Showing posts with label Jobs. Show all posts
Showing posts with label Jobs. Show all posts

Wednesday, October 13, 2010

కష్టే సాహస ఫలి

ఇద్దరు సోదరులు.. ఒక కల.. ఏమిటా కల ? ఎంతో అసాధ్యమైన కల !

మనిషికి రెక్కలు పొదిగి ఆకాశంలో ఎగిరేలా చేయాలని. పక్షులు ఎగురగలుగుతున్నప్పుడు మనిషి మాత్రం ఎందుకు ఎగరలేడు ?

పోనీ మనిషి కాకపోతే. ఏదైనా యంత్రం ఎగరొచ్చు కదా !! దాంతో పాటు మనిషి కూడా ఎగరొచ్చు కదా !

ఇది ఆ సోదరుల కల. రైట్ సోదరుల కల.

మనకు రెక్కలనిచ్చి గగన యాత్ర అనుభవాన్ని అందించిన మహాశయులు రైట్ సోదరులు.

బెంగళూర్‌లో బ్రేక్‌ఫాస్ట్, లండన్‌లో లంచ్, డిన్నర్ ఢిల్లీలో నేడు మనం చేయగలుగుతున్నామంటే అది రైట్ సోదరుల కలలు, ప్రజ్ఞాపాటవాల వల్లనే మనకు అందుబాటులోకి వచ్చాయి. కలలు, గమ్యాలు, ఆ కలల సాకారానికి వినియోగపడే పద్ధతులు- అన్నీ ఏకమైతేనే వాటికో రూపం వచ్చి అవి నిజాలయ్యేవి. లేకుంటే పగటి కలలుగా నిల్చిపోతాయి.

పగటి కలల గురించి తెల్సిందే కదా మనకు. పగటి కలలు అనగానే చప్పున నా మదిలో మెదుల్తుంది ముల్లా నసీరుద్దీన్ గారి పగటి కలలు. ముల్లా నసీరుద్దీన్ హాస్యానికి, కొంటె పనులకు మారుపేరు. మన తెనాలి రామకృష్ణుడిలాగా. ముల్లా నసీరుద్దీన్ గురించి పలు కథలు, అనేక భాషల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకరోజున ముల్లా నసీరుద్దీన్ తన గాడిద మీద ప్రయాణం చేస్తూ తన పగటి కలల ప్రపంచంలోనికి అడుగుపెట్టాడు... పంచరంగుల కలలు.

తను వ్యాపారవేత్తనవుతానని, నాలుగు దుకాణాలు కొని, వాటిల్లో చెప్పుల షాపు, కుండల షాపు, టైలర్ షాపు, జంతువుల స్వారీకి ఉపయోగించబడే సీట్లు కుట్టే షాపును పెడదామనుకున్నాడు. ప్రతి షాపులో ఇద్దరు పనివాళ్లను పెట్టి వ్యాపారాభివృద్ధి చేసి హాయిగా రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు భార్యలతో, నలుగురు అబ్బాయిలతో జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుని ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు అందమైన అమ్మాయిల్ని తెచ్చి పెళ్లిళ్లు చేయాలనుకొన్నాడు.

కలలంటూ మొదలయ్యాక అవి అనంతంగా అల్లుకుపోతూనే ఉంటాయి కదా. అదే జరిగింది. మన ముల్లా నసీరుద్దీన్‌కు కూడా. కలలు అల్లుకుంటూ పోతున్నాడు. మనవలు, మనవరాళ్లు. తనను పట్టించుకోకుండా తన కలల లోకంలో విహరిస్తున్న ముల్లాను చూచింది ఆయన స్వారీ చేస్తున్న గాడిద. 'చిన్న గమ్మత్తు చేస్తేనో' అనుకుంది.

ఎదురుగా చిన్న గుంట, దాన్ని దాటటానికి ఒక చిన్న వంతెన కనబడ్డాయి.. వంతెనను వదిలి ఒక్కసారి ఆ గుంట మీద నుంచి అమాంతం దూకితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో కదా అనుకుని వెంటనే దూకేసింది. గాడిద గుర్రం కాదు కదా. పగటి కలలు నిజాలు కావు కదా.

అంతే గుంటలో పడిపోయింది గాడిద, దాంతో పాటు అనంతంగా పగటి కలలు కంటున్న మన ముల్లా నసీరుద్దీన్ గారు.

నడ్డి విరిగిందని వేరే చెప్పాలా !? పగటి కలల ప్రయోజనం ఇంతేనని మనకు ముల్లా చెబుతున్న నీతి కథ.

మన రైట్ బ్రదర్స్ కలలు పగటి కలలు కావు. చిన్నతనం నుంచి వారితో పెరిగిన ఒక గాఢమైన కోరిక. నడిచే మనిషిని విమానంలో కూర్చొపెట్టి ఎగురవేయాలనే తపన.

ఆర్‌విల్ రైట్ , విల్బర్ రైట్ .
విల్బర్ 1867లో ఆర్‌విల్ 1871లో పుట్టారు. వీరు కాక మరో ఐదుగురు సంతానం వారి తల్లిదండ్రులకి. అతి సామాన్యమైన కుటుంబం. తండ్రి మిల్టన్ రైట్ చర్చిలో బిషప్‌గా పనిచేస్తుండేవాడు. అందరిలోకి ఆర్‌విల్ చాలా అల్లరివాడు. చేస్తున్న అల్లరి పనులకు ప్రతిఫలంగా ఒకసారి స్కూల్లోంచి తీసేయబడ్డాడు కూడా.

అయితే అన్నదమ్ములిద్దరికి ఎగిరే పక్షులన్నా, అవి ఆకాశంలో ఎగురుతూ చేసే అద్భుతాలన్నా, విన్యాసాలన్నా ఎంతో మక్కువ. గంటల తరబడి రకరకాల పక్షుల ఆకాశయానాన్ని అలా కన్నార్పకుండా చూస్తూ ఉండేవారు. ఏ ప్రక్రియ వల్ల పక్షులు నేల మీద నుంచి ఆకాశంలోకి ఎగురగలుగుతున్నాయి, ఎలా తమ రెక్కల ఉపయోగం ద్వారా దిశలు మార్చగలుగుతున్నాయో సునిశితంగా పరీక్షించేవారు. అవి ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాయో పరీక్షించేవారు. ఆకాశయానంలో ఎగురుతున్న పక్షులకు గాని యంత్రాలకు గాని వాటి బ్యాలెన్స్, క ంట్రోల్ ఎంతో ముఖ్యమని గమనించారు.

1878లో విల్బర్, ఆర్‌విల్ సోదరులకు వారి తండ్రి ఒక బొమ్మ హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది ప్రతి చోట సర్వసాధారణంగా లభ్యమయ్యే బొమ్మ హెలికాప్టర్. రబ్బరు బెండు, పేపర్, వెదురు ముక్కలతో చేసిన హెలికాప్టర్. ఒక అడుగు పొడుగు మాత్రమే.

విహంగ యానం మీద ఎంతో మక్కువ పెంచుకున్న రైట్ సోదరులకు తండ్రి ఇచ్చిన ఈ సామాన్య బహుమతి వాళ్ల సృజనాత్మకను మేలుకొలిపింది. వారి కలలకు ఒక రూపం ఒక గమ్యం ఏర్పడినాయి. సైకిల్ షాపు తెరిచారు. ఆ రోజుల్లో అమెరికాలో సైకిళ్లంటే విపరీతమైన మోజు ఉండేది. సైకిళ్లను అమ్మటమే కాదు రిపేర్లు చేసే కూడా చేసేవాళ్లు. 1896లో తామే సైకిళ్లను తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టారు. ఇదంతా డబ్బు సంపాదించాలనే తపనతో కాదు, తమ కల ఏరోప్లేన్‌ను కనుగొనే కలను సాకారం చేసుకోవటానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవటానికై. ఇంతేకాదు, సైకిల్‌కు ఎగిరే విమానానికి ఎన్ని పోలికలున్నాయో గ్రహించారు రైట్ సోదరులు. సైకిల్ నడపాలంటే కంట్రోల్ ఎంతో అవసరం కదా.

అలాగే విమానానికి ఎంతో అవసరం ఈ కంట్రోల్. పైగా సైకిళ్ల ఉత్పాదనలో, వాటి మరమ్మత్తులలో, యంత్రాల నిర్మాణం వాటికి అవసరమైన నేర్పును నేర్చుకున్నారు. తర్వాత కాలంలో వారు తమ గ్లైడర్సును విమానాలను తయారు చేస్తున్నప్పుడు ఈ సైకిళ్ల తయారీ అనుభవం ఎంతో మేలు చేసింది వారికి. 14 మే 1908న రైట్ బ్రదర్స్ ఎంతో కాలంగా శ్రమించిన విమానం ప్రయాణికులతో ఎగరటానికి సిద్దమైంది.

అయితే 17 సెప్టెంబర్‌న ఓ విమాన ప్రమాదం జరిగింది. ఆర్‌విల్ రైట్ ఆ ప్లేనుకి పైలట్. ఆ విమానంలో ఒక ప్రయాణికుడు సిగ్నల్ కార్ప్స్ లెఫ్టినెంట్ థామస్ సెల్ఫ్‌రిడ్జ్ ఉన్నారు. విమానం కూలిపోయింది. ఆర్‌విల్ బతికి బట్టకట్టాడు. థామస్ సెల్ఫ్‌రిట్జ్ మరణించాడు.

ఈ దుర్ఘటన వారిలోని పట్టుదలను ధృడపరిచింది . మరెంతో శ్రమించారు.
1909లో అమెరికా ప్రభుత్వం తమ మొదటి విమానాన్ని కొనుగోలు చేసింది. అది రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం. ఆ రోజుల్లో ఆ విమానం ధర 25 వేల డాలర్లు.

ఇక అక్కణ్ణుంచి అన్నీ విజయాలే.
1911లో ఖండాంతర ప్రయాణం చేయగలిగిన విమాన సృష్టి. అమెరికాని దాటటానికి ఆ విమానానికి 84 రోజులు పట్టింది. 70 సార్లు ఆగింది.

1912లో మెషిన్‌గన్‌ను అమర్చిన ప్లేన్‌ను ఆవిష్కారం.
1914లో ఆర్మీలో ఒక చిన్న ఎయిర్‌ఫోర్సు విభాగం ఏర్పాటు జరిగింది.
ఒక్కసారి ఆలోచించండి...
ఎక్కడి ఆటబొమ్మ హెలికాప్టర్ !!
ఎక్కడి ఎయిర్‌ఫోర్స్ విభాగం !!
కేవలం 30 ఏళ్లలో మనిషి ఎగ రటం మాత్రమే నేర్చుకోలేదు. తాను ఎగిరే విమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకోగలిగాడు. జయహో రైట్ సోదరులారా ! ప్రపంచానికి ఒక కొత్త వేగాన్ని ఒకే జీవిత కాలంలో ఎన్నో జీవితాల అనుభవాన్ని పొందుపరుచుకునే శక్తిని మానవ జాతికి ఇచ్చారు రైట్ సోదరులు.

కలలు కనటమే కాదు... ఆ కలల సాకారానికై స్ఫూర్తి, శ్రమే కాకుండా డబ్బు కావాలి. దీన్ని రైట్ సోదరులకి వారి సైకిళ్ల వ్యాపారం చేకూర్చింది. కలలు కనే ప్రతి వారికి వాటి సాకారానికై కొన్ని సూత్రాలు పద్ధతులు ఎంతో అవసరం. గత వారాల్లో నిర్మా కర్సన్ భాయ్, సర్ సివి రామన్, ధీరూభాయ్, ముద్రా గురించి ముచ్చటించుకొన్నాం. వీరి విజయాలు, ఇతరుల విజయాలను పరిశీలించగా, వీరందరూ క్రింద పొందుపర్చిన అన్ని పద్ధతులను కాని లేక వాటిలో కొన్నింటినైనా గాని అమలు పరచి వారివారి కలలను సాధించగలిగారు.

పెద్దపెద్ద కలలు కనటం
ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులుగా మారటం
పాజిటివ్ థృక్పధం అలవరుచుకోవటం
అసాధ్యాలంటూ ఏదీ ఉండవనే నమ్మకం పెంచుకోవటం
పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు అనే ధృడ విశ్వాసం
కలలను, గమ్యాలను విడనాడక పోవటం
సహచరులపై ధృడమైన నమ్మకం, విశ్వాసాలను పెంచుకోవటం
సవాళ్లను ఆహ్వానించటం
సర్వేజనా సుఖినోభవంతుపై నమ్మకం
ఇది ఒకే జీవితం, ఒకే అవకాశం అనే థృక్పధం
-ఎజి కృష్ణమూర్తి

Tuesday, September 28, 2010

ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్ * ప్రైవేటు టీచర్.కామ్

గూగుల్ కూడా గుర్తించలేని ఒక మారుమూల తండాలో పుట్టాడు సోమేశ్వర్ వంశీ నాయక్. అయితే ఇప్పుడు గూగుల్‌లో అతని గురించి ఒక్కసారి వెతికి చూడండి.. మీకు కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అసలు వంశీ గురించి మేమెందుకు తెలుసుకోవాలి అంటారా? ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు మరెవరికీ ఎదురుకాకూడదని ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దాని గురించే ఈ కథనం.

మీరు టీచర్‌గా పనిచేస్తున్నారా? లేదంటే పనిచేయాలన్న ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాఠశాలలో కాకుండా మరో మంచిస్కూల్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది. అదే ఎడ్యునెస్ట్ (www.edunest.org). కేవలం టీచర్ల కోసమే రూపొందించిన వెబ్ పోర ్టల్ ఇది. దీన్ని డిజైన్ చేసింది పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదు, నిన్న మొన్ననే ఎంఏ పూర్తి చేసిన ఒక సాధారణ టీచర్. అసలు అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో చదవండి.

ఓ దసరా పండగ మధ్యాహ్నం.. ట్యాంక్‌బండ్‌పై ఒంటరిగా బెంచీ మీద కూర్చుని ఇలా డైరీ రాసుకుంటున్నాడు వంశీ నాయక్. "అందరూ కొత్తబట్టలు వేసుకుని, పండగ జరుపుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ నా పరిస్థితేంటి ఇలా ఉంది? ఆకలిగా ఉంది. జేబులో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలి? చచ్చిపోవాలనిపిస్తోంది. ఛీ... నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? లేదు. పిరికివాడిలా చావకూడదు. ఎలాగైనా చదువుకోవాలి. ఏదైనా సాధించాలి'' అనుకున్నాడు.

తండాలో పుట్టి...
నిజానికి వంశీకి అమ్మానాన్నా, ఇద్దరు అక్కలూ ఉన్నారు. అతనిది మహబూబ్‌నగర్ జిల్లాలోని బుద్ధారం ధర్మ తండా. చాలా పేద కుటుంబం. కుటుంబంలో అందరూ ఏదో ఒక పనిచేస్తేనే కడుపునిండేది. అలాంటి పరిస్థితుల్లో వంశీని చదివించడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయింది. వంశీ అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో అక్కలతో కలిసి కూలీ పనికి వెళ్లేవాడు. రోజుకు పది రూపాయలు వచ్చేవి.

అలా కూడబెట్టుకున్న డబ్బులు, అక్కావాళ్లు ఇచ్చిన ఇంకొన్ని డబ్బులు మూటకట్టుకుని ఇంట్లోంచి పారిపోయాడు. వనపర్తిలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోసాగాడు. వాళ్ల అమ్మనాన్న కూడా 'పోనీ చదువుకోనీలే' అని వదిలేశారు. సెలవుల్లో ఇంటికి వెళ్లి వస్తుండేవాడు కానీ ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలా రెండు మూడేళ్లు గడిచింది.

పేపర్ బాయ్‌గా..
ఏడో తరగతి చదువుతున్నప్పుడు సాయంత్రం పూట వంశీ ఒక ఎస్టీడీ బూత్‌లో పనిచేసేవాడు. నెలకు వంద రూపాయలు వచ్చేవి. అవి కూడా సరిపోయేవి కావు. 'ఇంకా ఏదైౖనా పని ఉంటే చెప్పండి' అని ఎస్టీడీ యజమానిని అడిగితే 'పేపర్ బాయ్‌గా చేస్తావా? 150 రూపాయలిస్తాను' అన్నాడు.

వంశీ పేపర్ వేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ పని చేయాలంటే సైకిల్ ఉండాలి. ఆ యజమాని సైకిల్ తానే ఇస్తానన్నాడు కానీ దానికి అద్దె నెలకు 75 రూపాయలు. అలా ఉదయం, సాయంత్రం కష్టపడితే వచ్చే 175 రూపాయలతో వంశీ చదువుకునేవాడు.

ఆలోచన పుట్టిందిలా..
ఇంటర్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'మళ్లీ బడి' కార్యక్రమంలో చేరాడు. పాటలు పాడుతూ, పాఠాలు చెబుతూ గ్రామాల్లో తిరిగేవాడు. ఆ సందర్భంలోనే ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి కలిగింది. తర్వాత వనపర్తిలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌లోని జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుండేవాడు.

ప్రయివేటు ట్యూషన్లు చెబుతూ ఎంఏ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు వనపర్తిలోని బ్రిలియంట్ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు, సహోద్యోగులు ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టిన ఆలోచనే ఎడ్యునెస్ట్.

ఎడ్యునెస్ట్ గురించి...
ఈ రోజుల్లో ఒక వెబ్‌సైట్ రూపొందించడం పెద్ద కష్టం ఏం కాదు. చాలా తక్కువ ఖర్చులో కూడా తయారుచేయొచ్చు. కానీ వంశీ తయారు చేసుకున్న కాన్సెప్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం చాలా జిబి స్పేస్ కావాలి. ఒకరు మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారనుకుందాం.

వేరే స్కూల్లో అదే పోస్ట్, ఎక్కువ జీతంతో ఖాళీ ఉందనుకుందాం. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే అవి వెంటనే ఆ టీచర్‌కు ఎస్ఎమ్ఎస్ రూపంలో వెళ్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారాన్ని కేవలం ఇ-మెయిల్స్ ద్వారానే అందిస్తున్నాయి మిగతా వెబ్‌సైట్లు. అందరూ ప్రతిరోజూ ఇంటర్‌నెట్ చూసే అవకాశం ఉండదు కాబట్టే ఈ ఎస్ఎమ్ఎస్ పద్ధతిని ఎంచుకున్నానంటాడు వంశీ.

ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు అతనికి 50 వేల రూపాయలు ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని తనకు నెల నెల వచ్చే జీతం నుంచి వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు వంశీ. అధికారికంగా వెబ్‌సైట్‌ని ప్రారంభించేందుకు గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 
జూ బీరెడ్డి నగేష్ రెడ్డి

Friday, September 24, 2010

'సెమీ ఆటోమేటిక్ చపాతీ' ఆలోచన

రెడీమేడ్ చపాతీ

నలుగురున్న ఇంట్లో చపాతీలను, పూరీలను తయారుచే యాలంటే పెద్ద పని. పిండి కలపాలి, వత్తాలి. ఆపై కాల్చాలి. పూరీలయితే వేయించాలి. పెద్దపెద్ద హోటళ్లలో, క్యాంటీన్లలో ఈ పని మరింత భారం కదా.
ఏదో ఒక యంత్రం పిండి కలిపి, చపాతీ, పూరీలను చేసి కాల్చడానికి రెడీగా అందిస్తే..? కలో, కోరికో కాదు. ఇప్పుడు అలాంటి యంత్రం ఉంది. వాటికి భారీ మార్కెట్ కూడా ఉందని చెప్పారు హైదరాబాద్‌కి చెందిన ప్రభాకర్. ఒక కొత్త తరహా ఆలోచనతో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన మార్గం ఇంకొందరు ఔత్సాహికులు అనుసరించడానికి అనువుగా ఉంది.

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఒక మలుపులో 'ఇక్కడ వండుటకు సిద్ధంగా ఉన్న చపాతీలు, పూరీలు, జొన్నరొట్టెలు లభిస్తాయి' అనే ప్రకటన కనిపిస్తుంది. ఒకటి రెండు రూపాయలకు మించని ధర. పరిశుభ్రమైన వాతావరణం

. వెళ్లినవాళ్లు కొన్నయినా కొనుక్కురాకుండా ఉండలేరు, ఒకసారి కొన్నవాళ్లు మరోసారి వెళ్లకుండా అసలే ఉండలేరు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగినులు, బ్రహ్మచారులకే కాదు, గృహిణులకు కూడా ప్రభాకర్ ప్రారంభించిన చపాతీ యంత్రం ఒక ఊరటలాగా కనిపిస్తోంది. అందువల్లే ఏడాది క్రితం ప్రారంభమైన ఆయన వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది.

ఆలోచన ఎలా?
ఒక మద్యం తయారీ సంస్థ సేల్స్ రంగంలో 27 సంవత్సరాలు పనిచేసిన ప్రభాకర్ ఆ పనితో విసిగిపోయారు. ఒత్తిడివల్ల రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలూ చుట్టుముట్టాయి. ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాడు. దేశమంతా తిరిగిన అనుభవం, కొత్తగా చెయ్యాలన్న తపన.. వీటికి ఇంటర్నెట్ పరిజ్ఞానం జోడిస్తే 'సెమీ ఆటోమేటిక్ చపాతీ' ఆలోచన వచ్చింది ఆయనకు. ఆ యంత్రాన్ని కొనుగోలు చేసి, తన ఆలోచనకు తగినట్టు దానిలో మార్పులుచేర్పులు చేశారు.

ఎలా తయారవుతాయి?
గోధుమపిండి, నూనె, ఉప్పు, నీటిని ఒకేసారి యంత్రంలో వెయ్యాలి. సరిగ్గా ఏడు నిమిషాల్లో పిండి కలపడం పూర్తవుతుంది. దాన్ని సిలిండర్‌లో పెట్టి హైడ్రాలిక్ ప్రెషర్‌ను ఉపయోగించినప్పుడు చపాతీలు, పూరీలు కావాల్సిన పరిమాణంలో వచ్చేస్తాయి. ఈ క్రమంలో తేమ తీసేస్తారు కనుక అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. అందువల్లే అవి ఫ్రిజ్‌లో ఉంచితే ఆరు రోజుల వరకూ పాడవకుండా ఉంటాయి.

ఇలా తయారయిన వాటిని ఇంట్లో నేరుగా వండుకోవడమే. ప్రస్తుతానికి ప్రభాకర్ వీటిని సామాన్య వినియోగదారులతో పాటు, కేటరింగ్ సంస్థలు, కర్రీపాయింట్లు, హాస్టళ్లు, సూపర్‌మార్కెట్లకు పంపిణీ చేస్తున్నారు. కిందటేడు కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు అక్కడ పంచడానికి దాతలకు తగ్గింపు ధరల్లో దాదాపు పద్దెనిమిదివేల చపాతీలను అందజేశారు.

కిటుకులు తెలియాలి..
ప్రభాకర్ యంత్రం గంటకు నాలుగువందల చపాతీలను తయారుచెయ్యగలదు. కాని ఇప్పటికైతే రోజుకు రెండువేల చపాతీలు, పూరీలు అమ్ముడుపోతున్నాయి. దీనిమీద ప్రభాకర్ కాకుండా ముగ్గురు మహిళలు, ఒక సూపర్ వైజర్ ఉపాధి పొందుతున్నారు. 'పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి, రొట్టెలమ్ముకోవడం ఏమిట'ని ప్రభాకర్‌ను చాలామందే నిరుత్సాహపరిచారట.

వ్యాపారం ప్రారంభించిన కొత్తలో సరిగా కుదరక చాలా పిండి వృధా అయిపోయి నష్టం వచ్చేదట. నాలుగయిదు నెలలయితేగానీ ఆ పనిలో చేయి తిరగలేదు. 'చపాతీ, పూరీల పిండి సరిగా కలపడం అనుభవాన్ని బట్టే ఉంటుంది. దానికితోడు వాతావరణాన్ని అనుసరించి కూడా ఉంటుంది.

హైదరాబాద్ వంటి పొడి వాతావరణంలో పాళ్లు కలిపినట్టు విశాఖపట్నం వంటి సముద్రతీర ప్రాంతాల్లో కలపడానికి కుదరదు.. అది చెయ్యగాచెయ్యగా వస్తుంది' అని చెబుతున్న ప్రభాకర్ ప్రభుత్వ సంస్థ అయిన 'డైరెక్టరేట్ ఆఫ్ షోర్‌గమ్'తో (షోర్‌గమ్ అంటే జొన్నలు) ఒప్పందం కుదుర్చుకున్నారు.

మధుమేహవ్యాధిగ్రస్తుల కోసం ఆ సంస్థ రాగులు, జొన్నలను కలిపి తయారు చేసిన పిండిని ప్రభాకర్‌కు ఇస్తే, ఆయన దాంతో రోజుకు ఐదొందల చపాతీలను తయారు చేస్తున్నారు. ఆ సంస్థే 'వేగన్' అనే పేరుతో వాటిని సూపర్‌మార్కెట్లలో అమ్ముతోంది. సుమారు ఆరులక్షల రూపాయల దాకా పెట్టుబడి అవసరమయ్యే ఈ వ్యాపారాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో ప్రారంభించాలనుకునే ఉత్సాహం ఉన్నవారికి తాను స్వయంగా శిక్షణనిస్తానంటున్నారు ప్రభాకర్.

ఈ మాత్రం ఊతమిస్తే ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఇక ఆగుతారా? ఇకముందు చాలాచోట్ల రెడీ టు కుక్ చపాతీలు, పూరీలూ దర్శనమిస్తాయేమో!   (ప్రభాకర్ సెల్ నెంబర్ : 98480 72133)
- అరుణ పప్పు

Thursday, September 16, 2010

పశువులకాపరి నుంచి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దాకా.....

"ఊర్లో పశువులు కాసే వాళ్లకు అడవే ప్రపంచం. ఊర్లో ఏం జరిగినా మాకు తెలిసేది కాదు. ఎవ్వరితోనూ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. పొద్దున్నే మేతకు పశువుల్ని తీసుకెళ్లడం, సాయంత్రం ఇంటికొచ్చాక తిని పడుకోవడం. నాతోటి పిల్లలందరూ బడికి వెళుతుంటే చాలా బాధ కలిగేది. ఏం చేయాలో దిక్కుతోచేది కాదు. మా అమ్మానాన్నలకు అక్షరం ముక్క రాదు. చదువంటే వారికి ఏమీ తెలీదు.

కృష్ణా జిల్లా విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎ.కొండూరు మండలంలో కంభంపాడు అనే గిరిజన తండా మాది. తల్లిదండ్రులు చిట్టిపోతుల నాగయ్య, ముత్తమ్మలు. పండుగలప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో కొర్రన్నం తినేవాళ్లం. పూట గడవాలంటే కూలికి వెళ్లాలి. ఉన్న కాస్తోకూస్తో పొలంలో పండినవే తిండిగింజలు. ఇలాంటి కుటుంబంలో పుట్టిన నాకు చదువుకునే భాగ్యం పదకొండేళ్ల వయస్సులో కలిగింది.

అమ్మ చేర్పించింది..
విస్సన్నపేటకు చెందిన కోటేశ్వరరావు అనే విద్యార్థి రోజూ మా ఇంటిదగ్గరికి స్నానానికి వచ్చేవాడు. ఒకరోజు వాణ్ణి చూసి 'ఒరే నువ్వు కూడా ఎలాగైనా చదువుకోవాలి..' అంటూ అమ్మ గట్టిగా చెప్పింది. వెంటనే తీసికెళ్లి బళ్లో ఒకటో తరగతిలో చేర్చింది. తర్వాతి సంవత్సరం 2, 3, 4 తరగతులు ఒకేసారి పూర్తి చేశాను. మా ఊర్లోనే ఉన్న మూర్తి మాస్టారు ట్యూషన్ చెప్పి, నన్ను బాగా ప్రోత్సహించారు.

ఆరో తరగతికి వచ్చేలోగా తోటి విద్యార్థులతో సమానంగా చదివేవాణ్ణి. ఏడోతరగతిలో పబ్లిక్ పరీక్షరాసి జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచాను. గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకోవడం గొప్ప అనుభవం. అప్పటికే నా చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు. వాళ్లను చూసి నాలో పట్టుదల పెరిగింది. పదోతరగతి అయ్యాక ఇంటర్‌కు ఏపీ రెసిడెన్షియల్‌లో సీటు సంపాదించాలనుకున్నాను. రిజల్టు అలాగే వచ్చింది. పులిగడ్డ ఏపీ రెసిడెన్షియల్‌లో ఇంటర్‌లో చేరి 83 శాతం మార్కులతో పాసయ్యాను.

ఆంధ్రాయూనివర్శిటీలో ఎంటెక్ పూర్తిచేసేసరికి, మా అమ్మానాన్న నా కోసం 25 పశువుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. మాకున్న ఒకేఒక్క ఆధారం పశువులే. నా చదువుకు అవసరమైనప్పుడల్లా కొన్ని పశువులను అమ్మేసి నాకు డబ్బులు పంపించేవారు. నా కష్టానికి ఫలితం అన్నట్లు పాండిచ్చేరిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సైంటిస్టుగా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఏడాదిపాటు చేశాను.

పనికొచ్చే పరిశోధనతో...
ఉద్యోగం ఏదైనా సమాజం కోసం పనికొచ్చే పరిశోధన చేయాలన్న లక్ష్యం రోజురోజుకూ బలపడింది. అదే సమయంలో కాకినాడలోని జెఎన్‌టియులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. పీహెచ్‌డీ చేసే సమయంలోనే 'హ్యూమన్ ఫేస్ రికగ్నైజేషన్' సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశా. యూనివర్శిటీలో చేరాక అదే కొనసాగించాను. ఒక వ్యక్తి లక్షమందిలో ఉన్నా గుర్తుపట్టే సాఫ్ట్‌వేర్ అది.

చిన్న ఫోటో ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్‌తో సులువుగా, నిమిషాల్లో గుర్తుపట్టవచ్చు. డీఆర్‌డీవో సైంటిస్టుల సహాయం తీసుకొని దీన్ని రూపొందించాను. ఈ సాఫ్ట్‌వేర్ సామాజిక భద్రతకు పనికొస్తుంది. నేరస్తులను పట్టుకొనేందుకు తోడ్పడుతుంది. వాయిస్ రికగ్నైజేషన్, స్పీచ్ రికగ్నైజేషన్ కూడా దీనికి జోడిస్తున్నాం. ఇప్పటికే పోలీసులు ఈ సాఫ్ట్‌వేర్‌ను వారికి ఇవ్వమని అడిగారు. పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తాం.

ప్రస్తుతం నాకు సహాయపడిన డీఆర్‌డీవో సైంటిస్టులు నా దగ్గరే పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇప్పుడు కాకినాడ జెఎన్‌టియులోనే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా పనిచేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు 35 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారు. 'పదకొండేళ్ల వయసులో బడికి వెళ్లి ఏం సాధించగలనని..' భావించి ఉంటే ఇప్పటికీ పశువులకాపరిగానే అడవులు పట్టుకు తిరుగుతుండేవాణ్ణి.

- వై.రమేష్‌బాబు

Wednesday, November 12, 2008