Monday, October 25, 2010

ముగాబే భార్య ప్రేమాయణం * రిజర్వ్‌బ్యాంకు అధిపతితో ఐదేళ్లుగా కొనసాగిన వ్యవహారం

పాణభయంతో ముగాబే భార్య ప్రియుడు
మాజీ ప్రియుల్లో ఒకరి అనుమానాస్పద మృతి, మరొకరి పరారీ



జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే భార్య గ్రేస్ ముగాబే ఒక బ్యాంకర్‌తో నడిపిన ప్రేమాయణం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాబర్ట్ ముగాబేకు సన్నిహితుడైన జింబాబ్వే రిజర్వ్ బ్యాంకు అధిపతి గిడియన్ గోనోతో దాదాపు ఐదేళ్లు గ్రేస్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు బ్రిటిష్ దినపత్రిక ‘డెయిలీ మెయిల్’ వెల్లడించింది. ఈ వ్యవహారం బయటపడటంతో గోనో ప్రాణభయంతో వణికిపోతున్నాడని తెలిపింది. ఈ కథనం ప్రకారం... రాబర్ట్ ముగాబే (86) కంటే గ్రేస్ వయసులో 41 సంవత్సరాలు చిన్న. ముగాబేకు సన్నిహితుడైన గోనోతో ఆమె పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ తరచు రహస్యంగా కలుసుకునే వారు. గ్రేస్‌కు చెందిన డెయిరీ ఫాంలోను, హోటళ్లలోను నెలకు కనీసం మూడుసార్లయినా కలుసుకునే వారు. ఐదేళ్లకు పైగా సాగిన ఈ వ్యవహారం ముగాబేకు మాత్రం ఈ ఏడాది జూలైలోనే ఆయన సోదరి సబీనా ద్వారా తెలిసింది.

సబీనా మరణశయ్యపై ఉన్న సమయంలో గ్రేస్ రహస్య కార్యకలాపాల వివరాలను తన సోదరుడు ముగాబేకు చెప్పింది. ముగాబేను 1996లో వివాహమాడినప్పటి నుంచి గ్రేస్‌కు గోనోతో పరిచయం ఏర్పడింది. జింబాబ్వే రిజర్వ్ బ్యాంకు అధిపతిగా కొనసాగుతున్న గోనో భాగస్వామ్యంతో ఆమె పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గోనో హయాంలోనే జింబాబ్వేలో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుని, కరెన్సీకి విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం అతడు 47 పడక గదులు, ఈతకొలను తదితర వసతులు గల విలాస సౌధంలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. గోనో, ముగాబే భార్య గ్రేస్ ప్రేమికులని గోనో కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ముగాబే మరణించాక కలసి జీవించాలని కూడా వారు నిర్ణయించుకున్నారని తెలిపారు. గ్రేస్‌కు ఇదొక్కటే వ్యవహారం కాదు, ఇదివరకు పీటర్ పామైర్, జేమ్స్ మకాంబా అనే వారితోనూ ప్రేమాయణాలు ఉన్నాయి. పీటర్ ఒక అనుమానాస్పద కారు దుర్ఘటనలో మరణించగా, జేమ్స్ దేశాన్ని విడిచి పారిపోయాడు. తాజా వ్యవహారం బయటపడటంతో గోనో ప్రాణభయంతో భీతిల్లుతున్నాడని జింబాబ్వే ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.

No comments: