Wednesday, October 27, 2010

అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ .... యూఎఫ్‌ఓ


యు.ఎఫ్.ఓ...డిన్నర్ పళ్లెం
ఎగిరే పళ్లేలలో ఏలియన్లు వస్తున్నారు...మనతోపాటు మన ఇంట్లో డైనింగ్ టేబుల్‌పై డిన్నర్ చేసేందుకు!
అవును ఆ రోజులు ఎంతో దూరంలో లేవు! అమెరికన్లు వారి కోసం సిద్ధమవుతున్నారు... వారికి ఐక్యరాజ్యసమతి స్వాగత సన్నాహాలు చేస్తోంది. ఇక మనం కూడా డిన్నర్ పళ్లేలను ఫలహారాలతో నింపి స్వాగతిద్దామా...!


సరిగ్గా నెల క్రితం ఐక్యరాజ్యసమితి ఒక వింత ప్రకటన చేసింది. యాభై ఎనిమిదేళ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ మజ్లన్‌ఆథ్‌మన్ ఇక పై అంతరిక్షానికి దౌత్యవేత్తగా వ్యవహరిస్తారంటూ ఆ ప్రకటన సారాంశం. ‘అంతరిక్షానికి దౌత్యవేత్త ఏంటి?’ అన్న ప్రశ్నకు సమాధానంగా... ఒకవేళ గ్రహాంతరవాసులు గనుక భూమికి వస్తే ‘ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ (మొట్టమొదటగా కలవవలసిన మనిషి) మజ్లన్ ఆథ్‌మన్ అని తేల్చిచెప్పింది ఐక్యరాజ్యసమితి! ఈ వార్త ఎంతోమందిని విస్తుపోయేలా చేస్తే, ఇంకెంతోమందిని నవ్వుకునేలా చేసింది.
‘ఇది నిజంగా జరిగే పనేనా?! ఉన్నట్టుండి ఇంత అర్జెంట్‌గా ఇలాంటి ప్రకటన వెలువడడానికి కారణం ఏంటీ..?’ ఆలోచించాల్సిన విషయమే!!!

అక్టోబర్ 13, 2010 న్యూయార్క్ సిటీలోని చెల్సీ ప్రాంతవాసులు ఒక్కసారిగా రోడ్డు మీదకి పరుగుతీశారు. అది ఏ భూకంపం నుంచో తప్పించుకోవడానికి కాదు... ఆకాశంలో గుండ్రంగా తిరుగుతున్న సాసర్ల లాంటి వస్తువులు, తెల్లని కాంతిలో మెరిపోతూ కళ్లకు కనిపించేటంత దూరంలో తిరగాడుతుండటమే దానికి కారణం. అక్కడి టివీ ఛానల్ 7 కెమెరాలు ఈ వింతని బంధించటమే కాదు దీనిపై స్పందించమని ఎఫ్‌ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అసోసియేషన్) వారిని కోరింది. అయితే వీటివల్ల విమానాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని మాత్రమే ఎఫ్‌ఏఏ ప్రకటన విడుదల చేసింది. అంతకు మించి ఎటువంటి సమాచారాన్ని బయటకి పొక్కనివ్వలేదు. కాని ఆ రోజు అక్కడ జరిగింది ఓ ‘యుఎఫ్‌ఓ సైటింగ్.’ అంటే... ఆ రోజు ఆకాశంలో గుర్తుతెలియని ఎగిరే పళ్లేలను ప్రజలు చూశారు. అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌గా పేర్కొనే వాటికి సంక్షిప్తరూపమే ఈ... యూఎఫ్‌ఓ.

జులై 7, 2010 చైనాలోని ఝీజియాంగ్ ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కుతున్న ప్రయాణికులను ఉన్నట్టుండి ఆపేశారు. అంతే కాదు ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను గంటపాటు నిలిపివేశారు. కారణాలు చెప్పలేదు. దీనికి కారణం ఆకాశంలో కనిపించిన గుర్తుతెలియని వస్తువని తర్వాత తెలిసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ ప్రక్రియ అధికారులకు తెలిసే జరిగినా ప్రభుత్వం మాత్రం దీని తదనంతరం ఎటువంటి సంజాయిషీ ఇవ్వలేదు. ఇది జరగడానికి కొన్ని గంటల పూర్వం ఆకాశంలో మెరుస్తున్న పొడవాటి వస్తువుని చూశామని ఆ ప్రాంతవాసుల ప్రత్యక్ష కథనం.

ఇవి రెండూ ఈ ఏడాది ప్రపంచం రెండు వైపులా జరిగిన యుఎఫ్‌ఓ సైటింగ్స్. పైగా వీటికి ప్రత్యక్ష సాక్షులతో పాటు టీవీ కెమెరాల బంధించిన ఫుటేజ్ మరింత బలమైన సాక్ష్యం. దానికి తోడు అటు ప్రభుత్వం నుంచి కాని, ఇటు శాస్తవ్రేత్తల నుంచి కాని ఎటువంటి వివరణ లేకపోవటం ఈ సైటింగ్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీవీ కెమెరాలకు కూడా చిక్కిన ఈ అంతుపట్టని వస్తువుల వెనక రహస్యం ఏంటి? ఇవి కేవలం ట్రిక్ ఫొటోగ్రఫీ ద్వారా నిజంగా జరిగినట్టు భ్రమ కల్పిస్తున్నారా? మరప్పుడు ప్రత్యక్షసాక్షుల మాటేమిటి? ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండా ఏం దాస్తున్నాయి? ఒకవేళ ఆ సాసర్లు నిజంగా కనపడితే అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎవరు వీటిని పంపిస్తున్నారు? వీటిలో గ్రహాంతరవాసులు మన లోకాన్ని చూడడానికి వస్తున్నారా? ఒక వేళ అదే నిజమైతే అవి మనలని కలవడానికి ఎందుకు ప్రయత్నం చేయటంలేదు? లేదా మన ప్రపంచం మీదకి దాడికి సిద్ధపడుతూ రెక్కీ చేయటానికి వస్తున్నారా? లాంటి ప్రశ్నలకి జవాబు లేనందువల్లనేమో వీటి పట్ల మరింత ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

మొట్టమొదటి యుఎఫ్‌ఓ సైటింగ్.
యుఎఫ్‌ఓ సైటింగ్ ఈ మధ్యలో మొదలైన ప్రక్రియ కాదు. ఇలాంటిది మొట్టమొదట చూసిన దాఖలా ఆగస్టు 12, 1886 లో జరిగింది. బోనిల్లా అనే ఓ ప్రముఖ ఖగోళ శాశ్త్రవేత్త సూర్యుడిపై పరిశోధనలు జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 283 గుర్తు తెలియని గుండ్రని ఆకారాలను ఆకాశంలో తిరగాడుతూ ఉండటాన్ని గమనించాడు. వాటిని ఫొటోలు కూడా తీశాడు. వీటికి సంబంధించినంత వరకూ మొదటి ఫోటో ప్రూఫ్ ఇదే. అది మొదలు... నేటి వరకూ తరచూ వీటికి సంబంధించిన సమాచారం ‘అదిగో పులి అంటే, ఇదిగో తోక’ చందాన బైటకి వస్తూనే ఉంది.

చూడటం వరకూ ఓకే... కాని వీటివల్ల హాని కలగవచ్చనే భయం అక్టోబర్ 10, 1886లో మొదటిసారిగా కలిగింది. వెనిజులా దేశంలో మరకైబో నగరంలో జరిగిన వింతైన సంఘటన ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. తుఫాను సమయంలో ఆకాశాన ‘ఝుమ్‌మ్‌మ్‌మ్....’మంటూ శబ్దం చేస్తూ తిరుగాడుతున్న ప్రకాశవంతమైన వస్తువు ఓ గుడిసె వద్ద కనిపించింది. కొంతసేపు అక్కడే తచ్చాడిన ఆ వస్తువు తరవాత ఆకాశంలోకి అదృశ్యం అయిపోయింది. తరవాత ఆ గుడిసె చుట్టు కనిపించిన దృశ్యమే అందరినీ భయభ్రాంతులకి గురిచేసింది. గుడిసె చుట్టూ చెట్టూ చేమా పూర్తిగా కాలి బూడిదై కనిపించింది. అంతేకాదు ఆ గుడిసెలో నివసించే వారు రేడియేషన్ పాయిజనింగ్‌కి గురైనట్టు కూడా తరవాత జరిపిన పరీక్షల్లో తేలింది.

అది మొదలు వీటికి సంబధించినంతవరకూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఈ కథలన్నీ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వీటిని చూసిన ప్రత్యక్ష సాక్షుల కథనాలు కొట్టి పడేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఎక్కువగా ఎగిరే పళ్లేల ఆకారంలో ఇవి కనిపించినా వీటిని కోడిగుడ్డు ఆకృతిలో చూసిన వారూ ఉన్నారు. ఆకారం ఏదైనా కళ్లు చెదిరిపోయే తెల్లటి కాంతిని ప్రత్యక్షంగా చూసిన ప్రతీ ఒక్కరూ గమనించారు. కొంతమందికి ఇవి రంగుల లైట్లతో కూడా దర్శనమిచ్చాయి.

టార్గెట్ అమెరికా!
బాగా అభివృద్ధి చెందిన దేశమనో ఏంటో కాని అమెరికా దేశాన్ని సందర్శించే యూఎఫ్‌ఓల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా 1940-60 ప్రాంతంలో యుఎఫ్‌ఓ సైటింగ్స్ ఎక్కువగా అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన సైనిక స్థావరాల పై ఇవి తిరుగాడుతున్నాయన్న విషయంపై ప్రభుత్వం ఒక అధికారిక పరిశోధన (ఇన్వెస్టిగేషన్) ప్రారంభించింది. 1948 జనవరి 7న ఫోర్ట్‌నాక్స్, కెంటకీ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. ఆకాశంలో ఏదో గుర్తుతెలియని వస్తువు తిరుగుతోందన్న వార్త తెలిసిన వెంటనే ఫైటర్ జెట్ దాన్ని వెంబండించటానికి నింగిలోకి ఎగిసింది. కాని ఈ జెట్ మళ్లీ తిరిగి రాలేదు. దానిలోని ఫైటర్ పెలైట్ మృత్యువాత పడ్డాడు. కారణాలు బైటకి రాలేదు. 1952 లో వరుసగా రాడార్‌పై కనిపించిన ఈ యుఎఫ్‌ఓలు అక్కడ దేశవ్యాప్తంగా మొదటిపేజీ ప్రధాన కథనంగా మారాయి. దాంతో ఈ విషయాలను దర్యాప్తు చేయాల్సిందిగా అక్కడి ప్రభుత్వం సిఐఏకు కేసు అప్పగించింది. అయితే ఈ సంగతులేవీ బైటకి పొక్కకుండా జాగ్రత్త పడింది.

మానవులతో కాంటాక్ట్
1957లో బ్రెజిల్ దేశానికి చెందిన ఆంటోనియో విల్లాస్ బోయాస్ అనే వ్యక్తి రాత్రి పూట పని పూర్తి చేసుకొని, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై కార్లో రేడియో వింటూ ఇంటికి వెళ్తున్నాడు. సడెన్‌గా రేడియో వింత వింత శబ్దాలు చేయటం మొదలు పెట్టింది. కారు ఉన్నట్టుండి ముందుకి వెళ్లనని మొరాయించింది. ‘ఏంటా?’ అని ఆలోచిస్తున్న ఆంటోనియో కళ్లు తిరిగిపోయే దృశ్యాన్ని చూశాడు. కారుకి ఎదురుగా పెద్ద శబ్దం చేస్తూ ఆకాశంలో వెలిగిపోతూ పళ్లెం ఆకారంలో స్పేస్‌షిప్‌ని పోలిన వస్తువొకటి కనపడింది. జరిగిన దాన్నుంచి తేరుకునేలోగానే ఎగిరే పళ్ళెం లాంటి వస్తువులో వచ్చిన ఏలియన్లను పోలిన వ్యక్తులు అతనని బంధించి తీసుకువెళ్ళారు.

ఆంటోనియా కథనం ప్రకారం ఆ స్పేస్‌షిప్‌లో అత్యంత ఆధునాతన సైన్స్ లెబొరేటరీ ఉందని... అందులో ఉన్న ఏలియన్లు అతడిని బల్లమీద పడుకోబె ట్టి వింత వింత ఉపకరణాలతో అతనిపై రకరకాల పరీక్షలు జరిపారని తెలిపాడు. పరిశోధనల అనంతరం అతడిని తిరిగి భూమి పైన వదిలేసి వెళ్లిపోయారు. ఆంటోనియో మాటల్లో సత్యం ఉందనటానికి అతని శరీరంపై అంతకుముందులేని మచ్చలు హటాత్తుగా ప్రత్యక్షమవ్వటమే. ఇవి ఏలియన్లు అతనిపై పరిశోధనలు జరిపారనటానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇది మొదలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వ్యక్తులు మరికొంతమంది ముందుకు వచ్చారు. వీటిని పరీక్షించిన డాక్టర్లు ఇవి ఎంతో అత్యాధునికమైన (సొఫెస్టికేటెడ్) పరికరాలతో, ఎంతో నైపుణ్యం ఉన్న డాక్టర్లు మాత్రమే చేయగలిగినవిగా గుర్తించారు.
- కె. ఎం

ప్రత్యక్ష సాక్షి


1969లో జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేస్తున్నప్పుడు లీరీ అనే పట్టణం దగ్గర్లో తాను యుఎఫ్‌ఓను చూశానని అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ చెప్పిన ఉదంతం ‘జిమ్మీ కార్టర్ యుఎఫ్‌ఓ ఇన్సిడెంట్’గా ప్రఖ్యాతి గాంచింది. ఈ విషయమై అతను 1973లో ఇంటర్నేషనల్ యుఎఫ్‌ఓ బ్యూరో అభ్యర్థన మేరకు ఒక రిపోర్ట్‌ను కూడ ఫైల్ చేశారు. తాను చూసిన వస్తువు తెల్లని కాంతితో మెరిసిపోతూ ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పోలి ఉందని ఆ రిపోర్ట్‌లో కార్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ రోజు అక్కడే కార్టర్‌తో ఉన్న మరో పదకొండు మంది వ్యక్తులు కూడా ధృవీకరించారు. దాదాపు 10 నిముషాల పాటు రంగుల కాంతులని చిందించిన ఆ వస్తువు తిరిగి ఆకాశంలో అదృశ్యం అయిపోయిందన్నది వీరి కథనం.

క్రాప్ సర్కిల్స్... పొలాల్లో యుఎఫ్‌ఓలు
అమెరికాలోని క్యాన్సెస్ రాష్ట్రంలో రైతులు ఓ కొత్త తరహాలో యుఎఫ్‌ఓల ఉనికిని గుర్తించారు. ఉదయం లేచేటప్పటికి పొలాల్లో ఎంతో నైపుణ్యంతో ఎవరో చేసినట్టు గుండ్రని వలయాలు దర్శనమిచ్చాయి. ఇదేం పెద్ద విషయం కాదనుకునే వారికి ఆ వలయాలు ఒక్కొక్కటి కొన్ని మీటర్ల పొడవుతో ఉండటమే కాదు అవి ఏర్పడిన చోటు గడ్డి మొత్తం కాలిపోయి ఉంది. అలాంటి ఒక వలయం చేయడానికి మనుషులకి కనీసం 9-10 గంటల సమయం పడుతుంది.

అది కూడా ఏదైనా మిషన్ సహాయంతో! కాని అక్కడ దర్శనమిచ్చినవి ఒకటి రెండు వలయాలు కాదు... దాదాపు 10 వరకు ఉన్నాయి. అంటే ఒకవేళ మానవమాత్రులు పూనుకుని వాటిని రూపొందించాలన్నా వాటిని తయారు చేయడానికి ఒక రాత్రి సరిపోదు! అంతేకాదు అక్కడి రైతులకి తమ పశువుల్లో కొన్ని గల్లంతవడం, మరికొన్నింటి అవయవాలు తీసేసి వాటి కళేబరాలు మాత్రం పడేయడం వారిలో ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించాయి. పరిశోధనల తరవాత తేలిన విషయం ఏంటంటే ఆ వలయాకృతులు మానవులు రూపొందిచలేరనీ... ఏవో చాలా బరువైన వేడి వస్తువులు అక్కడ వాలినందుకే అవి ఏర్పడ్డాయని తెలిసింది. కాని అవేమిటో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కలేదు.

అంతా ట్రాష్...

‘గ్రహాంతరజీవులా, ఫ్లయింగ్ సాసర్లా... అంతా ట్రాష్!’ అంటూ కొట్టి పడేసే వారూ ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వేరే దేశాల పైకి వేగుల్లాగా, గూఢచారిగా పనిచేయడానికి వాడే విమానాలకు ‘ఎగిరే పళ్లేలు’ అని పేరు పెట్టారన్నది వీరి వాదన. అందుకే వీటి వెనకాల అంత రహస్యం అంటారు. కాని ఈ యుఎఫ్‌ఓ లను చూసినవారిలో సామాన్య ప్రజలే కాదు, శాస్తవ్రేత్తలు, పోలీస్ అధికారులు, పెలైట్లు. సమాజంలో బాధ్యాతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు, అంతెందుకు అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ కూడా ఉన్నారంటే... ఇవి ఉన్నాయనే కదా అర్థం?!

పి.ఎస్: 2005, ఏప్రిల్7న అమెరికా ప్రెసిడెంట్ నివాసమైన వైట్ హౌస్‌ని యుఎఫ్‌ఓ సైటింగ్ కారణంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2007, మార్చి 7న లో మన దేశ ప్రధాని నివాసం దగ్గర రెండు యుఎఫ్‌లో దర్శనమిచ్చాయి.

No comments: