
25, మే 2011.. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక అధ్యాయానికి తెరపడింది. 1986 మొదలై 145కి పైగా దేశాల్లో ప్రసారమవుతూ వస్తున్న 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' ఆ రోజుతో ముగిసింది. పాతికేళ్లుగా అమెరికాలో ఇంటిల్లిపాదికీ సుపరిచితమైన ఓప్రా విన్‌ఫ్రే చివరిసారి టీవీలో కనిపించే ఎపిసోడ్‌ని ఆ దేశంలో సినిమా థియేటర్లలో కూడా లైవ్‌గా ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా బార్లు, పబ్‌లలో ఓప్రా అభిమానులు చేరి టీవీషో చూస్తూ వీడ్కోల పండుగ జరుపుకున్నారు. ఆమెరికా ఆమెని అంతగా ఆరాధించడానికి కారణమేమిటి? ఓప్రా విన్‌ఫ్రే కేవలం టీవీ యాంకర్ మాత్రమే కావచ్చు. అమెరికన్ సంస్కృతిని పాతికేళ్లుగా మరెవరూ చేయలేనంతగా ప్రభావితం చేసిందని సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపించాయి.


తల్లి పిల్లలతో మాట్లాడినట్లే..

పేదరికం నుంచి..
ఓప్రా విన్‌ఫ్రే 1954 జనవరి 29న మిసిసిపీలో ఒక టీనేజి పెళ్లికాని అమ్మాయికి జన్మించింది. ఆమె తల్లి ఇళ్లల్లో పనిచేసేది. ఓప్రా అసలు పేరు ఓర్పా గెయిల్ విన్‌ఫ్రే. ఓర్పా కాస్తా వాడుకలో ఓప్రా అయిపోయింది. తొమ్మిదేళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యానని ఒకసారి తన షోలో చెప్పింది ఓప్రా. ఏళ్లపాటు అత్యాచారానికి గురైన ఆమె 13 ఏళ్లవయసులో ఇల్లొదిలి పారిపోయింది. పద్నాలుగేళ్ల వయసులో మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అప్పట్నించి నేటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో వక్తృత్వపోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించింది. ఆ పోటీల్లో గెలుపుతో యూనివర్శిటీ చదువుకి ఫెలోషిప్ సంపాదించి నల్లజాతి విద్యార్థులకు పెట్టింది పేరైన టెన్నెస్ స్టేట్ యూనివర్శిటీలో చేరింది.

ఓ పక్క చదువుకుంటూనే స్థానిక రేడియో స్టేషన్లో వార్తలు కూడా చదివిన ఆమె ఆ రేడియోలో పనిచేసిన పిన్నవయస్కురాలే కాదు, మొట్టమొదటి నల్లజాతి యాంకర్ కూడా ఆమే. రేడియో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న ఓప్రా 1983లో టెన్నెస్ నుంచి చికాగోకి మకాం మార్చింది. ఓ రేడియో స్టేషన్‌లో ఉదయం వార్తా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఓప్రా రంగ ప్రవేశంతో కొన్ని నెలల్లోనే రేటింగ్‌లో ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉన్న ఆ కార్యక్రమం మొట్టమొదటి స్థానానికి ఎగబాకింది. ఓప్రా ఇంటర్వ్యూ చేసే తీరు, ఆమె నైపుణ్యాన్ని గమనించిన సినీ విమర్శకుడొకరు ఆమెని టెలివిజన్ షో చెయ్యమని సలహా ఇచ్చాడు. కార్యక్రమాన్ని దేశమంతటా టీవీ చానళ్లకు అమ్మవచ్చని, ఖచ్చితంగా జనాన్ని ఆకర్షించగలుగుతుందని చెప్పాడు. ఆయన సలహాతోటే 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' అనే పేరుతో ఆమె సొంతగా టెలివిజన్ షో నిర్మించే పనిలో పడింది.

ది ఓప్రా విన్‌ఫ్రే షో

ఇద్దరు నల్లజాతి తారల్ని ఓ చోట చేర్చిన ఆ కార్యక్రమం అమెరికన్ టెలివిజన్ చరిత్రలోనే అతి ఎక్కువమంది వీక్షించినదిగా రికార్డులకెక్కింది. నోబెల్ గ్రహీత, అమెరికన్ నల్లజాతి రచయిత్రి టోని మారిసన్ రచించిన 'బిలవెడ్'ని వెండితెరపై నిర్మించి నటించింది. మరో నల్లజాతి రచయిత్రి ఆలిస్ వాకర్ రచించిన 'ది కలర్ పర్పుల్'ని స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మిస్తే, దాన్లో నటించి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది. ఒక విజయం మరిన్ని విజయాలకు బాట వేస్తుందనేది ఓప్రా విషయంలో ముమ్మాటికీ నిజమైంది.
2000 సంవత్సరంలో ఆమె ప్రారంభించిన 'ఒ-ది ఓప్రా మ్యాగజైన్' మాసపత్రిక 27 లక్షల కాపీల సర్క్యులేషన్‌తో నడుస్తోంది. ఆ మ్యాగజైన్ దక్షిణాఫ్రికా ఎడిషన్ కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఓప్రాకి ఉన్న ఆదరణని గమనించిన డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థ ఆమెతో సంయుక్తంగా ఒక చానల్ నడపడానికి ముందుకొచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో 'ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్' పేరుతో ఆ టీవీ చానల్ మొదలైంది.
పుస్తక ప్రచురణపై ఓప్రా మార్కు
ఓప్రా విన్‌ఫ్రే ఐదు పుస్తకాలకు సహరచయిత కూడా. 2005లో ఆమె తన వ్యక్తిగత ట్రెయినర్ బాబ్ గ్రీన్‌తో కలిసి బరువు తగ్గడంపై పుస్తకం రాసింది. ఆ పుస్తకానికి వచ్చిన పారితోషకం కూడా ఒక రికార్డే. ప్రపంచంలో ఏ రచయితకీ చెల్లించనంత ఎక్కువ మొత్తాన్ని ఆమెకి చెల్లించారని వార్తలొచ్చాయి. అప్పటి దాకా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జీవితచరిత్రకి లభించిందే అతి ఎక్కువ మొత్తం. పుస్తకాలు రాయడమే కాదు ఓప్రా తన షోలో పుస్తకాల గురించి కూడా చర్చించేది. దానికి ఓప్రా బుక్ క్లబ్ అనే పేరు పెట్టిందామె. ఏదైనా పుస్తకం ఆ క్లబ్‌లో స్థానం సంపాదించడమంటే ఒక పెద్ద అంతర్జాతీయ అవార్డు రావడంతో సమానం.


అంత్యంత ప్రభావశీల మహిళ

కాలిఫోర్నియాలోని 'ది ప్రామిస్డ్ ల్యాండ్' అనే 42 ఎకరాల సువిశాల ఎస్టేట్‌లో ఉన్న విలాస భవనం ఆమె ప్రస్తుత నివాసం. ఇంకా చాలా నగరాల్లో ఆమెకి ఇళ్లున్నాయి. ప్రఖ్యాత నల్లజాతి అమెరికన్ రచయిత్రి మాయా ఎంజెలూ అంటే ఓప్రాకి ఎనలేని ప్రేమ, గౌరవం. 'ఆమే నాకు అక్క, తల్లి, స్నేహితురాలు' అని పేర్కొన్నదోసారి. పేదరికంలో పుట్టి పెరిగిన ఓప్రా 32 ఏళ్లకే మిలియనీరైంది. 41 ఏళ్లు వచ్చేనాటికి ఫోర్బ్స్ 400 మంది ధనవంతుల జాబితాలో ఉన్న ఏకైక నల్లజాతి వ్యక్తి అయింది. ఆమె ఆస్తి అప్పటికి 340 మిలియన్ డాలర్లు. 20వ శతాబ్దానికి గాను అత్యంత ధనవంతురాలైన ఆఫ్రికన్ అమెరికన్ ఆవిడే.
కేవలం సంపాదించడమే కాదు, దాన్నెలా ఖర్చు చేయాలో కూడా తెలుసు ఓప్రాకి. అందుకే 1998లో ఓప్రాస్ ఏంజెల్స్ నెట్‌వర్క్ పేరుతో ఒక సేవాసంస్థను స్థాపించి ఎనిమిది కోట్ల డాలర్లు విరాళాలు సేకరించి సేవాకార్యక్రమాలు నిర్వహించింది. అమెరికాలో మరే ఇతర సెలబ్రిటీ దానం చేయనంత డబ్బుని దానం చేసింది. ఒక్క 2007లోనే 303 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన ఆమె దక్షిణాఫ్రికాలో వీధి బాలల కోసం స్కూల్ కూడా నడుపుతోంది.
No comments:
Post a Comment