పొట్టిగా ఉంటారు. వాళ్లకున్నన్ని సహజవనరులు ఎక్కడా లేవనిపిస్తుంది నాకు. బంగారం, రాగి, బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి.

వనరుల ఆధిపత్యం కోసమే కాంగో ప్రభుత్వానికీ, తిరుగుబాటు దార్లకూ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. రెబల్ గ్రూప్స్‌కి ్రపైవేట్ ఆర్మీ పెద్ద సంఖ్యలో ఉంటుంది. దాడుల సమయంలో రాళ్లు విసురుకోవడం, గ్రూపుల మధ్య కాల్పులు జరగడం సర్వసాధారణ దృశ్యాలు. కిన్సాసా, గోమా, కిగాలి లాంటి ప్రాంతాల్లో గొడవలు ఎక్కువ. మేము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేం.

కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే మాకు పూర్తి భద్రత ఉంటుంది. యుఎన్ వాహనాల్లో మాత్రమే వెళతాం. అప్పుడప్పుడు మేం ప్రయాణించే వాహనంపైనా దుండగులు రాళ్లు విసురుతారు. ఒక్కోసారి రెండు రోజులపాటు ఇంటికి తిరిగి రాలేము.

మా ఆవిడ బోరున ఏడ్చింది...
నాకు 2006లో మమతతో పెళ్లి అయింది. వాళ్లది నర్సంపేట. పెళ్లికి ముందే నా డ్యూటీ గురించి, జీవితం గురించి వివరంగా చెప్పాను. కొంతకాలం ఇక్కడే ఉంది. ఆ తరువాత 'నేనూ వస్తాను' అని పట్టుబట్టింది. ఆమెను అక్కడికి తీసుకెళ్లాలంటే యుఎన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఎలాగోలా అక్కడికి తీసుకెళ్లాను. ఇప్పుడు ఆమె నాతోనే ఉంటుందక్కడ. మొదట్లో మేం కిన్సాసాలో ఉండేవాళ్లం. ఇప్పుడు గోమాలో ఉంటున్నాం. మేం ఉండేది పైఅంతస్తులో.

మా కింది పోర్షన్‌లో శ్రీలంక ఫ్యామిలీ ఉండేది. అనుకోకుండా పెద్ద గొడవ జరిగి అది కాల్పుల దాకా వెళ్లింది. శ్రీలంకకు చెందిన ఒకావిడ, పేరు గుర్తుకురావడం లేదు, మా మిషన్‌లో పనిచేసే వ్యక్తి భార్య పెద్దపెట్టున అరుపులు, పెడబొబ్బలు పెడుతోంటే ఈమే (మమత) కాల్పులు జరుగుతున్నా సరే ధైర్యంతో కిందికి దిగి ఆమెను మా పోర్షన్‌లోకి తీసుకొచ్చింది.

ఆ సమయంలో నేను డ్యూటీలో ఉన్నాను. రెండు రోజులు పరిస్థితులు అనుకూలించక అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత మీదపడి బోరున ఏడ్చింది. నాకూ కన్నీళ్లు ఆగలేదు. ఆ సంఘటన గుర్తుచేసుకుంటే ఇప్పటికీ గగుర్పాటే.

వీకెండ్స్ కొంచెం హ్యాపీ
మా మిషన్ పనితీరును పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు ఐరాస దేశాల ప్రతినిధులు తరచూ వస్తుంటారు. కోఫీ అన్నన్ (యుఎన్ఒ మాజీ సెక్రటరీ జనరల్), హిల్లరీ క్లింటన్ ఇతర ప్రముఖులు కూడా తరచూ వచ్చి మాకు సలహాలు ఇస్తుంటారు. అటువంటివాళ్లను దగ్గరగా చూడటం సంతోషంగా ఉంటుంది. ఇటువంటి జీవితానికి వీకెండ్స్ కొంచెం హ్యాపీనిస్తాయి.

వీకెండ్స్‌కు ఇండియన్ ఫ్యామిలీస్ అంతా ఒక్కచోట చేరుతాం. ఎక్కువగా కాంగో సరిహద్దు దేశాల్లో గడిపేందుకు ఇష్టపడతాం. ఉగాండా, రువాండ, అంగోలా, టాంజానియా, బురుండీ, జాంబియా దేశాలకు అప్పుడప్పుడూ వెళతాం. మేముంటున్న గోమా రువాండాకు దగ్గర. దాని రాజధాని కిగాలి భలే బాగుంటుంది. అందుకే అక్కడికి ఎక్కువసార్లు వెళతాం.

అక్కడి లోకల్ తిండి తినలేం. వాళ్లు మాంసాహారులు. బీఫ్, బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటారు. మాకు అవి పడవు. కనుక ఇండియన్ ఫుడ్‌నే తీసుకుంటాం. రైస్ ఎంత కాస్ట్ అయినా సరే కొంటాం (5కిలోల బియ్యం ధర అక్కడ రూ. 700. అంటే కిలో బియ్యం రూ.140 అన్నమాట). గోధుమ పిండిని చపాతీ పౌడర్ అంటారు దాన్ని ఎంత దూరంలో ఉన్నా సరే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం.

కూరగాయలు బాగా దొరుకుతాయి. కాఫీతోటలు విస్తారంగా ఉంటాయి కనుక ధర కొంచెం తక్కువగా ఉంటుంది. బతకడానికి పోయాం కానీ తినేందుకు కాదు కదా అనిపిస్తుంది. లంచ్‌బాక్స్ ఇంటి నుంచే తప్పనిసరి తీసుకెళతాను. హ్యాపీనెస్ అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదు. చేసే పనే హ్యాపీ అనుకోవాలి. ఆ మిషన్‌లో పనిచేసే అవకాశం దొరకడమే గ్రేట్‌గా ఫీలవుతాను.

కంప్యూటర్‌తోనే కాలక్షేపం - మమత
ఆయన డ్యూటీకి వెళ్లాక కంప్యూటర్‌తోనే ఎక్కువ సేపు ఉంటాను. పెళ్లికి ముందు ఆయన చేసే జాబ్ గురించి చెబితే 'అంత రిస్క్ ఉంటుందా?' అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లి చూశాక చచ్చేంత భయం వేసింది. అయినా సరే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రోజు ఆమెను మా రూంకి తీసుకొచ్చాను. ఆయన తిరిగొచ్చే దాకా భయమే.

కొద్దిరోజులు బాగా భయపడ్డాను కాని తరువాత అలవాటైపోయింది. ఎక్కడ చూసినా పచ్చదనం, కొండలూ లోయలూ బావుంటుందక్కడ. మా వాళ్లను తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూపించాలనిపిస్తుంది. వీకెండ్స్‌లో ఇండియన్ ఫ్యామిలీస్ కలిసినపుడు చాలా సరదాగా ఉంటుంది. ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. నాకు హిందీ వచ్చు. ఇంగ్లీష్ ఓ మాదిరిగా నేర్చుకున్నాను.

మా ఇంట్లో పనమ్మాయితో కొంత టైమ్‌పాసవుతోంది. ఆమె స్వాహిలీ మాట్లాడుతుంది. నేనూ ఆ భాష నేర్చుకొన్నాను. ఇంటర్‌నెట్‌లో సినిమాలు చూస్తుంటాను. మా తమ్ముడితో, అక్కయ్యలతో అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడతాను. మా ఇళ్లలో జరిగే ఫంక్షన్స్‌కు రాలేక పోతున్నామని బాధగా ఉంటుంది. అయినా అక్కడ ఎంతకాలం ఉంటాం? ఇంకో నాలుగైదేళ్లున్న తరువాత ఇండియాకే వచ్చి ఇక్కడే సెటిల్ అవుతాం.

No comments: