Friday, March 11, 2011

జలవిలయం * పసిఫిక్ మహాసముద్రం అడుగున అత్యంత శక్తిమంతమైన భూకంపం కారణంగా పుట్టిన సునామీ జపాన్ ఈశాన్య తీరాన్ని కబళించింది

జపాన్‌పై పెను భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ
360 మంది మృతి.. 500 మంది గల్లంతు..
రిక్టర్ స్కేల్‌పై 8.9 తీవ్రతతో పసిఫిక్‌లో భూకంపం.. సెందాయ్ నగరాన్ని కబళించిన రాకాసి అలలు... కొట్టుకుపోయిన ఓడ, జాడతెలియని రైలు
టోక్యో సహా అన్ని నగరాలూ గజగజ.. విమానాశ్రయాలు, సబ్‌వేలు, రైళ్లు బంద్..
అణు అత్యవసర పరిస్థితి ప్రకటించిన జపాన్ ప్రధాని..
అమెరికా, రష్యా తీరాలు సహా 20 దేశాలకు సునామీ హెచ్చరికలు
భారత్‌కు సునామీ భయం లేదని కేంద్ర సర్కారు ప్రకటన


జపాన్‌పై పెను సునామీ పడగ విసిరింది. పసిఫిక్ మహాసముద్రం అడుగున అత్యంత శక్తిమంతమైన భూకంపం కారణంగా పుట్టిన సునామీ జపాన్ ఈశాన్య తీరాన్ని కబళించింది. దాదాపు 33 అడుగుల ఎత్తుకు ఎగసిన రాకాసి అలలు తీరంలోని మియాగి, ఫుకుషిమా రాష్ట్రాలను ముంచెత్తాయి. ఇళ్లు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి. అలల ధాటికి ఫ్లైఓవర్లు సైతం కుప్పకూలాయి. బోట్లు, కార్లతో పాటు పెద్దపెద్ద ఇళ్లు కూడా సునామీలో అగ్గిపెట్టెల్లా కొట్టుకుపోయాయి. సెందాయ్ నగరం నీటమునిగింది. రాజధాని టోక్యోతో సహా ప్రధాన నగరాలన్నింటిలో రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి, సరఫరా ఆగిపోయింది. సగం దేశం అంధకారంలో మునిగిపోయింది.



ఈ భూకంపం, సునామీల కారణంగా ఇప్పటివరకూ 360 మంది చనిపోయారని, మరో 500 మంది జాడ తెలియటం లేదని జపాన్ అధికారులు తెలిపారు. మరో 627మ మంది గాయపడ్డారు. సెందాయ్ నగరంలో దాదాపు 200 నుంచి 300 మృతదేహాలు లభ్యమయ్యాయి.


ఇవాటె రాష్ట్రంలో 60 మంది చని పోయారు. జపాన్ ఈశాన్య తీరంలో 100 మందితో ప్రయాణిస్తున్న ఓడ ఒకటి రాకాసి అలల్లో కొట్టుకుపోయింది. దాని జాడ ఇంకా తెలియరాలేదు. సెందాయ్-ఇషినోమాకి మధ్య ప్రయాణిస్తున్న ఒక పాసింజర్ రైలు జాడ కూడా తెలియటం లేదని, అందులో ఎందరు ప్రయాణికులు ఉన్నారన్న విషయమూ తెలియదని అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య 1000 వరకూ పెరిగే అవకాశముందని చెప్తున్నారు. 





మరోవైపు పసిఫిక్ తీరంలో అమెరికా, రష్యాలు సహా మరో 20 దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్‌కు సునామీ ప్రమాదం లేదని హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ స్పష్టంచేసింది.


టోక్యో: నిత్యం భూకంపాలను చవిచూసే జపాన్ చరిత్రలో శుక్రవారం 8.9 రిక్టర్ స్కేలు తీవ్రతతో అతి పెద్ద భూకంపం సంభవించింది. ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.46 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 11.16 గంటలకు) పసిఫిక్ మహాసముద్రంలో ఈ పెను భూకంపం సంభవించింది. జపాన్‌లోని హోన్షు దీవి తూర్పు తీరంలో గల సెందాయ్ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున 24 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం.. 1923లో టోక్యో పరిసర ప్రాంతాల్లో 1.40 లక్షల మందిని బలిగొన్న గ్రేట్ కాంటో భూకంపంకన్నా తీవ్రమైనది. నాటి భూకంపం 7.9 తీవ్రతతో జపాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద భూకంపంగా రికార్డయింది. తాజా భూకంపం ధాటికి.. భూకంప కేంద్రానికి 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ రాజధాని టోక్యో కూడా కంపించిపోయింది. పెద్ద పెద్ద భవంతులు సైతం గడ్డిపోచల్లా వణికిపోవటం టీవీ చానళ్లలో ప్రసారమైంది. ప్రభుత్వం సైరన్లు మోగించటంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వేలాది మంది టెర్మినళ్లలో చిక్కుకుపోయారు. లోకల్ రైళ్లు, సబ్‌వే వ్యవస్థలను నిలిపివేయటంతో లక్షలాది మంది ఇళ్లకు దూరంగా ఉండిపోయారు.


పెను భూకంపం వెంటనే మరిన్ని బలమైన ప్రకంపనలు కూడా సంభవించాయి. భారీ సునామీ ప్రమాదం గురించి నిపుణులు, ప్రభుత్వం ప్రజలను హెచ్చరించారు. జపాన్ తీరాన్ని మరో 15 నిమిషాల్లో సునామీ తాకుతుందన్న హెచ్చరికలు జారీచేసి, సైరన్లు మోగించటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవటం వల్ల భారీగా ప్రాణనష్టం జరగలేదు. రాకాసి అలలు తమ దారిలో అడ్డొచ్చిన ప్రతిదాన్నీ తుడిచిపెట్టుకుంటూ ముందుకు సాగాయి. మియాగిలో నటోరి నది సమీపంలో ఒక జనావాస ప్రాంతాన్ని సునామీ ఎలా కబళిస్తోందో జపాన్ అధికారిక మీడియా సంస్థ ఎన్‌మెచ్‌కె ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచ ప్రజలకు చూపించింది. దాదాపు 10 లక్షల మంది నివసించే సెందాయ్ నగరాన్ని కూడా సునామీ కబళించింది. ఒక పాఠశాల భవంతి పైభాగంలో దాదాపు 600 మంది విద్యార్థులు చిక్కుకుపోయి కనిపించారు. టోక్యో టవర్ కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. ఇక్కడి చమురు శుద్ధి కర్మాగారం, ఉక్కు కర్మాగారాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భూకంపం, సునామీల నేపథ్యంలో మియాగి, ఫుకుషిమాల్లో అణు విద్యుదుత్పత్తి ప్లాంట్లు మూతపడ్డాయి.


ప్రభుత్వం అణు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అణు విద్యుత్ ప్లాంట్ల సమీపంలో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒక అణు విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ.. అణుధార్మికత లీకవ్వటం వంటి అసాధారణ పరిస్థితులేవీ తలెత్తలేదని అధికారులు పేర్కొన్నారు. భూకంపం చాలా ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించినప్పటికీ అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని జపాన్ ప్రధానమంత్రి నవోటో కాన్ ప్రకటించారు. భూకంపం వల్ల నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.

 
ప్రపంచయుద్ధాన్ని తట్టుకున్నా సునామీ మింగేసింది

సెందాయ్ గాథ ఇదీ..


