Tuesday, June 14, 2011

వీడ్కోలు * టీవీ తెరపై తిరుగులేని తార ఓప్రా విన్‌ఫ్రే



తానెంతగానో అభిమానించి ఆరాధించే టీవీ యాంకర్‌ని చూడడానికి శ్రియ పిల్గోంకర్ అనే ఇరవైరెండేళ్ల యువతి ముంబయి నుంచి అమెరికా వెళ్లింది. ఆ యాం కర్ నిర్వహించే టీవీ షో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చునే అవకాశం దొరికినపుడు ఆమె పడిన సంతోషం అంతా ఇంతా కాదు. సినీ తారలు, పాప్ సింగర్లంటే పడిచచ్చేవాళ్లని చూశాం కాని టీవీ యాంకర్లకి కూడా అభిమానులుంటారా అని ఆశ్చర్యపోతున్నారా. ఆ టీవీ యాంకర్ అంటే ప్రపంచానికున్న అభిమానం మరే తారకీ లేదు. ఆమే పాతికేళ్లపాటు టీవీషో నిర్వహించి ప్రపంచ టెలివిజన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అమెరికాని 'ఓప్రాఫికేషన్' చేసిన ఒక నల్లజాతి అమెరికన్ మహిళ.. ఓప్రా విన్‌ఫ్రే.

25, మే 2011.. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక అధ్యాయానికి తెరపడింది. 1986 మొదలై 145కి పైగా దేశాల్లో ప్రసారమవుతూ వస్తున్న 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' ఆ రోజుతో ముగిసింది. పాతికేళ్లుగా అమెరికాలో ఇంటిల్లిపాదికీ సుపరిచితమైన ఓప్రా విన్‌ఫ్రే చివరిసారి టీవీలో కనిపించే ఎపిసోడ్‌ని ఆ దేశంలో సినిమా థియేటర్లలో కూడా లైవ్‌గా ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా బార్లు, పబ్‌లలో ఓప్రా అభిమానులు చేరి టీవీషో చూస్తూ వీడ్కోల పండుగ జరుపుకున్నారు. ఆమెరికా ఆమెని అంతగా ఆరాధించడానికి కారణమేమిటి? ఓప్రా విన్‌ఫ్రే కేవలం టీవీ యాంకర్ మాత్రమే కావచ్చు. అమెరికన్ సంస్కృతిని పాతికేళ్లుగా మరెవరూ చేయలేనంతగా ప్రభావితం చేసిందని సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపించాయి.
అమెరికాలోనే కాదు, ఆమె షో ప్రసారమైన అన్ని దేశాల్లోనూ ఆమెకి అభిమానులున్నారు. అలాగని ఓప్రా టీవీషో నిర్వహించిన మొదటి వ్యక్తేమీ కాదు. ఆమె రాకకి ముందునుంచే టీవీ టాక్‌షోలు నడుస్తున్నాయి. అయితే ఆమె మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తులనుంచి సమాధానాలు రాబట్టే నేర్పరితనంతో తనదైన శైలిలో యాంకరింగ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందామె. అందుకు ఆమె వ్యక్తిత్వంతోపాటు జీవితం నేర్పిన పాఠాలూ దోహదపడ్డాయి. ఒక్క టీవీషో ద్వారా అమెరికన్ జీవితాల్లోకి అన్ని కోణాలనుంచి చొచ్చుకుపోగలిగింది. టాక్‌షోలలో సెలబ్రిటీలపై వచ్చే గాసిప్‌లను, బ్యూరోక్రాటిక్‌గా సాగే చర్చలను కాదని సామాన్య ప్రజల జీవితాలే కేంద్రంగా టీవీషో కొనసాగించింది. జనం బయటకు చెప్పుకోలేని ఎన్నో విషయాల గురించి తన షోలో చర్చిస్తూ వాటిని అమెరికన్ సమాజమంతా బహిరంగంగా చర్చించుకునేలా చేసింది ఓప్రా. అందుకే అమెరికన్లకి ఆమె అంటే అంత అభిమానం.

తల్లి పిల్లలతో మాట్లాడినట్లే..
తల్లి తన పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతూ తనషోకి వచ్చిన అతిథుల మదిలోయల్లోకి చొచ్చుకుపోతుంది ఓప్రా. అందుకేనేమో ఆమె అడిగితే చాలు ఎంతటి వారైనా తమ మనసులో ఉన్నదాన్నంతా బయట పెట్టేవాళ్లు. ఒక్కోసారి భోరున ఏడ్చేసేవాళ్లు, ఒక్కోసారి పట్టలేని సంతోషంతో పిచ్చిగంతులేసేవారు... ఆత్మన్యూనతని పక్కన పెట్టి సగర్వంగా తమ గురించి చెప్పుకునేవాళ్లు. ఎవరి గురించి వాళ్లు చెబుతూ ఉంటే తన జీవితంలో జరిగిన సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటర్వ్యూలని పరిపూర్ణం చేసేది ఆమె. అందుకే వారం వారం ప్రసారమయ్యే ఆమె షో కోసం అమెరికా పడిగాపులు కాసేది. ఆ అభిమానమే ఆమెని 20వ శతాబ్దంలో అత్యంత ధనవంతురాలైన నల్లజాతి వ్యక్తిగా నిలిపింది. కడుపేదరికంలో పుట్టిన ఓప్రా అంత అభిమానాన్ని ఆస్తిపాస్తుల్ని సంపాదించే దిశగా చేసిన పయనంలో ఎన్నో కష్టనషాల్ని చవిచూసింది.


పేదరికం నుంచి..
ఓప్రా విన్‌ఫ్రే 1954 జనవరి 29న మిసిసిపీలో ఒక టీనేజి పెళ్లికాని అమ్మాయికి జన్మించింది. ఆమె తల్లి ఇళ్లల్లో పనిచేసేది. ఓప్రా అసలు పేరు ఓర్పా గెయిల్ విన్‌ఫ్రే. ఓర్పా కాస్తా వాడుకలో ఓప్రా అయిపోయింది. తొమ్మిదేళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యానని ఒకసారి తన షోలో చెప్పింది ఓప్రా. ఏళ్లపాటు అత్యాచారానికి గురైన ఆమె 13 ఏళ్లవయసులో ఇల్లొదిలి పారిపోయింది. పద్నాలుగేళ్ల వయసులో మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అప్పట్నించి నేటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో వక్తృత్వపోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించింది. ఆ పోటీల్లో గెలుపుతో యూనివర్శిటీ చదువుకి ఫెలోషిప్ సంపాదించి నల్లజాతి విద్యార్థులకు పెట్టింది పేరైన టెన్నెస్ స్టేట్ యూనివర్శిటీలో చేరింది.

ఓ పక్క చదువుకుంటూనే స్థానిక రేడియో స్టేషన్లో వార్తలు కూడా చదివిన ఆమె ఆ రేడియోలో పనిచేసిన పిన్నవయస్కురాలే కాదు, మొట్టమొదటి నల్లజాతి యాంకర్ కూడా ఆమే. రేడియో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న ఓప్రా 1983లో టెన్నెస్ నుంచి చికాగోకి మకాం మార్చింది. ఓ రేడియో స్టేషన్‌లో ఉదయం వార్తా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఓప్రా రంగ ప్రవేశంతో కొన్ని నెలల్లోనే రేటింగ్‌లో ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉన్న ఆ కార్యక్రమం మొట్టమొదటి స్థానానికి ఎగబాకింది. ఓప్రా ఇంటర్వ్యూ చేసే తీరు, ఆమె నైపుణ్యాన్ని గమనించిన సినీ విమర్శకుడొకరు ఆమెని టెలివిజన్ షో చెయ్యమని సలహా ఇచ్చాడు. కార్యక్రమాన్ని దేశమంతటా టీవీ చానళ్లకు అమ్మవచ్చని, ఖచ్చితంగా జనాన్ని ఆకర్షించగలుగుతుందని చెప్పాడు. ఆయన సలహాతోటే 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' అనే పేరుతో ఆమె సొంతగా టెలివిజన్ షో నిర్మించే పనిలో పడింది.

ది ఓప్రా విన్‌ఫ్రే షో
1986, సెప్టెంబర్ 8న దేశవ్యాప్తంగా ఓప్రా విన్‌ఫ్రే షో ప్రసారమైంది. అప్పటికి నెంబర్‌వన్ స్థానంలో ఉన్న షోని కొన్ని వారాల్లోనే పక్కకి నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. టీవీ షోలలో తెల్లజాతి మగవాళ్ల హవా నడుస్తున్న సమయంలో ఒక నల్లజాతి స్త్రీ వాళ్లని వెనక్కి నెట్టి తిరుగులేని యాంకర్‌గా వార్తల్లోకెక్కింది. క్రమంగా శాటిలైట్ టెలివిజన్ అంతర్జాతీయంగా విస్తరించడంతో ఆమె షో కూడా ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పటికీ ఆ షోకి పోటీ వచ్చిన షో మరోటి లేదంటే ఆమె ఎంచుకున్న అంశాలు అలాంటివి. స్థానిక సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల దాకా, గుండెజబ్బు నుంచి ఎయిడ్స్ దాకా, స్వలింగ సంపర్కులపై వివక్ష నుంచి ఆధ్యాత్మిక చింతన దాకా ఆమె స్పృశించని అంశం లేదు. 1993లో ఓప్రా విన్‌ఫ్రే మైకెల్ జాక్సన్‌ని తన షోకి ఆహ్వానించింది.

ఇద్దరు నల్లజాతి తారల్ని ఓ చోట చేర్చిన ఆ కార్యక్రమం అమెరికన్ టెలివిజన్ చరిత్రలోనే అతి ఎక్కువమంది వీక్షించినదిగా రికార్డులకెక్కింది. నోబెల్ గ్రహీత, అమెరికన్ నల్లజాతి రచయిత్రి టోని మారిసన్ రచించిన 'బిలవెడ్'ని వెండితెరపై నిర్మించి నటించింది. మరో నల్లజాతి రచయిత్రి ఆలిస్ వాకర్ రచించిన 'ది కలర్ పర్పుల్'ని స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మిస్తే, దాన్లో నటించి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది. ఒక విజయం మరిన్ని విజయాలకు బాట వేస్తుందనేది ఓప్రా విషయంలో ముమ్మాటికీ నిజమైంది.


2000 సంవత్సరంలో ఆమె ప్రారంభించిన 'ఒ-ది ఓప్రా మ్యాగజైన్' మాసపత్రిక 27 లక్షల కాపీల సర్క్యులేషన్‌తో నడుస్తోంది. ఆ మ్యాగజైన్ దక్షిణాఫ్రికా ఎడిషన్ కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఓప్రాకి ఉన్న ఆదరణని గమనించిన డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థ ఆమెతో సంయుక్తంగా ఒక చానల్ నడపడానికి ముందుకొచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో 'ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్' పేరుతో ఆ టీవీ చానల్ మొదలైంది.


పుస్తక ప్రచురణపై ఓప్రా మార్కు
ఓప్రా విన్‌ఫ్రే ఐదు పుస్తకాలకు సహరచయిత కూడా. 2005లో ఆమె తన వ్యక్తిగత ట్రెయినర్ బాబ్ గ్రీన్‌తో కలిసి బరువు తగ్గడంపై పుస్తకం రాసింది. ఆ పుస్తకానికి వచ్చిన పారితోషకం కూడా ఒక రికార్డే. ప్రపంచంలో ఏ రచయితకీ చెల్లించనంత ఎక్కువ మొత్తాన్ని ఆమెకి చెల్లించారని వార్తలొచ్చాయి. అప్పటి దాకా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జీవితచరిత్రకి లభించిందే అతి ఎక్కువ మొత్తం. పుస్తకాలు రాయడమే కాదు ఓప్రా తన షోలో పుస్తకాల గురించి కూడా చర్చించేది. దానికి ఓప్రా బుక్ క్లబ్ అనే పేరు పెట్టిందామె. ఏదైనా పుస్తకం ఆ క్లబ్‌లో స్థానం సంపాదించడమంటే ఒక పెద్ద అంతర్జాతీయ అవార్డు రావడంతో సమానం.
బుక్ క్లబ్‌లో చేరిన పుస్తకాల అమ్మకాలు అమాంతం పెరిగిపోయేవి. ఒక్క రోజులోనే లక్షల కాపీలు అమ్ముడు పోయేవి. లైబ్రరీలన్నీ ఆ పుస్తకాలు తప్పక తెప్పించి పెట్టేవి. ఓప్రా క్లబ్‌లో చేరిన పుస్తకాల సెక్షన్లు షాపుల్లో ప్రత్యేకంగా ఉండేవి. ఓప్రాఫికేషన్ అనే కొత్త పదం ఇంగ్లీషు డిక్షనరీలో చేరింది. బహిరంగంగా నిజాన్ని ఒప్పుకునే అలవాటు అమెరికన్లలో పెంపొందడానికి ఓప్రా షోయే కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ కొనియాడింది. ఆమె ప్రభావంతో పాశ్చాత్య ప్రపంచంలో మెమోయిర్‌లు రాయడం పెరిగింది కూడా ఓప్రాఫికేషన్ వల్లే.

అంత్యంత ప్రభావశీల మహిళ
సిఎన్ఎన్, టైమ్ మ్యాగజైన్ రెండూ ఓప్రాని ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల మహిళగా పేర్కొన్నాయి. అలాంటి మరెన్నో జాబితాల్లో ప్రభావశీలమైన వ్యక్తిగా ఎన్నికవ్వడం ఆమెకి సర్వసాధారణమైపోయింది. చివరికి బరాక్ ఒబామా కూడా ఓప్రా 'ఓప్రా అమెరికాలో అత్యంత ప్రభావశీల వ్యక్తి కావచ్చేమో' అని పేర్కొన్నాడు. నిజమే.. ఆడతనమంటే అది ఓప్రాలా ఉండాలని అమెరికన్ అమ్మాయిలన్నారంటే ఆమెపై వారికున్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

కాలిఫోర్నియాలోని 'ది ప్రామిస్డ్ ల్యాండ్' అనే 42 ఎకరాల సువిశాల ఎస్టేట్‌లో ఉన్న విలాస భవనం ఆమె ప్రస్తుత నివాసం. ఇంకా చాలా నగరాల్లో ఆమెకి ఇళ్లున్నాయి. ప్రఖ్యాత నల్లజాతి అమెరికన్ రచయిత్రి మాయా ఎంజెలూ అంటే ఓప్రాకి ఎనలేని ప్రేమ, గౌరవం. 'ఆమే నాకు అక్క, తల్లి, స్నేహితురాలు' అని పేర్కొన్నదోసారి. పేదరికంలో పుట్టి పెరిగిన ఓప్రా 32 ఏళ్లకే మిలియనీరైంది. 41 ఏళ్లు వచ్చేనాటికి ఫోర్బ్స్ 400 మంది ధనవంతుల జాబితాలో ఉన్న ఏకైక నల్లజాతి వ్యక్తి అయింది. ఆమె ఆస్తి అప్పటికి 340 మిలియన్ డాలర్లు. 20వ శతాబ్దానికి గాను అత్యంత ధనవంతురాలైన ఆఫ్రికన్ అమెరికన్ ఆవిడే.

కేవలం సంపాదించడమే కాదు, దాన్నెలా ఖర్చు చేయాలో కూడా తెలుసు ఓప్రాకి. అందుకే 1998లో ఓప్రాస్ ఏంజెల్స్ నెట్‌వర్క్ పేరుతో ఒక సేవాసంస్థను స్థాపించి ఎనిమిది కోట్ల డాలర్లు విరాళాలు సేకరించి సేవాకార్యక్రమాలు నిర్వహించింది. అమెరికాలో మరే ఇతర సెలబ్రిటీ దానం చేయనంత డబ్బుని దానం చేసింది. ఒక్క 2007లోనే 303 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన ఆమె దక్షిణాఫ్రికాలో వీధి బాలల కోసం స్కూల్ కూడా నడుపుతోంది.

No comments: