Showing posts with label Vinayaka. Show all posts
Showing posts with label Vinayaka. Show all posts

Thursday, September 16, 2010

పాలవెల్లి కోసం వాల్‌మార్ట్‌లో వెతికాం

(అమెరికాలో ఉంటున్న ఇందు వినాయక చవితి జరుపుకునేందుకు చాలా కష్టాలు పడిందట. అవేంటో తన బ్లాగ్‌లో రాసుకుంది మీరూ చదవండి) చిన్నప్పటి నుంచి మేం వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకునేవాళ్లం. అటువంటిది ఈ దేశం కాని దేశంలో మొదటిసారి ఇంటికి దూరంగా ఉండి జరుపుకుంటున్న పండుగ ఇది. రెండు రోజుల ముందు నుంచే చందుని హింసించడం మొదలుపెట్టాను..

పత్రి ఎలా? మట్టి వినాయకుడు దొరుకుతాడా? ఉండ్రాళ్లకి బియ్యపు రవ్వ ఎక్కడ కొనాలి? మరి పాలవెల్లి సంగతేంటి? వ్రత కథ పుస్తకం ఎలా? బంతిపూల మాలలు దొరకవు కదా? ఇలా విసిగించాను. పాలవెల్లి కోసం దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్స్ అన్నీ తిరిగాం. కానీ దొరకలేదు. అసలు పాలవెల్లి లేకుండా వినాయకచవితి ఊహించుకోవడం ఎలా? దానికి పసుపురాసి కుంకుమ పెటి ్ట గోడకి కట్టి దానికి ఆపిల్, దానిమ్మ కాయలు, వెలక్కాయలు, మొక్కజొన్నలు, అరటి పిలకలు, మామిడాకులు, బంతి, కలువ పువ్వులన్నింటితో అలంకరణ చేస్తేనే కదా పండగ కళ వచ్చేది? ఇంటికి వచ్చాక ఇంటర్‌నెట్‌లో గూగుల్ మీద పడి వెతకడం మొదలుపెట్టాను. ఎక్కడా పాలవెల్లి జాడ కనిపించలేదు. సరిగ్గా రేపు పండగ అనగా ఒక సైట్‌లో 'పాలవెల్లిని నేనే తయారు చేసుకున్నా' అని ఓ పోస్ట్ కనిపించింది.

నేనూ అలాగే తయారు చేసుకుందామని చెక్కముక్కల కోసం వాల్‌మార్ట్‌కి వె ళ్లాను. దొరకలేదు. మిగతా సరుకులైనా కొందామని 'క్రోగర్'లో పూల బొకేలు, అరటి పళ్లు తీసుకున్నాం. 'నమస్తే'కి వెళ్లి కొబ్బరికాయలు కొన్నాం. పండగ సందర్భంగా వారు మామిడాకులు, చెరకుగడ, తమలపాకులు, రెండు అరటిపళ్లు, ఇంకా నాలుగు రకాల పళ్లు కూడా ఇచ్చారు. అవన్నీ ఉంటేనే కదా పండగ కళ.

ఇక మట్టి వినాయకుని వెతకడమే మిగిలింది. ఏ షాపులో చూసినా రంగు రంగుల వినాయకులే. నాకేమో మట్టి వినాయకుడే కావాలి. చివరికి ఒక షాపులో బుజ్జి వినాయకుడు దొరికాడు. చిన్న గొడుగు కింద సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. తర్వాత తమలపాకులు, వక్కలు, చందనం, చిన్న దీపపు ప్రమిదలు కొన్నాం. పాలవెల్లి ఇంకా మిగిలే ఉంది. చెక్కల కోసం 'హోమ్ డిపో'కి వెళ్లాం. కష్టపడి మాకు కావాల్సిన చెక్కముక్కలు కొన్నాం. ఇంటికి రాగానే చందు పాలవెల్లిని తయారు చేసే పనిలో మునిగిపోతే, రేపు వంటకి కావాల్సిన ఏర్పాట్లలో నేను ఉండిపోయా. పాలవెల్లి రెడీ అయింది కాని దాన్ని ఎలా వేలాడదీయాలి? గోడకి మేకులు కొడితే ఓనర్స్ ఒప్పుకోరు.

అందుకే మా సైడ్ టేబుల్‌ని పూజామందిరంగా మార్చేశా. కింద పైన అద్దాలు ఉండే సైడ్ టేబుల్ అది. కింద గ్లాస్ మీద వినాయకుడిని పెట్టొచ్చు. పైన పాలవెల్లి పెట్టొచ్చు అనుకున్నాం. అమ్మయ్య! మనసు కుదుటపడింది. చవితి రోజున పొద్దున్నే లేచి వంట కానిచ్చి ఇద్దరం పూజ ముందు కూర్చున్నాం. పాలవెల్లిని అలంకరించుకుని లాప్‌టాప్‌లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేశాం. ఆ రోజు మా ఇంటికి అతిథిగా వాచ్చిన నాని గారు మా వినాయకుణ్ణి చూసి 'ఇండియాని గుర్తు చేశారండి' అన్నారు. నాకు చాలా సంతోషమేసింది.

Saturday, September 11, 2010

మట్టి వినాయకుడే మహారాజు

ఈ ఏడు పర్యావరణ గణపతికి ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. మట్టి విగ్రహాలు కొనమని చాలామంది ప్రచారం చేస్తున్నారు. కొందరు స్కూళ్లకు, కాలనీలకు వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు విగ్రహాలు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన ఫ్రెండ్స్ పల్లవి, వీణ ఆ పనినే కాస్త కొత్తగా ఎలా చేస్తున్నారో తెలుసుకోండి!
వర్షాకాలానికి ముందు ఊళ్లలో చెరువులు పూడిక తీసి ఆ మట్టితో విగ్రహాలు చేసేవారు. ఇది భూతకాలం. వర్తమానంలో ఆ సంప్రదాయాన్ని సాంకేతిక పరిజ్ఞానం మింగేస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో చేసిన విగ్రహాల తయారీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు చెరువులు కలుషితమవుతున్నాయి. పర్యావరణానికి హాని కలుగుతోంది.

భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతోంది. ఈ నేపథ్యంలో మట్టి విగ్రహాల వాడకం, సహజమైన రంగుల పట్ల అవగాహన కల్పించే బాధ్యతను చాలామంది భుజాన వేసుకోవడం హర్షణీయం. అలాంటి వారిలో వీళ్లు ఒకరు. పల్లవి ఎస్ఐటి అనే ఇనిస్టిట్యూట్‌ని నిర్వహిస్తోంది. వీణ 'అనహత' కేంద్రంలో పిల్లలకు క్రాఫ్ట్ మేకింగ్‌లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటుంది. వీరిద్దరు కలిసి ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల పట్ల చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

భక్తికి సైజు ముఖ్యం కాదు : పల్లవి
"ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన భారీ గణపతి విగ్రహాలను నిలబెడుతున్నారు. ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్పగా భావిస్తున్నారు చాలామంది. భక్తికి సైజు, ఆకర్షణీయమైన రంగులు ముఖ్యం కాదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీళ్లలో కరగడానికి చాలా నెలలు పడుతుంది. సంవత్సరం కూడా పట్టొచ్చు. పోయిన సంవత్సరం మట్టి కరగకముందే మళ్లీ ఈ ఏడాది నిమజ్జనం చేస్తున్నాం. దీనివల్ల నీళ్లు కలుషితమవ్వడమే కాకుండా, సూర్యకాంతిని నీళ్లలోకి ప్రసరించకుండా చేస్తాయి అవి. దీనివల్ల జలచరాలకు హాని కలుగుతోంది.

పర్యావరణానికి హాని కలిగించే 'అంత భక్తి' ఎందుకు చెప్పండి? ఆకర్షణీయమైన రంగులు ఉంటేనేనా పండగా? మన సంప్రదాయంలో పండగలు ఆకులు, పూలు, పండ్లు, మట్టి.. ఇలా సహజమైన వాటి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ఆ సహజత్వాన్ని మింగేస్తోంది. ఈ అంశాలన్నీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాం. వాటికి సంబంధించిన సమాచారం, ఫోటోలతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశాం'' అని తమ వర్క్‌షాప్ గురించి చెప్పింది పల్లవి.

రెండువేల మందికి నేర్పాం : వీణ
పిల్లలకే ఎందుకు చెప్పాలనుకున్నారని అడిగితే "పిల్లలకు ఇష్టమైన దేవుడు వినాయకుడు. ఆ గణపతి విగ్రహాన్ని తామే తయారు చేసుకుంటే వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. భవిష్యత్తు వారిది. అందుకే మేం పిల్లలకు విగ్రహాలు ఎలా తయారు చేయాలో నేర్పించాలనుకున్నాం. వాళ్లు స్వతహాగా ఇంట్లో తయారు చేసుకుంటుంటే పెద్దలు కూడా వద్దనరు.

నేను గతంలో క్రాఫ్ట్ మేకింగ్‌పై చిన్నారుల కోసం సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహించాను. ఇప్పుడు వినాయకుని విగ్రహాన్ని ఎలా తయారు చేయాలో స్కూళ్లకు వెళ్లి వర్క్‌షాపుల ద్వారా విద్యార్థులకు నేర్పిస్తున్నాను. మట్టి, పేపర్ గుజ్జులతో ఎలా చేయొచ్చో చెబుతున్నాను. పసుపుకుంకాలను, ఆకులతో ఆకుపచ్చ రంగును గులాబీలతో ఎరుపు రంగును బంతి పూలతో పసుపు రంగును తయారు చేసి సహజమైన రంగులుగా వాటికి ఎలా అద్దొచ్చో నేర్పుతున్నాను. ఇప్పటి వరకు రెండు వేల మందికి నేర్పించాం.
వాళ్లు కచ్చితంగా ఐదారువేల మందికి నేర్పుతారని, భవిష్యత్తులో మట్టి విగ్రహాలనే తయారు చేసుకుంటారని నమ్ముతున్నాం'' అని చెప్పింది వీణ.
- బీరెడ్డి నగేష్‌రెడ్డి