ఈశాన్య జపాన్ తీరంలోని సువిశాల సుందర నగరం సెందాయ్.... క్రీ.శ 1600లో మసామునే అనే భూస్వామ్యప్రభువు ఈ నగరాన్ని తన రాజధానిగా నిర్మించాడని చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇది మిత్రపక్షాల బాంబుదాడులను తట్టుకుని నిలిచింది. పాక్షికంగా దెబ్బతిన్న ఈ నగరాన్ని ఆ తర్వాత పునర్నిర్మించారు. అయితే ఇపుడు సునామీ సృష్టించిన విలయంలో ఈ నగరం సర్వనాశనమైపోయింది. భూకంప కేంద్రానికి అతి సమీపంలో ఉన్న సెందాయ్‌పై సునామీ ప్రభావం ఎక్కువగా ఉంది. పది లక్షల జనాభా ఉన్న సెందాయ్ నగరం ఈ ప్రాంతంలో ప్రధానమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. జపాన్ రాజధాని టోక్యోకు ఈ నగరం దాదాపు 300 కి.మీ.దూరంలో ఉంది. నానాకిటా, హిరోస్ గవా నదుల మధ్య ఉన్న సెందాయ్ నగరం భౌగోళికంగా చాలా విలక్షణంగా కనిపిస్తుంది. ఈ నగరం తూర్పున విశాలమైన మైదాన ప్రాంతం ఉండగా పశ్చిమాన పర్వతశ్రేణులున్నాయి. వీటిలో ఎతె్తైన పర్వతం ఫునాగటా ఎత్తు 1500 మీటర్లు. సెందాయ్ నగరం ఈ ప్రాంతంలో కీలకమైన వాణిజ్య కేంద్రమే కాక రవాణాకు కూడా అతి ముఖ్యమైన నగరం. అంతేకాదు ఇది జపాన్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడ అతిపెద్దదైన తొహుకు యూనివర్సిటీ సహా అనేక వర్సిటీలున్నాయి.

మన్మోహన్, ఒబామా సానుభూతి

భూకంపం, సునామీల్లో ఆప్తులను కోల్పోయిన జపాన్ ప్రజలకు భారతదేశం తరఫున ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సానుభూతి తెలిపారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంటూ జపాన్ ప్రధానికి లేఖ రాశారు. జపాన్‌లో నివసిస్తున్న 25 వేల మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు జపాన్ ప్రజలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఇలాంటి కష్ట కాలంలో జపాన్‌కు సహాయ హస్తం అందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చెప్పారు.




పసిఫిక్ దేశాలకు హెచ్చరికలు...

జపాన్ భూకంపం నేపథ్యంలో పసిఫిక్ సముద్రం చుట్టూతా రష్యా, దక్షిణ అమెరికా, అమెరికా పశ్చిమ తీరం, కెనడా, అలాస్కాల వరకూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేసియాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఇండోనేషియా ఉత్తర తీరం నుంచి వేలాది మంది జనం ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయితే.. ఉత్తర మాలుకు దీవులను కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తున్న చిన్న అల మాత్రమే తాకిందని, దానివల్ల పెద్ద నష్టం సంభవించినట్లు వార్తలు రాలేదని అధికారులు తెలిపారు. కానీ.. దీని వెనుక మరింత పెద్ద అలలు వచ్చే ప్రమాదం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. హవాయ్ దీవుల్లోని వాయ్‌కికి తీరాన్ని కూడా చిన్నపాటి సునామీ అలలు తాకాయి.










చరిత్రలో విలయాలు..

1900 నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలో సంభవించిన పెను భూకంపాలు, సునామీలు ఇవీ..
1906, జనవరి 31: ఈక్వెడార్, కొలంబియా తీరాల్లో 8.8 తీవ్రతతో భూకంపం. వెయ్యి మంది మృతి.
1923, సెప్టెంబరు 1: టోక్యోలో 7.9 తీవ్రతగల భారీ భూకంపం. 1.45 లక్షల మంది మృతి.
1950 ఆగస్టు: అసోం, టిబెట్ ప్రాంతంలో 8.6 తీవ్రత భూకంపం. 780 మంది మృతి.
1960, మే 21: చిలీలో 9.5 తీవ్రతతో అతి భారీ భూకంపం. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత తీవ్రతగల భూకంపం. ఈ విలయం 1,655 మందిని పొట్టనబెట్టుకుంది.
1964, మార్చి 27: అమెరికాలోని అలస్కాలో 8.4 తీవ్రతతో సముద్రగర్భంలో భూకంపం. సునామీలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం.

1976, ఆగస్టు: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో, సులు దీవుల్లో 8 తీవ్రత భూకంపం. 5 వేల మంది మృత్యువాత.
2004, డిసెంబరు 26: ఇండోనేిసియాలోని సుమత్రా దీవుల్లో 8.9 తీవ్రతతో భూకంపం. విరుచుకుపడ్డ సునామీ. ఇండోనేసియా, భారత్, తదితర దేశాల్లో 2 లక్షల 20వేల మందికిపైగా మృత్యువాత.
2005, మార్చి 28: ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో 8.5 తీవ్రతతో మళ్లీ భూకంపం. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం.
2008, మే 12: చైనా నైరుతిభాగంలోని వెంచుయాన్ కౌంటీలో 8.0 తీవ్రత భూకంపం. సుమారు 70 వేల మంది మృతి.
2010, ఫిబ్రవరి 27: దక్షిణ చిలీ ప్రాంతంలో సముద్రగర్భంలో 8.8 తీవ్రతతో భూకంపం. 300 మంది మృతి.





జపాన్‌కు ‘అణు’భయం
ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటులో పేలుడు
 
పెను భూకంపం, సునామీ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న జపాన్ మరో పెను విపత్తును ఎదుర్కొంటోంది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటులో పేలుడు సంభవించటంతో రేడియేషన్ విడుదలవుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే అణు రియాక్టర్ ఉన్న కంటైనర్‌కు ఎలాంటి ముప్పూ వాటిల్లలేదని ప్రభుత్వం చెప్తోంది. అయితే ప్లాంటు పరిసరాల నుంచి వేలాది మందిని ఖాళీ చేయించటం.. ప్లాంటు సమీపం నుంచి రక్షించిన ముగ్గురికి రేడియేషన్ సోకినట్లు నిర్ధారణ కావటం ప్రజల ఆందోళనను రెట్టింపు చేస్తోంది. మరోవైపు శుక్రవారం సంభవించిన భూకంపం, దానివెంట విరుచుకుపడిన సునామీల్లో మరణించిన వారి సంఖ్య 1,700కు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. మియాగి రాష్ట్రంలోని మినామిసాన్రికు పట్టణంలో దాదాపు 10,000 మంది గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. మరో నాలుగు రైళ్ల జాడ కూడా తెలియటం లేదు. సునామీతో దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయ బృందాలు చేరుకోవటం కష్టమవుతుండటంతో నష్టం తీవ్రతను అంచనా వేయలేకపోతున్నారు.

టోక్యో: భూకంపం, సునామీలు సృష్టించిన విధ్వంసంకన్నా.. అణుధార్మికత విడుదలపై తలెత్తిన ఆందోళన జపాన్ ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటులో శనివారం భారీ పేలుడు సంభవించింది. అయితే.. ప్లాంటులో అణు రియాక్టర్‌కు ప్రమాదం జరగలేదని, రియాక్టర్‌ను ఉంచిన లోహపు గది చుట్టూ ఉన్న కట్టడం మాత్రమే పేలిపోయిందని అధికారులు చెప్తున్నారు. పేలుడు తర్వాత అణు రియాక్టర్ నుంచి విడుదలయ్యే అణు ధార్మికత (రేడియేషన్) స్థాయి పెరగకపోగా.. అంతకుముందు విడుదలవుతున్న స్థాయికన్నా తగ్గిందని కూడా వారు చెప్తున్నారు. కానీ.. అణు రియాక్టర్‌ను చల్లబరిచే వ్యవస్థ పనిచేయకపోవటం వల్ల అది వేడెక్కి కరిగిపోయే ప్రమాదముందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అత్యంత ప్రమాదకరమైన అణుధార్మికత లీకై తీవ్ర నష్టానికి దారితీస్తుందని చెప్తున్నారు.



ఈ పరిస్థితుల నేపథ్యంలో జపాన్ అంతటా అణు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పేలుడు సంభవించిన ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటు చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న దాదాపు 45 వేల మంది ప్రజలను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. స్థానికులు నల్లాల్లో నీటిని వాడవద్దని, బయటకు వచ్చేటపుడు చర్మానికి గాలి తగలకుండా దుస్తులు కప్పుకోవాలని, ముఖానికి మాస్కులు ధరించాలని సూచనలు జారీచేశారు. శుక్రవారం సంభవించిన 8.9 తీవ్రత గల భూకంపం, దానివల్ల పుట్టిన పెను సునామీలు జపాన్‌ను చిన్నాభిన్నం చేసిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి.. జపాన్‌లోని 54 వాణిజ్య అణు రియాక్టర్లలో 10 రియాక్టర్లు మూతపడ్డాయి. అయితే.. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటు-1కి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానివల్ల అణురియాక్టర్ శీతలీకరణ వ్యవస్థ పనిచేయటం మానేసింది.

ఫలితంగా వేడిమి పెరిగిపోయి రియాక్టర్ వెలుపలి గది శనివారం మధ్యాహ్నం పేలిపోయిందని ప్రభుత్వ ప్రతినిధి యుకియో ఎడానో పేర్కొన్నారు. ఈ పేలుడులో నలుగురు గాయపడగా వారిని అస్పత్రికి తరలించినట్లు చెప్పారు. పేలుడు సంభవించటానికి ముందు జపాన్ ప్రధాని నవాటో కాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఇతర సునామీ ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పేలుడు తర్వాత ప్లాంటు పరిసరాల్లోని వాతావరణంలో రేడియేషన్ స్థాయి పెరగలేదని, పైగా కొంతమేర తగ్గిందని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే.. అలా ఎందుకు జరిగిందనేది ఆయన చెప్పలేదు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయి ఎంత ఉందనేది కూడా నిర్దిష్టంగా చెప్పలేదు.


అయితే.. విస్ఫోటనానికి ముందు ఈ ప్లాంటు నుంచి ప్రతి గంటలో విడుదలవుతున్న రేడియేషన్.. ఒక వ్యక్తి ఒక సంవత్సరం మొత్తంలో వాతావరణం నుంచి స్వీకరించే రేడియేషన్‌తో సమానంగా ఉందని మాత్రం చెప్పారు. పేలుడు తర్వాత ప్లాంటులో ఒత్తిడి కూడా తగ్గుతోందన్నారు. అణు విద్యుత్ ప్లాంటులో పేలుడుకు ముందు తెల్లగా సన్నని పొగలు పైకి లేచాయి. అవి అంతకంతకూ దట్టంగా మారి ప్లాంటు మొత్తం అలుముకున్నాయి. అణు రియాక్టర్లు ఉన్న కంటైనర్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్లాంటు ఆపరేటర్ ఒకరు.. కంటైనర్ వాల్వును తెరిచారని, దానివల్ల కొంత మొత్తం అణుధార్మిక వాయువు విడుదలైందని కూడా చెప్తున్నారు. పేలుడు కారణంగా భవనం గోడలు కుప్పకూలాయని ప్లాంటును నిర్వహిస్తున్న టోక్యో పవర్ ఎలక్ట్రిక్ కంపెనీ (టెప్కో) పేర్కొంది.



శీతలీకరణకు ఉపయోగించే నీరు శనివారం ఆవిరై తగ్గిపోవటంతో అణు ఇంధన కడ్డీలకు పాక్షికంగా గాలిసోకిందని, దీంతో రియాక్టర్‌లోకి ఫైరింజన్ ద్వారా నీటిని పంప్ చేస్తున్నారని జిజి ప్రెస్ అనే వార్తా సంస్థ పేర్కొంది. నీటి స్థాయి పెరుగుతోందని టెప్కో తెలిపినట్లు వెల్లడించింది. మరోవైపు.. ప్లాంటులో యురేనియం ఇంధనం ఉన్న లోహపు ట్యూబులు కరిగివుంటాయని జపాన్ అణు, పారిశ్రామిక భద్రతా సంస్థ ఆందోళన వ్యక్తం చేసినట్లు జపాన్ అధికార వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది. అణు ఇంధనంలో కొంత భాగం కరిగివుండొచ్చు కానీ, రియాక్టర్ మాత్రం పనిచేయటం ఆగిపోయిందని, దానిని చల్లబరుస్తున్నారని టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ నవాటో సెకిమురా పేర్కొన్నట్లు వివరించింది.

ప్లాంటు పరిసరాల్లో అణుధార్మిక పదార్థాలైన సీసియం, ఐయోడైన్‌లను గుర్తించినట్లు అణు, పారిశ్రామిక భద్రతా సంస్థ తెలిపింది. రసాయన విపత్తుల కోసం శిక్షణ పొందిన సహాయదళాలు, ఫైర్ ఫైటింగ్ సిబ్బందిని ఈ ప్లాంటు వద్దకు తరలించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఫుకుషిమా ప్లాంటు-1కి సమీపంలోని మరో అణు విద్యుత్ ప్లాంటు నుంచి కూడా సాధారణంగా విడుదలయ్యే రేడియేషన్‌కన్నా 1,000 రెట్లు ఎక్కువగా రేడియేషన్ విడుదలవుతోందని పోలీసులు చెప్తున్నారు. దీని పరిసరాల నుంచి కూడా వేలాది మందిని ఖాళీ చేయించారు.


ముగ్గురికి రేడియేషన్ నిర్ధారణ!...: ఫుకుషిమా ప్లాంటుకు సమీపంలోని ఫుతాబా మాచి అనే పట్టణంలో గల ఒక ఆస్పత్రి నుంచి తరలించిన 90 మంది రోగుల్లో ముగ్గురికి అణు ధార్మికత సోకినట్లు గుర్తించారు. సునామీ ధాటికి ఆస్పత్రి మునిగిపోవటంతో ఈ రోగులంతా సమీపంలోని స్కూలుపైకి వెళ్లి సహాయం కోసం గంటల తరబడి వేచివున్నారు. వీరిని హెలికాప్టర్ల ద్వారా రక్షించి ముగ్గురిపై పరీక్షలు నిర్వహించారు. ఆ ముగ్గురికీ అణుధార్మికత సోకినట్లు వెల్లడికావటం ఆందోళనను తీవ్రం చేసింది.



చల్లబడే మార్గంలేకే...
రెండో ప్రపంచ యుద్ధకాలంలో హిరోషిమా, నాగసాకిలపై అమెరికా పేల్చిన అణుబాంబులు సృష్టించిన విధ్వంసాన్ని జపాన్ ఎన్నటికీ మరువలేదు. అందుకే అణు విద్యుత్ ప్లాంట్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎప్పుడూ భూకంపాలతో సహజీవనం చేసే జపాన్.. భూకంపాలు సంభవించినపుడు వాటికవే మూతబడేలా అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తారు. శుక్రవారం భూకంపం సంభవించినపుడు కూడా అణు రియాక్టర్లు పనిచేయటం ఆటోమేటిక్‌గా ఆగిపోయినప్పటికీ.. వాటిని చల్లబరిచే వ్యవస్థలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం వివరించింది.

రియాక్టర్లు ఆగిపోయిన వెంటనే శీతలీకరణ వ్యవస్థలు వెంటనే పనిచేయటం ప్రారంభించాల్సి ఉండగా అలా జరగలేదు. సాధారణంగా ఈ వ్యవస్థలు బాహ్య విద్యుత్ గ్రిడ్ల ద్వారా కానీ, బ్యాకప్ జనరేటర్ల ద్వారా కానీ, బ్యాటరీల ద్వారా కానీ పనిచేస్తాయి. అవి పనిచేయకపోతే రియాక్టర్లలోని అణు ఇంధన కడ్డీలు విపరీతంగా వేడెక్కి అణు ధార్మికతను విడుదల చేస్తాయి. ఫలితంగా అణుపదార్థం కరిగిపోయి గాలిలోకి ప్రమాదకరమైన స్థాయిలో అణుధార్మికత వ్యాపిస్తుంది. ఇది సోకిన వారికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

 



విషాద సాగరం * మృతులు 1700 పైనే మినామిసాన్రికులో 10,000 మంది గల్లంతు?
భూకంపం, సునామీల కారణంగా జపాన్‌లో మృతుల సంఖ్య 1,700 దాటినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రాకాసి అలలు జపాన్ ఈశాన్యంలో 2,100 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని కబళించాయి. పెద్ద సంఖ్యలో పల్లెలు, పట్టణాలు, నగరాలను సునామీ తుడిచిపెట్టింది. దాదాపు 23 అడుగుల ఎతె్తైన రాకాసి అలలు కొన్ని ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర భూమిపైకి చొచ్చుకువచ్చాయి. బోట్లు, కార్లు, ఇళ్లు, భవనాలను మింగేశాయి. అధికారికంగా 574 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. మరో 586 మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిగాక సెందాయ్ తీరంలో దాదాపు 300 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇదిలావుంటే మియాగి రాష్ట్రంలోని మినామిసాన్రికు పట్టణంలో దాదాపు 10,000 మంది గల్లంతైనట్లు ఫుజీ టీవీ చెప్తోంది.

ఒఫునాటో, సెన్సెకి, కెసెన్నుమా లైన్లలో నాలుగు రైళ్లు గల్లంతయ్యాయి. వాటిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నదీ తెలియదు. అంతకుముందు సెన్సెకి లైన్ మీద ఒక రైలు పడిపోయివుండగా గుర్తించారు. అందులో నుంచి మియాగి పోలీసులు హెలికాప్టర్ ద్వారా తొమ్మిది మందిని రక్షించారు. సునామీలో కొట్టుకుపోయి పేరుకున్నచెత్తలో, భూకంపం కారణంగా కూలిన భవనాల కింద మరిన్ని మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నారు. భూకంపం, సునామీల దెబ్బకు మొత్తం 3,400 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 181 సంక్షేమ భవనాలు, నర్సింగ్‌హోమ్‌లు దెబ్బతిన్నాయి. భూకంపం తాకిన ప్రాంతాల్లో 55.7 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరు లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా తెగిపోయింది.



టోక్యో నగరంలో లోకల్ రవాణా వ్యవస్థ స్తంభించిపోవటంతో శుక్రవారం రాత్రి 1.20 లక్షల మంది ఇళ్లకు చేరుకోలేక వీధుల్లోనే కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది. సునామీతో దెబ్బతిన్న ప్రాంతాలన్నింటికీ సహాయ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. దీంతో మొత్తం నష్టం తీవ్రత ఎంతగా ఉందన్నది ఇంకా అంచనాలకు అందటం లేదు. సహాయ చర్యల కోసం 20,000 మంది సైనికులు, 200 హెలికాప్టర్లు, విమానాలు, 25 బోట్లు రంగంలోకి దిగాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల నుంచి సహాయ బృందాలు జపాన్‌కు చేరుకుంటున్నాయి. దాదాపు 50 దేశాలు సహాయం ప్రకటించాయి.


మరోవైపు.. శుక్రవారం 8.9 తీవ్రత గల భూకంపంతో అతలాకుతలమైన జపాన్‌ను దానితర్వాత వరుస వెంట భూ ప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. శనివారం మరో 14 ప్రకంపనలు పుట్టాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6.8 వరకూ ఉన్నట్లు నమోదైంది. 


సునామీ ధాటికి తీరానికి వచ్చిపడ్డ చేపలు 
అకాపల్కో (మెక్సికో): జపాన్‌లో సంభవించిన సునామీ ధాటికి కుప్పలు తెప్పలుగా చేపలు మెక్సికో తీరానికి వచ్చిపడ్డాయి. మెక్సికోలోని అకాపల్కో తీరం వద్దకు వివిధ జాతులకు చెందిన చేపలు పెద్దసంఖ్యలో కొట్టుకు వచ్చాయి. దీంతో మత్స్యకారులు వలలు, రాడ్లు వదిలేసి మరీ మోటారు బోట్లతో అక్కడకు చేరుకున్నారు. ఎవరికి దొరికిన చేపలను వారు దోసిళ్లతో పట్టుకుని బకెట్లలో నింపుకుని తిరిగి వెళ్లారు. సునామీ వల్ల ఏర్పడ్డ సుడిగుండాలకు ఇవి కొట్టుకుని వచ్చి ఇక్కడకు చేరి ఉంటాయని భావిస్తున్నారు.  

జపాన్.. మరో చెర్నోబిల్?
ప్రమాదం అంచున మరిన్ని అణు రియాక్టర్లు

ఒకటి పేలిన 24 గంటల్లోనే ఆందోళనకరంగా మరో నాలుగు
అణు ఎమర్జన్సీ విధింపు
రెండు లక్షల మంది తలింపు
మరో మూల అగ్ని పర్వత విస్పోటం
'సూర్యుడు ఉదయించే భూమి'లో మొత్తం నిరాశ్రయులు 25 లక్షలు 
Allu Arjun Marriage photo Gallery
భూకంపం మిగిల్చిన వినాశనం.. వేలాదిగా ప్రజలు దుర్మరణం.. అంతలోనే 'మరో చెర్నోబిల్'ను తలపిస్తూ విరుచుకుపడిన అణుభూతం. దీంతో సునామీ సృష్టించిన బీభత్సం కారణంగా అణు విద్యుత్కేంద్రాలు 'కరిగి' పోతున్నాయా? అనే భయం జపాన్‌లో నెలకొంది. అణు ఇంధనం కరిగిపోతే వెలువడే అణు ధార్మికత ఇంకెంత మంది ప్రజలను మింగేస్తుందోనన్న వేదనతో దేశంలో ప్రభుత్వం అణు ఎమర్జెన్సీ విధించింది. Allu Arjun Marriage photo Gallery
సునామీ దెబ్బకు దారితప్పిన అణు రియాక్టర్లు అణు బాంబులుగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియక.. సాంకేతికతకే మారుపేరుగా నిలిచిన జపాన్ గజగజ వణుకుతోంది. సూర్యుడు ఉదయించే దేశంలో మరోసారి అణుప్రమాద భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒక రియాక్టర్ పేలిపోగా, మరో రియాక్టర్ పేలుడు అంచున ఉంది. ఫుకోషిమాలో పరిస్థితి ఇలా ఉండగా.. ఒనగావాలోని మూడు రియాక్టర్లు కూడా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఫుకోషిమా రియాక్టర్ల భయానికి దాదాపు రెండు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.



దీంతో రెండో ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత క్లిష్ట పరిస్థితిని జపాన్ ఎదుర్కొంటోందని ఆ దేశ ప్రధాని నవోటో కన్ వాపోయారు. ఆనాటి అణుబాంబును తలుచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? అనిపిస్తోంది. అంతలోనే 10,000 మందిని పొట్టన పెట్టుకుందని భావిస్తున్న భూకంపం మిగిల్చిన విషాదం కూడా తక్కువేమీ కాదని తలంపుకొస్తోంది. అత్యంత విలాసవంతంగా జీవించిన అక్కడి ప్రజలు బురదలోనూ, మురుగలోనూ కాలం వెళ్లదీస్తున్నారు.

విద్యుత్ లేక నిముషమైనా మనలేని జనం ఆ సౌకర్యం లేక చీకట్లోనే మగ్గుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగువుతుందో ఒక అంచనాకు రాకముందే.. కష్టాలకు అంతులేదా? అన్నట్లు దేశంలో మరో మూల అగ్నిపర్వతం విస్ఫోటం చెందింది. మొత్తానికి ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశానికి గడ్డురోజులొచ్చాయా? అని ఆ దేశ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
 
Allu Arjun Marriage photo Gallery

No comments: