Monday, November 1, 2010

నాడు గెరిల్లా.. నేడు దేశాధినేత * బ్రెజిల్‌కు లేడీ లీడర్ * ఐరన్ లేడీగా, లాలూ శిష్యురాలిగా ఘన చరిత్ర

  ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనున్న బ్రెజిల్ అధ్యక్ష పదవికి ఒక మహిళ మొట్టమొదటిసారి...
 ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనున్న బ్రెజిల్ అధ్యక్ష పదవికి ఒక మహిళ మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. ఆమె, ఒకప్పుడు భద్రతా బలగాలు వెంటాడి వేటాడిన ప్రముఖ గెరిల్లా దిల్మా వానా రోసెఫ్ (62) కావడం మరీ విశేషం. గత నెల 24న జరిగిన రెండో దఫా అధ్యక్ష ఎన్నికలలో అధికార వర్కర్స్‌పార్టీ (పీటీ) అభ్యర్థి రోసెఫ్ గెలుపొందినట్టుగా సుప్రీం ఎలక్టోరల్ కోర్టు సోమవారం ప్రకటించింది. సెంట్రిస్ట్ పీఎస్‌డీబీ అభ్యర్థి జోస్ సెర్రాకు, రోసెఫ్‌కు మధ్య జరిగిన ముఖాముఖి పోరులో రోసెఫ్‌కు 55.6 శాతం ఓట్లురాగా, సెర్రాకు 44.4 శాతం ఓట్లు లభించాయి. అక్టోబర్ 3 నాటి మొదటిదఫా ఎన్నికల్లో త్రిముఖ పోటీలో అత్యధిక శాతం ఓట్లు సాధించినా, 50 శాతం కంటే కనీసం ఒక్క ఓటైనా ఎక్కువ సాధించడంలో విఫలమయ్యారు. దీంతో రెండో రౌండ్ తప్పలేదు. సుప్రసిద్ధుడైన దేశాధినేతగా వెలుగొందుతున్న లూయిజ్ ఇనాషియో లూలా డ సిల్వా (లూలా) స్వయంగా రోసెఫ్‌ను తన అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేశారు. రోసెఫ్ జనవరి 1న దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. లూలా తొలి పదవీకాలంలో విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేసిన రోసెఫ్, 2005 నుండి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు వరుసగా అధ్యక్షునిగా పనిచేసినందున ఈ సారి పోటీ చేయలేకపోయిన అధ్యక్షుడు లూలా 2014లో మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగుతానని ప్రకటించారు.

పోరాటమే ఆమె ఊపిరి:  దిల్మా రోసెఫ్ తండ్రి 1920ల నాటి బల్గేరియన్ కమ్యూనిస్టు. స్టాలినిస్టు పాలనలో పారిపోయి బ్రెజిల్‌లో స్థిరపడ్డాడు. రోసెఫ్ హైస్కూల్‌లో చేరే నాటికి బ్రెజిల్ సైనిక నియంతృత్వం (1964 నుంచి 1974) కింద మగ్గుతోంది. సోషలిజం, విప్లవ భావాలు, విద్రోహకర కార్యకలాపాలు ఆమెకు అక్కడే వంటబట్టాయి. కళాశాల రోజుల్లో ఓ రహస్య కమ్యూనిస్టు సంస్థలో చేరి, గెరిల్లాగా మారారు. ఆ సంస్థ ఆర్థిక, ఆయుధ సరఫరా విభాగాలను చాకచక్యంగా నిర్వహించారు. బ్యాంకు లూటీలు, కిడ్నాపులు, హత్యలు, కుట్రలలో ఆరితేరిందంటూ పోలీసులు ఎప్పుడూ నీడలా వెంటాడే వారు. రోజుకో ఇంటిలో నిద్ర పోవాల్సి వచ్చేది. అయినా 1970, 1972లలో పట్టుబడ్డారు. దుడ్డుకరల్ర సత్కారం నుంచి కరెంటు షాక్‌ల వరకు సకల చిత్రహింసలు అనుభవించారు. మూడేళ్లు జైలు జీవితం తరువాత మారిన పరిస్థితుల లో క్షమాభిక్ష పొందారు. అర్థశాస్త్రం, సామాజిక శాస్ర్తాలను అధ్యయనం చేశారు. 2009 మేలో 61 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడి జయించారు.

బ్రెజిల్‌కు లేడీ లీడర్
ఎన్నికలలో మాజీ గెరిల్లా రౌసెఫ్ విజయం
 

జనవరిలో బాధ్యతల స్వీకరణ

ఐరన్ లేడీగా, లాలూ శిష్యురాలిగా ఘన చరిత్ర

బ్రెజిల్ తొలి అధ్యక్షురాలిగా మార్క్సిస్టు మాజీ గెరిల్లా, ఐరన్ లేడీ డిల్మా రౌసెప్ ఎన్నికయ్యారు. 62 ఏళ్ల ఈ నానమ్మ 1970లో గెరిల్లా కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించారు. ఆదివారం జరిగిన ఎన్నికలలో రౌసెఫ్ తన ప్రత్యర్థి సావో పౌలో గవర్నర్ జోసే సెరాను ఓడించారు. ఆమెకు 56 శాతం ఓట్లు దక్కాయి.

దేశంలో సుదీర్ఘకాల నియంతృత్వ సమయంలో ఆమె జైలు పాలయి, చిత్రహింసలకు గురయ్యారు. పదవి నుంచి వైదొలుగుతున్న వామపక్ష నేత లూలా డా సిల్వా స్థానంలో రౌసెఫ్ దేశ సారథ్య బాధ్యతలు చేపడుతారు. సిల్వా ఆమెకు రాజకీయ గురువు కావడం విశేషం. ఆర్థిక, రాజకీయ సంక్షోభ నేపథ్యంలో ఆమె ఈ పదవికి ఎన్నికయ్యారు. ఆమె లూలా క్యాబినెట్ చీఫ్‌గా వ్యవహరించారు.

లాటిన్ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్ అధ్యక్ష బాధ్యతలను ఆమె వచ్చే ఏడాది జనవరిలో చేపడుతారు. లూలా ఏదైనా అంతర్జాతీయ బాధ్యతను స్వీకరించవచ్చునని లేదా రౌసెఫ్ సలహాదారుగా తెరవెనుక ఉండొచ్చునని భావిస్తున్నారు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయను' అని రౌసెఫ్ ఆ తరువాత విలేకరులతో చెప్పారు. లూలా విధానాలనే తాను కొనసాగిస్తానని తెలిపారు. రౌసెఫ్ విజయం కోసం లూలా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిపారు.

నియంతృత్వంపై గెరిల్లా పోరు:  బ్రెజిల్‌లో సాగిన సైనిక పాలనకు వ్యతిరేకంగా రౌసెఫ్ గతంలో సాయుధ పోరాటం జరిపారు. సాయుధ మిలిటెంట్ బృందంలో కీలక పాత్ర పోషించారు. ఈ దశ1967లో ఆమె విద్యార్థిగా ఉండగానే మిలిటెంట్ గ్రూప్‌లో చేరారు. మూడేళ్ల పాటు గెరిల్లా దళానికి నాయకత్వం వహించారు. బల్గేరియా నుంచి వలస వచ్చిన ఓ లాయర్ కూతురైన రౌసెఫ్ తల్లి బ్రెజిలియన్, ఓ స్కూలు టీచరు. 14వ ఏటనే తండ్రి చనిపోయాడు.

లూలా క్యాబినెట్‌లో ఇంధన శాఖను కూడా నిర్వహించిన రౌసెఫ్‌కు ఓ దశలో క్యాన్సర్ సోకినా దాని నుంచి బయటపడింది. తన పాలనాదక్షతతో ఆమె ఉక్కుమహిళగా పేరు తెచ్చుకుంది. 1970లో ఆమెను బ్రెజిల్ సైనిక వర్గాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి.

1973 తరువాత దేశంలో సైనిక పాలన వీగిపోతున్న తరుణంలో ఆమె విడుదలై, చురుగ్గా రాజకీయాలలో పాల్గొన్నారు. 2003లో లూలా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె పలు బాధ్యతలు చేపట్టారు. తన రాజకీయ సంవిధానంలో పలు పరిణామదశలున్నాయని, మార్క్సిజం నుంచి ప్రగతివాద క్యాపిటలిజం వైపు పయనం సాగిందని, అయితే తన విప్లవ గతమే తనకు గర్వకారణమని పలు ఇంటర్వ్యూలలో ఆమె చెప్పారు.

Sunday, October 31, 2010

కొండ రహస్యం

భూమి, సూర్యుడు ఒకప్పుడు భార్యాభర్తలట.
కొన్ని లక్షల సంవత్సరాల పాటు వాళ్లిద్దరే కబుర్లాడుకుంటూ తాము సృష్టించిన లోకాన్ని కన్నుల పండుగగా చూసుకుంటూ ఎంతో ఆనందంగా బతికేసారట.
ఒకానొక అపురూప క్షణంలో వాళ్లు ఒక బిడ్డను కనాలనుకున్నారు. భూమి, సూర్యుడు తలచుకుంటే నెరవేరనిది ఉంటుందా? వెంటనే వాళ్లకు ఓ అందమైన అబ్బాయి పుట్టాడు. మిగతా సృష్టి బాధ్యతనంతా ఆ పిల్లవాడికి వదిలేసి వాళ్లిద్దరూ విశ్రాంత జీవితం గడపసాగారట.
ఆ పిల్లవాడు చెట్టూ చేమా పక్షీ పశువూ ... అలా ఒకటొకటీ సృష్టించుకుంటూ వాటి కోసం సముద్రం నుంచి కొంత కొంత భూమిని తీసుకుంటూ వచ్చాడట.
సముద్రం ఊరుకుంటుందా? అది ఆ అబ్బాయితో పెద్ద కొట్లాట పెట్టుకుందట. సముద్రానికీ పిల్లవాడికీ మధ్య జరిగిన యుద్ధంలో పిల్లవాడి కాలు విరిగిందట.
తల్లి మనస్సు చూస్తూ ఊరుకుంటుందా? వెంటనే నలుగురు మహాకాయుల్ని సృష్టించి తన పిల్లవాడి సృష్టికి నాలుగు దిక్కులా కాపలా పెట్టిందట.

అయినా సముద్రం ఆగలేదు. సముద్రానికి, ఆ మహాకాయులకు మధ్య అనేకసార్లు యుద్ధాలు జరిగాయి. సముద్రం ధాటికి తట్టుకోలేక అవి ఒక్కొక్కటీ మరణించాయి. అయితే మరణించే ముందు తమను కొండలుగా మార్చమని అవి భూమాతను కోరాయట. చచ్చిపోయినా సరే ఈ సృష్టిని కాపలా కాసే బాధ్యతను వదిలి పెట్టబోమనీ, అలా చిరకాలం బతికే వరం ఇవ్వమనీ అవి ఆమెను ప్రార్థించాయట. ఆమె ఒప్పుకుంది.
అప్పటికే ఖండఖండాలుగా నరకబడ్డ ఆ భారీకాయులు భూగోళమంతటా చిన్నా పెద్దా కొండలుగా అవతరించి అప్పటినుంచీ సృష్టిని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాయట.
కొండల పుట్టుక వెనుక ఆఫ్రికా వాళ్లు చెప్పుకునే కథ ఇది. మన పురాణాల్లోనూ వెతికితే ఇలాంటి కథలు బోలెడు దొరకొచ్చు కాని ఏం లాభం? వినేవాళ్లెవరు? నమ్మేవాళ్లెవరు? ఒక్క కరీంనగర్‌లోనే 560 గుట్టల్ని తవ్వి పడేస్తుంటే మాట్లాడేవాళ్లేరీ ... భూమాతతో సహా.

Wednesday, October 27, 2010

అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ .... యూఎఫ్‌ఓ


యు.ఎఫ్.ఓ...డిన్నర్ పళ్లెం
ఎగిరే పళ్లేలలో ఏలియన్లు వస్తున్నారు...మనతోపాటు మన ఇంట్లో డైనింగ్ టేబుల్‌పై డిన్నర్ చేసేందుకు!
అవును ఆ రోజులు ఎంతో దూరంలో లేవు! అమెరికన్లు వారి కోసం సిద్ధమవుతున్నారు... వారికి ఐక్యరాజ్యసమతి స్వాగత సన్నాహాలు చేస్తోంది. ఇక మనం కూడా డిన్నర్ పళ్లేలను ఫలహారాలతో నింపి స్వాగతిద్దామా...!


సరిగ్గా నెల క్రితం ఐక్యరాజ్యసమితి ఒక వింత ప్రకటన చేసింది. యాభై ఎనిమిదేళ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ మజ్లన్‌ఆథ్‌మన్ ఇక పై అంతరిక్షానికి దౌత్యవేత్తగా వ్యవహరిస్తారంటూ ఆ ప్రకటన సారాంశం. ‘అంతరిక్షానికి దౌత్యవేత్త ఏంటి?’ అన్న ప్రశ్నకు సమాధానంగా... ఒకవేళ గ్రహాంతరవాసులు గనుక భూమికి వస్తే ‘ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ (మొట్టమొదటగా కలవవలసిన మనిషి) మజ్లన్ ఆథ్‌మన్ అని తేల్చిచెప్పింది ఐక్యరాజ్యసమితి! ఈ వార్త ఎంతోమందిని విస్తుపోయేలా చేస్తే, ఇంకెంతోమందిని నవ్వుకునేలా చేసింది.
‘ఇది నిజంగా జరిగే పనేనా?! ఉన్నట్టుండి ఇంత అర్జెంట్‌గా ఇలాంటి ప్రకటన వెలువడడానికి కారణం ఏంటీ..?’ ఆలోచించాల్సిన విషయమే!!!

అక్టోబర్ 13, 2010 న్యూయార్క్ సిటీలోని చెల్సీ ప్రాంతవాసులు ఒక్కసారిగా రోడ్డు మీదకి పరుగుతీశారు. అది ఏ భూకంపం నుంచో తప్పించుకోవడానికి కాదు... ఆకాశంలో గుండ్రంగా తిరుగుతున్న సాసర్ల లాంటి వస్తువులు, తెల్లని కాంతిలో మెరిపోతూ కళ్లకు కనిపించేటంత దూరంలో తిరగాడుతుండటమే దానికి కారణం. అక్కడి టివీ ఛానల్ 7 కెమెరాలు ఈ వింతని బంధించటమే కాదు దీనిపై స్పందించమని ఎఫ్‌ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అసోసియేషన్) వారిని కోరింది. అయితే వీటివల్ల విమానాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని మాత్రమే ఎఫ్‌ఏఏ ప్రకటన విడుదల చేసింది. అంతకు మించి ఎటువంటి సమాచారాన్ని బయటకి పొక్కనివ్వలేదు. కాని ఆ రోజు అక్కడ జరిగింది ఓ ‘యుఎఫ్‌ఓ సైటింగ్.’ అంటే... ఆ రోజు ఆకాశంలో గుర్తుతెలియని ఎగిరే పళ్లేలను ప్రజలు చూశారు. అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌గా పేర్కొనే వాటికి సంక్షిప్తరూపమే ఈ... యూఎఫ్‌ఓ.

జులై 7, 2010 చైనాలోని ఝీజియాంగ్ ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కుతున్న ప్రయాణికులను ఉన్నట్టుండి ఆపేశారు. అంతే కాదు ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను గంటపాటు నిలిపివేశారు. కారణాలు చెప్పలేదు. దీనికి కారణం ఆకాశంలో కనిపించిన గుర్తుతెలియని వస్తువని తర్వాత తెలిసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ ప్రక్రియ అధికారులకు తెలిసే జరిగినా ప్రభుత్వం మాత్రం దీని తదనంతరం ఎటువంటి సంజాయిషీ ఇవ్వలేదు. ఇది జరగడానికి కొన్ని గంటల పూర్వం ఆకాశంలో మెరుస్తున్న పొడవాటి వస్తువుని చూశామని ఆ ప్రాంతవాసుల ప్రత్యక్ష కథనం.

ఇవి రెండూ ఈ ఏడాది ప్రపంచం రెండు వైపులా జరిగిన యుఎఫ్‌ఓ సైటింగ్స్. పైగా వీటికి ప్రత్యక్ష సాక్షులతో పాటు టీవీ కెమెరాల బంధించిన ఫుటేజ్ మరింత బలమైన సాక్ష్యం. దానికి తోడు అటు ప్రభుత్వం నుంచి కాని, ఇటు శాస్తవ్రేత్తల నుంచి కాని ఎటువంటి వివరణ లేకపోవటం ఈ సైటింగ్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీవీ కెమెరాలకు కూడా చిక్కిన ఈ అంతుపట్టని వస్తువుల వెనక రహస్యం ఏంటి? ఇవి కేవలం ట్రిక్ ఫొటోగ్రఫీ ద్వారా నిజంగా జరిగినట్టు భ్రమ కల్పిస్తున్నారా? మరప్పుడు ప్రత్యక్షసాక్షుల మాటేమిటి? ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండా ఏం దాస్తున్నాయి? ఒకవేళ ఆ సాసర్లు నిజంగా కనపడితే అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎవరు వీటిని పంపిస్తున్నారు? వీటిలో గ్రహాంతరవాసులు మన లోకాన్ని చూడడానికి వస్తున్నారా? ఒక వేళ అదే నిజమైతే అవి మనలని కలవడానికి ఎందుకు ప్రయత్నం చేయటంలేదు? లేదా మన ప్రపంచం మీదకి దాడికి సిద్ధపడుతూ రెక్కీ చేయటానికి వస్తున్నారా? లాంటి ప్రశ్నలకి జవాబు లేనందువల్లనేమో వీటి పట్ల మరింత ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

మొట్టమొదటి యుఎఫ్‌ఓ సైటింగ్.
యుఎఫ్‌ఓ సైటింగ్ ఈ మధ్యలో మొదలైన ప్రక్రియ కాదు. ఇలాంటిది మొట్టమొదట చూసిన దాఖలా ఆగస్టు 12, 1886 లో జరిగింది. బోనిల్లా అనే ఓ ప్రముఖ ఖగోళ శాశ్త్రవేత్త సూర్యుడిపై పరిశోధనలు జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 283 గుర్తు తెలియని గుండ్రని ఆకారాలను ఆకాశంలో తిరగాడుతూ ఉండటాన్ని గమనించాడు. వాటిని ఫొటోలు కూడా తీశాడు. వీటికి సంబంధించినంత వరకూ మొదటి ఫోటో ప్రూఫ్ ఇదే. అది మొదలు... నేటి వరకూ తరచూ వీటికి సంబంధించిన సమాచారం ‘అదిగో పులి అంటే, ఇదిగో తోక’ చందాన బైటకి వస్తూనే ఉంది.

చూడటం వరకూ ఓకే... కాని వీటివల్ల హాని కలగవచ్చనే భయం అక్టోబర్ 10, 1886లో మొదటిసారిగా కలిగింది. వెనిజులా దేశంలో మరకైబో నగరంలో జరిగిన వింతైన సంఘటన ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. తుఫాను సమయంలో ఆకాశాన ‘ఝుమ్‌మ్‌మ్‌మ్....’మంటూ శబ్దం చేస్తూ తిరుగాడుతున్న ప్రకాశవంతమైన వస్తువు ఓ గుడిసె వద్ద కనిపించింది. కొంతసేపు అక్కడే తచ్చాడిన ఆ వస్తువు తరవాత ఆకాశంలోకి అదృశ్యం అయిపోయింది. తరవాత ఆ గుడిసె చుట్టు కనిపించిన దృశ్యమే అందరినీ భయభ్రాంతులకి గురిచేసింది. గుడిసె చుట్టూ చెట్టూ చేమా పూర్తిగా కాలి బూడిదై కనిపించింది. అంతేకాదు ఆ గుడిసెలో నివసించే వారు రేడియేషన్ పాయిజనింగ్‌కి గురైనట్టు కూడా తరవాత జరిపిన పరీక్షల్లో తేలింది.

అది మొదలు వీటికి సంబధించినంతవరకూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఈ కథలన్నీ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వీటిని చూసిన ప్రత్యక్ష సాక్షుల కథనాలు కొట్టి పడేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఎక్కువగా ఎగిరే పళ్లేల ఆకారంలో ఇవి కనిపించినా వీటిని కోడిగుడ్డు ఆకృతిలో చూసిన వారూ ఉన్నారు. ఆకారం ఏదైనా కళ్లు చెదిరిపోయే తెల్లటి కాంతిని ప్రత్యక్షంగా చూసిన ప్రతీ ఒక్కరూ గమనించారు. కొంతమందికి ఇవి రంగుల లైట్లతో కూడా దర్శనమిచ్చాయి.

టార్గెట్ అమెరికా!
బాగా అభివృద్ధి చెందిన దేశమనో ఏంటో కాని అమెరికా దేశాన్ని సందర్శించే యూఎఫ్‌ఓల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా 1940-60 ప్రాంతంలో యుఎఫ్‌ఓ సైటింగ్స్ ఎక్కువగా అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన సైనిక స్థావరాల పై ఇవి తిరుగాడుతున్నాయన్న విషయంపై ప్రభుత్వం ఒక అధికారిక పరిశోధన (ఇన్వెస్టిగేషన్) ప్రారంభించింది. 1948 జనవరి 7న ఫోర్ట్‌నాక్స్, కెంటకీ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. ఆకాశంలో ఏదో గుర్తుతెలియని వస్తువు తిరుగుతోందన్న వార్త తెలిసిన వెంటనే ఫైటర్ జెట్ దాన్ని వెంబండించటానికి నింగిలోకి ఎగిసింది. కాని ఈ జెట్ మళ్లీ తిరిగి రాలేదు. దానిలోని ఫైటర్ పెలైట్ మృత్యువాత పడ్డాడు. కారణాలు బైటకి రాలేదు. 1952 లో వరుసగా రాడార్‌పై కనిపించిన ఈ యుఎఫ్‌ఓలు అక్కడ దేశవ్యాప్తంగా మొదటిపేజీ ప్రధాన కథనంగా మారాయి. దాంతో ఈ విషయాలను దర్యాప్తు చేయాల్సిందిగా అక్కడి ప్రభుత్వం సిఐఏకు కేసు అప్పగించింది. అయితే ఈ సంగతులేవీ బైటకి పొక్కకుండా జాగ్రత్త పడింది.

మానవులతో కాంటాక్ట్
1957లో బ్రెజిల్ దేశానికి చెందిన ఆంటోనియో విల్లాస్ బోయాస్ అనే వ్యక్తి రాత్రి పూట పని పూర్తి చేసుకొని, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై కార్లో రేడియో వింటూ ఇంటికి వెళ్తున్నాడు. సడెన్‌గా రేడియో వింత వింత శబ్దాలు చేయటం మొదలు పెట్టింది. కారు ఉన్నట్టుండి ముందుకి వెళ్లనని మొరాయించింది. ‘ఏంటా?’ అని ఆలోచిస్తున్న ఆంటోనియో కళ్లు తిరిగిపోయే దృశ్యాన్ని చూశాడు. కారుకి ఎదురుగా పెద్ద శబ్దం చేస్తూ ఆకాశంలో వెలిగిపోతూ పళ్లెం ఆకారంలో స్పేస్‌షిప్‌ని పోలిన వస్తువొకటి కనపడింది. జరిగిన దాన్నుంచి తేరుకునేలోగానే ఎగిరే పళ్ళెం లాంటి వస్తువులో వచ్చిన ఏలియన్లను పోలిన వ్యక్తులు అతనని బంధించి తీసుకువెళ్ళారు.

ఆంటోనియా కథనం ప్రకారం ఆ స్పేస్‌షిప్‌లో అత్యంత ఆధునాతన సైన్స్ లెబొరేటరీ ఉందని... అందులో ఉన్న ఏలియన్లు అతడిని బల్లమీద పడుకోబె ట్టి వింత వింత ఉపకరణాలతో అతనిపై రకరకాల పరీక్షలు జరిపారని తెలిపాడు. పరిశోధనల అనంతరం అతడిని తిరిగి భూమి పైన వదిలేసి వెళ్లిపోయారు. ఆంటోనియో మాటల్లో సత్యం ఉందనటానికి అతని శరీరంపై అంతకుముందులేని మచ్చలు హటాత్తుగా ప్రత్యక్షమవ్వటమే. ఇవి ఏలియన్లు అతనిపై పరిశోధనలు జరిపారనటానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇది మొదలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వ్యక్తులు మరికొంతమంది ముందుకు వచ్చారు. వీటిని పరీక్షించిన డాక్టర్లు ఇవి ఎంతో అత్యాధునికమైన (సొఫెస్టికేటెడ్) పరికరాలతో, ఎంతో నైపుణ్యం ఉన్న డాక్టర్లు మాత్రమే చేయగలిగినవిగా గుర్తించారు.
- కె. ఎం

ప్రత్యక్ష సాక్షి


1969లో జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేస్తున్నప్పుడు లీరీ అనే పట్టణం దగ్గర్లో తాను యుఎఫ్‌ఓను చూశానని అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ చెప్పిన ఉదంతం ‘జిమ్మీ కార్టర్ యుఎఫ్‌ఓ ఇన్సిడెంట్’గా ప్రఖ్యాతి గాంచింది. ఈ విషయమై అతను 1973లో ఇంటర్నేషనల్ యుఎఫ్‌ఓ బ్యూరో అభ్యర్థన మేరకు ఒక రిపోర్ట్‌ను కూడ ఫైల్ చేశారు. తాను చూసిన వస్తువు తెల్లని కాంతితో మెరిసిపోతూ ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పోలి ఉందని ఆ రిపోర్ట్‌లో కార్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ రోజు అక్కడే కార్టర్‌తో ఉన్న మరో పదకొండు మంది వ్యక్తులు కూడా ధృవీకరించారు. దాదాపు 10 నిముషాల పాటు రంగుల కాంతులని చిందించిన ఆ వస్తువు తిరిగి ఆకాశంలో అదృశ్యం అయిపోయిందన్నది వీరి కథనం.

క్రాప్ సర్కిల్స్... పొలాల్లో యుఎఫ్‌ఓలు
అమెరికాలోని క్యాన్సెస్ రాష్ట్రంలో రైతులు ఓ కొత్త తరహాలో యుఎఫ్‌ఓల ఉనికిని గుర్తించారు. ఉదయం లేచేటప్పటికి పొలాల్లో ఎంతో నైపుణ్యంతో ఎవరో చేసినట్టు గుండ్రని వలయాలు దర్శనమిచ్చాయి. ఇదేం పెద్ద విషయం కాదనుకునే వారికి ఆ వలయాలు ఒక్కొక్కటి కొన్ని మీటర్ల పొడవుతో ఉండటమే కాదు అవి ఏర్పడిన చోటు గడ్డి మొత్తం కాలిపోయి ఉంది. అలాంటి ఒక వలయం చేయడానికి మనుషులకి కనీసం 9-10 గంటల సమయం పడుతుంది.

అది కూడా ఏదైనా మిషన్ సహాయంతో! కాని అక్కడ దర్శనమిచ్చినవి ఒకటి రెండు వలయాలు కాదు... దాదాపు 10 వరకు ఉన్నాయి. అంటే ఒకవేళ మానవమాత్రులు పూనుకుని వాటిని రూపొందించాలన్నా వాటిని తయారు చేయడానికి ఒక రాత్రి సరిపోదు! అంతేకాదు అక్కడి రైతులకి తమ పశువుల్లో కొన్ని గల్లంతవడం, మరికొన్నింటి అవయవాలు తీసేసి వాటి కళేబరాలు మాత్రం పడేయడం వారిలో ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించాయి. పరిశోధనల తరవాత తేలిన విషయం ఏంటంటే ఆ వలయాకృతులు మానవులు రూపొందిచలేరనీ... ఏవో చాలా బరువైన వేడి వస్తువులు అక్కడ వాలినందుకే అవి ఏర్పడ్డాయని తెలిసింది. కాని అవేమిటో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కలేదు.

అంతా ట్రాష్...

‘గ్రహాంతరజీవులా, ఫ్లయింగ్ సాసర్లా... అంతా ట్రాష్!’ అంటూ కొట్టి పడేసే వారూ ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వేరే దేశాల పైకి వేగుల్లాగా, గూఢచారిగా పనిచేయడానికి వాడే విమానాలకు ‘ఎగిరే పళ్లేలు’ అని పేరు పెట్టారన్నది వీరి వాదన. అందుకే వీటి వెనకాల అంత రహస్యం అంటారు. కాని ఈ యుఎఫ్‌ఓ లను చూసినవారిలో సామాన్య ప్రజలే కాదు, శాస్తవ్రేత్తలు, పోలీస్ అధికారులు, పెలైట్లు. సమాజంలో బాధ్యాతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు, అంతెందుకు అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ కూడా ఉన్నారంటే... ఇవి ఉన్నాయనే కదా అర్థం?!

పి.ఎస్: 2005, ఏప్రిల్7న అమెరికా ప్రెసిడెంట్ నివాసమైన వైట్ హౌస్‌ని యుఎఫ్‌ఓ సైటింగ్ కారణంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2007, మార్చి 7న లో మన దేశ ప్రధాని నివాసం దగ్గర రెండు యుఎఫ్‌లో దర్శనమిచ్చాయి.

Monday, October 25, 2010

Dirty fun at mud festival

The Paleo is the largest Switzerland open-air music festival.Students and festival volunteers paid tribute to the 40th anniversary of the Woodstock music festival by spreading the fun of mud as it was done in 1969 in Upstate New York.According to the festival organization, the project is a “back to the earth” psychedelic inspiration and 100% recyclabledirty festival (6)


dirty festival (7)
Mud is also used in medical porpuse, the health benefits that users swear by are not scientifically proven, but you know what you feel. The mud treatment is said to help clear clogged pores. Toxins are removed from the body as well. Those who suffer from pain in their muscles and joints have found relief through mud baths
dirty festival (5)
dirty festival (4) dirty festival (3)
dirty festival (2)
dirty festival (1) dirty festival dirty festival (8)

So you can combine two usufull stuff in one, music festival and mud beauty and healthy treatment to heal and rejuvenate the entire body.

ముగాబే భార్య ప్రేమాయణం * రిజర్వ్‌బ్యాంకు అధిపతితో ఐదేళ్లుగా కొనసాగిన వ్యవహారం

పాణభయంతో ముగాబే భార్య ప్రియుడు
మాజీ ప్రియుల్లో ఒకరి అనుమానాస్పద మృతి, మరొకరి పరారీ



జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే భార్య గ్రేస్ ముగాబే ఒక బ్యాంకర్‌తో నడిపిన ప్రేమాయణం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాబర్ట్ ముగాబేకు సన్నిహితుడైన జింబాబ్వే రిజర్వ్ బ్యాంకు అధిపతి గిడియన్ గోనోతో దాదాపు ఐదేళ్లు గ్రేస్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు బ్రిటిష్ దినపత్రిక ‘డెయిలీ మెయిల్’ వెల్లడించింది. ఈ వ్యవహారం బయటపడటంతో గోనో ప్రాణభయంతో వణికిపోతున్నాడని తెలిపింది. ఈ కథనం ప్రకారం... రాబర్ట్ ముగాబే (86) కంటే గ్రేస్ వయసులో 41 సంవత్సరాలు చిన్న. ముగాబేకు సన్నిహితుడైన గోనోతో ఆమె పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ తరచు రహస్యంగా కలుసుకునే వారు. గ్రేస్‌కు చెందిన డెయిరీ ఫాంలోను, హోటళ్లలోను నెలకు కనీసం మూడుసార్లయినా కలుసుకునే వారు. ఐదేళ్లకు పైగా సాగిన ఈ వ్యవహారం ముగాబేకు మాత్రం ఈ ఏడాది జూలైలోనే ఆయన సోదరి సబీనా ద్వారా తెలిసింది.

సబీనా మరణశయ్యపై ఉన్న సమయంలో గ్రేస్ రహస్య కార్యకలాపాల వివరాలను తన సోదరుడు ముగాబేకు చెప్పింది. ముగాబేను 1996లో వివాహమాడినప్పటి నుంచి గ్రేస్‌కు గోనోతో పరిచయం ఏర్పడింది. జింబాబ్వే రిజర్వ్ బ్యాంకు అధిపతిగా కొనసాగుతున్న గోనో భాగస్వామ్యంతో ఆమె పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గోనో హయాంలోనే జింబాబ్వేలో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుని, కరెన్సీకి విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం అతడు 47 పడక గదులు, ఈతకొలను తదితర వసతులు గల విలాస సౌధంలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. గోనో, ముగాబే భార్య గ్రేస్ ప్రేమికులని గోనో కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ముగాబే మరణించాక కలసి జీవించాలని కూడా వారు నిర్ణయించుకున్నారని తెలిపారు. గ్రేస్‌కు ఇదొక్కటే వ్యవహారం కాదు, ఇదివరకు పీటర్ పామైర్, జేమ్స్ మకాంబా అనే వారితోనూ ప్రేమాయణాలు ఉన్నాయి. పీటర్ ఒక అనుమానాస్పద కారు దుర్ఘటనలో మరణించగా, జేమ్స్ దేశాన్ని విడిచి పారిపోయాడు. తాజా వ్యవహారం బయటపడటంతో గోనో ప్రాణభయంతో భీతిల్లుతున్నాడని జింబాబ్వే ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.

Sunday, October 24, 2010

కాంగోలో జీవితం తుపాకీ మీద సామే!

నిత్యం తుపాకీ మోతలు.. ఏ బాంబు ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియని పరిస్థితి.. దారికాచి దోచుకునే దొంగలు... ఇంటి నుంచి బయటికిపోయి మళ్లీ ఇంటికి వచ్చేదాకా ప్రాణం మీద నమ్మకం లేని జీవితం గడపడమంటే ఎట్లా ఉంటుంది? ఊహిస్తేనే అమ్మో అనిపిస్తోంది కదూ.

కానీ అలవాటు పడితే అవన్నీ జీవితంలో భాగమవుతాయి అంటారు పరుపాటి శ్రీనివాసరెడ్డి. దేశం కానీ దేశంలో.. తన భాషరాని మనుషుల మధ్య ఆరేళ్లుగా జీవితాన్ని తుపాకీ మీద సాములాగా సాహసంతో నెట్టుకువస్తున్నాడీయన. కాంగో దేశంలోని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఓ) పీస్ కీపింగ్ మిషన్‌లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తోన్న ఆయన అనుభవాలు నిన్న యుఎన్ఓ డే సందర్భంగా...

"నా పేరు పరుపాటి శ్రీనివాసరెడ్డి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకొర్పోలు మా గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నలుగురు అన్నదమ్ములు. ముగ్గురు అక్కచెల్లెళ్లు. డిగ్రీ నర్సంపేటలో చేశాను. ఎంకాం ఉస్మానియా యూనివర్సిటీలో, ఐసీడబ్ల్యూఏ ఇంటర్ విజయవాడలో చేశాను. మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకునేవాణ్ని. అందుకోసం కంప్యూటర్ తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. కంప్యూటర్ (సాఫ్ట్‌వేర్) నేర్చుకునే దగ్గరే టర్న్ అయింది జీవితం.

అప్పట్లో సాఫ్ట్‌వేర్ బూమ్ బాగా ఉంది. నేను మొదటి నుంచి బ్రిలియంట్‌నేం కాదు. బిలో యావరేజ్ స్టూడెంట్‌ను. నేను టెన్త్ థర్డ్‌క్లాస్‌లో పాసయ్యాను. అటువంటిది నెమ్మది నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ సాఫ్ట్‌వేర్ దగ్గరకొచ్చేసరికి యావరేజ్ అయ్యాను. ఇంటర్‌నెట్ చూడటం, ఛాటింగ్ చేయడం అప్పట్లో హాబీగా ఉండేది. ఆన్‌లైన్లో ఈ ఉద్యోగం సంపాదించుకున్నాక ఒక సంవత్సరం కొసావో (యుగోస్లావియా)లో పనిచేశాను.

ఆ తరువాత పూర్తిస్థాయిలో యుఎన్ లోటస్ నోస్ డెవలపర్‌లో ప్రోగ్రామర్‌గా 2004, సెప్టెంబర్ 4 నుంచి కాంగోలో పనిచేస్తున్నాను. శాంతి పరిరక్షణ కోసం, ప్రజల భద్రత, వనరుల భద్రత కోసం యుఎన్ఓ ఎన్నో దేశాల్లో పీస్ కీపింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. మేం చేయాల్సిందల్లా యుఎన్‌కు సంబంధించిన విధానాలను అమలు చేయడమే. వివిధ దేశాల నుంచి ఎంతో మంది శాంతిపరిరక్షణ కోసం ఈ మిషన్‌లో భాగం పంచుకుంటున్నారు.

కాంగోలో ఇండియన్ కాంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంటుంది. మిలిటరీ పరంగా కానీ, ఇతరత్రా సహాయ సహకారాల పరంగాగానీ. మేం చేయాల్సింది ఆయా సందర్భాల్లో ట్రూప్స్‌కు ప్రోగ్రామ్స్‌ను (సాఫ్ట్‌వేర్ పరంగా) డెవలప్ చేయడం, వాటిలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే పరిష్కరించడం అంతే.

ఎప్పుడూ గొడవలే...
మా అవసరం ఎక్కడుంటే అక్కడికి రోజూ వెళ్లాల్సి ఉంటుంది. మామూలుగా డ్యూటీ టైమింగ్స్ అంటే ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 దాకా ఉంటుంది. శనివారం ఒక పూటే. అయితే డ్యూటీ ప్లేస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం ఏ మూడో నాలుగో అవుతుంది. ఆదివారం సెలవు తప్పనిసరేం కాదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. జీవితం క్షణం క్షణం రిస్క్‌గానే ఉంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే లైఫ్ ఎప్పుడూ గొడవలు, కొట్లాటల మధ్యే సాగుతూ ఉంటుంది. రాళ్లు విసురుకోవడాలూ కాల్పులూ తరచుగా ఉంటాయి. మొదట్లో భయం వేసేది. ఇప్పుడు అలవాటైంది (నవ్వుతూ). మొదట చాలా కాలం అక్కడి భాషరాక ఇబ్బంది పడ్డాను. కాంగోలో ఎక్కువగా స్వాహిలీ భాష మాట్లాడతారు. దాంతో పాటు ఫ్రెంచ్, ఇంగ్లీష్‌లు కూడా మాట్లాడతారు.

అయితే ప్రజలతో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి మాకు. ఇంగ్లీష్ ఎలాగూ వచ్చు. ఇప్పుడు స్వాహిలీ, ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నాను. పనిచేయడానికి భాష పెద్దగా అడ్డుకాదు. అక్కడి ప్రజలు చాలా మంచివారు. నల్లగా, పొట్టిగా ఉంటారు. వాళ్లకున్నన్ని సహజవనరులు ఎక్కడా లేవనిపిస్తుంది నాకు. బంగారం, రాగి, బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి.

వనరుల ఆధిపత్యం కోసమే కాంగో ప్రభుత్వానికీ, తిరుగుబాటు దార్లకూ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. రెబల్ గ్రూప్స్‌కి ్రపైవేట్ ఆర్మీ పెద్ద సంఖ్యలో ఉంటుంది. దాడుల సమయంలో రాళ్లు విసురుకోవడం, గ్రూపుల మధ్య కాల్పులు జరగడం సర్వసాధారణ దృశ్యాలు. కిన్సాసా, గోమా, కిగాలి లాంటి ప్రాంతాల్లో గొడవలు ఎక్కువ. మేము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేం.

కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే మాకు పూర్తి భద్రత ఉంటుంది. యుఎన్ వాహనాల్లో మాత్రమే వెళతాం. అప్పుడప్పుడు మేం ప్రయాణించే వాహనంపైనా దుండగులు రాళ్లు విసురుతారు. ఒక్కోసారి రెండు రోజులపాటు ఇంటికి తిరిగి రాలేము.

మా ఆవిడ బోరున ఏడ్చింది...
నాకు 2006లో మమతతో పెళ్లి అయింది. వాళ్లది నర్సంపేట. పెళ్లికి ముందే నా డ్యూటీ గురించి, జీవితం గురించి వివరంగా చెప్పాను. కొంతకాలం ఇక్కడే ఉంది. ఆ తరువాత 'నేనూ వస్తాను' అని పట్టుబట్టింది. ఆమెను అక్కడికి తీసుకెళ్లాలంటే యుఎన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఎలాగోలా అక్కడికి తీసుకెళ్లాను. ఇప్పుడు ఆమె నాతోనే ఉంటుందక్కడ. మొదట్లో మేం కిన్సాసాలో ఉండేవాళ్లం. ఇప్పుడు గోమాలో ఉంటున్నాం. మేం ఉండేది పైఅంతస్తులో.

మా కింది పోర్షన్‌లో శ్రీలంక ఫ్యామిలీ ఉండేది. అనుకోకుండా పెద్ద గొడవ జరిగి అది కాల్పుల దాకా వెళ్లింది. శ్రీలంకకు చెందిన ఒకావిడ, పేరు గుర్తుకురావడం లేదు, మా మిషన్‌లో పనిచేసే వ్యక్తి భార్య పెద్దపెట్టున అరుపులు, పెడబొబ్బలు పెడుతోంటే ఈమే (మమత) కాల్పులు జరుగుతున్నా సరే ధైర్యంతో కిందికి దిగి ఆమెను మా పోర్షన్‌లోకి తీసుకొచ్చింది.

ఆ సమయంలో నేను డ్యూటీలో ఉన్నాను. రెండు రోజులు పరిస్థితులు అనుకూలించక అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత మీదపడి బోరున ఏడ్చింది. నాకూ కన్నీళ్లు ఆగలేదు. ఆ సంఘటన గుర్తుచేసుకుంటే ఇప్పటికీ గగుర్పాటే.

వీకెండ్స్ కొంచెం హ్యాపీ
మా మిషన్ పనితీరును పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు ఐరాస దేశాల ప్రతినిధులు తరచూ వస్తుంటారు. కోఫీ అన్నన్ (యుఎన్ఒ మాజీ సెక్రటరీ జనరల్), హిల్లరీ క్లింటన్ ఇతర ప్రముఖులు కూడా తరచూ వచ్చి మాకు సలహాలు ఇస్తుంటారు. అటువంటివాళ్లను దగ్గరగా చూడటం సంతోషంగా ఉంటుంది. ఇటువంటి జీవితానికి వీకెండ్స్ కొంచెం హ్యాపీనిస్తాయి.

వీకెండ్స్‌కు ఇండియన్ ఫ్యామిలీస్ అంతా ఒక్కచోట చేరుతాం. ఎక్కువగా కాంగో సరిహద్దు దేశాల్లో గడిపేందుకు ఇష్టపడతాం. ఉగాండా, రువాండ, అంగోలా, టాంజానియా, బురుండీ, జాంబియా దేశాలకు అప్పుడప్పుడూ వెళతాం. మేముంటున్న గోమా రువాండాకు దగ్గర. దాని రాజధాని కిగాలి భలే బాగుంటుంది. అందుకే అక్కడికి ఎక్కువసార్లు వెళతాం.

అక్కడి లోకల్ తిండి తినలేం. వాళ్లు మాంసాహారులు. బీఫ్, బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటారు. మాకు అవి పడవు. కనుక ఇండియన్ ఫుడ్‌నే తీసుకుంటాం. రైస్ ఎంత కాస్ట్ అయినా సరే కొంటాం (5కిలోల బియ్యం ధర అక్కడ రూ. 700. అంటే కిలో బియ్యం రూ.140 అన్నమాట). గోధుమ పిండిని చపాతీ పౌడర్ అంటారు దాన్ని ఎంత దూరంలో ఉన్నా సరే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం.

కూరగాయలు బాగా దొరుకుతాయి. కాఫీతోటలు విస్తారంగా ఉంటాయి కనుక ధర కొంచెం తక్కువగా ఉంటుంది. బతకడానికి పోయాం కానీ తినేందుకు కాదు కదా అనిపిస్తుంది. లంచ్‌బాక్స్ ఇంటి నుంచే తప్పనిసరి తీసుకెళతాను. హ్యాపీనెస్ అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదు. చేసే పనే హ్యాపీ అనుకోవాలి. ఆ మిషన్‌లో పనిచేసే అవకాశం దొరకడమే గ్రేట్‌గా ఫీలవుతాను.

కంప్యూటర్‌తోనే కాలక్షేపం - మమత
ఆయన డ్యూటీకి వెళ్లాక కంప్యూటర్‌తోనే ఎక్కువ సేపు ఉంటాను. పెళ్లికి ముందు ఆయన చేసే జాబ్ గురించి చెబితే 'అంత రిస్క్ ఉంటుందా?' అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లి చూశాక చచ్చేంత భయం వేసింది. అయినా సరే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రోజు ఆమెను మా రూంకి తీసుకొచ్చాను. ఆయన తిరిగొచ్చే దాకా భయమే.

కొద్దిరోజులు బాగా భయపడ్డాను కాని తరువాత అలవాటైపోయింది. ఎక్కడ చూసినా పచ్చదనం, కొండలూ లోయలూ బావుంటుందక్కడ. మా వాళ్లను తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూపించాలనిపిస్తుంది. వీకెండ్స్‌లో ఇండియన్ ఫ్యామిలీస్ కలిసినపుడు చాలా సరదాగా ఉంటుంది. ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. నాకు హిందీ వచ్చు. ఇంగ్లీష్ ఓ మాదిరిగా నేర్చుకున్నాను.

మా ఇంట్లో పనమ్మాయితో కొంత టైమ్‌పాసవుతోంది. ఆమె స్వాహిలీ మాట్లాడుతుంది. నేనూ ఆ భాష నేర్చుకొన్నాను. ఇంటర్‌నెట్‌లో సినిమాలు చూస్తుంటాను. మా తమ్ముడితో, అక్కయ్యలతో అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడతాను. మా ఇళ్లలో జరిగే ఫంక్షన్స్‌కు రాలేక పోతున్నామని బాధగా ఉంటుంది. అయినా అక్కడ ఎంతకాలం ఉంటాం? ఇంకో నాలుగైదేళ్లున్న తరువాత ఇండియాకే వచ్చి ఇక్కడే సెటిల్ అవుతాం.

పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిరాభివృద్ధి

ఉపాధికి 'పచ్చ' దిక్కు


వాతావరణం కలుషితమవుతోంది.. ఓజోన్ పొర క్షీణిస్తోంది... భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి..అని గగ్గోలు పెట్టిన ప్రపంచం ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించే పనిలో పడింది. 'రీయూజ్, రెడ్యూస్,రీసైకిల్', వెల్త్ ఆవుట్ ఆఫ్ వేస్ట్, గ్రీన్ కన్‌స్ట్రక్షన్స్ , గ్రీన్ టెక్నాలజీ, ఎకో ఫ్రెండ్లీ, గో గ్రీన్...సేవ్ గ్లోబ్...అంటూ పదేపదే వల్లెవేస్తోంది. అందుకే 'ఎకో ఫ్రెండ్లీ' అంటేనే ఓ బ్రాండ్ అయిపోయింది. ఈ పరిణామం ప్రధానలక్ష్యం పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిరాభివృద్ధి కూడా. అంటే ఒక హాని ఆరోగ్యకరమైన కొత్త అభివృద్ధికి నాంది పలుకుతోందన్నమాట. ఇదే ఇప్పుడు ఉపాధి అవకాశాల వెల్లువను సృష్టిస్తోంది. వీటి గురించి ఉస్మానియా యూనివర్శిటిలో పనిచేసి రిటైరై 'సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్'కి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త కె. పురుషోత్తమ్‌రెడ్డి చెప్పిన 
విశేషా లు. 

ఎన్నడూ లేంది మూడు నెలల కిందట... మాస్కోలో భయంకరమైన క్షామం తాండవించింది. మొన్నటికిమొన్న చైనా, పాకిస్థాన్‌లను భీభత్సమైన వరదలు ముంచెత్తాయి. మన దేశానికి వస్తే... ఎప్పుడూ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో మగ్గే జైసల్మేర్‌లో చిరపుంజిని మించిన వర్షపాతం నమోదైంది. మైనస్ 45 డిగ్రీల టెంపరేచర్‌తో గడగడా వణికే దేశాలు సైతం ఎండతో మండిపోతున్నాయి. వింటే విచిత్రంగా అనిపిస్తోంది కదూ... ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ మరి. భూవాతావరణం వేడెక్కడం, రుతువులు గతితప్పడం ఫలితంగా ఎండైనా, వానైనా, చలైనా ఎక్కువగా ఉండడం. ఇలా వాతావరణం ఎఫెక్టవడమే కాదు దానికి సంబంధించి గొలుసు కట్టులా ఉన్న చాలా విషయాల్లో నష్టం జరుగుతోంది, జరగబోతోంది కూడా. ఇప్పటివరకు దుష్ప్రభావం చూపిస్తున్నవాటిపట్ల మనమేం చేయలేకపోయినా ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడానికి మాత్రం చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ, ఎకో ఫ్రెండ్లీ, గో గ్రీన్,సేవ్ గ్లోబ్ వంటివి ఈ నేపధ్యంలో నుంచి పుట్టినవే. ఎనలేని ఉద్యోగాల వనరులుగా ఉన్నవి కూడా ఇవే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తరం భవిష్యత్తంతా 'పచ్చ'దనమే. ఇదంతా ఎలా మొదలయిందంటే...

ఆక్సిజన్ పుట్టడం వల్లే...

పరిశ్రమలు విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్‌లను ఓజోన్‌కు హాని కలిగించే వాయువులుగా మొట్టమొదట గుర్తించారు. అయితే తర్వాత జరిగిన పరిశోధనల్లో ఇంకా అనేక వాయువులు బయటపడ్డాయి. వీటన్నిటినీ కలిపి ఓడిఎస్- ఓజోన్ డిఫ్లిటెటీవ్ సబ్‌స్టాన్సెస్ అంటున్నారు. గాల్లో పైకెళ్లి ఓజోన్‌ను చేరుకున్నాక ఇందులోని క్లోరిన్ తనకుండే సహజ గుణమైన ఆక్సిజన్‌ను పుట్టించడమనే పనిని దిగ్విజయంగా సాగిస్తుంది. కాని ఓజోన్‌పొర ఉన్న చోట మనకు ఆక్సిజన్ అవసరం లేదు. అయితే క్లోరిన్‌కు ఈ విషయం తెలియదు కదా.. అందుకే అది తన పని తాను చేసుకుపోతుంది. ఓజోన్‌పొర క్షీణిస్తోంది.

కొత్త అభివృద్ధి మొదలు

వనరులను విచ్చలవిడిగా వాడుకోవడం, ఆ దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం వంటివి కూడా ఓజోన్ పొర క్షీణించడం లాంటి దుష్ఫలితాలనిచ్చాయి. ఇదొక్కటే కాదు మనం చేసిన చాలా చర్యలు భూమ్మీదే కాకుండా జల సంపద మీదా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపాయి. ఒకొక్కటీ బయట పడుతుంటే ప్రపంచం ఉలిక్కిపడింది. అగ్రరాజ్యాలు వణికిపోయాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఐక్యరాజ్యసమితి 1987 సెప్టెంబరు 16న కెనడాలోని మాంట్రియల్‌లో ఓ అంతర్జాతీయ సదస్సును ఏర్పాటుచేసింది. ఆ సమావేశంలో ఓజోన్ పొరను రక్షించుకోవడం అత్యవసరమని భావించాయి. అందుకు దాదాపు అన్ని దేశాలు సమ్మతిని తెలుపుతూ ఓ డాక్యుమెంట్ మీద సంతకాలు చేశాయి. దీన్నే మాంట్రియల్ ప్రొటోకాల్ అంటున్నారు.

మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ఓజోన్‌కు హాని చేసే సిఎఫ్‌సి (క్లోరోఫ్లోరో కార్బన్స్) వాయువుల ఉత్పత్తి, వాడకాలను నిషేధించాలి. అయితే ఎసి, ఫ్రిజ్‌లు, కోల్డ్‌స్టోరేజ్‌లాంటివి ఒకప్పుడు విలాసాలుగా ఉన్నా తర్వాత అత్యవసరాలుగా మారాయి కాబట్టి వాటి వాడకాన్ని తగ్గించుకునే వీలు లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? సిఎఫ్‌సికి ప్రత్యామ్నాయంగా, పర్యావరణానికి హాని కలిగించని కొత్త మూలకాలను వెతుక్కోవాలి. అలాంటి మూలకాల మీద దృష్టిపెట్టారు పరిశోధకులు. ఎన్నో పరిశోధనల ఫలితంగా సిఎఫ్‌సి ప్రత్యామ్నాయ మూలకాలు వెలుగుచూశాయి. ఈ ప్రాసెస్ అంతా సంబంధిత రంగాల్లో ఉద్యోగవకాశాలను కల్పించింది. ఒక్క ఓజోన్ విషయంలోనే కాదు పర్యావరణానికి హాని చేస్తున్న అనేక విషయాల్లో ప్రత్యామ్నాయాల కోసం జరుగుతున్న అధ్యయనాలు, పరిశీలనలు, పరిశోధనలు, ఫలితాలే ఒక్కొక్క రంగంలో అనేక అవకాశాలను అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు చర్చల్లో ఉన్న గ్లోబల్ వార్మింగ్ నివారణా ప్రయత్నాలు కూడా ఇలాంటి కొత్త అవకాశాలను చూపించబోతోంది.

సేఫ్ అండ్ క్లీన్...

ఇప్పటిదాకా విచ్చలవిడిగా వాడుతూ ఎన్నో దుష్పరిణామాలకు కారణమైన ఎనర్జీని అదుపు చేయాలని నిర్ణయించాం బాగానే ఉంది. కాని శక్తి లేందే ఏ పనీ జరగదు కదా...మరెలా? అప్పుడే మన కళ్లకు సూర్యుడు కనిపించాడు. మిరుమిట్లు గొలిపే ఆ కాంతి ఎంత వాడినా తరగని శక్తి. ఇంకేముంది సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునే యత్నాలు మొదలయ్యాయి. కరెంటు, పెట్రోలియం ఉత్పత్తులన్నింటికీ సౌరశక్తే ప్రత్యామ్నాయం కాబట్టే ఈ రంగంలో అవకాశాలుు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు శక్తికి ప్రకృతిలో వీచే గాలి కూడా మరో ప్రత్యామ్నాయంగా తోచింది. ఫలితంగా గాలిమరలు నిలిచాయి. ఇలా శక్తి వినియోగాన్ని అదుపు చేసే విషయంలో జరిగిన ఎన్నో పరిశోధనల్లో జియోథర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్, థైడల్ ఎనర్జీ (సముద్ర అలల నుంచి శక్తిని తీయడం) హానిలేని శక్తివనరులుగా తేలాయి. అలాగే హైడ్రోజన్‌ని కూడా పర్యావరణానికి హాని చేయని శక్తి వనరుగా భావిస్తున్నారు కాబట్టి దీనికీ బ్రహ్మాండమైన భవిష్యత్తుంది. ప్రస్తుతం లోకమంతటినీ ఆకర్షిస్తోన్న అతిముఖ్యమైన శక్తి వనరు జియోథర్మల్.

హాట్‌స్పాట్ ఎనర్జీ

గ్లోబల్ వార్మింగ్‌కి ప్రధాన కారణం బొగ్గే కనక ఇకముందు థర్మల్ పవర్ మూతపడనుంది. దానికి బదులుగా వృద్ధి చెందుతున్న అనేక ప్రత్యామ్నాయాల్లో ఒకటే ఈ జియోథర్మల్. భూమిలోపలున్న వేడి ప్రదేశాల నుంచి కరెంటును ఉత్పత్తి చేయడమే జియో థర్మల్. వీటినే హాట్ స్పాట్స్ అంటున్నారు. మన దేశంలో జమ్ముకాశ్మీర్, రాష్ట్రంలో రెంటచింతల అనే ప్రాంతాల్లో హాట్‌స్పాట్స్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇంకా అనేకప్రాంతాల్లో సర్వేలు జరుగుతున్నాయి. దీన్నెలా ఉత్పత్తి చేస్తారంటే... ముందు హాట్‌స్పాట్స్‌ను గుర్తిస్తారు. నేల స్వభావాన్నిబట్టి ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోతు వరకు పక్కపక్కనే రెండు బోర్లను వేస్తారు. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలో ఈ రెండింటినీ కలుపుతారు. లోపల 250 డిగ్రీల నుంచి 300 డిగ్రీల టెంపరేచర్ ఉన్న చోట ఒక పైపు నుంచి నీళ్లను పంపిస్తారు. ఆ వేడికి నీళ్ల నుంచి ఆవిరి పుడుతుంది. ఆవిరితో పక్కనే ఉన్న టర్బైన్స్ తిరుగుతాయి. టర్బైన్ తిరుగుతుంటే కరెంట్ పుడుతుంది. ఇది బొగ్గును మండించి తీసే విద్యుత్‌చ్ఛక్తి కన్నా కొన్ని రెట్లు సురక్షితమైనది. ఎలాంటి కాలుష్యం ఉండదు. అందుకే ప్రస్తుతం ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి కొన్ని వేల ఉద్యోగాలను అందిస్తోంది.

అవకాశాలు కల్పించడంలో బయోగ్యాస్ పాత్రా తక్కువేమీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో దీనికున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. కొందరు రైతులైతే తమ పైర్లకు బయోగ్యాస్ కరెంటుతో నడిచే మోటార్లతోనే నీళ్లు పడుతున్నారు. బయోగ్యాస్ కూడా ఆ రంగంలో కొత్త అన్వేషణలకు మార్గం చూపెడుతోంది. ఇవేకాదు వ్యర్థాల నుంచి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సాలిడ్ వేస్ట్‌ను మండించి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రంగంలో కూడా వేల సంఖ్యలో ఉపాధి మార్గాలు పుట్టుకొస్తున్నాయి.

నిర్మాణ రంగంలో...

పర్యావరణాన్ని కాపాడే దిశగా నిర్మాణ రంగంలో వచ్చిన మార్పులూ ఉపాధి మార్గాలను చూపెడుతున్నాయి. ఎకోఫ్రెండ్లీ కట్టడాలు వచ్చేశాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు ఎదిగిన ప్రత్యామ్నాయ రంగం, సేంద్రీయ వ్యవసాయం... ఒక్కటేమిటి, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా రూపుదిద్దుకోనున్న ప్రతి రంగం కొత్త అవకాశాలను లక్షల్లో పుట్టిస్తోంది. ప్రతి పౌరుడు పొల్యూట్ కాని లైఫ్ స్టయిల్‌ని కోరుకుంటున్నాడు కాబట్టి 'గ్రీన్' అనేది అన్ని చర్యల్లో అంతర్భాగమైంది. ఈ చైతన్యం ఉన్న వినియోగదారులు మార్కెట్‌ను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు కాబట్టి గ్రీన్ మార్కెట్‌నే డిమాండు చేస్తున్నారు. అందుకే కృత్రిమ రసాయనాలు లేని, కలుషితం కాని వస్తువులను వాళ్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ బిజినెస్ అంతా గ్రీన్ బిజినెస్‌గా మారుతోంది. కార్పొరేట్ కంపెనీల మీదా ఈ దిశగా విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీంతో అవీ తమ పంథాను పర్యావరణానికి అనుకూలంగా మార్చుకోక తప్పడం లేదు. సామాజిక బాధ్యతల దృష్ట్యా కూడా తమ కంపెనీలను ఎకోఫ్రెండ్లీగా మార్చుకుంటున్నాయి. కనుక కార్పొరేట్ ఉద్యోగాలూ ఈ రంగాల్లోనే ఉండబోతున్నాయి. అంటే వ్యాపారం కూడా క్లీన్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కిందకు మారుతోందన్నమాట.

రిస్క్, డిజాస్టర్, క్రైసిస్...

సంపదను దాచుకున్న సముద్రంలా అవకాశాలను పొదువుకున్న పర్యావరణం మీద జరిగిన అధ్యయనాలు కొత్త కొత్త రంగాలను వెలుగులోకి తెస్తే... వాటిని అభివృద్ధి చేయడంలో మరిన్ని అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఉదాహారణకు ఎకో ఫ్రెండ్లీగా ఉండే ఓ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టామనుకుందాం... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ఏవైనా ప్రమాదాలు సంభవించవచ్చు. వాటిని నిభాయించి, సరిదిద్దగల సామర్థ్యం కూడా వాటి యాజమాన్యాలకు ఉండాలి. ఆ నిర్వహణే రిస్క్, డిజాస్టర్, క్రైసిస్ మేనేజ్‌మెంట్లు. బృహత్తర అవకాశాలనిస్తున్నాయివి. వీటితోపాటు రీయూజ్, రీసైకిల్డ్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్లు కూడా ప్రధాన ఉపాధి రంగాల్లా మారాయి ఇప్పుడు.

అక్షయపాత్రలా...

పర్యావరణాన్ని కాపాడుకుంటూ సుస్థిరాభివృద్ధికి నాంది పలకాలి. ఈ అవగాహన, పరిశోధనల పుణ్యమాని ఇదే భవిష్యత్తుగా, గ్రీన్ (పర్యావరణం, ప్రకృతి) అనేది అత్యంత శక్తిమంతమైన రంగంగా మారింది. ఇంతకుముందు వాడిన కృత్రిమాలన్నిటికీ బదులుగా సహజసిద్ధంగా లభించేవేమున్నాయనే శోధన మొదలవడంతో పర్యావరణానికి చెందిన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించడం, పరిశోధించడంతో ఇదో పెద్ద శాస్త్రంగానే కాదు లక్షల ఉద్యోగాలు పుట్టిస్తున్న అక్షయపాత్రగా మారింది. ఈ డిమాండుననుసరించి పర్యావరణం అనేది చదువులో కూడా భాగమైంది. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయిదాకా దీన్నో సబ్జెక్టుగా చేరింది. ఆర్ట్, సైన్స్, లా, పాలిటిక్స్, ఎకనమిక్స్, మేనేజ్‌మెంట్ చదువుల్లో, ఇంజనీరింగ్‌లలో కూడా పర్యావరణ శాస్త్రం పాఠ్యాంశంగా మొదలైంది. ఇందులో స్పెషలైజేషన్ కోర్సులూ ప్రారంభమయ్యాయి. పర్యావరణ బయోటెక్నాలజీలో కూడా చాలా అవకాశాలున్నాయి.

స్మార్ట్ అండ్ గ్రీన్ లివింగ్

పర్యావరణశాస్త్ర పురోగతి కొత్త తలపులను తెరిచి లోకాన్ని పచ్చగా మారుస్తోంది. ఇది ఒక ఎత్తయితే... ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉన్న వనరులను పొదుపుగా వాడుకుంటూ తెలివిగా జీవించడం ఇంకో ఎత్తు. ఈ రెంటిని కలిపి స్మార్ట్ అండ్ గ్రీన్ లివింగ్ అంటున్నారు. స్మార్ట్‌గా ఆలోచించి కనిపెట్టే స్మార్ట్ థింగ్స్‌లో కూడా బ్రహ్మాండమైన ఉపాధి ఉందన్నట్టే కదా. ఎలాగంటే... చైనా, అమెరికా లాంటి దేశాల్లో కొత్తరకమైన కరెంటు బల్బులు వెలుగుతున్నాయి. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్లగానే మనం విడిచి వెళ్లిన గదిలో లైట్ ఆరిపోయి అడుగుపెట్టిన గదిలో వెలుగుతుంది. అంటే విద్యుత్ వృధా అయ్యే అవకాశం లేకుండా అన్నమాట. అలాగే నీటి వృధా అరికట్టడానికీ ఇలాంటి కిటుకులు కనిపెట్టారు. వాష్ బేసిన్, సింకుల్లాంటి చోట్ల కుళాయి కింద చేయి పెడితేనే నీళ్లొస్తాయి. చేయి తీయగానే నీళ్లు రావడం ఆగిపోతాయి. ఇలాంటివి కనుక్కొనే టెక్నాలజీ ఒకటి ఉందీ అంటే అందులో బోలెడు అవకాశాలు ఉన్నట్లే కదా.

మహాత్మా గాంధీ చెప్పినట్టు ప్రకృతికి ప్రజలందరి అవసరాలను తీర్చే స్తోమత ఉంది కాని కొందరి అత్యాశలను తీర్చే శక్తి లేదు. అందుకే ప్రకృతి సంపదను కాపాడుకోవాలి. దానికే ఎసరు పెట్టే కార్యక్రమాలను మానుకోవాలి. అప్పుడే అది మనల్ని కాపాడుతుంది. మొత్తం భూమండలాన్నే ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మనదే. పర్యావరణం అందించే అవకాశాల గురించి అవగాహన, విజ్ఞానాన్ని పెంచుకుని వాటిని అందుకుంటే ప్రపంచంలోనే మనవాళ్లు గ్రీన్ లీడర్స్‌గా ఎదిగే బంగారం లాంటి చాన్స్ ఇది.

ఆ నవలే...

1965లో... పర్యావరణ కాలుష్యం వల్ల జరగబోయే నష్టాల నేపథ్యంగా రేచెల్ కార్సన్ రాసిన 'ది సైలెంట్ స్ప్రింగ్ ' అనే నవల ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మేధావుల నుంచి ఐరాస దాకా విస్తృతమైన చర్చకు తెరలేపింది. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ కోసం 1972లో స్టాక్‌హోంలో గ్లోబల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇలాంటి చర్చలు, సమావేశాలు, అధ్యయనాలు, పరిశోధనలు అనేకం1985 వరకు సాగాయి. అందుకే ఈ కాలాన్ని పీరియడ్ ఆఫ్ ఇంటెన్సివ్ రీసెర్చ్ అంటారు. ఈ రకంగా 'ది సైలెంట్ స్ప్రింగ్' ఇంటలెక్చువల్ రివల్యూషన్‌కి కారణమైంది. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ఏ దేశానికి ఆ దేశమే నడుం కట్టింది. కొన్ని వందల చట్టాలను తయారు చేసుకున్నాయి. మన దేశంలోనూ సుమారు రెండు వందల చట్టాలున్నాయి. వాటి ప్రకారం ప్రకృతిని తమ చర్యల ద్వారా ఎవరూ కలుషితం చేయడానికి వీలులేదు. ఒకవేళ చేస్తే ఆ కాలుష్యాన్ని నివారించే పనిని కూడా వాళ్లే చేయాలి.

మా సంస్థ ఏం చేస్తుందంటే...

కె. పురుషోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలోని 'సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్' సంస్థ గ్రీన్ డెవలప్‌మెంట్ (హరితాభివృద్ధి)కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే అకడమిక్ రీసెర్చ్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఈ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగకారిగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయడం, దీని ఆధారంగా స్థానిక సమస్యలకు పరిష్కారాలు అందించడం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం వంటి పనులనూ చేపడుతోంది.

ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీగా వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేయడమేకాక దాని ఆవశ్యకతను వివరిస్తుంది. అంతేకాదు వాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించిన విషయాలపై ప్రజలను చైతన్య పరుస్తూ ఆ మార్పులను నివారించే మార్గాలను వెదకడం... అవి ఆలస్యమైనప్పుడు ఆ మార్పులకెలా సర్దుకుపోవాలో శిక్షణనిస్తుంది ఈ సంస్థ. ఇవీ కాక ఈ అంశం మీద పనిచేస్తున్న అన్నిరకాల సంస్థలతో అనుసంధానమేర్పర్చుకుని ఓ బలమైన శక్తిగా మారేందుకు కృషిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో మన దేశం నాయకత్వం వహించేలా... స్థూలంగా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సంస్థలా ఎదగడం దీని ప్రధాన లక్ష్యం.
* సరస్వతి రమ