Showing posts with label life. Show all posts
Showing posts with label life. Show all posts

Tuesday, April 17, 2012

What Women Want ?

To All Innocent Women....... 
That's all Women want......

...Plain looking husband



...normal simple ring



...small wedding party



...honeymoon at any place



...small house for the kids to run around



...lovely children



...husband is a family man



...but works hard



...small car for shopping



...another car for kids



...some collections



...shoes for each occasion



...some nice outfits



...a bit of cosmetics



...a bit of makeup



...overseas trip once a year



...more often on domestic trips



...dinners



...Presents occasionally



...finally, some securities.



That's it... do you think its too much ?? WOMEN ARE NOT DEMANDING AT ALL!!!!!

Tuesday, February 22, 2011

గొప్ప ధ్రిల్లింగ్‌... హార్స్‌ రైడింగ్‌

ట్రెక్కింగ్‌, బైక్‌రైడింగ్‌...లాంటి సాహసాలను అలవాటు కలిగిన వారు ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇలాంటి వాటిలో ఎంతో థ్రిల్‌, ఆనందం ఉంటుందనేది వీరి అభిప్రాయం. ఈ కోవలోకే ప్రస్తుతం ప్రధాన నగరాల్లో నివసించే యువతలో కొత్తగా గుర్రపుస్వారీ నేర్చుకోవాలనే కోరిక కలుగుతోంది. దాంతో వీరి ఆసక్తి తగ్గట్టుగా నగరాలలో పలుచోట్ల హార్స్‌రైడింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు వెలిశాయి. గుర్రపుస్వారీ నేర్చుకునేందుకు యువత అధికసంఖ్యలో వస్తుండడం విశేషం. అయితే ఇది కారు, బైక్‌ నడిపినంత సులభం కాదు. ఎంతో జాగ్రత్తతో, మెళకువతో కూడుకున్నదని అంటున్నారు అనుభవజ్ఞులు. తగు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారవుతారని వారు సలహాలిస్తున్నారు.

horse-ridingగుర్రంపై ఊరేగుతూ యువరాజులా తిరగానే ఉబలాటం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఉంటుంది. కుర్రకారుకైతే ఈ ఆసక్తి మరీ ఎక్కువనే చెప్పాలి. వారు ఎప్పుడు ఎలాంటి వాటిపై ఆస క్తి కనబరుస్తారో తెలుసుకోవడం చాలా కష్టం. యూత్‌లో ప్రస్తుతం హార్స్‌ రైడింగ్‌ ఓ హాట్‌ టాపిక్‌. తాము గుర్రపుస్వారీని హాబీగా చేసుకోవాలని వారు తహతహలాడుతున్నారు.

ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది...
‘నాకు చిన్నప్పటినుంచి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. అందులో ఉండే థ్రిల్లే నన్ను వాటివైపు ఆకర్షితుడిని చేసింది. ఆ ఇష్టం నాతోపాటే పెరిగి నా కు హాబీగా మారింది. నాకు బైకర్స్‌ క్లబ్‌లో మెంబర్‌ షిప్‌కూడా ఉంది. ప్రస్తుతం నేను హార్స్‌రైడింగ్‌ నేర్చు కోవాలనుకుంటున్నాను. నాతో పాటు నా స్నేహితు లందరూ కూడా శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడిదే లేటెస్ట్‌ ట్రెండ్‌. ఇందుకోసం పేరు పొందిన శిక్షకుల వద్ద ట్రైనింగ్‌ కోసం చేరాము’ అని రాజీవ్‌ తెలిపాడు.

ఖాళీగా ఉండాలి...
horsesగుర్రపు స్వారీ చేసే కనీసం అరగంట ముందు వర కు కడుపు ఖాళీగా ఉండాలి. కడుపు నిండా తిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వారీ చేయకూడదు. గుర్రపు స్వారీ అంటేనే శరీరం కుదుపులకు గురౌతుంది. నిండు కడుపుతో స్వారీ చేస్తే వాంతులు, ఆయాసం రావడం ఖాయం. గుర్రపు స్వారీ చేసే సమయంలో పెద్దగా అరవడం, కేకలేయడం సరి కాదు. ఇలా చే స్తే గుర్రం గాబారా పడి మన అదుపు తప్పి పోతుం ది. గుర్రంపై స్వారీ చేసే వారికేగాక పక్కన నిలబడి చూసే వారికి కూడా ఇది వర్తిస్తుంది.

విశ్రాంతినివ్వాలి...

గుర్రపు స్వారీకి ఉదయం, సాయంత్రం సమయా లు అనుకూలంగా ఉంటాయి. ఎండ దెబ్బ తగలకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు గుర్రం దౌడు తీసే సమయంలో త్వరగా అలసిపోకుండా ఉంటుంది. చల్లటి త్రాగే నీటిని వెంట తీసుకెళ్లడం మరిచిపోకండి. దూర ప్రదేశాలకు గుర్రం పై వెళ్లే అలవాటు ఉన్న వారికి ఇది ఎంతో మేలుచేస్తుంది. సన్‌స్క్రీన్‌ లోషన్లు, గాగుల్స్‌ను వాడడం మంచిది. సుదూర ప్రాంతా ల్లో గుర్రం పైన వెళ్లే వారు ఏకధాటిగా గుర్రాన్ని దౌడు తీయించకుం డా మధ్య మధ్యలో దానికి విశ్రాంతినివ్వాలి. గుర్రం మీకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనదనే విషయాన్ని విస్మరించకండి. దాన్ని లొంగదీసుకోవడానికి రెచ్చగొట్టడం, కళ్లాన్ని అదేపనిగా లాగడం చేయకూడదు. కళ్లాన్ని రెండు చేతులతో పట్టుకొని, కాళ్లను ఫుట్‌రెస్ట్‌లో జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాతే రైడింగ్‌కు బయలుదేరాలి.

సరదాగా ఉంటుంది...

‘ఎంతో ఆసక్తిగా గుర్రపు స్వారీనేర్చుకున్నాను. గుర్రపు స్వారీ నేర్చుకోవడమంటే అంత సులువు కాదు. పట్టుదలతో కష్టపడి గుర్రపుస్వారీలో శిక్షణ పొందాను. కొండలు, గుట్టల్లో గుర్రాన్ని దౌడు తీయిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. సరదాగా సాగే ఈ ప్రయాణంలో అలసట అనిపించదు. కానీ గుర్రాన్ని అదుపులో ఉంచుకొని ప్రయాణం చేయాలి. లేదంటే అదుపు తప్పిన గుర్రం కింద పడేస్తే ప్రమాదమే’ అని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రకాష్‌ తెలిపారు.

గాల్లో తేలినట్టుగా...
‘గుర్రపు స్వారీ ఎంతో హాయిగా అనిపిస్తుంది. గుర్రాన్ని వేగంగా దౌ డు తీయిస్తుంటే గాలిలో తేలినట్టుంటుంది. గుర్రపు స్వారీ చేసే వారు తమ బరువు తక్కువగా ఉండే టట్టు చూసుకోవాలి. తక్కువ బరువు ఉన్న వారే వేగం గా గుర్రాన్ని పరిగెత్తించగలరు. ఇక కొన్ని గుర్రాలైతే ఎవరిని పడితే వారిని ఎక్కించుకోవు. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని శ్రేయా తెలిపారు.మొత్తం మీద ఆధునిక యువతకు పురాతన సవారీ మీద మోజు కలగడం విచిత్రమే!

ఒక్కరే సురక్షితం...
గుర్రపు స్వారీ నేర్చుకునేటప్పుడు, స్వారీ చేసేటప్పుడు కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని ‚అంటున్నారు అనుభవజ్ఞులైన శిక్ష కులు. ‘స్వారీ చేయడానికి గుర్రాన్ని సమీపించే సమయంలో వెనక వైపు నుండి వెళ్లకండి. గుర్రానికి ముందు లేదా ఎడమవైపు నుండి వెళ్తే గుర్రం అనవసరంగా గాబరా పడకుండా ఉంటుంది. గుర్రంపై ఒక్కరు స్వారీ చేస్తేనే సురక్షితం. అప్పుడప్పుడూ పెద్దవారు చిన్నపిల్లల్ని గుర్రంపై కూర్చోబెట్టుకుని స్వారీ చేస్తుంటారు. ఇది ప్రమాదకరం. చిన్న పిల్లలు గుర్రపు స్వారీ చేసేప్పుడు ఓ ట్రైనర్‌ను వెంట పెట్టి ప్రతిక్షణం పరిశీలిస్తూ ఉండాలి. గుర్రపు పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు అప్పగించకండి. వాటిని ట్రైనర్‌ లేదంటే మీ వద్దే ఉం చుకుంటే గుర్రాన్ని అదుపులో ఉంచడానికి వీలవుతుంది’ అని టోలిచౌకీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హార్స్‌ రైడింగ్‌లో గుర్రపు స్వారీ శిక్షకుడు మహ్మద్‌ అజీజ్‌ తెలిపారు.

అంతసులభం కాదు...
horse-lady‘గుర్రపుస్వారీ అంటే అంత తేలికైన విషయం కాదు. ఇంజన్‌తో నడిచే వాహనాలను నడిపినంత సులభంకాదు. ఈ విషయాన్ని హార్స్‌రైడింగ్‌‌‌ నేర్చుకునేవారు తప్పకుండా గుర్తించుకోవాలి. అంతే కాకుండా మనం వేసుకునే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి. గుర్రపు స్వారీ చేసే టప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోవద్దు. చర్మానికి హత్తుకుని ఉండేలా పొడవాటి దుస్తుల్ని వేసుకోవాలి. లింగ బేధం లేకుండా ప్రతిఒక్కరూ పాంట్స్‌ వేసుకుంటే ఉత్తమం.

అవీ తేలిక రంగులో ఉండాలి. మరికొందరు గుర్రానికి నూలు బట్టలు, ఇతర దుస్తుల్ని చుడుతుంటారు. ఇవి పరిగెత్తే సమయంలో కాళ్లలోకి వచ్చి చిక్కుకోవడంతో పడిపోవడం ఖాయం. కనీసం ఒకటి నుండి రెండు అంగుళాల ఎత్తున్న షూను వేసుకోండి. స్వారీ చేసే సమయంలో గడ్డి, ముళ్లు వంటివి కాళ్లకు తగలకుండా ఇవి కాపాడుతాయి. ఇంకా ఫుట్‌రెస్ట్‌లో చక్కగా ఇమిడిపోతుంది. అన్నికంటే ముఖ్యమైనది ముఖానికి, ప్రమాదవశాత్తూ కింద పడ్డా తలకు గాయాలవకుండా ఇది కాపాడుతుంది. హెల్మెట్‌కు బెల్ట్‌ ఉంటే మరీ మంచిది’ అని గండిపేట్‌ వద్ద గల ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హార్స్‌ రైడింగ్‌ లోని గుర్ర పుస్వారీ శికుడు నగేష్‌ వివరించారు.
- ఎస్‌.అనిల్‌ కుమార్‌

Tuesday, January 11, 2011

ఆ పిలుపును అందుకున్న వాళ్లలో నేనొకడ్ని * ' నెల్సన్ మండేలా : కన్వర్జేషన్స్ విత్ మైసెల్ఫ్'

చాలా ఏళ్లుగా మండేలాను నేను ఆరాధనా భావంతో చూస్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో స్పష్టంగా కనిపించే నిరాశా, నిస్పృహలకు ధీటుగా నిలిచి గెలిచిన జీవితం ఆయనది. ఒక ఖైదీ స్వేచ్ఛాజీవి అయ్యాడు.
చరిత్రను ప్రభావితం చేసి మార్చగలిగే నేతలు ఈ ప్రపంచంలో అతి కొద్దిమంది. వారి జీవితాలు లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. అలాంటి వారిలో మండేలా ఒకరు. జాత్యహంకార ధోరణికి వ్యతిరేకంగా మండేలా చేసిన పోరాటం- దక్షిణాఫ్రికా దేశ చరిత్రనే మార్చేసింది. ప్రపంచంలోని కోట్లాది నల్లజాతీయులకు స్ఫూర్తిగా నిలిచింది. మండేలా జైలులో ఉన్న రోజులలో రాసిన ఉత్తరాలు, స్నేహితులతో జరిపిన సంభాషణలను గుదిగుచ్చి అందించిన పుస్తకమే- 'నెల్సన్ మండేలా : కన్వర్జేషన్స్ విత్ మైసెల్ఫ్'. దీనిలోని కొన్ని భాగాలను మీకు అందిస్తున్నాం..
(అమెరికా అధ్యక్షుడు ఒబామా రాసిన ముందుమాట నుంచి..)
"ప్రపంచంలో అనేక మంది మాదిరిగానే, మండేలా రాబిన్ ద్వీపంలోని జైలులో ఉన్నప్పుడు దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. మనలో చాలా మందికి మండేలా ఒక వ్యక్తి కాదు. దక్షిణాఫ్రికాలో న్యాయం కోసం, సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రతీక. ఆయన త్యాగం- మానవాభివృద్ధి కోసం ఏం చేయగలరో అది చేయండని ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చిన ఒక పిలుపు.. ఆ పిలుపును అందుకున్నవారిలో నేను ఒకడిని. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో- దక్షిణాఫ్రికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నేను పాల్గొన్నాను.

రాజకీయంగా నా తొలి అడుగు అదే. జాత్యహంకార బాధితులు ప్రతి రోజూ అనుభవించే బాధలతో పోలిస్తే వ్యక్తిగతంగా నాకు ఎదురయిన అడ్డంకులు చెప్పుకోదగ్గవి కావు. ఒక జైలు గదిలో అంత కాలం మగ్గుతూ, ధైర్యం కోల్పోకుండా పోరాడటం కేవలం మండేలాకు మాత్రమే సాధ్యం. అయితే ఆయన జీవితం నాకో దారి చూపించింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా సత్యం వైపే నిలబడటం నేర్పింది. తాను తీసుకున్న నిర్ణయాల ద్వారా- ఈ ప్రపంచం ఎలా ఉందో అలాగే దానిని అంగీకరించాల్సిన అవసరం లేదని- మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగ మార్చవచ్చని మండేలా నిరూపించాడు.

చాలా ఏళ్లుగా మండేలాను నేను ఆరాధనా భావంతో చూస్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో స్పష్టంగా కనిపించే నిరాశా, నిస్పృహలకు ధీటుగా నిలిచి గెలిచిన జీవితం ఆయనది. ఒక ఖైదీ స్వేచ్ఛాజీవి అయ్యాడు. స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తి అందరినీ కలుపుకుపోవాలని వాదించాడు. ఒక పార్టీ నేత దేశాధ్యక్షుడయ్యాడు. పదవి నుంచి వైదొలగిన తర్వాత కూడా స్వేచ్ఛ, సమానావకాశాలు, ఆత్మగౌరవం కోసం కూడా పోరాడుతున్నాడు. ఈ ప్రపంచాన్ని, తాను పుట్టిన దేశాన్ని మార్చటానికి ఆయన ఎంతో చేశాడు. మండేలా లేని కొన్ని దశాబ్దాలను మనం ఊహించలేం.

కాలిఫోర్నియాలో విద్యార్థిగా దక్షిణాఫ్రికా జాత్యాహంకారంపై ఉద్యమించిన నేను.. అప్పటి నుంచి రెండు దశాబ్దాల తర్వాత రాబిన్ ద్వీపంలో మండేలా జైలు గదిలో నిలబడ్డాను. అంతకు ముందే నేను సెనేటర్‌గా ఎన్నికయ్యాను. అప్పటికే- మండేలా జైలుగది త్యాగానికి ఒక చిహ్నంగా మారిపోయింది. ఆ గదిలో నిలబడి- మండేలా ఖైదీ 466-44 గా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదా అని ఊహించుకోవటానికి ప్రయత్నించాను. ఆ సమయంలో ఆయన విజయం ఒక అనిశ్చితి మాత్రమే. చరిత్రను మార్చిన మండేలా ఆ జైలు గదిలో ఎలా ఉండేవాడో తల్చుకోవడానికి ప్రయత్నించా.''

...ఈ పుస్తకంలో మండేలా తన జీవితంలో ఏ విషయాన్నీ దాచటానికి ప్రయత్నించలేదు. తాను పూర్తి ఫర్‌ఫెక్ట్ కాదని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు. మనలాగానే ఆయనలో కూడా కొన్ని తప్పులున్నాయి. అయితే ఆ తప్పులు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. మనకు మనం నిజాయితీగా ఉంటే- జీవితంలో చిన్నవో, పెద్దవో- సంఘర్షణలు ఉంటాయని తెలుసు. ఈ సంఘర్షణల ఫలితం ఎలా ఉంటుందో తెలియనప్పుడు కూడా పోరాడటం మండేలా మనకు నేర్పుతాడు. ఈ పుస్తకంలో ఉన్న కథ- మండేలా జీవితం మనకు చెప్పే కథ- ఎటువంటి తప్పులు చేయని వ్యక్తిది కాదు.

విజయం తప్పనిసరిగా వరిస్తుందని భావించే వ్యక్తిది కాదు. తాను నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని ఫణంగా పెట్టిన వ్యక్తి కథ ఇది. ఈ ప్రపంచాన్ని అందరికి నివాసయోగ్యంగా చేయాలని ప్రయత్నించిన వ్యక్తి కథ ఇది. అదే మనకు మండేలా ఇచ్చే సందేశం. మార్పు అసాధ్యం అనిపించే రోజులు మనందరి జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి. మన ప్రత్యర్థులు, మనలో ఉండే బలహీనతలు- బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి సులభమైన మార్గాలను అవలంభించాలని ఊరిస్తూ ఉంటారు. మండేలా జీవితంలో కూడా అలాంటి రోజులు ఉన్నాయి. రాబిన్ ద్వీపంలోని జైలు గదిలో ఉదయాన్నే కొద్దిపాటి కాంతి కనిపించగానే- తాను చేస్తున్న త్యాగం వ్యర్థం కాదు అనిపించేలా ప్రకాశవంతమైన భవిష్యత్తు మండేలాకు కనిపించేది. ప్రతీకారం తీర్చుకొనే అవకాశం వచ్చినప్పుడు కూడా సర్దుబాటు ధోరణినే ఆయన అవలంభించాడు..''

జైలు గదిలో అంతర్ముఖుడు
మన గురించి మనం తెలుసుకోవటానికి, అంతర్ముఖులమై మన ఆలోచనలను, మన భావనలను వాస్తవిక అంచనా వేసుకోవటానికి జైలుగది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. సామాజికంగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాం, మన పరపతి, పరువు ప్రతిష్టలు, సంపద, విద్యార్హతలు- మొదలైన అంశాల ఆధారంగా ఒక వ్యక్తిగా ఎంత అభివృద్ధి చెందామనే విషయాన్ని మనం మదింపు వేసుకుంటూ ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి విజయాన్ని అంచనా వేయటానికి ఇవన్నీ అవసరమైనవే. వీటిని పొందటానికి వ్యక్తుల ఆతృత, వారు పడే తపన కూడా అర్థం చేసుకోదగినవే.

అయితే ఒక మనిషిగా మనం ఎంత ఎదిగాం అనే విషయాన్ని అంచనా వేయాలంటే మాత్రం- మన లోపలి విషయాలను మదింపు వేయాల్సిందే. నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, నిగర్వం, వితరణ, నిరహంకారం, సేవ- మొదలైన లక్షణాలన్నీ అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితానికి ఇవే పునాదులు. తీవ్రమైన అంతర్మథనం జరిగి- మనని మనం తెలుసుకొని, మన బలహీనతలను కనుగొని, మన తప్పులను తెలుసుకున్నప్పుడే పై లక్షణాలను పెంపొందించుకోగలం. ఒక వేళ ఇవేవీ గుర్తించలేదనుకుందాం.

అప్పుడు కూడా మనం ప్రతి రోజు ఎలా ప్రవర్తిస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవటానికి జైలు గది ఉపయోగపడుతుంది. మనలో ఉన్న చెడును తొలగించుకోవటానికి.. మంచిని పెంచుకోవటానికి దోహదపడుతుంది. ఉదయాన్నే పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన జీవితంలో ఉన్న ప్రతికూలాంశాలను గమనించటం మొదట్లో చాలా కష్టంగా ఉండొచ్చు. కాని పదే పదే ప్రయత్నిస్తే మాత్రం మంచి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. మంచి లక్షణాలు అలవరచుకోవాలనుకుంటే పాపి కూడా యోగి అవుతాడనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు..


(విన్ని మండేలాకు 1975, ఫిబ్రవరి1 నాడు రాసిన లేఖలో..)
నెల్సన్ మండేలా : కన్వర్జేషన్స్ విత్ మైసెల్ఫ్
పేజీలు : 454
ప్రచురణ : మాక్‌మిలన్

Friday, January 7, 2011

అదిరేటి ... నగలు మీరేస్తే...

bridal-wear-and-jewellery 
చిన్న చిన్న తీగల్లాంటి నగలను కాస్త పక్కన పెట్టేందుకు.. ఇది సరైన సమయం.. ఎందుకంటే కొత్త సంవత్సరం తనతో పాటు ఎన్నో కొత్త కొత్త ఆభరణాలను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడంతా పెద్ద పెద్ద స్టోన్స్‌.. లేయర్స్‌... వైల్డ్‌ లుక్‌.. అంటున్నారు యువత.. కంటికింపైన రంగులు.. పూసలు.. రంగు రంగుల రాళ్లు... మోటిఫ్స్‌.. సిరామిక్‌ పువ్వులు... ఈ కొత్త సంవత్సరం మురిపించేందుకు ముస్తాబయి వస్తున్నాయి. సీతాకోక చిలుకలు.. నెమళ్లు... పురుగులను ఆభరణాలలో పొదిగి మనకు అందించేందుకు అనూషా మమోత్రా వీటికి సంబంధించిన ఎన్నో సంగతులను వివరిస్తున్నారు.

చివరిగా ఎప్పుడు మెటల్‌ గాజులను వేసుకున్నారో గుర్తుందా..! కాపర్‌, గ్రే కలర్‌లో వున్న ఆ గాజులను వీధిలో అమ్మే బండిపై కొనుక్కున జ్ఞాపకం ఇప్పటికే గుర్తే.. ధర కాస్త తగ్గించమంటూ అడిగినది ఇప్పటికీ ఫ్రెండ్సంతా కలిసినప్పుడు గుర్తు చేసుకోకుండా వుండలేరు.

Pakistani-Bridal 
కాలేజీకి వెళ్లేప్పుడు వేసుకున్న సీతాకోకచిలుక డిజైన్‌ చెయిన్‌ చూసి ఎంతమంది కాంప్లిమెంట్‌ ఇచ్చారో.. అది ఇప్పటికీ బాక్స్‌లో భద్రంగా వుంటుంది. అప్పుడు వేసుకున్న గాజులు, డెనిమ్‌ డ్రెస్‌, హెయిర్‌ క్లిప్స్‌, మెటల్‌ రింగ్స్‌ ఇలా ఒకటేమిటి అప్పట్లో ఆ ట్రెండే వేరు..! గుర్తు చేసు కుంటేనే ఎంత బాగుంటాయో.. ఆ సంగతులు...!

అలా అని ఇప్పుడు బాధ పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాలేజీ రోజు లు మళ్లీ తిరిగి తెచ్చుకోవచ్చు. కాకపోతే కాలేజీకి వెళ్లలేం... అంతే ఆ జ్ఞాపకాలన్నీ అలాగే కంటిన్యూ చేయొచ్చు. నేడు అవే కొత్త ఫ్యాషన్‌గా మారిపోయాయి. 2011 చంకీ మెటల్స్‌, పెద్ద పెద్ద పూసలు, స్టెప్స్‌గా వచ్చే చెయిన్స్‌, వైల్డ్‌ ఆనిమల్స్‌ బొమ్మలు మురిపించేస్తున్నాయి. ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి.
కూల్‌... కూల్‌...
గోల్డ్‌, ఎల్లో, వైట్‌, పింక్‌, బ్లాక్‌ స్టీల్‌ లేదా కాపర్‌ కలర్‌ ఇలా రంగుల్లో మెటల్స్‌ వయ్యారాలు పోతున్నాయి. మెలితిరిగి మురిపిస్తున్నాయి. స్టెయిన్‌ లెస్‌స్టీల్‌తో తయారయిన చెయిన్స్‌, బ్రేస్‌లెట్లకు నడివయసు వారు సైతం సై అంటున్నారు. వీటిల్లోనూ సింగిల్‌, డబుల్‌ తిన్‌ అండ్‌ థిక్‌ డిజైన్స్‌లో లభ్యమవుతున్నాయి. వీటికి తోడుగా పెద్ద పెద్ద స్టోన్స్‌ తోడైతే ఆ అందమే వేరు అంటున్నారు డిజైనర్లు. ముందుగా మెటల్‌ని ఎంపిక చేసుకుని వాటికి తగిన విధంగా ముత్యా లు, డైమండ్స్‌, క్రిస్టల్స్‌, విలువైన రంగురాళ్ళను జత చేస్తారు. అవసరా న్ని బట్టి కొన్నిటికి యానిమల్‌ లుక్‌ ఇచ్చేందుకు కొన్ని రకాల సీతాకోక చిలుకలు, మిడతవంటి అందమైన ఆకారాలను వాటికి జతచేస్తారు.

బ్లాక్‌ మెటల్‌లో రింగ్‌ జతగా తయారైన ఆభరణాలను గనుక ధరిస్తే అది ఎటువంటి వస్త్రాలకైనా కొత్తదనాన్ని తెస్తుంది. ఇప్పటి ఫ్యాషన్‌ కూడా ఇది. ఆభరణాలలో ఇదొక సంచల విజయం కూడా. ఈ రకం ఆభర ణాలు ఎంతగా ఆదరణకు నోచుకున్నాయంటే వీటిలో డిజైన్లు కావాలం టూ ఎంతో ఆర్డర్‌ ఇచ్చి మరీ చేయించుకున్నారు అని డిజైనర్‌ అనూష అంటున్నారు.
దిగుమతిలోనూ...
goldకొన్ని ఆకర్షణీయమైన డిజైన్లు యుకె బ్రాండ్‌ ‘మావీ’ భారతదేశంలోనూ విడుదల చేసింది. ఇవి భారతదేశానికి ఈ సంవత్సరమే కొత్తగా దిగు మతి అయ్యాయి. ప్రస్తుతం ఇవే యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. జ్యూయెలరీకి సరికొత్త దారులు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి స్టన్నింగ్‌ జ్యూయెలరీ ఎస్‌ఎస్‌11 రేంజ్‌లో దొరుకుతోంది. అందులో కొన్ని డిజైన్లు టూటీ ఫ్రూటీ సింగిల్‌ క్లా-సెట్‌, ముత్యాతలతో తయారైన రింగ్‌ నెక్‌లేస్‌ మరికొన్ని డిజైన్లు వున్నాయి. డైనమేట్‌ పెండెంట్‌తో తయారైన లేయర్‌ చెయిన్‌ మరింత అందంగా తయారైంది. పార్టీలో వేసుకునేందుకు వైల్డ్‌ లుక్‌గల ఆభరణాల తయారీలోనూ వీరు ఎంతో ముందున్నారు. మిగిలిన కలెక్షన్లలో గ్రిసోగానో, మటాస్సా గోల్డ్‌ ఆభర ణాలు వున్నాయి.
పెద్ద పెద్ద ఆభరణాలు...
ఇక పెద్ద సైజు వున్నవాటి వైపుకు వెళ్తే... ఇవి ఇప్పు డు ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా మారాయి. వీటికి పెద్ద లీఫ్‌ బ్రూచ్‌ దీనికి డైమండ్స్‌ని జత చేశారు. గోల్డ్‌తో తీసిన పగడాలను పొదిగి బంగారం పూత పూశా రు. పగడాలతో అల్లిన అందమైన తీగలను వీటికి జతచేశారు. వీటన్నిటి కలిపి తయారు చేయడం వల్ల చూడగానే చూపరుల దృష్టిని ఆకర్షించేలా వుంటాయి ఇవి. ద్రాక్ష, ఆపిల్‌, ఆరెంజ్‌, వాటర్‌ మెలన్‌ ఆకాలలో రంగు రంగుల డిజైన్లలో తయార యిన నగలు మరింత అందంగా తయారవుతు న్నాయి. చిన్నపాటి అందమైన డిజైన్‌ కావాలనుకుంటే రోజ్‌ మురానో గ్లాస్‌ పెండెంట్‌తో కలిసి తయారయిన మెటల్‌ డిజైన్‌ ఎంతో బాగుటుంటుంది. ఇందులో డిజైనర్‌ మిరారి బంగారు తీగలను తీసుకుని నెమలి రంగుతో తయారయిన మోటిఫ్స్‌తో అందంగా అలంకరించారు.
లేయర్స్‌గా....
లేయర్స్‌గా నెక్లెస్‌ వేసుకుంటే ఆ అందమే వేరు. ఇం దులో మెటల్‌ బిబ్‌ నెక్లెస్‌ అనేది చాలా బాగుంటుంది. ఇందులోని రెండు లేయర్స్‌లోనూ డిఫరెంట్‌ లుక్‌ వుండేలా తీర్చిదిద్దారు. ముత్యాలతో తయారయిన కలర్‌ బీడ్స్‌, సిరామిక్‌ పువ్వులతో కలిపి వీటిని ఎంతో అందంగా తయారు చేశారు. మావీ నుండి విడు దలైన టూ పీస్‌ సెక్లెస్‌లో మల్టీ లేయర్‌ టస్క్‌ కామి యో ఛార్మ్‌ నెక్లెస్‌ ఎంతో బాగుంటుంది.
వైల్డ్‌ లైఫ్‌...
రెక్కలు ఆడిస్తున్న సీతాకోకచిలుకలు, చిన్నచిన్న పురు గులు, టైగర్స్‌ ఇప్పటి 2011 ట్రెండ్‌ లిస్ట్‌లో ముందుం డేవి. మీకు కావలసిన జంతువును బొమ్మను ఎన్ను కోవడమే ఆలస్యం. గుడ్లగూబ, మెటిఫ్స్‌ కూడా బాగా నేదొరుకుతాయి. ఎమరాల్డ్‌, ముత్యాలు, డైమండ్స్‌ని మిడతను పోలిన బ్రూచ్‌లు ఇప్పటికే వచ్చేశాయి.
గిరిజన తెగలు వేసుకునే...
అలంకరణలో గిరిజనులు వుపయోగించే పూసలు, రాళ్లు వంటివి ఇప్పటివి కాదు. పురాతన కాలం నుండి వున్నదే. వాటినే ఇప్పుడు ఎక్కువగా ఇ ష్టపడుతున్నారు. వీరు తయారు చేసే ఆభరణాలలో ఎక్కువగా లెదర్‌, సిల్క్‌, బీడ్స్‌, క్రిస్టల్స్‌ను వుపయోగిస్తుంటారు. సరైన రంగులు ఎన్నుకుంటారు కాబట్టే వాటికి అంతటి అందాన్ని వారు ఇవ్వగలుగుతారు అని డిజైనర్లు అంటున్నారు.
బ్లాక్‌ మెటల్‌లో...
టెక్నో కలర్స్‌ పింక్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ రంగుల పూజలు వంటివి ఎక్కువగా వుపయోగిస్తున్నారు. ట్రైబల్‌ జ్యూ యెలరీ 2011లో మరింత ప్రాధాన్యతను సంతరించు కోనుంది. ఇందులోనూ సంప్రదాయ డిజైన్లను ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఇక పుర్రె, డేంజర్‌ వంటి గుర్తులను ఇష్టపడేవారు లేకపోలేదు. వీరి కోసం కూడా ప్రత్యేక డిజైన్లను రూపొందిస్తున్నారు. మొత్తం మీద ట్రెండీగా ఉండాలనుకునే యువతకు అందుకు తగ్గ ఆభరణాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఏ దుస్తులపైనైనా ఇట్టే ఇవి అమరిపోవడం విశేషం.

Tuesday, December 21, 2010

పురుగుల పుట్ట ...... మానవ దేహం


మట్టిపై పుట్టి, మట్టిలో కలిసిపోయే మనుషులం మనం.
కానీ మనం అసలు మనుషులమే కాదని అంటున్నారు బోనీ బాస్లేర్!
‘‘ఇదేం మాట తల్లీ!’’ అని అడిగితే -‘‘ఉన్నమాటే’’ అంటున్నారావిడ!
కళ్లు, చెవులు, కాళ్లూ చేతులూ ఉన్నంత మాత్రాన మనుషులం అయిపోమనీ,
మనమంతా పురుగుల పుట్టలమనీ.... సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు బోనీ బాస్లేర్. ఈ చేదునిజాన్ని అంగీకరించడానికి మీరు సిద్ధమేనా?
అయితే చదవండి.

ఒక వస్తువుకు మనం పేరు ఎలా పెడతాం? ఆ వస్తువు తయారైన పదార్థం ఆధారంగా లేదా దాంట్లో ఏమున్నాయి అన్న అంశంపై ఆధారపడి నామ్నీకరణ జరుగుతుంది. ఒక గ్రాము బంగారపు పూత ఉన్నంత మాత్రాన అలాంటి ఆభరణాలు రోల్డ్‌గోల్డ్ మాత్రమే అవుతాయి గానీ అచ్చు గోల్డ్ కాదన్నది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే ఉదాహరణను మనిషికి వర్తింపజేసి చూద్దాం. మన శరీరాల్లో ఏముంటాయి? అవయవాలు, రక్తం.. ఇంకొంచెం సూక్ష్మంగా, స్థూలంగా ఆలోచిస్తే కోటానుకోట్ల కణాలు. మరి ఈ కణాలతోనే మన దేహం మొత్తం నిండిపోయిందా? కానేకాదు అంటారు బోనీ బాస్లేర్. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ మైక్రోబయాలజిస్ట్ అయిన ఈ శాస్తవ్రేత్త ఒక వినూత్న వాదననను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. మన శరీరంలోని కణాలు, డిఎన్‌ఏల సంఖ్యతో పోలిస్తే పది నుంచి వందరెట్లు ఎక్కువగా సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా ఉంటుందన్నదే ఆ వాదన. (బ్యాక్టీరియం ఏకవచనం. బాక్టీరియా బహువచనం)

ఆశ్చర్యంగా ఉందా? బోనీ చెబుతున్నది అక్షరాలా నిజం. ‘‘మనిషి దేహంలో దాదాపు లక్ష కోట్ల కణాలుంటాయి. ఆ లక్ష కోట్ల కణాలు 10 లక్షల కోట్ల బ్యాక్టీరియాకు ఆవాసాలుగా మారిపోయాయి. మనలో దాదాపు 30 వేల జన్యువులు ఉంటే వాటిల్లో 100 రెట్లు అధికంగా బ్యాక్టీరియాకు ఆతిథ్యమిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి.. నాకు మీరు 1-10 శాతం మాత్రమే మనుషులుగా, 90-99 శాతం బ్యాక్టీరియాగా కనిపిస్తారనడం తప్పా?’’ అని ప్రశ్నిస్తారు బాస్లెర్! కేవలం 51 మంది చేతులను పరిశీలిస్తేనే 4,742 జాతుల బ్యాక్టీరియా ఉందని తేలినప్పుడు ఇక వాస్తవ సంఖ్యను అంచనావేయడం సాధ్యమవుతుందా? అని ఆమె చెబితే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు మరి. అంతేకాదు... ఈ బ్యాక్టీరియా శరీరంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తూ జీవక్రియలను కూడా నియంత్రిస్తూంటాయని, భాష లాంటిది కూడా అభివృద్ధి చేసుకున్నాయని ఆమె ఎనిమిదేళ్ల క్రితమే ప్రతిపాదించారు!


బ్యాక్టీరియా మాటలు
అసలు దేహంలో ఇంత పెద్దమొత్తంలో బ్యాక్టీరియా ఎలా పోగయిపోయిందబ్బా? అని ఆశ్చర్యం వేస్తోంది కదూ! జనాభాను పెంచుకునేందుకు బ్యాక్టీరియా పరస్పరం మాట్లాడుకుంటాయంటారు బాస్లెర్! అవి వివిధ వేర్వేరు వాతావరణాల్లో ఎలా మనుగడ సాగించగలవన్న కోణంలో ఆమె చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగుచూసింది. ప్రత్యేకమైన రసాయన సంకేతాల ద్వారా బ్యాక్టీరియా సమాచార మార్పిడి చేసుకుంటాయి. కొన్ని రకాల సముద్ర బ్యాక్టీరియా మాత్రమే రసాయన సంకేత భాషను ఉపయోగిస్తాయన్నది అప్పటివరకూ ఉన్న అంచనా. బోనీ మాత్రం తన పరిశోధనల ద్వారా ఇది అన్ని రకాల బ్యాక్టీరియాకూ వర్తిస్తుందని నిరూపించారు. బ్యాక్టీరియా భాషకు బోనీ పెట్టిన పేరు... ‘కోరమ్ సెన్సింగ్! ఇంకో విషయం... అనువుగాని చోట అధికులమనరాదు అన్న సామెతను బాగా వంటబట్టించుకున్నాయి ఈ బ్యాక్టీరియా. తమతో పోలిన బ్యాక్టీరియా నిర్దిష్ట సంఖ్యలో ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే... ఇవి ఆతిథ్య కణం లేదా డీఎన్‌ఏపై దాడి మొదలుపెడతాయట!
ఎలా తెలిసింది?
పదేళ్లక్రితం నాటి మాట ఇది. అప్పట్లో బోనీ రసాయన శాస్త్రంలో పిహెచ్‌డి చేస్తోంది. ఒకానొక సందర్భంలో సిల్వర్‌మాన్ అనే ఓ శాస్తవ్రేత్త ఉపన్యాసం వింది. జన్యుశాస్తవ్రేత్త అయిన సిల్వర్‌మాన్ చెప్పిందేమిటో ఈ రసాయన శాస్తవ్రేత్తకు ఏమీ అర్థం కాలేదు. రెండు విషయాలు తప్ప... ఆయన బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నారని... అవి తమలో తాము మాట్లాడుకుంటాయని! ‘‘బ్యాక్టీరియా మాట్లాడుకుంటాయని ఇతరులెవరైనా చెప్పిఉంటే ఆ... చెప్పావులే అని అనుకునేదాన్నేమో. మనం చదువుకున్న చదువుల్లో లేని విషయం అది. అందుకే ఆ అంశంపై ఆసక్తి పెరిగింది’’ అని బోనీ తెలిపారు. ఆ ఉపన్యాసం అయిన వెంటనే సిల్వర్‌మాన్‌ను వేడుకుని అతడి సంస్థలోనే బ్యాక్టీరియా భాషపై పరిశోధనలు ప్రారంభించారు బోనీ!
చీకట్లో వెలుగులు నింపే బ్యాక్టీరియా!
బ్యాక్టీరియా ఎలా మాట్లాడుతుందో తెలుసుకోవాలంటే బోనీ పరిశోధనశాలకు వెళ్లాల్సిందే. పూర్తి చీకటిగా ఉండే ఆ పరిశోధనశాలలో వందల కొద్దీ గాజు పాత్రలు ఉంటాయి. ఏ ఒక్కదాన్ని తీసుకుని అటూఇటూ కదిలించినా నీలపు రంగు వెలువడుతుంది. ఆ పాత్రల్లో ఉండేది సముద్రాల్లోంచి సేకరించిన ఒక రకమైన బ్యాక్టీరియా మరి. బ్యాక్టీరియా రెండు రకాల రసాయనాలతో సంభాషణలు నెరపుతాయని, తమతో పోలిన వాటితో మాత్రమే కాకుండా ఇతర రకాల బ్యాక్టీరియాతో మాట్లాడేందుకు కూడా వీటికి ప్రత్యేకమైన సంకేత భాష ఉందని బోనీ వివరిస్తారు. జీవజాతులన్నింటికంటే ముందుగా అవతరించిన బ్యాక్టీరియా రసాయనాల సాయంతో ఒక భాషను అభివృద్ధి చేసుకుని ఉండాలని తాను ముందు నుంచి అంచనా వేసినట్లు వివరించారు. ఈ రసాయనాల ద్వారానే లక్ష్యాలపై దాడి చేయడం, మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థ, మందుల నుంచి తప్పించుకోవడం లాంటి తదితర పనులను సమష్టిగా చక్కబెట్టుకుంటాయని ఆమె నిరూపించారు. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలచుకోవడం కూడా బ్యాక్టీరియాకు ఈ కోరం సెన్సింగ్ ద్వారానే సాధ్యమవుతోందని బోనీ అంటారు.
ఎన్నో ప్రయోజనాలు
బ్యాక్టీరియా పేరు చెప్పగానే మనకు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు గుర్తుకు రావడం సహజం. కానీ బ్యాక్టీరియా అన్నీ మనకు చెడే చేయవు. మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. నిజానికి ఇటువంటి బ్యాక్టీరియానే మన శరీరంలో ఎక్కువ. అయితే వ్యాధులకు కారణమవుతున్న బ్యాక్టీరియాను నాశనం చేసే క్రమంలో మంచి బ్యాక్టీరియా కూడా నాశనమవుతోంది. బ్యాక్టీరియా భాషను బాగా అర్థం చేసుకుంటే ఈ చిక్కు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మందులకు లొంగని మొండి బ్యాక్టీరియా పనిపట్టేందుకు కొత్త ఆయుధాలు తయారు చేయవచ్చన్నది బోనీ ఆలోచన. బ్యాక్టీరియా సంకేత భాషను నిలిపివేయడం ద్వారా అవి సమష్టిగా వ్యవహరించడాన్ని అంటే... ఆతిథ్య కణంపై దాడిచేయడాన్ని నిలువరించవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకో విషయం. కోరం సెన్సింగ్ కేవలం వ్యాధులకు మాత్రమే పరిమితం కావడం లేదు.

కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి రంగాల్లోనూ దీన్ని ఉపయోగించవచ్చునని శాస్తవ్రేత్తలు అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగించే సెల్ఫ్ ఆర్గనైజింగ్ నెట్‌వర్క్‌లు మరింత సమర్థంగా పనిచేసేందుకు కోరం సెన్సింగ్ ఉపయోగపడుతుందని అంచనా. ఇందులో నెట్‌వర్క్‌లోని ఒక్కో నోడ్ తన పరిసరాల్లో తగినన్ని నోడ్‌లు ఉన్నాయా? లేదా? అన్నది సరి చూసుకున్న తరువాతనే పనిచేస్తాయి. తద్వారా సమర్థవంతమైన, మెరుగైన పనితీరు వీలవుతుంది. అంతేకాకుండా తనంతటతానుగా ప్రవర్తించే రోబోట్‌ల ప్రవర్తనను నియంత్రించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చునని అంచనా.
జనాభాను పెంచుకునేందుకు
బ్యాక్టీరియా పరస్పరం
మాట్లాడుకుంటాయి.
బ్యాక్టీరియా భాషకు బోనీ
పెట్టిన పేరు... ‘కోరమ్ సెన్సింగ్!



బ్యాక్టీరియా ఉండని ప్రాంతమంటూ ఈ భూమ్మీద లేనే లేదు. అగ్నిపర్వత బిలాల్లోనైనా... మంచుగడ్డల లోపలైనా బ్యాక్టీరియా మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.

నేల పొరల్లో ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ లోతులో, సముద్రగర్భంలోనూ అతి ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉంటుంది

భూమ్మీద ఉండే మొత్తం బ్యాక్టీరియా జాతులు... కోటానుకోట్లు!

కొంచెం ఉజ్జాయింపుగా చెప్పాలంటే ఆ అంకె 5 పక్కన 30 సున్నాలు పెడితే ఎంతో అంత!

ఒక్క లీటర్ సముద్రపు నీటిలో 20,000కు పైచిలుకు బ్యాక్టీరియా ఉంటాయి!

- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

Saturday, November 20, 2010

నిజమైన ‘రాణి’ * జోర్డాన్‌ రాణి రానియా

అందగత్తెల పోటీల్లో సౌందర్యరాశులంతా మాటల్లో ‘సేవాభావం’ కురిపిస్తారు.తరువాత బాలీవుడ్ లోనో, హాలీవుడ్  లోనో ప్రత్యక్షమవుతుంటారు. మరికొంత మంది వాణిజ్య ప్రకటనల షూటింగ్‌లతో, షోరూంల ప్రారంభోత్సవాలతో తీరిక లేకుండా ఉంటారు. అయితే బ్రిటిష్‌ యువరాణి డయానా వంటి వారు బహు అరుదుగా మాత్రమే సమాజసేవలో నిమగ్నమవుతారు. ఇటువంటి వారి కోవలోకే  జోర్డాన్‌ రాణి రానియా చేరుతారు. మహిళల, బాలల హక్కుల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. కేవలం మాటలతో కాదు.. కట్టుబాట్లను ఎదిరించి చిన్నారులకు చేయూతనిస్తున్నారు.మహిళలను ఆదుకునేందుకు తనవంతు సాయం అందిస్తున్నారు.

queen-of-jordanఅంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తున్న రానియా రాజుల కుటుం బంలో జన్మించలేదు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచే వచ్చారు. కువైట్‌లో స్థిరపడిన పాలస్తీనీయుల కుటుంబంలో పుట్టింది రానియా.తండ్రి వైద్యుడు.చిన్న ప్పటి నుంచే చదువులో అమిత ప్రతిభపాటవాలు చూపిన ఆమె కైరోలోని అమెరికన్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కొన్నాళ్లు సిటీ బ్యాంకులో ఉద్యోగం చేశాక యాపిల్‌ కంపెనీకి మారింది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక పార్టీకి వెళ్లడమే రానియా జీవితాన్ని మార్చేసింది. ఆపార్టీకి వచ్చిన జోర్డాన్‌ యువ రాజు అబ్దుల్లా బిన్‌ అల్‌ హుస్సేన్‌తో కలిసింది.సరిగ్గా ఐదునెలలు తిరిగే సరికి వాళ్ళ పెళ్లయి పోయింది. తర్వాత కొద్ది రోజులే అబ్దుల్లాకు జోర్డాన్‌ రాజుగా పట్టాభిషేకం జరిగింది. అలా మూడుపదుల వయసు నిండక ముందే ఒక దేశానికి మహారాణి అయింది రానియా.

చిన్నప్పటి ఆలోచనలు...
childrenఅరబ్‌ దేశాలలో మహిళలూ చిన్నపిల్లల కష్టాలను చూస్తూ పెరిగిన రానియాలో బాల్యం నుంచే ఎన్నో ఆలో చనలు. రాణి అవగానే తన ఆలోచనలు అమల్లో పెట్టేం దుకు గొప్ప అవకాశం వచ్చిందని అర్థమైందామెకు. వెం టనే జోర్డాన్‌లోని అన్ని పాఠశాలల్లోనూ విద్యాసంస్కరణలు ప్రారంభించేలా రాణి హోదాలో చర్యలు తీసుకుం దామె. భర్త కూడా అందుకు సహకరిం చడంతో రానియాకు మరింత ప్రోత్సాహం లభించినట్ట యింది. మహిళల హక్కును కాలరాసే కట్టుబాట్లకు వ్యతిరేకంగా గొంతెత్తింది.‘జోర్డాన్‌ రివర్‌ షౌండే షన్‌’ పేరుతో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించి మహిళల, పిల్లల సంక్షేమం దిశగా కృషిచేస్తోంది.

బెదిరింపులు వచ్చినా...
jordanఎంత మహారాణి అయినా, సంప్రదాయాలనూ కట్టు బాట్లనూ దాటి ఒక మహిళ ఇలా నలుగుర్లోకీ రావడం, వాటికి విరుద్ధంగా గొంతెత్తడం అక్కడి మతఛాందసవా దులకు నచ్చలేదు. వారి బెదిరింపులను ఖాతరు చేయ కుండా ధైర్యంగా తాను ఎంచుకున్నబాటలోనే నడుస్తోం ది రానియా. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్దెనిమి ది అంతర్జాతీయ సంస్థల్లో సభ్యురాలిగా కీలక పాత్ర పోషిస్తోంది. యునైట్‌డ్‌ నేషన్స్‌ ఫండ్‌, యునిసెఫ్‌, గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌, ఇంటర్నే షనల్‌ యూత్‌ ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ అసిస్టెన్స్‌ వంటి ప్రముఖ సంస్థల్లో ఇప్పుడు రానియా సేవలు కీలకం. ఆమె సేవలకు మెచ్చి జోర్డాన్‌ ప్రభుత్వం గౌరవ కల్నల్‌హోదా కూడా ఇవ్వడం విశేషం.

మంచి తల్లిగా...
అంతర్జాతీయంగా ఎన్నో సంస్థల్లో సభ్యురాలైనా ఆ వ్యవహారాల్లో ఎంత మునిగినా, తన పిల్లల విషయంలో మాత్రం తల్లిగా అన్ని బాధ్యతలూ చక్కగా నిర్వహిస్తుంది రానియా. ‘ఒక దేశానికి రాణి అనే హోదా కన్నా నా పిల్లలకు గోరుముద్దలు పెట్టడం, వాళ్లతో ఆడుకోవడం, జోకొట్టి నిద్రపుచ్చడం.. .వీటిలో ఉండే ఆనందం నాకెంతో అపురూపంగా అనిపిస్తుంది’ అని రానియా చెబుతుంది. ఇలా చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో కనిపించే మెరుపులకు వెలకట్టడం అసాధ్యం.

వెబ్‌సైట్‌తో శ్రీకారం...

Jordan-readsఅధునాతన సాంకేతిక పరిజ్ఞానం తాలూకూ సౌకర్యా లను అందిపుచ్చుకోవడంలోనూ వాటిని ఉపయో గిం చుకుని తన భావాలను ప్రపంచానికి చాటడంలోనూ రానియాది ఎప్పుడూ ముందంజే. దీనికి సొంత వెబ్‌ సైట్‌తో శ్రీకారం చుట్టిన రానియా గతేడాది యూట్యూబ్‌ లోనూ ఓ వెలుగు వెలిగింది. యూట్యూబ్‌లో ఆమె వీడి యోలను 30 లక్షల మందికి పైగా చూడటం అందుకు నిదర్శనం. ఫేస్‌బుక్‌లోనూ రానియాకు ఎంతో ఆదరణ. ఇక ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్త ఆదరణ పొందు తున్న మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లోనూ అడుగు పెట్టిం దామె. అందులో నిత్యం ఆమె రాసే పోస్టులకు చూసేవారి సంఖ్య తొమ్మిది లక్షల యాభైవేలకు పైమాటే!

Friday, November 19, 2010

‘ విల్లా ’ సవంతమైన జీవితం

సొంత ఇంటి కల నిజం ఒకప్పుడు నగరాల్లో నివసించే మధ్యతరగతివారు సొంత ఇల్లు ఉండాలని కలలు కనేవారు. ఆ కలలను నెరవేర్చుకునేవారుకూడా. కానీ రెండుమూడు దశాబ్దాలుగా దాదాపు అన్ని నగరాల్లో అపార్ట్‌మెంట్లు వచ్చేశాయి. కనుక ఇల్లు కొనుక్కోవడం అంటే ఒక చిలకపంజరం కొనుక్కోవడంగా తయారయ్యింది. ఈ ఫ్లాట్ల సంస్కృతి నగరాలనుంచి చిన్న చిన్న పట్నాలకు సైతం వ్యాపించింది. ఈ నేపథ్యంలోనే నగరానికి దగ్గర్లో, నగరం పొలిమేరల్లో విల్లా సంస్కృతి ప్రవేశపెట్టారు రియల్టీ వ్యాపారవేత్తలు. సొంత ఇల్లు కావాలని కలలు గనే ధనమున్నవారు ఆపై వర్గంవారు తమ కలలను నిజం చేసుకోవచ్చు. 
పెద్దపెద్ద నగరాల్లో విల్లాల కథనం.....

villas-item-photo 
చెన్నైలో, ఏడాది క్రితం ప్రాపర్టీ డెవలపర్లు మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. వారి ఫ్లాట్లు అమ్ముడు పోలేదు. నిర్మాణంలో ఉన్న పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. కానీ 2010లో ఉన్నట్టుండి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఫ్లాట్లు చాలా మేరకు అమ్ముడుపోయాయి. మిగతావి బుక్‌ అయ్యాయి. ముఖ్యంగా నగరంలోని ఓఎంఆర్‌ ప్రాంతంలోని ఐటి కారిడార్‌లో నివాసగృహాల అపార్ట్‌మెంటులు, ఐటి ఆఫీసుల భవనాలు మొత్తంగా అమ్ముడు పోయాయి. ఐటి ప్రదేశం ఇప్పటికీ ఖాళీగానే ఉన్నప్పటికీ ఓఎంఆర్‌లో కొత్త నివాస గృహాల పథకాలు ప్రారంభించాలని చాలామంది బిల్డర్లు భావిస్తున్నారు. సుందరమైన ఇసిఆర్‌(ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌), దీనికి సమాంతరంగా ఉన్న ఓఎంఆర్‌ లలో గత కొద్దినెలలుగా వివిధ బిల్డర్లు ఉన్నత స్థాయి విల్లా (భవంతులు)పథకాలు చేపట్టారు. ఈ రెండురోడ్లలో నివాసగృహాల పథకాలకంటే కొత్తగా తలపెట్టిన విల్లా పథకాలు ఎక్కువసంఖ్యలో ఉన్నాయి. ఈరెండు రోడ్ల మధ్య దూరం ఒక కిలోమీటరే. విశ్రాంతి హోమ్స్‌, చైతన్య బిల్డర్స్‌, క్రిష్ణ కన్స్‌ట్రక్షన్స్‌, ఒలంపియా గ్రూపు, అరిహంత్‌ ెఫౌండేషన్స్‌, ఇండస్‌ ఫౌండేషన్స్‌, శ్రీ ప్రొమోటర్స్‌, సాగాస్‌ ప్రమోటర్స్‌ వంటి అనేక ప్రాపర్టీ డెవెలపర్స్‌ కనీసం ఒక విల్లా పథకాన్ని ఇసిఆర్‌ లోగానీ ఓఎంఆర్‌లో గానీ ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు శ్రీపెరంబదూర్‌-ఒరగడమ్‌ రోడ్డులో విల్లా పథకాలు ప్రారంభించాయి. ఈ రెండురోడ్లలో ప్రారంభించిన విల్లా పథకాల సంఖ్య అనూహ్యమైంది. చెనై్నలో ఎన్నో అపార్ట్‌మెంటు పథకాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ సగటు చెనై్నవాసి సొంత ఇల్లు ఉండాలనే కోరుకుంటాడు. కనుక విల్లాస్‌ లేక ఇళ్ళ వరుసకు విపరీతమైన డిమాండు ఉందని స్కౌలైన్స్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌, ప్రమోటర్‌ సంజయ్‌ ఛుగ్‌ అంటున్నారు. నగరం లోపల భూవిలువ అనూహ్యంగా ఉన్నందువల్ల నగరం పొలిమేరల్లో విల్లా పథకాలు వస్తున్నాయని ఆయన ఆన్నారు. ఈ విల్లాలు ఒకే కాంపౌండ్‌లో నిర్మిస్తారు. రోడ్లు, లైట్లు, క్లబ్‌హౌస్‌, స్విమ్మింగ్‌పూల్‌, పార్టీహాల్‌, జిమ్‌- అన్ని సదుపాయాలూ ఉంటాయి.

villa 
ఈ భావన ఢిల్లీలో, జాతీయ రాజధాని ప్రాంతంలో జనాదరణ పొందింది. చెన్నైలో కూడా మెల్లిగా ఊపందంకుంటోంది. ఈ విల్లాలకు కావలసిన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం, ఈ పథకాలు సమాజంలో ఉన్నత వర్గాలవారికోసం నిర్మిసున్నారు. ఒక్కో విల్లా 2,000 చదరపుటడుగులునుంచి 4,000 చదరపుటడుగులు కలిగివుంటుంది. . 3లేక 4 బెడ్‌రూంలుంటాయి. ఒక్కో విల్లా ధర రూ.1.0 కోట్లనుంచి రూ.3.0 కోట్ల వరకూ ఉంటుంది. ప్రతిభారతీయుడు కనీసం ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని కలలు కంటాడు. ఈ దృష్ట్యా చాలా కాలంగా చెనై్నవాసులు సొంత ఇల్లు కొనడానికే ఇష్టపడతారు. కానీ జీతంతో బతికే మధ్యతరగతివారు ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో గత కొద్ది దశాబ్దాలుగా అపార్ట్‌మెంటులు నగరమంతటా వెలిశాయి. ఒక మార్కెట్‌గా మద్రాసు చిరకాలంగా సొంత ఇల్లే కోరుకుంది. నగరంలో చాలామంది అపార్ట్‌మెంటు కొనాలని భావించినప్పటికీ ఇప్పుడు రెండవ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని అరిహంత్‌ ఫౌండేషన్స్‌ వారి కమల్‌ లూనావత్‌ అంటున్నారు.

ఇల్లుకొనాలనుకుని ఫ్లాటు కొనుక్కున్నవారు ఇపుడు సొంతింటి కోర్కె తీర్చుకోవడంకోసం నగరం పొలిమేరల్లో విల్లా కొనాలని భావిస్తున్నారు. కొత్తగా ఆవిర్భవించిన ధనిక వర్గం వల్ల విల్లాలకు డిమాండ్‌ వచ్చిందని ఒలింపియా గ్రూపువారి అజిత్‌ చోర్డియా అంటున్నారు. విల్లాలో ఏకాంతం, భద్రత, అన్ని సదుపాయాలూ ఉంటాయని ఆయన అంటున్నారు. మరోవైపు, విల్లాస్‌(జి1) తీసుకుంటే ఒక ఎకరం భూమిలో ఏడు విల్లాలు నిర్మించవచ్చని, 18నెలల్లో నిర్మాణం పూర్తిచేయవచ్చనీ ఆయన అంటున్నారు. విల్లాలకు డిమాండు ఒక్క చెనై్నకి మాత్రమే పరిమితమై లేదని బెంగళూరు, కోల్‌కతా నగరాలు కూడా ఈరంగంలోకి ప్రవేశించాయనీ, బెంగళూరులో కూడా నగరం పొలిమేరల్లో నిర్మించిన విల్లాలు చప్పున అమ్ముడుపోతాయనీ చోర్డియా తెలియజేస్తున్నారు. బెంగళూరులో విల్లాలకు 25నుంచి 30శాతం డిమాండు ఎన్‌ఆర్‌ఐల వల్ల ఏర్పడుతోంది. రమారమి 60శాతం విల్లాలు వ్యక్తిగతమైన వాడుక కోసం అంటే పదవీవిరమణ చేసిన తరువాత స్థిరపడ్డానికి కొంటున్నారు. కాగా40 శాతం విల్లాలు పెట్టుబడి రూపేణా కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాలు మునపటి ఇన్ఫోసిస్‌ ఉద్యోగి, ప్రస్తుతం ఎడిఫిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ థార్డ్‌ తెలియజేస్తున్నారు. బెంగళూరులో ఎం.జి రోడ్డు నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో బెంగళూరులో విల్లాలకు అనూహ్యమైన డిమాండ్‌ ఉండగా సప్లై చాలా పరిమితంగా ఉంది. నగరం విస్తరించే కొద్దీ పొలిమేరల్లో విల్లాల కుండే డిమాండ్‌ పూర్తవుతుంది.

villas-one 
దీనికి సుమారు ౫ ఏళ్ళుపట్టవచ్చు. ఇప్పటి పరిస్థితులను బట్టిచూస్తే యెలహంకాలో విల్లా పథకాలకు మంచి డిమాండు వుంది. ఇప్పటికే నగరం సరిహద్దులోనే ఒలింపియా వారివి రెండు విల్లా ప్రాజెక్టులున్నాయి. అవి పూర్తయ్యేనాటికి వాటి ధర మరో 20శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. కలకత్తా మాటకొస్తే, అక్కడ విల్లా సంస్కృతి రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. గంగ ఒడ్డున రైచక్‌ లో అంబుజా రియాల్టి(అప్పుడు బెంగాల్‌ అంబుజా)విల్లా పథకం ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఒక లక్షరీ రిసార్ట్‌, 7స్టార్‌ హోటల్‌, శ్యామొలిమా,పఖిరాలయ, నివాస బంగళాలు, బంగ్లా కుటీర్‌ నిర్మించింది. ఎఫ్‌ ఫోర్ట్‌ ఒక్కొక్కటీ ఏడాది తరువాత ఏడాది నిర్మితమయ్యాయి. కలకత్తాలో ప్రధాన కార్యాలయం ఉన్న అంబుజా రియాల్టీ, గంగా ఆవాస్‌ విల్లా పథకాన్ని తలపెట్టింది. ఇందులో 90 విల్లాలుంటాయి. బంగళాలు, అపార్టుమెంటులు ఉంటాయి. ఈ పథకం నిర్మాణం కోసం అంబుజా రూ.30 కోట్లు వెచ్చించనుంది. తన విల్లా పథకం గురించి అంబుజా ఉత్సాహంగా ఉన్నప్పటికీ మరో రియాల్టీ డెవెలపర్‌ బ్లూచిప్‌ ప్రాజెక్ట్‌‌స మాత్రం కాస్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. కలత్తాలో స్థలం లేదు. ముంబై, చెనై్న లాగా సముద్రతీరంగానీ కొండప్రాతంగానీ లేదు.

ఇతర ఆకర్షణీయమైన స్థావరాల్లేవు. కార్పొరేట్‌ సంస్థలు తమ ఉన్నతాధికారులకోసం విల్లాలను లీజుకు తీసుకుంటాయి. వారు కుటుంబ సమేతంగా విశ్రాంతి తీసుకోవడం కోసం విల్లాలు ఎంతగానో ఉపయోగపడతాయని బ్లూ చిప్స్‌ ప్రాజెక్ట్‌‌స మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిత్విక్‌ దాస్‌ అంటున్నారు. ఇతర నగరాల్లో కంటే ముందే కోల్‌కతాలో విల్లా పద్ధతి మొదలైంది. కలకత్తాలో గతంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఝార్‌గ్రాం,శాంతినికేతన్‌, దేవ్‌ఘర్‌ వంటి ప్రాంతాల్లో విశాలమైన విల్లాలు కలిగివుండేవారు. కానీ ఈ ప్రాంతాల్లో మునుపున్నంత భద్రత లేదని తెలుస్తోంది.

Wednesday, November 3, 2010

ప్రకృతి వైపరీత్యాలతో రాటుదేలిన దేశమే ఇండోనేషియా.

సునామీ మినహా  అంతా సుఖమే

బంగారుగనులను దాచుకున్న ఆ నేలే ఇంకోవైపు అగ్నిపర్వతాలనూ మోస్తోంది. భూకంపాల్నీ, సునామీలను కూడా భరిస్తోంది. తరచూ సంభవించే ఈ వైపరీత్యాలతో రాటుదేలిన దేశమే ఇండోనేషియా. ప్రకృతి బీభత్సాలు భయాన్ని సృష్టిస్తున్నా ఇక్కడున్న ఉపాధి అవకాశాల వల్ల ప్రవాసీయుల తాకిడీ దీనికి ఎక్కువే.

ఎనిమిదేళ్ల క్రితం ఈ దేశానికి వచ్చిన ప్రవాసాం«ద్రుడు సబ్బవరపు హరి 'పేరులోనే కాదు కొన్ని ఆహారపు అలవాట్లలోనూ ఇండోనేషియా ఇండియాను కొంచెం పోలి ఉంటుంది' అంటారు. ఇక్కడి 'బిసానా అపెరల్ గ్రూప్' గార్మెంట్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన చెప్పిన విశేషాలు..

నేను ఇండోనేషియా వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది, నేనుండేది బోగోర్ అనే ఊళ్లో. జకార్తాకి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడ 365 రోజులూ వర్షం పడుతుంది. అందుకే దీన్ని రెయిన్ సిటీ అంటారు. గొడుగు, రెయిన్ కోట్ లేకుండా ఎవరూ బయటకు వెళ్లరు. అంత అవసరం అవి.

ఈ మధ్యే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు కొంచెం తగ్గినా.. రోజూ పడడం మాత్రం మానలేదు. అలవాటుపడేదాకా కొత్తగా వచ్చిన ఫారినర్స్‌కి, టూరిస్టులకు ఈ వర్షం ఇబ్బందినే కలిగిస్తుంది. ఇబ్బంది పడుతూనే ఎంజాయ్ చేస్తారు కూడా. నేను పనిచేసే గార్మెంట్ కంపెనీ ఎప్పుడో వందేళ్ల క్రితం ఇండోనేషియాలో స్థిరపడిన తమిళులది. మా కంపెనీలో 1800 మంది పనిచేస్తారు. అందులో ఏడుగురం మాత్రమే భారతీయులం. మిగిలిన అందరూ ఇండోనేషియన్లే.
టూ వీలర్ టాక్సీలు ఎక్కువ మా ఇంటికీ... ఫ్యాక్టరీకి పన్నెండు కిలోమీటర్ల దూరం. మాకు పనిమనిషి ఉంది. ఇంట్లో వంటతో సహా పనంతా చేస్తుంది. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలి. సర్వెంట్ మెయిడ్స్‌ను కూడా ఇక్కడ ఉద్యోగుల్లాగే చూస్తారు. ఇళ్లల్లో వంటమనుషులుగా పనిచేసే ఇండోనేషియన్లందరికీ భారతీయ వంటలు వచ్చు.

టిఫిన్ చేసి నేను ఏడింటికల్లా ఆఫీస్‌కి బయలుదేరుతాను. మెట్రొలు, బస్‌లు, ఆటోలు(లాంటివి) ఇక్కడి ప్రధాన రవాణా సౌకర్యాలు. టూవీలర్ టాక్సీలు కూడా ఎక్కువే. వీటివల్లే రోడ్లు రద్దీగా ఉంటాయి. ఏ కార్నర్‌లో చూసినా ఐదారుగురు హెల్మెట్లు పెట్టుకుని( హెల్మెట్ తప్పనిసరి) వెహికిల్స్‌తో నిలబడి ఉంటారు. అదీగాక చాలామంది బాగోర్( బాగోర్ ప్రాంతం చల్లగా, ప్రశాంతంగా చాలా బాగుంటుంది కాబట్టి)నుంచి జకార్తాకి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దీనివల్ల కూడా ఆఫీస్ వేళల్లో మహారద్దీగా ఉంటాయి రోడ్లు. అయితే ఎవరూ ట్రాఫిక్ నియమాలను ఉలంఘించరు. పాదచారులకు ప్రాధాన్యం ఎక్కువ

.
చివరి మూడు రోజులూ బిజీ
అన్ని వ్యాపారాల్లోకీ గార్మెంట్ బిజినెసే టాప్ ఇక్కడ. ప్రతి ఫ్యాక్టరీలో కార్మికులకు భోజన, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా ఉంటాయి. నా పనికొస్తే... భోజన సమయానికి ముందు ఎక్కువగా స్టాఫ్ మీటింగ్‌లు ఉంటాయి.అప్పటికప్పుడు చేయాల్సిన కొన్ని అత్యవసరమైన పనులూ ఉంటాయి.. ఒంటి గంటకు లంచ్.

తర్వాత మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పనులు చూసుకుంటాను. ప్రతి రెండున్నర గంటలకు టీ బ్రేక్ ఉంటుంది. నాలుగు నుంచి మెల్లమెల్లగా ఆఫీస్ ఖాళీ అవుతుంటుంది. మాకు పని సమయం ఎనిమిది గంటలు. నిజానికి నాకు పనివేళలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు దాకా. ఓవర్ టైమ్ చేయాల్సి వస్తే ఓ రెండుగంటలు ఎక్కువుంటాం . అయితే వారం మొత్తం ఇలాగే ఉండదు

. అమెరికా, యూరప్ దేశాలకు చేయాల్సిన ఎగుమతులుంటాయి. ఎగుమతులను తీసుకెళ్లే షిప్‌లన్నీ శనివారం బయలుదేరుతాయి. ఆ రోజుకల్లా డెలివరీ ఇచ్చేయాలి కాబట్టి గురు, శుక్ర, శని వారాలు చాలా బిజీగా ఉంటాం.ఆ రోజుల్లో ఇంటికి తిరిగొచ్చే టైమ్ మా చేతుల్లో ఉండదు. మామూలు రోజుల్లో ఆరున్నర కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఏడున్నరకి డిన్నర్ చేసి కాసేపు నెట్‌లో చాటింగ్, ఏదైనా చదువుకోవడం, ఇండియలో ఉన్న ఫ్రెండ్స్, బంధువులతో మాట్లాడ్డం లాంటివి చేస్తాను. అయితే మా దగ్గర టెలిఫోన్ లైన్స్ చాలా వీక్.

షారూఖ్ అంటే బాగా ఇష్టం

ఇక్కడ వారానికి ఆరు రోజుల పనిదినాలు. ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం ఒక్క పూటే ఉంటుంది. ఆదివారం రోజు జాలీగానే గడుపుతారంతా. మేమైతే ( మా కుటుంబం) ప్రతి ఆదివారం జకార్తాకి వెళ్తాం. అక్కడున్న ఇండియన్ స్టోర్స్‌లో కావల్సినవి కొనుక్కొంటాం. ఇండియన్ రెస్టారెంట్లలో లంచ్ చేసి సినిమాకి వెళ్తాం. పెద్ద పెద్ద హీరోల హిందీ సినిమాలన్నీ వస్తాయి.

ఇప్పుడు రోబో నడుస్తోంది. ఇక్కడి వాళ్లకు షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లంటే చాలా ఇష్టం. షారూఖ్ కుఛ్ కుఛ్ హోతా హై సినిమా అంటే పడి చస్తారు. ఆ సినిమా పాటలు అందరికీ వచ్చు. ఇండియన్స్ ఎవరు కనిపించినా...మీది షారూఖ్ ఖాన్ ఊరా? అని అడుగుతుంటారు. ఆహారం విషయానికి వస్తే...దొండకాయ తప్ప అన్నీ దొరుకుతాయి. వీళ్ల వంటలు కొన్ని మన వంటల్నే పోలి ఉంటాయి. అలాంటి వాటిని పడంగ్ ఫుడ్ అంటారు. సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. బాగా ఇష్టపడతారు కూడా . ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇండోనేషియన్లు ఇంట్లో వంట చేసుకోవడం చాలా తక్కువ.

హోటల్స్‌లోనే తింటారెక్కువగా. అందుకే ఇక్కడ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. భారతీయులు 35 వేల మంది దాకా ఉండొచ్చు. తమిళ్, పంజాబి అసోసియేషన్స్ ఉన్నాయి. తెలుగు కుటుంబాలు మాత్రం ఇరవై కన్నా ఎక్కువ లేవు. నెలకు ఒకసారి కలుసుకుంటాం. అందరం కలిసి దీపావళి గ్రాండ్‌గా చేసుకుంటాం. మన దేవాలయాలు చాలా ఉన్నాయి. పండగలకు, బర్త్‌డేలకు అక్కడికి వెళ్తుంటాం.

ఆడవాళ్లే ఎక్కువ...

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో ఇండోనేషియా నాలుగవది. ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం. చాలా భాషలున్నా అధికార భాష మాత్రం బహాసా దీరా(bahasa deearh). భారతీయుల్ని చాలా ఇష్టపడతారు, గౌరవిస్తారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ముస్లిం దేశమే అయినా ఆడవాళ్లు స్వేచ్ఛగానే ఉంటారు. నిజానికి పనిచేసేది ఎక్కువగా వాళ్లే. ఫ్యాక్టరిల్లో, ఆఫీసుల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కనిపిస్తారు.

భారతీయుల తర్వాత ఈ దేశంలో కనిపించేది కొరియన్లు, చైనీయులు. బాలిలో యురోపియన్లు, ఆస్ట్రేలియన్లు ఎక్కువుంటారు. సాఫ్ట్‌వేర్ సంగతేమో కాని గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు మాత్రం ఇబ్బడిముబ్బడి అవకాశాలున్నాయిక్కడ. కంపెనీ స్టాండర్డ్‌ను బట్టి వేతనాలుంటాయి. గోల్డ్‌మైన్స్‌లో కూడా మంచి అవకాశాలే ఉన్నాయి.

ఓవైపు సునామీ..ఇంకోవైపు అగ్నిపర్వతాలు

ఇక్కడ భయపెట్టేవల్లా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు. ఇవన్నీ మధ్య ఇండోనేషియాలోని జావా అనే ప్రాంతంలో ఎక్కువ. కొన్ని అగ్నిపర్వతాలయితే నిరంతరం రగులుతూనే ఉంటాయి. అయినా ఆ ప్రాంతాల్లో కూడా జనజీవనం సాగుతోంది. ఓ వైపు అగ్నిపర్వతాల్లోంచి పొగ వస్తూంటుంది..మరోవైపు దాని పరిసరాల్లోనే ప్రజలు తమ పనుల్లో మునిగి ఉంటారు.

ఆశ్చర్యమేస్తుంది ఆ దృశ్యం చూస్తే. నిజానికి అగ్నిపర్వతాలు ఎగజిమ్మే నిప్పుకణికల వల్ల ఇక్కడ మరణాల రేటు రోజురోజుకీ ఎక్కువవుతోంది. దట్టమైన పొగలో చిక్కుకుని కనిపించకుండా పోయే జనాల సంఖ్యా తక్కువేమీ లేదు. మా ఫ్యాక్టరీలోని ఓ వర్కర్ తల్లితండ్రులు ఇలాగే గల్లంతయ్యారు. ఇలాంటి వాళ్ల ఆచూకి తీయడం కోసం ప్రత్యేక బలగాలు పనిచేస్తూనే ఉంటాయి.

సునామీ...అయితే భయంక రమైన అనుభవం. 2004 నాటి సునామీలో ఊళ్లకు ఊళ్లే తుడుచిపెట్టుకుపోయాయి. అందులోంచి ఇంకా చాలామంది తేరుకోనే లేదు.. మొన్నటికిమొన్న వచ్చిన సునామీ కూడా మమ్మల్ని వణికించిందనే చెప్పాలి. ఇక్కడ అంత ప్రభావం చూపకపోయినా సునామీ వార్తతోనే అందరూ భయపడ్డారు. ఇళ్లు ఖాళీ చేసేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఇంకా స్వస్థలాలకు చేరుకోనేలేదు భయంతో. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడ ఎక్కువనే చెప్పాలి. ఓ రకంగా దైనందిన జీవితాన్ని చాలా డిస్ట్రర్బ్ చేస్తాయి.

ఇండోనేషియాలో భయపెట్టేవల్లా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు. ఇవన్నీ మధ్య ఇండోనేషియాలోని జావా అనే ప్రాంతంలో ఎక్కువ. కొన్ని అగ్నిపర్వతాలయితే నిరంతరం రగులుతూనే ఉంటాయి. అయినా ఆ ప్రాంతాల్లో కూడా జనజీవనం సాగుతోంది.  
సరస్వతి రమ